Reviewing AP Inter 2nd Year Telugu Study Material ఉపవాచకం 2nd Lesson ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం Questions and Answers Summary can help students prepare confidently for exams.
AP Inter 2nd Year Telugu ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం Questions and Answers
అభ్యాసం
I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ప్రకాశం బాల్యం – విద్యాభ్యాసం వృత్తాంతాన్ని వివరించండి.
జవాబు:
టంగుటూరి ప్రకాశం పట్టుదలతో కష్టాలను ఎదిరించి, చదువులో ప్రగతి సాధించి, ఉన్నత స్థానానికి చేరిన తీరు మన జీవితాలకు ఒక దిక్సూచి. ఒక వెలుగు రేఖ. ఆయన జీవితం తరతరాల వారిని ఉత్తేజితం చేయగలదు. గోపాలకృష్ణయ్య, సుబ్బమ్మగార్ల ప్రథమ సంతానంగా ప్రకాశం 1872 ఆగష్టు 23వ తేదీన జన్మించారు. ఇద్దరు తోబుట్టువుల పెళ్ళిళ్ళు, చుట్టుముట్టిన కరువు వల్ల వారి కుటుంబం ఆర్థికంగా దెబ్బతింది. పెద్దల కట్టడి వల్ల వల్లూరులోని వీథి బడికి వెళ్ళేవాడు ప్రకాశం. ఈయన ఆంగ్లభాషే కాక ఒక ముస్లిం కుర్రవాని సాహచర్యంలో ఉర్దూ భాష కూడా నేర్చుకున్నారు. క్రికెట్ ఆడటం, శారీరక వ్యాయామం, దివాణం ఏనుగులపై ఎక్కడం ఇవీ ఆనాటి ప్రకాశం సరదాలు.
ప్రకాశానికి పదకొండేళ్ళ వయస్సులో తండ్రి చనిపోవడం వారి కుటుంబానికి ఒక పిడుగుపాటు. కుటుంబ భారమంతా తల్లిపై పడింది. ఆస్తిపాస్తులేమీ లేవు. శుష్క విలువలకు జడవక ఒంగోలులో ‘పూటకూటిల్లు’ పెట్టుకొని తన కొడుకులకు ఇంగ్లీషు చదువు చెప్పించాలని ఆమె నిశ్చయించు కుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్రకాశం చేరాడు. పన్నెండో యేట మిడిల్ స్కూల్ పరీక్ష ప్రథమ శ్రేణిలో పాసయ్యాడు.
ప్రకాశం చిన్నప్పటి నుండి రంగస్థల నాటకాల వైపు ఆకర్షితుడయ్యాడు. స్థానిక పాఠశాల ఉపాధ్యాయులైన ఉండవల్లి సాహెబ్, హనుమంతరావు నాయుడులకు నాటకాలంటే మహా ఇష్టం. అందుచేత వీరిరువురూ ప్రకాశాన్ని అభిమానంతో ప్రోత్సహించేవారు. లేమి కారణం చేత ఇతరుల దాతృత్వం మీద ఆధారపడి పాఠ్యపుస్తకాలు కొనుక్కునేవాడు. తమ ఇంటికి ఎదురుగా ఉన్న కోర్టుకి, నల్లకోటు వేసుకువచ్చే ప్లీడర్లు తమ వాద ప్రతివాదాలతో బాగా డబ్బు సంపాదించడం చూసి, తనూ వారిలో ఒకడవాలని కలలుగన్నాడు ఆనాటి బాల ప్రకాశం. హనుమంతరావు నాయుడు ఒంగోలులోని మిషనరీ వారికి చెప్పగా, ప్రకాశానికి హైస్కూలులో ఉచితవిద్యకు అవకాశం లభించింది. నాయుడుగారి అధ్యాపకత్వంతో ప్రి-మెట్రిక్ చదివాడు. ఆయన సహకారంతో రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో ఎఫ్.ఎ. తరగతిలో చేరాడు. శిష్యుని చిరకాల స్వప్నమైన ప్లీడరు చదువుకి ప్రకాశాన్ని మద్రాసు పంపించాడు నాయుడుగారు. ప్రకాశం సెకండ్ గ్రేడు ప్లీడరు శిక్షణ పొందాడు. “తన జీవితానికి మార్గదర్శకుడు తన అభివృద్ధికి మూలకారకుడు గురువుగారు నాయుడుగారే” అని ప్రకాశం అంటుండేవారు.
“నీవు బారిస్టర్‌గా హైకోర్టులో రాణించాలి” అని బారిస్టర్ స్వామినాథన్ గారు, ప్రకాశంతో అన్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో, వాటిని ఆచరణ పెట్టడంలో క్షణమైనా ఆలస్యం చేయని ప్రకాశం తన సంపన్న మిత్రుడు కె. రామచంద్రరావు తోనూ, తన ధనిక క్లయింటు ఎమ్. లక్ష్మణదాసుతోనూ ఈ విషయం ప్రస్తావించగా, వారు వెంటనే ప్రకాశం బారిస్టర్ చదువుకయ్యే ఖర్చు తాము భరిస్తామన్నారు. ఆనాటి బారిస్టర్లలో చాలామంది లండన్ వెళ్ళి తాగుడు అలవాటు చేసుకుంటారనే అపవాదు ఉంది. ఈ విషయమై భయపడుతున్న తన తల్లికి, మద్యమాంసాలు ముట్టనని ప్రమాణం చేస్తాడు ప్రకాశం.
1904 నవంబరులో ప్రకాశం బొంబాయిలో ఓడ ఎక్కాడు. లండన్ చేరుకున్నాక “గ్రేస్ ఇన్”లో ప్రవేశించి బారిస్టర్ చదవనారంభించాడు. అక్కడి గ్రంథాలయాన్ని బాగా ఉపయోగించుకుంటూ, క్రమం తప్పకుండా క్లాసుకు హజరు కావడం, వాటికి సంబంధించి పేజీలకొద్దీ నోట్సు రాసుకోవడం, అక్కడి కోర్టులలో జరిగే న్యాయ విచారణను ఆసక్తితో పరికించడం వంటివి ప్రకాశం దినచర్యగా పెట్టుకున్నాడు. లండన్‌లో ఉంటున్న దాదాభాయ్ నౌరోజీ రాసిన గ్రంథాలను శ్రద్ధగా చదివేవాడు. తన తల్లికి ఇచ్చిన మాటను గౌరవిస్తూ మద్యాన్ని, మాంసాన్ని ముట్టుకోకుండా, ఆంగ్లేయులు ఎంత వేళాకోళం చేసినా నిబద్ధతో చదువు సాగించాడు ప్రకాశం. బారిస్టర్ పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయి ఇంటికి చేరాడు.
చరిత్రను దిద్దగలిగిన వారే ఉత్తమ కార్యాచరణ వల్ల సమకాలికులకు మేలు చేయగలుగుతున్నారు. ఈ ఉత్తమ కార్యాసక్తి కలవారిలో కొద్దిమంది మాత్రమే తమ కలలు పండటం, తమ ఆశయాలు నెరవేరడాన్ని తమ జీవిత కాలంలో వీక్షించగల అదృష్టవంతులు అవుతున్నారు. నవభారతంలో ప్రకాశం అలాంటి ధన్యజీవి.
![]()
ప్రశ్న 2.
“న్యాయవాదిగా – స్వాతంత్ర్యోద్యమ నాయకునిగా ప్రకాశం పంతులు గారు” వివరించండి.
జవాబు:
కొందరు గొప్పవాళ్ళుగా పుడతారు. కొందరిని గొప్పతనం అలుముకుంటుంది. కొందరు అవిరళకృషితో, శక్తి సామర్థ్యాలతో, సచ్ఛీల ప్రవర్తనలతో గొప్పతనం సాధిస్తారు. ప్రకాశంగారు చివరికోవకు చెందిన మనిషి. లేమిలో జన్మించినా కష్టాలకు ఏనాడూ ఆయన నెరవేరలేదు. దేశానికి సేవ చేసే నిమిత్తం కష్టాలనూ, దారిద్ర్యాన్ని భరించాడు. పట్టుదలతో కష్టాలను ఎదిరించి, చదువులో ప్రగతి సాధించి, ఉన్నత స్థానానికి చేరుకున్న ప్రకాశం మనకు స్ఫూర్తి. స్వాతంత్ర్యో ద్యమంలో పాల్గొనడం, దేశభక్తి, ధైర్యం, నీతి నిజాయితీ కోసం పదవిని సైతం తృణప్రాయంగా విడిచిపెట్టిన ప్రకాశం జీవితం మనకు ఆదర్శం.
న్యాయవాదిగా రెండు చేతులా సంపాదిస్తూ హంసతూలికా తల్పంపై శయనించిన మహనీయుడు, దేశానికి సేవ నిమిత్తం తన సంపదనంతా ధారపోశాడు ప్రకాశం. స్వార్థ రాహిత్యం, త్యాగనిరతి ఈ రెండూ ప్రకాశాన్ని అన్ని వర్గాల వారికి సన్నిహితుని చేశాయి. తన చిన్ననాటి కలను కలగా మిగిలిపోనీకుండా కష్టపడి చదివి, మిత్రుల సహకారంతో బారిస్టర్ పట్టా సంపాదించాడు. తన సామర్థ్యంపై మిక్కిలి విశ్వాసం గల ప్రకాశం, న్యాయమూర్తుల మంచితనం కోసం ఏనాడూ ప్రాకులాడక, నిర్భయంగా వ్యవహరిస్తూ తన క్లయింట్ల నమ్మకాన్ని చూరగొన్నాడు ప్రకాశం. ఎంతో సంచలనం గావించి, రాజకీయ రంగుదాల్చిన ‘యాష్ మర్డర్ కేసు’ క్రిమినల్ సైడ్ ప్రకాశం విజయపరంపరకు చెందిన ప్రముఖ ఘట్టం. ఈ కేసే ప్రకాశం’ ప్రతిభను నలుదిక్కులా చాటి, ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది.
న్యాయవాద వృత్తిలో ప్రకాశం గారి పేరు ప్రఖ్యాతులు అన్ని జిల్లాలకు పాకాయి. రాకుమారునిలా సంపాదించి రాకుమారునిలాగానే ప్రజా ప్రయోజనాల కోసం వెచ్చించాడు. ‘సత్యాగ్రహ ప్రమాణం” మీద సంతకం పెట్టి గుప్పిళ్ళతో వేలకు వేలు చేకూర్చి పెడుతున్న న్యాయవాద వృత్తికి స్వస్తి పలికారు ప్రకాశం.
స్వాతంత్ర్యోద్యమ నాయకునిగా : 1907లో వందేమాతర ఉద్యమాన్ని ప్రచారం చేసే నిమిత్తం బిపిన్ చంద్రపాల్ మద్రాసు వచ్చినప్పుడు ఆయన సభకు అధ్యక్షులుగా ఉండేందుకు ఎవరూ ముందుకు రాకపోయేసరికి “నేనున్నాను” అంటూ ముందుకు వచ్చాడు ప్రకాశం. 1917లో కలకత్తా కాంగ్రెసు సమావేశానికి, 1918 బొంబాయి సమావేశానికి ప్రకాశం హాజరై చిత్తరంజన్ దాస్, బాలగంగాధర తిలక్‌తో చేతులు కలిపాడు. 1921లో జరిగిన అహ్మదాబాద్ సమావేశంలో అఖిలభారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి అయ్యారు. దేశంలో ఏ మూల కల్లోలం జరిగినా, ఎక్కడ ప్రజా ఉద్యమం సాగుతున్నా అక్కడ ప్రకాశం ఉండవలసిందే. ఆ రోజులలో ఆంధ్రాలోని కాంగ్రెస్ త్రిమూర్తులు కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, ప్రకాశం. ఒకరు ఆత్మ, మరొకరు మేధ, మూడవ వారు చైతన్యం.
ప్రకాశం జీవితంలో మహత్తర ఘట్టం 1928 సైమన్ కమిషన్ మద్రాసు వచ్చినప్పటిది. రాజ్యాంగ సంస్కరణల పేరిట ఈ నివేదికా సంఘాన్ని జాతీయవాదులు బహిష్కరించాలని తీర్మానించారు. మద్రాసు పోలీసు కమిషనర్ ప్రదర్శనలు, ఊరేగింపులు ఫలానా మార్గాల గుండా వెళ్ళకూడదని నిషేధించి ముఖ్య నాయకులను ముందే హెచ్చరించాడు. ప్రకాశం ఈ నిషేధపు ఉత్తర్వుకు సవాలుగా నల్ల జెండాల ఊరేగింపుని ఆ మార్గాల గుండానే తీసుకు వచ్చాడు. అశ్వారూఢులైన పోలీసులు ఈ జన ప్రవాహాన్ని ఆపలేక తుపాకులు పేల్చగా, ఒకరు అక్కడిక్కడ మరణించారు. ఒక క్షతగాత్రుని వైపుగా ప్రకాశం ముందుకు చొచ్చుకొని వెళ్ళి “రండిరా ” కాల్చండిరా – చూద్దాం” అని ఛాతి చూపించే సరికి ఇటు ప్రదర్శకులు, అటు పోలీసులు నిస్తేజులయ్యారు.’
1930 జాతీయ పోరాటానికి నాందిగా కాంగ్రెస్ శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తున్న సందర్భంలో ప్రకాశం తన పదవికి రాజీనామా ఇచ్చి, ఉప ఎన్నికలలో స్వంతంగా నిలబడి పార్టీ ముద్ర లేకుండా ఎన్నికవడం ఆయనకున్న ప్రజా బల మెటువంటిదో చెబుతుంది. సత్యాగ్రహెూద్యమ కాలంలో తన కుమారుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నా లెక్క చేయక ఉప్పు చట్టాన్ని ధిక్కరించాడు. గాంధీజీ సాగించిన ప్రతి జాతీయ పోరాటంలో పాల్గొని, జైలు కెళ్ళాడు. ప్రజా ఉద్యమానికి ఊతంగా ఉండాలనే భావనతో ఏర్పడిన “స్వరాజ్య” పత్రికకు ప్రకాశం వర్కింగ్ ఎడిటర్‌గా పనిచేసి, ఉద్యమాన్ని బలోపేతం చేశారు.
తన వారి సౌకర్యం కోసం తను ఎంతటి త్యాగానికైనా సంసిద్ధంగా ఉండే ప్రకాశాన్ని. అమితైశ్వర్యం గాని, కటిక పేదరికం గాని ఆయన స్వభావాన్ని, మానసిక ధైర్యాన్ని, నైతిక స్థిరత్వాన్ని మార్చలేక పోయాయి. తన ఆత్మకథని “నా జీవిత యాత్ర”గా నాలుగు సంపుటాలుగా చక్కని వ్యవహార భాషలో రాసుకొన్న ప్రకాశం మే 20, 1957న విశ్రాంతి ఎరుగని కర్మవీరుడు “ఆంధ్ర కేసరి” సుదీర్ఘ విశ్రాంతి పొందారు.
విశేషాంశాలు
జమాబందీ : రైతుల వద్ద భూమిశిస్తులు వసూలు చేసి ప్రభుత్వానికి అప్పగించే పని.
పూటకూటిల్లు : పూర్వం పెద్ద గ్రామాలలో, పట్టణాలలో ఉండే ఇవి నేటి హెూటళ్ళకు మాతృకలవంటివి. అక్కడ భోజనం చేయదలచుకున్నవారు కాస్త ముందుగానే నిర్వాహకులకు చెప్తే వారు వంటచేసి పెడతారు. యాత్రికులు ఏ పూటకాపూట తగిన పైకం చెల్లించి భోజనం చేసి వెళ్ళేవారు. కొన్ని చోట్ల స్నానం, విశ్రాంతి కొరకు కూడా ఏర్పాట్లు ఉండేవి.
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం Summary in Telugu
పాఠ్యభాగ ఉద్దేశ్యం
ఈ పాఠ్యాంశం టంగుటూరి ప్రకాశంగారు వ్రాసుకున్న స్వీయచరిత్ర “నా జీవిత యాత్ర” అనే గ్రంథం నుండి స్వీకరించడం జరిగింది. స్వాతంత్ర్య పోరాటంలో తమ సమస్తం అర్పించిన త్యాగధనుల జీవితం ధరణీతలంపై అజరామరమై నిలుస్తుంది. వారి తనువులు నేలరాలినా, ఆ త్యాగ పరిమళం మాత్రం అవ్యక్తానుభూతితో పరవశింపజేస్తుంది. ఇటువంటి పూజనీయులు నవభారత నిర్మాణానికి ఏ తీరున సహాయపడ్డారో, నేటి యువతీ యువకులు తెలుసుకోలేకపోవడం క్షంతవ్యం గాని విషయం. ప్రకాశం గారి జీవితం ఒక దిక్సూచి. ఒక వెలుగు రేఖ. ఆంధ్రప్రజలు గర్వింపదగ్గ ఒక మహానాయకుడాయన. ఆయన జీవితం తరతరాలవారిని ఉత్తేజితం గావించగలదు.
టంగుటూరి పట్టుదలతో కష్టాలను ఎదిరించి, చదువులో ప్రగతి సాధించి, ఉన్నత స్థానానికి చేరుకోవడాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం, దేశభక్తి, ధైర్యం, నీతినిజాయితీ కోసం పదవిని సైతం తృణప్రాయంగా విడిచిపెట్టడం వంటి విషయాలను తెలియజేయడం ద్వారా ఉత్తమ విలువలను విద్యార్థులలో పెంపొందించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం.
![]()
కఠిన పదాలకు అర్థాలు
పేజి – 99 :
అజరామరం = స్థిరముగా ఉండేది, చావులేనిది
తనువు = శరీరం
క్షంతవ్య౦ = మన్నింపతగినది
దిక్సూచి = దారి చూపేది
తృణప్రాయం = గడ్డిపరకతో సమమైనది, అల్పం
అవిరళము = పలుచనకానిది, తక్కువ కాని
సచ్ఛీలము = సత్ ప్రవర్తనము
లేమి = దారి(ద్య౦
హంసతూలికా తల్పం = ఖరీదైన పరుపు (మెత్తని హంస ఈకలు పెట్టి కుట్టి సిద్ధము చేసిన పరుపు)
నిరతి = ఆసక్తి
తరతమ = తక్కువ, ఎక్కువ
పేజి – 101
కరణీకం = లెక్కరాయుట
నియోగి = బ్రహ్మణులలో ఒక తెగ, రాజాదులచే ఒక పని యందు నియక్తుడైనవాడు, మంత్రి
కట్టడి = ఆదేశం
దివాణం = రాజభవనం, ఆస్థానం
విచ్చలవిడి = = స్వేచ్ఛ, అలవోక
సాహచర్యం = స్నేహం
శిస్తు = భూస్వామికి కౌలుదారుగా నిర్ణయింపబడిన అద్దె, పన్ను
బకాయి = సకాలంలో చెల్లించకపోవడం వల్ల బాకీపడ్డ సొమ్ము
అశనిపాతం = పిడుగుపాటు
శుష్క = ఎండిన, సన్నగిల్లు
జడవక = భయపడక
రిక్తహస్తం = ఉత్త చెయ్యి
తాకట్టు = కుదవ, అప్పు ఇచ్చేవానికి నమ్మకానికై తీసుకొనేవాడు ఇచ్చే వస్తువు
![]()
పేజి – 102:
ప్రి – మెటిక్ = 10వ తరగతిలోపు చదువు
యాదృచ్ఛికం = ఎదురు చూడనిది, ప్రయత్నం లేకయే కలిగినది
సాన్నిహిత్యం = దగ్గరతనం
పర్యవేక్షణ = పరిశీలించుట
స్తోమత = శక్తి
స్వప్నం = కల
చేదోడువాదోడు = సహాయం, ఒకరికి ఒకరు సాయంగా ఉండడం
పేజి – 103 :
చులకన = లోకువ, తేలిక
పేయింగ్ గెస్ట్ = యజమాని ఇంట్లో ఉంటూ వసతి, ఆహారం వంటి సదుపాయాలకు అద్దె చెల్లించే వసతి వ్యవస్థ
శాకపాకాలు = వంటలు
అవగతం = తెలియబడినది, తెలిసినది
సూటిగా = సరిగా
ప్రాకులాడక = బతిమాలక, ఆశ్రయించక
క్లయింటు = ఆశ్రితుడు, కక్షిదారు, ఆధారపడిన వ్యక్తి
ముద్దాయి = నేరము మోపబడినవాడు
పేజీ – 104
దత్తత = సంతానం లేనివారు ఇతరులు పిల్లలను పెంచుకొనుట, పెంపుడు
స్వస్తి పలుకు = కొంతకాలంగా సాగిస్తూ వచ్చిన పనులను ఆపివేయుట, ముగింపు
కల్లోలం = అలజడి
మహత్తర = గొప్ప
ఇసుక వేస్తే రాలనంత = రద్దీ చాలా ఎక్కువ
సవాలు = ఎదుర్కొనుట, ప్రశ్న
క్షతగాత్రుడు = గాయపడినవాడు
నిస్తేజ౦ = ప్రతాపం లేని
మశూచి = స్ఫోటకం, అమ్మవారు (small pox)
పేజి 105 :
జరిమానా = జుల్మానా, నియమ నిబంధనలను దాటినప్పుడు డబ్బు రూపేణా వేసే శిక్ష
జప్తు = స్వాధీనం చేసుకోవడం
జయప్రదం = సఫలం
ఊతం = ఆధారం
వర్కింగ్ ఎడిటర్ = ప్రచురణలు, వెబ్ కంటెంట్‌ను సవరించి, మెరుగుపరచి, తుది రూపానికి తీసుకువచ్చే నిపుణుడు.
ధరావత్తు = బయానా, నిలువ ఉంచు సొమ్ము
తార్కాణం = నిదర్శనం, ఉదాహరణ
మొగ్గు = వంపు, ఇష్టం
ఆత్మాహుతి = ప్రాణ త్యాగం
స్రవంతి = నది
ఔదార్యం = దానశీలం, దయాదాక్షిణ్యం
కటిక = మిక్కిలి
జరా = ముసలితనం
![]()
పాఠ్యభాగంలోని ముఖ్య విశేషాలు
‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు ఒక సజీవ స్రవంతి, ఎన్నో వాగులను, ఉపనదులను తనలో కలుపుకొని ఉరకలెత్తే మహానది. అన్నింటినీ మించి ఆయన ఔదార్యానికి హద్దులు ఉండేవి కావు. తన వారి కోసం తను ఎంతటి త్యాగానికైనా సంసిద్ధంగా ఉండేవాడు. అమితైశ్వర్యం గాని, కటిక పేదరికం గాని ఆయన స్వభావాన్ని, మానసిక ధైర్యాన్ని, నైతిక స్థిరత్వాన్ని మార్చలేకపోయాయి. ప్రకాశం తన ఆత్మకథని “నా జీవిత యాత్ర”గా నాలుగు సంపుటాలుగా చక్కని వ్యావహారిక భాషలో రాశారు.