కాళియమర్దనం Questions and Answers Summary Inter 2nd Year Telugu

Reviewing AP Inter 2nd Year Telugu Study Material పద్యభాగం 2nd Poem కాళియమర్దనం Questions and Answers Summary can help students prepare confidently for exams.

AP Inter 2nd Year Telugu కాళియమర్దనం Questions and Answers

అభ్యాసం

I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కాళియమర్దన వృత్తాంతాన్ని వివరించండి.
జవాబు:
యమునా నది యొడ్డున గోకులం ఉండేది. అందులో రోహిణీ, యశోదలతో కలిసి నందుడు తమ కుమారులైన బలరామ, శ్రీకృష్ణులతో కూడి సుఖంగా జీవించేవాడు. వారిని ఆశ్రయించి గోపాలకులు, గోపికలు, అసంఖ్యాక గోవులు ఉండేవి. గోకులానికి సమీపంలో యమునా నదికి అనుబంధంగా ‘కాళింది’ అనే మడుగులో కాళియుడనే గొప్ప సర్పరాజు తన భార్యలతో కలసి నివసించేవాడు. అతడు ఎగజిమ్మే, విష జ్వాలలకు ఆ సమీపానికి వచ్చిన అన్ని ప్రాణులు మరణించేవి.

ఒకనాడు గోవులతోపాటు గోవిందుని సహచరులైన కాళింది మడుగులో నీరు త్రాగి ప్రాణాలు కోల్పోయారు. వారిని బాలకృష్ణుడు బ్రతికించాడు. కాళియుని మదమణచాలని నిర్ణయించుకున్నాడు. విషజ్వాలలు ఉప్పొంగుతున్న మడుగులోనికి దూకాడు. అది గమనించిన కాళియుడు తన ప్రభావాన్ని చూపుతూ శ్రీకృష్ణుని కాటు వేశాడు. తన శరీరంతో చుట్టివేశాడు.

అది చూచిన గోకులంలోని వారంతా గగ్గోలు పెట్టారు. కన్నీరు మున్నీరయ్యారు. శ్రీకృష్ణుని శక్తి తెలిసినవాడైన ఒక బలభద్రుడు మాత్రం నవ్వుతూ అంతా గమనించసాగాడు. అంతలో పూతనాంతకుడైన ముకుందుడు తన శరీరాన్ని పెంచి, కాళియుని పడగలపై చేతితో బలంగా చరిచాడు. ఆ పెద్ద సర్పాన్ని గిర్రున త్రిప్పి విసిరికొట్టాడు. అయినా విజృంభిస్తున్న కాళీయుని పడగలపై ఎక్కి కృష్ణమూర్తి చక్కగా తాండవం చేశాడు. దానితో కాళియ సర్పం యొక్క గర్వం, అహంకారం, క్రోధం అణగిపోయాయి. తనపై నృత్యం చేస్తున్న బాలకుడు సామాన్యుడు కాదని జగన్నాథుడైన శ్రీహరి అని తెలుసుకుని శరణువేడాడు కాళియుడు.

ప్రశ్న 2.
శ్రీకృష్ణుని వెతుకుతూ వెళ్ళిన గోకుల వాసులంతా ఎలా దుఃఖించారు ?
జవాబు:
గొల్లపల్లెలో ఉన్న నందుడు, యశోద మొదలైన గొల్లవారు శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఆపదలో చిక్కుకున్నాడేమో అని ఆరాటపడుతూ, ఆక్రందన చేస్తూ గొల్లపల్లె నుండి బయలుదేరారు. బలరాముడు, నందుడు మున్నగు గొల్లలు అడవిదారిలో వెదుకుతూ వెళ్ళారు. గోప బాలురు అడుగుజాడలు, ఆవుల అడుగుజాడల ఆధారంగా కాళిందీ నది ఒడ్డుకు చేరుకున్నారు.

కాళియుడు కృష్ణుణ్ణి కరవడం చేత, ఆ పాము శరీరంతో శరీరమంతా చుట్టుకొన్నందువల్ల, సొమ్మసిల్లి పడి ఉన్న శ్రీకృష్ణుణ్ణి చూచి, ఒడ్డున నిలబడి దుఃఖం ఆపుకోలేక కృష్ణా ! కృష్ణా ! అని గొంతెత్తి విలపిస్తూ తమ దురదృష్టాన్ని తిట్టుకునే కృష్ణుణ్ణి తోడివారయిన గొల్ల కుఱ్ఱల్ని చూశారు. మేతలు మాని, రెప్పవేయకుండా, దుఃఖంతో శ్రీకృష్ణుణ్నే చూస్తూ ఉండే గోవుల్ని, దూడల్ని చూశారు. ఈ సన్నివేశం చూసిన గోపికలు యశోదను కౌగిలించుకుని విలపించారు.

“అయ్యో ! బిడ్డా ! భయంకరమైన ఆ సర్పం కోపంతో నిన్ను కరుస్తూ ఉంటే ఎంతగా వణకిపోయావో ? నీ దౌర్భాగ్యాన్ని ఎంతగా తిట్టుకున్నావో ? మమ్మల్ని తలచుకొని ఎంతగా పలవరించి పోయావో ? అంటూ పరిపరి విధాల గోకుల వాసులంతా అనుకుంటూ దుఃఖించారు.

కాళియమర్దనం Questions and Answers Summary Inter 2nd Year Telugu

II సంక్షిప్తరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
యమునా నదిలో ఉన్న మడుగు గురించి రాయండి.
జవాబు:
యమునా నదిలో మిక్కిలి లోతైన పెద్ద మడుగు ఉంది. అందులో కాళియుడను పెద్ద పాముంది. అదీ తన విషాగ్ని జ్వాలలతో, ఆ నది నీటిని మరుగుతూ ఉప్పొంగేలా చేస్తూ ఉంటుంది. ఆ మడుగు మీదగా ఎగిరి వెళ్ళే పక్షులు ఆ వేడి సోకి అందులో పడి చచ్చిపోతూ ఉంటాయి. ఆ మడుగులోని కెరటాల మీదుగా వచ్చిన గాలి సోకిందంటే ఎటువంటి బలం గల ప్రాణి అయినా చచ్చి పోవలసిందే.

ప్రశ్న 2.
మడుగులో దూకిన కృష్ణుణ్ణి చూసి కాళియుడు ఏమనుకున్నాడు ?
జవాబు:
మడుగులో దూకిన కృష్ణుణ్ని చూసి కాళియుడు “వీడు చిన్నవాడు. ‘పైగా ఒంటరివాడు. ఇటువంటి వాడు అయి ఉండి, నా మడుగును క్షోభింప చేశాడు. నేను ఈ మడుగులోపల ఉన్నాననే సంగతి వీనికి తెలిసి ఉండదు. నాకు కోపం వచ్చిందంటే ఎంత తీవ్రంగా ఉంటుందో లోకానికి తెలియజేయడానికి ఇదే అదను. నా క్రోధాగ్ని జ్వాలలతో ఇతణ్ణి బూడిద చేసి, వీని ప్రాణాలు తీస్తాను” – అని అనుకున్నాడు.

ప్రశ్న 3.
కాళియుని పడగలపై కృష్ణుడు నాట్యం చేసే విధానాన్ని వివరించండి.
జవాబు:
శ్రీకృష్ణుడు అనే ప్రసిద్ధ నర్తకుడు కాళియుని పెద్ద పెద్ద పడగల మీదికి ఎక్కి, మిక్కిలి నేర్పుతో నాట్యం చేశాడు. ఆ సమయంలో ఆ పాము పడగలు, కెంపులు మొదలైన రతనాలు పొదిగిన విశాలమైన నాట్యమండపంలా ప్రకాశించాయి. యమునా నదిలోని పెద్ద పెద్ద కెరటాల చప్పుళ్ళు, ఆ నాట్యానికి సహకారం అందించే మద్దెల చప్పుళ్ళ వలె ఉన్నాయి.

బృందావనంలో తిరిగే తుమ్మెదల యొక్క ఝుంకారం, వీనుల విందుగా ప్రక్కనున్న గాయకులు అందించే సహకార గానంలా ఉంది. ఆ నదిలోని రాజహంసలు, బెగ్గురు పక్షులు చేసే శ్రావ్యమైన ధ్వనులు, తాళాల మ్రోతలవలె ఉన్నాయి. ఆ రమణీయ సన్నివేశాన్ని ఆకాశంలో ఉన్న దేవతలు, గంధర్వులు సభలో సుఖంగా కూర్చుండి, నాట్యం చూస్తూ వున్న ప్రేక్షకులవలె ఉన్నారు.

III ఏక వాక్యరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
యమునా నదిలో ఉన్న మడుగు ఎవరి విషం చేత నిండిపోయింది ?
జవాబు:
యమునా నదిలో ఉన్న మడుగు కాళియుని విషం చేత నిండిపోయింది.

ప్రశ్న 2.
గోకులంలో పుట్టిన వారిలో ఉత్తముడెవరు ?
జవాబు:
గోకులంలో పుట్టిన వారిలో ఉత్తముడు శ్రీకృష్ణుడు.

కాళియమర్దనం Questions and Answers Summary Inter 2nd Year Telugu

ప్రశ్న 3.
తన పడగలపై నాట్యం చేస్తున్న బాలుణ్ణి కాళియుడు ఎవరని అనుకున్నాడు ?
జవాబు:
తన పడగలపై నాట్యం చేస్తున్న బాలుణ్ణి, కాళియుడు శ్రీహరిగా తలచాడు.

ప్రశ్న 4.
ఏ అవతారంలో సముద్ర మధ్యంలో ఈదడం వలన శ్రీకృష్ణునికి ఈదడం అభ్యాసం అయింది ?
జవాబు:
మత్స్యావతారంలో సముద్ర మధ్యంలో ఈదడం వలన శ్రీకృష్ణునికి ఈదడం అభ్యాసం అయింది.

ప్రశ్న 5.
కృష్ణుడు మడుగులో దూకడం వలన ఎంత దూరం మేర బుడగలు లేచాయి?
జవాబు:
కృష్ణుడు మడుగులో దూకడం వలన నాలుగు వందల మూరల విస్తీర్ణం వరకు బుడగలు లేచాయి.

ప్రశ్న 6.
గోకులంలో కృష్ణుని శక్తి తెలిసిన వారెవరు ?
జవాబు:
గోకులంలో కృష్ణుని శక్తి తెలిసినవారు బలరాముడు.

ప్రశ్న 7.
కాళియమర్దనం పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
కాళియమర్దనం పాఠ్యభాగ రచయిత పోతన.

ప్రశ్న 8.
కాళియమర్దనం ఏ గ్రంథం నుండి గ్రహించబడింది ?
జవాబు:
కాళీయమర్దనం ఆంధ్రమహాభాగవతం దశమ స్కంధం నుండి గ్రహింపబడింది.

ప్రశ్న 9.
భాగవతం ఎన్ని స్కంధములు ?
జవాబు:
భాగవతం 12 సం్కంధములు.

ప్రశ్న 10.
శ్రీకృష్ణుని సోదరుని పేరేమి ?
జవాబు:
శ్రీకృష్ణుని సోదరుడు బలరాముడు.

IV. సందర్భ సహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
సంతుష్ట మానసములఁ జనిరిమానవేంద్ర
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము బమ్మెరపోతనచే రచింపబడిన ఆంధ్ర మహాభాగవతం – దశమ స్కంధము నుండి గ్రహింపబడిన “కాళియమర్దనం” అను పాఠములోనిది.

సందర్భము : శ్రీకృష్ణుడు మిగిలిన గొల్ల పిల్లలు అందరూ కలసి ఆవులను తోలుకొని అడవికి వెళ్ళారు. ఎండ తీవ్రంగా ఉండడం చేత దాహం వేసింది గోవులకు, గొల్ల పిల్లలకు. యమునా నదికి వెళ్ళి, నదిలోని విషం కలిగిన నీటిని త్రాగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అపుడు కృష్ణుని చూపులతో వారిని బ్రదికించారు. శ్రీకృష్ణుని దయవల్ల తాము బదికినట్లు తెలిసికొని సంతోషంతో గొల్ల పల్లెకు వెళ్ళారని చెబుతూ శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో పల్కిన సందర్భము.

భావము : రాజా ! అందరు సంతోషంతో గొల్లపల్లెకు వెళ్ళారని భావము.

కాళియమర్దనం Questions and Answers Summary Inter 2nd Year Telugu

ప్రశ్న 2.
లోకులకు నాకోపంబు దీపింపఁగన్
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము బమ్మెరపోతనచే రచింపబడిన ఆంధ్ర మహాభాగవతం – దశమ స్కంధము నుండి గ్రహింపబడిన “కాళీయమర్దనం” అను పాఠములోనిది.

సందర్భము : చిన్నవాడు, ఒంటరివాడైన వీడు నా మడుగును క్షోభింప చేశాడు. ఈ మడుగు లోపల నేను (కాళియుడు) వీనికి (కృష్ణునికి) తెలియదు. నా క్రోధాగ్ని జ్వాలలతో ఇతణ్ణి బూడిద చేసి ప్రాణాలు తీస్తాను. దీని ద్వారా నా కోపం ఎలా ఉంటుందో లోకాలకు తెలుస్తుంది అని కాళియుడు అనుకున్న సందర్భము.

భావము : నా క్రోధాగ్నిని లోకాలకు తెలిసేందుకు ఇదొక చక్కని అవకాశం.

ప్రశ్న 3.
బరిశేషిత దర్పము గ్రూరసర్పమున్
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము బమ్మెరపోతనచే రచింపబడిన ఆంధ్ర మహాభాగవతం – దశమ స్కంధము నుండి గ్రహింపబడిన “కాళీయమర్దనం” అను పాఠములోనిది.’

సందర్భము : మహా పరాక్రమవంతుడైన ఆ శ్రీకృష్ణుడు జంకు గొంకు లేకుండా ఆ పాము (కాళియుని) పడగల మీద చేతితో ఒక చరుపు చరిచాడు. ఆ పాము రెండు దౌడలు చిక్కబట్టి, కళ్ళ నుండి విషాగ్నులు బయటకు ప్రసరిస్తూ ఉండగా దాన్ని పైకెత్తి గిర గిర త్రిప్పి విసరివేశాడని చెప్తూ శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు చెప్పిన సందర్భము.

భావము : సర్పం యొక్క మిగిలిన గర్వం చాలా భాగం అణగిపోయిందని భావం.

ప్రశ్న 4.
భీతిన్ శరణంబు నొందె బిట్టలసి నృపా !
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము బమ్మెరపోతనచే రచింపబడిన ఆంధ్ర మహాభాగవతం – దశమ స్కంధము నుండి గ్రహింపబడిన “కాళియ మర్దనం” అను పాఠములోనిది.

సందర్భము : రాజా ! ఆ బాలుడెవడో తెలుసుకున్న కాళియుడు శ్రీహరిని శరణము కోరాడని చెప్తూ శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో పల్కెను. భావము : భయంతో కాళియుడు శ్రీహరిని శరణు వేడెను.

విశేషాంశాలు

1. పరీక్షిన్మహారాజు : పాండవుల వారసుడైన పరీక్షిన్మహారాజు స్వయంకృతాప రాధం వలన ముని బాలకునిచే (శృంగి) శపించబడ్డాడు. పాముకాటుతో తన మరణం తథ్యం అని తెలుసుకుని ప్రాణాలు పోయేలోపు పుణ్యదాయకమైన భాగవతం వినాలనుకున్నాడు. అందుకు సమర్థుడైన శుకమహర్షిని ఆహ్వానించి ఏడురోజులపాటు భాగవతాన్ని చెప్పించుకుని విన్నాడు.

2. కాళియుడు : కాళియుడనే సర్పరాజు గరుత్మంతుని ధిక్కరించి ఆయన ఆగ్రహానికి గురయ్యాడు. గరుడుడు చేరుకోలేని కాళింది అనే మడుగులోకి తన పరివారంతోసహా చేరిపోయి నివసించసాగాడు. భయంకరమైన తన విషాన్ని ఎగజిమ్ముతూ, మడుగును సమీపించిన ప్రాణులన్నింటినీ చంపేవాడు.

3. పాదరేఖలు : హస్తరేఖలు వాటి గురించి చెప్పే హస్తసాముద్రికం గురించి అందరికీ తెలిసిందే. వీటిలాగే పాదాల కింద (అరికాళ్ళకు) కూడా సాధారణంగా మానవులందరికీ రేఖలుంటాయి. కారణజన్ములకు, దైవాంశ సంభూతులైనవారికి పాదాలకింద విశేషమైన రేఖలుంటాయి. శ్రీరామ చంద్రుని పాదాల క్రింద పద్మ రేఖలున్నట్లుగా మొల్ల రామాయణంలో వర్ణించబడింది.

అలాగే భీమునికి కూడా అరికాళ్ళలో వజ్రం, పూర్ణకలశం, పద్మ రేఖలున్నాయని ఆంధ్రమహాభారతం అరణ్యపర్వంలో వర్ణనలున్నాయి. ఈ విధంగానే శ్రీకృష్ణుని పాదాలకు యవ, అంకుశ, హల, వజ్ర, చక్ర, చాప, ధ్వజరేఖ మొదలైన చిహ్నాలు ఉన్నాయని భాగవతం వివరించింది.

4. ధనువు : సాధారణార్థంలో విల్లు, విశేషార్థంలో కొలమానం, ధనస్సు ప్రమాణం అంటే 6 అడుగుల దూరం. ధనుశ్శతం అంటే 600 అడుగుల దూరం అని అర్థం.

5. పూతన : కంసునిచే పంపబడిన పూతన అనే రాక్షసి అందమైన రూపం ధరించి నందుని గృహంలో చొరవగా ప్రవేశించింది. ఊయలలో ఆడుకుంటున్న బాలకృష్ణుని ఎత్తుకుని తన విషపు చనుబాలు త్రాగించింది. శ్రీకృష్ణుడు ఆమె పాలు తాగిన వెంటనే ఆ రాక్షసి పెద్దపెట్టున అరుస్తూ, పరుగెడుతూ, నిజరూపంతో నేలకూలింది. నందుడు మొదలైనవారు పూతన మృత కళేబరానికి దహనక్రియలు చేయగా, బృందావనమంతా సుగంధం వ్యాపించింది.

6. చారణులు : ఆకాశంలో సంచరించే దివ్యులు.

కాళియమర్దనం Questions and Answers Summary Inter 2nd Year Telugu

చారుచర్య Summary in Telugu

కవి పరిచయం

భాగవత రచనా శైలి : పోతన వర్ణనలు మిక్కిలి విశదాలై వర్ణ్యం పఠితలకు సాక్షాత్కరిస్తుంది. ఈయన శైలి అతి మధురమైనది. తెలుగు భాషకు నిసర్గమైన సంగీత మాధుర్యం ఈయన భాగవతంలో సర్వతోముఖంగా కన్పిస్తుంది. ఈయనకు అలంకార ప్రీతి మెండు. వర్ణనల సందర్భంలో అంత్యానుప్రాసాలంకారం ఎక్కువగా వాడాడు. ఈయన భాగవతం తెలుగుదేశంలో పండితులకు, పామరులకు, వృద్ధులకు, బాలురకు, స్త్రీలకు, పురుషులకు – సర్వులకూ పీతి పాత్రమైన మహాకావ్యము.

భాగవతం-రచనా చరిత్ర: భాగవతోత్తముడైన పోతన భగవత్ ప్రేరణతో తెలుగులో భాగవతాన్ని అనితరసాధ్యంగా పూర్తి చేశాడు. తన నోట ఆ పరమాత్మే అంతా పలికిస్తున్నాడని వినమ్రంగా చెప్పుకున్నాడు. అసాధారణ కవిత్వ, పటుత్వ సంపద గల 12 స్కంధాలు మాత్రమే పోతన గారి పేరున లభిస్తున్నాయి. మిగిలినవి వారి శిష్యులు, అనుయాయులు అయిన గంగన పేరున 5వ స్కంధం, సింగయ పేరున 6వ స్కంధం, నారయ పేరున 11, 12 స్కంధాలు లభిస్తున్నాయి. అయినప్పటికీ మోక్షలక్ష్మీదేవి అనుగ్రహాన్ని వర్షించే భాగవతం పోతన వలనే తెలుగువారికి నిత్య పారాయణ గ్రంథమైంది.

పాఠ్యభాగ ఉద్దేశం

శ్రీకృష్ణుని లీలల్లో కాళియ మర్దనం ఒకటి. బలం, అహంకారాలతో తోటి ప్రాణులన్నింటినీ హతమార్చడమే కాకుండా తన విషంతో జల కాలుష్యానికి పాల్పడుతున్న కాళియుని గర్వాన్ని అణచివేయడమే ఈ పాఠం ప్రధాన ఉద్దేశ్యం. బలం, యుక్తి ఉన్నప్పుడు లోక కల్యాణం కొరకు ధైర్య సాహసాలతో దుర్మార్గాన్ని అణచి వేయాలని ఈ కథలోని అంశం. భాగవతానికి దశమ స్కంధము హృదయ మని ముఖమని ఆధ్యాత్మిక కోవిదులు చెప్తున్న మాట. కనుక ఈ పాఠాన్ని చదివిన విద్యార్థులంతా తమకు ఆపదలు కల్గితే తరుణోపాయాన్ని ఆలోచించి తెలివిగా బయట పడాలని వారి భావి జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలి.

పాఠ్యభాగ నేపథ్యం

నవవిధ భక్తి మార్గాలకు భాగవతం నిలయం. దశమస్కంధంలో శ్రీకృష్ణ బలరాముల బాల్య క్రీడలన్నింటికి ఆటపట్టినది. తృణావర్తుని వృత్తాంతము, పూతన సంహారం, శకటాసుర భంజనం, యశోదమ్మకు కృష్ణుడు తన నోటిలో బ్రహ్మాండ భాండాలను చూపడం, గోపబాలకులతో కృష్ణుడు చల్దులారగించుట, బలరాముడు ధేనుకాసురుణ్ని చంపుట. తర్వాత కాళీయమర్దనం సన్నివేశాన్ని వర్ణించడమే ప్రస్తుత పాఠ్యభాగం.

పాఠ్యభాగ సారాంశం

వేదవ్యాసుడు రచించిన భాగవతాన్ని శుకమహర్షి పాండవుల వారసుడైన పరీక్షిత్తుకు వినిపించాడు. మాధవుని మాహాత్మ్యాన్ని వివరించే రసవద్ఘాట్టాలలో కాళియమర్దనం ఒకటి. ఇది ద్వాపరయుగం నాటి గాథ. యమునా నది ఒడ్డున గోకులం ఉండేది. అందులో రోహిణీ, యశోదలతో కలిసి నందుడు తమ కుమారులైన బలరామ, శ్రీకృష్ణులతో కూడి సుఖంగా జీవించేవాడు. వారిని ఆశ్రయించి గోపాలకులు, గోపికలు, అసంఖ్యాక గోవులు ఉండేవి. గోకులానికి సమీపంలో యమునానదికి అనుబంధంగా ‘కాళింది’ అనే మడుగులో కాళీయుడనే గొప్ప సర్పరాజు తన భార్యలతో కలిసి నివసించేవాడు. అతడు ఎగజిమ్మే, విషజ్వాలలకు ఆ సమీపానికి వచ్చిన అన్ని ప్రాణులు మరణించేవి. ఒకనాడు గోవులతోపాటు గోవిందుని సహచరులైన గోపబాలురు కాళింది మడుగులో నీరు త్రాగి ప్రాణాలు కోల్పోయారు.

వారిని బాలకృష్ణుడు బ్రతికించాడు. కాళియుని మదమణచాలని నిర్ణయించుకున్నాడు. విషజ్వాలలు ఉప్పొంగుతున్న మడుగులోనికి దూకాడు. అది గమనించిన కాళీయుడు తన ప్రభావాన్ని చూపుతూ శ్రీకృష్ణుని కాటు వేశాడు. తన శరీరంతో చుట్టివేశాడు. అది చూచిన గోకులంలోని వారంతా గగ్గోలు పెట్టారు. కన్నీరుమున్నీరయ్యారు. శ్రీకృష్ణుని శక్తి తెలిసినవాడైన ఒక్క బలభద్రుడు మాత్రం నవ్వుతూ అంతా గమనించసాగాడు.

అంతలో పూతనాంతకుడైన ముకుందుడు తన శరీరాన్ని పెంచి కాళీయుని పడగలపై చేతితో బలంగా చరిచాడు. ఆ పెద్దసర్పాన్ని గిర్రున తిప్పి విసిరికొట్టాడు. అయినా విజృంభిస్తున్న కాళీయుని పడగలపై ఎక్కి కృష్ణమూర్తి చక్కగా తాండవం చేశాడు. దానితో కాళియసర్పం యొక్క గర్వం, అహంకారం, క్రోధం అణగిపోయాయి. తనపై నృత్యం చేస్తున్న బాలకుడు సామాన్యుడు కాదని జగన్నాథుడైన శ్రీహరి అని తెలుసుకుని శరణువేడాడు కాళియుడు.

కాళియమర్దనం Questions and Answers Summary Inter 2nd Year Telugu

పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు

1. సీ. ఒకనాఁడు బలభద్రుఁ డొక్కఁడు రాకుండ
గోపాలకులు దానుఁ గూడి కృష్ణుఁ
డడవికిఁ జని యెండ నా గోవులును గోప
కులు నీరు వట్టునఁ గుంది డస్సి
కాళిందిలో విషకలిత తోయముఁ ద్రావి
ప్రాణానిలంబులు వాసి పడిన
యోగీశ్వరేశుండు యోగివంద్యుడు గృష్ణుఁ
డీక్షణామృతధార లెలమి గురిసి

ఆ. వె. పసుల గోపకులను బ్రదికించె మరలంగ
వారు దమకుఁ గృష్ణు వలన మరల
బ్రదుకు గలిగె నంచు భావించి సంతుష్ట,
మానసములఁ జనిరి మానవేంద్ర!

ప్రతిపదార్దము :

మానవ + ఇంద్ర మానవేంద్ర = ఓ పరీక్షిన్మహారాజా !
ఒకనాడు = ఒకరోజున
బలభద్రుఁడు + ఒక్కడున్ బలభద్రుడొక్కడున్ = ఒక్క బలరాముడు మాత్రము
రాక + ఉండన్ రాకుండన్ = రాకుండగ
కృష్ణుడ = శ్రీకృష్ణుడును
గోపాలకులున్ = మిగిలిన గొల్లలును
తానున్ = తానును
కూడి = కలిసి
అడవికిన్ = అరణ్యమునకు
చని = వెళ్ళి
ఎండన్ = ఎండలో
‘ఆ గోవులను = అడవికి తోలుకొనిపోయిన ఆ ఆవులును
గోపకులును = గొల్లలును
నీరు + పట్టునన్ నీరు వట్టునన్ = దప్పిక చేత
కుంది = బాధపడి
డస్సి = అలసిపోయి
కాళిందిలోన్ = యమునా నదిలో
విషకలిత తోయమున్ = విషంతో కూడుకొనిన నీటిని
త్రావి = త్రాగి
ప్రాణ + అనిలంబులు ప్రాణానిలంబులు = ప్రాణవాయువులు
పాసి = విడిచి
పడినన్ = మరణింపగా
యోగి + ఈశ్వర + ఈశుండున్ యోగీశ్వరేశుండున్ = యోగీశ్వరులను పాలించువాడును
యోగి వంద్యుడున్ = యోగులచేత నమస్కరింపదగినవాడును, అగు
కృష్ణుడు = శ్రీకృష్ణుడు
ఈక్షణ + అమృతధారలు ఈక్షణామృతధారలు = చూపులనెడి అమృత ధారలను
ఎలమిన్ = ప్రేమతో
కురిసి = కురిపించి
పసులన్ = ఆవులను
గోపకులన్ = గొల్లవారిని
మరలన్ + కన్ మరలఁగన్ = తిరిగి
బ్రదికించెను = బ్రతికించినవాడు
వారున్ = ఆ గొల్లలును
తమకున్ = తమకు
కలిగెన్ + అంచున్ కలిగెనంచున్ = కలిగింది అంటూ
కృష్ణువలనన్ = కృష్ణుని వల్ల
మరలన్ = తిరిగి
బ్రదుకు = జీవనం
భావించి = తెలిసికొని
సంతుష్టమానసములన్ = సంతోషించిన మనస్సులతో
చనిరి = (గొల్లపల్లెకు) వెళ్ళారు

తాత్పర్యము : ఓ పరీక్షిన్మహారాజా ! ఒకనాడు ఒక్క బలరాముడు తప్ప శ్రీకృష్ణుడు మిగిలిన గొల్లపిల్లలు అందరు తన వెన్నంటిరాగా ఆవులను తోలుకొని అడవికి వెళ్ళారు. ఎండలో తిరగడం చేత కొంత సమయం గడిచేటప్పటికి ఆవులకు గొల్లలకు దప్పిక కలిగింది. యమునా నదికి వెళ్ళి, నదిలోని విషం కలిగిన నీటిని తాగి, ప్రాణాలు పోగొట్టుకున్నారు. వెంటనే యోగీశ్వరుడైన కృష్ణుడు తన చూపులు అనే అమృతధారలను వారిపై కురిపించి, వారిని బ్రదికించాడు. అపుడు వారందరు శ్రీకృష్ణుని దయ వల్లనే తాము బదికినట్లు తెలిసికొని, సంతోషంతో గొల్లపల్లెకు వెళ్ళారు.

2. కం. కాళీయఫణిదూషిత యగు,
గాళిందిఁ బవిత్రఁ జేయఁగా నుత్సుకుఁడై
కాళిందీజలవర్ణుఁడు,
కాళియు వెడలంగ నడిచెఁ గౌరవముఖ్యా !

ప్రతిపదార్థము :

కౌరవ ముఖ్యా ! = కురువంశ రాజులలో శ్రేష్ఠుడవైన ఓ పరీక్షిన్మహారాజా !
కాళియ ఫణి దూషిత = కాళియుడనే పాము చేత కలుషితం చేయబడింది. (ప్రాణ హాని కలిగించునది)
అగు కాళిందిన్ = అయినట్టి యమునా నదిని
పవిత్రన్ = పరిశుద్ధమైన దాన్ని
చేయన్ + కాన్ చేయఁగాన్ = చేయడం కోసం
ఉత్సుకుఁడు + ఐ ఉత్సుకుఁడై = కుతూహలం కలవాడై
కాళిందీ జలవర్ణుడు = యమునా నది నీటి వంటి రంగు కలవాడైన శ్రీకృష్ణుడు
కాళియున్ = కాళియ సర్పమును
వెడలన్ + కన్ + అడిచెన్ వెడలఁగనడిచెన్ = వెళ్ళగొట్టాడు.

తాత్పర్యము : ఓ పరీక్షిన్మహారాజా ! అపుడు శ్రీకృష్ణుడు కాళియ సర్ప విషం చేత కలుషితమైన యమునా నదిని స్వచ్ఛమైన దాన్ని చేయాలని సంకల్పించి, ఆ కాళియుణ్ణి ఆ నది నుండి దూరంగా తరిమివేశాడు.

కాళియమర్దనం Questions and Answers Summary Inter 2nd Year Telugu

3. అనిన ‘నయ్యగాధజలంబువలన మాధవుం డెట్టి నేర్పున సర్పంబు దర్పంబు మాపి వెడలించె, నందుఁ బెద్దకాలం బా వ్యాళం బేలయుండె? నెఱింగింపుము.

ప్రతిపదార్ధము :

అనినన్ = అని చెప్పగా (శుకుడు ఈ విధంగా చెప్పగా)
ఆ + అగాధ జలంబువలనన్ అయ్యగాధ జలంబువలనన్ = మిక్కిలి లోతు గల ఆ యమునా నది నీటి నుండి
మాధవుండు = కృష్ణుడు
ఎట్టినేర్పునన్ = ఎటువంటి సామర్థ్యంతో
సర్పంబు దర్పంబున్ = ఆ పాము గర్వాన్ని
మాపి = పోగొట్టి
వెడలించెన్ = వెళ్ళగొట్టెను
అందున్ = ఆ యమునా నదిలో
ఆవ్యాళంబు = ఆ పాము
పెద్దకాలంబు = చాలాకాలం
ఏల + ఉండెన్ = ఎందుకని ఉండెనో
ఎఱింగింపుము = తెలియజెప్పుము

తాత్పర్యము : అని శుకమహర్షి చెప్పగా విన్న పరీక్షిన్మహారాజు ఈ విధంగా ప్రశ్నించాడు. ఓ మునిశ్రేష్ఠా ! చాలా లోతైన ఆ యమునా నది మడుగులో ఉన్న పాము పొగరును శ్రీకృష్ణుడు ఏ విధంగా అణచాడు ? ఎలా బయటకు వెళ్ళగొట్టాడు? అక్కడే ఆ పాము చాలా కాలం ఉండటానికి కారణం ఏమిటి ? అంతా వివరంగా తెలియజెప్పు.

4. కం॥ తొఱ్ఱులఁ గాచిన నందుని,
కుఱ్ఱని చరితామృతంబు గొనకొని చెవులన్
జఱ్ఱంగఁ దనివి గల్గునె!,
వెఱ్ఱుల కయినను దలంప ? విప్రవరేణ్యా !

ప్రతిపదార్ధము :

విప్రవరేణ్యా ! = బ్రాహ్మణులలో శ్రేష్ఠుడవైన ఓ శుకమహర్షీ!
తలంపన్ = ఆలోచింపగా
తొఱ్ఱులన్ = ఆవులను
కాచిన = రక్షించినట్టి
నందుని కుఱ్ఱని = నందుని బిడ్డయగు శ్రీకృష్ణుని యొక్క
చరిత + అమృతంబున్ చరితామృతంబున్ = చరిత్ర అనే అమృతాన్ని
కొనకొని = ప్రయత్నించి
చెవులన్ = చెవులతో
జుఱ్ఱన్ + కన్ జుఱ్ఱంగన్ = జుట్టుకొనగా
వెఱులకున్ + అయినను
వెఱ్ఱులకయినను = వివేకం లేని వారికైనా
తనివి = తృప్తి
కల్గును + ఎ కల్గునె = కలిగిస్తుందా ? (కలుగదు)

తాత్పర్యము : ఓ శుకమహర్షీ ! ఆవులను కాపాడిన శ్రీకృష్ణుని కథామృతాన్ని చెవులారా ఎంత విన్నా వెర్రివాడికైనా కూడా తనివి తీరదంటే ఇంకా మాబోటి భక్తుల విషయం చెప్పేదేమిటి ? కావున మరింతగా విస్తరించి వినిపింపవయ్యా !

5. అనిన శుకుం డిట్లనియె

ప్రతిపదార్థము :

అనినన్ = అని పరీక్షిన్మహారాజు పలుకగా
శుకుండు = శుకమహర్షి
ఇట్ల = ఈ విధంగా
అనియెన్ = పలికాడు

తాత్పర్యము : అని పరీక్షిన్మహారాజు పలుకగా శుకమహర్షి మళ్ళీ ఈ విధంగా అన్నాడు.

కాళియమర్దనం Questions and Answers Summary Inter 2nd Year Telugu

6. సీ. మానవేశ్వర ! యొక్కమడుఁగు కాళిందిలోఁ
గల, దది యెప్పుడుఁ గాళియాహి
విషవహ్ని శిఖలచే వేఁచు చుండును, మీఁదఁ
బఱతెంచి నంతన పక్షులైనఁ
బడి మ్రగ్గు, నందుఁ దర్భంగశీకరయుక్త
నంబు సోఁకినఁ బ్రాణు లెవ్వి
యైన నప్పుడ చచ్చు ? నట్టి యా మడుఁగులో
నుదకంబు వొంగుచు నుడుకుచుండఁ

తే. జూచి వెఱఁగంది కుజనుల స్రుక్కఁజేయ,
నవతరించిన బలువీరుఁ డాగ్రహించి
భుజగవిషవహ్ని దోషంబు వొలియఁజేసి,
సుజలఁ గావించి యీనదిఁ జూతు ననుచు

ప్రతిపదార్ధము :

మానవ + ఈశ్వర మానవేశ్వర = ఓ పరీక్షిన్మహారాజా !
కాళిందిలోన్ = యమునా నదిలో
ఒక్కమడుగు కలదు = ఒక లోతైన మడుగు (మిక్కిలి లోతు గల చోటు) కలదు.
అది = ఆ మడుగు
ఎప్పుడున్ = ఎల్లప్పుడును
కాళియ = కాళియుడనే పేరుగల
అహి = సర్పం యొక్క
విష వహ్ని= విషాగ్ని యొక్క
శిఖలచేన్ = జ్వాలల చేత
వేఁచుచున్ + ఉండును వేఁచుచుండును = తపింపజేస్తూంటుంది
మీదన్ = మడుగు మీదుగా
పఱతెంచిన + అంతనన్ పఱతెంచినంతనన్ = వచ్చినంత మాత్రం చేతనే
పక్షులు = పిట్టలు
ఐనన్ = అయినా
అందున్ = ఆ మడుగులో
పడి = పడిపోతూ
(మగ్గున్ = చస్తాయి
తద్ = ఆ మడుగు నందలి
భంగ = కెరటాల యొక్క
శీకరయుక్త = తుంపరలతో గూడిన
పవనంబు = గాలి
సోకినన్ = తగిలినను
ప్రాణులు + ఎవ్వి + ఐనన్ ప్రాణులెవ్వియైనన్ = ఎంత బలం గల జీవులైనా
అప్పుడు + అ అప్పుడ = వెంటనే
చచ్చున్ = చచ్చిపోతాయి
అట్టి = అటువంటి
ఆ మడుఁగులోన్ = ఆ మడుగులోపలి
ఉదకంబు = నీరు
ఉడుకుచున్ + ఉండన్ ఉడుకుచుండన్ = కుత కుత ఉడుకుచుండగా
పొంగుచున్ = పైకి పొంగుతూ ఉంటుంది.
కుజనులన్ = దుష్టులను
స్రుక్కన్ + చేయన్ జేయ స్రుక్కఁజేయన్ = శిక్షించుటకై
అవతరించిన = భూమిపై జన్మించిన
బలవీరుడు = గొప్ప వీరుడగు శ్రీకృష్ణుడు
చూచి = ఆ మడుగును చూచి
వెఱఁగు + అంది వెఱగ్రంది = ఆశ్చర్యపడి
ఆగ్రహించి = కోపించి
భుజగ = కాళియుడను సర్పం యొక్క
విష = విషమనెడి
వహ్ని = అగ్ని వల్ల కలిగిన
దోషంబున్ = దుష్టత్వాన్ని
పొలియన్ + చేసి పొలియఁజేసి = నిర్మూలించి
ఈ నదిన్ = ఈ యమునను
సుజలన్ = మంచినీరు కల దాన్నిగా
కావించి = చేసి
చూతున్ (చూచుదును) = చూస్తాను
అనుచున్ = అని అనుకుంటూ

తాత్పర్యము : ఓ పరీక్షిన్మహారాజా ! యమునా నదిలో మిక్కిలి లోతైన పెద్ద మడుగు ఉంది. అందులో కాళియుడు అనే పేరు గల పెద్ద పాము ఉంది. అది తన విషాగ్ని జ్వాలలతో, ఆ నది నీటిని మరుగుతూ ఉప్పొంగేలా చేస్తూ ఉంటుంది. ఆ మడుగు మీదగా ఎగిరి వెళ్ళే పక్షులు ఆ వేడి సోకి అందులో పడి చచ్చిపోతూ ఉంటాయి. ఆ మడుగులోని కెరటాల మీదుగా వచ్చిన గాలి సోకిందంటే చాలు. ఎటువంటి బలం కల ప్రాణి అయినా సరే చచ్చిపోవలసిందే. దుష్ట సంహారం చేయడం కోసం భూమి మీద అవతరించిన శ్రీకృష్ణుడు, సర్ప విషంతో కూడిన ఆ నదిలోని నీటిని, స్వచ్ఛమైన దాన్నిగా చేస్తాను అని సంకల్పించాడు.

7. కృతనిశ్చయుండై, పూర్వజన్మ భాగ్యంబులం దన చరణ సంస్పర్శంబునకు యోగ్యంబై, తత్సమీపంబున విశాలవిటప శాఖాకదంబంబుతో నున్న కదంబ భూజంబు నెక్కి

ప్రతిపదార్థము :

కృతనిశ్చయుండు + ఐ కృతనిశ్చయుండై = చేయబడిన నిర్ణయం కలవాడయి
పూర్వభాగ్యంబులన్ = కడచిన పుట్టుకలలో చేసిన పుణ్యం వల్ల
తన చరణ సంస్పర్శంబునకున్ = తన పాదముల స్పర్శకు
యోగ్యంబు + ఐ యోగ్యంబై = తగిందై
తత్ + సమీపంబునన్ తత్సమీపంబునన్ = ఆ మడుగు దగ్గరలో
విశాల = విస్తరించిన
విటపశాఖా = చిగిర్చిన కొమ్మలు, రెమ్మల
కదంబంబుతోన్ = సమూహంతో
ఉన్న కదంబ భూజంబున్ = ఉన్నట్టి కడిమి చెట్టును
ఎక్కి = అధిరోహించి

తాత్పర్యము : ఈ విధంగా మనస్సులో నిశ్చయించుకున్న వాడయి శ్రీకృష్ణుడు ఒడ్డున ఉన్న కడిమి చెట్టు మీదికి ఎక్కాడు. అది శ్రీకృష్ణుని అడుగుల స్పర్శను నోచు కోవడానికి తగినంత పుణ్యం గత జన్మలలో చేసికొని ఉంది. అది పెద్దవి చిన్నవి అయిన కొమ్మలతోను, రెమ్మలతోను కూడుకొని యుంది.

విశేషము : ఈ మడుగు మీది విషపు గాలి తగిలి ఆకాశంలో ఎగిరిపోయే పక్షులే చచ్చిపోతున్నాయి కదా ! అటువంటిది యమున ఒడ్డు మీద ఈ కడిమి చెట్టు ఎలా బతికి ఉంది. అనే సందేహం కలుగవచ్చు. గత జన్మలో అది శ్రీకృష్ణుని అడుగులు సోకడానికి తగినంత పుణ్యం చేసుకుంది. పాద స్పర్శ జరగాలంటే అది జీవించి ఉండాలి. ఇంతకీ దాని పూర్వ పుణ్యం కారణం. ఇదే కవి సమర్ధన.

కాళియమర్దనం Questions and Answers Summary Inter 2nd Year Telugu

8. మ. కటిచేలంబు బిగించి పింఛమునఁ జక్కం గొప్పు బంధించి దో
స్తటసంస్థలన మాచరించి చరణద్వంద్వంబుఁ గీలించి త
త్కుటశాఖాగ్రము మీఁదనుండి యుఱికెన్ గోపాలసింహంబు ది
క్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభ గుభధ్వానం బనూనంబుగన్

ప్రతిపదార్థము :
గోపాలు సింహంబు = గొల్లవారిలో గొప్పవాడైన ఆ శ్రీకృష్ణుడు
కటిచేలంబున్ = మొలపైనున్న బట్టను
బిగించి = గట్టిగా గట్టి
పింఛమునన్ = నెమలి పురితో
కొప్పు = జుట్టుముడిని
చక్కన్ = చక్కగా
బంధించి = బిగించి
దోస్ + తట సంస్థలనము= భుజ ప్రదేశాల మీద చరచుటను
ఆచరించి = చేసి
చరణ ద్వంద్వంబున్ = అడుగులు రెండింటిని
కీలించి = (దగ్గరకు) చేర్చి
దిక్ + తటములు దిక్తటములు = దిక్కుల యొక్క ప్రదేశాలు
మ్రోయన్ = మారుమ్రోగునట్లుగా
హ్రదంబులోన్ = మడుగులో
గుభగుభ ధ్వానంబు = గుభగుభ అనే చప్పుడు (ఇది ధ్వన్యనుకరణం)
అనూనంబు + కన్ అనూనంబుగన్ = పెచ్చు పెరుగుతుండగా
తత్ = ఆ
కుట = చెట్టు యొక్క
శాఖా = కొమ్మ యొక్క
అగ్రము మీదన్ + ఉండి అగ్రము మీద నుండి = చివరి చోటు నందుండి
ఉబికెన్ = దూకాడు

తాత్పర్యము : శ్రీకృష్ణుడు నడుము మీది బట్టను బిగించి కట్టుకొని, నెమలి పింఛాన్ని జుట్టు ముడిలో బంధించి, ఉత్సాహంతో జబ్బలు చరుస్తూ, రెండు పాదాలు కూడ తీసికొని, ఆ కడిమి చెట్టు కొమ్మ కొన నుండి మడుగులోనికి దూకాడు. ఆ అదురుపాటుకు నాలుగు దిక్కులు పిక్కటిల్లాయి. మడుగులో గుబ గుబ ధ్వనులు హెచ్చెయి పోయాయి.

9. ఉ. భూరిమహాప్రతాప పరిపూర్ణ భయంకర గోపబాల కం
ఠీరవ పాతవేగ వికటీకృత దుర్విషభీషణోర్మి సం
పూరితమై వడిం గలఁగి పొంగి ధనుశ్శతమాత్రభాగ వి
స్తారము వొంగె నమ్మడుఁగు తప్తపయఃకణబుద్బుదోగ్రమై

ప్రతిపదార్థము:
భూరి = మిక్కిలి
మహా ప్రతాప = అధికమైన పరాక్రమం చేత, తేజస్సు చేత
పరిపూర్ణ = చక్కగా నిండిన
భయంకర = భయాన్ని గొల్పే
గోపబాల = గొల్ల పిల్లలతో
కంఠీరవ = శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుని యొక్క
పాత = పడుట (దూకుట) యొక్
వేగ = వడి చేత
వికటీకృత = అల్లకల్లోలంగా చేయబడిన
దుర్ + విష దుర్విష = చెడ్డది అయిన విషంచే
భీషణ = భయంకరమైన
ఊర్మి = కెరటాలచే
సంపూరితము + ఐ సంపూరితమై = బాగుగా నింపబడిందయి
ఆ + మడుగు అమ్మడుగు = ఆ మడుగు
తప్త = కాచబడిన
పయస్ = నీటి యొక్క
కణ = బిందువుల చేతను
బుద్బుద = బుడగల చేతను
ఉగ్రము + ఐ ఉగ్రమై = భయంకరమైనదయి
వడిన్ = వేగంగా
కలఁగి = కల్లోలమై
పొంగి = పైకి ఉబికి
ధనుస్ + శతమాత్ర ధనుశ్శతమాత్ర = నూరువిండ్లు కొలత మాత్రం గల
భాగ = ప్రదేశం యొక్క
విస్తారము = విరివిని
పొంగెన్ = పొందింది. (ధనుస్సు = నాలుగు మూరల కొలది. ధనుశ్శత = 4 × 100 = 400 మూరల విస్తీర్ణ)

తాత్పర్యము : మహా ప్రతాపవంతుడైన శ్రీకృష్ణుడు దూకగానే ఆ వేగానికి ఆ మడుగు కలత పడిపోయింది. విషమయమైన తరంగాల చేతను, కుతకుత ఉడికే నీటి బిందువుల చేతను, నీటి బుడగల చేతను భయాన్ని కలిగిస్తూ కల్లోలమై పొంగుతూ నాల్గువందల మూరల మేర వ్యాపించింది.

10. శా. పాలీనాకృతిఁ దోయరాశి నడుమన్ భాసిల్లి మున్నాఢ్యుఁడై
కాఠిన్యక్రియ నీఁదు నేర్పు దనకుం గల్మిన్ భుజంగేంద్ర హృ
త్పీఠాగ్రంబున రోషవహ్ను లెగయన్ భీమంబుగా నీఁదె ను
ల్లోఠోత్తుంగ తరంగమై మడుఁగు దుర్లోక్యంబుగా బాహులన్

ప్రతిపదార్థము :

మున్ను= పూర్వ౦
పాఠీన + ఆకృతిన్ పాఠీనాకృతిన్ = చేప ఆకృతితో
తోయరాశి నడుమన్ = సముద్ర మధ్య భాగంలో
ఆఢ్యుడు + ఐ ఆఢ్యుడై = ప్రసిద్ధుడై
ప్రకాశించి
కాఠిన్య క్రియన్ = గట్టితనం కలిగి ఉన్నట్లుగా
ఈఁదు నేర్పు = ఈదునట్టి నైపుణ్యం
తనకున్ = తనకు
కల్మిన్ = కలిగి ఉండుట చేత
భుజంగ + ఇంద్ర భుజంగేంద్ర = పాములలో గొప్పవాడగు కాళియుని యొక్క
హృత్ + పీఠ హృత్పర = గుండె అనే పీఠం యొక్క
అగ్రంబునన్ = పై భాగం వఱకు (కాళియుని హృదయమునందని భావం)
రోష వహ్నులు = కోపాగ్నులు
ఎగయన్ = ప్రజ్వరిల్లగా
ఉత్ + లోఠ + ఉత్ + తుంగ తరంగము + ఐ ఉల్లోకోత్తుంగ తరంగమై = పైకి పొంగి పొరలుచున్న మిక్కిలి పొడవైన కెరటాలు కలదయి ఉన్న
మడుఁగున్ = మడుగును
దుర్ + లోక్యంబు దుక్యంబు = చూడ శక్యం కానిది
కాన్ = కాగా
బాహులన్ = భుజాలతో
భీమంబు + కాన్ భీమంబుగాన్ = భయంకరంగా
ఈదెన్ = ఈదాడు

తాత్పర్యము : పూర్వం మత్స్యావతారాన్ని ఎత్తి, సముద్రంలో బాగా ఈదిన అనుభవం ఉన్నవాడు కనుక శ్రీకృష్ణుడు ఆ మడుగులో పెద్ద పెద్ద అలలు పైకి లేచేటట్లు నదిని కలచి వేస్తూ, అటూ ఇటూ భయంకరంగా ఈదాడు. దానితో కాళియుని మనస్సులో కోపాగ్ని జ్వాలలు ఎగదోసినట్లయింది.

కాళియమర్దనం Questions and Answers Summary Inter 2nd Year Telugu

11. ఆ సమయంబున

ప్రతిపదార్థము:

ఆ సమయంబునన్ = అప్పుడు

తాత్పర్యము : ఆ సమయంలో

12. శా. ‘బాలుం డొక్కఁడు వీఁడు నామడుఁగు విభ్రాంతో చ్చలత్కీర్ణ క
ల్లోలంబై కలఁగం జరించె నిట నే లో నుంటఁ జూడండు, మ
త్కీలాభీల విశాలదుస్సహవిషాగ్ని జ్వాలలన్ భస్మమై
కూలంజేసెద నేఁడు లోకులకు నాకోపంబు దీపింపఁగన్

ప్రతిపదార్థము :

వీఁడున్ = ఈతడు
బాలుండు = చిన్న పిల్లవాడు
ఒక్కఁడు = ఒంటరివాడు
నామడుఁగు = (కాళియుడు) నేనుండే ఈ మడుగును
విభ్రాంత = మిక్కిలి భ్రాంతిని కలిగిస్తూ
ఉత్ + చలత్ ఉచ్ఛలత్ = పైకి పొంగుచున్న
కీర్ణ = అంతట వ్యాపించిన
కల్లోలంబు + ఐ కల్లోలంబై = పెద్ద కెరటాలు కలదయి
కలఁగన్ = క్షోభించేట్లుగా
చరించెన్ = ప్రవర్తించాడు
ఇటన్ = ఇచ్చట
లోన్ = మడుగు లోపల
ఏన్ = నేను
ఉంటన్ = ఉండడాన్ని
చూడండు = చూడలేదు
నేడు = ఈనాడు
లోకులకున్ = ప్రజలకు
నాకోపంబు = నాక్రోధం
దీపింపన్ + కన్ దీపింపఁగన్ = వెల్లడి అయ్యేట్లుగా
మత్ = నా యొక్క
కీలా = మంటల చేత
ఆ భీల = భయంకరమైన
విశాల = విస్తృతమైన
దుస్ + సహ – దుస్సహ = సహించడానికి శక్యం కాని
విష + అగ్ని – విషాగ్ని = విషమనెడి అగ్ని యొక్క
జ్వాలలన్ = మంటల చేత
భస్మము + ఐ భస్మమై = బూడిదగా మారి
కూలన్ = చనిపోవునట్లు
చేసెదన్ = చేస్తాను

తాత్పర్యము : వీడు చిన్నవాడు, పైగా ఒంటరివాడు. ఇటువంటివాడు అయివుండి, నా మడుగును క్షోభింప చేశాడు. నేను ఈ మడుగులోపల ఉన్నాననే సంగతి వీనికి తెలిసి ఉండదు. నాకు కోపం వచ్చిందంటే ఎంత తీవ్రంగా ఉంటుందో, లోకానికి తెలియజేయడానికి ఇదే అదను. నా క్రోధాగ్ని జ్వాలలతో ఇతణ్ణి బూడిద చేసి, వీని ప్రాణాలు తీస్తాను.

13. అని తలంచి విజృంభించి

ప్రతిపదార్థము:

అని = ఇట్లా
తలంచి = ఆలోచించి
విజృంభించి = చెలరేగినవాడయి

తాత్పర్యము : అని ఈ విధంగా అనుకొని, ఇంకా విజృంభిస్తూ

14. ఉ. ఘోరవిషానల ప్రభల గొబ్బునఁ గ్రమ్మగ సర్వసైన్య వి
స్పారుఁడు గాళియోరగుఁడు పాఱివడిం గఱచెం బయోధరా
కారుఁ బయోవిహారు భయకంప విదూరు మహాగభీరు నా
భీరకుమారు వీరు నవపీత శుభాంబరధారు ధీరునిన్

ప్రతిపదార్థము :

ఘోర = భయంకరమైన
విష = విషం నుండి పుట్టిన
అనల = అగ్ని యొక్క
ప్రభలు = కాంతులు
గొబ్బునన్ = శ్రీఘ్రంగా
క్రమ్మన్ + కన్ క్రమ్మగన్ = వ్యాపింపగా
సర్ప సైన్య విస్ఫారుడు = పాముల దండు చేత అధికుడైన
కాళియ + ఉరగుడు కాళియోరగుడు = కాళియుడనే సర్పం
పాఱి = పరుగెత్తుకొనిపోయి
పయోధర + ఆకారున్ పయోధరాకారున్ = నీల మేఘం వంటి రూపం కలవాణ్ణి
పయోవిహారున్ = నీటిలో విహరించువాణ్ని
భయకంప విదూరున్ = బెదురు వణకులేనివాణ్ని
మహా గభీరున్ =గొప్ప గంభీరుడైనవాణ్ని (మిక్కిలి లోతైన వాడును)
వీరున్ = పరాక్రమవంతుణ్ణి
నవ = నూతనమైన
పీత = పచ్చనిదీ
శుభ = మంగళకరమైందీ అగు
అంబరధారున్ = వస్త్రాన్ని ధరించినవాణ్ణి
ధీరునిన్ = ధైర్యవంతుడును అగు
ఆ భీరు కుమారున్ = గొల్ల పిల్లవాడగు శ్రీకృష్ణుణ్ని
వడిన్ = వేగంగా
కఱచెన్ = కాటు వేశాడు

తాత్పర్యము : ఈ విధంగా ఆలోచించిన కాళియుడు సర్ప సైన్యంతో కలిసి, విషాగ్ని జ్వాలల కాంతులు అంతట వ్యాపిస్తూ ఉండగా, వేగంగా వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి కాటు వేశాడు. శ్రీకృష్ణుడు నీల మేఘంలా ఉన్నాడు. జంకు గొంకు లేకుండా ఆ మడుగు నీళ్ళల్లో స్వేచ్ఛగా విహరిస్తున్నాడు. ధైర్య గాంభీర్య గుణాలు కలిగి ఉన్నాడు. బంగారు రంగు గల పట్టు వస్త్రాన్ని కట్టుకొని ఉన్నాడు.

కాళియమర్దనం Questions and Answers Summary Inter 2nd Year Telugu

15. కం. కఱచి పిఱుతివక మఱియును,
వెఱవక నిజవదనజనిత విషదహనశిఖల్
మెరయఁ దన నిడుద యొడలిని,
నెఱి హరిఁ బెనఁ గొనియె భుజగనివహపతి వడిన్\

ప్రతిపదార్థము:

కఱచి = కాటు వేసి
పిఱుతివక = వెనుదీయక
వెఱవక = జంకక
మఱియునున్ = ఇంకా
నిజ = తన యొక్క
వదన = ముఖము నందుండి
జనిత = వెలువడిన
విషదహన = విషాగ్ని యొక్క
శిఖల్ = జ్వాలలు
మెరయున్ = ప్రకాశించగా
భుజగ నివహపతి = పాముల గుంపులకు రాజయిన కాళియుడు
వడిన్ = వేగంగా
తన నిడుద + ఒడలినిన్ తన నిడుద యొడలినిన్ = = తన పొడవైన శరీరం చేత
నెఱిన్ = పరాక్రమంతో
హరిన్ = శ్రీకృష్ణుణ్ణి
పెనుఁగొనియెన్ = బంధించాడు

తాత్పర్యము : సర్ప రాజయిన కాళియుడు శ్రీకృష్ణుణ్ణి కాటు వేసి, అంతటితో ఊరుకోకుండా, తన నోటి నుండి విషపు మంటలు వెలిగ్రక్కుతూ, తన పొడవైన శరీరంతో శ్రీకృష్ణుణ్ణి గట్టిగా పెనవేసుకున్నాడు.

16. ఇట్లు భోగిభోగ పరివేష్టితుండై, చేష్టలు లేనివాని తెఱంగునఁ గానంబడు చున్న ప్రాణసఖునిం గనుంగొని తత్ప్రభావంబు లెఱుంగక, తత్సమర్పిత ధనదార మనోరథ మానసులు గావున..

ప్రతిపదార్థము :

ఇట్లు = ఈ విధంగా
భోగి = పాము యొక్క
భోగ = శరీరం చేత
పరివేష్టితుండు + ఐ పరివేష్టితుడై = చుట్టుకొనబడిన వాడయి
చేష్టలు లేని వాని తెఱంగునన్ = కాళ్ళు చేతులు ఆడని వాడి విధంగా
కానన్ + పడుచున్ + ఉన్నన్
కానంబడుచున్నన్ = కనబడుతూ ఉన్నటువంటి
ప్రాణసఖునిన్ = ప్రాణ సమానమైన స్నేహితుణ్ని
కనుంగొని = చూచి
తత్ ప్రభావంబులు = ఆ శ్రీకృష్ణుని మహిమలు
ఎఱుంగక = తెలుసుకొనలేక
తత్ = శ్రీకృష్ణుని యందు
సమర్పిత = సమర్పింపబడిన
ధన = సంపదలు
దార = భార్యలు
మనోరథ = కోరికలు
మానసులు = హృదయములును కలవారు
కావునన్ = అయిన కారణం చేత

తాత్పర్యము : ఈ రీతిగా శ్రీకృష్ణుడు కాళియ సర్పం చేత బంధింపబడి కాళ్ళు చేతులు ఆడనందువల్ల కదలిక మెదలిక లేకుండా ఉండడం చూశారు గొల్ల పిల్లలు. అతడు తమకు ప్రాణ స్నేహితుడు. అతని మహిమలు వారికి తెలియవు. తమ సంపదలు, భార్యలు, కోరికలు, మనస్సులు అన్నింటిని శ్రీకృష్ణునికి సమర్పించి, సర్వస్వం శ్రీకృష్ణుడే అని నమ్మినవారు కావున.

17. చం. అదె మన కృష్ణునిం గఱిచె, నంతటఁ బోక భుజంగమంబు దుర
ర్మదమున మేనఁ జుట్టికొని మానక యున్నది, యింక నేమి సే
యుద? మెటఁ జొత్త, మే పురుషు లోపుదు రీయహి నడ్డపెట్ట నె
య్యది సదుపాయ ? మంచుఁ బడి రార్తరవంబులఁ దూలి గోపకుల్

ప్రతిపదార్థము:

గోపకుల్ = గోపకులు (గొల్లవారు)
అదె = అదుగో
భుజంగమంబు = సర్పము
మన కృష్ణునిన్ = మనవాడైన శ్రీకృష్ణుణ్ణి
కఱచెన్ = కరిచింది
అంతటన్ + పోక అంతటం బోక = అంతటితో విడిచి వెళ్ళక
దుర్ + మదమునన్ దుర్మదమునన్ = పాడు పొగరుతో
మేనన్ = శరీరంపై
చుట్టుకొని = పెనవేసుకొని
మానక ఉన్నది = విడువకుండా ఉంది
ఇంకన్ = ఇటు పైన
ఏమి చేయుదము = శ్రీకృష్ణుణ్ణి విడిపించుకొనేందుకై ఏమి చేయగలం
ఎటన్ + చొత్తము ఎటఁజొత్తము = ఎక్కడకు వెళ్తాం
ఈ + అహిన్ ఈయహిన్ = ఈ పామును
అడ్డ పెట్టన్ = అడ్డగించడానికి (లొంగదీయుటకు)
ఏ పురుషులు = ఏమగవారు
ఓపుదురు = సమర్థులవుతారు
సత్ + ఉపాయము సదుపాయము = మంచి ఉపాయం
ఏ + అది – ఎయ్యది = ఏది ?
అంచున్ = అంటూ
ఆర్తవంబులన్ = ఆర్తితో కేకలు పెడుతూ
తూలి = ఒరిగిపోతూ
పడిరి = నేలపై పడ్డారు

తాత్పర్యము : అదిగో ఆ పాము మన కృష్ణుణ్ణి కరిచింది. అంతటితో వదలి పెట్టకుండా, పొగరుబోతుతనంతో అతని శరీరమంతా చుట్టుకొని కదలకుండా బంధించి వేసింది. ఇంక ఇప్పుడేమి చేద్దాం ? ఎక్కడికి వెళ్లాం ? లొంగదీయగల సమర్థులెవరు? ఏమిటి ఉపాయం ? అని గొల్లపిల్లలంతా శోకంతో బొబ్బలు పెడుతూ నేల మీద పడిపోయారు.

కాళియమర్దనం Questions and Answers Summary Inter 2nd Year Telugu

18. కం. గోపకుమారక శేఖరు
నేపున సర్పంబు గఱచు టీక్షించి వగన్
మేపులకుఁ దొలఁగి గోవులు
వాపోవుచు నుండె వృషభవత్సంబులతోన్

ప్రతిపదార్థము :

గోపకుమారక శేఖరున్ = గొల్ల కుఱ్ఱలలో గొప్ప వాడయిన శ్రీకృష్ణుణ్ణి
కఱచుట = కాటు వేయడం
ఈక్షించి = చూచి
గోవులు = ఆవులు
వృషభ వత్సంబుల తోన్ = ఎద్దులతోను, దూడలతోను గూడ
వగన్ = దుఃఖంతో
మేపులకున్ + తొలగి మేపులకుఁదొలఁగి = మేత మేయడాలు మానివేసి
వాపోవుచున్ + ఉండెన్ వాపోవుచునుండెస్ = అరుస్తూ ఉన్నాయి.

తాత్పర్యము : శ్రీకృష్ణుణ్ణి కాళియ సర్పం కరవడం చూచిన ఆవులు, ఎద్దులు, దూడలు అన్నీ దుఃఖంతో మేత మేయడం మానేసి అరుస్తూ ఉండిపోయాయి.

19. కం. భూతలము వడఁకె నుల్కా
పాతంబులు మింటఁ గానఁబడె ఘోషములో
వ్రేతలకును గోపక సం
ఘాతములకు నదరెఁ గీడుకన్ను లిలేశా !

ప్రతిపదార్దము :

ఇలా+ఈశా ! – ఇలేశా ! = భూమికి ప్రభువైన ఓ పరీక్షిన్మహారాజా !
భూతలమున్ = భూమియు
వడఁకెన్ = కంపించింది
మింటన్ = ఆకాశంలో
ఉల్కాపాతంబులు = ఉల్కలు రాలడం
కానన్ + పడెన్ కానఁబడెన్ = కనుపించాయి
ఘోషములోన్ = గొల్లపల్లెలో
వ్రేతలకున్ = గోపికలకును
గోపక సంఘాతములకున్ = గోపాలకుల గుంపులకును
కీడు కన్నులు = కీడును సూచించునట్లుగా కన్నులు
అదరెన్ = చలించాయి

తాత్పర్యము : భూమి కంపించింది. ఆకాశం నుండి ఉల్కలు రాలుతూ కనిపించాయి. గొల్లపల్లెలో ఉండే ఆడువారికి కుడి కన్నులు, మగవారికి ఎడమ కన్నులు అశుభాన్ని సూచిస్తూ అదిరాయి.

20. అంత నా దుర్నిమిత్తంబులు వొడగని బెగడు గదిరిన చిత్తంబుల నుత్తలపడుచు మందనున్న నందయశోదాదులైన గోపగోపికాజనంబులు హరి దళసరి యెఱుంగక గోపాలగోగణ పరివృతుండైన కృష్ణుం డెక్కడ నైనం జిక్కనోపునని పొక్కుచుం బెక్కువలయిన మక్కువలు చెక్కులొత్త నొక్క పెట్ట బాలవృద్ధ సమేతులై మహాఘోషంబున నా ఘోషంబు వెలువడి

ప్రతిపదార్థము :
అంతన్ = అపుడు
మందన్ + ఉన్న మందనున్న = గొల్లపల్లెలో ఉన్నట్టి
నందయశోదా + ఆదులు నందయశోదాదులు = నందుడు, యశోద మొదలుగా కలవారు
ఐన గోప గోపికా జనంబులు = గొల్లలు గొల్లెతలు అయినట్టి జనులు
ఆ-దుర్ + నిమిత్తంబులు ఆ-దుర్నిమిత్తంబులు = ఆ అపశకునాలు
పొడంగని = చూచి
బెగడు గదిరిన చిత్తంబులన్ = భయపడిన మనస్సులతో
ఉత్తలపడుచున్ = కలత నొందుతు
హరిదళసరి = శ్రీకృష్ణుని యొక్క సామర్థ్యం
ఎఱుంగక = తెలియక
గోపాల = గోపాలరుల
గో = ఆవుల
గణ = సమూహాలతో
పరివృతుండు + ఐన పరివృతుండైన = చుట్టూ ఉన్నవాడైన
కృష్ణుండు = శ్రీకృష్ణుఁడు
ఎక్కడన్ + ఐనన్ ఎక్కడైనన్ = ఏదో ఒకచోట.
చిక్కన్ + ఓపును + అని చిక్కనోపునని = ఇరుకుకొని ఉండవచ్చును అంటూ
పొక్కుచున్ = దుఃఖించుతూ
పెక్కువలు + అయిన మక్కువలు పెక్కు వలయిన మక్కువలు = పెచ్చు పెరిగిన ప్రేమలు
చెక్కులు + ఒత్తన్ చెక్కులొత్తన్ = మితిమీరుచుండగా
ఒక్కపెట్టన్ = ఒక్కసారిగా
బాలవృద్ధ సమేతులు + ఐ బాలవృద్ధ సమేతులై = చిన్న పిల్లలతోను, ముసలివారితోను కూడు కున్నవారయి
మహాఘోషంబునన్ = పెద్ద సవ్వడితో
ఆఘోషంబున్ = ఆ గొల్లపల్లె నుండి
వెలువడి = బయటకు వచ్చి

తాత్పర్యము : గొల్లపల్లెలో ఉన్న నందుడు, యశోద మొదలైన గొల్లవారు ఆడవారు, మగవారు అందరు ఆ దుశ్శకునాలు చూచి భయపడిపోయారు. శ్రీకృష్ణుని సామర్థ్యం తెలియక, గొల్లపిల్లలు ఆవుల మందలతో కలిసి ఉన్న శ్రీకృష్ణుడు, ఎక్కడైనా ఆపదలో చిక్కుకున్నాడేమో అని ఆరాటపడ్డారు. మిక్కిలి ప్రేమతో పిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరు పెద్ద పెట్టున ఆక్రందన చేస్తూ గొల్లపల్లె నుండి బయలుదేరారు.

కాళియమర్దనం Questions and Answers Summary Inter 2nd Year Telugu

21. కం. వా రిబ్భంగి నెఱుంగని
వారై హరిఁ జూడఁ బోవ వడిగఁగొని నగుచున్
వారింపఁ డయ్యె రాముఁడు
వారిని హరి లావెఱుంగువాఁ డయ్యు నృపా!

ప్రతిపదార్థము :

నృపా = ఓ పరీక్షిన్మహారాజా !
వారు = ఆ గొల్లలు
ఈ + భంగిన్ ఇబ్బంగిన్ = ఈ విధంగా
ఎఱుంగనివారు + ఐ ఎఱుంగనివారై = (శ్రీకృష్ణుని శక్తి) తెలియని వారయి
హరిన్ = శ్రీకృష్ణుని
చూడన్ + పోవన్ చూడబోవన్ = చూడడానికి వెళ్ళుతుండగా
రాముడు = బలరాముడు
హరిలావు = శ్రీకృష్ణుని శక్తి
ఎఱుంగువాడు = తెలిసినవాడు
అయ్యున్ = అయి ఉండికూడా
వడిగఁగొని నగుచున్ = పకపక నవ్వుతూ
వారిన్ = (నందుడు మొదలైన గొల్ల) వారిని
వారింపడు + అయ్యెన్ వారింపడయ్యెన్ = అడ్డగింపలేదు.

తాత్పర్యము : ఓ రాజా ! ఈ విధంగా గొల్లపల్లెలోని వారంతా, శ్రీకృష్ణుని శక్తి తెలియక, అజ్ఞానంతో అతని జాడ తెలుసుకొనడం కోసం వెడుతూ ఉంటే, అతని శక్తి తెలిసినవాడైనా బలరాముడు వారిని ఆపు చెయ్యలేదు. పైగా పక పక నవ్వుకుంటూ, వారిని గమనిస్తూ ఊరుకున్నాడు.

22. అంతలోన వారునుం దానును గాంతారమార్గంబు వట్టి పోవుచు నెడనెడ గోపగోప్పదంబుల సందుల నింత నంత నక్కడక్కడ యవాంకుశ హల కమల కులిశ చక్ర చాప కేతనాది రేఖాలంకృతంబులై మార్గాభరణంబులైన హరిచరణంబుల జాడఁ గని చొప్పు దప్పక చని దుర్ఘటంబయిన యమునా తటంబు సేరి, వారిమధ్యంబున నితరుల కసాధ్యంబైన సర్పంబుచేతఁ గాటు వడి దర్పంబు సూపక భోగిభోగ పరివృతుండైన కృష్ణునిం గృష్ణ కృష్ణతివిలాపంబులఁ దాపంబులం బొందుచుఁ దత్కాలం బునం బ్రతికూలం బయ్యె ననుచు దైవంబు దిట్టు గోపకులను, గోపకులం గలసి మేఁత లుడిగి తెప్పలిడక కృష్ణునిం దప్పక చూచుచు నొరలుచున్న గోవులం గని, రందు గోపికలు యశోదం బట్టుకొని విలపించుచుఁ గృష్ణు నుద్దేశించి

ప్రతిపదార్థము :

అంతలోన = అపుడు
వారునున్ = ఆ గొల్లలు
తానునున్ = బలరాముడును
కాంతార – మార్గంబున్ + పట్టి పోవుచున్ కాంతారమార్గంబు వట్టి పోవుచున్= అడవి దారిలో వెళ్ళుతూ
ఎడన్ + ఎడన్ ఎడనెడన్ = అక్కడక్కడ
గోప = గోపాలుర
గోప్పదంబుల సందునన్ = ఆవుల అడుగుల సందుల్లో
యవ = యవలు
అంకుశ = అంకుశం
హల = నాగలి
కమల = పద్మం
కులిశ = వజ్రాయుధం
చక్ర = చక్రం
చాప = ధనుస్సు
కేతన = ధ్వజం
ఆది = మొదలుగా గల వాని యొక్క
రేఖా = ఆకృతులతో
అలం కృత్తులు = అలంకరింపబడినవి
ఐ = అయి
మార్గ + ఆభరణంబులు మార్గాభరణంబులు = దారికి అలంకారాల వంటివి
ఐన హరిచరణంబుల జాడన్ = అయినటువంటి శ్రీకృష్ణుని యొక్క అడుగుల గుర్తును
కని = చూచి
చొప్పు తప్పుక = దారి తప్పకుండగ
చని = వెళ్ళి
దుర్ + ఘటంబు + అయిన దుర్ఘటంబైన = చేరుటకు శక్యం కానిది అయిన
యమునాతటంబున్ = కాళిందీ నది ఒడ్డున
చేరి = సమీపించి
వారి మధ్యంబునన్ = నీటి నడుమ
ఇతరులకున్ = తన కంటె వేరయిన వారికి
అసాధ్యంబు = లొంగ దీయుటకు శక్యం కానిది
ఐన – సర్పంబు చేతన్ = అయినట్టి పాము చేత
కాటు + పడి కాటువడి = కరవబడి
దర్పంబు = గర్వమును
చూపక = ప్రకటింపక
భోగి భోగ పరివృతుండు = పాము శరీరంతో చుట్టుకొనబడినవాడు
ఐన కృష్ణునిన్ = అయినట్టి కృష్ణుణ్ణి గురించి
కృష్ణ కృష్ణ + ఇతి విలాపంబులన్ = కృష్ణా ! కృష్ణా ! అనే ఏడ్పులతో
తాపంబులన్ = బాధలను
పొందుచున్ = అనుభవిస్తూ
తత్ + కాలంబునన్ తత్కాలంబునన్ = ఆ సమయంలో
ప్రతికూలంబు = అనుకూలం కానిదిగా
అయ్యెను + అనుచున్ అయ్యెననుచున్ = అయిందని అంటూ
దైవంబున్ = (తమ) భాగ్యమును
తిట్టు గోపకులను = నిందించునటువంటి గొల్లవారిని
గోపకులన్ = గోపాలురతో
కలిసి = కలిసి
మేతలు = గడ్డి మేయుటలు
ఉడిగి = మాని
తెప్పలు + ఇడక తెప్పలిడక = కనురెప్పలార్పక
కృష్ణునిన్ = శ్రీకృష్ణుణ్నీ
తప్పక = మానక
చూచుచున్ = చూచుచు
ఒరలుచున్ + ఉన్న ఒరలుచున్న= బాధతో అరచుచు ఉన్న
గోవులన్ = ఆవులను
కనిరి = చూశారు
అందున్ = అక్కడ
గోపికలు = గొల్లతలు
యశోదన్ = యశోదాదేవిని
పట్టుకొని = పట్టుకొని
విలపించుచున్ = రోదించును
కృష్ణునిన్ + ఉద్దేశించి కృష్ణునుద్దేశించి = శ్రీకృష్ణుని గురించి
ఇట్లు + అనిరి ఇట్లనిరి = ఈ విధంగా పలికారు

తాత్పర్యము: బలరాముడు, నందుడు మొదలైన గొల్లలు అడవిదారిలో శ్రీకృష్ణుణ్ణి వెదుకుతూ వెళుతున్నారు. ఆవులను కాచే గోపబాలుర అడుగుజాడలు, ఆవుల అడుగుజాడల నడుమ శ్రీకృష్ణుని అడుగు జాడలు కనబడుతున్నాయి. వాటి అడుగుల జాడలలో ఉత్తమ సాముద్రిక చిహ్నాలైన యవరేఖ, అంకుశ రేఖ, హలరేఖ, కమలరేఖ, కులిశరేఖ, చక్రరేఖ, చాపరేఖ, ధ్వజరేఖ మొదలైన రేఖలు ఆ అడవి దారికి ఆభరణాలుగా అందంగా ఉన్నాయి. ఆ జాడల వెంబడి దారి తప్పకుండా వెళ్ళి కాళియుని భయం వల్ల అక్కడికి వెళ్ళడానికి అందరూ భయపడే కాళిందీ నది ఒడ్డుకు చేరారు.

ఏటి నడుమ ఎవరికి లొంగని బలం కల కాళియుడు కరవడం చేత చేష్టలుడిగి ఆ పాము శరీరంతో శరీరమంతా చుట్టుకొన్నందువల్ల, సొమ్మసిల్లి పడి ఉన్న శ్రీకృష్ణుణ్ణి చూచి, ఒడ్డున నిలబడి, దుఃఖం ఆపుకోలేక, కృష్ణా ! కృష్ణా ! అని గొంతెత్తి విలపిస్తూ తమ దురదృష్టాన్ని తిట్టుకునే కృష్ణుని తోడివారయిన గొల్ల కుఱ్ఱల్ని చూశారు. మేతలు మాని, రెప్పవేయకుండా, దుఃఖంతో శ్రీకృష్ణుణ్ణి చూస్తూ ఉండే గోవుల్ని, దూడల్ని చూశారు. (ఈ గొల్ల పిల్లలు, ఆవులు ఆనాటి ఉదయమే శ్రీకృష్ణునితో బాటుగా, గొల్ల పల్లె నుండి అడవికి వచ్చిన వారన్నమాట) ఈ సన్నివేశం అంతా చూచిన గోపికలు యశోదను కౌగిలించుకుని, శ్రీకృష్ణుని చేష్టలు తలచుకొని, ఈ విధంగా విలపిస్తున్నారు.

కాళియమర్దనం Questions and Answers Summary Inter 2nd Year Telugu

23. సీ. ఎదురువచ్చినఁ జాల నెదురుగాఁ జనుదెంతు
వెదురు వచ్చిన నేఁడదేల రావు ?
చూచినఁ గృపతోడఁ జూచు చుందువు నీవు
సూచినఁ గనువిచ్చి చూడ వేల?
డాసిన నఱలేక డాయంగ వత్తువు
డాసిన నేటికి డాయ విచటఁ?
జీరిన’నో’ యని చెలరేఁగి పలుకుదు
విది యేమిసీరిన నెఱుఁగ కుంట ?

ఆ. తలఁపు సేయునంతఁ దలపోయుచుందువు
తలఁపు సేయ నేఁడు దలఁప వకట !
యనుచు భక్తివివశ లాడెడి కైవడి
‘వ్రేత లెల్ల నాడి వివశలైరి

ప్రతిపదార్థము:

ఎదురు వచ్చినన్ = (నీకు మేము) ఎదురుగా వచ్చినట్లయిన
చాలన్ = మిక్కిలిగా
ఎదురు + కాన్ + చనుదెంతువు ఎదురుగాఁ జనుదెంతువు = (మాకు) ఎదురుగా వచ్చేవాడివి
ఎదురు వచ్చినన్ = మేము ఎదురుగా వచ్చినా
నేడు = ఈనాడు
అది + ఏలరావు అదేలరావు = ఎందుకని ఎదురుగా రావు
చూచినన్ = (నిన్ను) చూచినచో
కృపతోడన్ = దయతో
నీవు = నీవూ
చూచుచున్ + ఉందువు చూచుచుందువు = చూస్తూ ఉంటావు .
చూచినన్ = మేము నిన్ను చూచినప్పటికిని (నీవు)
కనువిచ్చి = కన్ను తెరచి
చూడు + ఏల చూడవేల = (మమ్ము) ఎందుకు చూడవు ?
డాసినన్ = (నిన్ను) సమీపించినచో
అఱలేక = భేదభావం లేకుండగ
డాయన్ + కన్వత్తువు డాయంగవత్తువు = సమీపించుటకు వచ్చెడివాడవు
ఇచటన్ = ఇక్కడ
డాసినన్ = (మేము) నిన్ను సమీపించినప్పటికిని
ఏటికిన్ = ఎందుకు ?
డాయవు = సమీపానికి రావు
చీరినన్ = పిలిచినచో
చెలరేగి = మిక్కిలి విజృంభించి
ఓ + అని ఓయని = ఓ అంటూ
పలుకుదువు = పలుకుతావు
చీరినన్ = పిలిచినప్పటికిని
ఎఱుఁగక + ఉంటన్ ఎఱుగకుంటన్ = తెలియనట్లుగా ఉండడం
ఇది + ఏమి – ఇదియేమి = ఎందువలన ?
తలపు + చేయునంతన్ తలపుసేయునంతన్ = తలచినంత మాత్రాన్నే
తలపోయుచున్ = మా గురించి తలచుకొంటూ
ఉందువు = ఉంటావు
నేడు = ఈనాడు
అకట = అయ్యో !
తలపు + చేయన్ తలపుసేయన్ = తలంచినా (నిన్ను గురించి)
తలంపవు = ఆలోచింపవు
అనుచున్ = అంటూ
వ్రేతలు + ఎల్లన్ వ్రేతలెల్లన్ = గోపికలందరు
భక్తి వివశలు = భక్తిచే పరవశించేవారు
ఆడెడి + కైవడిన్ ఆడెడికైవడిన్ = మాటలాడే విధంగా
ఆడి = పలికి
వివశలు = పరవశత్వం పొందినవారు
ఐరి = అయ్యారు

తాత్పర్యము : శ్రీకృష్ణా మేము నీకు ఎదురుగా వస్తే నీవు మాకు ఎదురు వచ్చేవాడవు. ఈ వేళ మేము వచ్చినా నీ వెందుకు ఎదురు రావడం లేదు. మేము నీకేసి చూస్తే చాలు, నీవు దయతో మావైపునకు చూచేవాడవు. నేడు మేము నిన్ను చూస్తూ ఉన్నా నీవు మాకేసి ఎందుకు చూడటం లేదు ? మేము కృష్ణా ! అని పిలస్తే చాలు ‘ఓ’ అని వెంటనే గట్టిగా ఉత్సాహంతో బదులు పలికేవాడవు.

నేడు మేము ఎంత పిలిచినా నీవు తెలియనట్లు ఉన్నావు ఎందుకు ? మేము నిన్ను తలచుకొంటే చాలు. మమ్మల్ని గురించి తలచేవాడవు. ఈనాడు ఆ ఆలోచనే నీకు రావడం లేదు’ ఎందుకు ? అని గోపికలు భక్తితో పరవశించిన భక్తురాళ్ళ వలె పలికి ఒళ్ళు మరచిపోయారు.

24. ఆ సమయంబున నందయశోదాదులు హరిం జూచి యధికంబైన శోకంబున నిట్లనిరి.

ప్రతిపదార్థము :

ఆ సమయంబునన్ నందయశోదా + ఆదులు = అప్పుడు
నందయశోదాదులు = నందుడు, యశోద మొదలైన గొల్లవారందరు
హరిన్ = శ్రీకృష్ణుణ్ని
చూచి = చూస్తూ
అధికంబు = ఎక్కువ
ఐనశోకంబునన్ = ఐన దుఃఖంతో
ఇట్లు = ఈ విధంగా
అనిరి = పలికారు

తాత్పర్యము : అప్పుడు నందుడు, యశోద మొదలైన గొల్లవారంతా అధికమైన శోకంతో శ్రీకృష్ణుణ్ని చూచి, ఈ విధంగా అన్నారు.

25. కం. విషకుచయుగ యగు రక్కసి
విషకుచదుగ్ధంబు ద్రావి విషవిజయుఁడవై
విషరుహలోచన ! యద్భుత
విషయుండగు నీకు సర్పవిష మెక్కెఁ గదా !

ప్రతిపదార్థము :

విషరుహలోచన = నీటి నుండి పుట్టిన తామర పూవు వంటి కన్నులు గల ఓ కృష్ణా !
విషకుచయుగ = విషంతో కూడిన చన్నుల యొక్క జంట కలది
అగు = అయినట్టి
రక్కసి = రాక్షసి యొక్క
విషకుచ = విషంతో కూడిన చన్నుల యొక్క
దుగ్ధంబున్ = పాలను
త్రావి = పానం చేసి
విష విజయుడవు + ఐ విష విజయుడవై = విషమును జయించినవాడవు అయి
అద్భుత విషయుండు = ఆశ్చర్యకరమైన సామర్థ్యము కలవాడు
అగునీకున్ = అయినట్టి నీకు
సర్ప విషము = పాము విషం
ఎక్కెన్+కదా-మెక్కెఁగదా = ఎక్కింది కదా !

తాత్పర్యము : తామర పూల వంటి కన్నులు గల ఓ శ్రీ కృష్ణా ! విషాన్ని రొమ్ములలో దాచుకొని వచ్చిన దుష్ట రాక్షసి పూతన ఇచ్చిన పాలు త్రాగి అరిగించుకున్న అద్భుత శక్తి కలిగినవాడివి గదా ! అటువంటి నీకు ఈ పాము విషం ఎక్కిందంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయమో కదా !

విశేషము : విషమంటే = నీరు, విషం అనే అర్థాలున్నాయి. ఇక్కడ ‘విషరుహ’ అంటే నీటి నుండి పుట్టిన – అనఁగా పద్మం అని అర్థం.

కాళియమర్దనం Questions and Answers Summary Inter 2nd Year Telugu

26. కం. కట్టా ! క్రూరభుజంగము
గట్టలుకన్ నిన్నుఁ గఱవఁ గంపించితివో ?
తిట్టితివో పాపపు విధి?,
పట్టీ ! మముఁ దలఁచి కాఁకఁ బలవించితివో ?

ప్రతిపదార్ధము :

పట్టీ = ఓ బిడ్డా!
కట్టా = అయ్యో !
క్రూర భుజంగము కడు + అలుకన్ = క్రూరమైన సర్పం
కట్టులుకన్ = మిక్కిలి కోపంతో
నిన్నున్ = నిన్ను
కఱవన్ = కాటువేయగా
కంపించితివి + ఓ కంపించితివో = వణకిపోయావేమో ?
పాపపు విధి = చెడ్డదియగు విధిని
తిట్టితివి + ఓ తిట్టితివో = నిందించావో
కాఁకన్ = పరితాపంతో
మమున్ = మమ్ము
తలంచి = తలచుకొని
పలవించితివి + ఓ పలవించితివో = పలవరించిపోయావో ?

తాత్పర్యము : అయ్యో ! బిడ్డా ! భయంకరమైన ఆ సర్పం కోపంతో నిన్ను కరుస్తూ ఉంటే ఎంతగా వణకిపోయావో ? నీ దౌర్భాగ్యాన్ని ఎంతగా తిట్టుకున్నావో? మమ్మల్ని తలచుకొని ఎంతగా పలవరించిపోయావో గదా !

27. కం. పన్నగము మమ్ము గఱవక
నిన్నేటికిఁ గఱచెఁ గుఱ్ఱ ! నెమ్మి గలిగి నీ
వున్నను మము రక్షింతువు
నిన్నున్ రక్షింప నేము నేరము తండ్రీ!

ప్రతిపదార్థము :

కుఱ్ఱా = ఓ బిడ్డా !
పన్నగము = పాము
మమ్మున్ + కఱవక మమ్ముగఱవక = మమ్మల్ని కాటువేయకుండ
నిన్నున్ = నిన్ను
ఏటికిన్ = ఎందుకు ?
కఱచెన్ = కాటువేసెను
తండ్రీ! = నాయనా !
నీవు నెమ్మి కలిగి = నీవు క్షేమం కలవాడవయి
ఉన్నను = ఉంటే
మమున్ = మమ్ములను
రక్షింతువు = కాపాడుతుంటావు
నిన్నున్ = నిన్ను
ఏము = మేము
రక్షింపన్ = రక్షించడానికి
నేరము = సమర్థులము కాము

తాత్పర్యము : బిడ్డా ! ఈ పాము మమ్మల్ని కరవకుండా నిన్నెందుకు కరచిందో కదా ! నీవు క్షేమంగా ఉంటే మాకు ఏ ఆపదలూ రాకుండా కాపాడుతూ ఉంటావు. నాయనా ! నీకు ఆపద కలిగితే నిన్ను మేము రక్షించలేము కదా !

28. చూడ వ దేమి గౌరవపుఁజూపుల మమ్ము ? సఖాలితోడ మా
టాడ వ దేమి ? నర్మముగ నందెలు పాదములందు మ్రోయ ? నేఁ
డాడ వ దేమి నర్తనము ? లవ్వలమ్రోలను గోపికావళిం
గూడ వ దేమి నవ్వులకు ? గోపకుమారవరేణ్య ! చెప్పుమా !

ప్రతిపదార్థము :

గోపకుమార వరేణ్య గౌరవము + చూపులన్ = గోప కుమారులలో శ్రేష్ఠుడవైన ఓ శ్రీకృష్ణా !
గౌరవపుఁజూపులన్ = గౌరవంతో కూడిన చూపులతో
మమ్మున్ = మమ్ములను
చూడు + అది + ఏమి ? చూడవదేమి ? = ఎందుకు చూడకుండా ఉన్నావు ?
సఖ + ఆలితోడన్ సఖాలితోడన్ = స్నేహితుల వరుసలతో
నర్మము + కన్ నర్మముగన్ = రహస్యంగ
మాటాడవు = పలుకవు
అది + ఏమి అదేమి = ఎందులకని
నేఁడు = ఈనాడు
పాదములందున్ = కాళ్ళయందు
అందెలు = నూపురములు
మ్రోయన్ = ధ్వనించునట్లుగా
అవ్వలమ్రోలను = తల్లుల ఎదురుగా
ఆడవు = నాట్యము చేయవు
అది + ఏమి అదేమి = ఎందులకు
నవ్వులకున్ = పరిహాసములాడుటకు
గోపికా + ఆవళిన్ గోపికావళిన్ = గొల్లపడుచులతో
కూడవు = కలియవు
అది+ఏమి – అదేమి = ఎందుకు
చెప్పుము +ఆ – చెప్పుమా = చెప్పు

తాత్పర్యము : ఓ కృష్ణా ! ఈ వేళ ఎప్పటిలాగ మమ్మల్ని గౌరవంగా ఎందుకు చూడవు ? స్నేహితులతో ఏకాంతంగా ఎందుకు మాటాడవు ? చెవులకు ఇంపుగా కాళ్ళగజ్జెలు మ్రోగే విధంగా తల్లుల ఎదుటకు వచ్చి ఎందుకు నాట్యం చేయవు ? గొల్లపడుచులతో పరిహాస ప్రసంగాలు ఎందుకు చేయవు ? చెప్పు.

కాళియమర్దనం Questions and Answers Summary Inter 2nd Year Telugu

29. సీ. శ్రవణరంధ్రంబులు సఫలతఁ బొందంగ
నెలమి భాషించువా రెవ్వరింకఁ?
గరచరణాదులకలిమి ధన్యత నొంద
నెగిరి పైఁ బ్రాఁకువా రెవ్వరింక ?
నయనయుగ్మంబు లున్నతిఁ గృతార్థములుగా
నవ్వులు సూపువా రెవ్వరింక ?
జిహ్వలు గౌరవశ్రీఁ జేరఁ బాటల
యెడఁ బలికించువా రెవ్వ రింక ?

ఆ. దండ్రి ! నీవు సర్పదష్టుండవై యున్న
నిచట మాకుఁ బ్రభువు లెవ్వ రింక ?
మరగి పాయ లేము, మాకు నీ తోడిద
లోక మీవు లేని లోక మేల?

ప్రతిపదార్ధము :
‘ఇంకన్ = ఇటుపైన
శ్రవణ రంధ్రంబులు = చెవుల
సఫలతన్ = ప్రయోజనం
పొందన్ + కన్ పొందగన్ = పొందునట్లుగా
ఎలమిన్ = సంతోషంతో
భాషించువారు = మాట్లాడేవారు
ఎవ్వరు = ఎవరు
ఇంకన్ = ఇటుమీద
కర = చేతులు
చరణ = కాళ్ళు
కలిమి = కలిగియుండుట
ఆదుల = మొదలగు వాని యొక్క
ధన్యతన్ = ధన్యత్వమును
ఒందన్ + ఎగిరి ఒందనెగిరి = పొందునట్లుగా ఎగురుతూ
పైన్ = మీదకి
ప్రాంకు వారు =జరుగువారు
ఎవ్వర = ఎవరు
ఇంకన్ = ఇటు తర్వాత
నయన యుగ్మంబులు = కనుల జంటలు
ఉన్నతిన్ = గొప్పతనముతో
కృత + అర్థములు కృతార్థములు = నెరవేరిన ప్రయోజనము కలవి
కాన్ = అగునట్లుగా
నవ్వులు + చూపువారు నవ్వులు సూపువారు = నవ్వులను ప్రదర్శించేవారు
ఎవ్వరు + ఇంకన్ ఎవ్వరింకన్ =ఇంక ఎవరు ఉన్నారు
జిహ్వలు = నాలుకలు
గౌరవ శ్రీన్ = గౌరవ సంపదను
చేరన్ = పొందునట్లుగా
పాటల + ఎడన్ పాటల యెడన్ = పాటలు పాడేటపుడు
పలికించువారు = కలిపి పాడించేవారు
ఎవ్వరు + ఇంకన్ ఎవ్వరింకన్ = ఇంక పైన ఎవరు
తండ్రి = నాయనా !
నీవు = సర్వ సమర్థుడవైన నీవు
సర్పదష్టుండవు + ఐ సర్పదష్టుడవై = పాముచే కరవబడిన వాడవై
ఉన్నన్ = ఉంటే
ఇచటన్ = ఇక్కడ
మాకున్ = మా కందరికి
ప్రభువులు = పాలకులు
ఎవ్వరు + ఇంకన్ ఎవ్వరింకన్ = ఇట మీదట ఎవరు ?
మరగి = (నీ యందు) ప్రేమ కలిగి యుండి
పాయన్ + లేయు పాయలేము = (నిన్ను) విడువజాలము
మాకున్ = మాకు
నీతోడిది + అ నీతోడిద = నీతో ఉండడమే
లోకము = ప్రపంచము
ఈవు = నీవు
లేని లోకము = లేనట్టి లోకం
ఏల = ఎందులకు ?

తాత్పర్యము : తండ్రీ ! కృష్ణా ! నీవు ఈ విధంగా పాముకు చిక్కిపోయావే ! ఇంక మా చెవులు సఫలములయ్యేలా మాతో ఎవరు మాట్లాడతారు ? మా కాళ్ళు చేతులు ధన్యములయ్యే విధంగా ఎత్తుకోమని మా పైకి ఎవరు ఎగబ్రాకుతారు ? మా కళ్ళు చల్లగా ఎవరు చిరునవ్వులు చిందిస్తారు ? నోటి కింపుగా మా చేత మంచి పాటలు ఎవరు పాడిస్తారు ? ఇటుపైన మా ఆలనా పాలనా చూచేవారెవరు ? నీ యందే మా మనస్సులు లగ్నమైపోయాయి. నిన్ను విడిచి వెళ్ళలేము. ఇంక మాకు ఇళ్ళు వాకిళ్ళు అక్కరలేదు. నీవు ఎక్కడ ఉంటే అదే మా ప్రపంచము. నీవు లేని ఈ లోకం మా కెందులకు ?

30. అని యొండొరులం బట్టుకొని విలపించుచుం గృష్ణునితోడన మడుఁగు జొత్తము, చత్త’ మనుచుఁ గృష్ణవిరహ వేదనానల భారతప్తులై ‘మడుఁగుఁజొరఁబాఱుచున్న వారలఁ గనుంగొని భగవంతుండైన బలభద్రుండు ‘మీరు మీఁదెఱుంగరు, ధైర్యంబు విడుచుట కార్యంబు గాదు. సహించి చూడుఁ డనుచు వారిని వారించె.

ప్రతిపదార్థము :

అని = ఈ విధంగా పలికి
ఒండు + ఒరులన్ ఒండొరులన్ = ఒకరినొకరు.
పట్టుకొని = పట్టుకొని
విలపించుచున్ = దుఃఖంతో కేకలు వేస్తూ
కృష్ణుని తోడనన్ = కృష్ణునితో గూడ
మడుఁగున్ = అగాధంలో
చొత్తము = ప్రవేశిద్దాం
చత్తము = ప్రాణాలు విడిచిపెడదాం
అనుచున్ = అని పలుకుతూ
కృష్ణ = కృష్ణుని తోడి
విరహ = ఎడబాటు వల్ల కలిగిన
వేదనా = బాధ అనెడి
అనల = అగ్ని యొక్క
భార = బరువు చేత
తప్తులు + ఐ తప్తులై = తపింప జేయబడిన వారయి
మడుఁగున్ = అగాధంలోనికి
చొరన్ = ప్రవేశించేందుకు
పాఱుచున్ + ఉన్నవారలన్ పాఱుచున్న వారలన్ = పరుగులిడుతూ ఉన్న గొల్లలను ఉద్దేశించి
భగవంతుడు = భగవంతుని అవతారం
ఐన బలభద్రుండు = అయినట్టి బలరాముడు
మీరు = మీరందఱు
మీఁదు + ఎఱుంగరు మీఁదెఱుంగరు = రాబోయే మంచి చెడ్డలను తెలియలేరు
ధైర్యంబున్ = ధీరత్వంబును
విడుచుట = విడిచిపెట్టడం
కార్యంబున్ + కాదు కార్యంబుగాదు = చేయదగిన పనికాదు
సహించి = ఓర్చుకొని
చూడుడు = వేచి చూడండి
అనుచు = ఈ విధంగా పలుకుతూ
వారిని = నందుడు మొదలైన గొల్లలను
వారించెన్ = ఆపు చేశాడు

తాత్పర్యము : ఈ విధంగా నందాదులైన గొల్లవారంతా ఒకరి నొకరు పట్టుకుని దుఃఖిస్తున్నారు. కృష్ణుణ్ణి విడిచి బ్రతుక లేక దుఃఖంతో కాలిపోతూ అతనితో బాటే మనం కూడా మడుగులో పడి ప్రాణాలు విడిచిపెట్టేద్దాం – అని మడుగులో దూకడానికి సిద్ధమయ్యారు. భగవంతుని అంశావతారమైనవాడు, శ్రీకృష్ణుని శక్తి సామర్థ్యాలు తెలిసినవాడైన బలరాముడు వారిని ఆపి, ముందు ముందు ఏమి జరుగబోతుందో మీకు తెలియదు. కనుక ధైర్యం విడిచి పెట్టకండి. ఓర్చుకుని వేచి చూడండి అని చెప్పాడు.

31. కం. తనుఁ గూర్చి యివ్విధంబున
వనితలు బిడ్డలును దారు వాపోయెడి ఘో
షనివాసులఁ గని కృష్ణుఁడు
మనుజుని క్రియ నొక ముహూర్తమాత్రము జరిపెన్.

ప్రతిపదార్ధము :

కృష్ణుడు = శ్రీకృష్ణుడు
తనున్ + కూర్చి తనుఁగూర్చి = తనను ఉద్దేశించి
ఈ + విధంబునన్ ఇవ్విధంబునన్ = ఈ తీరుగా
వనితలు = స్త్రీలు
బిడ్డలును = పిల్లలను
తారున్ = తామును (కలసి)
వాపోయెడి ఘోషనివాసులన్ = రోదిస్తున్న గొల్లపల్లెలోని వారందరినీ
కని = చూచి
మనుజుని క్రియన్ = సాధారణ మానవుని వలె
ఒక ముహూర్త మాత్రము = రెండు గడియల సేపు
జరిపెన్ = గడిపాడు (గడియ = 24 నిమిషాలు)

తాత్పర్యము : గొల్లపల్లెలో ఉండే గొల్లలందరు, తమ ఆలుబిడ్డలతో వచ్చి, తన కోసం విలపించడం చూచి, శ్రీకృష్ణుడు ఏమీ చేతకాని సామాన్య మానవుని వలె రెండు గడియల సమయం మాత్రం ఊరుకున్నాడు.

కాళియమర్దనం Questions and Answers Summary Inter 2nd Year Telugu

32. శా. అంతం గృష్ణుఁడు మేను వెంప భుజగుం డావృత్తులం బాసి తా
సంతప్తాయతభోగుఁ డై కఱచుటల్ సాలించి నిట్టూర్పుతో
శ్రాంతుండై తలలెత్తి దుర్విషము నాసావీథులం గ్రమ్మ దు
శ్చింతన్ దిక్కులు సూచుచుం దలఁగి నిల్చెన్ ధూమకాష్టాకృతిన్

ప్రతిపదార్థము :
అంతన్ = అపుడు
కృష్ణుడు = శ్రీకృష్ణ భగవానుడు
మేను + పెంపన్ మేనువెంపన్ = శరీరాన్ని పెంచగా
భుజగుండు = కాళియసర్పం
ఆ వృత్తులన్ = తన చుట్లను
పాసి = విడచి
తాన్ = తాను
సంతప్త + ఆయత – భోగుడు + ఐ సంతప్తాయత భోగుడై = మిక్కిలి తపింప చేయబడిన (సాగదీయబడిన శరీరం కలవాడయి)
కఱచుటల్ = కాటువేయుటలు
చాలించి = ఆపు చేసి
నిడు + ఊర్పుతోన్ నిట్టూర్పుతోన్ = పొడవైన నిశ్శ్వాసంతో
శ్రాంతుండు + ఐ శ్రాంతుండై = అలసినవాడయి
తలలు = పడగలు
ఎత్తి = పైకెత్తి
దుర్ + విషము దుర్విషము = చెడ్డ విషం
నాసా వీధులన్ = ముక్కుల మార్గాల నుండి
క్రమ్మన్ = (బయటికి వచ్చి) వ్యాపించగా
దుస్ + చింతన్ దుశ్చింతన్ = చెడు విచారంతో
దిక్కులు + చూచుచున్ దిక్కులు సూచుచున్ = నాలుగువైపుల చూస్తూ
తలఁగి = తొలగించిన
ధూమకాష్ఠ + ఆకృతిన్ ధూమకాష్ఠాకృతిన్ = పొగచూరిన కట్టె వలె
నిల్చెన్ = నిలబడ్డాడు

తాత్పర్యము : అపుడు శ్రీకృష్ణుడు తన శరీరాన్ని బాగా పెంచాడు. కాళియుని’ చుట్టలు విడిపోయాయి. పాము శరీరం బాగా వేడెక్కిపోయింది. దానితో కరవడం మానేశాడు. అలసిపోయాడు. పెద్ద నిట్టూరుస్తూ పడగలు పైకెత్తాడు. ముక్కుల నుండి విషం చిమ్ముతూ, ఏమీ చెయ్యలేక, కృష్ణుణ్ని విడిచి దూరంగా నిలబడ్డాడు. పొగచూరిన కట్టెలాగ కాంతిని కోల్పోయాడు.

33. చం. వెఱ మెఱ లేనియట్టి బలువీరుఁడు కృష్ణకుమారుఁ డొక్కచేఁ
జఱచి ఖగేంద్ర చందమునఁ జక్కన దౌడలు వట్టి కన్నులం
జొఱచొఱ దుర్విషానలము జొబ్బిలు చుండఁగ నెత్తి లీలతో
జిఱజిఱఁ ద్రిప్పి వైచెఁ బరిశేషిత దర్పముఁ గ్రూరసర్పమున్

ప్రతిపదార్థము:

వెఱ = భయము
మెర = సంకోచము
లేని + అట్టి – లేనియట్టి = లేనటువంటి
బలువీరుడు = గొప్ప వీరుడగు
కృష్ణకుమారుడు = శ్రీకృష్ణుడు
పరిశేషిత దర్పమున్ = కొంచెమే మిగిలిన గర్వం గల
క్రూర సర్పమున్ = భయంకరమగు
ఒక్కచేన్ = ఒంటి చేతితో
చఱచి = కొట్టి
ఖగ + ఇంద్రు చందమునన్ ఖగేంద్రు చందమునన్ = పక్షుల రాజగు గరుత్మంతుని వలె
చక్కనన్ = చక్కగా (పట్టు సడలనట్లుగా)
దౌడలు పట్టి= పాము రెండు దౌడలు పట్టుకొని
కన్నులన్ = (పాము) కన్నుల నుండి
దుర్ + విష + అనలము దుర్విషానలము = చెడ్డదియగు విషాగ్ని
చొఱచొఱ = చొరచొర అను చప్పుడు చేస్తూ
జొబ్బిలుచున్ + ఉండన్ + కన్ జొబ్బిలుచుండఁగన్ = (బయటకు) కారుచుండగా
లీలతోన్ = విలాసంగా
ఎత్తి = పైకెత్తి
చిఱచిఱన్ = చిరచిరయని చప్పుడు కలుగునట్లుగా
త్రిప్పి = గుండ్రంగా తిప్పుతూ
వైచెన్ = విసరివేశాడు.

తాత్పర్యము : మహా పరాక్రమవంతుడైన ఆ శ్రీకృష్ణుడు, జంకు గొంకు లేకుండా, ఆ పాము పడగల మీద చేతితో ఒక చరుపు చరిచాడు. గరుత్మంతునివలె ఆ పాము రెండు దౌడలు చిక్కబట్టి, కళ్ళ నుండి విషాగ్నులు బయటకు ప్రసరిస్తూ ఉండగా, దాన్ని పైకెత్తి గిరగిర త్రిప్పి విసరివేశాడు. దానితో ఆ భయంకరమైన సర్పం యొక్క గర్వం చాలా భాగం అణగిపోయింది.

34. ఇట్లు వేగంబుగ నాగంబు వీచి వైచి జగజెట్టియైన నందునిపట్టి రెట్టించిన సంభ్రమంబున.

ప్రతిపదార్ధము :

జగ జెట్టియైన = జగదేక వీరుడును
నందుని పట్టి = నందుని కుమారుడునగు శ్రీకృష్ణుడు
ఇట్లు = ఈ ప్రకారంగా
నాగంబున్ = కాళియ సర్పాన్ని
వేగంబున్ + కన్ వేగంబుగన్ = వేగంగా
వీచివైచి = విసరికొట్టి
రెట్టించిన సంభ్రమంబునన్ = రెట్టింపు వేగంతో

తాత్పర్యము : ఈ విధంగా పామును విసరికొట్టి రెట్టించిన వేగంతో జగదేక వీరుడైన శ్రీకృష్ణుడు కదిలాడు.

35. సీ. ఘనయమునానదీ కల్లోల ఘోషంబు
సరసమృదంగ ఘోషంబు గాఁగ
సాధుబృందావన చరచంచరీక గా
నంబు గాయక సుగానంబు గాఁగ
గలహంస సారస కమనీయమంజు శ
బ్దంబులు దాళశబ్దములు గాఁగ
దివినుండి వీక్షించు దివిజ గంధర్వాది
జనులు సుఖాసీనజనులు గాఁగఁ

తే. బద్మరాగాదిరత్న ప్రభాసమాన
మహితకాళియ ఫణిఫణామండపమున
నళినలోచన విఖ్యాత నర్తకుండు
నిత్యనైపుణ్యమునఁ బేర్చి నృత్య మాడె

ప్రతిపదార్థము:

ఘన = గొప్పదైన
యమునా నదీ = కాళిందీ నది యందలి
కల్లోల = పెద్ద పెద్ద కెరటాల యొక్క
ఘోషంబునన్ = ధ్వని
సరస మృదంగ ఘోషంబు = రసవంతమైన మద్దెల ధ్వని
కాన్ + కన్ – కాఁగన్ = అవుతుండగా
సాధు = చక్కనైన
బృందావన చర = బృందావనంలో సంచరించునట్టి.
చంచరీక = తుమ్మెదల యొక్క
గానంబు = పాట
గాయక సుగానంబు = గాయకుల యొక్క మంచి పాట
కాన్ + కన్ – కాఁగన్ = అవుతుండగా
కలహంస = రాజహంసల యొక్కయు
సారస = బెగ్గురు పక్షుల యొక్కయు
కమనీయ = మనోహరమైన
మంజు = (చెవికి) ఇంపయిన
తాళ శబ్దంబులు = తాళముల ధ్వనులు
కాన్ + కన్ – కాఁగన్ = అవుతుండగా
దివి నుండి = ఆకాశము నుండి
వీక్షించు = చూస్తున్నట్టి
దివిజ = దేవతలు
గంధర్వ = గంధర్వులు
ఆది = మొదలగు
రత్న = రత్నాల చేత
ప్రబాసమాన = మిక్కిలి ప్రకాశిస్తున్న
మహిత = గొప్పది అయిన
కాళియ ఫణి = కాళియుడు అనే పాము యొక్క
ఫణ = పడగలు అనే
మండపమునన్ = మండపంలో
నళినలోచన = పద్మముల వంటి కన్నులు గల కృష్ణుడు అనే
విఖ్యాత = ప్రసిద్దుడైన
నర్తకుడు = నాట్యం చేసేవాడు
నిత్య నైపుణ్యమునన్ = స్థిరమైన నేర్పుతో
పేర్చి = అతిశయించి
నృత్యము + ఆడెన్ నృత్యమాడెన్ = నాట్యం చేశాడు

తాత్పర్యము : శ్రీకృష్ణుడు అనే ప్రసిద్ధ నర్తకుడు కాళియుని పెద్ద పెద్ద పడగల మీదికి ఎక్కి, మిక్కిలి నేర్పుతో నాట్యం చేశాడు. ఆ సమయంలో ఆ పాము పడగలు, కెంపులు మొదలైన రతనాలు పొదిగిన విశాలమైన నాట్య మండపంలా ప్రకాశించాయి. యమునా నదిలోని పెద్ద పెద్ద కెరటాల చప్పుళ్ళు. ఆ నాట్యానికి సహకారం అందించే మద్దెల చప్పుళ్ళ వలె ఉన్నాయి.

ఆ బృందావనంలో తిరిగే తుమ్మెదల యొక్క ఝుంకారం, వీనుల విందుగా ప్రక్కనున్న గాయకులు అందించే సహకార గానంలా ఉంది. ఆ నదిలోని రాజహంసలు, బెగ్గురు పక్షులు చేసే శ్రావ్యమైన ధ్వనులు, తాళాల మ్రోతల వలె ఉన్నాయి. ఆ రమణీయ సన్నివేశాన్ని ఆకాశంలో ఉన్న దేవతలు, గంధర్వులు సభలో సుఖంగా కూర్చుండి, నాట్యం చూస్తూ వున్న ప్రేక్షకుల వలె ఉన్నారు.

కాళియమర్దనం Questions and Answers Summary Inter 2nd Year Telugu

36. శా. కుక్షిన్ లోకములున్న గౌరవముతో గోపాకృతి న్నున్న యా
రక్షోహంత వడిన్ మహాఫణిఫణారంగ ప్రదేశంబు పై
నక్షీణోద్ధతి నాఁడుఁ, బాడుఁ, జెలఁగున్, హాసంబుతోడం బద
ప్రక్షేపంబులు సేయుఁ గేళిగతులం బ్రాణైకశేషంబుగన్

ప్రతిపదార్ధము :

కుక్షిన్ = కడుపులో
లోకములు = అన్ని లోకాల
ఉన్న గౌరవముతోన్ = ఉన్నట్టి గొప్పతనంతో (బరువుతో అని అర్థాంతరము)
గోప + ఆకృతిన్ గోపాకృతిన్ = గొల్లవాని రూపంతో
ఉన్న = ఉన్నట్టి
ఆరక్షోహంత = రాక్షసులను సంహరించుటకై అవతరించిన ఆ శ్రీకృష్ణుడు
వడిన్ = వేగంగా
మహత్ = పెద్దదియగు
ఫణి = కాళీయ సర్పం యొక్క
ఫణా = పడగలు అనే
రంగ ప్రదేశంబుపైన్ = నాట్యరంగం మీద
అక్షీణ + ఉద్ధతిన్ అక్షీణోద్ధతి = తరగని దర్పంతో
ఆడున్ = నృత్యం చేస్తాడు
పాడున్ = గానం చేయును
చెలంగున్ = కేకలు వేయును
ప్రాణ + ఏక శేషంబు + కన్ ప్రాణైక శేషంబుగన్ = ప్రాణం ఒకటి మాత్రమే మిగులునట్లుగా
హాసంబుతోడన్ = నవ్వుతో
కేళి గతులన్ = ఆడునట్టి రీతులతో
పద ప్రక్షేపంబులు = అడుగులు వేయుటలు
చేయున్ = చేస్తున్నాడు

తాత్పర్యము : తన కడుపులో లోకాలన్నీ దాచుకున్న గోపాలకృష్ణుడుగా ఆ విష్ణువు రాక్షస సంహారం చెయ్యడం కోసం భూమి మీద అవతరించాడు. అతడు కాళియుని పడగలను రంగస్థలంగా చేసుకుని, తరగని దర్పంతో నాట్యం చేశాడు. ఆడాడు. పాడాడు. ఉత్సాహంతో కేకలు వేశాడు. కేరింతలు కొట్టాడు. అతని అడుగుల తాకిడికి కాళియుని తలప్రాణం తోకకు వచ్చినట్లయింది.

37. కం. ఘనతర సుషిరానంద
స్వనములతో సిద్ధ సాధ్య చారణ గంధ
ర్వ నిలింప మునిసతులు చ
య్యనఁ గురిసిరి విరులవాన లాడెడు హరిపై

ప్రతిపదార్థము :

సిద్ధ = సిద్ధుల యొక్కయు
సాధ్య = సాధ్యుల యొక్కయు
చారణ = చారణుల యొక్కయు
గంధర్వ = గంధర్వుల యొక్కయు
నిలింప = దేవతల యొక్కయు
ముని = మునుల యొక్కయు
సతులు = భార్యలు
ఘనతర = మిక్కిలి అధికమైన
సుషిర = పిల్లనగ్రోవి యొక్క
ఆనంద = సంతోషం కలిగించే
స్వనములతోన్ = ధ్వనులతో
ఆడెడు హరిపైన్ = నాట్యం చేస్తున్న శ్రీకృష్ణుని మీద
విరులవానలు = పూలవానలు
చెయ్యనన్ = శ్రీఘ్రంగా
కురిసిరి = కురిపించారు

తాత్పర్యము : సిద్ధులు, సాధ్యులు, చారణలు, గంధర్వులు, దేవతలు, మునులు, మున్నగు వారి భార్యలు సంతోషం కలిగించేలా పిల్లనగ్రోవి ఊదుతూ నాట్యం చేస్తున్న శ్రీకృష్ణుని మీద పూలవానలు కురిపించారు.

38. ఇట్లు దుష్టజన దండధరావతారుండైన హరి వడి గలిగిన పడగల మీఁదఁ డాండవంబు సలుప, బెండువడి యొండొండ ముఖంబుల రక్తమాంసంబు లుమియుచుఁ గన్నుల విషంబు గ్రక్కుచు నుక్కుసెడి చిక్కిదిక్కులు సూచుచుం గంఠగత ప్రాణుండై ఫణీంద్రుండు తన మనంబున

ప్రతిపదార్థము :

ఇట్లు = ఈ విధంగా
దుష్టజన = దుర్మార్గులయిన వారికి
దండధర + అవతారుండు దండధరావతారుండు = యముని వంటి అవతారం కలవాడు.
ఐనహరి = అయినట్టి శ్రీకృష్ణుఁడు
వడిగలిగిన = వేగంగా చలిస్తున్న
పడగల మీదన్ = కాళియుని పడగల మీద
తాండవంబున్ = నాట్యాన్ని
చలుపన్ = చేస్తుండగా
బెండు + పడి బెండువడి = చేవతప్పి
ఒండు + ఒండు + అ ఒండొండ = క్రమక్రమంగా
ముఖంబులన్ = పడగల నుండి
రక్తమాంసంబులు = రక్తమును, మాంసమును
ఉమియుచున్ = వెలిగ్రక్కుచు
కన్నులన్ = కన్నుల నుండి
విషంబున్ = విషమును
క్రక్కుచున్ = వెలువరిస్తూ
ఉక్కు + చెడి ఉక్కుసెడి = శౌర్యం కోల్పోయి
చిక్కి = కృశించి
దిక్కులు + చూచుచున్ దిక్కులు సూచుచున్ = ఏమీ తోచక నలువైపుల చూస్తూ
కంఠగత ప్రాణుండు + ఐ కంఠగత ప్రాణుండై = గొంతు లోనికి చేరిన ప్రాణాలు కలవాడయి
ఫణి + ఇంద్రుండు ఫణీంద్రుడు = కాళియుడనే సర్పరాజు
తన మనంబునన్ = తన మనస్సులో

తాత్పర్యము : ఈ విధంగా దుర్మార్గులను శిక్షించడంలో యముని వంటి వాడైన శ్రీకృష్ణుడు, వడి కలిగిన కాళియుని పడగల మీద తాండవం చేశాడు. కాళియుని చేవ చచ్చింది. వరుసగా ఉన్న పడగల నుండి రక్తమాంసాలు వెలిగ్రక్కాడు. కళ్ళ నుండి విషం కారిపోయింది. సత్తువ తగ్గి దిక్కులు చూస్తూ ప్రాణాలు గొంతులోకి రాగా తనలో ఈ విధంగా అనుకున్నాడు.

39. ఉ. వేలుపులైన లావులు సెడి వేదనఁ బొందుచు నావిషానల
జ్వాలలు సోఁకినంతటన చత్తురు, నేఁడిది యేమి చోద్య? మా
భీలవిషాగ్ని హేతిచయపీడకు నోర్చియుఁ గ్రమ్మఱంగ నీ
బాలుఁడు మత్ఫణాశతము భగ్నముగా వెసఁ ద్రొక్కి యాడెడిన్

ప్రతిపదార్ధము :

వేలుపులు + ఐనన్ వేలుపులైన = దేవతలైనా
నా విష + అనల జ్వాలలు నా విషానల జ్వాలలు = నా యొక్క విషమనే అగ్ని మంటలు
సోఁకిన + అంతటను + ఆ సోఁకినంతటన = తగినంత మాత్రం చేతనే
లావులు + చెడి లావులు సెడి = బలమును కోల్పోయి
వేదనన్ = బాధను
పొందుచున్ = అనుభవిస్తూ
చత్తురు = మరణిస్తారు
ఈ బాలుడు = ఈ కుఱ్ఱవాడు
నేడు = ఈ రోజు
ఆఖీల = భయంకరమైన
విష + అగ్ని – విషాగ్ని = విష మనెడు నిప్పు యొక్క
హేతి చయ = మంటల సమూహం వల్ల కలిగే
పీడకున్ = బాధకు
ఓరియున్ = సహించియు
క్రమ్మఅంగన్ = తిరిగి
మత్ + ఫణాశతము మత్పణా శతము = నా నూరు పడగలను
భగ్నము + కాన్ భగ్నముగా = చెల్లా చెదురవునట్లుగా
వెసన్ = శ్రీఘ్రంగా
త్రొక్కి + ఆడెడిన్ త్రొక్కియాడెడిన్ = నాట్యం చేస్తున్నాడు
ఇది = ఇట్లు న్యాటం చేయుట
ఏమి చోద్యము = ఎంత ఆశ్చర్యము

తాత్పర్యము : దేవతలైనా సరే ! నా విషాగ్ని జ్వాలలు తాకాయంటే చాలు, గిలగిలలాడుతూ ప్రాణాలు విడిచిపెట్టేస్తారే ! ఈ వేళ ఈ పిల్లవాడు ఇదేమిటి ? భయంకరమైన నా విషాగ్ని జ్వాలలను సహించడం మాత్రమే కాక తిరిగి నా నూరు పడగలను చితికి చెల్లాచెదరు చేస్తూ, నిర్భయంగా నాట్యం కూడా చేస్తున్నాడే ? ఎంతటి ఆశ్చర్యం ?

కాళియమర్దనం Questions and Answers Summary Inter 2nd Year Telugu

40. కం. ఈతఁడు సర్వచరాచర
భూతేశుండైన పరమపురుషుఁడు సేవా
ప్రీతుఁడు శ్రీహరి యగు నని
భీతిన్ శరణంబు నొందె బిట్టలసి నృపా!

ప్రతిపదార్ధము :

నృపా = ఓ పరీక్షిన్మహారాజా ! (కాళియుడు)
బిట్టు + అలసి – బిట్టలసి = శీఘ్రంగా నీరసించి
ఈతడు = ఈ బాలుడు
సర్వ = సమస్తమైన
చర = చలించెడి మనుష్య పశుపక్ష్యాదులు
అచర = చలింపని చెట్లు పొదలు మొదలగు
భూత = ప్రాణులకు
ఈశుండు = ప్రభువు
ఐన పరమ పురుషుడు = అయినట్టి భగవానుడును
సేవాప్రీతుడు = భక్తి యందు ప్రీతి కలవాడునగు
శ్రీహరి + అగును + అని శ్రీహరియగునని = శ్రీమహావిష్ణువే అయి ఉంటాడని భావించి
భీతిన్ = భయంతో
శరణంబు + ఒందెన్ శరణంబునొందెన్ = శరణు పొందినాడు

తాత్పర్యము : ఓ పరీక్షిన్మహారాజా ! బాగా అలసిపోయిన కాళియునికి వివేకం కలిగింది. ఈతడు సామాన్య బాలుడు కాదు. సమస్త చరాచర ప్రాణికోటికి ప్రభువు. భగవంతుడు భక్తికి సంతోషించేవాడు అయిన శ్రీమహావిష్ణువు అయి ఉంటాడని భావిస్తూ భయంతో అతణ్ణి శరణు వేడినాడు.