TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 3rd Lesson వీర తెలంగాణ Textbook Questions and Answers.

TS 10th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వీర తెలంగాణ

చదవండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 26)

తెలుగు గుండెల బిగువు
తెలిపింది తెలగాణ
తెలుగు జోదుల తెగువ
చూపించి తెలగాణ

దేశానికే ముందు నిల్చిందిరా తెలగాణ
దేశానికే పేరు తెచ్చిందిరా !
పరాన్నభుక్కులకు
పక్కలో బల్లెమై
దేశద్రోహుల కింక
తావులేదని చాటి

ఢంకా బజాయించెరా తెలగాణ
దౌర్జన్య మెదిరించెరా !
జయభేరి మోగించెరా తెలగాణ
జయము రైతుల కందెరా !
– (కొత్తపల్లి రంగారావు తెలంగాణ పోరాట పాటలు)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ గేయాన్ని రాసిందెవరు ?
జవాబు:
ఈ గేయాన్ని కొత్తపల్లి రంగారావుగారు రాశారు.

ప్రశ్న 2.
ఈ గేయం దేని గురించి తెలియజేస్తున్నది ?
జవాబు:
ఈ గేయం తెలంగాణ పోరాటం గురించి తెలియజేస్తున్నది.

TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ

ప్రశ్న 3.
ఈ గేయాన్ని ఎందుకు రాసి ఉంటాడు ?
జవాబు:
ఈ గేయాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాసిఉంటాడు.

ప్రశ్న 4.
ఇట్లా తెలంగాణ గురించి రాసిన కవులు, రచయితలు ఎవరు ? ఎందుకు రచనలు చేసి ఉంటారు ?
జవాబు:
తెలంగాణ గురించి రాసిన కవులు, రచయితలు కాళోజి, డా॥ సినారె, సామల సదాశివ, అలిశెట్టి ప్రభాకర్, డా॥ దాశరథి కృష్ణమాచార్య మొదలగు వారు. వీరంతా తెలంగాణ సాధన కోసం రచనలు చేసారు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 28)

ప్రశ్న 1.
ఈ భూమండలమంతా ఎందుకు ప్రతిధ్వనించింది ?
జవాబు :
తెలంగాణలో రజాకార్ల దుర్మార్గాలు మితిమీరి పోయాయి. మొత్తం తెలంగాణ ప్రజానీకమంతా ఏకమైంది. తన శత్రువులైన రజాకార్లపై ఎదురు తిరిగింది. పొలికేకలు పెట్టింది. ఆ బొబ్బలు ఎలా ఉన్నాయంటే తెలంగాణ మొత్తం ఒకేసారి యుద్ధ శంఖం పూరించినట్లుగా ఉంది. ఈ భూమండలంలో ప్రతిచోటా తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడి నుండే సమరశంఖం పూరించారు. అందుకే అది భూమండలమంతా ధ్వనించిందని కవి చెప్పాడు.

ప్రశ్న 2.
బ్రతుకుతోవ చూపే కాలం రావడం అంటే ఏమిటి ?
జవాబు :
రజాకార్లు తెలంగాణను అభివృద్ధి చెందనివ్వలేదు. తర తరాల నుండి తెలంగాణ దోపిడీకి గురయ్యింది. తెలంగాణ ప్రజలు జీవనోపాధులను కోల్పోయారు. దెయ్యాలు, పిశాచాల వంటి దోపిడీదారుల ఉక్కుపాదాల కింద నలిగిపోయారు.

ఇప్పుడు క్రొత్త బ్రతుకు తోవ ఏర్పడే కాలం వచ్చింది. అంటే స్వేచ్ఛగా తమ బ్రతుకు నిర్ణయాలు తామే తీసుకొనే మంచి సమయం వచ్చిందని అర్థం.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 29)

ప్రశ్న 1.
“తెలంగాణ నేలలో ఎంత బలం ఉన్నదో కదా !” అని కవి ఎందుకన్నాడు ?
జవాబు:
కోటిమంది తెలుగు పిల్లలను తెలంగాణ ఒడిలో పెంచింది. కత్తులనిచ్చి, వజ్రాయుధమంతటి కఠినమైన భుజ పరాక్రమాలను చూపేటట్లు రాజుతో తలపడు తుంది. కావున ఈ తెలుగునేలలో ఎంత బలం (కాంతి) ఉన్నదని అర్థం.

ప్రశ్న 2.
‘గడ్డి పోచకూడా కత్తిలా మారటం’ అంటే ఏమిటి ?
జవాబు:
సాధారణంగా గడ్డి మనం నడిస్తే పాదాల కింద పడినలిగి తలవంచి నిలబడుతుంది. కానీ కొన్నిసార్లు ఆ గడ్డి పోచలే బిరుసెక్కి అరికాళ్ళలో ముళ్ళలా గుచ్చుకుంటున్నప్పుడు ఒక్క అడుగు కూడా సరిగా వేయలేం. అట్లాగే పిల్లలుగా పుట్టిన తెలంగాణ బిడ్డలు యుక్తవయసు రాగానే కత్తి చేపట్టి నిర్దయుడైన రాజుతో యుద్ధం చేయటానికి సిద్ధమవటాన్ని కవి అలా పోల్చాడు.

TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ

ప్రశ్న 3.
నవోదయం రావడమంటే మీరేమని అనుకొంటున్నారు ?
జవాబు:
ఉదయం అనేది రోజుకు మొదలు. ఉదయంతో రోజు ప్రారంభం అవుతుంది. అంటే ఉదయం అనేది రోజు మొత్తానికి తొలి అడుగు.

ప్రతిరోజూ ఉదయం జరుగుతూనే ఉంటుంది. రోజులు గడుస్తూనే ఉంటాయి. కాని, నవోదయం అంటే క్రొత్త ఉదయం. అంతవరకూ జరిగిన దానికి భిన్నంగా రోజు ప్రారంభమవడం. పాత రోజులలో ఉండే కష్టాలు, బాధలు లేకుండా క్రొత్త ఉత్సాహం, అభివృద్ధి చెందే ఆలోచనలకు అవకాశం కల్పించేది నవోదయం. అటువంటి అభివృద్ధే నవోదయం రావడమంటే అని అనుకొంటున్నాము.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
తెలంగాణ వీరుల ప్రత్యేకత ఏమిటి ? (T.B. P.No. 29)
జవాబు:
తెలంగాణా వీరులు భూమండలాన్నంతా సవరించి ఉజ్జ్వలమైన, కాంతిమంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్తకాంతి సముద్రాలు నింపారు. వీరులు, యోధులు మరియు న్యాయం తెలిసిన పరోపకారులైన తెలుగు వీరులు తెలంగాణ వీరులు.

ప్రశ్న 2.
బ్రతుకు ఎప్పుడు దుర్భరం అవుతుంది ?
జవాబు:
మత పిశాచం విజృంభిస్తే బ్రతుకులు దుర్భరం అవుతాయి. స్వేచ్ఛ లేకపోతే బ్రతుకు భరించలేము మతకల్లోలాలు జరిగితే చాలామంది బ్రతుకులు నాశనం అవుతాయి. ఏ దిక్కూ మొక్కూ లేకపోయినా బ్రతకడం కష్టం. నీతి, న్యాయం, ధర్మం, విద్య లేని సమాజంలో బ్రతుకు దుర్భరం.

ప్రశ్న 3.
ఆకాశాన జెండాలు రెపరెపలాడటం దేనికి సంకేతం ?
జవాబు:
రుద్రమదేవి పరాక్రమించినపుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి. ఇది రుద్రమదేవి పరా క్రమానికి నిదర్శనం. తెలంగాణ విజయానికి సంకేతం.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పంద – ప్రతిస్పందన

ప్రశ్న 1.
కింది అంశాలను గూర్చి చర్చించండి.

అ) ‘వీర తెలంగాణ’ అనే పాఠం పేరు వినగానే మీకు ఎటువంటి అనుభూతి కలిగింది ? దాశరథి తెలంగాణను వీర తెలంగాణ అనడాన్ని తగిన ఉదాహరణలతో సమర్థించండి.
జవాబు:
‘వీర తెలంగాణ’ పేరు వినగానే గొప్ప పోరాటాలు కనుల ముందు మెదిలి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. గడచిన బాధల మబ్బులు ఒక్కసారిగా తొలిగి వెలుతురు వచ్చినట్లు అయింది. తెలంగాణ పేరు ముందు ఉన్న ‘వీర’ అను పదం తెలంగాణలో ఉన్న పోరాటాల చరిత్రను గుర్తు చేసి ఆలోచింపచేసింది.

దాశరథి రాసిన ‘రుద్రవీణ’ అనే పేరుతోనే ఆవేశము, పోరాటము, ఉద్యమము వినిపిస్తాయి. అందులోనూ ఈ పాఠంలో ప్రతి పద్యపాదంలోని పదాలు చరిత్ర చెబుతూ స్ఫూర్తిని ఇస్తాయి. తెలంగాణ పెదవుల మీది నుంచి వచ్చిన శంఖపు చప్పుడు నాలుగు చెరగులా ప్రతిధ్వనించింది అనటం వల్ల తెలంగాణ పోరాటం ఎంత ఉద్వేగభరితంగా జరిగిందో చెప్పవచ్చు.

కోటిమంది తెలుగు పిల్లలు తెలంగాణ యోధులై కత్తులు దూసే వజ్రాయుధమంతటి భుజ పరాక్రమం కలిగి నిజాం రాజుతో తలపడమని తెలంగాణ నేల చెప్పినదన్నప్పుడు తెలంగాణ వీరుల పరాక్రమం అక్షరాల్లో కనిపించి ‘వీర తెలంగాణ’ అనటం సరియైనదే అనిపిస్తుంది.

తెలంగాణలో మొలచిన గడ్డిపోచ కూడా కత్తిపడుతుందని, తెలంగాణ స్వాతంత్ర్య పోరాటం సముద్రంలాగా ఉప్పొంగుతున్నదని, నవాబుల ఆజ్ఞలకు కాలం చెల్లించిందనీ అనటం కూడా ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.

కాకతీయుల పోరాటాలు గుర్తుకు తెస్తూ రుద్రమనూ, కాపయ నాయకుడినీ గుర్తు చేసినపుడు, దొంగ దెబ్బలకు భయపడకుండా శత్రురాజుల గుండెలు ఆగేలా ఉరిమిన తెలంగాణ మేఘపు గర్జనలను గుర్తుచేసినపుడు, దాశరథి ఈ పాఠాన్ని ‘వీర తెలంగాణ’ అనటం సబబే అనిపించి తీరుతుంది.

ప్రశ్న 2.
కింది అపరిచిత కవితను చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

తోటమాలి బలిదానం చేస్తేనే
పువ్వులు పరిమళాల నీనగలవు
మానవుడు కలవాలి మానవుణ్ణి
తిడితే ఏం లాభం కనిపించని దేవుణ్ణి
ఆకాశానికి శోభ చందమామ
మిణుగురుతో విద్యుత్కాంతులు ప్రసరించవు
మారాలి నేటి నాటువ్యక్తి
కాకుంటే లే దెన్నటికి విముక్తి
మానవునికి మానవుడే ధ్యేయం
మానవత్వమే మానవజాతికి శ్రేయం
చరిత్రలు మన ఉనికికి కావు ప్రమాణం
ధరిత్రిని వెనక్కి నెట్టి చేయాలి ప్రయాణం
(కవిరాజ మూర్తి)

ప్రశ్నలు

అ) పూలు ఎప్పుడు తమ పరిమళాలను వెదజల్లగల్గుతాయి ?
జవాబు:
తోటమాలి బలిదానం చేస్తే పువ్వులు పరిమళాలను వెదజల్లగల్గుతాయి.

ఆ) ఎవరిని తిట్టగూడదు ?
జవాబు:
దేవుడ్ని (కనిపించని) తిట్టకూడదు.

TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ

ఇ) ఎవరు మారాలి ? ఎందుకు మారాలి ?
జవాబు:
నేటి నాటువ్యక్తి (సామాన్యుడు) మారాలి. ఎందుకంటే మారకపోతే మానవునకు అజ్ఞానం నుండి, బాధల నుండి విముక్తి కలగదు.

ఈ) మానవుడు ఏవిధంగా ప్రయాణం చేయాలి ?
జవాబు:
ఈ భూమిని (ధరిత్రిని) వెనక్కి నెట్టి ప్రయాణం చేయాలి. అంటే భూమికంటే వేగంగా అభివృద్ధి మార్గంలో మానవుడు ప్రయాణించాలి.

ఉ) పై కవితకు శీర్షిక నిర్ణయించండి.
జవాబు:
పై కవితకు శీర్షిక “మానవత్వం”.

ఊ) పై కవితను రాసింది ఎవరు ?
జవాబు:
కవిరాజ మూర్తిగారు రచించారు.

ప్రశ్న 3.
రెండో పద్యానికి ప్రతిపదార్థం క్రింద ఉంది. ఇదే విధంగా 3, 4, 6 సంఖ్య గల పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి.
2వ పద్యం ప్రతిపదార్ధము
తల్లీ = అమ్మా !
నీ = నీ యొక్క
ప్రతిభా విశేషములు = ప్రజ్ఞా విశేషాలు
కొన్ని తరాలదాక = కొన్ని తరాల వరకు
భూతప్రేత = చెడు శక్తుల (భూతప్రేతాల)
హస్తమ్ములన్ = చేతులలో
డుల్లెన్ = పడిపోయినవి (చిక్కుకున్నవి)
ఇపుడు = ఇప్పుడు
అడ్డుల్ + పోయెన్ = అడ్డంకులు తొలగిపోయాయి
సౌదామనీవల్లీ = మెరుపుతీగల
ఫుల్ల = విచ్చుకున్న
విభా + ఆవళుల్ = కాంతులవరుసలు
బ్రతుకుత్రోవల్ = బ్రతుకు దారులను
చూపు = చూపే
కాలమ్ములున్ = సమయములు
మళ్ళెన్ = తిరిగివచ్చినవి (అదిగో)
స్వచ్ఛతర = అత్యంత స్వచ్ఛమైన
ఉజ్జల = ప్రకాశవంతమైన
ప్రథమ సంధ్యా = తొలి పొద్దు
భానువు = సూర్యుడు
ఏతెంచెడిన్ = వస్తున్నాడు (ఉదయిస్తున్నాడు)

జవాబు:
ప్రతిపదార్థ తాత్పర్యాలలో 3, 4, 6 పద్యాలు చూడుము.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “తెలంగాణ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాలవరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకొన్నాయి” అన్న కవి మాటలను మీరెట్లా సమర్థిస్తారు ?
జవాబు:
తెలంగాణ ఎంతో సాంస్కృతిక వికాసం కలది. భాషా సంస్కృతులు ఎంతో గొప్పవి. కానీ ఇవన్నీ చరిత్రలో ఇనుప పద ఘట్టనల కింద నలిగిపోయాయి. తెలంగాణ నేలమీద విముక్తి ఉద్యమాలు, సాయుధ పోరాటాలు, ప్రత్యేక రాష్ట్ర మహోద్యమాలు సముద్రంలో అలల మాదిరిగా పొంగాయి.

తెలంగాణ గొప్పతన విశేషాలు అన్నీ కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకున్నాయి. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. అడ్డంకులు తొలగి పోయాయి అన్నాడు దాశరథి. కవి మాటలను నేను సమర్థిస్తున్నాను. “నేను నా తెలంగాణ నిగళాలు తెగద్రొచ్చి ఆకాశమంత ఎత్తు అరచినాను” అన్నాడు కవి. ఈ విధంగా ఎందరో వీరుల త్యాగఫలమే నేటి తెలంగాణ. ఎన్నో పోరాటాల ఫలితంగా 2014 జూన్ రెండవ తేదీన పరిపూర్ణ స్వాతంత్య్రం పొందింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దానితో తెలంగాణ ఆశలు నెరవేరాయి.

ఆ) “తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము” అని దాశరథి ఎందుకన్నాడు ?
జవాబు:
ఈ తెలంగాణలో గడ్డిపోచ కూడా కత్తి బట్టి ఎదిరించింది. గొప్ప రాజుగా పేరొందినవాని గర్వాన్ని అణచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగు తుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతాలన్నీ ఆకాశంలో ఇంద్రధనుస్సుల పరంపరలచేత సయ్యాటలాడాయి.

కాబట్టి “ఇక్కడ పుట్టిన చిగురు కొమ్మైనా చేవగలది”. “తెలంగాణలో చాలా చిన్నదయిన గడ్డి పోచకు కూడా కత్తిబట్టి యుద్ధం చేయగల సత్తా ఉందని” కవి చెప్పాడు.

ఇ) తెలంగాణలో సంధ్యాభానువు మొదటిసారి ఉదయించాడని కవి ఎందుకన్నాడు ?
జవాబు:
అమ్మా తెలంగాణమా ! నీ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతులలో చిక్కుకొన్నాయి. ఇప్పుడు ఆ రోజులు గతించాయి. అడ్డంకులు తొలిగాయి. విచ్చుకున్న మెరుపు తీగల కాంతిరేఖలు బతుకుతోవ చూపే కాలం వచ్చింది. స్వచ్ఛమైన కాంతవంతమైన సంధ్యాసూర్యుడు మొదటి సారి ఉదయించాడు.
కాబట్టి కాంతి జ్ఞానానికి సంకేతం – విముక్తికి సంకేతం. కాంతివంతము, స్వచ్ఛమయిన సూర్యకాంతి తెలంగాణకు వచ్చిందని కవి భావన.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.

TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ

అ) వీర తెలంగాణ పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటలలో రాయండి.
(లేదా)
వీర తెలంగాణ పాఠం ఆధారంగా తెలంగాణ వీరుల ఘనతను వర్ణించండి. (June ’16)
జవాబు:
ఓ తెలంగాణమా ! నీ పెదవులతో ఊదిన శంఖధ్వనులు ఈ భూమండలమంతా ఒక్కమారుగా బొబ్బలు పెట్టినట్లుగా ప్రతిధ్వనించాయి. ఆహా ! ఉదయించిన సూర్యుని కిరణాలచేత ప్రీతిపొందిన పద్మాలచే, చలించిన ఆకాశగంగా తరంగాలు అన్ని దిక్కులను తెలవారేటట్లు చేశాయి. అమ్మా తెలంగాణమా ! నీ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతులలో చిక్కుకొన్నాయి. ఇప్పుడు ఆ రోజులు గతించాయి. అడ్డంకులు తొలిగాయి. విచ్చుకున్న మెరుపు తీగల కాంతిరేఖలు బతుకుతోవ చూపే కాలం వచ్చింది. స్వచ్ఛమైన, కాంతిమంతమైన సంధ్యా సూర్యుడు
మొదటిసారి ఉదయించాడు.

అమ్మా ! కోటిమంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు. వారికి వయసురాగానే చేతులకు కత్తులనిచ్చి, వజ్రాయుధమంతటి కఠినమైన భుజపరాక్రమాలను చూపేటట్లు రాజుతో తలపడమన్నావు. అమ్మా ! ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా ! ఈ తెలంగాణలో గడ్డిపోచకూడా కత్తి బట్టి ఎదిరించింది. గొప్ప రాజుగా పేరొందినవాని గర్వాన్ని అణచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతాలన్నీ ఆకాశంలో ఇంద్ర ధనుస్సుల పరంపరలచేత సయ్యాట లాడాయి.

తెలంగాణా స్వాతంత్ర్య పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగుతున్నది. నాలుగువైపుల నుండి సముద్రానికి గండికొట్టి తెలంగాణ నేలనంతా స్వాతంత్ర్యపు నీటితో తడుపుతున్నారు. ఉద్రిక్తత కలిగించిన నవాబుల ఆజ్ఞలకు కాలం చెల్లిపోయింది. అమ్మా తెలంగాణా ! నీ పిల్లలలో ప్రకాశించే విప్ల వాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. భూమండ లాన్నంతా సవరించి ఉజ్జ్వలమైన కాంతిమంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వారంతా వీరులు, యోధులేకాదు. న్యాయం తెలిసిన పరోపకారులైన తెలుగువీరులు సుమా !

అమ్మా ! మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో మా నేలను ఆక్రమించి మా గొంతులు కోస్తున్నప్పుడు, ఏ దిక్కూ తోచనప్పుడు, బ్రతకడమే భారమైనప్పుడు తెలుగుదనాన్ని కోల్పోలేదు. యుద్ధ రంగంలో రుద్రాదులు మెచ్చేటట్లు చివరికి విజయాన్ని సాధించాం. ఇక్కడ కాకతీయ రాజుల కంచుగంట మ్రోగినప్పుడు దుర్మార్గులైన శత్రురాజులు కలవర పడ్డారు. రుద్రమదేవి పరాక్రమించినప్పుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి. కాపయ్య నాయకుడు తన విజృంభణం చూపినప్పుడు శత్రు రాజులకు గుండెలు ఆగిపోయాయి.

చాళుక్య రాజులు పశ్చిమ దిక్కున పరిపాలన చేసేటప్పుడు మంగళకరమైన జయధ్వనులు మోగాయి. నాటి నుండి నేటి వరకు తెలంగాణం శత్రువుల దొంగ దెబ్బలకు ఓడిపోలేదు. శ్రావణ మాసంలోని మేఘం మాదిరిగా గంభీరమైన గర్జనలు అలరారుతుండగా నా తెలంగాణం ముందుకు సాగుతూనే ఉన్నది.

ప్రశ్న 3.
కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

అ) ‘తెలంగాణ తల్లి’ తన గొప్పదనాన్ని వివరిస్తున్నట్లుగా ఏకపాత్రా భినయం రాసి ప్రదర్శించండి. లేదా ఆత్మకథ రాయండి.
జవాబు:
ఏకపాత్ర
ఏంది అట్టా సూత్తుండ్రి ? నేనే మీ యమ్మను. అదే బిడ్డా ! మీ తెలంగాణా తల్లిని. ఏందట్లో నవ్వుతుండావే ఎన్నేళ్ళయింది బిడ్డల్లారా ! మీ మొగాన నగవు చూసి, మీరు నా కోసం ఎన్ని బాదలు పడ్డారో ? ఎంతమంది నా బిడ్డల ఉసురు కోల్పోయేరో ? వాళ్ళందర్నీ తల్చుకొంటే కడుపు చెరువయ్యేను. ఒకటే పట్టు, మొండి పట్టు, జనిగె పట్టు పట్టారు, సాధించారు.

ఇదిగో ఇయ్యేల నాకు పూలకాలం తియ్యటి తీపులదినం. ఏమనుకున్నవో ? ఓ బిడ్డా ! ఇయ్యేల నా తెలంగాణాలో అదేనో మనింట్లో ఎక్కడ జూసిన కమ్మటి వాసన. ఇను సొంపైన రొద. అదో ! అక్కడి దిక్కు జెర నా చెవు వారిచ్చి ఇను, ఎడవాసిన ఎదలను ఏకంజేయ పేరుపెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయిల కూతలు.

మంగళార్తులు ఈయడానికి ముత్తైదలొత్తన్నారు. జర ఆనందంగా ఉండండి. ఇగ మనకు కష్టాలు లేవు. సల్లగా నవ్వాలి నా వోళ్ళంతా.

ఆత్మకథ

ఎన్నో కష్టాలు పడ్డాను. నా కళ్ళ ముందే నా బిడ్డలు పిట్టల్లా రాలిపోతుంటే వెక్కి వెక్కి ఏడ్చాను. పరాయి పాలనలో ఎన్ని బాధలు పడ్డానో ? తలుచు కొంటే ఒళ్ళు జలదరిస్తుంది. పాల్కురికి సోమన, బమ్మెర పోతన వంటి భక్త కవులను తలచుకొంటే భక్తి భావంతో పరవశించి పోతాను. యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామిని చూసినప్పుడల్లా అనుకొంటాను కష్టాలు అశాశ్వతమని. ఆయన హిరణ్య కశిపుడిని చంపాక ప్రహ్లాదుడిని కాపాడాడు కదా !

అలాగే ఏదో రోజు పరాయి పాలన అనే హిరణ్య కశిపుడు అంతమౌతాడు. ప్రహ్లాదుడు లాంటి నా తెలంగాణా బిడ్డలు రక్షించబడతారు అని నా నమ్మకం. అది నెరవేరింది.

దాశరథిలాంటి విప్లవ కవులు పుట్టడం నా అదృష్టం. తెలంగాణ పోరాటాలలో నా ‘కవి కుమారుల’ గొప్పతనాన్ని మరిచిపోగలనా? ఎంతోమంది కళా కారులను కన్నాను. మీకెవ్వరికీ అన్నానికి లోటులేదు. ఇది తెలుగు మాగాణి. నేనెప్పుడూ పదిమందికి పెట్టాను. అందుకే మీకూ నా లక్షణాలే వచ్చాయి.

ఇది మన ఇల్లు. మనం అభివృద్ధి చేసుకోవాలి. మీరంతా బాగా చదువండి. నా పేరు ప్రఖ్యాతులు పెంచండి. తెలంగాణ తల్లి దీవెనలు మీ అందరికీ ఎప్పుడూ ఉంటాయి. ఇంకోసారి కలిసినప్పుడు ఇంకా మాట్లాడుకొందాం.

III. భాషాంశాలు

పదజాలం

ప్రశ్న 1.
క్రింది వాక్యాలు చదువండి. గీత గీసిన పదాల అర్థాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) గాలికి ఊగుతున్న పువ్వులు చిగురుటాకులతో సయ్యాటలాడుతున్నాయి.
అర్థం = పరిహాసాలాడు
జవాబు:
సొంతవాక్యం : రవి తన స్నేహితులతో పరిహాసాలాడాడు.

ఆ) స్వాతంత్ర్యోద్యమం బ్రిటిష్ వారి గుండెల్లో కల్లోలం రేపింది.
అర్థం = అలజడి
జవాబు:
సొంతవాక్యం : పరీక్షా ఫలితాల రోజున మా విద్యార్థుల మనస్సులో అలజడి రేగుతుంది.

ఇ) వీరులెప్పుడూ ప్రాణాలను అర్పించడానికి వెనుకాడరు.
అర్థం = ఆగిపోరు
జవాబు:
సొంతవాక్యం : దేశభక్తులైన భారతీయ సైనికులు యుద్ధంలో శత్రువుల బలాన్ని చూసి ఆగిపోరు.

TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ

ఈ) దిక్కు తోచనప్పుడు అయోమయంలో పడుతాం.
అర్థం = ఏమీ పాలుపోనప్పుడు
జవాబు:
సొంతవాక్యం : విశాఖలో ప్రజలకు హుదూద్ తుఫాను వచ్చినప్పుడు ఏమీ పాలుపోలేదు.

ప్రశ్న 2.
క్రింది పదాలకు నానార్థాలు రాయండి.

అ) ఉదయము = పుట్టుక, తూర్పుకొండ, ప్రాతకాలం, వడ్డి, సృష్టి, సూర్యోదయం
ఆ) ఆశ = కోరిక, దిక్కు
ఇ) అభ్రము = ఆశ్చర్యము, అపురూపం, అచ్చెరువు, మేఘం, స్వర్గం

ప్రశ్న 3.
క్రింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.

అ) మురళీరవము మానసిక ఆహ్లాదాన్నిస్తుంది.
జవాబు:
ధ్వని, కంఠధ్వని, శబ్దం, రవళి

ఆ) రుద్రమదేవి కృపాణముతో శత్రువులను చెండాడింది.
జవాబు:
ఖడ్గము, కత్తి, అసి

ఇ) జలధి అనేక జీవరాశులకు నిలయం.
జవాబు:
వార్థి, సముద్రం, అంబుధి, పయోధి

ఈ) జాతీయ జెండాను గౌరవించాలి.
జవాబు:
పతాకం, టెక్కెం, కేతనం, పతాక

ఉ) హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు.
జవాబు:
దూకుడు, దాటుట, తరించాడు, పరిస్థుతం

వ్యాకరణాంశాలు

1. కింది పదాలను విడదీసి రాసి, సంధిపేరు రాయండి. 

అ) జగమెల్ల = జగము + ಎల్ల – ఉకార సంధి
ఆ) సయ్యాటలాడెన్ = సయ్యాటలు + ఆడెన్ – ఉకార సంధి
ఇ) దారినిచ్చిరి = దారిని + ఇచ్చిరి – ఇకార సంధి
ఈ) ధరాతలమెల్ల = ధరాతలము + ఎల్లన్ – ఉత్వసంధి
ఉ) దిశాంచలము = దిశ + అచలము – సవర్ణదీర్ఘ సంధి
ఊ) శ్రావణాభ్రము = శ్రావణ + అభ్రము – సవర్ణదీర్ఘ సంధి
ఋ) మేనత్త = మేన + అత్త – అకార సంధి

2. క్రింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు వ్రాయండి. 

సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు

అ) కాకతీయుల కంచుగంట – కాకతీయుల యొక్క కంచుగంట – షష్ఠీ తత్పురుష సమాసము
ఆ) కళ్యాణ ఘంటలు – కళ్యాణ ప్రదమైన ఘంటలు – విశేషణ పూర్వపద కర్మధారయం
ఇ) బ్రతుకుత్రోవ – బ్రతుకు యొక్క త్రోవ – షష్ఠీ తత్పురుష సమాసము
ఈ) మహారవము – మహాయైన (గొప్పదైన) రవము – విశేషణ పూర్వపద కర్మధారయం
ఉ) వికారదంష్ట్రలు – వికారమైన దంష్ట్రలు – విశేషణ పూర్వపద కర్మధారయం
ఊ) కాంతివార్డులు – కాంతి అనెడి వార్థులు – రూపకం
ఋ) తెలంగాణ రాష్ట్రం – తెలంగాణ అను పేరుగల రాష్ట్రం – సంభావనాపూర్వపద కర్మధారయం
ౠ) మతపిశాచి – మతమనెడు పిశాచి – రూపక సమాసం

చీకానుప్రాసాలంకారం :

ఈ వాక్యాన్ని పరిశీలించండి.

నీటిలో పడిన తేలు తేలుతదా !
ఈ వాక్యంలో తేలు, తేలు అనే పదాలకు అర్థాలకు వేరు వేరుగా ఉన్నాయి. ఆ పదాలు వెంట వెంటనే ప్రయోగించబడ్డాయి. హల్లుల జంట అర్థభేదంతో వెంటవెంటనే వాడబడితే దానిని ‘ఛేకానుప్రాసాలంకారం’ అంటారు.
మరికొన్ని వాక్యాలు చూడండి. సమన్వయం చేయండి.

హల్లుల జంట అర్థభేదంతో
అవ్యవధానంగా వస్తే
ఛేకానుప్రాసం.

అ) అరటితొక్క తొక్కరాదు.
ఆ) నిప్పులో పడితే కాలు కాలుతుంది.
ఇ) తమ్మునికి చెప్పు ! చెప్పు తెగిపోకుండా నడువుమని.

ఇట్లాంటివి పాఠంలో వెతకండి. కొన్ని సొంతంగా తయారు చేయండి.

ప్రాజెక్టు పని

తెలంగాణా పోరాట నేపథ్యంలో వచ్చిన ఏవైనా రెండు మూడు పాటలు సేకరించండి. వాటిని పాడి వినిపించండి.
(లేదా)
దాశరథి రాసిన ఏదైనా ఒక పుస్తకం / పాట / కవిత చదువండి. దాని ఆధారంగా నివేదిక రాసి చదివి వినిపించండి.
జవాబు:
గద్దర్ తం
1. బండెనక బండి కట్టి
పదహారు బండ్లు కట్టి
ఏ బండ్లో పోతావ్ కొడకో
నైజాము సర్కరోడా
నాజీల మించినవురో
నైజాము సర్కారోడా
పోలీసు మిల్టీ రెండు
బలవంతులా అనుకోని
నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో
నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో
మా పల్లెలు దోస్తివి కొడుకో
నైజాము సర్కారోడా

2. పల్లె పల్లెను లేపి
గుండె గుండెను ఊపి
నిండుశక్తిని జూపి, నింగినేలను దాచే
దుంకో దుంకర దుంకో ॥ దుర్గ దుంకిన
దుంకో !
కాశ్మీర్ చూడరో ! కథ మారిపోయరా
అస్సామీ నాడురో ! నెత్తురు మడుగాయరా
ఖలిస్తాన్ మాటరో ! కడుపున చిచ్చాయరో
ముడుచుకు కూర్చుంటెరో ! ముక్కలేను
దేశమ్మురో || పల్లె ||

TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ

3. పహరాహుషార్ పహరా హుషార్ పహరా ॥ హుషార్ ॥
నీవు లేచిఉండాలిరా కాపు కాచి ఉండాలిరా || హుషార్ ॥
స్వార్థబుద్ధి రాజ్యమేల ప్రగతి శూన్య మాయరా!
అన్యాయం అక్రమాలు పెచ్చుమీరిపోయరా ! ॥ పహరా ॥
నీతికి న్యాయానికీ నేతవునీవై
జాతికి నవశక్తి దాతవు కాగా ॥ నీవులేచి ॥
దాశరథి కవిత :
ఆ చల్లని సముద్రగర్భం
దాచిన బడబానల మెంతో ?
ఆ నల్లని ఆకాశంలో
కానరాని భాస్కరు లెందరో ?
భూగోళం పుట్టుకకోసం
కూలిన సురగోళాలెన్నో ?
ఈ మానవరూపంకోసం
జరిగిన పరిణామాలెన్నో ?

ఒక రాజును గెలిపించుటలో
ఒరిగిన నరకంఠాలెన్నో ?
శ్రమజీవులు పచ్చినెత్తురులు
త్రాగని ధనవంతులెందరో ?

అన్నార్తులు అనాథలుండని
ఆ నవయుగ మదెంత దూరమో ?
కరువంటూ కాటకమంటూ
కనుపించని కాలాలెపుడో ?

అణగారి అగ్నిపర్వతం
కని పెంచిన “లావా” యెంతో ?
ఆకలితో చచ్చే పేదల
శోకంలో కోపం యెంతో ?

పసిపాపల నిదుర కనులలో
ముసిరిన భవితవ్యం యెంతో ?
గాయపడిన కవి గుండెల్లో
రాయబడని కావ్యాలెన్నో ?

కులమతాల సుడిగండాలకు
బలియైన పవిత్రులెందరో ?
భరతావని బలపరాక్రమం
చెర వీడే దింకెన్నాళ్ళకో ?

నివేదిక

ప్రశ్నల రూపంలో కొనసాగుతూ అసంఖ్యాకమైన ఆలోచనలను రేకెత్తించే గేయం ఇది. ఇరవై నాలుగు చరణాల్లో సమస్త మానవ ప్రపంచాన్ని, విశ్వవిజ్ఞానశాస్త్ర విషయాల సారాన్ని కవిత్వంలో సంక్షిప్తీకరించాడు. మొదటి చరణం సముద్రం, ఖగోళశాస్త్రాల సమ్మేళనం. రెండో చరణం భూమి, మనిషి పుట్టుకల తీరుని వివరిస్తుంది. ఇందులో విశ్వ ఆవిర్భావం, మానవ పరిణామక్రమం కనిపిస్తుంది.

మిగిలిన చరణాలు కవి లోకానుభవంనుండి వచ్చిన చారిత్రక వాస్తవాలు. కవి కలలు, అందమైన ఊహలు, మరో కొత్త ప్రపంచపు ఆశలు, ఆశయాలు, ఆవేదనలు, ఆగ్రహాలతో ఉద్వేగంగా నడుస్తుంది. కవి సున్నితమైన భావాలు మనల్ని ఆనందానికి, ఆగ్రహానికి గురిచేస్తాయి. కవి అన్నీ ప్రశ్నలే వేశాడు. ఇవి మానవాళికి సంబంధించిన ఆత్మవిమర్శనాత్మక అస్త్రాలు. ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఈ ప్రశ్నలకు సమాధానం, సమస్యలకు పరిష్కారం మనలోనే, మన దగ్గరే ఉంది. కవి వేసే ప్రశ్న మనకు గుచ్చుకుంటుంది. ఇలాంటి ప్రశ్నలకు చోటులేని ‘నవయుగం’ కోసం కవి చేసిన అక్షరయాగమే ఈ గేయం.

మీకు తెలుసా ?…

1. దాశరథి 1952లో డా॥ సి. నారాయణ రెడ్డి, వట్టికోట ఆళ్వారు స్వామి, డా॥ బిరుదురాజు రామరాజు మొదలగువారితో కలిసి తెలంగాణా రచయితల సంఘాన్ని స్థాపించాడు. ఈయన వట్టికోట ఆళ్వారుస్వామితో కలిసి నిజామాబాద్లో జైలుశిక్ష అనుభవించాడు. తెలంగాణ ఉద్యమ కావ్యాలలోకెల్ల అగ్రగణ్యమైనది దాశరథి ‘అగ్నిధార’. ఇది పీడిత ప్రజల మనోభావాలకు ప్రతీక. ‘అగ్నిధార’ను నిజామాబాద్లో జైలు సహవాసి వట్టికోట అళ్వారుస్వామికి అంకితమిచ్చాడు. అట్లే ‘రుద్రవీణ’ అనే కవితాసంపుటిని తెలంగాణ ప్రజానీకానికి అంకితమిచ్చాడు.

విశేషాంశాలు :

1. కాపయనాయకుడు: క్రీ॥శ॥ 1328 నుండి 1369 వరకు ఓరుగల్లు కోటను కేంద్రంగా చేసుకొని స్వాతంత్య్ర పోరాటం చేసినవాడు. మహా బలవంతుడైన ఢిల్లీ చక్రవర్తి మహమ్మద్ బీన్ తుగ్లక్ అధికారమును ధిక్కరించి స్వాతంత్య్రోద్యమమును లేవదీసిన ఘనత కాపయప్రోలయ నాయకులది. కాపానీడు లేక కాపయనాయకుడు ముసు నూరి నాయకుల వంశమునకు చెందినవాడు. కాపయనాయకుడు తెలంగాణను మ్లేచ్ఛ పాలన నుండి విముక్తి చేశాడు. కాకతీయుల తరువాత ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ముసునూరి యుగం చరిత్రలో సువర్ణ ఘట్టం.

సూక్తి : సంకల్పమే సకల విజయాలకు మూలం సాధించాలనే తపనే విజయంవైపు వేసే తొలి అడుగు

ప్రతిపదార్థ తాత్పర్యాలు

I

1. ఉ.
ఓ తెలంగాణ ! నీ పెదవులొత్తిన శంఖ మహారవమ్ములీ
భూతలమెల్ల నొక్కమొగి బొబ్బలు పెట్టినయట్లు తోచె, ఓ
హో ! తెలవార్చివేసినవి ఒక్కొక దిక్కు నవోదయార్క రుక్
ప్రీత జలేజ సూన తరళీకృత దేవనదీతరంగముల్

కవి పరిచయం
ఈ పద్యం డా॥ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి “రుద్రవీణ” లోనిది.

ప్రతిపదార్థము (June 2017)

ఓ తెలంగాణ = ఓ తెలంగాణమా !
నీ పెదవుల = నీ పెదవులతో
ఒత్తిన = ఊదిన
శంఖమహారవమ్ములు = శంఖధ్వనులు
ఈ భూతలము = ఈ భూమండలము
ఎల్లన్ = అంతా
ఒక్కమొగి = ఒక్కమారుగా
బొబ్బలు = బొబ్బలు
పెట్టిన + అట్లు = పెట్టినట్లుగా
తోచే = అనిపించింది.
ఓహో ! = ఆహా !
తెల్లవార్చి = తెల్లవారేటట్లు
వేసినవి = చేశాయి
ఒక్కొక్క = అన్ని
దిక్కు = దిక్కులను
నవోదయ + అర్క = ఉదయించిన సూర్యుని
రుక్ = కిరణాలచేత
ప్రీత = ప్రీతి పొందిన
జలేజసూన = పద్మాలచే
తరళీకృత = చలించిన
దేవనదీతరంగముల్ = ఆకాశగంగా తరంగాలు

తాత్పర్యము:
ఓ తెలంగాణమా ! నీ పెదవులతో ఊదిన శంఖ ధ్వనులు ఈ భూమండలమంతా ఒక్కమారుగా బొబ్బలు పెట్టినట్లుగా అనిపించింది. ఆహా ! ఉదయించిన సూర్యుని కిరణాలచేత ప్రీతిపొందిన పద్మాలతో, చలించిన ఆకాశ గంగా తరంగాలు అన్ని దిక్కులను తెలవారేటట్లు చేశాయి.

TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ

2. శా.
తల్లీ ! నీ ప్రతిభా విశేషములు భూతప్రేత హస్తమ్ములన్
డుల్లెన్ కొన్ని తరాలదాక ! ఇపుడడ్డుల్ వోయె; సౌదామనీ
వల్లీ పుల్లవిభావళుల్ బ్రతుకుత్రోవల్ జూపు కాలమ్ములున్
మళ్ళెన్ ! స్వచ్ఛతరోజ్జ్వల ప్రథమ సంధ్యాభానువేతెంచెడిన్

కవి పరిచయం

ఈ పద్యం డా॥ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి “రుద్రవీణ” లోనిది.

ప్రతిపదార్ధము (June 2017)

తల్లీ = అమ్మా (తెలంగాణమా)
నీ = నీ యొక్క
ప్రతిభా = గొప్పతనపు
విశేషములు = విశేషాలు
భూతప్రేత = దుర్మార్గుల (చెడుశక్తుల)
హస్తమ్ములన్ = చేతులలో
డుల్లెన్ = చిక్కుకున్నాయి
కొన్ని = కొన్ని
తరాలదాక = తరాలవరకు
ఇపుడు = ఇప్పుడు (ఆ రోజులు గతించాయి)
అడ్డుల్ = అడ్డంకులు
పోయెన్ = తొలిగాయి (తొలగిపోయాయి)
సౌదామనీ వల్లీ = మెరుపు తీగల
ఫుల్ల = విచ్చుకున్న
విభా + ఆవళుల్
(విభావళుల్) = (కాంతి రేఖల) కాంతుల వరుసలు
బ్రతుకుత్రోవల్ = బతుకు దారులను
చూపు = చూపే
కాలమ్ములన్ + మళ్ళెన్ = కాలం వచ్చింది (సమయం వచ్చింది)
స్వచ్ఛతర = స్వచ్ఛమైన
ఉజ్జ్వల = కాంతివంతమైన
ప్రథమసంధ్యా = తొలిపొద్ద
భానువు = సూర్యుడు
ఏతెంచిడిన్ = ఉదయించాడు (వస్తున్నాడు)

తాత్పర్యము
అమ్మా తెలంగాణమా ! నీ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతులలో చిక్కుకొన్నాయి. ఇప్పుడు అడ్డంకులు తొలిగాయి. విచ్చుకున్న మెరుపు తీగల కాంతి రేఖలు బతుకుతోవ చూపే కాలం వచ్చింది. స్వచ్ఛమైన కాంతిమంతమైన సంధ్యాసూర్యుడు ఉదయించాడు.

II

3. ఉ.
నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్ !
ప్రాయము వచ్చినంతనె కృపాణములిచ్చితి, యుద్ధమాడి వా
శ్రేయ భుజాబలమ్ము దరిసింప జగమ్ము, నవాబుతో సవాల్
చేయుమటంటి; వీ తెలుగు రేగడిలో జిగి మెండు మాతరో !

కవి పరిచయం
ఈ పద్యం డా॥ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి “రుద్రవీణ” లోనిది.

ప్రతిపదార్థము

మాతరో = అమ్మా !
కోటి = కోటి మంది
తెలుంగు కుర్రలన్ = తెలుగు పిల్లలను
నీ = నీ
ఒడిలోన = ఒడిలో
పెంచితివి = పోషించావు
ప్రాయము వచ్చినంతనే = వయసురాగానే
కృపాణములు ఇచ్చితి = చేతులకు కత్తులనిచ్చి
వాత్రేయ = వజ్రాయుధము అంతటి కఠినమైన
భుజాబలమ్ము = భుజపరాక్రమాలను
దరిసింప = చూపేటట్లు
జగమ్ము = లోకం
నవాబుతో = నిజాం నవాబుతో
సవాల్ =ఎదురొడ్డి ప్రశ్నించుట
చేయుము + అట + అంటివి = చేయమన్నావు
యుద్ధము + ఆడి = తలపడమన్నావు
ఈ తెలుగు రేగడిలో = సారవంతమైన ఈ తెలంగాణ భూమిలో
జిగి = ఎంత బలం
మెండు = ఉన్నదో కదా !

తాత్పర్యము
అమ్మా ! కోటిమంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు. వారికి వయసురాగానే చేతులకు కత్తులనిచ్చి, వజ్ర సమానమైన భుజపరాక్రమాలను లోకం చూసేటట్లు నిజాం రాజుతో తలపడమన్నావు. ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా !

4. మ.
తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము ! రా
జలలాముం డనువాని పీచమడచన్ సాగించె యుద్ధమ్ము ! భీ
తిలిపోయెన్ జగమెల్ల యేమియగునో తెల్యంగరాకన్ ! దిశాం
చలముల్ శక్రధనుఃపరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్

కవి పరిచయం
ఈ పద్యం డా॥ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి “రుద్రవీణ” లోనిది.

ప్రతిపదార్ధము
తెలగాణమ్మున గడ్డిపోచయును కృపాణమ్ము సంధించెన్

తెలగాణమ్మున = తెలంగాణలో
గడ్డిపోచయును = గడ్డిపోచకూడా
కృపాణమ్ము = కత్తి బట్టి
సంధించెన్ = ఎదిరించింది
రాజలలాముండు = గొప్ప రాజుగా
అనువాని = పేరొందినవాని
పీచమున్ = గర్వాన్ని
అడచన్ = అణచేటట్లుగా
యుద్ధమ్ము = యుద్ధం
సాగించె = సాగించింది
ఏమి + అగునో = ఏమి జరుగుతుందో
తెల్యంగరాకన్ = తెలియక
జగము + ఎల్లన్ = జగమంతా
భీతిలిపోయెన్ = భయపడిపోయింది
దిశ + అంచలమున్ = దిగంతాలన్నీ
దివిన్ = ఆకాశంలో
శక్తధనుః = ఇంద్రధనుస్సుల
పరంపరలతో = పరంపరలచేత
సయ్యాటలు + ఆడెన్ = సయ్యాటలాడాయి

తాత్పర్యము
ఈ తెలంగాణలో గడ్డిపోచకూడా కత్తి బట్టి ఎదిరించింది. గొప్ప రాజునని అనుకొనేవాని గర్వాన్ని అణచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతాలన్నీ ఆకాశంలో ఇంద్రధనుస్సుల వరుసలతో సయ్యాటలాడాయి.

TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ

5. ఉ.
నాలుగు వైపులన్ జలధి నాల్కలు సాచుచు కూరుచుండె ! క
ల్లోలము రేపినారు భువిలో ! నలుదిక్కుల గండికొట్టి సం
డ్రాలకు దారినిచ్చిరి ! ధరాతలమెల్ల స్వతంత్ర వారి ధా
రాలులితమ్ము కాదొడగె, రాజు రివాజులు బూజు పట్టగన్

కవి పరిచయం
ఈ పద్యం డా॥ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి “రుద్రవీణ” లోనిది.

ప్రతిపదార్థము

నాలుగువైపులన్ = నాలుగు వైపుల నుండి
జలధి = సముద్రం
నాల్కలుసాచుచు = నోరు తెరచినట్లుగా
కూరుచుండె = ఉప్పొంగుతున్నది
కల్లోలం = అలజడి
భువిలో = భూమిలో
రేపినారు = కలిగించినారు
నలుదిక్కులు = నాలుగు దిక్కులు
గండికొట్టి = గండికొట్టి
సంద్రాలకు = సముద్రాలకు
దారినిచ్చిరి = దారిని ఇచ్చారు.
స్వతంత్ర వారి ధారా = స్వాతంత్ర్యపు నీటిలో
లులితమ్ము = తడుపుతున్నారు.
రాజు = నవాబుల
రివాజులు = ఆజ్ఞలకు
బూజుపట్టగన్ = కాలం చెల్లిపోయింది

తాత్పర్యము
తెలంగాణా స్వాతంత్య్ర పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగుతున్నది. నాలుగు వైపుల నుండి సముద్రానికి ‘గండికొట్టి తెలంగాణ నేలనంతా స్వాతంత్య్రపు నీటితో తడుపుతున్నారు. ఉద్రిక్తత కలిగించిన నవాబుల ఆజ్ఞలకు కాలం చెల్లిపోయింది.

III

6. మ.
తెలగాణా ! భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సం
చలనమ్మూరక పోవలేదు ! వసుధా చక్రమ్ము సారించి ఉ
జ్జ్వల వైభాతిక భానునిన్ పిలిచి దేశంబంతటన్ కాంతి వా
ర్ధులు నిండించిరి, వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్ బళా !

కవి పరిచయం
ఈ పద్యం డా॥ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి “రుద్రవీణ” లోనిది.

ప్రతిపదార్దము

తెలంగాణా = అమ్మా తెలంగాణ !
భవదీయ + పుత్రకులలో = నీ పిల్లలలో
తీండ్రించు = ప్రకాశించే
వైప్లవ్య = విప్లవాత్మకమైన
సంచలనమ్ము = కదలిక
ఊరకపోవలేదు = ఊరికే పోలేదు
వసుధా చక్రము = భూమండలాన్నంతా
సారించి = సవరించి
ఉజ్జ్వల = ఉజ్జ్వలమైన
వైభౌతిక = కాంతివంతమైన
భానునిన్ = సూర్యుడిని
పిలిచి = పిలిచి
దేశంబు + అంతటన్ = దేశమంతా
కాంతి = క్రొత్తకాంతి
వార్ధులు = సముద్రాలు
నిండించిరి = నింపారు
వీరు = వారంతా
వీరులు = యోధులేకాదు
పరార్థుల్ = న్యాయం తెలిసిన పరోపకారులైన
తెల్గుజోదుల్ = తెలుగువీరులు
బళా ! = సుమా !

అమ్మా తెలంగాణా ! నీ పిల్లలలో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. వీరు భూ మండలాన్నంతా సవరించి ఉజ్జ్వలమైన కాంతివంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వారంతా వీరులు, యోధులేకాదు. పరోపకారులు కూడా.

7. మ.
మతపైశాచి వికార దంష్ఠికలతో మా భూమి లంఘించి మా
కుతుకల్ గోసెడి వేళ గూడ, యెటు దిక్కున్ తోచకున్నప్పుడున్
బ్రతుకే దుర్భరమైన యప్పుడును ఆంధ్రత్వమ్ము పోనాడ లే
దు, తుదిన్ గెల్చితిమమ్మ యుద్ధమున రుద్రుల్ మెచ్చనాంధ్రాంబికా!

కవి పరిచయం
ఈ పద్యం డా॥ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి “రుద్రవీణ” లోనిది.

ప్రతిపదార్థము

ఆంధ్రాంబికా ! = అమ్మా !
మతం = మతం అనే
పైశాచి = పిశాచి
వికార = తన క్రూరమైన
దంష్ట్రికలతో = కోరలతో
మా భూమి = మా నేలను
లంఘించి = ఆక్రమించి
మాకుతుకల్ = మా గొంతులు
గోసెడివేళ కూడా = కోస్తున్నప్పుడు కూడా
యెటుదిక్కున్ = ఏ దిక్కూ
తోచకున్నప్పుడున్ = తోచనప్పుడు
బ్రతుకే = బ్రతకడమే
దుర్భరమైన + అప్పుడును = భారమైనప్పుడు
ఆంధ్రత్వమ్ము = తెలుగుదనాన్ని
పోనాడలేదు = కోల్పోలేదు
యుద్ధమున = యుద్ధరంగంలో
రుద్రుల్ = రుద్రాదులు
మెచ్చున్ = మెచ్చేటట్లు
తుదిన్ = చివరికి
గెల్చితిమమ్మ = విజయాన్ని సాధించాం

తాత్పర్యము
అమ్మా ! మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో మా నేలను ఆక్రమించి మా గొంతులు కోస్తున్నప్పుడు, ఏ దిక్కూ తోచనప్పుడు, బ్రతకడమే భారమైనప్పుడు కూడా తెలుగుదనాన్ని కోల్పోలేదు. రుద్రాదులు మెచ్చేటట్లు చివరికి విజయాన్ని సాధించాం.

8. సీ.
కాకతీయుల కంచు గంట మ్రోగిననాడు
కరకు రాజులకు తత్తరలు పుట్టె
వీర రుద్రమదేవి విక్రమించిన నాడు
తెలుగు జెండాలు నర్తించే మింట
కాపయ్య నాయకుండేపు సూపిన నాడు
పరరాజులకు గుండె పట్టుకొనియె
చాళుక్య పశ్చిమాశా పాలనమ్మున
కళ్యాణ ఘంటలు గణగణమనె

తే.గీ॥ నాడు నేడును తెలగాణ మోడలేదు.
శత్రువుల దొంగదాడికి; శ్రావణాభ్ర
మటుల గంభీర గర్ణాట్టహాసమలర
నా తెలంగాణ పోవుచున్నది పథాన

కవి పరిచయం
ఈ పద్యం డా॥ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి “రుద్రవీణ” లోనిది.

ప్రతిపదార్ధము

కాకతీయులు = కాకతీయరాజుల
కంచు గంట = కంచుగంట
మ్రోగిననాడు = మ్రోగినప్పుడు
కరకురాజులకు = దుర్మార్గులైన శత్రురాజులు
తత్తరలు + పుట్టె = కలవర పడ్డారు
వీరరుద్రమదేవి = రుద్రమదేవి
విక్రమించిననాడు = పరాక్రమించినప్పుడు
తెలుగు జెండాలు = తెలుగు జెండాలు
మింటన్ = ఆకాశాన
నర్తించె = రెపరెపలాడాయి
కాపయ్యనాయకుడు = కాపయ్య నాయకుడు
ఏపు + సూపిననాడు = విజృంభణం చూపినప్పుడు
పరరాజులకు = శత్రురాజులకు
గుండెపట్టుకొనియె = గుండెలు ఆగిపోయాయి
చాళుక్య = చాళుక్య రాజులు
పశ్చిమ + ఆశా = పశ్చిమ దిక్కున
పాలనమ్మున్ = పరిపాలన చేసేటప్పుడు
కళ్యాణఘంటలు = మంగళకరమైన జయధ్వనులు
గణగణమనె = గణగణమంటూ మోగాయి
నాడు = నాటినుండి
నేడును = నేటివరకు
తెలగాణము = తెలంగాణం
శత్రువుల = శత్రువుల
దొంగదాడికి = దొంగదెబ్బలకు
ఓడలేదు = ఓడిపోలేదు
శ్రావణాభ్రము = శ్రావణ మాసంలోని మేఘం
అటుల = మాదిరిగా
గంభీర = గంభీరమైన
గర్జాట్టహాస = గర్జనలు
అలర = అలరారుతుండగా
నా తెలంగాణ = నా తెలంగాణం
పథాన = ముందుకు
పోవుచున్నది = సాగుతూనే ఉన్నది

తాత్పర్యము

ఇక్కడ కాకతీయ రాజుల కంచుగంట మ్రోగినప్పుడు దుర్మార్గులైన శత్రురాజులు కలవరపడ్డారు. రుద్రమదేవి పరాక్రమించినప్పుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెప లాడాయి. కాపయ్య నాయకుడు తన విజృంభణం చూపినప్పుడు శత్రురాజులకు గుండెలు ఆగిపోయాయి. చాళుక్య రాజులు పశ్చిమ దిక్కున పరిపాలన చేసేటప్పుడు మంగళకరమైన జయధ్వనులు గణగణమంటు మోగాయి. నాటి నుండి నేటి వరకు శత్రువుల దొంగ దెబ్బలకు తెలంగాణం ఓడిపోలేదు. శ్రావణ మాసంలోని మేఘం మాదిరిగా గంభీరమైన గర్జనలు అలరారుతుండగా నా తెలంగాణం ముందుకు సాగుతూనే ఉన్నది.

పాఠం నేపథ్యం / ఉద్దేశ్యం

తెలంగాణ వీరుల పురిటిగడ్డ. ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం తుదిశ్వాస వరకు పోరాడారు. దుర్మార్గులైన రజాకార్ల అరాచకత్వాన్ని ఎదిరించిన రణక్షేత్రం తెలంగాణ. అటువంటి నేల అస్తిత్వ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజాసమూహం తమదైన పద్ధతుల్లో ధిక్కారస్వరం వినిపించింది. ఆయుధం ధరించి పోరాడినవారు కొందరైతే, అక్షరాయుధంతో పోరాడినవారు మరికొందరు. సాహితీ యోధుడు డా॥ దాశరథి కృష్ణమాచార్య ప్రత్యక్షంగా పోరాటంలో మమైకమౌతూనే ధైర్య సాహసాలను పద్యాలలో ప్రశంసించాడు.

వీరుల త్యాగాలను స్మరించడం, తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని కీర్తించడం, స్వస్థానాభిమానాన్ని ప్రేరేపించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

TS 10th Class Telugu Guide 3rd Lesson వీర తెలంగాణ

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందినది. చారిత్రక అంశాలను వస్తువుగా తీసుకొని రాసిన పద్యాలివి. డా॥ దాశరథి కృష్ణమాచార్య రచించిన “దాశరథి సాహిత్యం” ఒకటవ సంపుటి ‘రుద్రవీణ’ లోనిది.

కవి పరిచయం

కవి : డా॥ దాశరథి కృష్ణమాచార్య
జననం : 22.7.1925
మరణం : 05.11.1987
జన్మస్థలం : మహబూబాబాద్ జిల్లా, చిన్నగూడూరు.

ఇతర రచనలు :

  1. అగ్నిధార,
  2. రుద్రవీణ,
  3. మహాంధ్రోదయం,
  4. పునర్నవం
  5. కవితాపుష్పకం,
  6. తిమిరంతో సమరం,
  7. అమృతాభిషేకం
  8. ఆలోచనాలోచనాలు మొదలగు నవి. నవమి (నాటికలు), యాత్రాస్మృతి (స్వీయచరిత్ర) వంటి పలు గ్రంథాలను రచించారు. సినిమాలకు చక్కని పాటలు రాశారు. గాలిబ్ గజళ్ళను అనువదించారు.

కవితారీతి :

నాటి పాలకులపై వ్యతిరేకంగా ప్రజా పోరాటాలలో పాల్గొన్నారు. ఆచరణాత్మక వైఖరి ప్రదర్శించారు. తన కవిత్వంతో ప్రజలను చైతన్యపరిచారు. దాశరథి ఉద్యమ కవి. ‘నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బౌనొ అందాక ఈ భూగోళంబున కగ్గి పెట్టెద’నన్నారు.

నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడలపై రాసిన ధీరుడు. ఆయన కవిత లలో అక్షరాలకు ఆవేశం ఎక్కువ. ఆయన కవిత్వం అభ్యుదయ మార్గంలో నడు స్తుంది. సున్నితమైన భావుకతతో ఉంటుంది. ప్రాచీన పద్యశైలిలో ఉంటుంది. ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచే కవితా రీతుల ప్రదర్శనలో తలపండిన మహాకవి దాశరథి. ఆయన ప్రజాకవి, మహాకవి.

సన్మానాలు-సత్కారాలు : తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసినవాడు దాశరథి. 1961లో గాలిబ్ గజళ్ళను అనువదించాడు. ప్రసిద్ధులైన ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించాడు. విమర్శకుల ప్రశంసలను అందుకొన్నాడు.

పురస్కారాలు :

  1. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1967)
  2. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1974)

శైలి : సున్నితమైన భావుకత, ప్రాచీన పద్య శైలి.
విశేషాంశములు : సినీగేయ కవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి.

ప్రవేశిక

సముద్రం ఉప్పొంగుతుండగా చూసేవారు అరుదుగా ఉంటారు. సముద్రం చెలియలికట్ట దాటడం ఎవరూ ఊహించలేరు. కాని తెలంగాణ నేల ఈ అరుదైన పరిణామా లను, అద్భుతాలను ప్రపంచానికి చూపెట్టింది. తెలంగాణ నేలమీద జరిగిన విముక్తి ఉద్యమంలో తెలంగాణ ప్రజలు సముద్రంలో అలల మాదిరిగా ఉవ్వెత్తున ఉప్పొంగి ఎగిశారు. ఆ హోరును, తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును, మహోన్నత త్యాగాల తీరును దాశరథి పద్యాల్లో విని ఉత్తేజితులం కావడానికి… ఈ పాఠంలోకి పయనిద్దాం.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి.

ప్రక్రియ – ఆధునిక పద్యం

ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందినది. ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ఆధునిక పద్యం ఒకటి. చారిత్రక, వాస్తవిక అంశాలను వస్తువుగా తీసుకొని ఆధునిక భావ వ్యక్తీకరణతో రాసిన పద్యాలివి. గ్రాంథిక భాషకు దూరంగా ఉంటాయి. ఆధునిక భాష పద్యాలలో ఎక్కువగా ఉంటుంది. సమాజాభ్యుదయం ప్రధానాంశంగా ఉంటుంది.

Leave a Comment