Telangana SCERT 10th Class Telugu Grammar Telangana తెలుగు వ్యాకరణం Questions and Answers.
TS 10th Class Telugu Grammar Questions and Answers
భాషాభాగములు
ఆంధ్రభాషలోని పదాలను అయిదు రకాలుగా విభజించిరి. అవి :
1. నామవాచకము :
దీనికి విశేష్యము అని కూడా పేరు కలదు. పేర్లను తెలుపు పదాలు నామవాచకాలు. రాముడు, కృష్ణానది, బల్ల, మేడ. ఇది సంజ్ఞ, జాతి, గుణ క్రియా భేదములచే నాలుగు రకములైనది.
2. సర్వనామము :
నామవాచకములకు బదులుగా వాడబడేది. అతడు, ఆమె, అది, ఇది, ఇవి, వాడు, వారు మొ||నవి. ఇది కూడా ప్రశ్న వాచక, సంబంధ వాచకాది భేదములతోనున్నది.
3. విశేషణము :
నామవాచకముల, సర్వనామముల విశేషములను రంగు, రుచి మొ||నవి. వాటిని తెలుపు పదము. నల్లని, కమ్మని, చెడ్డ మొదలగునవి.
4. క్రియ :
పనిని తెలుపు పదాలు క్రియలు. ఉదా : చదివెను, వ్రాయును.
5. అవ్యయము :
లింగ, వచన, విభక్తులు లేనిది. ఆహా, అయ్యో, ఔరా, భళా, చేసి, చూసి, చేయక.
విభక్తులు
వాక్యములోని వేర్వేరు పదాలకు ఒకదానితో ఒకటికి గల సంబంధమును తెలిపేవే విభక్తి ప్రత్యయములు. ఇవి ఏడు విధములు.
విభక్తి – ప్రత్యయములు
ప్రథమా విభక్తి – డు, ము, వు, లు
ద్వితీయా విభక్తి – నిన్, నున్, లన్, కూర్చి, గురించి
తృతీయా విభక్తి – చేతన్, చేన్, తోడన్, తోన్
చతుర్థీ విభక్తి – కొరకున్, కై
పంచమీ విభక్తి – వలనన్, కంటెన్, పట్టి
షష్ఠీ విభక్తి – కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్
సప్తమీ విభక్తి – అందున్, నన్
సంబోధనా ప్రథమా విభక్తి – ఓ, ఓయి, ఓరి, ఓసి
విభక్తిని ఆధారంగా చేసుకొని శబ్దములకు చివర ఆగముగా గాని, ఆదేశముగా గాని వచ్చి చేరేటటువంటి ఇ, టి, తి వర్గములు ఔప విభక్తికములు.
కాలు + చే = కాలిచే
అన్ని + ని = అన్నిటిని
చేయి + లో = చేతిలో.
సూచనలు : ప్రాచీన గ్రంథాలలో వాడింది కావ్యభాష. దాన్నే గ్రాంథిక భాష అంటారు. నేడు వాడుకలో ఉండే భాషే వ్యావహారిక భాష, దాన్నే ఆధునిక భాష అంటారు. గ్రాంథిక భాషను ఆధునిక భాషలోకి మార్చేటప్పుడు క్రింది మార్పులు గమనించాలి.
1. ఎ, ఏ లకు ముందున్న వకారం లోపిస్తుంది. పట్టుకు + వెళ్ళాడు – పట్టుకు + ఎళ్ళాడు – పట్టుకెళ్లాడు. అలాగే పడేశాడు మొ॥
2. పెట్టు క్రియలోని వకారం లోపిస్తుంది. కూడు + పెట్టాడు – కూడు + ఎట్టాడు – కూడెట్టాడు
3. పదాదిలోని వకారం ఒకారంగా మారుతుంది.
వాడు వదలడు – వాడొదలడు
పట్టుకు వచ్చాడు – పట్టుకొచ్చాడు.
4. సాగుతున్న వర్తమాన కాలాన్ని సూచించే చోట ఊకారానికి మారుగా ఓకారం వస్తుంది.
ప్రవహిస్తూ + ఉంది – ప్రవహిస్తూంది – ప్రవహిస్తోంది
ఇట్లే చేస్తోంది. రాస్తోంది మొ॥
5. ము, మ్ము, ంబుల చోట ‘o’ వస్తుంది.
వర్షము – వర్షం; వృక్షమ్ము – వృక్షం; దేశంబు – దేశం
6. ని / ను, కి / కులకు ముందున్న మకారం లోపిస్తుంది. దానికి ముందున్న అచ్చు దీర్ఘం అవుతుంది. ని అనేది న్నిగా మారుతుంది.
దేశమును – దేశాన్ని; దేశమునకు – దేశానికి ; దానిని – దాన్ని; పందెమునకు – పందానికి
7. ఇ, ఈ, ఎ, ఏ లకు ముందు ‘య’ చేరుతుంది.
ఎక్కడ – యెక్కడ; ఇటు = యిటు
8. ఉ, ఊ, ఒ, ఓ లకు ముందు వకారం చేరుతుంది.
ఉండ + ఒచ్చు – ఉండొచ్చు – వుండొచ్చు
9. రెండు పదాలు కలిసినపుడు రెండో పదం మొదట గల ‘అ’ లోపిస్తుంది లేదా ‘అ’ కు ముందు టకారం చేరవచ్చు.
చచ్చే + అంత – చచ్చేంత – చచ్చేటంత
10. పొమ్ము, రమ్ము వంటి పదాలలోని ‘మ్ము’ లోపించి ముందు అచ్చు దీర్ఘం అవుతుంది. పొమ్ము – పో; రమ్ము – రా
చూడుము, వెళ్ళుము వంటి వాటిలో ‘ము’ లోపిస్తుంది. చూడు, వెళ్ళు, వచ్చెను, పోయెను లలో ‘ను’ లోపించి వచ్చె, పోయె అవుతాయి.
ఆధునిక భాషలోని పరివర్తనం
క్రింది వాక్యాలను ఆధునిక భాషలోకి పరివర్తనం చేయండి.
1. వివేకహీనుడయిన ప్రభువును సేవించుట కంటే వనవాసముత్తమము.
ఆధునిక భాష : వివేకహీనుడైన ప్రభువును సేవించడం కంటే వనవాసం ఉత్తమం.
2. ఎలుక ప్రతిదినము చిలుకకొయ్య మీఁదికెగిరి పాత్రము నందున్న యన్నము భక్షించి పోవుచున్నది.
ఆధునిక భాష : ఎలుక ప్రతిదినం చిలుకకొయ్య పైకి ఎగిరి పాత్రలో ఉన్న అన్నాన్ని భక్షించిపోతోంది. “తని పోతుంది.
3. బుద్ధిహీనత వలన సమస్త కార్యములు నిదాఘనదీ పూరములట్లు వినాశము నొందును.
ఆధునిక భాష : బుద్ధిహీనత వల్ల సమస్తకార్యాలు నిదామన పూరములైనట్లుగా వినాశనాన్ని పొందుతాయి.
4. అతని వ్యాపారము న్యాయమార్గమున సాగుచున్నది.
ఆధునిక భాష : అతని వ్యాపారం న్యాయమార్గంలో సాగుతోంది.
5. నేటి విద్యార్థులు జ్ఞాన సంపాదనకు తగినంత శ్రద్ధ వహించుట లేదు.
ఆధునిక భాష : నేటి విద్యార్థులు జ్ఞానం సంపాదించడం కోసం తగినంత శ్రద్ధ తీసుకోవడం లేదు.
6. పదేపదే చదివినచో పద్యము తప్పక అర్థమగును.
ఆధునిక భాష : పదే పదే చదివితే పద్యం తప్పకుండా అర్థమవుతుంది.
7. స్వాతంత్య్రమనగా స్వరాజ్యమని మాత్రమే కాదు.
ఆధునిక భాష : స్వాతంత్ర్యం అంటే స్వరాజ్యం అని మాత్రమే కాదు.
8. పురుషుడు న్యాయము తప్పక విద్యా ధనములు గడింపవలెను.
ఆధునిక భాష : పురుషుడు న్యాయాన్ని తప్పక విద్యా సంపాదించాలి ధనాల్ని గడించాలి.
కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చుట
‘కర్త’ ఆధారంగా రూపొందిన వాక్యాలు కర్తరి వాక్యాలని, ‘కర్మ’ ప్రధానంగా రూపొందించిన వాక్యాలను కర్మణి వాక్యాలని అంటారు.
ఉదా:
రామకృష్ణారావు ఆమోదముద్ర వేశారు. (కర్తరి వాక్యం)
రామకృష్ణారావుచే ఆమోదముద్ర వేయబడింది. (కర్మణి వాక్యం)
వివరణ :
(ఆమోదముద్రవేయడం – కర్తకు సంబంధించిన క్రియ.
ఆమోదముద్ర వేయబడటం – కర్మకు సంబంధించిన క్రియ.)
1. ఆయన కన్నుమూసిన విషయం పత్రికలో వ్రాశారు. (కర్తరి వాక్యం)
ఆయనచే కన్నుమూయబడిన విషయం పత్రికలో వ్రాయబడింది. (కర్మణి వాక్యం)
2. సుగ్రీవుడు వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. (కర్తరి వాక్యం)
సుగ్రీవునిచే వాలి యుద్ధానికి ఆహ్వానించబడ్డాడు. (కర్మణి వాక్యం)
ప్రత్యక్ష కథనం – పరోక్ష కథనం
ప్రత్యక్ష కథనం :
ఇతరులు చెప్పిన దానిని లేక తాను చెప్పిన దానిని ఉన్నది ఉన్నట్టుగా అనుసరించి చెప్పడం. దీనిలో ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి. ఉదా : ‘దీన్ని నరికివేయండి’ అని తేలికగ అంటున్నారు.
పరోక్ష కథనం :
అనుకరించిన దానిలోని విషయాన్ని లేక అభిప్రాయాన్ని మాత్రమే అనుకరించడం. దీనిలో ఇన్వర్టెడ్ కామాస్ ఉండవు.
ప్రత్యక్ష కథనం = పరోక్ష కథనం
నేను – నా – నాకు = తాను – తన – తనకు
మేము – మాకు = తాము – తమకు
నీవు – నీకు – నీది = అతడు / ఆమె – అతడికి / ఆమెకు – అతనిది / ఆమెది
మీ – మీకు = వారి – వారికి
ఇది – ఇవి – ఇక్కడ = అది – అవి – అక్కడ అని మార్పు చెందుతాయి.
1. ప్రత్యక్ష కథనం : “నా పుస్తకాలూ, కాగితాలూ ఏవీ ? ఎవరు తీశారు ?” అని రాజు కేకలు వేసేవాడు.
పరోక్ష కథనం : తన పుస్తకాలూ, కాగితాలూ ఏమైనాయనీ, ఎవరు తీశారనీ రాజు కేకలు వేసేవాడు.
2. ప్రత్యక్ష కథనం : “నా రచనలలో నా జీవితం ఉంటుంది” అని రచయిత మిత్రునితో అంటున్నాడు.
పరోక్ష కథనం : తన రచనలలో తన జీవితం ఉంటుందని ఒక రచయిత తన మిత్రునితో అంటున్నాడు.
3. ప్రత్యక్ష కథనం : “నేను కఠినుడనని అందరూ అంటారు. నిజానికి నేను చాలా శాంత స్వభావం కలవాడిని. పచ్చికవలె మృదువయినవాడిని. కోపం వచ్చినప్పుడే నన్ను సంభాళించడం కష్టమౌతుంది” అని తనను గురించి చెప్పుకున్నాడు.
పరోక్ష కథనం : తాను కఠినుడని అందరూ అంటారనీ, నిజానికి తాను చాలా శాంత స్వభావం కలవాడనీ, మృదువయిన వాడనీ, కోపం వచ్చినప్పుడు తనను సంభాళించడం కష్టమవుతుందనీ ఆయన తన గురించి చెప్పుకున్నాడు.
4. ప్రత్యక్ష కథనం : “నేను మా ఊళ్ళో నాలుగో తరగతిదాకా చదివాను” అని లక్ష్మి చెప్పింది.
పరోక్ష కథనం : తాను వాళ్ళ ఊళ్ళో నాలుగో తరగతిదాకా చదివానని లక్ష్మి చెప్పింది.
5. ప్రత్యక్ష కథనం : “గంభీరమైన నా ముఖం చూసి ఎవరూ నాతో స్నేహం చేయడానికి ఇష్టపడరు” అని అంబేద్కర్ అంటుండేవాడు.
పరోక్ష కథనం : గంభీరమైన తన ముఖం చూసి ఎవరూ తనతో స్నేహం చేయడానికి ఇష్టపడరని అంబేద్కర్ అంటుండేవాడు.
6. ప్రత్యక్ష కథనం : “నాకు ఏ వ్యసనాలు లేవు. శీల సంవర్ధనంలో అభిమానపడతాను” అని ఆయన అన్నాడు.
పరోక్ష కథనం : తనకు ఏ వ్యసనాలు లేవనీ శీల సంవర్ధనంలో అభిమానపడతానని ఆయన అన్నాడు.
7. ప్రత్యక్ష కథనం : “నేను రాకున్నా నీవు తప్పక వెళ్ళి చూచి రా” అని రవి నాతో అన్నాడు.
పరోక్ష కథనం : తాను రాకున్నా నన్ను తప్పక వెళ్ళి చూచి రమ్మని రవి నాతో అన్నాడు.
8. ప్రత్యక్ష కథనం : “నాకు చాలా ముఖ్యమైన పని ఉందని రాము చెప్పాడు.
పరోక్ష కథనం : తనకు చాలా ముఖ్యమైన పని ఉందని రాము చెప్పాడు.
జాతీయాల వివరణ
1. మంత్రాలకు చింతకాయలు రాలడం :
మంత్రాలు మనస్సుకు సంబంధించినవి. అవి చదివినంత మాత్రాన తక్షణమే భౌతికమైన పనులు జరుగవు. చింతచెట్టు కింద నిలబడి ఎన్ని మంత్రాలు చదివినా ఒక్క చింతకాయ కూడా రాలదు. మానసిక ప్రయత్నంకంటే భౌతిక ప్రయత్నమే ముఖ్యమని తెలియజెప్పే సందర్భంలో దీన్ని ప్రయోగిస్తారు.
2. మిన్నందుకోవడం :
మిన్ను అనగా ఆకాశం. నిత్యావసర వస్తువుల ధరలు కొనలేనంతగా బాగా పెరిగిన సందర్భంలోను లేదా ఎత్తైన భవన నిర్మాణం జరిగినప్పుడు దాని ఎత్తును తెలియజేసే సందర్భం లోను దీన్ని ప్రయోగిస్తారు.
3. గజ్జెకట్టడం :
ఎవరైనా నాట్యం చేయడానికి ఆరంభంగా ముందుగా కాళ్ళకు గజ్జెలు కడతారు. ఏదైనా ఒకపని ఆరంభమైందనే విషయాన్ని తెలియ జేసే సందర్భంలో దీన్ని వాడుతారు.
4. గుండెలు బరువెక్కడం:
సాధారణంగా గుండె సున్నితంగా ఉంటుంది. బరువులను మోయలేదు. మానసిక వత్తిడిని కూడా తట్టుకోలేదు. ఎప్పుడైనా తీవ్రమైన బాధ కల్గిన సందర్భంలోను, ఆత్మీయులు, స్నేహితులు మొదలైన వారిని కోల్పోయి బాధలో ఉన్నప్పుడు ఈ జాతీయాన్ని వాడుతాము.
5. నీరుకారిపోవడం :
ఘనపదార్థంగా ఉన్న మంచు ముక్క క్రమంగా నీరుగా మారిపోవడం అంటే ఉనికిని కోల్పోవడం. అదే విధంగా మనిషికి చెమట పట్టి ఒక పనిని చేయలేని సందర్భములో ఈ జాతీయాన్ని వాడుతాము.
6. కనువిప్పు :
‘విప్పు’ అంటే విచ్చుకోవడం, తెరుచు కోవడం. కన్ను తెరవడం ద్వారా కలిగే జ్ఞానం మిగిలిన నాలుగు జ్ఞానేంద్రియాల ద్వారా కలిగే జ్ఞానం కంటే ఎక్కువైనా, ఇక్కడ కనువిప్పు అంటే మనోనేత్రం విచ్చుకోవడం అని భావం. భ్రమలన్నీ తొలగిపోయి, సత్యం గోచరించడమే కనువిప్పు.
7. కాలధర్మం చెందడం :
కాలధర్మం అంటే ‘మరణించుట’ అని అర్థం. ఎవరైనా మరణించిన సందర్భంలో మరణించారు అనే పదాన్ని ప్రయోగించ కుండా కాలధర్మం (కాలధర్మాన్ని అనుసరించి మరణం పొందు) అనే పదం ప్రయోగిస్తారు.
8. తునాతునకలు :
ఏదైనా ఒక వస్తువు అజాగ్రత్త వల్ల గాని, నిర్లక్ష్యంగా గాని కిందపడినపుడు అది బ్రద్దలై ముక్కలుముక్కలైపోతుంది. లేదా వేలుళ్ళు సంభవించినపుడు కూడా వస్తువులు ముక్కలు ముక్కలై పోతాయి. అందువల్ల ఒక వస్తువు చిన్నా భిన్నమై పగిలిన సందర్భాన్ని తెలియజేయునపుడు దీన్ని వాడతారు.
9. పురిటిలోనే సంధి కొట్టడం :
పని ప్రారంభించగానే ఆ పనికి విఘ్నం కలగడం అనే అర్థంలో వాడే జాతీయం.
10. ఉన్నదంతా ఊడ్చుకుపోవడం :
పూర్తిగా నాశనం కావడం అని భావం.
11. శ్రీరామరక్ష :
రక్షింపగలిగినది, సర్వరక్షకమైనది అనే అర్థం.
12. గీటురాయి :
కొలబద్ద ప్రమాణము అని ఈ జాతీయానికి భావము. నాణ్యత నిర్ణయించడానికి బంగారాన్ని గీటురాయిపై గీత పెడతారు.
13. కారాలు మిరియాలు నూరడం :
మండిపడడం, మిక్కిలి కోపగించడం అని ఈ జాతీయానికి భావం.
14. స్వస్తి వాచకం :
ముగింపు, వదలివేయడం అని ఈ జాతీయానికి భావం.
15. అగ్రతాంబూలం : అందరికంటే ముందుగా గుర్తింపబడడం, గౌరవింపబడడం అని భావం.
16. దిక్కులు పిక్కటిల్లడం :
‘అంతటా వ్యాపించు’ అనే అర్థంలో వాడే జాతీయం.
17. విజయవంతం కావడం అంటే :
ఎవరైనా ఏదైనా ఒకపనిని కష్టపడి చేసినప్పుడు అది విజయవంతం అవుతుంది. ఆ విధంగా చేపట్టిన పని విజయం పొందిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. విజయవంతం కావడం అంటే కార్యసాఫల్యతను పొందడం అని అర్థం.
18. ఉలుకు పలుకూ లేకపోవడం అంటే :
‘ఉలుకు’ అంటే భయం ‘పలుకు’ అంటే మాట ఎవరైనా ఎక్కడైనా భయంకరమైన జంతువును చూచినప్పుడుగాని, భయంకరాకృతిని చూచిన సందర్భంలోను నిశ్చేష్ఠులై పడి ఉండటాన్ని ఈ పదం తెలియజేస్తుంది. నిష్క్రియత్వం లేకపోవడమే ఉలుకు పలుకూ లేకపోవడం.
వాక్య ప్రయోగాలు
1. శ్రీరామరక్ష : ధీమంతులకు ఆత్మస్థైర్యమే శ్రీరామరక్షగా ఉంటుంది.
2. గీటురాయి : ఎన్నికలు ప్రజాభిప్రాయానికి గీటు రాయి.
3. రూపుమాపడం : విద్యార్థులు తమలోని దుర్గుణాలను రూపు మాపడం తప్పనిసరి.
4. కారాలుమిరియాలు నూరడం : పాలకపక్షం, విపక్షం ఎప్పుడూ ఒకదానిపై మరొకటి కారాలు, మిరియాలు నూరుకొంటాయి.
5. స్వస్తి వాచకం : పురోహితులు భక్తులకు స్వస్తి వాచకం పలుకుతారు.
6. శ్రద్ధాసక్తులు : చదువుపట్ల శ్రద్ధాసక్తులు ప్రదర్శించే వారు విజయాన్ని పొందుతారు.
7. ప్రేమ ఆప్యాయతలు : తల్లిదండ్రులు తమ పిల్లలపట్ల ప్రేమ ఆప్యాయతలు ప్రదర్శించాలి.
8. వన్నెచిన్నెలు : అప్సరసలు తమ వన్నెచిన్నెలతో దేవేంద్రుని అలరించారు.
9. సమయసందర్భాలు : కొందరు సమయసందర్భాలు పాటించకుండా మాట్లాడుతారు.
10. హాయిసౌఖ్యాలు : ప్రతిఫలాపేక్ష లేకుండా సేవచేయు వానికి జీవితంలో హాయిసౌఖ్యాలు కలుగుతాయి.
11. సాన్నిధ్యం (సామీప్యం, ఎదురు) : భగవంతుని సాన్నిధ్యంలో అందరూ సమానులే.
12. మైత్రి : దుర్జనులతో మైత్రి చేయవద్దు.
13. ఏకాకి (ఒంటరి) : అభిమన్యుడు పద్మవ్యూహంలో ఏకాకి అయినాడు.
14. రోమాంచితం : భారతదేశం, క్రికెట్ ఆటలో ప్రపంచ కప్ సాధించినదని విని, నాకు రోమాంచితం అయ్యింది.
15. కనువిప్పు : గురువుగారి హెచ్చరికతో నాకు కనువిప్పు కలిగింది.
16. పొద్దస్తమానం : సోమరులు పొద్దస్తమానం కాల క్షేపాలతో సమయాన్ని వ్యర్థం చేస్తుంటారు.
17. చమత్కారం : చాటుపద్యాల్లోని చమత్కారం పాఠకులను ఆనందపరుస్తుంది.
18. కష్టఫలం : రైతు సోదరులు కష్టఫలంగానే పంటలు పండుతాయి.
19. కడుపులు మాడ్చుకొను : దీనజనులు తిండితిప్పలు లేకుండా కడుపులు మాడ్చుకొని జీవిస్తున్నారు.
20. అడుగున పడిపోవు : పసిబాలుడు లోతైన బోరుబావి అడుగున పడిపోవడం విచారకరం.
సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చుట
వాక్యాల మార్పిడిలో గుర్తుంచుకోదగిన అంశాలు :
సామాన్య వాక్యం :
సమాపక క్రియ కల్గి కర్త, కర్మలు గల వాక్యం సామాన్య వాక్యం.
ఉదా :
రాముడు సీతను పెండ్లాడెను.
సంక్లిష్ట వాక్యం :
ఒక సమాపక క్రియ; ఒకటిగాని, అంత కంటే ఎక్కువగాని అసమాపక క్రియలు గల వాక్యం సంక్లిష్ట వాక్యం. సమాపక క్రియగలది ప్రధాన వాక్యంగా, అసమాపక క్రియగలది ఉప వాక్యంగా ఉంటుంది. అసమాపక క్రియ భూతకాలాన్ని సూచిస్తుంది.
ఉదాహరణలు :
I. క్రింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యంగా మార్చండి.
ప్రశ్న 1.
నా మల్లెలు ఎంతోమంది యువతులు ధరించారు. ఆనందించారు.
జవాబు:
నా మల్లెలు ఎంతోమంది యువతులు ధరించి ఆనందించారు.
ప్రశ్న 2.
పిల్లలు సముద్రతీరాన ఆడుకొంటున్నారు. ఇసుకలో ఇల్లు కట్టుకున్నారు.
జవాబు:
పిల్లలు సముద్రతీరాన ఆడుకొంటూ, ఇసుకలో ఇల్లు కట్టుకున్నారు.
ప్రశ్న 3.
బొండుమల్లెలు వేసింది తానే, పెంచింది తానే, డబ్బు చేసిందీ తానే.
జవాబు:
బొండుమల్లెలు వేసి, పెంచి, డబ్బు చేసింది తానే.
ప్రశ్న 4.
ఎందరో దేశభక్తులు తమ ధన, మాన, ప్రాణాలను కోల్పోయారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు.
జవాబు:
ఎందరో దేశభక్తులు తమ ధన, మాన, ప్రాణాలను కోల్పోయి, దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు.
ప్రశ్న 5.
ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి. పంటలు బాగా పండాయి.
జవాబు:
ఈ సంవత్సరం వర్షాలు బాగా కురియడంతో పంటలు బాగా పండాయి.
ప్రశ్న 6.
విలేఖరులు వింకిల్ను పట్టణానికి తీసికెళ్ళారు. అతన్ని అనేక ప్రశ్నలడిగారు.
జవాబు:
విలేఖరులు వింకిల్ను పట్టణానికి తీసికెళ్ళి అనేక ప్రశ్నలడిగారు.
ప్రశ్న 7.
వినోద్ బొంబాయి వెళ్ళాడు. అతడు మిత్రుణ్ణి కలిశాడు.
జవాబు:
వినోద్ బొంబాయి వెళ్ళి మిత్రుణ్ణి కలిశాడు.
ప్రశ్న 8.
వదరుబోతు జన్మించినది అనంతపురమందు – వదరుబోతు పని చేసినది, సన్యసించినది అనంతపురమందే.
జవాబు:
వదరుబోతు జన్మించినది, పని చేసినది, సన్యసించినది అనంతపురమందే.
ప్రశ్న 9.
నా భయం కళ్ళకు కప్పేసింది. రాలేక నిలబడి పోయాను.
జవాబు:
నా భయం కళ్ళకు కప్పేయ్యటంతో రాలేక నిలబడి పోయాను.
II. క్రింది సంక్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చండి.
ప్రశ్న 1.
జనమంతా పగలబడి నవ్వుతూ గోల చేస్తున్నారు
జవాబు:
జనమంతా పగలబడి నవ్వుతున్నారు. గోల చేస్తున్నారు.
ప్రశ్న 2.
అతను మాట్లాడుతూ అన్నం తింటున్నాడు.
జవాబు:
అతను మాట్లాడుతున్నాడు. అన్నం తింటున్నాడు.
ప్రశ్న 3.
అంబేద్కర్ అమెరికా వెళ్ళి తనతో ఇరవైనాలుగు పెట్టెల పుస్తకాలు తెచ్చుకున్నాడు.
జవాబు:
అంబేద్కర్ అమెరికా వెళ్ళాడు. తనతో ఇరవైనాలుగు పెట్టెల పుస్తకాలు తెచ్చుకున్నాడు.
ప్రశ్న 4.
రాము కాఫీ తాగుతూ చదువుతున్నాడు.
జవాబు:
రాము కాఫీ తాగుతున్నాడు. రాము చదువుతున్నాడు.
ప్రశ్న 5.
కృష్ణ ఉద్యోగం చేసుకుంటూ చదువుకొంటున్నాడు.
జవాబు:
కృష్ణ ఉద్యోగం చేసుకుంటున్నాడు. కృష్ణ చదువు కొంటున్నాడు.
సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్పుట
సంయుక్త వాక్యం :
సమ ప్రాధాన్యం గల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడే వాక్యాలను సంయుక్త వాక్యాలు అంటారు.
ప్రశ్న 1.
వీరు పొమ్మను వారు కారు. వీరు పొగబెట్టు వారు.
జవాబు:
వీరు పొమ్మను వారు కారు, పొగబెట్టువారు.
ప్రశ్న 2.
రైలు వచ్చింది. చుట్టాలు రాలేదు.
జవాబు:
రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు.
ప్రశ్న 3.
నాలో చురుకుదనం ఉంది. జిజ్ఞాస ఉంది.
జవాబు:
నాలో చురుకుదనం, జిజ్ఞాస ఉన్నాయి.
ప్రశ్న 4.
పదేళ్ళకే మాకు ఎంతో మాటకారితనం వచ్చేది. ఎంతో పెద్దరికమూ వచ్చేది.
జవాబు:
పదేళ్ళకే మాకు ఎంతో మాటకారితనమూ, పెద్దరికమూ వచ్చేవి.
ప్రశ్న 5.
ఆయన సత్యకాలంవాడు. పరమ సాత్వికుడు.
జవాబు:
ఆయన సత్యకాలంవాడు మరియు పరమ సాత్త్వికుడు. (లేదా) ఆయన సత్యకాలం వాడు, పరమ సాత్త్వికుడు కూడా.
ప్రశ్న 6.
అంబేద్కర్ కార్యవాది. క్రియాశీలి.
జవాబు:
అంబేద్కర్ కార్యవాది మరియు క్రియాశీలి. (లేదా) అంబేద్కర్ కార్యవాది, క్రియాశీలి కూడా.
ప్రశ్న 7.
కమల బాగా చదివింది. కమలకు ర్యాంకు రాలేదు.
జవాబు:
కమల బాగా చదివింది కాని ర్యాంకు రాలేదు.
ప్రశ్న 8.
రాముడు శివధనుస్సును విరచెను. రాముడు సీతను వివాహమాడెను.
జవాబు:
రాముడు శివధనుస్సును విరచెను మరియు సీతను వివాహమాడెను.
ప్రశ్న 9.
పోటీలో చాలామంది పాల్గొన్నారు. బహుమతి ముగ్గురికే ఇచ్చారు.
జవాబు:
పోటీలో చాలామంది పాల్గొన్నప్పటికీ బహుమతి ముగ్గురికే ఇచ్చారు.
ప్రశ్న 10.
రవి సాయంకాలం వరకు పనిచేసేవాడు. రవి చీకటి పడుతుంటే ఇంటికి వెళ్లేవాడు.
జవాబు:
రవి సాయంకాలం వరకు పనిచేసేవాడు కాని చీకటి పడుతుంటే ఇంటికి వెళ్ళేవాడు.
ప్రశ్న 11.
అనిల్ ఎంతో కష్టపడి చదివాడు. అతడు పరీక్షలో తప్పాడు.
జవాబు:
అనిల్ ఎంతో కష్టపడి చదివాడు కానీ పరీక్షలో తప్పాడు.
ప్రశ్న 12.
ప్రకాశం పంతులుగారు ధైర్యశాలి. అతడు త్యాగశీలి.
జవాబు:
ప్రకాశం పంతులుగారు ధైర్యశాలి మరియు త్యాగశీలి.
ప్రశ్న 13.
సీత పాఠం అర్థం చేసుకొంది. సీత పరీక్ష బాగా వ్రాసింది.
జవాబు:
సీత పాఠం అర్థం చేసుకొనడంతో పరీక్ష బాగా వ్రాసింది.
వాక్యాంగములు
సాధారణంగా వాక్యంలో కర్త, కర్మ, క్రియ అనే మూడు అంగాలు ఉంటాయి.
కర్త (Subject) – పనిని చేసేవాడు కర్త.
కర్మ (Object) – పని యొక్క ఫలితాన్ని అనుభవించేవాడు కర్మ.
క్రియ (Verb) – చేసిన పనిని తెలిపే పదం క్రియ.
ఉదా : వేటగాళ్ళు వలలు పన్నారు.
ఈ వాక్యంలో వేటగాళ్ళు – కర్త, వలలు – కర్మ, పన్నారు – క్రియ.
క్రియను ఎవడు, ఎవరు అను పదాలతో ప్రశ్నించగా వచ్చే జవాబు కర్త.
క్రియను దేనిని, వేనిని అను ప్రశ్నించగా వచ్చే జవాబు కర్మ.
కర్తను తెలిపే పదం కర్తృపదం అనీ, కర్మను తెలిపే పదం కర్మపదం అనీ అంటారు.
కొన్నిచోట్ల వాక్యాల్లో కర్త లోపించవచ్చును.
ఉదా : బడికి వెళ్ళాడు
(ఇక్కడ ‘వాడు’ అనే కర్త పదం లేదు)
కొన్నిచోట్ల వాక్యాల్లో కర్మ లోపించవచ్చును.
ఉదా : నేను చదువుతున్నాను.
(ఇక్కడ కర్మ పదం ‘పాఠం’ లేదు)
కొన్నిచోట్ల క్రియలేని వాక్యాలు ఉండవచ్చును.
ఉదా : దశరథునకు ముగ్గురు భార్యలు.
క్రియలు – భేదములు
పనిని తెలుపు పదములు క్రియలు. ధాతువునకు ప్రత్యయములు చేరి క్రియలు ఏర్పడును. తెనుగున ధాతువులు ఉకారాంతములై ఉండును.
ధాతువునకు ఉదా : వండు, వ్రాయు, కొట్టు, తిను మొదలగునవి.
క్రియకు ఉదా : వండెను, వ్రాయుచున్నాడు, కొట్టగలడు, తినెను మొదలగునవి.
క్రియలు పనిని తెలిపే విధానమును బట్టి రెండు రకములు. అవి :
- సమాపక క్రియలు,
- అసమాపక క్రియలు.
సమాపక క్రియ – వాక్యార్థమును పూర్తి చేయునది. – తిన్నాడు, చూశాడు, చదివాడు.
ఉదా : సీత బడికి వెళ్ళెను.
అసమాపక క్రియ – వాక్య భావమును పూర్తి చేయని క్రియ. – తిని, చూసి, వండి, చేస్తూ
ఉదా : సీత బడికి వెళ్ళి
సమాపక క్రియలు కాలము, వచనము మొదలగు వాటిని అనుసరించి మారుచుండును. అసమాపక క్రియలు మారవు. అందుకే వాటిని అవ్యయములు అని లెక్కించిరి.
పని జరుగు సమయమును బట్టి సమాపక క్రియలు నాలుగు కాలములందు వాడబడును.
భూతకాల క్రియ – జరిగిపోయిన పనిని తెలుపును.
ఉదా : వెళ్ళెను, వెళ్ళితిని, వ్రాసితిమి.
వర్తమానకాల క్రియ – జరుగుచున్న పనిని తెలుపు క్రియ.
ఉదా: వెళ్ళుచున్నావు, వ్రాయుచున్నాడు, తినుచున్నాము.
భవిష్యత్కాల క్రియ – జరుగబోవు పనిని తెలుపు క్రియ.
ఉదా : వెళ్ళగలను, వ్రాయగలడు, తినగలము.
తద్ధర్మార్థక క్రియ – భూత భవిష్యద్వర్తమానముల కంటే భిన్నమై, ఆ మూడు కాలములను తెలుపు క్రియ.
ఉదా : వెళ్ళును, వెళ్ళెదము, చేసెదవు.
(ఇప్పటి వ్యవహారమున తద్ధర్మార్థక క్రియ భవిష్య దర్థములో వాడుచున్నారు)
అసమాపక క్రియలు :
1. క్త్వార్థకము – భూతకాలమును తెలిపే అసమాపక క్రియ. ధాతువు చివర ‘ఇ’ చేరును.
ఉదా : చేయు + ఇ = చేసి, తిను + ఇ = తిని.
2. వ్యతిరేక క్త్వార్థకము – క్త్వార్థకమునకు వ్యతిరేకము. ధాతువునకు “అక” చేరును.
ఉదా : చేయు + అక = చేయక,
తిను + అక = తినక.
3. శత్రర్థకము – వర్తమానార్ధమును తెలుపునట్టిది. ధాతువునకు “చున్” ప్రత్యయము చేరును.
ఉదా : చేయు + చున్ = చేయుచున్
తిను + చున్ = తినుచున్.
4. తుమున్నాద్యర్థకము – కారణమును తెలియజేసేది. ధాతువునకు “అన్” చేరును.
ఉదా : చేయన్, తినన్.
5. చేదర్థకము – కార్యకారణ సంబంధాన్ని తెలియ జేసేది. ధాతువునకు “ఇనన్” ప్రత్యయము చేరును.
ఉదా : చదివినన్, చేసినన్, తినినన్.
6. అనంతర్యార్థకము – తరువాత అనే అర్థాన్ని తెలుపుతూ ధాతువునకు “డున్” చేరును.
ఉదా : చదువుడున్, చేయుడున్, తినుడున్.
7. భావార్థకము – ధాతువు యొక్క భావాన్ని తెలిపేది. “ట” చేరును.
ఉదా : విను – వినుట, చేయు – చేయుట, తిను – తినుట, వండు వండుట.
8. వ్యతిరేక భావార్ధకము – ధాతువు యొక్క అర్థానికి వ్యతిరేకార్థమును తెలుపుచూ “అమి” చేరిన అసమాపక క్రియ.
ఉదా : విను – వినమి, చేయు – చేయమి, తిను – తినమి.
వాక్యములలో రకములు
వాక్యాలు చెప్పే భావాన్ని, విధానాన్ని బట్టి కొన్ని రకాలుగా విభజించబడ్డాయి.
1. విద్యర్థక వాక్యం – కర్త పనిని చేయాలని ఆదేశించి నట్లుగా ఉంటుంది.
ఉదా :
- సలీం ! నీవు తరగతిలో కూర్చో.
- మీరు చదవండి.
- మీరు చిత్రం వేయండి.
- నీవు గూడూరు వెళ్ళు.
- మీరు వెళ్ళాల్సిందే.
- మీరు వ్రాయండి.
- నువ్వు వాడు.
2. అనుమత్యర్థక వాక్యం – కర్త చేయవలసిన పనిని చేయవచ్చునని అనుమతి ఇచ్చినట్లుంటుంది.
ఉదా :
- పిల్లలూ ! ఇక మీరు ఆటలాడుకోవచ్చు.
- మీరు ఆటలు ఆడవచ్చు.
- పిల్లలు ఊరికి వెళ్ళవచ్చు.
- మీరు భోజనం చేయవచ్చు.
- మీరు రావచ్చు.
- నేను లోపలికి రావచ్చునా ?
- మేము ఆటలు ఆడవచ్చునా ?
3. సందేహార్థక వాక్యం – కర్త చేయవలసిన పనిని చేస్తాడో, చేయడో అనే అనుమానం తెలుపుతుంది.
ఉదా :
- రాము ఈ రోజు బడికి రాడేమో.
- రవి చూస్తాడో ? చూడడో ?
- అమ్మ రమ్మంటుందో ? వద్దంటుందో ?
- ఈ గొయ్యి లోతో ? కాదో ?
- వారు వెళ్ళవచ్చా ?
- వాన పడుతుందో, లేదో ?
4. ప్రశ్నార్థక వాక్యం – కర్త చేయవలసిన పని జరిగిందా అని ప్రశ్నిస్తున్నట్లు ఉంటుంది.
ఉదా :
- లలిత బడికి వచ్చిందా ?
- పాఠాలు బాగా విన్నారా ?
- పరీక్షలు బాగా వ్రాశారా ?
- పదార్థాలు రుచిగా ఉన్నాయా ?
- వారందరికి ఏమైంది ?
5. వ్యతిరేకార్థక వాక్యం – కర్త చేయవలసిన పనిని చేయడు అని చెప్పడం.
ఉదా :
- రాజు ఈరోజు బడికి రాడు.
- లత సినిమా చూడదు.
- అమ్మ ఊరికి వెళ్ళదు.
- వాడు పాఠం వ్రాయడు.
- రాము చదవడు.
6. నిషేధార్థక వాక్యం – ఎవరూ ఈ పనిని చేయకూడదనే భావన ఉంటుంది.
ఉదా :
- పరీక్ష మొదలైన తరువాత ఎవరూ లోనికి రాకూడదు.
- మీరు అల్లరి చేయవద్దు.
- మీరు బయట తిరగవద్దు.
- దుష్టులతో స్నేహం వద్దు.
- మీరు రావద్దు.
- మీరు వెళ్ళవద్దు.
- నీవు తినవద్దు.
7. నిశ్చయార్థక వాక్యం – ఒక నిశ్చయాన్ని తెలిపేందుకు వాడే వాక్యం. కర్తకు లేక మరొక పదానికి “ఏ, అ”లు చేర్చడం వలన ఏర్పడును. లేకుండా కూడా ఉండవచ్చును.
ఉదా :
- రాముడే రక్షకుడు, రాముడు రక్షకుడు, వాడు శాస్త్రవేత్త.
- నేను తప్పక వస్తాను.
- నేను రేపు రాస్తాను.
- రాము తప్పక వెళ్తాడు.
- గోపాల్ చెట్టు ఎక్కాలి.
8. ఆశ్చర్యార్థక వాక్యం – ఆశ్చర్యాన్ని తెలిపేది.
ఉదా :
- అయ్యో ! ఎంత కష్టం వచ్చింది, ఆహా ! ఎంత బాగున్నదో !
- ఆహా ! కూర ఎంత బాగుందో !
- ఆహా ! చిత్రం ఎంత అద్భుతంగా ఉందో !
- ఆహా ! ఏమి ప్రకృతి రమణీయత !
- ఆహా ! ఎంత బాగుందీ !
9. ప్రార్థనార్థక వాక్యం – ఇతరులను ప్రార్థించు, అర్థించు అనే విషయంలో ఈ వాక్యాలు వస్తాయి.
ఉదా :
- దయచేసి అనుమతించండి.
- నన్ను అనుగ్రహించండి.
- నాకు సెలవు ఇవ్వండి.
- లోపలికి అనుమతించండి.
- అయ్యా ! నాకు చదువు చెప్పండి.
- దయచేసి నన్ను కాపాడు.
- దయచేసి ఆ పనిని పూర్తి చేయండి.
10. అప్యర్థకం – ‘అపి’ అనగా కూడా అని అర్థం. కూడా అనే పదాన్ని ప్రయోగించాల్సిన సమయంలో ఈ వాక్యాలను వాడుతాము.
ఉదా :
- వర్షాలు వచ్చినా చెరువు నిండలేదు.
- అధికారులు వచ్చినా సమస్యలు తీరలేదు.
- ముఖ్యమంత్రి వచ్చినా స్పందన లేదు.
- వర్షాలు పడినా ధరలు తగ్గలేదు.
- బాగా చదివినా మార్కులు రాలేదు.
- రైలు వచ్చినా చుట్టాలు రాలేదు.
- దేవుడు దిగివచ్చినా, ఆయన గెలవలేదు.
11. శత్రర్థకము వర్తమాన అసమాపక క్రియను శత్రర్థకము అని అంటారు.
ఉదా :
- రాము తింటూ వింటున్నాడు.
- అమ్మ వండుతూ చదువుతున్నది.
- లత పాడుతూ నటిస్తున్నది.
- శ్రీను పాఠం వింటూ రాస్తున్నాడు.
12. తద్ధర్మార్థక వాక్యం – మూడు కాలాల యందును జరుగు పనులను తెలియజేయును.
ఉదా :
- సూర్యుడు తూర్పున ఉదయించును.
- అగ్ని మండును.
- సముద్రపు నీరు ఉప్పగా ఉండును.
- ఆవుపాలు మధురంగా ఉండును.
13. ఆశీర్వచనార్థకం – ఆశీస్సును తెలియజేయు వాక్యములను ఆశీర్వచనార్థక వాక్యాలు అంటారు.
ఉదా :
- మీకు మేలు కలుగుగాక
- మీకు క్షేమం కలుగుగాక
- భగవంతుడు మిమ్ము అనుగ్రహించు గాక
- మీ మార్గం ఫలప్రదం అగునుగాక
- మీకు విజయం సిద్ధించుగాక.
- మీరు ఉత్తీర్ణులగుదురుగాక.
14. హేత్వర్థక వాక్యం – హేతువు అనగా కారణం. ఒక పని జరగడానికి ఒక నిమిత్తం ఉండాలి. అలాంటి వాక్యాలను హేత్వర్థక వాక్యాలు అని అంటారు.
ఉదా :
- బాగా చదవడం వల్ల మార్కులు వచ్చాయి.
- వరదలు రావడంతో ఇబ్బందులు వచ్చాయి.
- మురుగునీరు రావడంతో దోమలు వచ్చాయి.
- వర్షాలు కురవడంతో రైతులు ఆనందించారు.
15. సామర్థ్యార్థకం – పనిని చేయుటయందు సమర్థత కలిగి ఉండటం.
ఉదా :
- రవి పాడగలడు.
- లత చక్కగా చిత్రం వేయగలదు.
- అర్జునుడు యుద్ధం చేయగలడు.
- ప్రధాని సామర్థ్యాన్ని నిరూపించుకొనగలడు.
వాక్యములు – భేదములు
ఒక భావమును తెలుపు పదముల సముదాయమే వాక్యము.
ఉదా : రాముడు పాఠమును చదివెను.
ఒక్కొక్కప్పుడు ప్రశ్నకు సమాధానంగా ఒక మాటనే చెప్పవచ్చును. అది పూర్తి భావాన్ని ఇస్తుంది. కనుక అదియును వాక్యమే అగును.
ఉదా : నీదేవూరు ? – విజయవాడ.
నీ పేరేమి ? – రామరాజు.
వాక్యములు ముఖ్యముగా మూడు రకములు.
అవి :
- సామాన్య వాక్యము,
- సంక్లిష్ట వాక్యము,
- సంయుక్త వాక్యము.
1. సామాన్య వాక్యము (Simple Sentence) :
దీనిని సంపూర్ణ వాక్యము అని కూడా అంటారు. పూర్తి అర్థమును తెలుపుతూ సమాపక క్రియతో కూడినది సామాన్య వాక్యము.
ఉదా :
హనుమంతుడు సముద్రమును దాటెను. భావమును పూర్తిగా చెప్పకుండా అసమాపక క్రియతో కూడిన వాక్యము అసంపూర్ణ వాక్యము. దీనినే ఉపవాక్యము అందురు. ఉదా : నేను బడికి వెళ్ళి.
2. సంక్లిష్ట వాక్యము (Complex Sentence) :
ఒక ప్రధాన వాక్యము, ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని ఉపవాక్యములు కలిగియుండు వాక్యమే సంక్లిష్ట వాక్యము. దీనిలో ప్రధాన వాక్యంలో సమాపక క్రియ, ఉపవాక్యాల్లో అసమాపక క్రియ ఉంటాయి.
ఉదా :
మీరు వచ్చినచో, ఊరికి వెళ్ళుదము. సీత పాటను పాడి, బహుమతి గెల్చుకొనెను. వాడు చదివినా, అర్థం కాలేదు.
రెండు సామాన్య వాక్యాలు కలిపి సంక్లిష్ట వాక్యముగా చేయవచ్చును. అప్పుడు మొదటి వాక్యంలోని క్రియ అసమాపక క్రియ అవుతుంది.
ఉదా :
- వాడు బడికి వెళ్ళాడు. వాడు పాఠమును చదివాడు.
వాడు బడికి వెళ్ళి పాఠమును చదివాడు. - సీత నవ్వుతున్నది. సీత మాట్లాడుతున్నది.
సీత నవ్వుతూ మాట్లాడుతున్నది.
3. సంయుక్త వాక్యము (Compound Sentence) :
పరస్పర సంబంధము గల రెండు వాక్యములు ఒకే వాక్యములో ఉన్నచో అది సంయుక్త వాక్యము.
ఉదా : అతడు విద్యావంతుడే గాక వినయశీలి కూడ.
వాడు చదివాడు కాని, అర్థం కాలేదు.
అర్థాలు
అంగన = స్త్రీ
అగ్రహారం = బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమతిగా ఇచ్చే ఇళ్లు, భూములు
అభీప్సితం = కోరిక
అభ్యాగతుడు = భోజన సమయానికి వచ్చిన అతిథి
ఆర్ధ = తడిసిన
ఆసరా = తోడు
ఈవి = త్యాగం
ఉద్ది = జత
ఉన్నతి = ప్రగతి
ఉమ్రావులు = ఉన్నత వంశీయులైన కళాపోషకులు
ఏపు = వికాసం
ఏరుతార్లు = భేదాలు
కడగండ్ల = కష్టాలు
కయ్య = కాలువ
కర్దమం = బురద
పర్యాయ పదాలు
యశం = కీర్తి, గొప్ప
రవం = శబ్దం, ధ్వని
జెండా = పతాకం, కేతనం
రైతు = హాలికుడు, కర్షకుడు
అరణ్యం = వనం, అడవి
పల్లె = గ్రామం, జనపదం
తారలు = చుక్కలు, నక్షత్రాలు
మబ్బు = మేఘం, తెచ్చి
హాటకం = బంగారం, హోన్ను
సంబురం = సంతోషం, ఆనందం
వేదండము = ఏనుగు, కరి
వెన్నెల = జ్యోత్స్న, కౌముది
వటువు = బ్రహ్మచారి, వర్ణి, వడుగు
భండనం = యుద్ధం, రణం
కృపాణం = కత్తి, ఖడ్గం
పొలిమేర = సరిహద్దు, ఎల్ల
పొంకంగ = సొంపుగా, అందంగా
దేవాలయం = గుడి, కోవెల
పురాగ = మొత్తం, అంతా
వ్యుత్పత్త్యర్థాలు
నీరజభవుడు – విష్ణువు నాభి కమలము నందు పుట్టినవాడు (బ్రహ్మ)
పారాశర్యుడు – పరాశర మహర్షి కుమారుడు (వ్యాసుడు)
త్రివిక్రముడు – ముల్లోకాలను ఆక్రమించినవాడు (విష్ణువు)
గురువు – ఆజ్ఞానమనే అంధకారిని తొలగించే వాడు (ఉపాధ్యాయుడు)
అధ్యక్షుడు – చర్యలను కనిపెట్టి చూచేవాడు
విశ్వంభరుడు – విశ్వాన్ని భరించేవాడు (విష్ణువు)
భాగీరధీ – భగీరథమునిచే తీసుకురాబడదు
భాష – భాషింపబడేది (గంగ)
విష్ణువు – విశ్వమంతటా వ్యాపించి ఉండేవాడు (విష్ణుమూర్తి)
నానార్థాలు
అంబరము = వస్త్రం, ఆకాశం
ఆశ = కోరిక, దిక్కు
హరి = విష్ణువు, ఇంద్రుడు, గుర్రం
క్షేత్రం = చోటు, పుణ్యస్థానం
స్కందం = కొమ్మ, ప్రకరణం
సిరి = సంపద, లక్ష్మీ
రాజు = ప్రభువు, ఇంద్రుడు
బుధుడు = పండితుడు, బుధగ్రహం
వర్షం = వాన, సంవత్సరం, దేశం
పణం = పందెం, కూలి, వెలి
ఘనం = మేఘం, ఏనుగు, కఠినం
గురువు = ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి
కులం = వంశం, జాతి
సాహిత్యం = కలయిత, వాజ్ఞ్మయం
వీడు = పట్టణం, వదలడం, ఇతడు
బాష్పం = కన్నీరు, ఆవిరి
ప్రకృతి – వికృతులు
ప్రకృతి – వికృతి
సముద్రం – సంద్రం
ఆధారం – అదెరువు
విద్య – విద్దె
శిఖ – సిగ
ప్రయాణం – పైనం
దిశ – దెస
భిక్ష – బిచ్చ
యాత్ర – జాతర
మత్స్యం – మచ్చెం
పంక్తి – బంతి
రత్నం – రతనం
ఆజ్ఞ – ఆన
ఆశ్చర్యం – అచ్చెరువు
కవిత – కైత
కార్యం – కర్జం
కావ్యం – కబ్బం
భాష – బాస
సొంత వాక్యాలు
1. సయ్యాటలాడు : ఆకాశంలో ఎగిరిన పతంగి గాలితో సయ్యాటలాడుతోంది.
2. చెవి వారిచ్చి : మా నానమ్మ చెప్పే కథలను చెవి వారిచ్చి వింటాను.
3. కుటిలవాజితనం : మనుషులకు ఉండకూడని లక్షణం కుటిలవాజితనం.
4. పొలిమేర : మా ఊరి పొలిమేరలో మంజీర నది ప్రవహిస్తుంది.
5. నగారా : అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది.
6. మచ్చుతునక : తెలంగాణ చరిత్రలో పాపన్నపేట సంస్థానం మచ్చుతునక.
7. భాసిల్లు : ఏడుపాయల వనదుర్గ ఆలయం పచ్చని రమణీయతల మధ్య భాసిల్లుతోంది.
8. ముసురుకొను : బెల్లం చుట్టూ ఈగలు ముసురు కున్నాయి.
9. ప్రాణం పోయడం : తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ ప్రాణం పోశారు.
10. గొంతు వినిపించు రాష్ట్ర సమస్యలపై ప్రధానితో అభిలాష్ తన గొంతు వినిపించాడు.
11. యజ్ఞం : గ్రామ క్షేమం కోసం మందిరంలో యజ్ఞం జరిగింది.
12. చెరగని త్యాగం : తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న విద్యార్థులు చెరగని త్యాగంగా మిగిలారు.
13. పుట్టినిల్లు : సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లు.
14. ఏకాకి : పల్లెల్లో ఏకాకి జీవనం కనిపించదు.
15. చిత్తశుద్ధి : చిత్తశుద్ధితో చేసిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది.
16. గజ్జెకట్టు : ఆర్థిక అసమానతలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వీరేశం గజ్జెకట్టాడు.
17. పఠనీయ గ్రంథం : మనిషి జీవితం పఠనీయ గ్రంథం లాంటిది.