Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 4th Lesson బతుకమ్మ పండుగ Textbook Questions and Answers.
TS Inter 1st Year Telugu Study Material 4th Lesson బతుకమ్మ పండుగ
అభ్యాసం
I. వ్యాసరూప ప్రశ్నలు- సమాధానాలు
ప్రశ్న 1.
‘బతుకమ్మ’ పండుగ వెనుక ఉన్న ఆచారసంప్రదాయాలను వివరించండి?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అనే గ్రంథం నుండి గ్రహించబడింది. దీనిలో బతుకమ్మ పండుగ వెనుక దాగియున్న ఆచార సంప్రదాయాలు వివరించబడ్డాయి.
తెలంగాణా జానపద స్త్రీల ఆచార సంప్రదాయాలలో ఆనందోత్సాహాలతో వెల్లివిరిసేత పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగ జానపదుల సాహిత్య, సంగీత, నృత్య కళారూపాలకు ప్రతీక. స్త్రీలకు సౌభాగ్యాలనిచ్చే తల్లి గౌరమ్మ ఆమె బతుకమ్మ. భయాన్ని గొలిపే స్వరూపం గౌరమ్మది. నవరాత్రుల సమయంలో తెలంగాణ స్త్రీలు సుకుమారమైన అందమైన రూపంగా భావించి అమ్మవారిని కొలుస్తారు.
బతుకమ్మ పండుగ నాటికి ప్రకృతి అంతా పూలమయం అవుతుంది. స్త్రీల సౌందర్యారాధన, అలంకరణ నైపుణ్యం కళాత్మక దృష్టి పూల బతుకమ్మను పూలతో అలంకరించటంతోనే ఉంటుంది. మహాలయ అమావాస్యనాడు ఎంగిలి బతుకమ్మను పేర్చటంతో బతుకమ్మ పండుగ ప్రారంభమై మహార్నవమి వరకు సాగుతుంది.
ముత్తైదువుల తెల్లవారుజాముననే లేచి అభ్యంగనం స్నానంచేసి అలికి ముగ్గువేసి పూలతో అలంకరిస్తారు. ఉదయం బతుకమ్మను అలంకరించిన సాయంకాలం ఇంటిముందే ఆడతారు. ఆ తరువాత మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొనివెళ్ళి ఊరి మధ్యలోగాని, చెరువుగట్టుపైగాని ఉంచి స్త్రీలందరూ వలయాకారంలో నిలబడి ఒంగి ఒగురుతూ చేతులను తడుతూ పాటలు పాడతారు. చీకటి పడేవరకు ఆడి బతుకమ్మను కాలువలోగాని, చెరువులోగాని,భావిలోగాని వదిలిపెడతారు. బతుకమ్మకు వీడ్కోలు చెపుతారు.
నిద్రపోగౌరమ్మా నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు
నిను గన్న తల్లికి నిండునూరేండ్లు
అని పాటలు పాడుతారు. ప్రకృతి నుండి సేకరించిన పూలను మళ్ళీ ప్రకృతికే సమర్పించుకోవటం బతుకమ్మను నీటిలో విడిచిపెట్టడానికి కావచ్చు.
ఎర్రమట్టిని త్రిభుజాకారంలోకి మలచి దానిపై వెంపలిచెట్టు కొమ్మనుంచి పసుపుకుంకుమలతో పూజిస్తారు. ఇలా చేయటం భూమిని స్త్రీ దేవతగా భావించి అర్చించటమే! బతుకమ్మను ఆడేటపనుడు స్త్రీలు పౌరాణిక, నీతిభోధాత్మక, కథా గేయాలను పాడుకుంటారు. బతుకమ్మపండుగలో పాడే పాటల్లో స్త్రీల మనోభావాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి.
“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో- గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తులు పాలించ ఉయ్యాలో- వచ్చేరిసతిగూడి ఉయ్యాలో ‘
ఈ గేయంలో పనిలోనే పరమాత్మను దర్శించమనే బోధ స్త్రీలశ్రమైక జీవనానికి దర్పణం. పనిలోని అలసటను పాటల ద్వారా సులభతరం చేసుకొన్న పరమాత్మ స్వరూపులు స్త్రీలు. పసితనంలో పెళ్ళిళ్ళు చేసి బరువు దింపుకున్న తల్లిదండ్రుతు అల్లారుముద్దుగా తమవద్ద పెరిగిన కూతురిని వియ్యాలవారికి అప్పగిస్తూన్న పాటలో వారి ఆవేదన అర్థమౌతుంది.
“పెరుగు అన్నము పెట్టి ఉయ్యాలో- పెంచుకోండి సీతను ఉయ్యాలో
సద్ది అన్నము పెట్టి ఉయ్యాలో సాదుకోండి సీతను ఉయ్యాలో”
ఈ విధంగా అద్దంలోని కొండ ప్రతిబింబంలాగా బతుకమ్మ పండుగలో తెలంగాణా జానపద స్త్రీల జీవన విధానం, మనస్తత్వం కళలు ప్రతిబింబిస్తాయి.
ప్రశ్న 2.
బతుకమ్మ పండుగలోని సంగీత, సాహిత్య కళాంశాలను పేర్కొనండి?
జవాబు:
బతుతకమ్మ పండుగ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జ్ఞానపద విజ్ఞానం పరిశీలనం’ అనే గ్రంథం నుండి గ్రహించబడింది. తెలంగాణా జానపద స్త్రీల ఆచార సంప్రదాయాలు వారి సాహిత్య సంగీత, నృత్య కళారూపాల త్రివేణి సంగమం. సౌభాగ్యదాయిని అయిన గౌరీదేవిని అందమైన పూలతో అలంకరించి పాటలు పాడుతూ ఆడుతూ పూజించటం వారి కళాభిలాషకు ఉదాహరణం.
సుఖదుఃఖాలతో ఉత్సాహ ఉల్లాసాలతో మనసు ఉద్వేగం చెందినపుడే కళారూపాలు ఆవిర్భవిస్తాయి. బతుకమ్మ పండుగ నాటికి ప్రకృతి అంతా పూల మయంగా ఉంటుంది. పంటచేలు నిండు గర్భిణులుగా దర్శనమిస్తాయి. పప్పుధాన్యాలు ఇళ్ళకు చేరతాయి. అలాంటి సంతోష సమయంలో పల్లెపడుచులు తమ మనోభావాలను పాటల ద్వారా నాట్యం చేస్తూ తమ ఆనందపాఠవశ్యాలను సంగీత రూపంలో ప్రకటించుకుంటారు.
అలంకరణ:
బతుకమ్మను అలంకరించటమే ఒక కళ. ఉదయాన్నే ఇంటిముందు అలికి రంగు రంగుల ముగ్గులేయటం మరొక కళ. ఒక ఇత్తడి పళ్ళెంలో గుమ్మడి ఆకులను పరచి దానిపై తంగేడు పూలను పేర్చటం, పొడవైన గునుగుపూల చివరలను కత్తిరించి వాటికి రంగులను పూసి ముత్యాలపూలను గుత్తులు గుత్తులుగా అమర్చటం, స్త్రీల కళాభిరుచికి ఒక ఉదాహరణం.
పూవులు ఎక్కువగా దొరికితే మనిషంత ఎత్తుగా బతుకమ్మను అలంకరిస్తారు. పెద్ద బతుకమ్మ లేదా తల్లి బతుకమ్మ ప్రక్కల పిల్ల బతుకమ్మను అమర్చుతారు. ఉదయం బతుకమ్మను పేర్చిన ముత్తయిదువలు సాయంత్రం తమని తాము అలంకరించుకొని ఇంటిముందు ఆటపాటలతో కొంతసేపు కాలక్షేపంచేసి ఆ తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా బతుకమ్మను సాగనంపుతారు.
పాట- నాట్యం : జానపద స్త్రీలు వలయాకారంలో తిరుగుతూ నాట్యం చేస్తూ పాటలు పాడుకుంటారు.
నిద్రపోగౌరమ్మా నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు
నిను గన్న తల్లికి నిండునూరేండ్లు
అని రాగయుక్తంగా పాడటం వారి కళాసక్తికి నిదర్శనం. జానపదస్త్రీల బొడ్డెమ్మ బతుకమ్మ ఆటలకు మూలం. ఆటవికులు పండుగ సమయాలలో చేసే బృంద నృత్యాలే! పార్వతీపరమేశ్వరులు సాయంత్రం వేళల్లోనే నృత్య పోటీని పెట్టుకునేవారని అందులో ఈశ్వరుడే విజయం సాధించేవాడని ఒక కథనం. తెలంగాణ ప్రాంతంలో ఉంది. అందుకే బతుకమ్మను సాయంత్ర సమయంలో ఆడతారు.
బతుకమ్మ పండుగ ఆటపాటల మేలు కలయిక. స్త్రీల పాటలన్నీ ఒడుదుడుకులు లేకుండా ఒకే స్వరంలో సాగిపోతాయి. వీరు పాడే పాటలకు సంగీత శాస్త్రనియమాలుండవు. అవి చతురస్రగతిలో ‘కిటతక, కిటతకిట అను మాత్రలతో ఉంటాయి.
స్త్రీలు పౌరాణిక గీతాలు, నీతిబోధాత్మక గీతాలు కథాగేయాలను పడుతుంటారు. పాటలోని ప్రతి చరణాంతంలో ఉయ్యాలో, వలలో, చందమామ అని పునరావృతమౌతుం టుంది. ఆ పాటల్లో ప్రతి వనిత యొక్క మనోభావాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి.
“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో- గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తులు పాలించ ఉయ్యాలో- వచ్చేరి సతిగూడి ఉయ్యాలో
వారు పనిచేసే పనిలోని శ్రమను మరచి పోవటం ఈ పాటలలోని అసలు రహస్యం. పనిపాటలు పరమాత్మ స్వరూపాలుగా భావించటం ప్రజల సంప్రదాయం. ఇలా బతుకమ్మ పండుగలో సంగీత సాహిత్య నాట్యాలు కళాంశాలుగా రూపుదిద్దుకుంటాయి.
II. సంగ్రహరూప ప్రశ్నలు- సమాధానాలు
ప్రశ్న 1.
రావిప్రేమలత రచనలను తెలుపండి?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం రావిప్రేమలతచే రచించబడిన, జానపదవిజ్ఞానం పరిశీలనం అన్న గ్రంథం నుండి గ్రహించబడింది.
రావిప్రేమలత సిద్ధాంత వ్యాసం తెలుగు జానపదసాహిత్యం – పురాగాథలు తొలిరచన. జానపద విజ్ఞానంలో స్త్రీ ప్రేమలత వ్యాససంపుటి. తెలుగు స్త్రీల ముగ్గులపై పరిశోధన చేసి ‘తెలుగు స్త్రీల చిత్రలిపి’ అనే వైవిధ్య భరితమైన గ్రంథాన్ని రాశారు. ఇది బిరుదురాజు రామరాజు జానపదవిజ్ఞాన బహుమతిని, తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ గ్రంథ పురస్కారాన్ని అందుకున్నది.
ఈమె రాసిన ‘వ్యాసలతిక’ తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ విమర్శ గ్రంథంగా బహుమతినందుకున్నది. డా. కురుగంటి శ్రీలక్ష్మితో కలిసి ‘జానపదవిజ్ఞాన పరిశీలనం’ అన్న వ్యాస సంపుటిని వెలువరించారు. Folk Tales of South India- Andhra Pradesh అన్న కథా సంకలనానికి సంపాదకత్వం వహించారు. ఈమె రచనలన్నీ జానపద సాహిత్యం తోనే ముడిపడి ఉండటం ముదావహం.
ప్రశ్న 2.
బతుకమ్మను పేర్చే విదాధాన్ని వర్ణించండి?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపదవిజ్ఞాన పరిశీలనం’ అన్న గ్రంథం నుండి గ్రహించబడింది.
తెలంగాణా జానపదస్త్రీల ఆచార సాంప్రదాయాలతో ఆనందోత్సాహాలతో వెల్లివిరిసేది బతుకమ్మ పండుగ అదే పూలపండుగ. బతుకమ్మ పండుగనాటికి ప్రకృతి పూలమయంగా ఉంటుంది. బతుకమ్మను ఆ పూలతో అందంగా అలంకరిస్తారు. ముందుగా ఇత్తడి పళ్ళెంలో మొదట గుమ్మడి ఆకులను పరచి దానిపై తంగేడు పూలను పరుస్తారు. పొడవైన గునుగు పూలను చివర కత్తిరించి వాటికి పలురంగులు పూస్తారు. ఆ తరువాత ముత్యాల పువ్వులను గుత్తులు గుత్తులుగా అమరుస్తారు.
ఇళ్ళలో ఉండే గన్నేరు, రుద్రాక్ష, గోరింట, బీర పూలను గూడా గుండ్రంగా శిఖరాలలో పేరుస్తారు. శిఖరంపై గుమ్మడి పూలను అలంకరిస్తారు. పసుపుతో త్రికోణాకృతిలో బతుకమ్మను పెట్టడంతో బతుకమ్మను పేర్చే కార్యక్రమం పూర్తి అవుతుంది. బతుకమ్మ ప్రక్కనే పిల్ల బతుకమ్మలను ఉంచుతారు. బతుకమ్మలను కూరాటికుండ వద్దగాని, దేవుడి వద్దగాని పెట్టి నువ్వులు, సెనగపప్పు, పెసరపప్పు, పొడులతో చద్దుల పులిహోర దద్యోన్నంను నైవేద్యంగా అమర్చుతారు. పూలు ఎక్కువగా లభిస్తే మనిషంత ఎత్తు బతుకమ్మలను అమర్చుతారు. త్రికోణం స్త్రీకి సంకేతం. త్రికోణాకారంలో పసుపు ముద్దనుంచటం గౌరీదేవిని ప్రతిష్టించటంగా భావిస్తారు.
ప్రశ్న 3.
బొడ్డెమ్మ ఆటను గురించి రాయండి?
జవాబు:
‘బతుకమ్మపండుగ’ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అను గ్రంథం నుండి స్వీకరించబడింది.
బొడ్డెమ్మఆట బతుకమ్మ ఆటకు పూర్వరంగం బతుకమ్మతోపాటు ఎర్రమట్టిముద్దను త్రిభుజాకారంలో తయారుచేసి దానిపై వెంపలిచెట్టు కొమ్మను పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి పూజచేస్తారు. దీనిని కూడా నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ బొడ్డెమ్మ ఆట వినాయక చవితి నుండి ప్రారంభమై మహాలయ అమావాస్య నాటికి పూర్తవుతుంది.
బొడ్డెమ్మ ఆటలో ఎర్రమట్టి ముద్దను త్రిభుజాకారంలో మలచటం, పూజించటం భూమిని స్త్రీ మూర్తిగా భావించి అర్చింటమే! ఇది ఆటవికులు భూదేవిని పూజిస్తూ చేసే నాట్యాలలో వలే విందులు వినోదాలతో పాటలతో జరుపబడుతుంది. భూదేవికి ప్రతిరూపమైన బొడ్డెమ్మను పూజించటం, అడవిపూలైన తంగేడు, ముత్యాలపూలతో పూజించటం ఆటవికుల నమ్మకాల ప్రభావంగా భావించాలి.
ప్రశ్న 4.
బతుకమ్మ పాటలోని విశేషాలు ఏమిటి?
జవాబు:
బతుకమ్మ పండుగ అను పాఠ్యభాగం డా. రావి ప్రేమలతచే రచించబడిన ‘జానపద విజ్ఞాన పరిశీలనం’ అను గ్రంథం నుండి గ్రహించబడింది. బతుకమ్మ పండుగ ఆట పాటల మేలు కలయిక. స్త్రీల పాటలన్నీ ఒడిదుడుకులు లేక క్రమగతిలో ఒకే స్వరంలో సాగిపోతాయి. కంఠస్వరంనాళాలకు, గర్భాశయానికి హానికలుగని మధ్యమస్థాయిలో స్త్రీలు పాటలు పాడుతుంటారు.
సహజ సంగీతంతో సాగిపోయే బతుకమ్మ పాటలను సంగీత శాస్త్ర నియమాలు, లక్షణాలతో పనిలేదు. వీరి పాట నాట్యాన్ని అనుసరించి ఉంటుంది. బతుకమ్మ ఆటకు అనుగుణంగా ఉంటాయి. వీరి పాటలు పౌరాణిక గీతాలుగా, నీతి బోధకాలుగా, కథాగేయాలుగా ఉంటాయి. వారి పాటలలో ఉయ్యాలో, వలలో, చందమామ అన్న పల్లవులు ఆవృతాలవుతుంటాయి. సూర్యాస్త సమయంలో బతుకమ్మ పాటలు పాడతారు కాబట్టి “చందమామ” అని, గౌరమ్మను నీటిలో ఓలలాడిస్తారు కావున “వలలో” అని ‘ఊయలవలె’ ఊగుతూ పాడతారు కావున “ఊయాలో” అన్న పదాలుంటాయి.
బతుకమ్మకు వీడ్కోలు చెప్తున్న ఈ పాటలో
“నిద్రపో గౌరమ్మ నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు…..”
ఈ పాటలో జగజ్జననికి జనని జానపదయువతి. స్త్రీది మాతృ హృదయం. చిన్నారి పాపను జో కొడుతూ పాడే పాటలను బతుకమ్మ పాటగా పాడుతుంది.
బతుకమ్మ పాటలలో స్త్రీల మనోభావాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి. ఉదాహరణకు.
“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తులు పాలించ ఉయ్యాలో- వచ్చేరిసతిగూడి ఉయ్యాలో ‘
పనులలో అలుపు సొలుపు తెలియకుండా పాడే ఈ పాటలు పరమాత్మ స్వరూపాలు.
III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు- సమాధానాలు
ప్రశ్న 1.
రావిప్రేమలత పిహెచ్.డి పరిశోధనాంశం పేరేమిటి?
జవాబు:
“తెలుగు జానపద సాహిత్యం – పురాగాథలు” రావిప్రేమలత పిహెచ్. డి పరిశోధనాంశం.
ప్రశ్న 2.
తెలుగు స్త్రీల ముగ్గులపై రావిప్రేమలత రాసిన గ్రంథం పేరేమిటి?
జవాబు:
“తెలుగు స్త్రీల చిత్రలిపి” రావిప్రేమలత స్త్రీల ముగ్గులపై వ్రాసిన గ్రంథం.
ప్రశ్న 3.
రావిప్రేమలత “వ్యాసలతిక”కు లభించిన పురస్కారం ఏది?
జవాబు:
ఉత్తమ విమర్శన గ్రంథంగా తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లభించింది.
ప్రశ్న 4.
బతుకమ్మ పండుగలో ఏ పూలకు అగ్రస్థానం ఇస్తారు?
జవాబు:
‘తంగేడు’ పూలకు బతుకమ్మ పండుగలలో అగ్రస్థానం ఇస్తారు.
ప్రశ్న 5.
గుమ్మడికాయ, గుమ్మడిపూలు దేనికి సంకేతం?
జవాబు:
గుమ్మడికాయ, గుమ్మడిపూలు ‘సఫలతాశక్తికి’ సంకేతం.
ప్రశ్న 6.
బతుకమ్మ పాటలలోని పల్లవులు ఏవి?
జవాబు:
ఉయ్యాలో, వలలో, చందమామ అనునవి బతుకమ్మ పాటలలో పల్లవులు.
ప్రశ్న 7.
బతుకమ్మ పాటల్లో ఏవి ఒదిగి ఉంటాయి?
జవాబు:
బతుకమ్మ పాటల్లో స్త్రీల మనోభావాలు జీవన విధానాలు ఒదిగి ఉంటాయి.
ప్రశ్న 8.
పప్పుధాన్యాలను పొడిచేసి పెట్టే నైవేద్యాన్ని ఏమంటారు?
జవాబు:
‘సద్దులు’ అంటారు.
బతుకమ్మ పండుగ Summary in Telugu
రచయిత్రి పరిచయం
రచయిత్రి పేరు : డా. రావి ప్రేమలత
పుట్టినతేది : జూన్ 10, 1945
పుట్టిన ఊరు : నల్గొండజిల్లా, నాగిరెడ్డి పల్లె
తల్లితండ్రులు : మనోహరమ్మ, నాగిరెడ్డి
విద్యార్హతలు : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ, పిహెచ్.డి
పిహెచ్ సిద్ధాంత గ్రంథం : తెలుగు జానపద సాహిత్యం – పురాణగాథలు
రచనలు :
- జానపద విజ్ఞానంలో స్త్రీ (వ్యాససంపుటి)
- తెలుగు స్త్రీల చిత్రలిపి
- వ్యాస లతిక
పురస్కారాలు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అధ్యాపకురాలిగా తంగిరాల సాహిత్యపీఠం, ఉత్తమ పరిశోధకురాలు’ గా సత్కరించారు.
డా. రావిప్రేమలత జూన్ 10, 1945 ఉమ్మడి నల్గొండ జిల్లా నాగిరెడ్డిపల్లెలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు మనోహరమ్మ, నాగిరెడ్డిలు, భువనగిరి కళాశాలలో చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు, పిహెచ్.డి పూర్తి చేశారు. నాయని కృష్ణకుమారిగారి పర్యవేక్షణలో “తెలుగు జానపద సాహిత్యం- పురాగాథలు అన్న అంశంపై పరిశోధనచేసి పిహెచ్.డి సాధించారు.
రావి ప్రేమలత జానపద విజ్ఞానం సిద్ధాంతాలనేపధ్యంలో ‘జానపద విజ్ఞానంలో స్త్రీ’ అనే వ్యాససంపుటిని ప్రచురించారు. తెలుగు స్త్రీల ముగ్గులపై పరిశోధన చేసి “తెలుగు స్త్రీల చిత్రలిపి” అన్న వైవిధ్య గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథం బిరుదురాజు రామ రాజు జానపదవిజ్ఞాన బహుమతి, తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమగ్రంథ పురస్కారాన్ని అందుకుంది.
ఈమె ‘వ్యాసలతిక’ సంపుటి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమవిమర్శ గ్రంథంగా పురస్కారం అందుకుంది. డా॥ కురుగంటి లక్ష్మీతో కలిసి ‘జానపదవిజ్ఞాన పరిశీలనం’ అన్న వ్యాససంపుటిని వెలువరించారు. Folk Tales of South India- Andhra Pradesh అనే సంకలనానికి సంపాదకత్వం వహించారు. రావిప్రేమలత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉ త్తమ అధ్యాపకురాలు, తంగిరాల సాహిత్యపీఠం ఉత్తమ పరిశోధకురాలిగా పురస్కారం అందుకున్నారు.
పాఠ్యభాగ సారాంశం
తెలంగాణా జానపద స్త్రీల ఆచారసంప్రదాయాలతో ఆనందోత్సాహాలతో వెల్లివెరిసే పండుగ బతుకమ్మ పండుగ, అదే పూల పండుగ. ఇది జానపద స్త్రీల సాహిత్య, సంగీత, నృత్యకళారూపాల త్రివేణీ సంగమం. స్త్రీల సౌభాగ్య ప్రదాయిని అయిన గౌరీదేవిని బతుకమ్మగా భావించి అందమైన పూలతో మరింత అందంగా అలం కరించుకొని పూజిస్తుంటారు. బతుకమ్మ పండుగనాటికి ప్రకృతి అంతా పూలమయంగా ఉంటుంది. తంగేడు, గునుగు, ముత్యాలపూలు, ప్రకృతికి అందాన్నిస్తాయి. పంట పొలాలు సస్యస్యామలంగా ఉంటాయి.
మొదటి ఎనిమిది రోజులు బతుకమ్మను నెమ్మదిగా పేరుస్తారు. తొమ్మిదోరోజు పెద్ద పండుగ జరుపుతారు. దానినే ‘సద్దుల’ పండుగ అంటారు. ముత్తైదువలు తెల్లవారుజామున లేని అభ్యంగన స్నానాదికాలు ఆచరించి, అలికి ముగ్గువేసి మగపిల్లలు సేకరించిన పూలతో అలంకరణ ప్రారంభిస్తారు.
ఇత్తడి పళ్ళెంలో మొదట గుమ్మడి ఆకులను పరచి దానిపై తంగేడు పూలను అలంకరిస్తారు. పొడవైన గునుగు పూలను కత్తిరించి వరుసగా పైకి పేరుస్తూ వివిధ రంగులను పూస్తారు. తరువాత ఇళ్ళలో ఉండే గన్నేరు, రుద్రాక్ష, గోరింట పూలను అలంకరించి శిఖరంపై గుమ్మడి పూలనుంచుతారు. త్రికోణ ఆకారంలో పసుపు ముద్దను పెట్టడంతో బతుకమ్మ అలంకరణ పూర్తవుతుంది.
పెద్ద బతుకమ్మ లేదా తల్లి బతుకమ్మ చుట్టురా పిల్ల బతుకమ్మలను పెడతారు. ఇది స్త్రీ మాతృహృదయానికి సంకేతం ఇలా ఉదయం బతుకమ్మను పెట్టిన ముత్తైదువులను సాయంత్రం అలంకరించుకొని ఇంటి ముందే కొంచెంసేపు ఆడుకుంటారు.
ఆ తరువాత మేళ తాళాలతో ఊరేగిస్తూ ఊరి మధ్యలోగాని చెరువు గట్టుపైగాని ఉంచి స్త్రీలంతా వంగి చేతులతో చప్పట్లు కొడుతూ అందరూ కలిసి పాటలు పాడుకుంటారు. చీకటి పడుతుండగా కాలువలోగాని, చెరువులోగాని బావిలోగాని వదిలివేస్తారు. ఆ దృశ్యం ఈశ్వరుని కోసం వెళ్తున్న పార్వతిని తలపిస్తుంది.
నిద్రపో గౌరమ్మ నిద్రపోవమ్మా
నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు
పాడుతుంతారు. బతుకమ్మను ఎర్రమట్టి ముద్దతో త్రిభుజాకారంలో చేసి దానిపై వెంపలి చెట్టుకొమ్మను పెట్టి పసుపు కుంకుమలతో పూజించి నీటిలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మకు పూర్వ రంగమైన బొడ్డెమ్మ ఆట వినాయక చవితి నుండి ప్రారంభమై మహాలయ అమావాస్య నాటికి పూర్తవుతుంది.
బతుకమ్మను ఆడేటపుడు స్త్రీలు పౌరాణిక గీతాలను, నీతిబోధాత్మక గీతాలను, కథాగేయాలను పాడుతుంటారు. ఈ పాటలలో ఉయ్యాలో, వలలో, చందమామ పల్లవులుగా ఉంటాయి.
“గౌరమ్మ వెనుకను ఉయ్యాలో- గౌరీశ్వరుడు ఉయ్యాలో
భక్తుల పాలించి ఉయ్యాలో వచ్చిరి సతిగూడి ఉయా అని పాడతారు.
ఈ పాటలు మత విశ్వాసానికి ప్రతీక.
అలాగే పసితనంలో పెళ్ళిళ్ళు చేసి బరువు దిగిపోయిందని తృప్తిచెందే వ్యవస్థ మనది. ఆ పిల్ల అత్తవారికి అప్పగిస్తూ ఎలా చూసుకోవాలో పాటగా విన్పిస్తారు.
“పెరుగు అన్నము పెట్టి – ఉయ్యాలో పెంచుకోండి సీతను ఉయ్యాలో
సద్ది అన్నము పెట్టి- ఉయ్యాలో సాదుకోండి సీతను ఉయ్యాలో ఈ గేయాలతో జానపద స్త్రీల జీవిత విధానాల, మనస్తత్వం- కళలు మనకు కన్పిస్తాయి.
కఠినపదాలకు అర్థాలు
భీకరస్వరూపం = భయమును గొలిపే రూపము
ఏపుగా = బాగా
మనోరంజకంగా = మనసుకు ఆనందాన్నిచేకూర్చేదిగా
దద్యోన్నం – దధి+అన్నం = పెరుగు అన్నం
విస్తరించు = వ్యాపించ
ముత్తైదువల = మూడు తరాలపాటు భర్తతోడుగా ఉన్న స్త్రీ
వలయాకారం = గుండ్రంగా
ఒడిదుడుకులు = కష్టనష్టాలు
మందలిస్తూ = కోప్పడుతూ
పరిణామం = మార్పు
అతివలు = స్త్రీలు