Telangana SCERT 10th Class Telugu Grammar Telangana Alankaralu అలంకారాలు Questions and Answers.
TS 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు
1. శబ్దాలంకారాలు
1. వృత్త్యనుప్రాసాలంకారం :
లక్షణం :ఒకటిగాని, అంతకంటే ఎక్కువగాని హల్లులు అనేకసార్లు వచ్చునట్లు చెబితే దాన్ని వృత్త్యను ప్రాసాలంకారం’ అని అంటారు.
ఉదాహరణ : వీరు పొమ్మను వారు గారు పొగబెట్టు వారు.
సమన్వయం : పై ఉదాహరణ వాక్యంలో ‘ర’ కారం పలుమార్లు వచ్చింది. అందువల్ల ఇది వృత్త్యనుప్రాసా లంకారం.
2. ఛేకానుప్రాసాలంకారం :
లక్షణం :
అర్థభేదంతో కూడిన హల్లుల జంట అవ్యవధానంగా (వెంట వెంటనే) వస్తే ఛేకాను ప్రాసాలంకారం అని అంటారు.
ఉదాహరణ :
అనాథ నాథ నంద నందన నీకు వందనం.
సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో ‘నాథ’ ‘నంద’ అనే హల్లుల జంట అర్థభేదంతో వెంట వెంటనే వచ్చాయి. అందువల్ల ఇది ఛేకాను ప్రాసాలంకారం.
3. లాటానుప్రాసాలంకారం :
లక్షణం :
అర్థభేదం లేకున్నా తాత్పర్య భేదముతో ఒకే పదం మరల మరల వచ్చునట్లు ప్రయోగించ బడితే దాన్ని ‘లాటాను ప్రాసాలంకారం’ అని అంటారు.
ఉదాహరణ :
కమలాక్షు నర్చించు కరములు కరములు.
సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో ‘కరములు’ అనే పదం రెండు మార్లు ప్రయోగింపబడింది. రెండు మార్లు అర్థంలో తేడా లేదు. ‘కరములు’ అనగా చేతులు. కానీ రెండవసారి ప్రయోగింపబడిన ‘కరములు’ అనే పదానికి ధన్యములైన చేతులని తాత్పర్య భేదం ఉంది.
అ) హరి భజియించు హస్తములు హస్తములు ……….. (చేతులే, నిజమైనచేతులు)
ఆ) చిత్తశుద్ధితో జేసెడి సేవ సేవ. (సేవయే నిజమైన సేవ)
పై రెండు సందర్భాల్లోను ఒకే పదం అర్థంలో తేడా లేకున్నా భావంలో తేడా ఉండేటట్లు ప్రయోగించారు. ఈ విధంగా ఒకే పదాన్ని, అర్థం ఒకటే అయినా తాత్పర్య భేదంతో ప్రయోగించ డాన్ని ‘లాటానుప్రాసాలంకారం’ అంటారు.
4. యమకాలంకారం :
లక్షణం :
అచ్చులలో హల్లులో మార్పులేనట్టి అక్షరాల సమూహం అర్థభేదంతో మరల మరల ప్రయోగింపబడితే దాన్ని ‘యమకాలంకారం’ అని అంటారు.
ఉదాహరణ 1 :
పురము నందు నందిపురమునందు.
సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో ‘పురము’ అనే అక్షర సమూహం అర్థభేదంతో మరల మరల ప్రయోగింపబడింది. అందువల్ల దీనిని ‘యమకాలంకారం’ అని అంటారు.
ఉదాహరణ 2 :
లేమా ! దనుజుల గెలువఁగలేమా
(లేమ = స్త్రీ; గెలువగలేమా = గెలువడానికి మేమిక్కడ లేమా (ఉన్నాం కదా !)
ఉదాహరణ 3 :
ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది.
(తోరణం = ద్వారానికి కట్టే అలంకారం; రణం = యుద్ధం)
పై రెండు సందర్భాలల్లోను ఒకే పదం అర్థభేదంతో ప్రయోగించడం జరిగింది. దీనినే ‘యమకాలంకారం’ అంటారు.
5. అనుప్రాసాలంకారం :
లక్షణం :
ఒకటిగాని, అంతకంటే ఎక్కువ వర్గాలు గాని, ఒకటి కంటే ఎక్కువసార్లు ఆవృత్తం అయినట్లైతే దాన్ని ‘అనుప్రాసాలంకారం’ అని అంటారు.
ఉదాహరణ :
అక్క ముక్కుకు చక్కని ముక్కర.
సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో ‘క్క’ అనే అక్షరం పలుమార్లు ఆవృత్తం అయింది. అందువల్ల దీన్ని ‘అనుప్రాసాలంకారం’ అని అంటారు.
6. అంత్యానుప్రాసాలంకారం :
లక్షణం :
ప్రాస పాదం చివర ఒక అక్షరంగాని, అక్షర సముదాయంగాని ఉండేటట్లు రచన చేయడాన్ని ‘అంత్యాను ప్రాసం’ అని అంటారు.
ఉదా 1 :
నగారా మోగిందా
నయాగరా దుమికిందా
ఇది అంత్యానుప్రాసాలంకారానికి చెందినది. ఇందులో ‘దా’ అనే హల్లు రెండు పదాల్లోను అంత్యంలో ప్రయోగించబడింది.
అందువల్ల ఇది అంత్యానుప్రాసాలంకారం.
ఉదా 2:
రంగదరాతిభంగ; ఖగరాజతురంగ; విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ; పరితోషితరంగ;
దయాంతరంగ; స
త్సంగ; ధరాత్మజా హృదయ సారస భృంగ;
నిశాచరాబ్జ మా
తంగ; శుభాంగ ! ……………
ఇందులో అంత్యానుప్రాసాలంకారం ఉంది. ఇక్కడ అంత్యప్రాసగా ‘గ’ అనే ఒకే హల్లు, రంగ అనే హల్లుల జంట వాడబడినాయి. అందువల్ల ఇక్కడ అంత్యానుప్రాసాలంకారం ఉంది.
ఉదా 3 :
కొందరికి రెండుకాళ్ళు
రిక్షావాళ్ళకి మూడుకాళ్ళు
ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు
ఇక్కడ అంత్యానుప్రాసాలంకారం ఉంది. ఈ ఉదాహరణ లోని పాదాల్లో చివరగా ‘కాళ్ళు’ అనే హల్లుల జంట అంత్యప్రాసగా వాడబడింది. అందువల్ల ఇక్కడ అంత్యాను ప్రాసాలంకారం ఉంది.
ఉదా 4 :
“అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు.
తర్వాత అన్ని కులాల వారిని ఆడవచ్చన్నారు”
పై ఉదాహరణ యందు మొదటి వాక్యంలో చివరనున్న ‘ఆడవద్దన్నారు’ అనే పదం రెండవ వాక్యం చివర కూడా వస్తుంది. అందువల్ల అక్కడ అంత్యానుప్రాసాలంకారం ఉంది.
2. అర్థాలంకారాలు
1. ఉపమాలంకారం :
లక్షణం :
ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన పోలిక వర్గింపబడినట్టైతే దానిని ‘ఉపమాలంకాలరం’ అని అంటారు.
ఉదాహరణ 1 :
ఓ కృష్ణా ! నీ కీర్తి హంసలాగా ఆకాశ గంగలో మునుగుతూ ఉంది.
సమన్వయం :
ఉపమేయం – కీర్తి, ఉపమానం – హంస, ఉపమానవాచకంలాగా, ఈ పై ఉదాహరణ వాక్యంలో కీర్తి హంసతో మనోహరంగా పోల్చ బడింది. అందువల్ల దీన్ని ‘ఉపమాలంకారం’ అని అంటారు.
ఉదాహరణ 2:
కుముదినీరాగ రసబద్ధ గుళికయనగఁ
జంద్రుఁడుదయించెఁ గాంతి నిస్తంద్రుఁడగుచు.
పై ఉదాహరణయందు చంద్రోదయాన్ని రసమణి తోను, ఔషధపు ముద్దతోను పోల్చాడు. అందువల్ల ఇక్కడ ఉపమాలంకారం ఉంది.
ఉదాహరణ 3:
శ్రీమంత్ చొక్కా మల్లెపూవులా తెల్లగా ఉంది.
ఇందులో ఉపమాలంకారం ఉంది. ఈ వాక్యంలో
చొక్కా – ఉపమేయం
మల్లెపూవు – ఉపమానం
సమానధర్మం – తెల్లగా ఉండటం
ఉపమా వాచకం -లాగా
ఇక్కడ ఉపమాన ఉపమేయాలకు చక్కనిపోలిక వర్ణించి చెప్పడం జరిగింది. అందువల్ల ఇందులో ఉపమాలంకారం ఉంది.
2. రూపకాలంకారం :
లక్షణం :
1. ఉపమానానికి, ఉపమేయానికి భేదం లేనట్లు వర్ణించి చెప్పినట్లైతే దాన్ని ‘రూపకాలంకారం’ అని అంటారు.
(లేదా)
2. ఉపమేయమందు ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పినట్లైతే దాన్ని ‘రూపకాలంకారం’ అని అంటారు.
ఉదాహరణ 1:
లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి.
వివరణ :
పై ఉదాహరణ వాక్యంలో లతాలలనలు అంటే ‘తీగలు అనే స్త్రీలు’ అని అర్థం. ఇక్కడ తీగలకూ, స్త్రీలకూ భేదం లేనట్లు చెప్పబడింది. అదే విధంగా “కుసుమాక్షతలు” అన్నప్పుడు కూడా పూలకూ, అక్షతలకూ భేదం లేనట్లు చెప్పబడింది. అందువల్ల దీన్ని “రూపకాలంకారం” అని అంటారు.
ఉదాహరణ 2 :
సంసార సాగరాన్ని భరించటం మిక్కిలి కష్టం.
సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో ఉపమేయ మైన సంసారమందు ఉపమానమైన సాగర ధర్మం ఆరోపించబడింది. అందువల్ల దీన్ని “రూపకా లంకారం” అని అంటారు.
ఉదాహరణ 3 :
ఓ రాజాఁ నీ యశశ్చంద్రికలు దిగంతాలకు వ్యాపించాయి.
ఇది రూపకాలంకారానికి చెందినది.
సమన్వయం :
ఇందులో యశస్సు – ఉపమేయం, చంద్రిక – ఉపమానం. ఈ పై ఉదాహరణ యందు ఉపమేయమైన యశస్సునందు ఉపమానమైన చంద్రికల ధర్మాన్ని ఆరోపించడం జరిగింది. అందు వల్ల ఇది రూపకాలంకారం.
ఉదాహరణ 4:
అజ్ఞానాంధకారంలో కూర్చోకుండా విజ్ఞాన వీధుల్లో విహరించాలి.
ఇది రూపకాలంకారమునకు చెందినది.
సమన్వయం :
పై ఉదాహరణయందు అజ్ఞానము – ఉపమేయము, అంధకారము – ఉపమానము. ఇక్కడ ఉపమేయమైన అజ్ఞానమునందు ఉపమాన మైన అంధకార ధర్మం ఆరోపించబడింది. అందువల్ల ఇది రూపకాలంకారం.
3. ఉత్ప్రేక్షాలంకారం :
లక్షణం :
ఉపమాన ధర్మసామ్యంచేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే దాన్ని ‘ఉత్ప్రేక్షాలం కారం’ అని అంటారు.
ఉదాహరణ :
ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లుంది.
సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో వెన్నెల, పాలవెల్లి (పాల సముద్రం)గా ఊహించబడింది. దీన్ని ‘ఉత్ప్రేక్షాలం కారం’ అని అంటారు.
4. అర్థాంతరన్యాసాలంకారం :
లక్షణం:
విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంచేత గాని, సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంచేత గాని సమర్థించి చెప్పినట్లయితే దాన్ని ‘అర్థాంతరన్యాసా లంకారం’ అని అంటారు.
ఉదాహరణ :
హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. మహాత్ములకు సాధ్యము కానిదేమున్నది?
సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో మొదటి వాక్యం విశేష వాక్యం. రెండవది సామాన్య వాక్యం. ఇక్కడ విశేషం సామాన్యం చేత సమర్థించడం జరిగింది. అందువల్ల దీన్ని ‘అర్థాంతరన్యాసా లంకారం’ అని అంటారు.
5. దృష్టాంతాలంకారం :
లక్షణం :
ఉపమాన, ఉపమేయ వాక్యాల యొక్క వేరు వేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో వర్ణించి చెప్పినట్లయితే దాన్ని ‘దృష్టాంతాలంకారం’ అని అంటారు.
ఉదాహరణ :
ఓ రాజా ! నీవే కీర్తిమంతుడవు. చంద్రుడే కాంతిమంతుడు.
సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో రాజు ఉపమేయం. చంద్రుడు ఉపమానం. ఉపమేయమైన రాజు యొక్క ధర్మం కీర్తి, ఉపమానమైన చంద్రుని యొక్క ధర్మం కాంతి. కీర్తి, కాంతి అనే రెండు భిన్న ధర్మాలు కలిగి ఉన్నాయి. దిక్కుల చివరి దాకా వ్యాపించి ఉండటం వీని సమానధర్మం. ఈ రెండు బింబ, ప్రతిబింబ భావంతో వర్ణించబడ్డాయి. కాబట్టి దీన్ని “దృష్టాంతాలంకారం” అని అంటారు.
6. అతిశయోక్త్యలంకారం :
లక్షణం :
ఒక వస్తువు గురించి గాని, ఒక సందర్భాన్ని గురించి గాని, ఉన్నదానికంటే ఎక్కువగా చేసి చెప్పినట్లయితే దాన్ని ‘అతిశయోక్త్యలంకారం’ అని అంటారు.
ఉదాహరణ 1:
నగరంలోని భవనాలు నక్షత్రాలను తాకుతున్నాయి.
సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో నగరంలోని మేడలు మిక్కిలి ఎత్తయినవి అని చెప్పడానికి బదులుగా నక్షత్రాలను తాకుచున్నాయని ఎక్కువగా చేసి చెప్పడం జరిగింది. అందువల్ల దీన్ని ‘అతిశ యోక్త్యలంకారం’ అని అంటారు.
ఉదాహరణ 2:
- మా చెల్లెలు తాటిచెట్టంత పొడవుంది.
- దేవాలయ గోపురాలు ఆకాశానికంటుతున్నాయి.
పై వాక్యాల్లో చెల్లె ఎత్తును, గోపురాల ఎత్తులను ఉన్న ఎత్తు కంటే ఎక్కువచేసి చెప్పడం జరిగింది కదా! అంటే అతిశయంగా చెప్పడం అన్నమాట. ఇలా చెప్పటాన్ని అతిశయోక్తి అంటారు.
ఉదాహరణ 3 :
కం. చుక్కలు తల పూవులుగా
అక్కజముగ మేనుపెంచి యంబర వీధిన్ వెక్కసమై చూపట్టిన
అక్కోమలి ముదము నొందె ఆత్మస్థితిలోన్.
ఇక్కడ చుక్కలను తల పూలుగా చేసుకొని, ఆకాశమంత ఎత్తు పెరిగాడని, హనుమంతుడిని గూర్చి ఎక్కువగాచేసి చెప్పడం జరిగింది. అందువల్ల ఇక్కడ అతిశయోక్తి అలంకారం ఉన్నది.
ఉదాహరణ 4:
మా పొలంలో బంగారం పండింది. సాధారణంగా పొలంలో పంట పండుతుంది. కాని బాగా పంట పండిందనే విషయాన్ని తెలియ జేయడానికి బంగారం పండిందని ఎక్కువగా చేసి చెప్పడం జరిగింది. అందువల్ల ఇక్కడ అతిశయోక్తి అలంకారం ఉన్నది.
7. శ్లేషాలంకారం :
లక్షణం : అనేకమైన అర్థాలు గల శబ్దాలను ఉపయోగించి చెబితే దాన్ని “శ్లేషాలంకారం” అని అంటారు.
ఉదాహరణ 1:
రాజు కువలయానందకరుడు.
సమన్వయం : రాజు = ప్రభువు, చంద్రుడు;
కువలయం భూమి, కలువపూవు
- ప్రభువు భూమికి ఆనందాన్ని కలిగిస్తాడు.
- చంద్రుడు కలువపూలకు ఆనందాన్ని ఇస్తాడు.
ఇక్కడ రెండు అర్థములు వచ్చునట్లుగా చెప్పబడింది. అందువల్ల దీన్ని ‘శ్లేషాలంకారం’ అని అంటారు.
ఉదాహరణ 2 :
మిమ్ము మాధవుడు రక్షించుగాక ! అర్థం :
- మిమ్ము మాధవుడు (విష్ణువు) రక్షించుగాక !
- మిమ్ము ఉమాధవుడు (శివుడు) రక్షించుగాక !
ఉదాహరణ 3 :
మానవ జీవనం సుకుమారం. అర్థం :
- మానవ (ఆధునిక) జీవితం సుకుమారమైనది.
- మానవ (మనిషి) జీవితం సుకుమారమైనది.
పై అర్థాలను గమనించారు కదా ! ఒకే శబ్దం రెండు వేర్వేరు అర్థాలనందిస్తున్నది. అంటే విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉన్నాయి. ఇలా ఉంటే వాటిని ‘శ్లేషాలంకారం’ అని అంటారు.
ఉదాహరణ 4 :
నీవేల వచ్చెదవు
పై ఉదాహరణలో రెండు అర్థాలు స్ఫురిస్తున్నాయి.
- నీవు ఏల వచ్చెదవు ? (నీవు + ఏల)
- నీవేల (ఏ సమయంలో ? వచ్చెదవు)
ఈ అర్థాలను వాక్యంలో వ్రాస్తే, క్రింది విధంగా ఉంటాయి.
- నీవు ఏల వచ్చెదవు ?
- నీవు ఏ సమయంలో వచ్చెదవు ?
ఇట్లా ఒకే వాక్యంలో రెండు కానీ అంతకుమించి అర్థాలను కానీ కూర్చడమే శ్లేషాలంకారం.
8. స్వభావోక్త్యలంకారం :
లక్షణం :
జాతి, గుణ, క్రియాదులలోని స్వభావమును ఉన్నది ఉన్నట్లు మనోహరంగా వర్ణింపబడినచో దాన్ని ‘స్వభావోక్త్య లంకారం’ అని అంటారు.
ఉదాహరణ :
అడవిలోని లేళ్ళు చెవులు నిక్కబొడుచు కొని చెంగుచెంగున గంతులేస్తూ బిత్తరచూపులతో పరుగెత్తు చున్నాయి.
సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో లేళ్ళ స్థితిని ఉన్నది ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించబడింది. అందువల్ల దీన్ని స్వభావోక్త్యలంకారం అని అంటారు.
9. ముక్తపదగ్రస్త అలంకారం :
కం. మన వేటికి నూతనమా !
తన మానినిఁ బ్రేమఁ దనకుఁ దక్కితిననుమా
నను మానక దయ దనరం
దనరంతులు మాని నరసధవు రమ్మనవే.
ఒక పద్యపాదంగాని, వాక్యంగానీ ఏ పదంతో పూర్తవు తుందో అదే పదంతో తర్వాత పాదం / వాక్యం మొదలవు తున్నది. దీన్నే ముక్తపదగ్రస్త అలంకారం అంటారు.