Telangana SCERT 10th Class Telugu Guide Telangana 8th Lesson లక్ష్యసిద్ధి Textbook Questions and Answers.
TS 10th Class Telugu 8th Lesson Questions and Answers Telangana లక్ష్యసిద్ధి
ప్రశ్నలు – జవాబులు (T.B. P.No. 77)
ప్రశ్న 1.
పైనున్న సంపాదకీయ శీర్షికలు ఏ విషయాన్ని తెలుపుతున్నాయి ?
జవాబు:
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గురించి.
ప్రశ్న 2.
ఆ వార్తకున్న ప్రాధాన్యమేమిటి ?
జవాబు:
తెలంగాణ ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాము నష్టపోతున్నామనీ, ప్రత్యేకంగా తెలంగాణగా విడిపోతే, తమ ప్రాంతాన్ని తాము అభివృద్ధి చేసుకోవచ్చనీ, చాలాకాలంగా తమ ప్రాంతాన్ని వేరు రాష్ట్రంగా ప్రకటించమనీ కోరుతున్నారు. ఆ ప్రజల అభి మతమూ, వారి లక్ష్యమూ సిద్ధించాయని ఆ వార్త తెలుపుతోంది.
ప్రశ్న 3.
మీరెప్పుడైనా సంపాదకీయాలు చదివారా ? సంపాదకీయమంటే ఏమిటి ?
జవాబు:
సినిమా వార్తలు, క్రీడావార్తలు తప్ప సంపాదకీయాలను పెద్దగా చదువం. కాని, సంపాదకీయమంటే తెలుసు. ప్రతిరోజూ వార్తలు దినపత్రికలలో ప్రచురిస్తారు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క వార్త చాలా ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఆ విధంగా ప్రాధాన్యం కలిగిన వార్తలోని విషయాన్ని పత్రికా సంపాదకులు విశ్లేషిస్తారు. అదే సంపాదకీయం. అంటే సమకాలీన వార్తలపైన పత్రికల విశ్లేషణ.
ప్రశ్న 4.
సంపాదకీయాల ద్వారా ఆయా పత్రికల గూర్చి మనం ఏం తెలుసుకోవచ్చు?
జవాబు:
సంపాదకీయాల ద్వారా ఆయా పత్రికల మనో భావాలు తెలుస్తాయి. ఆ పత్రిక ఎవరికి అను కూలమో కూడా తెలుసుకోవచ్చు. పత్రికల యొక్క విశ్లేషణా సామర్థ్యం తెలుసుకోవచ్చు. సమకాలీన సమస్యలపై పత్రికకు ఉన్న అవగాహన తెలుస్తుంది.
ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 79)
“అర్థరాత్రి వేళ ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు ………… హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి.
ప్రశ్న 1.
“సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది.” ఈ మాటలన్నది ఏ సందర్భంలో ? ఎవరన్నారు?
జవాబు:
పాతదనంలోంచి కొత్తదనంలోకి అడుగుపెడుతాం. ఒక శకం ముగుస్తుంది. సుదీర్ఘకాలం అణచివేయ బడిన తెలంగాణ జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుం దని” దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు నెహ్రూ గారు ఈ మాటలన్నారు.
ప్రశ్న 2.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలోని ఏయే ఘట్టాలు ఈ ప్రాంత ప్రజల హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి?
జవాబు:
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వేళ మూడు తరాల తెలంగాణ బిడ్డల నుండి భావోద్వేగంతో భాష్పాలు రాలాయి. 1969 ఉద్యమం, మలిదశ పోరాటం, పతాకస్థాయి ఘట్టాలు, లాఠీలు ….. తూటాలు ….. గాయాలు ఇట్లా ఎవరి జ్ఞాపకాలు, అనుభూతులు వారివి. ఆనందోత్సాహాలతో పాటు పోరాట జ్ఞాపకాలు కూడా ముసురుకొని హృదయాలను ఆర్థంగా మార్చాయి.
ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 80)
తెలంగాణలోని ప్రతి అడుగడుగూ ఉద్యమ చరిత్రతో ………. అమరవీరులకు నివాళులు
ప్రశ్న 1.
‘జై తెలంగాణ’ నినాదం బలపడడానికి దారితీసిన సంఘటనలేవి ? వాటి పర్యవసానాలేవి ?
జవాబు:
తెలంగాణ ప్రతి విషయం ఉద్యమంతో ముడిపడి ఉన్నదే. ప్రతి ప్రదేశం ఉద్యమంతో ముడిపడిన పవిత్ర ప్రదేశమే. సచివాలయంలో ‘నల్లపోచమ్మ’ గుడి ఉండేది. అది మనకు పరమ పవిత్రమైన దేవాలయం కదా ! అక్కడ ‘నల్లపోచమ్మ’ను మాయం చేసి ‘బెజవాడ కనకదుర్గ’ ను పెట్టారు.
దాంతో తెలంగాణ ఉద్యోగులు పోరాటానికి దిగారు. మళ్ళీ ‘నల్లపోచమ్మ’ వెలిసింది. ఇది ‘జై తెలంగాణ’ నినాదాన్ని బలపరిచింది. పర్యవసానంగా మన తొలి ముఖ్యమంత్రి కె.సి.ఆర్. గారు ఆ గుడిలోనే పూజలు చేశారు.
ఉద్యమం చివరిదశలో ‘పరేడ్ గ్రౌండ్’ లో సభ పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. దానితో ‘జై తెలంగాణ’ నినాదం మిన్నంటింది. తెలంగాణ మొత్తం ‘జై తెలంగాణ’ నినాదంతో దద్దరిల్లి పోయింది. పర్యవసానంగా మన బంగారు ‘తెలంగాణ’ మనకేర్పడింది. మన ప్రియతమ ముఖ్యమంత్రిగారు అదే ‘పరేడ్ గ్రౌండ్’ లో గౌరవ వందనం స్వీకరించారు.
ప్రశ్న 2.
ఉద్యమకాలంలో హైదరాబాదు వీధులు, మైదానాల ప్రత్యేకతలు ఏమిటి ?
జవాబు:
ఉస్మానియా క్యాంపస్లో లాఠీచార్జీ, గస్పార్క్ అమర వీరుల స్తూపం దగ్గర చర్చలు, ముళ్ళతీగలను ఛేదించుకొని అమర వీరుల స్తూపం దగ్గరకు ఉరకడం ‘ఇవన్నీ’ ఉద్యమకాలంలో జరిగిన ప్రత్యేకతలు.
ప్రశ్న 3.
“గన్పార్క్ అమరవీరుల స్తూపంతో ముడిపడిన సంఘటన లెన్నో……….. ఆ సంఘటనలను గురించి చర్చించండి.
జవాబు:
తెలంగాణ ఉద్యమం గస్పార్క్ అమరవీరుల స్తూపంతో విడదీయలేని సంబంధం కలిగి ఉంది. ఉద్యమం ప్రతి దశలో, ప్రతి మలుపులోనూ, ప్రతి సంఘటనలోనూ ‘గస్పార్క్’ ససాక్ష్యంగా నిలిచింది. తెలంగాణ బిడ్డలు ‘గస్పార్క్’ దగ్గర కలుసుకొని చర్చించుకొనేవారు. వలసపాలకులు ఆంక్షలను ఉద్యమకారులు ధిక్కరించేవారు.
లాఠీ దెబ్బలకు జంకలేదు. ముళ్ళతీగలను ఛేదించేవారు. అమర వీరుల స్తూపం దగ్గరకు ఉరికేవారు. జూన్ రెండున అనేకమంది అక్కడ చేరి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ‘గన్పార్క్’ చూస్తే అమరవీరుల త్యాగాలు గుర్తుకు వస్తాయి. కళ్ళు చెమ్మగిల్లుతాయి.
ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 81)
స్వీయరాష్ట్రం సిద్ధించింది గనుక ఇక జాతి ……..
…………. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది.
ప్రశ్న 1.
తెలంగాణ పునర్నిర్మాణంలో ఎట్లాంటి చర్యలు వెంటనే చేపట్టాలని సంపాదకుడు భావిస్తున్నాడు ? దీన్ని మీరు సమర్థిస్తారా ?
జవాబు:
తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి. తెలంగాణ ప్రజలకు కావలసింది ప్రశాంతత. పచ్చని బతుకు. తెలంగాణ పునర్నిర్మాణానికి శక్తియుక్తులన్నీ కూడ గట్టాలని సంపాదకీయం పేర్కొంది. మా అభిప్రాయం కూడా ఇదే. మూడు తరాల నుండి ఉద్యమాలతో ప్రశాంతత లేదు. ఎటు చూసినా బాధలే. ఎటు చూసినా కన్నీరే. ఎటు చూసినా ఉద్రిక్తతలే. ఇంక మంచిరోజులు వచ్చాయి. ఇంక కావలసినది ప్రశాంతత.
ఉద్యమాలతో చాలామంది తమ ప్రాణాలను కోల్పోయారు. ప్రాణప్రదమైన వారిని కోల్పోయేరు. ఇక పచ్చని బతుకులు కావాలనేదే మా అందరి కోరిక. తెలంగాణ ప్రజలందరికీ కావలసినది కడుపు నిండా తిండి. కంటినిండా నిద్ర. రేపటి గురించి గుబులు లేని జీవితం అని కూడా సంపాదకీయం పేర్కొంది. మా కోరిక కూడా అదే.
ప్రశ్న 2.
నవ తెలంగాణ నిర్మాణంలో ప్రభుత్వ వ్యూహాలు ఏమిటి
జవాబు:
మూడు తరాల నుండి అణచివేతలో మగ్గిన సమాజాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం వ్యూహాలు తయారుచేసుకొంది.
- సంక్షేమ పథకాలు కచ్చితంగా అమలు జరిగేలా చూడాలి. అణచివేతకు గురైన మన సమాజాన్ని ఆదుకోవాలి.
- రుణమాఫీ – రైతులు అప్పులపాలై అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ పరిస్థితి నివారించాలంటే ‘రుణమాఫీ’ తప్పనిసరిగా అమలు జరగాలి.
- నీటి పారుదల – నీటి విషయంలో కూడా వివక్షకు గురయ్యాం. గురవుతున్నాం. ఈ పరిస్థితి నివారించక పోతే పంట పొలాలు ఎండిపోతాయి. విద్యుత్తు తగ్గిపోతుంది. అందుచేత ‘నీటి పారుదల’ అనేది చాలా పెద్ద పని.
- పరిపాలనా సంస్కరణలు – పాలనాపరమైన సంస్కరణలు కూడా చేపట్టాలి. మన పరిపాలన మనమే చేసుకొనే బంగారు రోజులు వచ్చాయి. కనుక మనకు అనుకూలమైన సంస్కరణలు పరిపాలనలో తీసుకొని రావాలి.
ప్రశ్న 3.
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరెట్లాంటి పాత్ర పోషిస్తారు?
జవాబు:
- సంక్షేమ పథకాలు అమలయ్యేటట్లు చూస్తాను.
- రుణాలు మాఫీ, 2 పడకల గదుల ఇల్లు. ఇలాంటి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చుతాను.
- వ్యక్తిగా ప్రభుత్వపు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల నిర్వహణలో ప్రభుత్వానికి అండగా ఉంటాను.
- గౌరవానికి భంగం కలుగకుండా నవతెలంగాణ నిర్మాణానికి సహకరిస్తాను.
ఇవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషిచేసిన వారిని అభినందించడానికి మీ పాఠశాలలో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడాలి. మీరైతే కింది అంశాలలో దేని గురించి మాట్లాడుతారు ?
అ) రాష్ట్రసాధనలో కవులు, కళాకారుల పాత్ర.
ఆ) ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్ర.
ఇ) ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పాత్ర.
ఈ) సకలజనుల పాత్ర.
జవాబు:
అ) రాష్ట్ర సాధనలో కవులు, కళాకారుల పాత్ర :
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కవులు, కళాకారుల పాత్ర ఎంతో ముఖ్యమయినది. 1969 తెలంగాణ తొలి ఉద్యమం కంటే ముందే 1925లో తెలంగాణ ఔన్నత్యాన్ని నిజాం రాష్ట్ర ప్రశంస పేరుతో శేశాద్రి రమణ కవులు ప్రచురించారు. ఆ తర్వాత 1934లో గోల్కొండ కవుల సంచిక ప్రచురితమైంది. దానికి కొనసాగింపుగా వట్టికోట అళ్వారుస్వామి సంపాద కత్వంతో “ఉదయ ఘంటలు” వెలువడింది.
1950లో ‘ప్రత్యూష’ కవితా సంకలనం హైద్రాబాదు కవులు తెచ్చారు. ‘తొలి కారు’ పేరుతో 1957లో వరంగల్ నుంచి కవిత్వ సంకలనం దాశరథి సంకిరెడ్డి నారాయణరెడ్డి గారి “మత్తడి”, “పొక్కిలి” తరువాత జాగో జగావో, దిమ్మెస, క్విట్ తెలంగాణ, ‘గాయాలే గేయాలై’, ‘మునుం’ వంటి కవితా సంకలనాలు వెలువడినాయి. అంతేకాక అనేక జిల్లాల నుండి కవితా సంపుటులు వెలువడ్డాయి.
అందెశ్రీ, గద్దర్, గోరెటి వెంకన్న, జయరాజ్ యస్పాల్ ధూంధాంలు నిర్వహించారు. తొలితరం ఉద్యమంలోనే గూడ అంజయ్య, మిత్ర, దరువు ఎల్లన్న, విమలక్క వంటి గాయకులు, కవులు ఎందరో 1949-1950లో చిత్తలూరి వీరస్వామి, రావెళ్ళ వెంకట్రామారావు మొదలయిన వారితో రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్ వంటి గాయకులు, ఘంటాచక్రపాణి, ఎన్. వేణుగోపాల్, అన్నవరం దేవేందర్, ఘనపురం దేవేందర్, జ్వలిత, జూపాక సుభద్ర, షాజహానా వంటి కవయిత్రులు ఎందరో తెలంగాణ ఉద్యమంలో తమ పాత్ర పోషించారు.
ఆ) ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్ర :
ఉద్యోగులు, ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర సాధనకు వెనుదిరగని ఉద్యమాలు చేశారు. సచివాలయంలో రోజూ ఉద్యమాలే. తెలంగాణ ఉద్యోగులు తమ ఉద్యోగాలకంటే ఆత్మాభిమానానికే విలువనిచ్చారు. బెదిరింపులకు భయపడలేదు. నాల్గవ తరగతి ఉద్యోగి నుండి అత్యున్నత అధికారి వరకు ఒకేమాట. ఒకేబాట. అదే ప్రత్యేక రాష్ట్ర సాధన. అవసరమైతే తమ ఉద్యోగాలు వదులుకునేందుకు కూడా సిద్ధపడ్డారు.
ఉపాధ్యాయులదీ అదే బాట. అందుకే అన్నమాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ‘స్పెషల్ ఇంక్రి మెంట్’ ఇచ్చి గౌరవించింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా 43 శాతం ఫిట్మెంట్ కూడా ఇచ్చింది.
ఇక విద్యార్థుల ఆవేశం కట్టలు తెచ్చుకొంది. చాలామంది ప్రాణాలను కూడా తృణప్రాయంగా విడిచిపెట్టారు. ఉస్మానియా క్యాంపస్ లో పోలీసు ఆంక్షలను లెక్క చేయకుండా ఉద్యమించారు. తెలంగాణలోని అన్ని యూనివర్శిటీలు, కళాశాలలది ఇదే పరిస్థితి. కేజీ నుండి పీ.జీ వరకు ఒకటేమాట. ఒకేబాట. అదే ‘ జై తెలంగాణ’. తెలంగాణ రాష్ట్రం కావాలి’. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎక్కువ కష్టాలను ఎదుర్కొన్నది విద్యార్థి లోకం.
ఇ) ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పాత్ర :
ఒక రాష్ట్ర సాధన కోసమే ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డల ఆత్మగౌరవంకు నినాదంగా రూపుదిద్దుకున్నది. ‘తెలంగాణా రాష్ట్ర సమితి టి.ఆర్.యస్.పార్టీ. రాష్ట్ర సాధనకోసం గ్రామ స్థాయి నుంచి ఉద్యమ పార్టీగా, ఉద్యమమే ధ్యేయంగా రూపుదిద్దుకున్నది. ఇతర పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీలు తమ వంతు కృషిచేసినా. వేరు స్థాయినుంచి పటిష్టమైన నిర్మాణం చేయగలిగింది తెరాసే.
ప్రజాప్రతినిధులుగా ప్రజల ఆశలను, ఆలోచన లనూ ప్రతిబింబించే బాధ్యతలను నెత్తికెత్తుకున్న ప్రజాప్రతినిధులు రాష్ట్ర సాధనకై పలుమార్లు తమ పదవులకు రాజీనామాలు చేసి తిరిగి ఎన్నిక కావటం ద్వారా ఈ ప్రాంతపు ప్రజల మనోభావాలను ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశారు.
రాజకీయ నాయకులుగా రాష్ట్రశ్రేయస్సుకోసం పనిచేస్తూనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషిచేసి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషిచేసిన వాళ్ళందరకీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఈ) సకలజనుల పాత్ర :
సకలజనుల సమ్మె ఉద్యమ ఘట్టంలో ప్రధాన భూమిక పోషించింది. అందరూ ‘చేయి చేయి కలిపి’ ముందుకు సాగారు. నాటి ప్రభుత్వానికి వణుకు పుట్టించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకల జనుల సమ్మెకు దిగి వచ్చాయి. ఈ విధంగా అనేక రకాల ఉద్యమాలు, ఎందరో వీరుల త్యాగఫలమే మన నేటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.
ప్రశ్న 2.
కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
1926 మే 19న గోలకొండ పత్రిక ప్రారంభ మైంది. నేడు ఉన్న సదుపాయాలు నాడు పత్రికా నిర్వహణకు ఏమాత్రం లేకుండె. సంపాదకుడే అన్ని పనులు నిర్వహించుకొనేవాడు. విలేఖరిపని, వ్యాస రచయితలపని, గుమాస్తాపని, ప్రూఫ్ రీడర్ పని ఇట్లా దాదాపు అన్ని పనులను ఒక్కరే చేయవలసి వచ్చేది. ఈ పరిస్థితుల్లో గోలకొండ పత్రిక ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్నది. బంధుమిత్రుల సహకారంతో సురవరం ప్రతాపరెడ్డి పట్టుదలతో పత్రిక నిర్వహించాడు. 1939 ఆగస్టు 3వ తేదీ నుండి గోలకొండ పత్రికకు సంపాదకుడిగా ప్రతాపరెడ్డి నియమితుడయ్యాడు. గోలకొండ పత్రిక ప్రతాపరెడ్డి ప్రతిభకు అద్దం పట్టింది. తెలంగాణ ప్రజానీకాన్ని జాగృతపరిచింది.
ఆయన రాసిన వ్యాసాలు, విమర్శలు, సంపాద కీయాలు వెయ్యికిపైగా ఉంటాయి. పత్రికలో చర్చా వేదికను నిర్వహించి సత్యాలను నిగ్గుతేల్చే అవకాశాలను విమర్శకులకు కలిగించే వాడు. వ్యక్తి స్వాతంత్ర్యం, పౌరహక్కులు, ప్రాంతీయ భాషలకు, పత్రికా స్వాతంత్ర్యానికి గడ్డురోజులు ఉన్నప్పటికీ కూడా నిజాం ప్రభుత్వం ఆంక్షల నెదుర్కొంటూ గోలకొండ పత్రిక తెలంగాణ ప్రజల్లో కొత్త భావాలను, ఆలోచనలను, చైతన్యాన్ని రగిల్చింది.
అ) గోలకొండ పత్రిక సంపాదకుడెవరు ?
జవాబు:
గోలకొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి గారు.
ఆ) నాటి పత్రికాసంపాదకులు ఏయే పనులు చేసేవారు ?
జవాబు:
నాటి పత్రికాసంపాదకుడే, అన్ని పనులూ నిర్వహించే వాడు. విలేఖరులపని, వ్యాసరచయితలపని, గుమాస్తాపని, ప్రూఫ్ రీడర్పని ఇట్లా అన్ని పనులు చేసేవారు.
ఇ) ప్రతాపరెడ్డి గోలకొండపత్రిక ద్వారా ఏం చేశాడు?
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డిగారు గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణా ప్రజానీకాన్ని జాగృతపరచాడు. పత్రికలో చర్చావేదికను నిర్వహించి సత్యాలను నిగ్గు తేల్చేవారు.
ఈ) గోలకొండ పత్రిక వల్ల తెలంగాణ ప్రజలకు కలిగిన ప్రయోజనమేమిటి ?
జవాబు:
వ్యక్తి స్వాతంత్య్రం, పౌరహక్కులు, ప్రాంతీయ భాషలకు పత్రికా స్వాతంత్ర్యానికి గడ్డు రోజులు ఉన్నప్పటికీ కూడా నిజాం ప్రభుత్వం ఆంక్షల నెదుర్కొంటూ గోలకొండ పత్రిక ప్రజల్లో కొత్త భావాలను, ఆలోచనను, చైతన్యాన్ని రగిల్చింది. గోలకొండ పత్రిక వల్ల తెలంగాణ ప్రజలకు నిగ్గు తేల్చే నిజాలను తెలుసుకునే అవకాశం కలిగింది. ప్రజలను ప్రభుత్వంపై ధైర్యంగా పోరాడే ఆత్మస్థైర్యం, సంకల్పబలం కలిగింది. ప్రజల్లో నూతన ఆలోచనల ఆవిష్కరణకు అవకాశం కల్పించింది.
ఉ) పై పేరాకు పేరు పెట్టండి.
జవాబు:
శీర్షిక “గోలకొండ పత్రిక” – ప్రతాపరెడ్డి సంపాదకత్వం.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు?
జవాబు:
1969 నుండి జూన్, 2014 వరకు సాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సఫలమై, తెలంగాణ సకల జనుల స్వప్నం సాకారమైన వేళ, భారతదేశ పటంపై 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఇది అద్భుతమైన ఘట్టం. చరిత్రలో అరుదుగా కన్పిస్తుంది. పాతదనం లోంచి కొత్త దనంలోకి అడుగుపెట్టడం.
ఒక శకం ముగుస్తుంది. సుదీర్ఘ కాలం అణచివేయబడిన జాతి తన గొంతు విన్పించింది. ఇది తెలంగాణ సమాజం చేసిన సమిష్టి ప్రకటన. తెలంగాణ పోరాటం గమ్యాన్ని ముద్దాడిన క్షణమది. జాతి చరిత్రలో అరుదైనక్షణం. అత్యద్భుతమైన క్షణం.
ఆ) తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరు ఎట్లాంటి పాత్ర పోషిస్తారు?
జవాబు:
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మేము మా సర్వ శక్తులు ధారపోస్తాము. తెలంగాణా జాతి సర్వతో ముఖాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాము. తెలంగాణా ఉద్యమకాలంలో ప్రాణాలర్పించిన అమర వీరుల ఆశయాల సాధనకు ఊపిరి ఉన్నంతవరకూ పోరాడుతాము. తెలంగాణా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలూ శ్రమించి వారి కలలను సాకారం చేస్తాము.
తెలంగాణ భాష సంస్కృతులకు మళ్ళీ ప్రాణం పోసి, ఉత్కృష్టమైన తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరింపజేసే విధంగా యువతను జాగురూకులను చేస్తాము. రాష్ట్ర ప్రజల మధ్య సామాజిక సంబంధాలు బలపడే విధంగా సామాజిక చర్యలు చేపడతాము. ప్రభుత్వ వ్యూహాలను ప్రజలకు తెలియజేసి, వాటి అమలుకు కృషి చేస్తాము.
- ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అన్ని సకాలంలో అమలయ్యే విధంగా చూస్తాము.
- పరిపాలనా రంగంలో నూతన సంస్కరణలు ప్రవేశ పెట్టి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతాము.
- తెలంగాణా పునర్నిర్మాణానికి మా శక్తియుక్తులన్ని కూడదీసుకుని కార్యాచరణ దిశగా పయనిస్తాము.
- నవతెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తాము.
ఇ) సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు ?
జవాబు:
ఒక్కొక్క పత్రికకు కొన్ని విశిష్ఠ లక్షణాలుంటాయి. ఆ పత్రిక ద్వారా చాలా విషయాలు వెలుగు చూస్తాయి. నార్ల వేంకటేశ్వరరావు, తాపీ ధర్మారావు, విద్వాన్ విశ్వం, పింగళి వెంకటకృష్ణారావు, బూదరాజు రాధాకృష్ణ, సురవరం ప్రతాపరెడ్డి లాంటి వ్యక్తులు తమ తమ జ్ఞానంతో, మేధస్సుతో రచనలు చేశారు.
పత్రికలు సమాజానికి ప్రతిబింబాలు. అసంఖ్యాకంగా పాఠకులు చదువుతారు. కాబట్టి సంపాదకీయాలు పత్రికల్లోనే రాస్తారు. అవి ప్రజాదరణ పొందుతాయి.
ఈ) పత్రికలలోని సంపాదకీయాలకు, సాధారణ వార్తాంశాలకు మధ్యనున్న భేదాలేవి ?
జవాబు:
పత్రికకు ప్రాణం సంపాదకీయం. సంపాదకీయం మొత్తం పత్రికకు ప్రతిబింబం. ఆ రోజు జరిగిన ముఖ్యమైన సంఘటనపై సంపాదకుని వ్యాఖ్యానం, విశ్లేషణల సమాహారమే సంపాదకీయం. ఇది వార్తాంశం కాదు. వార్తాంశంపై సమగ్ర విశ్లేషణ. పూర్వాపరాల పరామర్శ, అవసరమైతే తర్వాత కాలానికి కూడా వర్తిస్తుంది. ఇది ప్రధాన సంపాదకుడు రాస్తాడు. సాధారణ వార్తాంశం అంటే ఒక వార్తగా ప్రచురిస్తారు.
ఆయా ప్రాంతాలలోని విలేఖరులు వార్తలు పంపుతారు. వాటి ప్రాధాన్యతాక్రమాన్ని బట్టి పత్రికలో ఏ పేజీలో వెయ్యాలో నిర్ణయిస్తారు. వార్తకు ఆ రోజుకు మాత్రమే విలువ ఉంటుంది. మరునాటికది మామూలు విషయమే. వార్తాంశంలో పెద్దగా విశ్లేషణలు, వ్యాఖ్యానాలు ఉండవు. కేవలం జరిగిన సంఘటన, ప్రజాభిప్రాయం మాత్రమే పాఠకుల దృష్టికి వస్తుంది.
ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) “సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతి బింబిస్తాయి” – దీనిని సమర్థిస్తూ వ్రాయండి.
(లేదా)
సంపాదకీయాలు సమకాలీన అంశాలను స్పృశిస్తాయి. దీనిని నీవు ఎలా సమీక్షిస్తావు ?
జవాబు:
ఆధునిక తెలుగు సాహిత్యంలో సంపాదకీయాలకు సమున్నతమైన స్థానం ఉంది. సంపాదకుడిచేత, లేదా సంపాదకుడి తరపున రాయబడేవి సంపాదకీయాలు. ఈ సంపాదకీయాలు దిన పత్రికలకు, ఇతర మాస, వార, సాంవత్సరిక పత్రికలకు తేడాగా ఉంటాయి.
దిన పత్రికల్లోని సంపాదకీయాలు సమకాలీన అంశాలపై స్పందిస్తాయి. ప్రజలను చైతన్యవంతులనుగా చేస్తాయి. ఈ సంపాదకీయాలు పత్రికలకు గుండెకాయ వంటివి. ఇవి ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని రాయబడతాయి.
ఈ సంపాదకీయాలు సమకాలీన అంశాలపై తీవ్రంగా స్పందిస్తాయి. ముఖ్యంగా స్వాతంత్రపోరాట సమయంలోను, తెలంగాణా ఉద్యమకాలంలోను వ్రాసిన సంపాదకీయాలు ప్రజలను చైతన్యవంతులనుగా మార్చాయి. సంపాదకీయాల్లోని అక్షరాలు ఒక్కోసారి ఫిరంగుల్లా పనిచేస్తాయి. పాలకుల గుండెల్లో దిగిపోతాయి.
తెలంగాణ పోరాటసమయంలో పత్రికలు సంధించిన సంపాదకీయాలు ప్రత్యేకరాష్ట్ర ఆవశ్యకతను తెలియ జేశాయి. తెలంగాణ ప్రాంత ప్రజల్లో వీరత్వం నింపాయి. అందువల్లనే సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతిబింబిస్తాయని చక్కగా తెలుస్తోంది.
ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ వ్రాయండి.
అ) ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న ఏదైనా ఒక ప్రధాన సామాజికాంశం / సంఘటనల ఆధారంగా సంపాద కీయ వ్యాసం రాయండి. మీ తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
సంపాదకీయ వ్యాసం
అవ్యవస్థను చక్కదిద్దిన ఏడాది !
‘ఆరంభం బాగుంటే సగం పని పూర్తి అయినట్లే’ అన్నది ఆంగ్లేయుల నానుడి. ‘నేను ప్రధానమంత్రిని కాను, ప్రధాన సేవకుణ్ణి’ అని ఎర్రకోట బురుజులనుంచి ప్రకటించిన నరేంద్రమోదీ ఏలుబడికి నేటితో ఏడాది పూర్తి అవుతోంది.
పదేళ్ళ యూపీఏ అన్ని రంగాల్లోనూ దేశాన్ని సర్వభ్రష్టం చేసి, అవినీతిలో మాత్రం కొత్త రికార్డులు నెలకొల్పి చరిత్రపుటల్లో కలిసిపోగా, ‘అచ్ఛేదిన్’ కోసం మోదీ సారథ్యంపై ఆమ్ ఆద్మీ పెట్టుకొన్న కొండంత ఆశ ఎన్డీఏకు దక్కిన బంపర్ మెజారిటీల్లోనే ప్రస్ఫుటమైంది.
యూపీఏ నిర్వాకాల వల్ల దేశపాలనకు సంబంధించిన సకల వ్యవస్థలనూ నిష్క్రియాపరత్వం కమ్మేసి, అంతర్జాతీయ పెట్టుబడిదారులు దృష్టిపథంలో ఇండియా లేకుండాపోయిన నేపథ్యంలో అధికారానికి వచ్చిన మోదీ ప్రభుత్వానికి – ఇంటాబయటా ఆ ప్రమాద కర స్తబ్ధతను బదాబదలు చెయ్యడమే ప్రాధాన్య అంశంగా మారింది. విధానాల రూపకల్పన, అమలులో మంత్రివర్గ సచివాలయం (క్యాబినెట్ సెక్రటేరియట్) ద్వారా ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) నిర్ణాయక పాత్ర పోషించేలా వ్యవస్థాగత మార్పులు తెచ్చి, ప్రణాళిక సంఘానికి కొరత వేసిన మోదీ ప్రభుత్వం – పాలనను కొత్త పుంతలు తొక్కించింది.
అవినీతికి ఆస్కారంలేని అవకాశాల స్వర్గంగా ఇండియాను ఆవిష్కరించి, దేశ విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడం ద్వారా మౌలిక సదుపాయాల్ని పెంపొందించి, పారిశ్రామికీకరణకు కొత్త ఊపుతో ఉపాధి అవకాశాలను విస్తారం చేసి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే వ్యూహానికి అనుగుణంగా మోదీ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
అవినీతి నిరోధక శాసనాలు, భారత్లో తయారీ, స్వచ్ఛభారత్, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి పథకాలు, పెట్టుబడులపై గురిపెట్టి విస్తృతంగా విదేశీ యాత్రలు …. ఇవన్నీ శ్రేష్ఠ భారత్ లక్ష్య సాధనకు ప్రాతిపదికలే. అదే సమయంలో, 128 కోట్ల జనావళి అభివృద్ధి కాంక్షలకు గొడుగు పట్టే విధంగా మోదీ ప్రభుత్వం మరెంతో చెయ్యాల్సి ఉందన్నదీ నిజమే !
III. భాషాంశాలు
పదజాలం
ప్రశ్న 1.
క్రింది పదాలు ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) ముసురుకొను = మూగు, కమ్ము
జవాబు:
మధ్య తరగతి మానవుడిని అనేక సమస్యలు ముసురుకుంటున్నాయి.
ఆ) ప్రాణం పోయు = జీవాన్ని ఇవ్వడం
జవాబు:
మానవత్వంతో చేయు మంచిపనులు సమాజానికి ప్రాణం పోయుచున్నాయి.
ఇ) గొంతు వినిపించు = సమస్యపై స్పందించు, గొంతు విప్పి మాట్లాడుట
జవాబు:
అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు “తమ గొంతును వినిపించుట” లేదు.
ఈ) యజ్ఞం = దీక్షగా చేయు
జవాబు:
విద్యార్థులు విద్యను యజ్ఞంగా చేయాలి.
ప్రశ్న 2.
కింది పదాలకు పర్యాయపదాలు రాసి, వాటితో వాక్యాలు రాయండి.
ఉదా : తారలు = చుక్కలు, నక్షత్రాలు
ఆకాశంలో నక్షత్రాలు మల్లెలు విరబూసినట్లుగా ఎంతో అద్భుతంగా ఉన్నాయి.
అ) జ్ఞాపకం = గుర్తు, లక్ష్యము, లెక్క, జ్ఞప్తి, స్మృతి తెలంగాణ లక్ష్యంగా ప్రజాఉద్యమాలు జరిగాయి.
ఆ) పోరాటం = సమరం, యుద్ధం, కయ్యం, రణం కాకతీయ వీరులు యుద్ధపటిమ కల్గినవారు.
ఇ) విషాదం = భేదం, బాధ, దుఃఖం, వ్యధ భూకంపం వల్ల నేపాల్లో దుఃఖం అలుముకుంది.
ఈ) సంస్కరణ = మార్పుతీసుకొచ్చుట, బాగు చేయుట, సత్కర్మము
కందుకూరి వీరేశలింగంగారు సంఘంలో మార్పు తీసుకువచ్చారు.
ప్రశ్న 3.
దిన పత్రికలకు సంబంధించిన పదజాలం ఆధారంగా భావనా చిత్రాన్ని గీయండి.
జవాబు:
- కాశ్మీర్లో తొలి మహిళ ఐపీయస్
- మధుమేహం
- వారెవ్వా అనార్కలీ
- ఇష్టపడి చదివా. నెంబర్వనయ్యా
వ్యాకరణాంశాలు
ప్రశ్న 1.
కింది ప్రత్యక్ష కథన వాక్యాలను పరోక్ష కథనంలోకి మార్చండి.
అ) రాజకీయపార్టీలవారు “జనానికి తక్షణం కావల్సింది కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర” అని ఎన్నికల ప్రకటించారు.
జవాబు:
రాజకీయపార్టీలవారు జనానికి తక్షణం కావల్సింది కడుపునిండా తిండి, కంటినిండా నిద్రాయని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు.
ఆ) “సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది” అని నెహ్రూ అన్నాడు.
జవాబు:
సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుందని నెహ్రూ అన్నాడు.
ప్రశ్న 2.
క్రింది పరోక్ష కథన వాక్యాలను ప్రత్యక్ష కథనంలోకి మార్చండి.
అ) పరిపాలనారంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరమని ముఖ్యమంత్రి ప్రకటించాడు.
జవాబు:
“పరిపాలనారంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరం” అని ముఖ్యమంత్రి ప్రకటించాడు.
ఆ) సమాజాన్ని సంక్షేమపథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరని మేధావులు నిర్ణయించారు.
జవాబు:
“సమాజాన్ని సంక్షేమపథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి” అని మేధావులు నిర్ణయించారు.
ఇ) తెలుగులోనే రాయండని, తెలుగే మాట్లాడండని టివి ఛానల్లో ప్రసారం చేశారు.
జవాబు:
“తెలుగులోనే రాయండి. తెలుగే మాట్లాడండి” అని టివి. ఛానల్లో ప్రసారం చేశారు.
ప్రశ్న 3.
క్రింది పదాలను విడదీసి, సంధులను గుర్తించి, సూత్రాలను రాయండి.
అ) ప్రపంచమంతా = ప్రపంచము + అంతా – ఉకారసంధి
సూత్రం: ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
ఆ) అత్యద్భుతం = అతి + అద్భుతం = యణాదేశసంధి
సూత్రం: ఇ, ఉ, ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు క్రమముగా య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.
ఇ) సచివాలయం = సచివ + ఆలయం = సవర్ణదీర్ఘసంధి
సూత్రం: అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు వాని దీర్ఘము ఏకాదేశమగును.
ప్రశ్న 4.
క్రింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి.
సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
అ) బృహత్కార్యం – బృహత్ అయిన కార్యం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) శక్తియుక్తులు – శక్తియును, యుక్తియును – ద్వంద్వ సమాసం
ఇ) సంక్షేమ పథకాలు – సంక్షేమము కొరకు పథకాలు – చతుర్థీతత్పురుష సమాసం
అతిశయోక్తి అలంకారం
III. కింది ఉదాహరణను పరిశీలించండి.
ఉదా : హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
హిమాలయ పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి. కాని అవి నిజంగా ఆకాశాన్ని తాకవు. కాని వాటిని ఎక్కువచేసి చెప్పడంవల్ల ‘ఆకాశాన్ని తాకుతున్నాయి” అని అంటున్నాము.
ఏదైనా ఒక వస్తువుని గాని, విషయాన్ని గాని ఉన్న దాని కంటే ఎక్కువ చేసి చెప్పడం ‘అతిశయోక్తి’ అలంకారం
కింది లక్ష్యాలను పరిశీలించండి. అలంకారం గుర్తించండి.
(కింది పద్యం సీతాదేవి, అశోకవనంలో హనుమంతుని విరాడ్రూప దర్శన సందర్భంలోనిది)
అ) కం. చుక్కలు తల పూవులుగా
నక్కజముగ మేను పెంచి యంబరవీథిన్
వెక్కసమై చూపట్టిన
నక్కోమలి ముదము నొందె నాత్మస్థితిలోన్.
– మొల్ల రామాయణం
పై పద్యపాదం అతిశయోక్తి అలంకారానికి చెందినది.
సమన్వయం : పై పద్యంలో హనుమంతుడు శరీరాన్ని పెంచితే ఆకాశంలోని నక్షత్రాలు కనబడ్డాయని అనగా బాగా ఎత్తు పెరిగాడని చెప్పడానికి ఉన్న దాని కన్నా ఎక్కువ చేసి చెప్పబడినది కావున ఇది అతిశయోక్తి అలంకారం.
ఆ) మా ఊర్లో సముద్రమంత చెరువు ఉన్నది.
జవాబు:
వివరణ : చెరువును వర్ణించుట ప్రధానం. దానిని ఎక్కువ చేసి సముద్రమంత అని చెప్పడం అతిశయోక్తి.
ఇ) అభిరాం తాటి చెట్టంత పొడవు ఉన్నాడు.
జవాబు:
సమన్వయం / వివరణ / = అభిరాం యొక్క పొడవును చెప్పటాన్కి తాటిచెట్టంత అని చెప్పడం అతిశయోక్తి కావున దీనిలో అతిశయోక్తి అలంకారం ఉంది.
స్వభావోక్తి అలంకారం
క్రింది ఉదాహరణను పరిశీలించండి.
శివాజీ ఎర్రబడిన కన్నులతో అదిరిపడే పై పెదవితో ఘనహుంకారముతో కదలాడే కనుబొమ్మ ముడితో గర్జిస్తూ “గౌరవించదగిన, పూజించదగిన స్త్రీని బంధించి అవమానిస్తావా ? అని సోన్దేవుని మంద లించాడు.
పై వాక్యంలో కన్నులు ఎర్రబడటం, పై పెదవి అదరడం, గట్టిగా హుంకరించడం, కనుబొమ్మ ముడి కదలాడటం కోపంగా ఉన్నప్పుడు కలిగే స్వభావాలు. ఇట్లా ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం కూడా ఒక అలంకారమె. దీన్ని ‘స్వభా వోక్తి’ అలంకారం అంటారు.
స్వభావోక్తి అలంకారం : విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడమే ‘స్వభావోక్తి అలంకారం’. “జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి”.
పై వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి.
సమన్వయం : జింకలు సహజంగానే బిత్తర చూపులు చూడటం, చెవులు నిగిడ్చిటం, చెంగు చెంగున గెంతడం సహజ సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం.
ప్రాజెక్టు పని
వివిధ దిన పత్రికల ఆధారంగా 5 సంపాదకీయ వ్యాసాలు సేకరించండి. చదివి అర్థం చేసుకొండి. కీలకాంశాలను గుర్తించండి. పట్టికలో నమోదు చేయండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు:
విశేషాంశాలు:
1969 – ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం :
తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన కొన్ని రక్షణలు, షరతులు ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. పెద్దమనుషుల ఒప్పందం కుదుర్చుకొనబడింది. ప్రభుత్వానికి తగు సిఫార్సులు చేసేటందుకు ఒక ప్రాంతీయ సంఘం ఉండేది. పెద్దమనుషుల ఒప్పందం తూ.చ. తప్పకుండ అమలవు తుందని కేంద్ర ప్రభుత్వం వారు హామీ ఇచ్చారు. కాని విఫలమయ్యారు. ప్రజల నమ్మకానికి ద్రోహం జరిగింది.
ప్రజల్లో పెద్దపెట్టున అసంతృప్తి చెలరేగింది. తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరు కున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఇది స్వచ్ఛందమైన, ఉద్ధృత మైన ప్రజోద్యమంగా మారింది. గ్రామం మొదలుకొని నగరం వరకు అన్ని రంగాలకు చెందిన యువకులు, మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరు ఉద్యమంలో పాల్గొన్నారు.
నాటి పత్రికలైన ‘జై తెలంగాణ’, ‘తెలుగుగడ్డ’, ‘తెలుగువాణి’ కూడ వీటికి తమ మద్దతును ప్రకటించాయి. ఈ సందర్భంలోనే తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ విమోచనోద్యమ సమితి వంటి సంస్థలు ఆవిర్భవించాయి.
సూక్తి : సత్యాన్ని త్రికరణశుద్ధిగా నమ్మితే విజయం తథ్యం. నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు.
– స్వామి వివేకానంద
ముఖ్య పదాలు – అర్థాలు.
I
అరుదుగా = అపూర్వము, ఆశ్చర్యము
శకము = ఒకదేశము, ఒకజాతి, ఒకని పరిపాలనతో చేరిన సంవత్సరం
సంబురాలు = వేడుకలు
ఆవిర్భవించు = పుట్టు, జన్మము, కలుగు
పతాకస్థాయి = చివరి దశ
స్వతంత్రము = స్వచ్ఛందము, సొంతము
భాష్పాలు = కళ్ళనీళ్ళు
అనుభూతి = అనుభవము, అనుభవించు
సుదీర్ఘకాలం = ఎక్కువ సంవత్సరాలు / ఎక్కువ కాలంపాటు
II
ఉద్రిక్తత = అతిశయించినది
రాచఠీవి = దర్జా, రాజదర్పం
ముడిపడు = కూడుకొని, కలిసి
సచివాలయం = మంత్రులు ఉండుచోటు, పరిపాలనా భవనం
ధిక్కరించడం = వ్యతిరేకించడం, లెక్కచేయకపోవడం
ఘట్టం = సంఘటన
ఆంక్ష = వెలివేయుట, బహిష్కారము
అమరుడు = చావనివాడు
జడుపు = జంకు, భయం
III
అస్తిత్వం = ఉనికి
స్వీయరాష్ట్రం = సొంతరాష్ట్రం
సిద్ధించింది = లభించింది
సంక్షోభం = ఎక్కువ వ్యాకులత
ఛిద్రము = ముక్కలు
పునర్నిర్మాణ = తిరిగి నిర్మించుకోవడం
విషాదం = దుఃఖం
సర్వతోముఖాభివృద్ధి = అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించుట
పాటుపడు = చేయుట
ఋగులు = కలత
అనుగుణం = తగినది
తక్షణం = వెంటనే
క్షోభ = కలత
పాఠం ఉద్దేశం
దిన పత్రికల్లోని సంపాదకీయాలు, వ్యాఖ్యలు సమాజ చైతన్యానికి తోడ్పడుతాయి. కాబట్టి విద్యార్థుల్లో సంపాదకీయ వ్యాసాలు, వ్యాఖ్యల పట్ల అభిరుచిని కలిగిస్తూ, ఆసక్తిని పెంపొందింపజేయడం, సాధారణ వార్తలకు, సంపాద కీయాలకు మధ్య ఉండే తేడాను, వాటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకొనేందుకు ఉద్దేశించినదే ఈ పాఠం.
పాఠ్యభాగ వివరాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా 2వ జూన్, 2014 నాడు “నమస్తే తెలంగాణ” దినపత్రికలో వెలువడిన సంపాదకీయ వ్యాసం ఇది.
ప్రవేశిక
‘సంపాదకీయం’ సమకాలీన ప్రపంచంలో జరిగిన స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంఘటనలను గాని, దాని పరిణామాలనుగాని, అద్భుత విశేషాలనుగాని వివరిస్తుంది. జాతిపిత మహాత్మాగాంధీ మృతి చెంది నప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పత్రికలన్నీ సంతాపం తెలియజేస్తూ గాంధీ గొప్పతనాన్ని కీర్తిస్తూ ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి. అదే విధంగా మన భారతీయ క్రీడాకారులు, శాస్త్రవేత్తలు ఆయా రంగాల్లో అద్భుత విజయాలు ఆవిష్కరించినప్పుడు (ఆనాటి) దినపత్రికలన్నీ వారిని ప్రశంసిస్తూ సంపాదకీయాలు రాశాయి.
అట్లాగే 1969 నుండి 2 జూన్, 2014 వరకు సాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సఫలమై, తెలంగాణ సకల జనుల స్వప్నం సాకారమైన వేళ, భారతదేశ పటంపై 29వ రాష్ట్రంగా ‘తెలంగాణ’ అవతరించింది. ఈ సందర్భంగా పత్రికలన్నీ పతాక శీర్షికలతో ఈ వార్తను ప్రచురించి, ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి. అట్లాంటి సంపాదకీయాల్లో ఒకటి ప్రస్తుత పాఠ్యాంశం. తెలంగాణ ఉద్యమ మహా ప్రస్థానంలోని మైలురాళ్ళను మనకు పరిచయం చేస్తున్నదీ వ్యాసం.
విద్యార్థులకు సూచనలు
- పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
- పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
- వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.
ప్రక్రియ – సంపాదకీయ వ్యాసం
ఈ పాఠం సంపాదకీయ వ్యాస ప్రక్రియకు చెందినది. సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంతో పూర్వా పరాలను పరామర్శిస్తూ సాగే రచన సంపాదకీయ వ్యాసం. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ, ఆలోచింపచేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం. ఇవి తత్కాలానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకూ అనువర్తింప జేసుకోవచ్చు.