TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 11th Lesson భిక్ష Textbook Questions and Answers.

TS 10th Class Telugu 11th Lesson Questions and Answers Telangana భిక్ష

చదువండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 109)

కం. తనకోపమె తన శత్రువు
తనశాంతమె తనకురక్ష దయ చుట్టంబౌఁ
దనసంతోషమె స్వర్గము
తనదుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ పద్యంలో శత్రువుగా దేనిని పేర్కొన్నాడు ? ఎందుకు ?
జవాబు:
ఈ పద్యంలో శత్రువుగా కోపాన్ని పేర్కొన్నాడు. కోపం అంతర్గతమైన శత్రువు. ఇది సకల అనర్థాలను కలిగిస్తుంది. బంధువులను, ఆప్తులను, మిత్రులను దూరం చేస్తుంది. రోగాలను కల్గిస్తుంది.

ప్రశ్న 2.
శాంతి రక్షగా ఉంటుందనడంలో కవి ఉద్దేశమేమిటి ?
జవాబు:
శాంతి మానవాళికి రక్షణకవచంలా ఉంటుంది. శాంతం ఉంటే మనకు శ్రీరామరక్ష. సమాజంలో గౌరవ మర్యాదలను వృద్ధి పొందింపజేస్తుంది. ఆప్తులను, బంధువులను దూరం చేయదు. పనులు త్వరగా అవుతాయి. ఇంట్లో సకల సుఖాలు కలుగుతాయి. యుద్ధోన్మాదాలు కలుగవు. అందువల్ల శాంతి అనేది కేవలం శరీరానికేకాదు. సకల సమాజానికి రక్షణగా ఉంటుంది. “తనశాంతమె తనకు రక్ష” అని సుమతీ శతకకర్త బద్దెన చెప్పాడు.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ప్రశ్న 3.
సంతోషాన్ని స్వర్గంగా కవి ఎందుకు భావిస్తున్నాడు?
జవాబు:
మానవునికి సంతోషం స్వర్గంలాంటిది. సంతోషంగా ఉండడంవల్ల సమస్యలు తొలగిపోయి అంతటా ఆనందం వెల్లివిరుస్తుంది. తృప్తి కలుగుతుంది. ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది. అరిషడ్వర్గాలకు లోనుకాడు. అందువల్లనే సంతోషాన్ని స్వర్గంగా కవి భావించాడు. “తన సంతోషమే తన స్వర్గము” అని కవులు చెప్పారు.

ప్రశ్న 4.
కోపంవల్ల కలిగే అనర్థాలను గురించిన సంఘటనలు మీకేమైనా తెలుసా ? చెప్పండి.
జవాబు:
కోపం వల్ల ఓర్పు పోతుంది. ఎదుటి వారిని అనకూడని మాటలు అంటాము. దాని మూలంగా పనులు చెడతాయి. అందరూ శత్రువులౌతారు. కోపం వల్ల జరిగే నష్టాన్ని చెప్పే కథ ఒకటి పంచతంత్రంలో ఉంది.

ఒక రైతు తాను అల్లారుముద్దుగా పెంచు కుంటున్న ముంగిసను తన బిడ్డకు కాపలాగా ఉంచి బయటకు వెళ్ళాడు. ఈ లోపు పాము ఇంట్లోకి రావడం చూసి బిడ్డను కాపాడడానికి ముంగిస ఆ పామును కరచి చంపింది. ఇంతలో రైతు ఇంటికి వచ్చాడు. ముంగిస యజమానిని చూసిన ఆనందంలో అతనికి ఎదురు వచ్చింది.

దాని నోటికి, ఒంటికి ఉన్న రక్తం మరకలు చూసి, బిడ్డను చంపిందనుకొని కోపంతో రైతు ముంగిసను కర్రతో కొట్టి చంపాడు. ముంగిసను చంపి, ఇంటిలోపలికి వెళ్ళిచూస్తే, బిడ్డ హాయిగా పడుకొని ఉన్నాడు. చచ్చిపడివున్న పాము కనబడింది. తన బిడ్డను రక్షించిన ముంగిసనే ఒళ్ళు తెలియని కోపంతో చంపానని రైతు వెక్కివెక్కి ఏడ్చాడు. కానీ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 111)

ప్రశ్న 1.
ప్రాచీనకాలంలో భిక్షాటనాన్ని పవిత్రకార్యంగా ఎందుకు భావించేవారు ?
జవాబు:
సన్యాసులు, బ్రహ్మచారులు, మహర్షులు ‘భిక్షా’ వృత్తితో జీవించాలని, ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. వ్యాస మహర్షి వంటివారు పంచ భిక్ష స్వీకరించేవారు. అంటే కేవలం ఐదు గృహాలకు వెళ్ళి, ఐదుమంది నుండి మాత్రమే భిక్ష స్వీకరించేవారు. ఉపనయనం చేసినప్పుడు బ్రహ్మచారులు ముందుగా తల్లి నుండి, తరువాత తండ్రి నుండి భిక్షలు స్వీకరించాలి.

సన్యాసులు వంటి వారు జీవనం కోసం వస్తువులు, ధనం, వగైరా దాచరాదని, వారు భిక్ష ద్వారా లభించిన దానినే తిని జీవించాలనీ, శాస్త్రాలు చెపుతున్నాయి. అందుకే ప్రాచీన కాలంలో భిక్షాటనాన్ని పవిత్ర కార్యంగా భావించేవాడు

ప్రశ్న 2.
భిక్ష సమర్పించేటప్పుడు నాటికి నేటికి ఉన్న
జవాబు:
భిక్ష సమర్పించేటప్పుడు పూర్వం గృహిణులు, తమ ఇంటివాకిలిని ఆవు పేడతో శుద్ధిచేసి, అక్కడ ముగ్గు పెట్టి, అతిథికి అర్ఘ్యపాద్యాలిచ్చి, పుష్ప గంధాలతో పూజచేసి, అన్నం మీద నెయ్యి అభిఘూరం చేసి, పిండివంటలతో భక్తి విశ్యాసాలతో అతిథులకు పెట్టేవారు.

ఇప్పుడు భిక్ష పెట్టడం తక్కువ అయ్యింది. కేవలం కొద్దిమంది మాత్రం, ముష్టి పెడుతున్నారు. అది కూడా విసుగుకుంటూ, తప్పనిసరి పరిస్థితుల్లోనే బిచ్చగాండ్రకు ముష్టి వేస్తున్నారు. ముష్టి ఎత్తుకోడం, కొన్ని ప్రాంతాల్లో నేరంగా పరిగణింపబడుతోంది. నేడు దాన ధర్మాలు బాగా తగ్గిపోయాయి.

ఆలోచించండి – చెప్పండి (T.B. PNo. 113)

ప్రశ్న 1.
భిక్ష దొరకని వ్యాసుడు కోపగించాడు కదా ! దీనిపైన మీ అభిప్రాయమేమిటి ?
జవాబు:
వ్యాసుడు వేదవేదాంగవేత్త. అష్టాదశ పురాణాలు రచించినవాడు. భారతం రచించినవాడు. అటువంటి వాడు కేవలం రెండు రోజులు భిక్ష దొరకలేదని కాశీ నగరంపై కోపించి శపించడానికి సిద్ధమయ్యాడు. వ్యాసుడు కోపించడం, ధర్మం కాదు. లోకంలో ఎందరో మహర్షులు, తాపసులు నివ్వరి బియ్యం తిని జీవిస్తున్నారు.

కొందరు శాకాహారంతో, కంద భోజనంతో కడుపు నింపుకుంటున్నారు. కొందరు ఉంఛ వృత్తితో జీవిస్తున్నారు. కాబట్టి వ్యాసుని వంటి మహర్షి రెండు రోజులు పస్తు ఉండలేక, శివుని భార్యయైన కాశీ నగరాన్ని శపించబోవడం నేరం అని నా అభిప్రాయం.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ప్రశ్న 2.
“ఆకలి మనిషిని విచక్షణ కోల్పోయేటట్లు చేస్తుంది” దీన్ని గురించి మాట్లాడండి.
జవాబు:
మనిషికైనా, జంతువుకైనా, ఏ ప్రాణికైనా ఆకలి వేసినపుడు తిండి కావాలి. అది శరీరానికి ప్రాథమిక అవసరం. తిండి లేకపోతే కడుపులో మంట వస్తుంది. తలపోటు, చిరాకు, కోపం వస్తాయి. ఆ పరిస్థితులలో మనిషి విచక్షణ కోల్పోతాడు. తను ఏం చేస్తున్నాడో తనకు తెలియదు.

ప్రశ్న 3.
ఉన్న ఊరును కన్నతల్లితో సమానమని ఎందుకు (A.P Mar. ’16)
జవాబు:
కన్నతల్లి మనకు కావలసిన దానిని తాను గుర్తించి మన కడుపు నింపుతుంది. కన్నతల్లి తన బిడ్డలపై ఎప్పుడూ కోపగించుకోదు. పిల్లలను కన్నతల్లి బాగా ప్రేమగా చూసి, వారికి కావలసిన వాటిని ఇస్తుంది.

అలాగే మనం ఉన్న ఊరు కూడా, మనకు కావలసిన వాటిని సమకూరుస్తుంది. మనం ఉన్న ఊరిలో మనకు ప్రజలు అందరూ తెలిసిన వారు ఉంటారు. వారు తన తోడి వ్యక్తిని ప్రేమగా కన్నతల్లి వలె చూస్తారు. అందుకే జననీ, జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అన్నారు.

కన్నతల్లిని విడిచి వెళ్ళకూడదు. అలాగే మనం ఉన్న ఊరును విడిచి పొరుగూరు పోకూడదు. పొరుగూరిలో మనం ఎన్నటికీ ఉన్న ఊరులో వలె సుఖంగా ఉండలేము. కన్నతల్లి, ఉన్న ఊరు స్వర్గంతో
సమానం.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 114)

ప్రశ్న 1.
భోజనానికి ఆహ్వానించిన గృహిణితో వ్యాసుడు పలికిన మాటలను బట్టి మీకేమి అర్థమయింది
జవాబు:
గృహిణి వ్యాసుడిని భోజనానికి రమ్మని ఆహ్వానించింది. అప్పుడు వ్యాసుడు తానొక్కడినే భోజనానికి రానని, శిష్యులు పస్తులుండగా తానొక్కడినే తినడం మంచిది కాదని చెప్పాడు. దీనివల్ల వ్యాసునికి తన శిష్యులపట్ల ప్రేమానురాగాలు కలవని అందరూ ఆకలితో ఉంటే ఒక్కడినే తినడం మంచిదికాదని వ్యాసుని మాటల వల్ల అర్థమైంది.

ప్రశ్న 2.
ఈ పాఠం ఆధారంగా నాటి గురుశిష్య సంబంధాల గురించి వివరించండి.
జవాబు:
ఈ పాఠం ఆధారంగా అలనాటి గురుశిష్య సంబంధాలు జాతికి ఆదర్శంగా నిలుస్తాయి. శిష్యులు గురువుపై గౌరవాన్ని చూపేవారు. గురువు కూడా శిష్యులపై ప్రేమను, వాత్సల్యాన్ని చూపేవారు. శిష్యులు పస్తులుండగా గురువు ఆహారాన్ని స్వీకరించే వాడు కాదని తెలుస్తుంది.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
క్రింది పద్యం చదవండి. శ్రీ నాథుడు తన గురించి తాను ఏమని చెప్పుకొన్నాడో తెల్పండి.

సీ|| వచియింతు వేములవాడ భీమన భంగి
నుద్దండలీల నొక్కొక్కమాటు

భాషింతు నన్నయభట్టు మార్గంబున
నుభయవాక్రౌఢి నొక్కొక్క మాటు
వాక్రుత్తు తిక్కయజ్వ ప్రకారము రసా
భ్యుచిత బంధమున నొక్కొక్కమాటు
పరిఢవింతు ప్రబంధపరమేశ్వరుని ఠేవ
సూక్తివైచిత్రి నొక్కొక్కమాటు

తే॥గీ॥ నైషధాది మహాప్రబంధములు పెక్కు
చెప్పినాడవు మాకు నాశ్రితుడ వనఘ
ఇపుడు చెప్పఁదొడంగిన యీ ప్రబంధ
మంకితముసేయు వీరభద్రయ్యపేర (కాశీ 1-18)
జవాబు:

ఈ పద్యం శ్రీనాథుడి కవిత్వ రచనా విధానాన్ని గూర్చి చెపుతోంది.

  1. శ్రీనాథుడు వేములవాడ భీమన అనే కవి వలె, ఒక్కొక్కసారి “ఉద్దండ లీల”గా కవిత్వం చెపుతాడు.
  2. ఒక్కొక్కసారి నన్నయభట్టు కవి వలె, “ఉభయ, వాక్రౌఢి” తో కవిత్వం రాస్తాడు. “
  3. ఒకసారి తిక్కన గారి వలె, ‘రసాభ్యుచిత బంధము’గా రాస్తాడు.
  4. ఒక్కొక్కసారి ప్రబంధ పరమేశ్వరుడైన ఎఱ్ఱన గారి వలె “సూక్తి వైచిత్రి”ని చూపిస్తాడు.
  5. నైషధము వంటి అనేక ప్రబంధాలు రాశాడు.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ప్రశ్న 2.
‘అన్ని దానాల్లోకీ అన్నదానం మిన్న’ అనే అంశంపై తరగతిలో చర్చించండి.
జవాబు:
‘దానం’ అంటే ఇతరుడికి ఇవ్వడం. దానం చేస్తే పుణ్యం వస్తుందని చెపుతారు. ఈ జన్మలో దానం చేసుకుంటే తరువాతి జన్మలో భగవంతుడు మనకు తిరిగి ఇస్తాడని మన గ్రంథాలు చెపుతున్నాయి. దశదానాలు, షోడశ మహాదానాలు చేయాలని చెపుతారు. అయితే దానాలు అన్నింటిలోకి ‘అన్నదానం’ గొప్పది అని పెద్దలు చెపుతారు. ఈ మాట సత్యమైనది.

ఎదుటి వ్యక్తికి తృప్తి కలిగేటట్లు అన్నదానం చేయవచ్చు. అన్నదానం చేస్తే తిన్నవాడికి కడుపు నిండుతుంది. మరింతగా పెడతానన్నా అతడు తినలేడు. ఇతర దానాలు ఎన్ని చేసినా ఎంత విరివిగా చేసినా దానం పుచ్చుకున్న వాడికి తృప్తి కలుగదు. మరింతగా ఇస్తే బాగుండు ననిపిస్తుంది. అన్నదానం చేస్తే తిన్నవాడి ప్రాణం నిలుస్తుంది. కాబట్టి అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న అన్నమాట నిజం

ప్రశ్న 3.
“ఆకంఠంబుగ ….. శిలోంఛప్రక్రముల్ తాపసుల్!” పదాన్ని పాదభంగం లేకుండా పూరించి, భావాన్ని వ్రాయండి. (Mar. ’16)
జవాబు:
ప్రతిపదార్థ తాత్పర్యాలలో 10వ పద్యాన్ని చూడుము.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

1. క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు వ్రాయండి.

అ) పాఠం ఆధారంగా వ్యాసుడు ప్రవర్తించిన తీరుపై మీ అభిప్రాయాన్ని వ్రాయండి.
జవాబు:
“భిక్ష” పాఠం ఆధారంగా వ్యాసుడు ప్రవర్తించిన తీరును పరిశీలించగా ఎంతటి వారికయినా ఆకలిబాధ భరించరానిది అని అర్థమవుచున్నది. ఈ ఆకలి బాధచే వేదాలను నాలుగు విధాలుగా విభజించిన వేదవ్యాసుడు కోపానికి లోనయ్యాడు. కోపం వలన మంచి చెడుల విచక్షణను కోల్పోయి కాశీనగరాన్ని శపించబోయాడు. అంతేగాకుండా సకలశాస్త్రాలను చదివి, వాటి సారాన్ని తెలుసుకున్న వ్యాసుడు కేవలం 20 రోజులు భిక్ష దొరకని కారణంగా తీవ్రకోపానికి లోనై తన చేతిలోని భిక్షపాత్రను నేలకేసి విసిరిగొట్టెను.

“కనుక కోపం చాలా ప్రమాదకరమయినది. కోపం మానవునికి అంతర్గత శత్రువు. కోపం మన ప్రశాంతతను దెబ్బ తీస్తుంది. తోటివారిని ప్రశాంతంగా ఉండనివ్వదు. మనిషి ఆలోచనా శక్తిని, జ్ఞానాన్ని క్రమంగా క్షీణింపజేస్తుంది. ఆప్తులను, స్నేహితులను దూరం చేస్తుంది. గౌరవ, మర్యాదలు తగ్గిస్తుంది. కనుక మనిషి కోపాన్ని దూరం చేసుకోవాలి. అప్పుడే అందరికీ ఆదర్శంగా ఉండగలము” అనే విషయాన్ని గ్రహించాలి. మనిషికి కేవలం శాస్త్రజ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదనీ, ఆత్మజ్ఞానం మరియు ఇంద్రియ నిగ్రహం ఉండాలని వ్యాసుని పాత్ర ద్వారా గ్రహించవచ్చు.

ఆ) నేఁడు నిన్నటికి మఱునాఁడు నిక్కువంబు” అను మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు ? వీటి అంతరార్థమేమిటో వివరించండి.
జవాబు:
పరిచయం : ఈ మాటలు శ్రీనాథ మహాకవి రచించిన కాశీఖండం నుండి గ్రహించిన “భిక్ష” పాఠంలోనిది.
భావము : ఈ రోజు నిన్నటికి మరునాడే కదా !

అంతరార్థం : అంటే ఈ రోజు నాకు భిక్ష లభించకపోతే నిన్నటిలాగే ఈ రోజు కూడా ఉపవాసం తప్పదని వ్యాసుని మాటల్లోని అంతరార్థము.

ఇ) ఆకలి వల్ల వ్యాసుడు కాశీ నగరాన్ని శపించాలను కున్నాడు కదా ! “ఆకలి మనిషి విచక్షణను నశింప జేస్తుంది” అనే దాని గురించి రాయండి.
జవాబు:
వేదవ్యాసుడు మహాపండితుడు. వేద విభజన చేసినవాడు. 18 పురాణాలు రచించినవాడు. సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించాడు. అటువంటి మహర్షి కూడా ఆకలి వల్ల విచక్షణ కోల్పోయాడు. కాశీని శపించాలనుకొన్నాడు. ఎందుకంటే మనిషి దేనినైనా జయించగలడు. కానీ ఆకలిని జయించలేడు. ఆకలి ఎక్కువైతే కడుపులో మంట వస్తుంది. కళ్ళు తిరుగుతాయి.

తలపోటు, వికారం, చిరాకు, కోపం అన్నీ వస్తాయి. వాటివలన మనిషి విచక్షణను కోల్పోతాడు. విచక్షణ కోల్పోయిన మనిషి ఎంతకైనా తెగిస్తాడు. తనకు అన్నం పెట్టని లోకంపై కక్ష పెంచుకొంటాడు. రాక్షసుడుగా మారతాడు. అంటే మనిషిని రాక్షసుడిగా మార్చేది ఆకలి. అందుకే ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలి.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబులు వ్రాయండి.

అ) “భిక్ష” పాఠంలోని కథను సంక్షిప్తంగా వ్రాయండి. (A.P June’18)
(లేదా)
“భిక్ష” పాఠ్యభాగ కథను మీ మాటల్లో వివరించండి.
జవాబు:
వ్యాసమహర్షి శిష్యులతో కూడి నగరంలో నివ సిస్తున్నాడు. ఒకసారి వ్యాసుడు శిష్యులతో కలిసి భిక్షాటనకై బయలుదేరాడు. శివుని యోగమాయతో వ్యాసునికి గాని, అతని శిష్యులకు గాని భిక్ష లభించలేదు. ఏ ఇల్లాలు కూడా భిక్షను వేయలేదు. వాస్తవంగా కాశీ నగరంలోని ఇల్లాండ్రు అన్నపూర్ణా దేవికి చెలికత్తెలు. వారంతా అతిథులను గౌరవిస్తారు. కాని రెండు రోజుల పాటు భిక్ష దొరకలేదు.

వ్యాసుడు తీవ్రమైన కోపాన్ని పొందాడు. కాశీ నగరంలోని ప్రజలను శపించబోయాడు. ఆ సమయంలో అన్నపూర్ణాదేవి సాధారణ స్త్రీ వలె వ్యాసుని ముందుకు వచ్చింది. అతనితో మహర్షి ! నీవు కాశీపై కోపగించుట తగునా ? నీవు శాంత స్వభావం కల వాడివా ? పిడికెడు వరి గింజలతో కాలం వెళ్ళబుచ్చే శాకా హారంతో జీవించే తాపసుల కంటే నీవు గొప్ప వాడివా ? ‘ఉన్న ఊరు కన్నతల్లితో సమానం’ అనే ధర్మాన్ని మరిచిపోయావా ? ఆకలితో ఉన్న నిన్ను ఇంకా మాటలతో బాధపెట్టడం తగదు. నీవు వెంటనే భోజనానికి రమ్ము.

తరువాత నీకు కొన్ని మాటలు చెప్పాలి. అని పలికింది. వ్యాసుడు ఆ మాటలను విని ‘అమ్మా ! నా శిష్యులు, ఇతరులు మొత్తం పదివేల మంది ఉన్నారు. వారందరు తినకుండా నేను భోజనం చేయటం మంచిది కాదు’ అని పలికాడు. అది విని అన్నపూర్ణాదేవి “మహర్షీ! నీతోపాటు నీ శిష్యులు కలసి రావలసినది. విశ్వనాథుని అనుగ్రహంతో మీకందరికి రుచి కరములైన ఆహారాన్ని అందిస్తాను” అని పలికింది. వ్యాసుడు అంగీకరించిన శిష్యులతో కలిసి అన్నపూర్ణాదేవి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజన శాలలో భోజనం చేశాడు.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ఆ) కోపంవల్ల కలిగే దుష్పరిణామాలను గురించి రాయండి.
జవాబు:
మనం జయించవలసిన మనలోని శత్రువులు ఆరు. వీటిని అరిషడ్వర్గాలు అంటారు. అవి

  1. కామం,
  2. క్రోధం,
  3. లోభం,
  4. మోహం,
  5. మదం,
  6. మాత్సర్యం.

ఈ ఆరు అంతః శత్రువులను జయించిన వాడే మహనీయుడు అవుతాడు. వీటిలో ప్రధానమైన శత్రువు క్రోధం. అదే కోపం. ‘తన కోపమే తన శత్రువు – తన శాంతమే తనకు రక్ష’ అని శతకకర్త ఎప్పుడో చెప్పాడు. ‘కోపమునను ఘనత కొంచెమై పోవును’ అని కూడా మహాకవి చెప్పాడు.

కోపాన్ని జయించి సహనాన్ని శాంతాన్ని అలవరచుకోవడం చాలా కష్టం. ఎంతో సాధన చేస్తే తప్ప కోపాన్ని జయించలేం. భృగు మహర్షి, విశ్వామిత్రుడు, దుర్వాసుడు లాంటి గొప్ప మహర్షులు సహితం ఈ ప్రయత్నంలో విఫల మయ్యారు. కోపాన్ని జయించలేక తమను తాము తగ్గించుకొన్నారు. ఈ కోపం మనిషిని క్షణికావేశానికి లోను చేసి ఎన్నో అనర్థాలకు కారణమౌతుంది.

బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన వేదవ్యాస మహర్షి ఆకలి బాధ తాళలేక కోపానికి వశుడై, పరమేశ్వరునికి ప్రీతి పాత్రమైన కాశీనగరాన్ని శపించడానికి సిద్ధపడ్డాడంటే – కోపం ఎంతటి వారినైనా విచక్షణను కోల్పోయేటట్లు చేస్తుందనేదానికి నిదర్శనం. సాధన చేస్తే సాధ్యం కానిది లేదు. ప్రతి ఒక్కరూ అంతః శత్రువైన కోపాన్ని జయించాలి. సహనాన్ని అలవర్చుకోవాలి. ఆనాడే సమాజంలో శాంతి పరిఢవిల్లుతుంది.

“కోపాన్ని జయించండి – ఉత్తమ వ్యక్తులుగా ఎదగండి”

ప్రశ్న 3.
క్రింది అంశాలను గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ వ్రాయండి.

అ) భిక్ష, రక్ష, పరీక్ష, సమీక్ష, వివక్ష… వంటి పదాలతో ఒక చక్కని భావాన్ని ప్రకటించే కవిత వ్రాయండి.
జవాబు:
సకల శుభదాయక కల్పవల్లీ
జనులందరికీ జ్ఞాన భిక్ష ప్రసాదించు
నీ కృపారస దృష్టే జనులందరికీ రక్ష
అదే మాకందరికి జీవన రక్ష.

జీవన పోరాట పరీక్షలెన్నో ఉన్నాయి
పరీక్షలన్నింటిలో నీ రక్షతో గెలవాలి మేము
నవ సమాజంలో ఎన్నో వివక్షలు
కక్షలేని రహదారులు లేవెక్కడ
నిరక్షరాస్యులైన నిర్భాగ్యులెందరో
వారందరినీ చూడుము నిష్పక్షపాతంగా

సమీక్షలు లేని ప్రభుత్వ పథకాలెన్నో
దూరమవుతున్నాయి నిర్భాగ్యులకు
నాగరిక సమాజంలో ఎన్నో వివక్షలు
కనిపించని మానవ నైతిక సంబంధాలు
తల్లీ ! ఇక రక్షించు ! నీవైనా !
మా కందరికీ పంచిపెట్టు జ్ఞానభిక్ష !

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి.

అ) ద్వాఃకవాటంబు దెఱవదు వనిత యొకతె
జవాబు:
వనిత = మహిళ, స్త్రీ, పడతి, ఉవిద, నారి, పురంధ్రి, అంగన, మగువ

ఆ) ప్రక్షాళితంబైన పసిఁడి చట్టువము.
జవాబు:
పసిడి = బంగారం, కాంచనం, పుత్తడి, సువర్ణం, కనకము, హిరణ్యము

ఇ) పారాశర్యుండు క్షుత్పిపాసా పరవశుండై శపియింపఁ
జవాబు:
పారాశర్యుండు = వ్యాసుడు, బాదరాయణుడు, కృష్ణ ద్వైపాయనుడు, సాత్యవ తేయుడు

ఈ) ఇవ్వీటిమీద నాగ్రహము తగునె ?
జవాబు:
ఆగ్రహము = కోపము, క్రోధము, అలుక, ఉద్రేకం, రోషము

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ఉ) అస్తమింపగ జేసినాడు అహిమకరుడు.
జవాబు:
అహిమకరుడు = సూర్యుడు, భానుడు, రవి, ప్రభాకరుడు, ఆదిత్యుడు, ఇనుడు

2. క్రింది పదాలను అర్థాలను రాయండి.

అ) ద్వాఃకవాటము
ఆ) వీక్షించు
ఇ) అంగన
ఈ) మచ్చెకంటి
ఉ) భుక్తిశాల

అ) ద్వాఃకవాటము
జవాబు:
ద్వారబంధము

ఆ) వీక్షించ
జవాబు:
చూచు

ఇ) అంగన
జవాబు:
స్త్రీ

ఈ) మచ్చెకంటి
జవాబు:
చేపకనులు గల స్త్రీ

ఉ) భుక్తిశాల
జవాబు:
భోజనశాల

3. క్రింది వాక్యాల్లో నానార్థాలు వచ్చే పదాలను గుర్తించండి.

అ) వీడు ఏ వీడువాడోగాని దుష్కార్యములను వీడుచున్నాడు.
జవాబు:
ఈ వాక్యంలో ‘వీడు’ అనే పదం మూడు అర్థాలలో వాడబడింది.
వీడు (నానార్థాలు) :

  1. ఈ మనుష్యుడు
  2. పట్టణము
  3. వదలుట

ఆ) రాజు ఆకాశంలోని రాజును చూసి సంతోషించాడు. (A.P Mar.16)
జవాబు:
ఈ వాక్యంలో ‘రాజు’ అనే పదం మూడు అర్థాల్లో వాడబడింది.
రాజు (నానార్థాలు) :

  1. క్షత్రియుడు
  2. చంద్రుడు

4. క్రింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను ఎంపిక చేయండి.

అ) విద్య ()
క) విదియ
చ) విజ్జ
ట) విద్దె
త) విద్య
జవాబు:
ట) విద్దె

ఆ) భిక్ష ()
క) బత్తెము
చ) బచ్చ
ట) బిచ్చ
త) బిచ్చము
జవాబు:
త) బిచ్చము

ఇ) యాత్ర ( )
క) యతర
చ) జాతర
ట) జైత్ర
త) యతనము
జవాబు:
క) యతర

ఈ) మత్స్యము ( )
క) మచ్ఛీ
చ) మత్తియము
ట) మచ్చెము
త) మత్తము
జవాబు:
ట) మచ్చెము

ఉ) రత్నము ( )
క) రతనము
చ) రచ్చ
ట) రచ్చము
త) రత్తము
జవాబు:
క) రతనము

ఊ) పంక్తి ( )
క) పంతులు
చ) పత్తి
ట) బంతి
త) పంకు
జవాబు:
ట) బంతి

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

వ్యాకరణాంశాలు

1. కింద గీత గీసిన పదాల్లోని సంధులను గుర్తించి సంధి పేరు రాయండి.

అ) పుణ్యాంగనయు భిక్ష యిడదయ్యెఁ గటా !
జవాబు:

  1. పుణ్య + అంగన = పుణ్యాంగన
    సవర్ణదీర్ఘ సంధి సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమౌతాయి.
  2. భిక్ష + ఇడదయ్యె = భిక్షయిడదయ్యె
    యడాగమసంధి సూత్రం : సంధిలేని చోట అచ్చుకంటె పరమైన అచ్చునకు యడాగమం వస్తుంది.
  3. ఇడదయ్యెన్ + కటా = ఇడదయ్యెఁ గటా! ద్రుతప్రకృతిక సంధి (సరళాదేశ సంధి)

సూత్రాలు :

  1. ద్రుత ప్రకృతికము మీది పరుషాలకు సరళాలు వస్తాయి.
  2. ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి బిందు, సంశ్లేషలు విభాషగా వస్తాయి.

ఆ) కాశి; యివ్వీటి మీద నాగ్రహము దగునె.
జవాబు:

1) కాశి + ఇవ్వీటి = కాశి యివ్వీటి (యడాగమ సంధి)
ఈ + వీటి = ఇవ్వీటి (త్రికసంధి)

త్రికసంధి సూత్రాలు :

  1. ఆ,ఈ,ఏ లు త్రికములు.
  2. త్రికము మీదున్న అసంయుక్త హాల్లునకు ద్విత్వ బహుళంగా వస్తుంది.
  3. ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్ఛికంబగు దీర్ఘానికి హ్రస్వం.

2) గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమమీది పరుషములకు గ, స, డ, ద, వ లు బహుళముగానగు.

ఇ) ఓ మునీశ్వర ! వినవయ్య
జవాబు:

1) ముని + ఈశ్వర = మునీశ్వర (సవర్ణదీర్ఘ సంధి)

సవర్ణదీర్ఘసంధి సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమౌతాయి.
యడాగమసంధి సూత్రం:
సంధిలేని చోట అచ్చుకంటే పరమైన అచ్చునకు యడాగమం వస్తుంది
వినవు + అయ్య = వినవయ్య (ఉత్వ సంధి)
ఉత్వసంధి సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యంగా వస్తుంది.

2. పాఠంలోని తేటగీతి పద్యాన్ని గుర్తించి లక్షణాలతో సమన్వయం చేయండి.

అ) మునీశ్వర! ……….. నా గ్రహముదగునె ?
జవాబు:
TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష 1

పై పద్యంలోని ప్రతి పాదంలో ఒక సూర్య గణం, రెండు ఇంద్ర గణాలు, రెండు సూర్య గణాలు వరసగా వచ్చాయి కాబట్టి ఇది తేటగీతి పద్యం.
ఇది ఉపజాతి
ప్రాసనియమం ఉండదు.
ఒకటవ గణం మొదటి అక్షరానికి నాల్గవ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది.

సీస పద్యం

క్రింది తరగతులలో తేటగీతి, ఆటవెలది పద్యాలు తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు ‘సీస పద్య’ లక్షణాలను పరిశీలిద్దాం.

క్రింది ఉదాహరణలను పరిశీలించండి.
ఉదా :
TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష 2

సీసపద్య లక్షణం:

ఇందులో నాలుగు పాదాలుంటాయి.
ప్రతిపాదంలో ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
పద్యపాదం రెండు సమభాగాలుగా ఉంటుంది. రెండు భాగాల్లోను మూడో గణంలోని మొదటి అక్షరం యతి లేదా ప్రాస యతి.
ప్రాసనియమం లేదు.
తేటగీతి లేదా ఆటవెలది దీనికి చివరగా ఉంటుంది.

పై పద్యపాదాల్లో –

  1. ఒక్కొక్కటి రెండు భాగాలుగా ఉన్నాయి.
  2. రెండు భాగాల్లో కలిపి ఎనిమిది గణాలున్నాయి. (ఆరు ఇంద్రగణాలు + రెండు సూర్యగణాలు)
  3. యతి, ప్రాస యతులు (కా – గ, ర – ర) (ప-పు, ప-ప) ఉన్నాయి.
  4. ప్రాసనియమం లేదు. వీటిని బట్టి ఇది సీసపద్యం అన్ని గుర్తించవచ్చు.

ప్రశ్న 1.
పాఠంలోని సీసపద్యానికి గణవిభజన చేసి లక్షణాలను అన్వయించండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష 3
TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష 4
TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష 5
తేటగీతి :
TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష 6

లక్షణాలు :

  1. 4 పాదాలుంటాయి.
  2. ప్రతి పాదంలో 6 ఇంద్ర గణాలు + 2 సూర్య గణాలు ఉంటాయి.
  3. 3వ గణంలో 1 మొదటి అక్షరం యతి లేదా ప్రాస యతి.
  4. ప్రాస నియమం లేదు.
  5. తేటగీతి దీనికి చివరగా.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ప్రాజెక్టు పని

శ్రీనాథుడు రచించిన ఏవైనా 5 పద్యాలు సేకరించండి. (లేదా) కాశీపట్టణ విశేషాలు తెలుసుకొని రాయండి. నివేదిక రాసి వినిపించండి.

1. సీ. ‘తల్లి మదేకపుత్రక పెద్ద కన్నులు
గానదిప్పుడు మూడుకాళ్ళ ముసలి
యిల్లాలు గడుసాధ్వి యేమియు నెఱుగదు.
పరమ పాతివ్రత్య భవ్య చరిత వెనుక ముందర లేరు నెనరైన చుట్టాలు
లేవడి యెంతేని జీవనంబు
గానక కన్న సంతానంబు శిశువులు
జీవన స్థితికేన తావలంబు

2. సీ. వేదండ సదన శుండాదండ గండూష
కాండ సిక్తాస్సరో మండలములు
గంధర్వ కన్యకా కనక సౌగంధిక
మాలికాలగ్న షాణ్మాతురములు
నందీశ్వరక్షిప్త నారంగ ఫలపాక
తారశ విద్యాద్ధరీ స్తనభరములు
గరుడ లీలావతీ కస్తూరికా పంక
పిహిత నిశ్శేషాంగ భృంగిరిటులు

3. సీ. శ్రీ భీమనాయక శివనామ ధేయంబు
చింతింపనేర్చిన జిహ్వ జిహ్వ
దక్షవాటీ పురాధ్యక్ష మోహనమూర్తి
చూడంగనేర్చిన చూపుచూపు
దక్షిణాంబుధి తటస్థాయి పావనకీర్తి
చేవింపనేర్చిన చెవులు చెవులు
తారకబ్రహ్మ విద్యాదాత యౌదల
విరులు పూన్పగనేర్చు కరము కరము

4. “ఓరి దురాత్మ ! నీ వార ముష్టింపచా
భాస, యోజనగంధి ప్రథమపుత్ర
దేవర న్యాయదుర్భావనా పరతంత్ర
బహుసంహిత వృధా పాదపఠన
భారత గ్రంథ గుంభన పండితం మన్య
నీవా మదీయ పత్నికి నశేష
కైవల్య కల్యాణఘంటాపథమునకు
గాశికాపురికి నిష్కారణంబ

5. సీ॥ సంస్తుతించిరి బహ్వృచ ప్రపంచంబుల
నొకకొందఱసిత కంఠోపకంఠు
నుచ్చైస్స్వనంబున నొక కొందఱునుతించి
రార్యాకళత్రు సధ్వర్యుశాఖ
శివునిఁ బ్రశంస చేసిరి యొకకొందఱు
సద్భక్తి మైసప్త సామములను
సర్వజ్ఞుఁ బొగడిరధర్వ వేదంబున
నొకకొందఱగిఁ బ్రసంగోచితముగఁ

తే.గీ. వీరభద్ర వికీర్ణ కర్పూర చూర్ణ
ధనకళితాకాశ చరవనితా ముఖములు
శాంభవీశంభు మధుకేళి సంభ్రమములు
పొడులి నాసించుగాకత నా హృదయవీధి
– హరవిలాసం – శ్రీనాథుడు.

తే.గీ. ధవళకర శేఖరునకు బ్రదక్షిణంబు
నర్థి దిరుగంగ నేర్చిన యడుగులడుగు
లంబికానాయక ధ్యానమార్గ జలధి
మధ్యమున దేలియాడెడి మనసు మనసు
– భీమఖండము – శ్రీనాథుడు.

తే.గీ. శాపమిచ్చెదనని యనాచార సరణి
నడుగుపెట్టినవాడ వహంకరించి
పొమ్ము ! నిర్భాగ్య మాయూరి పాలము వెడలి
యెచటికేన్ శిష్యులు నీవు నీక్షణంబు” (భీమేశ్వర పురాణము)

తే.గీ. గాశికాతీర్థ వాసులఁ గర్మపరులఁ
భూతి రుద్రాక్షధారులఁ బుణ్యనిధుల
నందఱినిఁ జూచి కరుణా సమగ్రబుద్ధి
నిట్టులని యానతిచ్చె విశ్వేశ్వరుండు ।

1. కాశీ పట్టణ విశిష్టత : మనదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో పరమపావనమైనది, దివ్యమైనది కాశీ క్షేత్రం. ద్వాదశి జ్యోతిర్లింగ క్షేత్రంగాను, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందింది. పరమపావనమైన గంగానది ఇక్కడ ప్రవహిస్తుంది. కాశీలో మరణించినవారికి శివుని సాయుజ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇది ఎంతో అందమైన ప్రాంతం. నిరంతర వేదఘోష మార్మోగుతుంది. విద్యాలయాలకు నిలయంగా మారింది. అన్నార్తులకు కల్పవల్లిగా విరాజిల్లింది. భారతదేశంలో జన్మించిన ప్రతి హిందువు జీవితంలో ఒకసారైన కాశీని దర్శించాలని అనుకుంటాడు.

నివేదిక

శ్రీనాథుడు ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్రలో కవిసార్వభౌమునిగా గుర్తింపు పొందాడు. కావ్య రచనలో రసపోషణకు ప్రాధాన్యం ఎక్కువగా ఇచ్చాడు. ఇతనిది వర్ణనాత్మకశైలి. కవిత్వం కొంత ప్రౌఢంగా ఉన్నప్పటికీ కూడా ఆపాతమధురంగా ఉంటుంది. ఇతడు సీసపద్య రచనలో తన విశేష ప్రతిభను ప్రదర్శించాడు. పాత్రానుగుణమైన శైలి, పదబంధము ఇతని ప్రత్యేకత. ఇతని పద్యాల్లో అంత్యానుప్రాస, ఉత్ప్రేక్ష, రూపకాలంకారాలు ఎక్కువగా కనిపిస్తాయి. తెలుగు సాహిత్యంలో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వారిలో శ్రీనాథుడ్నే ప్రథముడుగా చెప్పవచ్చు. ఇతని కవిత్వం ప్రబంధ యుగానికి పునాది వేసింది.

విశేషాంశాలు

1. మాధుకరము : మధుకర వృత్తి అంటే తుమ్మెదలు పూలలోపలి తేనెను గ్రహించినట్లు గృహస్థులు ఇండ్ల నుండి భిక్షను గ్రహించడం

మీకు తెలుసా ?

1. బ్రాహ్మీముహూర్తం : సూర్యోదయానికి 90 ని॥ల ముందుకాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. బ్రాహ్మీ అంటే సరస్వతి అని కూడా అర్థం. బుద్ధిని పెంపొందించే సమయం కాబట్టి దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా ఈ సమయం శ్రేష్ఠమైనది.

2. దేవకార్యము : భగవంతుడికి విశేషంగా చేసే పూజా కార్యక్రమం. రెండోది పితృదేవతా కార్యం. అంటే శ్రాద్ధము. శ్రాద్ధమునాడు భిక్ష సమర్పించరాదనే సంప్రదాయమున్నది.

3. కామధేనువు : (దేవతల ఆవు). కోరిన కోర్కెలను తీరుస్తుంది.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

4. కాశి : ప్రపంచంలో అతి పురాతన క్షేత్రం. 5 క్రోశములు కోసం వ్యాపించినది. వరుణ, అసినదుల సంగమ ప్రాంతం కనుక “వారణాసి” అయింది. విశ్వేశ్వరుని ఆలయం కలదు. పార్వతీమాతను అన్నపూర్ణగా కొలుస్తారు. దీనికి మహాశ్మశానమని కూడా పేరు. సప్త మోక్షధామాలలో ఇది ఒకటి.

5. అష్టాదశపురాణాలు : భాగవత, భవిష్య, మత్స్య, మార్కండేయ, బ్రహ్మ, బ్రహ్మండ, బ్రహ్మవైవర్త, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద పురాణాలు.

6. పారణ : ఉపవాసం ఉండి తర్వాత రోజు చేయు భోజనం (ఉపవాసానంతర భోజనం).

సూక్తి : మేధావి ఎన్నికష్టాలుపడ్డా, శుద్ధమైన నడవడిని, జీవనాన్ని వదలడు. దానివల్లనే అతడు ప్రతిష్టను, ఉత్తమ గతులనూ పొందుతాడు.
– మహాభారతం ఉద్యోగపర్వం

ప్రతిపదార్థ తాత్పర్యాలు

I

1. తే॥గీ॥ నెట్టుకొని కాయ బీటెండ పట్టపగలు
తాను శిష్యులు నిల్లిల్లు దప్పకుండఁ
గాశికా విప్రగృహ వాటికల నొనర్చు
నఖిల విద్యాగురుండు భిక్షాటనంబు.

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థము
అఖిల విద్యాగురుండు = సకల విద్యలకు గురువైన వ్యాసుడు
తాను = తానును
శిష్యులున్ = శిష్యులును
పగలు + పగలు = పట్ట పగటియందు
బీఱు + ఎండ = అధికమైన ఎండ
నెట్టుకొనికాయన్ = అతిశయించి కాయుచుండగా
కాశికా = కాశీనగరమందలి
విప్రగృహ = బ్రాహ్మణుల గృహాలకు సంబంధించిన
వాటికలన్ = వాడలయందు
భిక్షాటనంబు = భిక్షాటనను
ఇల్లిల్లు = ప్రతిఇంటిని
తప్పకుండగన్ = విడువకుండా
ఒనర్చున్ = చేసెను

తాత్పర్యము
విద్యాగురుడైన వ్యాసమహర్షి శిష్యులతో కూడి పట్టపగలు, అధికమైన ఎండలో కాశీనగరంలోని బ్రాహ్మణ వీధిలో భిక్షకోసం ఇల్లిల్లూ తిరగసాగాడు.

2. తే॥గీ॥ వండుచున్నారమను నొక్క వనజనేత్ర
తిరిగి రమ్మను నొక్క లేఁదీఁగె బోఁడి
దేవకార్యంబు నేఁడనుఁ దెఱవ యోర్తు
ద్వాః కవాటంబుఁ దెఱవదు వనిత యొకతె

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

ఒక్కవనజనేత్ర = పద్మములవంటి కన్నులు గల ఒక
వండుచున్నారమనున్ = వంటచేయుచున్నవారమని
ఒక్కలేదీగబోడి = లతవంటి శరీరముగల ఒక స్త్రీ
తిరిగిరమ్మనున్ = తిరిగిరమ్మనును
తెఱవయోర్తు = ఒక ఇల్లాలు
నేడు = ఈరోజు
దేవకార్యంబు = దేవతాసమారాధన
అనున్ = అంటున్నది
వనితయొకతె = ఒక స్త్రీ
ద్వాఃకవాటంబున్ = వాకిటి తలుపును
తెఱవదు = తెరవనే తెరువదు

తాత్పర్యము
ఒక ఇల్లాలు ‘వండుతున్నాం’ అంటున్నది. మరొక స్త్రీ ‘మళ్ళీ రండి’ అంటున్నది. ఇంకొకావిడ ఈరోజు వ్రతం (దేవకార్యం) అని చెబుతుంది; వేరొకావిడైతే అసలు తలుపులే తెరవడం లేదు.

3. సీ॥
ముంగిట గోమయంబున గోముఖము దీర్చి
కడలు నాల్గుగ మ్రుగ్గుకఱ్ఱ వెట్టి,
యతిథి నచ్చో నిల్పి యర్ఘ్య పాద్యము లిచ్చి
పుష్పగంధంబులఁ బూజసేసి,
ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున
నన్నంబుమీఁద నెయ్యభిఘరించి,
ఫలపాయసాపూప బహుపదార్థములతో
భక్తివిశ్వాస తాత్పర్య గరిమఁ

తే॥గీ॥ బెట్టుదురు మాధుకరభిక్ష భిక్షుకులకుఁ
గంకణంబులతో సూడిగములు రాయఁ
గమ్రకరముల బ్రాహ్మణాంగనలు కాశి
నన్నపూర్ణ భవాని కట్టనుఁగుఁ జెలులు

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

ముంగిటన్ = ఇంటిముందు భాగమందు
గోమయంబునన్ = ఆవుపేడతో
గోముఖముదీర్చి = అలుకుపెట్టి (అలికి)
కడలు = అంచులు
నాల్గుగన్ = నాలుగవునట్లుగా
మ్రుగ్గుకఱ్ఱ = ముగ్గుతో నేలమీద రేఖలు
పెట్టి = పెట్టి
అతిథిన్ = అతిథిని
ఆ + చోటన్ = ఆ రంగవల్లుల మధ్యమునందు నిలుచుండ పెట్టి అర్ఘ్యపాద్యాదులను
నిల్చి = నిలుచుండపెట్టి
అర్ఘ్యపాద్యములు = అర్ఘ్యయపాద్యదులను
ఇచ్చి = ఇచ్చి
పుష్పగంధంబులన్ = పూవులతోను, చందనముతోను,
పూజచేసి = పూజించి, అర్చించి
ప్రక్షాళితంబు + ఐన = బాగుగా కడుగబడిన
పసిడి = బంగారుమయమైన
చట్టువమునన్ = గరిటెతో
అన్నంబుమీదన్ = అన్నము పైన
నెయ్యి = నేతిని
అభిఘరించి = అభిఘారముచేసి (కొద్దిగా చల్లి)
ఫల = పండ్లు
పాయస = పరమాన్నము
అపూప = పిండివంటకములు
బహు = అనేకములైన
పదార్దములతోన్ = వస్తువులతో
భక్తి = పూజ్యభావము యొక్క
విశ్వాస = నమ్మకము యొక్క
తాత్పర్య = తత్పరభావము యొక్క
గరిమన్ = పెంపుతో
కమ్రకరములన్ = ఇంపైన చేతులయందు
బ్రాహ్మణ + అంగనలు = బ్రాహ్మణ స్త్రీలు
కంకణంబులతోన్ = ముత్యాలు, పగడాలు మొదలైన వానిని గుచ్చి చేతికి కట్టుకొనేడి
సూడిగములు = గాజులు
రాయన్ = ఒరసికొనగా
కాశిన్ = కాశీయందు
అన్నపూర్ణ = అన్నపూర్ణ అను పేరుగల
భవాని = పార్వతి
కడు + అనుంగు = గారాబమైన
చెలులు = స్నేహితురాండ్రు
భిక్షకులన్ = = యాచకులకు
మధుకర = మధూకరమను
భిక్షన్ = భిక్షను
పెట్టుదురు = పెడతారు

తాత్పర్యము
కాశీనగరంలోని గృహిణులు అన్నపూర్ణ భవానికి ప్రియమైన చెలులుగా పేరుగాంచినవారు. వారు భిక్షార్థమై వచ్చిన వాళ్ళను సాక్షాత్తు శివుడిగా భావించి, అపురూపంగా ఆదరిస్తారు. వాకిట్లో ఆవుపేడతో చక్కగా అలికి, నాలుగంచులూ కలిసేటట్లు ముగ్గుపెట్టి, దాని మధ్యలో వచ్చిన అతిథిని నిలబెట్టి, కాళ్ళకూ, చేతులకూ నీళ్ళిచ్చి, పూవులతో, గంధంతో వారిని అర్చించి, శుభ్రంగా కడిగిన బంగారుగరిటెతో అన్నం మీద నెయ్యి అభిఘరించి (వేసి), పండ్లు, పరమాన్నం, పిండివంటలు చేర్చి, భక్తి విశ్వాసాలు ఉట్టిపడుతుండగా భిక్ష సమర్పిస్తారు. (అతిథి దేవోభవ ! అనే భారతీయ సంప్రదాయాన్ని ఈ పద్యంలో వర్ణించాడు కవి).

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

విశేషాంశాలు

1. అతిథి : తిథి, వార, నక్షత్ర నియమం లేకుండా భోజనానికి వచ్చువాడు.
2. అర్ఘ్యం : (వ్యుత్పత్తి) పూజకు తగినది.

అష్టవిధ అర్ఘ్యములు :

  1. పెరుగు,
  2. తేనె,
  3. నెయ్యి,
  4. అక్షతలు,
  5. గరిక,
  6. నువ్వులు,
  7. దర్భ,
  8. పుష్పము

3. పాద్యము : వ్యుత్పత్తి, పాదములు కడుగుకొనుటకు ఉపయోగించు నీరు.
4. మాధుకర భిక్ష : (వ్యుత్పత్తి) = మధుకరం అంటే తుమ్మెద. తుమ్మెద వివిధ పుష్పాలపై వ్రాలి, తేనెను గ్రహించినట్లు, సన్యాసులు వివిధ గృహాలకు వెళ్ళి, ఆ ఇంటి గృహిణుల నుండి భిక్షాన్నములను స్వీకరిస్తారు. అందువల్ల సన్యాసులు స్వీకరించే భిక్షను ‘మాధుకర భిక్ష’ అంటారు.

4. కం॥ ఆ పరమపురంధ్రులయం
దే పుణ్యాంగనయు భిక్ష యిడదయ్యెఁ గటా !
రేపాడి మేలుకని యే
నే పాపాత్ముని ముఖంబు నీక్షించితినో ?

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

ఆ పరమ పురంధ్రుల యందున్ = అట్టి పరమ పుణ్యస్త్రీలయందు
ఏ పుణ్యాంగనయున్ = ఏ పుణ్యురాలైన ఇల్లాలు
భిక్ష = భిక్షాన్నము
ఇడదెయ్యెన్ = పెట్టకుండెను
కటా = అయ్యో !
ఏను = నేను
రేపాడి = ప్రాతఃకాలమునందు
మేలుకని = నిద్రలేచి
ఏ పాపాత్ముని = ఏ పాపాత్మునియొక్క
ముఖంబున్ = ముఖాన్ని
ఈక్షించితినో = చూచియున్నానో

తాత్పర్యము
అటువంటి పుణ్యస్త్రీలున్న ఈ నేలలో ఒక్కరైనా భిక్ష సమర్పించడం లేదంటే ఆశ్చర్యంగా ఉన్నది. ఈ రోజు ఉదయమే లేచి, ఏ పాపిష్టివాని ముఖం చూశానో ‘అనుకున్నాడు వ్యాసుడు.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

విశేషాంశాలు

1. పాపాత్ముని ముఖం చూడడం: దుర్మార్గుల ముఖం చూస్తే, చెడ్డ పరిణామాలు కలుగుతాయని నమ్మకం. అందుకే ఉదయం లేవగానే కాని, పాడ్యమి తిథినాడు చంద్రోదయాన్ని గమనించినప్పుడు కాని, ఇష్టమైన వాళ్ళ ముఖాలను చూస్తారు. అలాగే ఏదయినా పనిపై వెళ్ళేటప్పుడు, కులస్త్రీలు శకునంగా ఎదురువస్తే మంచిది అనే సంప్రదాయాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇటువంటి వాటిపై, నమ్మకం పోతూ ఉండడం గమనింపదగిన విషయం.

5. తే॥గీ॥ ఉపవసింతుముగాక నేఁడుడిగి మడిఁగి
యస్తమించుచు నున్నవాఁ డహిమభానుఁ
డెల్లి పారణకైన లేదెట్లు మనకు ?
మాధుకరభిక్ష బ్రాహ్మణమందిరముల

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

ఉడిగి = భిక్షకై తిరుగుట మాని
మడిగి = అణగి యుండి
నేడు = ఈరోజు
ఉపవసింతుముగాక = ఉపవాసం ఉందుముగాక !
అహిమభానుడు = వేడికిరణములు గల సూర్యుడు
అస్తమించుచున్నవాడు = అస్తమించుచున్నాడు
ఎల్లి = రేపు
మనకున్ = మనకు
బ్రాహ్మణమందిరములన్ = ఆ బ్రాహ్మణుల ఇళ్ళలో
మాధురభిక్ష = మధూకరరూపమైన భిక్ష
పారణకైనన్ = ఉపవాసాంత భోజనముకైనను
లేదెట్లు = లేకుండా ఎలా ఉంటుంది (తప్పక లభిస్తుంది) ?

తాత్పర్యము
సరే, ఇక భిక్షాటనం మాని ఈ రోజుకు ఉపవాసమే చేద్దాం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రేపైనా మనకు ఈ బ్రాహ్మణ వాటికలో ఉపవాసాంత భోజనానికి సరిపడ భిక్ష దొరకక పోదు.

II

6. వ. అని యా రాత్రి గడపి మఱునాఁడు
మధ్యాహ్నకాలంబున
శిష్యులుం దాను వేఱువేఱు విప్రభవన వాటికల
భిక్షాటనం
బొనర్పంబోయి,తొలునాఁటియట్ల ముక్కంటిమాయ నే
మచ్చెకంటియు వంటకంబు పెట్టకున్నఁ గటకటంబడి
భిక్షాపాత్రంబు నట్టనడువీథిం బగులవైచి
– కోపావేశంబున

ప్రతిపదార్థం

అని = అట్లు చెప్పి
ఆ రాత్రి = ఆ రాత్రి
గడిపి = వెళ్ళబుచ్చి
మఱునాడు = మరుసటిరోజు
మధ్యాహ్నకాలంబున = మధ్యాహ్నసమయంలో
శిష్యులున్ = శిష్యులు
తాను = తానునూ (వేద వ్యాసుడునూ)
వేఱవేఱన్ = విడివిడిగా
వేదవ్యాసుడు = వేద వ్యాసమహర్షి
విప్రభవన = బ్రాహ్మణ భవనముల యొక్క
వాటికలన్ = వీధులయందు
భిక్షాటనంబు = భిక్ష కోసం సంచారం
ఒనర్పంబోయి (ఒనర్పన్ + పోయి) = చేయబోయి
తొలినాటియట్ల (తొలినాటి + అట్ల) = ముందురోజువలె
ముక్కంటి మాయన్ = శివునిమాయచేత
ఏ మచ్చెకంటియున్ = మీనాక్షియును
వంటకంబు = అన్నమును
పెట్టకున్న (పెట్టక + ఉన్నన్) = పెట్టకపోగా
కటకటంబడి = బాధపడి
భిక్షాపాత్రంబు = శివభిక్షాపాత్రను
నట్టనడివీధికి = వీధి నట్టనడుమ
పగులవైచి = పగులగొట్టి
కోపావేశంబునన్ = కోపావేశంతో

తాత్పర్యము
అని వ్యాసుడు శిష్యులతో ఆ రాత్రి మఠంలో గడిపి, మరునాడు యథావిధిగా మధ్యాహ్న సమయానికి శిష్యులు, తాను వేరువేరుగా విప్రవాటికల్లో భిక్షాటనం చేయసాగారు. కాని మొదటి రోజులాగానే విశ్వనాథుని మాయవల్ల ఏ ఇల్లాలు భిక్షపెట్టలేదు. దాంతో బాధపడి కోపంతో భిక్షాపాత్రను నట్టనడి వీథిలో ముక్కలు ముక్కల య్యేటట్లు విసిరి ఆవేశంతో.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

7. తే॥గీ॥ ధనము లేకుండెదరు మూఁడు తరములందు
మూఁడు తరములఁ జెడుఁగాక మోక్షలక్ష్మి
విద్యయును మూఁడు తరముల వెడలవలయుఁ
బంచజనులకుఁ గాశికాపట్టణమున

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

కాశీకాపట్టణమునన్ = కాశీపట్టణమందు
పంచజనులకున్ = నివసించే ప్రజలకు
మూడు తరములన్ = మూడు తరములందు
మోక్షలక్ష్మి = కైవల్యలక్ష్మి
చెడుగాక = చెడిపోవుగాక
మూడుతరములన్ = మూడు తరములందున్
విద్యయును = విద్యకూడా
వెడలవలయున్ = తొలగిపోవలయును
మూడుతరముల యందు = మూడుతరములయందు
ధనములేక = సంపదలేక
ఉండెదరు = ఉంటారు

తాత్పర్యము
‘ఈ కాశీ పట్టణంలో నివసించే మనుషులకు మూడు తరములదాక ధనం, విద్య, మోక్షం లేకుండు గాక’!

8. వ. అని పారాశర్యుండు క్షుత్పిపాసా పరవశుండై శపియింపందలంచు |
నవసరంబున నొక్క విప్రభవనంబు వాఁకిటం బార్వతి
ప్రాకృత వేషంబున

ప్రతిపదార్థం

అని = ఈ విధముగా
పారాశర్యుండు = పరాశరుని కుమారుడైన వ్యాసుడు
క్షుత్ = ఆకలి
పిపాస = దప్పికతో
పరవశుండై = లొంగిపోయినవాడై
శపియింపన్ + తలంప = శపించడానికి ప్రయత్నించగా
అవసరంబున = ఆ సమయంబున
ఒక్క = ఒకానొక
విప్రభవనంబు = బ్రాహ్మణ ఇంటి యొక్క
వాకిటన్ = వాకిటయందు
పార్వతి = పార్వతీదేవి
ప్రాకృతవేషంబునన్ = సామాన్య స్త్రీ వేషముతో

తాత్పర్యము
అని ఆకలిదప్పులచే బాధపడుతున్న వ్యాసుడు శపించబోయిన సమయంలో ఒక బ్రాహ్మణ మందిరపు వాకిట పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో –

9. ఉ॥
వేదపురాణశాస్త్ర పదవీ నదవీయసియైన పెద్దము
త్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ య
య్యాదిమ శక్తి, సంయమివరా ! యిటు రమ్మని పిల్చె హస్తసం
జ్ఞాదరలీల రత్నఖచితాభరణంబులు ఘల్లు ఘల్లనన్

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం
“వేదపురాణశాస్త్ర పదవీ నదవీయసియైన”
వేద = వేదములకు
పురాణ = పురాణములకు
శాస్త్ర = శాస్త్రములకు, (ప్రతిపాద్యమైన)
పదవీ = జ్ఞానమునకు
నదవీయసియైన = మిక్కిలి దూరమునందు లేని
పెద్దముత్తైదువ = పెద్దకాలపునాటి పురంధ్రి

“కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ”
కాశికానగర = కాశీనగరమనెడి
హాటకపీఠ = స్వర్ణ పీఠము యొక్క
శిఖా = శిఖరమునందు
అధిరూఢ = అధిరోహించియున్న
అయ్యాదిమ శక్తి = ఆ ఆదిమశక్తి (ఆ + ఆదిమ శక్తి) (ఆ మొదటి శక్తి స్వరూపిణియైన)
హస్తసంజ్ఞాదరలీల హస్త సంజ్ఞ = చేతిసంజ్ఞయందు స్ఫురించుచున్న
ఆదర = ఆదరముతో కూడిన
లీలన్ = విలాసముతో
రత్నఖచితాభరణంబులు
రత్నఖచిత = రత్నకంకణరూపములైన
ఆభరణంబులు = నగలు
ఘల్లుఘల్లన్ = ఘల్లు ఘల్లుమనునట్లుగా
సంయమివరా = ఓ ముని శ్రేష్ఠుడా !
రమ్ము + అని = రమ్మని
ఇటు = ఇచ్చటకు
పిల్చెన్ = పిలిచింది

తాత్పర్యము
వేదపురాణ శాస్త్రాలు నిర్దేశించే జ్ఞాన స్వరూపిణి ఆ ముత్తైదువ. కాశీనగరం అనే స్వర్ణపీఠ శిఖరాన్ని అధిరోహించి ఉన్న ఆమె – చేతికి ధరించిన రత్నకంకణాలు ఘల్లు ఘల్లుమనేట్లు చెయ్యి ఊపుతూ ఓ సంయమివరా ! ఇటురా అని పిల్చింది. (ఒక్క రోజు ఆకలికే తట్టుకోలేని వాడికి నీకేం సంయమనం ఉందయ్యా ! అని వ్యంగ్యంగా అడగడానికే సంయమివరా! అని సంబోధించింది ఆ ముత్తైదువ.)

10. శా॥
ఆకంఠంబుగ నిష్ఠు మాధుకర భిక్షాన్నంబు భక్షింపఁగా
లేకున్నం గడు నంగలార్చెదవు మేలే ? లెస్స ! శాంతుండవే!
నీకంటెన్ మతిహీనులే కటకటా ! నీవార ముష్టింపచుల్
శాకాహారులుఁ గందభోజులు, శిలోంఛప్రక్రముల్ తాపసుల్ ! (A.P Mar. ’16)

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది. (T.S Mar. ’17)

ప్రతిపదార్థం

ఇప్డు = ఇప్పుడు
ఆ కంఠంబుగన్ = గొంతుదాకా
మాధుకర భిక్షాన్నంబు = మాధుకర రూపమైన భిక్షాన్నము
భక్షింపగాన్ = తినుటకు
లేకున్నన్ = లేకపోయినను
కడున్ = మిక్కిలియును
అంగలార్చెదవు = చిందులువేస్తూ అరుస్తున్నావు
మేలే = మంచిదా !
లెస్స = బాగు
శాంతుండవే = శాంతస్వభావము గలవాడవేనా!
కటకటా = అయ్యెయ్యో !
నీవారముష్టింపచుల్ = పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారును
శాకాహారులు = కాయకూరలు తినేవారును
కందభోజులు = దుంపలు మాత్రమే తినెడివారును
శిల = కోతకోసిన వరిమళ్ళలో జారిపడిన కంకులను ఏరుకొని బ్రతుకువారును
ఉచక్రముల్ = రోళ్ళవద్ద మిగిలిన బియ్యంతో జీవనం గడుపువారికంటే
తాపసుల్ = మునులు (తపస్సుచేసుకొనేవారు)
నీ కంటెన్ = నీ కన్నా
మతిహీనులే = తెలివితక్కువ వారా ?

తాత్పర్యము
ఇప్పుడు గొంతుదాకా తినడానికి భిక్ష దొరకలేదని ఇంతగా చిందులువేస్తున్నావు కదా ! ఇది నీకు మంచిదా ? బాగున్నది. నిజంగా నీవు శాంత స్వభావుడవా ? పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారు, శాకాహారంతో, దుంపలతో సరిపెట్టుకునేవాళ్ళు, కంకులు ఏరుకొని బ్రతికేవాళ్ళు, రోళ్ళవద్ద బియ్యం ఏరుకొని జీవనం సాగించే మునులు నీకంటే తెలివితక్కువ వాళ్ళ ?

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

11. తే॥గీ॥ ఓ మునీశ్వర! వినవయ్య యున్న యూరుఁ
గన్నతల్లియు నొక్క రూపన్న రీతి ?
యటు విశేషించి శివుని యర్ధాంగలక్ష్మి
కాశి; యివ్వీటిమీఁద నాగ్రహము దగునె ?

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం
ఓ మునీశ్వర(ముని + ఈశ్వరా) = ఓ మునీశ్వరుడా ! (ఓ వ్యాస మహర్షి)
ఉన్నయూరున్(ఉన్న + ఊరున్) = తానున్న ఊరును
కన్నతల్లియున్ = తన్నుకన్న తల్లియును
ఒక్కరూపన్న రీతిన్ = ఒకే మాదిరను రీతిని
వినవయ్య = నీవు వినియుండలేదా?
కాశి = కాశీపట్టణం
అటు విశేషించి = అంతకంటే విశేషించి
శివుని = పరమేశ్వరుని యొక్క
అర్ధాంగ లక్ష్మికాశి = అర్ధభాగమైన భార్య కాశి
ఇవ్వీటి మీదన్ (ఈ + వీటిమీదన్) = ఈ నగరము మీద
ఆగ్రహము = కోపము
తగునే (తగును + ఏ) = తగునా ?

తాత్పర్యము
‘ఉన్నఊరు కన్నతల్లితో సమానం’ అనే నీతి నీకు తెలియదా ? అంతకంటే విశేషించి శివుని అర్ధాంగ లక్ష్మియైన ఈ కాశీనగరి మీద నీవింత కోపం చూపించడం తగునా ? అని మందలించింది పెద్దముత్తైదువ రూపంలో ఉన్న పార్వతీదేవి.

12.వ. ఇట్టి కాశికానగరంబుమీద భిక్ష లేకుండుట కారణంబుగా
నీయంత వాడు కటకటంబడి శపియింపందలంచునే?
విశేషించి యాఁకొన్నవాఁడవు గావున నీ యవసరంబున
నిన్ను హెచ్చు గుందాడుట మము బోఁటి గృహిణులకు
మెచ్చుగాదు. మా యింటికిం గుడువ రమ్ము! కుడిచి
కూర్చున్న పిమ్మటం గొన్నిమాటలు నీతో నాడఁగలననిన
నమ్మహాసాధ్వింగని, పారాశర్యుండిట్టులనియె -.

ప్రతిపదార్థం

ఇట్టి = ఇటువంటి
కాశికానగరంబుమీది = కాశీనగరంమీద
భిక్షలేకుండుట = భిక్షలేకపోవుట
కారణంబుగా = కారణంగా
నీ + అంతవాడు = నీవంటివాడు
కటకటంబడి = కోపగించుకొని
శపియింపన్ = శపించడానికి
తలంచునే = తలంతువా ?
విశేషించి = ప్రత్యేకించి
ఆకొన్నవాడవున్ + కావున = ఆకలికొనియున్న వాడవు
నిన్నున్ = నిన్ను
హెచ్చున్ = అధికముగా
కుందాడుట = నిందించుట (నీతో తగువుపడుట)
మముబోటి = మావంటి
గృహిణులకున్ = ఇల్లాండ్రకు
మెచ్చుగాదు = మర్యాదకాదు
మా + ఇంటికిన్ = మా ఇంటికి
కుడువరమ్ము = భోజనంచేయడానికి రమ్ము
కుడిచికూర్చున్న = తిని కూర్చున్న
పిమ్మటన్ = తరువాత
కొన్నిమాటలు = కొన్ని పలుకులు (మాటలు)
నీతోన్ = నీతో
ఆడగలను = పలుకగలను
అనినన్ = అనగా
ఆ + మహాసాధ్విన్ = ఆ మహా పతివ్రతను
కని = చూచి
పారాశర్యుండు = వేదవ్యాసుడు (పరాశరుని కుమారుడు)
ఇట్లు = ఈ విధముగా
అనియె = పలికాడు

తాత్పర్యము
కేవలం భిక్షదొరకలేదని బాధపడి విశిష్టమైన కాశీనగరాన్ని నీలాంటి ఉత్తముడు శపించాలనుకుంటాడా ? చాలా ఆకలితో ఉన్నావు. కాబట్టి ఈ సమయంలో నిన్ను ఎక్కువగా బాధపెట్టడం మావంటి గృహిణులకు మంచిది కాదు. మా ఇంటికి భోజనానికిరా ! తిని కూర్చున్న తర్వాత నీతో కొన్ని మాటలు మాట్లాడుతాను’ అన్న ఆ మహాసాధ్విని చూసి, వ్యాసుడిట్లా అన్నాడు.

III

13. తే॥గీ॥ అస్తమింపగఁ జేసినాఁ డహిమకరుఁడు
శిష్యులేఁగాక యయుతంబు చిగురుబోఁడి !
వ్రతము తప్పి భుజింపంగ వలను గాదు
నేఁడు నిన్నటి మఱునాఁడు నిక్కు వంబు

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

చిగురుబోఁడి = తల్లీ (ఓ పల్లవగాత్రీ) !
‘అహిమకరుడు = సూర్యుడు
అస్తమింపగన్ = అస్తమించడానికి
చేసినాడు = సమీపించినాడు
ఏగాక = నేనుగాకుండా
శిష్యులు = శిష్యులు
అయుతంబు = పదివేలమంది ఉన్నారు
వ్రతము తప్పి = నియమాన్ని తప్పి
భుజింపగన్ = తినడానికి
వలనుకాదు = యుక్తముకాదు (సరికాదు)
నేడున్ = నేడుకూడా
నిన్నటిమఱునాడు = నిన్నటి దినమునకు మరుసటి దినమే, పస్తుండటమే ?
నిక్కంబు = సత్యము (నిజం)

తాత్పర్యము
తల్లీ ! సూర్యుడస్తమిస్తున్నాడు. నేనే కాదు, నాతోపాటు శిష్యులూ ఉన్నారు. శిష్యులతో కలిసి భుజించాలనే నా వ్రతం విడిచిపెట్టి మీ ఇంట నేనొక్కడినే భుజించలేను. ఈ రోజు నిన్నటికి మరునాడేకదా ! (అంటే నిన్నటిలాగే ఈ రోజు కూడా ఉపవాసం తప్పదని అంతరార్థం).

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

14. చ॥
అనవుడు నల్ల నవ్వి కమలానన యిట్లను, లెస్సగాక, యో
మునివర ! నీవు శిష్యగణముంగొని చయ్యన రమ్ము విశ్వనా
థుని కృప పేర్మి నెందఱతిథుల్ చనుదెంచినఁ గామధేనువుం
బనిగొనునట్లు పెట్టుదు నపారములైన యభీప్సితాన్నముల్ (A.P June’15)

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

అనవుడున్ = వేదవ్యాసుడు ఈ విధంగా
అల్ల = కొంచెం
నవ్వి = నవ్వి
కమలాన = కమలమువంటి ముఖముగల ఆ ముత్తైదువ
ఇట్లనున్ = ఈ విధముగా పలికింది
లెస్సగాక = మేలగునుగాక !
ఓ మునివర = ఓ మునీశ్వరుడా !
నీవు = నీవు
శిష్యగణం ముంగొని = శిష్య సమూహముతో కలిసి
చయ్యన = వెంటనే (వేగముగా)
రమ్ము = రావలసినది
విశ్వనాథుని = విశ్వనాథుని యొక్క
కృప పేర్మిన్ = అతిశయమైన దయతో
ఎందఱు = ఎంతమంది
అతిథులు = అతిథులు
చనుదెంచినన్ కామధేనువుంబని = వచ్చినప్పటికీ
గొనునట్లు = కామధేనువును కల్గియున్నట్లు
అపారములైన (అభీప్సితాన్నముల్) = అంతులేని
అభీప్సిత = కోరినటువంటి
అన్నముల్ = భోజనములను
పెట్టుదున్ = పెడతాను

తాత్పర్యము
అని వేదవ్యాసుడు పల్కగా కొంచెం నవ్వి పద్మముఖియైన ఆ ఇల్లాలు సరేలే ! మునీంద్రా ! విశ్వనాథుని దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా కామధేనువు వలె కోరిన పదార్థాలన్నీ అనంతంగా నేను ఏర్పాటు చేయగలను. నీ శిష్యగణాన్ని తీసుకొని వెంటనే రా ! అన్నది.

15. వ॥ అనిన నట్లకాక మహాప్రసాదంబని వేదవ్యాసుండు
శిష్యులంగూర్చుకొని భాగీరథికిం జని యుపస్పర్శం
బాచరించి యేతెంచిన –

ప్రతిపదార్థం

అనినన్ = అని పలుకగా
అట్లాకాక = అట్లేయగునుగాక
మహాప్రసాదంబు = గొప్పదైన అనుగ్రహము
అని = అని
వేదవ్యాసుండు = వేదవ్యాసుడు
శిష్యులన్ = శిష్యులను
కూర్చుకొని = కలుపుకొని (తనవెంట పెట్టుకొని)
భాగీరథికిన్ = గంగానదికి
చని = వెళ్ళి
ఉపస్పర్శంబు = స్నానము, ఆచమనమును
ఆచరించి = చేసి
ఏతెంచినన్ = రాగా

తాత్పర్యం
అనగా, ‘సరే, మహాప్రసాదం’ అని, వేద వ్యాసుడు శిష్యులను తీసుకొని గంగానదికి వెళ్ళి, స్నాన, ఆచమనాదులు పూర్తి గావించుకొని రాగా.

16. తే॥గీ॥ గొడుగు పాగల గిలకలు గులకరింప
నిందుబింబాస్య యెదురుగా నేగుదెంచి
ఛాత్రసహితంబుగాఁ బరాశరతనూజు
బంతి సాగించె భుక్తి శాలాంతరమున

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

గొడుగు పాగల = గొడుగు, పావుకోళ్ళయొక్క
గిలకలు = గిలకలు
గులకరింపన్ = మ్రోగుతుండగా
ఇందుబింబాస్య = చంద్రబింబానమైన ఆ ఇల్లాలు
ఎదురుగాన్ = వ్యాసునకు ఎదురుగా
ఏగుదెంచి = వచ్చి (మునీశ్వరునకు ఎదురేగి)
ఛాత్రసహితంబుగాన్ = శిష్యసమేతముగా
పరాశరతనూజుబంతి = పరాశరనందనుడైన వ్యాసుడు కూర్చున్న పంక్తిని
భుక్తిశాల + అంతరమునన్ = భోజనశాల లోపల
సాగించెన్ = వడ్డన సాగించెను

తాత్పర్యము
గొడుగు, పావుకోళ్ళ (గొడుగు ఆకారంలోని బుడిపెలున్న పావుకోళ్ళు) గిలకలు మోగుతుండగా చంద్రముఖియైన ఆ ఇల్లాలు వారికి ఎదురెళ్ళి ఆహ్వానించింది. శిష్యులతో వ్యాసుడు భోజనశాలలో కూర్చున్నాడు. అప్పుడామె పంక్తికి వడ్డన సాగించింది.

పాఠం నేపథ్యం / ఉద్దేశం

వేదవిభజన చేసి, పంచమవేదంగా మహాభారతాన్ని రచించి, అష్టాదశ (18) పురాణాలను రచించిన బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు. పరమపవిత్రము, పరమేశ్వరునికి ప్రీతిపాత్రం అయిన కాశిలో వ్యాసుడు తన పదివేలమంది శిష్యులతో కొంతకాలం నివసించాడు. బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి, ప్రాతర్మాధ్యాహ్నిక విధులను పూర్తిగావించి, శిష్యులతో కాశీ నగరంలో భిక్షాటనం చేసేవాడు. శిష్యులు, తాను వేర్వేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథి అభ్యాగతులకు సమర్పించి, మిగిలినది భుజించేవారు. ఒకరోజు కాశీ విశ్వనాథునికి వ్యాసుడిని పరీక్షించాలన్న సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగిన సంఘటనే ఈ పాఠం.

ఆకలి ఎంతటి వారినైనా విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఇది మంచిది కాదని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠ్యాంశం కావ్యప్రక్రియకు చెందింది. కావ్యం e వర్ణనా ప్రధానమైనది. ఇది శ్రీనాథ కవిసార్వభౌముడు రచించిన ‘కాశీఖండము’ సప్తమాశ్వాసం లోనిది.

కవి పరిచయం

కవి : శ్రీనాథుడు
కాలం : 1380 – 1470
తల్లిదండ్రులు : భీమాంబ, మారయ
మూలగ్రంథం: కాశీఖండం – సప్తమాశ్వాసం

రచనలు :

  1. మరుత్తరాట్చరిత్ర
  2. శాలివాహన సప్తశతి
  3. పండితారాధ్య చరిత్ర
  4. శృంగారనైషధం
  5. భీమఖండం
  6. కాశీఖండం
  7. హర విలాసం,
  8. ధనంజయవిజయం
  9. క్రీడాభిరామం
  10. శివరాత్రిమాహాత్మ్యం
  11. పల్నాటి వీరచరిత్ర
  12. నందనందన చరిత్రలు

బిరుదు : కవిసార్వభౌముడు

విశేషాంశాలు : శ్రీనాథుడు రెడ్డి రాజుల ఆస్థానకవిగా ఉన్నాడు. పెదకోమటి వేమారెడ్డి కాలంలో విద్యాధికారిగా ఉన్నాడు. సుమారు ఇరవై సంవత్సరాలు రాజా శ్రయం పొందాడు. ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడడిండిమభట్టు యొక్క కంచుఢక్కను పగులగొట్టాడు. కనకా భిషేక గౌరవాన్ని పొందాడు.

శైలి – రచనా విధానం: ఉద్దండ లీల, ఉభయ వాక్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి శ్రీనాథుని కవితా లక్షణాలు. శ్రీనాథుని కవితావైశిష్ట్యానికి అతని సీసపద్య రచనా వైభవం ఒక నిదర్శనం. శ్రీనాథుడు శివ భక్తుడు. శివార్చన కళాశీలుడు. తెలుగు కవులలో విశిష్ట కవి శ్రీనాథుడు.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ప్రవేశిక

ఈనాడు ‘భిక్ష’ అనే మాట కేవలం ‘అడుక్కుతినడం’ అనే అల్పార్థానికి పరిమితమైంది కాని, ఒకప్పుడు ‘భిక్ష’ అనేది పరమపవిత్రమైన వ్రతం. శివుడు ఆదిభిక్షువుగా ప్రసిద్ధి. గురువులు శిష్యులకు ‘జ్ఞానభిక్ష’ పెట్టేవాళ్ళు. బుద్ధుడు భిక్షాధర్మంతోనే జీవనం సాగించేవాడు; బౌద్దులందరికీ అదే జీవనసూత్రంగా ఉండేది. గురుకులంలో చదువుకునే రాజకుమారులైనా భిక్షాటనంతో విద్యార్థిజీవనం గడిపేవారు.

భిక్షపెట్టేవాళ్ళు కూడా అది మహాపుణ్యకార్యంగా భావించి, తమ ఇంటికి వచ్చిన వారికి నమస్కరించి, పూజించి, భిక్ష సమర్పించేవాళ్ళు. భిక్షా ధర్మంతో చరించిన వేదవ్యాసమహర్షి కాశీనగరంలో పొందిన అనుభవమేమిటో ఈ పాఠం చదివి తెలుసుకోండి.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసు కోండి.

ముఖ్య పదాలు – అర్థాలు

అపూప = పిండివంటలు
అభిఘరించు = చల్లు
అర్ధాంగలక్ష్మి = శరీరంలో సగభాగమైన లక్ష్మి
ఆగ్రహం = కోపం
ఈప్సిత = కోరిక
బీటెండ = అధికమైన ఎండ
ద్వాఃకవాటము = ద్వారబంధము
భుక్తిశాల = భోజనశాల
మతిహీనులు = మతిలేనివారు
మచ్చెకంటి = చేపకనులుగల స్త్రీ
సాన్నిధ్యము = సమీపము
క్షుత్పిపాసులు = ఆకలి, దప్పిక బాధతో కూడినవారు
గోమయము = ఆవుపేడ
ప్రక్షాళితం = కడుగబడిన
పసిడి = బంగారం
ముక్కంటి = శివుడు
మోక్షలక్ష్మి = మోక్షము అనెడి లక్ష్మి
పారాశర్యుడు = వేదవ్యాసుడు
కటకటపడు = బాధపడు
సూడిగములు = గాజులు
బ్రాహ్మణాంగనలు = బ్రాహ్మణ స్త్రీలు
లెస్స = మేలు
కుందాడుట = బాధపెట్టునట్లు మాట్లాడు
భాగీరథి = గంగానది
బింబాస్య = చంద్రబింబము వంటి ముఖముకలది
ఆరగించుట = తినుట

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ప్రక్రియ – కావ్యం (ప్రాచీన పద్యం)

ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ప్రబంధం ఒకటి. పురాణ, ఇతిహాసాలనుండి ఒక చిన్న కథను తీసుకొని, దానిని అనేకములైన వర్ణనలతోను, కల్పనల తోను, పెంచి పెద్దచేసి వర్ణించే గ్రంథాన్ని ‘ప్రబంధం’ అని అంటారు. ఇందులో వర్ణనలకు ప్రాధాన్యం ఉంటుంది. శృంగార రసానికి ప్రాధాన్యం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇతర రసాలు కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. మనుచరిత్ర, వసుచరిత్ర మొదలైనవాటిని ప్రబంధాలుగా పేర్కొనవచ్చు.

పాఠ్యభాగ సారాంశము

వేదవ్యాసుడు ఒకరోజు కాశీనగరంలో శిష్యులతో మధ్యాహ్న సమయంలో భిక్ష కోసం బ్రాహ్మణ వీధులలో ఇంటింటికీ తిరిగాడు. ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. కాశీ నగరంలోని బ్రాహ్మణ స్త్రీలు రోజూ అతిథులకు మధూకర భిక్ష పెడుతూ ఉంటారు. కాని ఆనాడు వ్యాసుడికి భిక్ష పెట్టలేదు.

ఆ రోజుకు ఉపవాసం ఉందామని, మరునాడు పారణకు భిక్ష దొరకకపోదని వ్యాసుడు నిశ్చయించాడు. మరుసటి రోజున వ్యాసుడు తిరిగి శిష్యులతో భిక్షాటనకు వెళ్ళాడు. ఈశ్వరుడి మాయవల్ల ఆ రోజు కూడా ఆయనకు ఎవ్వరూ భిక్ష పెట్టలేదు. వ్యాసుడు కోపంతో తన భిక్షాపాత్రను వీధి మధ్యలో పగులగొట్టి, కాశీ వాసులకు మూడు తరాల దాకా ధనం, మోక్షం, విద్య లేకుండా పోవాలి అని శపించ డానికి సిద్ధమయ్యాడు.

అప్పుడు పార్వతీదేవి ఒక బ్రాహ్మణ మధూభవనం వాకిట్లో సామాన్య స్త్రీ వలె కనబడి, వ్యాసుని రమ్మని పిలిచి ఇలా మందలించింది. “ఓ మహర్షీ ! నీవు గొంతు దాకా తినడానికి మధూకర భిక్ష దొరకలేదని గంతులు వేస్తున్నావు. నివ్వరి బియ్యం తినేవారు, శాకాహారులూ, కందభోజులూ, ఉంఛవృత్తితో జీవించేవారూ అయిన మునీశ్వరులు నీ కంటే తెలివితక్కువ వారు కాదు. ఉన్న ఊరు, కన్నతల్లితో సమానం అంటారు. అదీకాక ‘కాశీ’, ఈశ్వరుడి భార్య. భిక్ష దొరక లేదని నీవు కాశీ నగరాన్ని శపించడం తగదు.

నీవు ఆకలితో ఉన్నావు. మావంటి గృహిణులు నిన్ను ఇలా నిందించడం మంచిది కాదు. మా ఇంటికి భోజనానికి రా, భోజనం చేసిన తరువాత నీతో మాట్లాడవలసిన మాటలు ఉన్నాయి”.

పార్వతీదేవి మాటలు విని, వ్యాసుడు ఆమెతో “అమ్మా! సూర్యుడు అస్తమిస్తున్నాడు. నాకు పదివేలమంది శిష్యులు ఉన్నారు. వారు తినకుండా నేను తిననని నాకు వ్రతం ఉంది. నిన్నటిలాగే ఈ రోజు కూడా పస్తు ఉంటాం” అన్నాడు.

అప్పుడు పార్వతీదేవి చిరునవ్వు నవ్వి “మునీశ్వరా ! నీవు శిష్యులను కూడా వెంటబెట్టుకొని తొందరగా రా. ఈశ్వరుడి దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా, అందరికీ కోరిన అన్నం పెడతాను” అంది.

వ్యాసుడు సరేనని గంగలో స్నానం చేసి, శిష్యులతో వచ్చాడు. పార్వతీదేవి వారికి స్వాగతం చెప్పి, వారందరికీ భోజనశాలలో బంతివేసి వడ్డించింది.

Leave a Comment