వాఙ్మయ కిరీటి కొర్లపాటి Questions and Answers Summary Inter 2nd Year Telugu

Reviewing AP Inter 2nd Year Telugu Study Material ఉపవాచకం 3rd Lesson వాఙ్మయ కిరీటి కొర్లపాటి Questions and Answers Summary can help students prepare confidently for exams.

AP Inter 2nd Year Telugu వాఙ్మయ కిరీటి కొర్లపాటి Questions and Answers

అభ్యాసం

I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి బాల్యం, విద్యాభ్యాసం గురించి రాయండి.
జవాబు:
ప్రస్తుత పాఠ్యాంశం ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి “షష్టిపూర్తి అభినందన సంచిక (1989) నుండి గ్రహించబడింది. అధ్యయనం, అధ్యాపకత్వం, పరిశోధన కలబోసిన ఓ సాహితీమూర్తిని విద్యార్థులకు పరిచయం చేయడం ఈ పాఠ్యభాగంలోని ప్రధాన ఉద్దేశ్యం.

కొర్లపాటి శ్రీరామమూర్తిగారు 17.10.1929న తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట తాలూకా (ఆనాటి) కొర్లపాటి వారి పాలెంలో రత్నమణి, మణ్యం గార్లకు జన్మించారు. వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. స్కూలు ఫైనలు చదువుతున్నప్పుడే తండ్రిని కోల్పోయిన కొర్లపాటి శ్రీరామమూర్తిగారు కొన్నాళ్ళు వ్యవసాయం చేస్తూ కుటుంబానికి సాయపడ్డారు. శ్రీరామమూర్తి గారి తాత, తండ్రులు జ్యోతిశ్శాస్త్ర పండితులు కావడంతో కొంత కాలం కొర్లపాటి వారు కూడా జ్యోతిష్యం చదువుకున్నారు. కాలం కాస్త కలిసి వచ్చాక కాకినాడలోని పిఠాపురం మహారాజా వారి కళాశాలలో చేరి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. భీమవరంలోని దంతులూరి నారాయణరాజు కళాశాలలో చేరి బి.ఎ. డిగ్రీ పూర్తి చేశారు.

ఈ సందర్భంగా సర్వశ్రీ దర్భా సర్వేశ్వర శాస్త్రి, దిగుమర్తి సీతారామస్వామి, నండూరి రామకృష్ణమాచార్యులు వంటి మహామహులు, విద్వాంసుల వద్ద కావ్య పాఠాలు నేర్చుకునే అవకాశం కలిగింది. 1953 నాటికి బి.ఎ.లో సర్వ ప్రథములుగా ఉత్తీర్ణులై బంగారు పతకం సాధించారు. ఆ తర్వాత విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వ విద్యాలయంలో తెలుగు ఎమ్.ఎ (ఆనర్స్)లో చేరారు. 1955-57 విద్యార్థి బృందంలో మొదటి ర్యాంక్ సాధించి, స్వర్ణపతకం పొందారు.

1965లో “శ్రీనాథుడు – సాహిత్యం” అనే అంశం మీద పిహెచ్.డి పూర్తి చేసి డాక్టరేట్ పొందారు. 1976లో “శ్రీనాథుడు – ఈశ్వరార్చన కళాశీలుడు” అనే సిద్ధాంత గ్రంథం వ్రాశారు. ఈ పరిశోధనా గ్రంథం శ్రీనాథ మహాకవి యొక్క అశేషశేముషీ వైభవాన్ని లోకం ముందు ఆవిష్కరించింది. పండితోత్తముల ఆమోదం పొందింది. ఈ గ్రంథమే కొర్లపాటి వారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో మొట్టమొదటి డి.లిట్. పట్టాను అందించింది. ఈ విధంగా కొర్లపాటి వారి బాల్యం, విద్యాభ్యాసం చక్కగా సాగింది.

ప్రశ్న 2.
ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి వ్యక్తిత్వం, సాహిత్య కృషిని వివరించండి.
జవాబు: ఈ పాఠ్యాంశం ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి “షష్టిపూర్తి అభినందన సంచిక” (1989) నుండి గ్రహించబడింది. పరిశోధన కోసం, తెలుగు సాహిత్య చరిత్రలో అపరిష్కృతంగా ఉన్న చిక్కుముడులు విప్పడం కోసం జీవితాన్ని అంకితం చేసిన శ్రీ కొర్లపాటి మనకు ప్రాతఃస్మరణీయులు. శ్రీనాథ సాహిత్యంపై ఆయన చేసిన కృషి వేనోళ్ళ పొగడదగినది. అధ్యయనం, అధ్యాపకత్వం, పరిశోధన కలబోసిన సాహితీమూర్తి శ్రీకొర్లపాటి.

వ్యక్తిత్వం : చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన కొర్లపాటి ఏమాత్రం అధైర్యపడక కొన్నాళ్ళు వ్యవసాయం చేస్తూ కుటుంబానికి సాయపడ్డాడు. చదువుపట్ల ఉన్న ఆసక్తితో తాత, తండ్రుల వారసత్వంగా వచ్చిన జ్యోతిశ్శాస్త్రాన్ని అధ్యయనం చేశారు కొర్లపాటి. స్వయంకృషి, గురువుల ఆశీస్సుల కల కొర్లపాటి సర్వశ్రీ దర్భా సర్వేశ్వర శాస్త్రి, దిగుమర్తి సీతారామస్వామి, నండూరి రామకృష్ణమా చార్యుల వంటి మహామహులు, విద్వాంసుల పరిచయ భాగ్యంతో కావ్య పాఠాలు నేర్చుకున్నారు. తాను చదువుకున్న డి.ఎన్.ఆర్ కళాశాలలో తెలుగు ట్యూంటర్గా పనిచేస్తూ విద్యార్థులకు పాఠాలు బాగా చెబుతుండడం, మంచి నడవడికతో హుందాగా వ్యవహరించే శ్రీరామమూర్తికి కొద్ది కాలంలోనే మంచి పేరు వచ్చింది. చిన్నా, చితకా ఉద్యోగాలు చేసుకుంటూ, రోజు గ్రంథాల యాలకు వెళ్ళి చక్కని విజ్ఞానాన్ని సంపాదించేవారు. అధ్యాపకత్వం అనేది ఎన్నో జన్మల పుణ్యమని భావించే కొర్లపాటి గురువుల ఆశీస్సులతో అధ్యాపక ఉద్యోగం వచ్చింది. కొర్లపాటి వారు సెలవులు తీసుకోకుండా విద్యార్థులకు విజ్ఞానం అందించేవారు.

చిన్న వయసులోనే పెళ్ళి జరగడం వలన సంసార బాధ్యతలు ఒక పక్క, బోధన పరిశోధన మరో పక్క సాగిస్తూనే మధ్యలో దొరికిన ఖాళీ సమయాల్లో నాటకాలు, నవలలు రాసే కొర్లపాటి బహుముఖ ప్రజ్ఞాశాలిగా మనకు దర్శనమిస్తారు. రాష్ట్రమంతటా పోతన పంచశతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో, ఇంత పెద్ద ఆంధ్ర విశ్వ విద్యాలయంలో పోతన గారికి గౌరవం జరగడం లేదని అభిమానధనుడైన కొర్లపాటి వారు, పట్టుపట్టి తెలుగుశాఖ పక్షాన “పోతన సాహిత్య గోష్ఠి” వైభవంగా జరిపించారు.

“ఆ పల్కరింపులొ అనురాగములు చిందు
తీయ తేనెల విందు చేయువాడు
……………………………………………….
………………………………………………. ”
అంటూ కొర్లపాటి వారిని కరుణశ్రీ కొనియాడారు.
సాహిత్య కృషి : “శ్రీనాథుడు – సాహిత్యం”, “శ్రీనాథుడు – ఈశ్వరార్చన కళాశీలుడు” అను పరిశోధనా గ్రంథాల ద్వారా శ్రీనాథ మహాకవి యొక్క అశేషశేముషీ వైభవాన్ని లోకానికి అందించారు కొర్లపాటి. వీరి శరీరంలో అణువణువునా పరిశోధనా దృక్పథం జీర్ణించుకుపోయింది. వివిధ గ్రంథాలయాల్లో, ప్రాచ్యపరిశోధనాలయాల్లో అపరిష్కృతంగా, అజ్ఞాతంగా చాలా గ్రంథాలు బూజు పట్టిపోయి ఉండటాన్ని చూచి ఆయన వేదన చెందేవారు. తాళపత్ర గ్రంథాల పరిస్థితి మరింత ఆందోళన కలిగించే విధంగా ఉండేది. అలాంటి వాటిని వెలుగులోకి తీసుకురావాలని, వాటిలోని విజ్ఞానాన్ని నేటి తరాలకు పంచాలని విద్యార్థులకు పదే పదే చెప్పేవారు.

తాను స్వయంగా తంజావూరు వెళ్ళి అక్కడి సరస్వతీ మహలులో అపరిష్కృతంగా పడి ఉన్న “ప్రబంధ శిరోమణి”, “ప్రబంధ రత్నాకరం” అనే రెండు గ్రంథాలను పరిష్కరించారు. వీరి “చిత్రశాల” నవల విశ్వవిద్యాలయ స్థాయిలో మొదటి బహుమతి పొందింది. ఇంకా వీరు రచించిన “పలనాటి వీర చరిత్ర, పాండవుల మెట్ట, ధర్మజ్యోతి, శ్రీకృష్ణదేవరాయలు వంటి నాటకాలు రాష్ట్రమంతా ప్రదర్శించబడి బహుమతులు గెల్చుకున్నాయి.

ఆచార్య శ్రీరామమూర్తి గారికి ‘చరిత్ర – సాహిత్యం’ రెండూ రెండు కళ్ళు లాంటివి. “చరిత్ర లోతుల్లోకి వెళ్ళగలిగితే సాహిత్యమూలాలు దొరుకుతాయి. సాహిత్యాన్ని పద్ధతిగా అధ్యయనం చేస్తే చరిత్రలో ఎన్నో చిక్కుముడులు విడిపోతాయి” అని ఆయన బలంగా నమ్మేవారు. వీరి ఆలోచనలకు అక్షర రూపాలుగా “చరిత్ర – చర్చ”, “సాహిత్య సంపద” అనే రెండు గ్రంథాలు వీరి కలం నుండి వెలువడ్డాయి. వేమన మీద వీరు రాసిన “నాథయోగి మన వేమన” అన్న విమర్శనా గ్రంథం పండితుల చేత ప్రశంసించబడుతోంది.

“పోతన పంచశతి ఉత్సవాల సందర్భంగా ఆంధ్ర విశ్వ విద్యాలయంలో తెలుగుశాఖ పక్షాన “పోతన సాహిత్య గోష్ఠి” వైభవంగా జరిపించారు. 1991 – 92 సం||లలో వీరు రాసిన “తెలుగు సాహిత్య చరిత్ర” 3 భాగాలుగా నేటికీ పరిశోధక విద్యార్థులకు, ఉద్యోగార్థులకు కల్పతరువులుగా ఉన్నాయి. 2004లో “సాహిత్య మంజరి” పేరుతో వీరి పరిశోధనా సంపుటి ప్రచురింపబడింది. వీరు 2005లో ‘సమత, నటన’ అనే సాంఘిక నాటకాలను వ్రాశారు. ఆకాశవాణిలో వీరు చేసిన వందలాది ప్రసంగాలు, పత్రికలలో వ్రాసిన వందలాది వ్యాసాలు ఎందరికో స్ఫూర్తినందించాయి. కరుణశ్రీ అన్నట్లు వీరు ‘వాఙ్మయ కిరీటి’. ఇలా అవిశ్రాంతంగా సాహితీ యజ్ఞం చేసిన ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి 26.7.2011లో పరమపదాన్ని చేరుకున్నారు.

వాఙ్మయ కిరీటి కొర్లపాటి Questions and Answers Summary Inter 2nd Year Telugu

విశేషాంశాలు

ఎమిరిట్స్ ఫెలో : ఉద్యోగ విరమణ చేసిన విషయ నిపుణులు, శాస్త్రవేత్తలను ప్రభుత్వం గుర్తించి, వారి సేవలను మరలా పొందడానికి తగిన గౌరవ వేతనమిచ్చి, ఉద్యోగంలో కొనసాగిస్తుంది. వీరినే ఎమిరిట్స్ ప్రొఫెసర్ అని కూడా అంటారు.

వాఙ్మయ కిరీటి కొర్లపాటి Summary in Telugu

రచయితల పరిచయం

పాఠ్యభాగం పేరు : ‘వాఙ్మయ కిరీటి కొర్లపాటి’ –
రచయితలు : ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రి, గుంటూరు శేషేంద్ర శర్మ, దేవులపల్లి రామానుజరావు, డా॥ నండూరి రామకృష్ణమాచార్యులు, ఆచార్య మాదిరాజు – రంగరాజు, ఆచార్య ఎస్. గంగప్ప, ఆచార్య చల్లా రాధాకృష్ణశర్మ గార్లు.
ఈ పాఠ్యాంశం ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి “షష్ఠిపూర్తి అభినందన సంచిక” (1989) నుండి గ్రహించడం జరిగింది. కరెవరపు వెంకట్రామయ్యగారి సంపాదకత్వంలో వెలువడిన ఈ సంచికలో కొర్లపాటి వారి జీవిత విశేషాలు, సాహిత్య కృషిని వివరిస్తూ వ్రాసిన పద్యాలు, వ్యాసాలు ఉన్నాయి. వాటిని క్రోడీకరిస్తూ ఈ పాఠ్యాంశాన్ని సిద్ధం చేయడం జరిగింది.

పాఠ్యభాగ ఉద్దేశ్యం

సాహిత్యంపట్ల మక్కువతో చదివి, రసానుభూతిని పొంది పదిమందికీ దానిని పంచేవారు సాహితీలోకంలో బాగా తగ్గిపోతున్నారు. అలాంటిది పరిశోధన కోసం, తెలుగు సాహిత్య చరిత్రలో అపరిష్కృతంగా ఉన్న చిక్కుముడులు విప్పడం కోసం జీవితాన్ని అంకితం చేసినవాళ్ళు, ప్రాతఃస్మరణీయులైనవారు మరింత అరుదుగా కనిపిస్తున్నారు. అలాంటి వారిలో కొర్లపాటి శ్రీరామమూర్తిగారు ఒకరు. శ్రీనాథ సాహిత్యంపై ఆయన చేసిన కృషి వేనోళ్ళ పొగడదగినది. అధ్యయనం, అధ్యాపకత్వం, పరిశోధన కలబోసిన ఓ సాహితీమూర్తిని విద్యార్థులకు పరిచయం చేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం.

పాఠ్యభాగంలోని ముఖ్య విశేషాలు

ఉత్తమ విమర్శకులుగా, పరిశోధనా పరమేశ్వరులుగా, సహృదయులైన ఆచార్య శిఖామణిగా విద్యార్థులు, పండితోత్తములచేత వేనోళ్ళ పొగడబడిన ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారు “పుంభావ భాషావధూటిగా, మధురకవి సార్వభౌమగా, వాఙ్మయ కిరీటి”గా ప్రసిద్ధి పొందారు. వ్యవసాయం, జ్యోతిశ్శాస్త్రం, తెలుగు సాహిత్యం, ఇలా ఒకటేమిటి అనేక అంశాలపై పట్టు కలిగిన పండితులు కొర్లపాటి. “చరిత్ర లోతుల్లోకి వెళ్ళగలిగితే సాహిత్య మూలాలు దొరుకుతాయి. సాహిత్యాన్ని పద్ధతిగా అధ్యయం చేస్తే చరిత్రలో ఎన్నో చిక్కుముడులు విడిపోతాయి” అని ఆయన బలంగా నమ్మేవారు. సాహిత్య రచన, నాటక రచన, నాటక ప్రదర్శనలతో రాష్ట్ర, రాష్టేతర ప్రాంతాల్లో కూడా కీర్తిని సంపాదించారు. U.G.C విషయ నిపుణులుగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగా ఇంకా అనేక పదవులలో ప్రభుత్వం చేత నియమించబడి సమర్థవంతంగా, నిజాయితీగా సేవలందించారు.

పదాలు – అర్థాలు

పేజి – 108 :

తావి = పరిమళం
మందమారుతం = చిరుగాలి, పిల్లగాలి
దోర = లేత ఎరుపు
కరము = చేయి
రాకా = పున్నమి, నిండువెన్నెల
చాంద్రీద్యుతులు = వెన్నెల (చంద్రునికి సంబంధించినది) కాంతులు
పేటి = పెట్టె
పుంభావ = ప్రౌఢిమము, ప్రావీణ్యం
వధూటి = స్త్రీ
సార్వభౌమ = చక్రవర్తి (భూమి అంతటా తెలిసినవాడు)
వాఙ్మయ = భాష
కిరీటి = అర్జునుడు (ఇంద్రదత్తమగు కిరీటము కలవాడు)
మేటి = గొప్పవాడు
వెలుగుల తేడు = సూర్యుడు
వసుంధర = భూమి
గీర్వాణము = సంస్కృతము
కాలం కాస్త కలిసి వచ్చాక = కష్టాలు తొలిగి అనుకూల పరిస్థితులు మొదలయ్యాక
మహామహులు = మిక్కిలి గొప్పవారు, గొప్ప తేజస్సు కలవారు
ట్యూటర్ = వ్యక్తిగతంగా చదువు చెప్పే వ్యక్తి
హుందా = = సంస్కారము, దర్జా
M.A (ఆనర్స్) = ఇది స్కాట్లాండ్, యూకే వంటి దేశాలలో అందించే ఒక ప్రత్యేకమైన అండర్ గ్రాడ్యు యేట్ డిగ్రీ. ఇది 4 సంవత్సరాల కాలపరిమితి కలిగి, సాధారణ 3 యేళ్ళ B.A డిగ్రీ కంటే ఎక్కువ లోతైన అధ్యయనం, పరిశోధన నైపుణ్యాలను మరియు థీసిస్ కలిగి ఉంటుంది.

వాఙ్మయ కిరీటి కొర్లపాటి Questions and Answers Summary Inter 2nd Year Telugu

పేజి – 110:

శేముషీ = ప్రజ్ఞ, బుద్ధి, మనీష
డి.లిట్ = (డాక్టర్ ఆఫ్ లిటరేచర్) సాహిత్యం, కళలు మొదలైనవాటిలో విశేషకృషి చేసిన ప్రముఖు లకు విశ్వవిద్యాలయాలు ఇచ్చే అత్యున్నత గౌరవ డాక్టరేట్
అపరిష్కృతం = సంస్కరింపబడనిది
ప్రశిష్యుడు = శిష్యునికి శిష్యుడు
ఆచార్య = ప్రొఫెసర్

పేజి – 111 :

సదస్సు = సభ
వేనోళ్ళ పొగడు = అధికంగా పొగడు
కలం నుండి జాలువారిన = రచయిత సృష్టించిన / రచించిన
అజోవిభొ – కందాళం ఫౌండేషన్ = ఈ సంస్థ వ్యవస్థాపకుడు అప్పాజోస్యుల సత్యనారాయణ (1993లో) గారు స్థాపించారు.
అప్పాజోస్యుల – విష్ణు భొట్ల – కందాళం ఫౌండేషన్ – ప్రస్తుతం డా|| కె.వి. రామానుజాచార్యులు ఛైర్మన్ గా సేవలందిస్తున్నారు.
జీవిత సాఫల్య పురస్కారం = ఒక వ్యక్తి తమ వృత్తి లేదా రంగంలో (కళలు, క్రీడలు, సామాజిక సేవ, విజ్ఞానం) సుదీర్ఘ కాలం పాటు చేసిన కృషి, సాధించిన విజయాలను గుర్తించి ఇచ్చే అత్యున్నత గౌరవం.
అంగరంగ వైభవంగా = అత్యంత ఘనంగా
పరమపదం = మోక్షం, వైకుంఠం, స్వర్గం

వాఙ్మయ కిరీటి కొర్లపాటి Questions and Answers Summary Inter 2nd Year Telugu