Reviewing AP Inter 2nd Year Telugu Study Material ఉపవాచకం 1st Lesson వ్యావహారిక భాషోద్యమ ప్రవక్త Questions and Answers Summary can help students prepare confidently for exams.
AP Inter 2nd Year Telugu వ్యావహారిక భాషోద్యమ ప్రవక్త Questions and Answers
అభ్యాసం
I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
గిడుగు రామమూర్తి గారి నిబద్ధత, సంస్కరణాభిలాషలను వివరించండి.
జవాబు:
వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు, సంఘసంస్కర్త గిడుగు. రామమూర్తి. ఈయన శ్రీకాకుళంలోని ప్రసిద్ధ శైవపుణ్యక్షేత్రమైన శ్రీముఖ లింగం సమీపాన గల పర్వతాలపేటలో వీర్రాజు, వెంకమ్మ దంపతులకు 1863 ఆగష్టు 29న జన్మించారు.
నిబద్ధత : రామమూర్తి గారు ఇంగ్లాండులోని బోధనా పద్ధతులను చదివి ఆకళింపు చేసుకున్నారు. తమలాగే తమ పిల్లలు, శిష్యులు తెలివితేటలను ప్రదర్శించాలని ఆశించేవారు. వీరు ఆశించినట్లు జరుగకపోతే పిల్లలను కఠినంగా దండించేవారు. ఆయన దగ్గర చదువు విషయంలో రాజీలేదు. ఇతర విషయాల్లో ఆయన పిల్లలందరితో సరదాగా ఉంటూ హాస్యమాడేవారు.
పరీక్షా పత్రాలను దిద్ది మార్కులు వేయడంలో గూడా చాలా నిక్కచ్చిగా ఉండేవారు. ఎవరు సిఫార్సు చేసినా సరే వారు నిర్ణయించిన మార్కులకు ఒక అరమార్కు కూడా కలిపేవారు కారు. ఒకసారి ఎఫ్.ఏ సెలక్షన్ ఎగ్జామినేషన్ లో చిలుకూరి నారాయణ రావు గారికి వీరు దిద్దిన హిస్టరీ పేపర్లో రెండు మార్కులు తక్కువ వచ్చాయి. నారాయణరావు గారు ప్రిన్సిపాల్ మంగు శ్రీనివాసరావు గారిని ఆశ్రయించారు. అప్పుడు ప్రిన్సిపాల్ రామమూర్తి గారిని కలసి నారాయణరావు పేపర్లను మరొకసారి చూడమన్నారు. “నేను సరిగ్గానే చూశాను. చదవని వాడికి మార్కులు రాకపోతే నేనేం చెయ్యను ? ఆ విషయం మీరు పట్టించుకొనకండి” అన్నారు రామ్మూర్తి గారు. తర్వాత నారాయణరావు, అన్నపూర్ణమ్మ గారిని ఆశ్రయించారు. ఆమె భర్తకు అన్నం పెడుతూ “మన నారాయణ రావు…!” అని ఇంకా విషయం ప్రస్తావించక ముందే గ్రహించి, భోజనం పూర్తి చేయకుండానే లేచి చెయ్యి కడుక్కొని ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్లి! చిలుకూరు నారాయణరావుని మీరు పరీక్షకు పంపించారంటే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. వీడు ‘మీ సిఫార్సే కాకుండా నా భార్య సిఫార్సుతో పరీక్షకు వెళ్లాలనుకుంటున్నాడు.
అదేం కుదరదు. ఇప్పటి నుండి వచ్చే సంవత్సరానికి తయారు కమ్మనండి’ అన్నారు. ఇంకొకసారి రామమూర్తి గారి రెండవ కుమారునికి మార్కులు తక్కువ రావడం వల్ల ఎఫ్.ఏ పరీక్షకు కూర్చోవడానికి వీలు లేకపోయింది. “మీ అబ్బాయికి రెండు మార్కులు కలపగలరేమో చూడండి, పరీక్షకు పంపిద్దామన్నారు ! ప్రిన్సిపాలుగారు”. ఎవరి అబ్బాయి అయినా సరే నేను దిద్దిన పేపరు మళ్లా చూడనవసరం లేదన్నారు రామ్మూర్తి గారు. వృత్తిలో అంతటి నిబద్ధత కలవారు.
సంస్కరణాభిలాష : ఎవరు ఏమి అనుకున్నా సరే తాము సత్యమని, ధర్మమని నమ్మిన దానిని ఆచరించడానికి రామమూర్తి వెనుకాడేవారు కాదు. సంఘ సంస్కర్తలతో సాంఘిక దురాచారాల గురించి చర్చించేవారు. వీరికి జాతి, మత కుల భేదాలతో ప్రసక్తి ఉండేదికాదు. సవరలను ఇంట్లోకి రానిస్తున్నారని కొందరు బ్రాహ్మణులు ఆక్షేపించారు. “శ్రీరామునికి శబరి ఆతిథ్యం యిచ్చి పూజించింది కనుక సవరలంటే ఈ రామమూర్తికి ఎంతో ఇష్టం” అనేవారు. బంకుమల్లి మల్లయ్య శాస్త్రి గారి కుమార్తె పదేళ్ల పిల్లగా ఉన్నప్పుడే వైధవ్యం పొందింది. ఆమెకు పెళ్లి చేయమని వీరు శాస్త్రి గారిని బలవంత పెట్టి ఒప్పించారు. మల్లయ్య శాస్త్రి గారు అందుకు సమ్మతించినా సంఘానికి భయపడి కన్యాదానం పీటల మీద కూర్చోడానికి భయపడ్డారు. అప్పుడు రామమూర్తి గారు అన్నపూర్ణ సమేతంగా పీటలమీద కూర్చొని వేదుల సత్యనారాయణ గారికి ఆ కన్యను దానం చేశారు.
1905 తన శిష్యుడైన కన్నెపల్లి నరసింహం ఇంగ్లాండ్లో “బార్-ఎట్- లా” చదివి తిరిగి స్వదేశానికి వచ్చిన తరువాత రామమూర్తి గారు తన శిష్యుడు ప్రయోజకుడైనందుకు సహపంక్తి భోజన విందు ఏర్పాటు చేశారు. కుల భ్రష్టుడైన వాణ్ని సహపంక్తిలో కూర్చోపెట్టుకొని భోజనం చేశారన్న నెపంతో రామమూర్తిని సహకులస్తులు వెలివేశారు.
![]()
ప్రశ్న 2.
వ్యావహారిక భాషకు గిడుగువారు చేసిన సేవను వివరించండి.
జవాబు:
“మా దృష్టిలో దేశభక్తి అంటే మాతృభాషమీద అభిమానమే” అని ప్రకటించిన స్వాభిమాని గిడుగు రామమూర్తి పంతులుగారు. ప్రజాక్షేత్రంలో వ్యవహరించే భాష బోధనా భాషగా ఉండాలని పట్టుబట్టి సాధించిన ధీశాలి గిడుగువారు. అందుకే ఆయనను “గిడుగు-పిడుగు” అనేవారు. తెలుగుభాష మనుగడ, వ్యాప్తి, కాలానుగుణంగా ఆధునీకరించడం కోసం ఆయన చేసిన కృషి ఎంతో గొప్పది. గ్రాంధికంలో రాసేవాడికి నిఘంటువులు, వ్యాకరణాలు కావాలి. “రాజమార్గంలో నడిచేవాడికి ఏ ఆధారమూ అవసరం లేదు. వ్యావహారిక భాష రాజమార్గం లాంటిది” అంటారు రామమూర్తి. “మన భాషలో ఇద్దరే వాగశాసనులున్నారు. ఒకరు నన్నయ రెండవారు శ్రీ గిడుగు” అని విశ్వనాథవారు శ్లాఘించారంటే, గిడుగువారు భాషకు ఎంత సేవ చేశారో మనమే అర్థం చేసుకోవాలి.
భాషాసేవ : ఉత్తరజిల్లాలకు స్కూళ్ల ఇన్స్పెక్టర్గా ఉండిన జె.ఎ. యేట్స్ దొర ఉపాధ్యాయుడు నేర్పే తెలుగు భాషకు, మాట్లాడే భాషకు వ్యత్యాసమున్నట్లు గమనించారు. ఈ విషయమై ఏ.వి.యన్ కాలేజీ ప్రిన్సిపాల్ పి.టి. శ్రీనివాస అయ్యంగార్తో ముచ్చటించగా ఆయన గురజాడ, గిడుగు రామ్మూర్తిలతో చర్చించమన్నారు. యేట్స్ దొరగారు ఈ విషయాన్ని తమ దృష్టికి తేవడంతో రామమూర్తి గారు నిశితంగా ఆలోచించడం ప్రారంభించారు. అంతవరకు ఆయనను ఆకర్షించని ఈ సమస్య వారి మనస్సును వేధించడం మొదలుపెట్టింది. ఇరవయ్యో శతాబ్ది ప్రవేశించిన నాటికి ఆంధ్రదేశంలో నూటికి తొమ్మిది మంది కూడా అక్షరాస్యులు లేరు. పాశ్చాత్యదేశాలలో ఆనాటికే నూటికి తొంభై మంది విద్యావంతులు. ఆయా దేశాలలో బోధనా భాష వ్యావహారికంలో ఉండటమే దీనికి కారణం. ఆనాటికే బెంగాలులో విద్యార్థులకు పరీక్షలను గ్రాంథికంలోగాని, వ్యావహారికంలో గాని వ్రాసే స్వేచ్ఛ ఉండేది. ఈ స్వేచ్ఛ తెలుగు విద్యార్థులకు అత్యంత ఆవశ్యకం అని రామమూర్తి గారు గుర్తించారు.
మొదటిసారిగా రామమూర్తి గారు 1909 లో ఒక ఉపాధ్యాయుల సభలో భాషలు, వాటి పుట్టుకతత్వం, అభివృద్ధి గురించి, తెలుగు భాష మార్పుల గురించి మాట్లాడారు. అనంతరం 1910 మే నెలలో విశాఖపట్నంలో జరిగిన ఒక ఉపాధ్యాయుల సభలో మెట్రిక్యులేషన్ ఎఫ్.ఎ. తరగతులలో అనువాదాన్ని, వ్యాస రచనను గ్రాంథిక భాషలో కాకుండా వ్యావహారిక భాషలో వ్రాయడం మంచిది అని వ్యావహారిక భాషా ప్రయోజనం గురించి ఉపన్యసించగా సభలో కొంత కలకలం పుట్టింది.
1911 లో రామమూర్తి గారు ఉద్యోగ విరమణ చేసి భాషాసేవ చేస్తూ సవరల పురోభివృద్ధికి తోడ్పడుతూ ఉండాలని నిర్ణయించుకున్నారు. విద్యాసంస్థలలోనికి వ్యావహారిక భాష ప్రవేశపెట్టడానికి తగిన మార్గాలను అన్వేషించే బాధ్యత రామమూర్తి గారి పైన పడింది. ఆ కాలంలో రామమూర్తి గారు, అప్పారావు గారు సెనేట్ మెంబర్లు ఈ ప్రతిపాదనను యూనివర్సిటీలో పెట్టి పాస్ చేయించారు. అదే సమయంలో యేట్స్ దొర ప్రోత్సాహంతో సెట్టి లక్ష్మీ నరసింహం గారు సరళగ్రాంథికంలో రాసిన ‘గ్రీకు పురాణకథలు’ స్కూల్ ఫైనల్ తరగతికి ఉపవాచకంగా వచ్చింది.
ఈ గ్రంథానికి పీఠిక వ్రాసిన శ్రీనివాస అయ్యంగార్ ఒక లెక్కల పుస్తకాన్ని రాసి ప్రచురించారు. వేదం వేంకటాచలయ్య గారు ‘విధిలేక వైద్యుడు’ అన్న పుస్తకం వ్యావహారిక భాషలో రాశారు. బట్టో ఎస్పర్సన్ వ్రాసిన ఇంగ్లీషు వ్యాకరణాన్ని రామమూర్తి గారు తెలుగు వ్యావహారికభాషలో రాశారు. గురజాడ వారు ‘ముత్యాల సరాలు’, “కన్యాశుల్కం” గ్రంథాలు వ్యావహారిక భాషలో రాశారు.
యేట్స్ దొర, శ్రీనివాస అయ్యంగార్, గురజాడ, గిడుగులు తమ ఉద్యమాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. దీనితో గ్రాంథిక పండితులలో ఆందోళన చెలరేగింది. ఇక గ్రాంథిక భాష ఉండదేమోనన్న ఆందోళనతో వీరిని “దుష్ట చతుష్టయంగా” అభివర్ణిస్తూ వ్యావహారిక భాషా వాదాన్ని ఖండిస్తూ యూనివర్సిటీకి తీర్మానం పంపించారు. వీరికి జయంతి రామయ్య పంతులు గారు నాయకత్వం వహించారు. వ్యావహారిక భాషావాదాన్ని ఖండిస్తూ వావిలకొలను సుబ్బారావు గారు ‘ఆధునిక వచన రచనా విమర్శనము’ అనే గ్రంథం రాశారు.
వ్యావహారిక భాషా ప్రయోజనాల ప్రచారం కోసం విజయనగరంలో “ఆంధ్ర సారస్వత సంఘం” నెలకొల్పారు. గ్రాంథిక భాషావాదులు వ్యావహారిక భాషావాదాన్ని అణచివేయడానికి జయంతి రామయ్య పంతులు గారి నాయకత్వంలో ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు’ ను కాకినాడలో స్థాపించారు.
1912 లో రామమూర్తి గారు “మెమోరాండం ఆఫ్ మోడ్రన్ తెలుగు” ప్రభుత్వం వారికి అందజేశారు. జయంతి రామయ్య పంతులుగారు “ఎ డిఫెన్స్ ఆన్ లిటరరీ తెలుగు” ప్రచురించారు. రామమూర్తి గారు 1915 నుండి 1919 వరకు బరంపురం నుండి మద్రాసు వరకు ఊరూరు వెళ్లి నన్నయ నుండి చిన్నయ వరకు భాష పరిణామ క్రమాన్ని తెలియజేస్తూ, పండితుల చేత తమ వాదాన్ని అంగీకరింపజేశారు.
రామమూర్తి గారి సంపాదకత్వంలో వెలువడిన ‘తెలుగు’, కాశీనాథుని నాగేశ్వరరావు గారి ‘భారతి’, ముట్నూరు కృష్ణారావు గారి ‘కృష్ణా’ పత్రికల్లో, వ్యావహారిక భాషలో వ్యాసాలను ప్రచురించసాగారు. దీంతో ఆనాటి యువకుల్లో ఉత్సాహం రేకెత్తి గ్రాంథిక భాషలో రాయలేని పలువురు రచయితలు వ్యావహారిక భాషలో రచనలు చేయడం ప్రారంభించారు. ఒకప్పుడు వ్యావహారిక భాషావాదాన్ని ఎదిరించిన మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రామమూర్తి గారి ప్రోత్సాహంతో “ఆంధ్రభాషానుశాసనం” అనే వ్యావహారిక భాషా వ్యాకరణాన్ని వ్రాశారు.
రామమూర్తి గారి కృషి ఫలితంగానే 1968లో స్థాపించబడిన తెలుగు అకాడమి వివిధ పాఠ్య గ్రంథాలను వ్యావహారికభాషలో ముద్రిస్తోంది. 1911లో రామమూర్తి గారు ప్రారంభించిన వ్యావహారిక భాషోద్యమం 1973 నాటికి సంపూర్ణంగా ఫలవంతమయింది.
వ్యావహారిక భాషా ఉద్యమానికి ఊపిరిలూది, ప్రజాభాషకు పట్టంగట్టేందుకు జీవితకాలమంతా శ్రమించి సఫలత సాధించిన గిడుగురామ్మూర్తి గారు ధన్యులు. వాడుకభాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆగష్టు 29న తెలుగుభాషా దినోత్సవాన్ని జరుపుకుంటూ వారిని స్మరించుకుంటాము.
విశేషాంశాలు
పాలియోగ్రఫీ : ప్రాచీన, మధ్యయుగ కాలంనాటి చేతిరాతలు, తాళపత్ర గ్రంథాలు, శిలాశాసనాలను మరియు పురాతన పత్రాలను అధ్యయనం చేయడం.
ఎపిగ్రఫీ : శాసనాల అధ్యయనం
మహాజరు : “వినతిపత్రం” అని అర్థం.
మహాప్రస్థానం : దీనికి “మృత్యువు” అని అర్థం. “సుదీర్ఘ పయనం” అనే అర్థం కూడా ఉంది. మహాభారతంలో 17వ పర్వం “మహాప్రస్థానం” పర్వం.
![]()
వ్యావహారిక భాషోద్యమ ప్రవక్త Summary in Telugu
రచయిత పరిచయం
పాఠ్యభాగం : వ్యావహారిక భాషోద్యమ ప్రవక్త – గిడుగు రామమూర్తి
రచయిత : – డా. అక్కిరాజు రమాపతిరావు
జననం : 4.5.1936
జన్మస్థలం : ‘వేమవరం’, ‘పల్నాడు తాలూకా, గుంటూరు జిల్లా, మాచవరం మండలం.
తల్లిదండ్రులు : అక్కిరాజు అన్నపూర్ణమ్మ, రామయ్యగార్లు
విద్యాభ్యాసం : నరసరావుపేటలో విద్యాభ్యాసం అనంతరం, ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ (తెలుగు), “వీరేశలింగం పంతులు జీవితం – సాహిత్యంపై పి. హెచ్ఐ పొందారు. “డిప్లొమా ఇన్ లింగ్విస్టిక్స్” చేశారు.
ఉద్యోగం : తెలుగు అకాడమీలో పరిశోధనాధికారిగా పని చేశారు.
కలం పేరు : మంజుశ్రీ
ప్రత్యేకతలు : సృజనాత్మక రచయితగా ప్రసిద్ధి చెందారు. పరి శోధకులుగా, జీవిత చరిత్రల రచయితగా, సమీక్షకులుగా, విమర్శకులుగా, వక్తగా వీరు తెలుగు సాహితీ లోకానికి సుపరిచితులు.
అవార్డు : “వ్యవహారిక భాషా వికాసం పరిశోధనా గ్రంథానికి 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు.
రచనలు : పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలోని’ దీక్ష, పురాతన ప్రకరణాలను తెలుగు వచనంలోకి అనువాదం, తెలుగులో స్వీయ చరిత్రలు (వ్యాస సంపుటి) 1984లో యువభారతిలో ప్రచురణ, కంచి మీదుగా నా అరుణాచల యాత్ర, ప్రతిభా మూర్తులు మొదలైనవి 60 పుస్తకాలు వరకు రచించారు. ప్రస్తుత పాఠ్యభాగం అక్కిరాజు రమాపతి రావు గారి “గిడుగు రామమూర్తి జీవితం ఉద్యమం” అను గ్రంథం నుండి గ్రహించ బడింది.
పాఠ్యభాగ ఉద్దేశ్యం
“మా దృష్టిలో దేశభక్తి అంటే మాతృభాష మీద అభిమానమే” అని ప్రకటించిన స్వాభిమాని గిడుగు రామమూర్తి పంతులుగారు. ప్రజాక్షేత్రంలో వ్యవహరించే భాష బోధనాభాషగా ఉండాలని పట్టుబట్టి సాధించిన ధీశాలి గిడుగువారు. అందువలనే ఆయనను “గిడుగు-పిడుగు” అనేవారు. తెలుగుభాష మనుగడ, వ్యాప్తి, కాలానుగుణంగా ఆధునీకరించడం కోసం రామమూర్తిగారు చేసిన కృషిని విద్యార్థులకు తెలపడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం.
పాఠ్యభాగంలోని ముఖ్య విషయాలు
వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు, బహుభాషావేత్త, చరిత్రకారుడు, పరిశోధకుడు, సంఘసంస్కర్త అయిన గిడుగు రామమూర్తి వ్యావహారిక భాషా ఉద్యమానికి ఊపిరిలూది, ప్రభా భాషకు పట్టంగట్టేందుకు జీవితకాలమంతా శ్రమించి, సఫలత సాధించారు. సవర భాషను నేర్చుకొని సవర భాషలో వాచకాలను, కథల పుస్తకాలను, పాటల పుస్తకాలను, నిఘంటువులను తయారు చేశారు.
![]()
కఠిన పదాలకు అర్థాలు
పేజి – 91:
బదిలీ = ఉద్యోగులను ఒకచోటి నుండి మరొక చోటికి మార్చుట
పేజి – 93 :
ప్రాయం = వయస్సు
కంఠస్థం = ఒప్పగించుటకు బాగుగా వచ్చి ఉన్నది
తీరిక = పనిలేక ఊరికే ఉండుట
ఇతిహాసం = పూర్వము ఇలా జరిగిందని పరంపరగా చెప్పబడిన గ్రంథం
దివంగతుడు = మరణించినవాడు
గత్యంతరం = మరొక మార్గం
లోయర్ ఫోర్తు క్లాస్ = బ్రిటీష్ విద్యా విధానాన్ని అనుసరించే పాఠశాలలో 4వ తరగతి (లోయర్, అప్పర్) చదువులో దిగువ స్థాయిని సూచిస్తుంది.
స్తోమత = శక్తి, సామర్థ్యం
గిట్టేది కాదు = నచ్చదు
మిడిల్ స్కూల్ = 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఉండే పాఠశాల
ఫస్టు ఫారం = 6వ తరగతి (పాత (పూర్వ) విధానంలో)
స్వయంకృషి = తనకు తానుగా పడిన కష్టం
దీక్ష = పట్టుదల
ఎఫ్.ఏ = ఫస్ట్ ఇన్ ఆర్ట్స్ (బ్రిటీష్ కాలానికి చెందిన విద్యా విధానంలో ఇప్పటి (12th) ఇంటర్ మీడియట్తో సమానమైన చదువు)
ఆకళింపు = అవగాహన
పేజి – 94 :
నిక్కచ్చి = మొగమాటము లేని
సిఫార్సు = సూచన
నిబద్ద = పనిలో అంకితభావం కలిగి ఉండుట
అతీతుడు = సత్త్వరజస్తమములను దాటినవాడు.
ఆక్షేపించు = నిందించు
శబరి = పంపా తీరాన మతంగా శ్రమమున ఉన్న రామభక్తురాలైన బోయజాతి స్త్రీ.
సవరలు = ఆంధ్రా, ఒరిస్సా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు
వైధవ్యం = భర్త చనిపోయిన స్త్రీ ఉన్న స్థితి
కన్యాదానం = కన్యను వరునకు ఇచ్చి చేయు పెండ్లి
బార్-ఎట్-లా = న్యాయవాది
సహపంక్తి = ఒకే వరుస
ఆదిమవాసులు = ఏదైన భూభాగంలో వేలాది సంవత్సరాలుగా నివసిస్తున్న స్థానిక ప్రజలు / భారతదేశంలోని వివిధ సమూహాలను ‘ఆదివాసీలు’ అని పిలుస్తారు.
అనామకులు = సామాన్యులు
లిపి = వ్రాత
![]()
పేజి – 95:
పారితోషికం = బహుమతి
గ్రాంట్ = ఉచిత డబ్బు
అహరహం = ప్రతిరోజు
మెమోరాండం = కార్యాలయ విషయాలను రికార్డు చేయడానికి మరియు తెలియజేయడానికి ఉపయోగించే చిన్న లిఖిత పత్రం, మెమో.
బ్రహ్మచెముడు = వినబడని స్థితి, ఎక్కువ చెముడు
కైజర్-ఇ-హింద్ = భారత చక్రవర్తి (బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంలో ప్రజాసేవ, వైద్యం విశేష కృషి చేసిన వ్యక్తులకు ఇచ్చేది)
నిశితం = పరిశీలన
మెట్రిక్యులేషన్ = 10వ తరగతి వరకు గల చదువు, SSLC
కలకలం = గోల
పేజి – 96 :
సెనేట్ = చట్టసభ
పీఠిక = పుస్తకం మొదట రాసే దాని పుట్టు పూర్వోత్తరాలు
అంచెలంచెలుగా = దశలవారీగా (Step by step)
తీర్మానం = నిర్ణయం
పరిణామం = మార్పు
పేజి – 97 :
భేషజం = ఆడంబరం
రాజమార్గం = పెద్ద బాట
అభిలషించు = కోరు
విడ్కోలు= విడుచుట
నిరసన = తిరస్కారము
వాగ(ను)శాసనుడు = తెలుగు భాషకు, వ్యాకరణానికి, పద స్వరూపానికి ఖచ్చితమైన నియమం (శాసనం) నిర్దేశించినవాడు
శ్లాఘించు = పొగడు
పేజి – 98 :
శీఘ్రం = వెంటనే, వేగిరం
కడపటి = చివరి
సఫలం = విజయవంతం, సక్సెస్
కీర్తిశేషులు = మరణించినవారు
తుది విన్నపం = చివరి మనవి
ఊపిరిలూది = ప్రాణం పోసి
పట్టంగట్టు = అధికారిక గౌరవం
ధన్యుడు = పొగడదగినవాడు, అనుకొన్న పనిని నెరవేర్చు కొన్నవాడు.
![]()