Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 4th Lesson అసామాన్యులు Textbook Questions and Answers.
అసామాన్యులు TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana
బొమ్మను చూడండి. ఆలోచించి చెప్పండి.
ప్రశ్న1.
బొమ్మను చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు ?
జవాబు.
వీధుల్లో పోగయిన చెత్తను, వ్యర్థాలను తీసి శుభ్రం చేస్తున్నారు.
ప్రశ్న2.
అట్లా చెత్తను ఎత్తిపోసే వారు లేకుంటే ఏమవుతుంది ?
జవాబు.
అట్లా చెత్తను ఎత్తిపోసేవారు లేకుంటే వీధులన్నీ మురికి కూపాలుగా మారతాయి. దోమలు, ఈగలు చేరి మలేరియా వంటి అంటురోగాలు వ్యాపిస్తాయి.
ప్రశ్న3.
ఇట్లా మనకు సేవలు చేసేవారు ఇంకా ఎవరెవరున్నారు ? వారి గొప్పదనమేమిటి ?
జవాబు.
ఇట్లా మనకు సేవ చేసే వారిలో వీధులను ఊడ్చేవారు, మురికి కాల్వలను బాగుచేసేవారు, హాస్పిటల్స్లో రోగులను శుభ్రం చేసేవారు ఉన్నారు. వీరే లేకపోతే మానవ మనుగడకే చేటు వస్తుంది. అంటురోగాలు విజృంభిస్తాయి.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.33)
ప్రశ్న 1.
ఈ నిజ జీవితంలో మీకు ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఉన్నాయా ? వాటి గురించి చర్చించండి.
జవాబు.
నిజ జీవితంలో ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటనలు ఎన్నో ఉంటాయి. ఆకాశం మేఘావృతమై జడివాన కురుస్తుంది. అంతలోనే వర్షం ఆగగానే ఆకాశంలో వెలసిన ఇంద్రధనుస్సును చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. అది ప్రకృతి అందించిన అందాల హరివిల్లు. దాన్ని చూసి ఆశ్చర్యానందాలను పొందని వారెవరుంటారు ? ఎంత జడివాన కురిసినా, సాలెగూడు తడవదు. సాలెపురుగు ఇంజనీరింగ్ నైపుణ్యం ఆశ్చర్యమేస్తుంది.
ప్రశ్న 2.
ప్రతి వృత్తి పవిత్రమైందే, అని అనడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది ?
జవాబు.
ప్రతి వృత్తి పవిత్రమైందే. విమానం నడిపేవాని వృత్తి ఎంత గొప్పదో, ఆటో నడిపేవాని వృత్తీ అంత గొప్పదే. ఏ వృత్తీ తక్కువకాదు. ఒక వృత్తి లేనిదే మరొకటి లేదు. ప్రతి వృత్తిలోను ఎంతో కష్టం, నైపుణ్యం, త్యాగం కలగలసి ఉంటాయి. ఒకరికొకరు చేదోడుగా ఉంటే తప్ప సమాజం సజావుగా సాగదు.
ప్రశ్న 3.
చక్రం సమాజగతిని మార్చినది అని ఎట్లా చెప్పగలవు ?
జవాబు.
చక్రాన్ని కనుగొనడానికి ముందు ఒక చోట నుండి మరొకచోటకు వెళ్ళడానికి నడక తప్ప వేరే మార్గంలేదు. చక్రం ఆవిష్కరణతో మానవ జీవనంలో పరుగు మొదలయింది. ప్రయాణం మొదలయింది. చరిత్ర గతి మారింది.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.35)
ప్రశ్న 1.
బంగారానికే సౌందర్యం తెచ్చే స్వర్ణకారుల జీవితాలు ఎందుకు కళ తప్పుతున్నాయో చర్చించండి.
జవాబు.
బంగారం అంత సులభంగా కరగదు. మూసలో పెట్టి బొగ్గుల కొలిమిలో ఉంచి కరిగిస్తారు. దానికోసం బాగా ఊదాల్సివస్తుంది. అద్భుతమైన బంగారు నగలు చేసే వృత్తి కళాకారుల జీవితాలు యాంత్రిక విధానం రావటంతో కళతప్పాయి. బంగారాన్ని కరిగించటానికి ఊది ఊది రోగాల బారిన పడుతున్నారు. వారి శ్రమకు తగ్గ ఫలితం దొరకడంలేదు.
ప్రశ్న 2.
“కమ్మరి పని ఒక ఇంజనీరు ప్రక్రియ” అని ఎట్లా చెప్పగలవు ?
జవాబు.
ఇంజనీరింగ్ ప్రక్రియ అంటే సాంకేతిక ప్రక్రియ. ఇనుముతో నిత్యం సహవాసం చేసేవారు కమ్మరులు. ఎంతో నైపుణ్యంతో గొడ్డలి, పార, కొడవలి, బండి చక్రాలను తయారు చేస్తారు. సరైన కొలతలు తెలియందే అవి తయారుకావు. అందుకే పైకి తేలికగా కనపడే కమ్మరి పనిలో ఇంజనీరు ప్రక్రియ దాగి ఉంది.
ప్రశ్న 3.
వస్తుసామగ్రి, ఇంటిసామగ్రి తయారుచేయడంలో వడ్రంగి శ్రమ విలువను గురించి మాట్లాడండి.
(లేదా)
వడ్రంగుల పనితనం గురించి రాయండి.
జవాబు.
వడ్రంగి శ్రమకు మారుపేరు. కలపను ఎంపిక చేసుకునే దగ్గర నుండి దానిని వివిధ ఆకారాలలోకి మార్చటం కోసం ఎంతగా శ్రమిస్తాడో చెప్పలేము. వ్యవసాయపు పనిముట్లు, ఇండ్లకు వాడే కలప దూలాలు, వాసాలు, కిటికీలు, తలుపులు, కుర్చీలు, బల్లలు వీటి తయారీలో ఆయన శ్రమ విలువ దాగి ఉంటుంది. ఏమాత్రం కొలతలు తప్పినా, తయారు చేసిన వస్తువులు సరిగా కుదరవు.
ప్రశ్న 4.
ఈ వ్యర్థ పదార్థాల నుండి పాదాలకు రక్షణ ఇచ్చే చెప్పులు సృష్టించిన వారి తెలివి ఎంత గొప్పదో చెప్పండి.
జవాబు.
మనం అడుగు బయట పెట్టాలంటే చెప్పుల్లో కాళ్ళు పెట్టాల్సిందే; ఒక చనిపోయిన జంతువు యొక్క చర్మమనే వ్యర్థ పదార్థం నుండి అందరికి అవసరమైన వస్తు సృష్టి చేయటం వారి తెలివికి నిదర్శనం.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.37)
ప్రశ్న 1.
ఈ మానవుని సౌందర్యం వెనుక క్షురకుని పాత్ర ఉన్నది. దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు.
క్షురకుడంటే తల వెంట్రుకలను కత్తిరించే వాడని అర్థం. ఆ వెంట్రుకలను కత్తిరించడంలో ఒక పద్ధతి ఉంది, ఒక అమరిక ఉంది. వారు సరిగా వెంట్రుకలను కత్తిరించకపోతే వికారంగా తయారవుతాము.
ప్రశ్న 2.
ఈ అగ్గిపెట్టెలో పట్టేటంత చీరను నేసిన నేతపనివారి పనితనాన్ని ప్రశంసిస్తూ మాట్లాడండి.
జవాబు.
శరీరాన్ని కప్పుకోవటానికి బట్టలు కావాలి. వాటిని తయారుచేసేవారు నేతపనివారు. బట్టలు నేసే మగ్గంలో గొప్ప సాంకేతిక పరిజ్ఞానం ఉంది. అగ్గిపెట్టె చిన్నది. చీర పెద్దది. అంత పెద్ద చీరను చిన్న అగ్గిపెట్టెలో పట్టేలా, చీరను నేయడం అంటే మాటలు కాదు. ఎంతో పనితనం, నైపుణ్యం ఉండాలి.
ప్రశ్న 3.
దేశానికి అన్నంపెట్టే రైతు జీవనం దుర్బరంగా ఎందుకు మారిందో చర్చించండి.
జవాబు.
దేశానికి వెన్నెముక రైతు. రైతులు కష్టపడి పనిచేసి పంట పండిస్తే సరైన గిట్టుబాటు ధర లభించటం లేదు. దళారి వ్యవస్థ ప్రజలకు, రైతుకు మధ్య ఉండి ఇద్దరినీ దోపిడీకి గురిచేస్తోంది. అందుకే రైతు జీవనం దుర్భరంగా మారింది. దీనికి తోడు అతివృష్టి, అనావృష్టి, నాణ్యమైన విత్తనాల కొరత, చీడ పీడలు….. ఇలా పెట్టిన పెట్టుబడి రాక, వ్యవసాయం గిట్టుబాటు కాక, రైతు జీవనం దుర్భరంగా మారింది.
ఇవి చేయండి
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. “ఒక్కొక్క వృత్తి దేనికదే గొప్పది” దీనిని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు.
వృత్తి అంటే చేతివృత్తులని అర్థం. భారతదేశంలో చేతివృత్తులపై ఆధారపడి జీవించేవారు ఎక్కువ. చేతి వృత్తులవారిలో కుమ్మరి, కంసాలి, కమ్మరి, వడ్రంగి, చర్మకారులు, మంగళ్ళు, నేతవారు, చాకలివారు, వ్యవసాయదారులు ఉన్నారు. వారిలో ఎవరి వృత్తి వారికి గొప్ప.
కుమ్మరి కుండలు చేసే చాకచక్యం కంసాలికి ఉండదు. అలాగే కంసాలి చేసే నగల సున్నితమైన పనితనం కుమ్మరికి ఉండదు. అలాగే మిగిలిన వృత్తుల వారికి కూడా! ఏ వృత్తి గొప్పదనం దానిదే. కుమ్మరి చక్రం తిప్పందే కుండ తయారవదు. ఆ చక్రం కావాలంటే వడ్రంగి, కమ్మరి చెక్కపని, ఇనుము పని చేయాలి. ఇలా ఒక వృత్తి మరొక వృత్తి మీద ఆధారపడి ఉంది. అందుకే దేనికది గొప్పది.
II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. కింది పేరాను చదవండి. దాని ఆధారంగా కింద ఇచ్చిన పట్టికలో వివరాలు రాయండి.
లక్కతో తయారయ్యే గాజులకు హైదరాబాదు ప్రసిద్ధి. వాటికి అద్దంముక్కలు, పూసలు, విలువైన రంగురాళ్ళతో అలంకరిస్తారు. హైదరాబాద్ను సందర్శించేవారు వీటిని తప్పక కొనుక్కుంటారు. కళాత్మక కుట్టుపనులలో, వివిధ ఆకారాలలో ఉన్న చిన్నచిన్న అద్దంముక్కలు, పూసలు అందంగా తీర్చిదిద్దుతారు. దుప్పట్లు, దిండ్లు, కుషన్కవర్లు, లంగాలు, జాకెట్లు వంటి దుస్తులకు అత్యంత గిరాకీ ఉన్నది. నిర్మల్ వర్ణచిత్రాలు ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నవి. గృహోపకరణాలైన కొయ్యసామగ్రి, తేలికపాటి చెక్కల బొమ్మలు ఎంతో సృజనాత్మకంగా తయారు చేయబడతాయి.
వెండి నగిషీ కళను ‘ఫెలిగ్రీ’ అంటారు. కరీంనగర్ ఈ కళకు పెట్టింది పేరు. ఇక్కడ సన్నని వెండి దారాలతో, ఆకర్షణీయమైన వస్తువులు తయారుచేస్తారు. గంధపుగిన్నెలు, పళ్లాలు, పెట్టెలు, గొలుసులు, పక్షుల, జంతువుల బొమ్మలు వంటివి కళాకారులు కళాత్మకంగా తయారుచేస్తారు. వరంగల్లు జిల్లాలోని ‘పెంబర్తి’ గ్రామం లోహపు పనివారలకు ప్రసిద్ధి. అపురూపమైన జ్ఞాపికలు, గోడకు తగిలించే చిత్రాలు, పూలకుండీలు, విగ్రహాలు, స్టేషనరీ సామానులు, లోహపు రేకులతో వివిధ అంశాల తయారీ, ఇంకా అనేక రకాల అలంకరణ వస్తువులు వీరి చేతిలో తయారవుతాయి.
జవాబు.
హస్తకళల పేర్లు | దొరికే ప్రాంతం | వాటి ప్రత్యేకతలు |
1. లక్క గాజులు | హైదరాబాదు | అద్దం ముక్కలు, పూసలు, విలువైన రంగు రాళ్ళతో చేతులకు అందాన్నిస్తాయి. |
2. చెక్క బొమ్మలు, వర్ణ చిత్రాలు | నిర్మల్ | చెట్ల కొమ్మలతో అద్భుతమైన కళారూపాలను, బొమ్మలను తయారు చేస్తారు. |
3. ఇత్తడి సామగ్రి | వరంగల్లు జిల్లా పెంబర్తి | ఇత్తడి ఖనిజంతో వివిధరకాలైన సామానులు, కళారూపాలను తయారుచేయు వృత్తి కళాకారులున్నారు. |
4. వెండి నగిషీకళ (ఫెలిగ్రీ) | కరీంనగర్ | సన్నని వెండిదారాలతో ఆకర్షణీయమైన వస్తువులను తయారుచేస్తారు. |
2. ఆయా వృత్తిపనులవారు తయారుచేసేవి, వాడే వస్తువుల పేర్లను పాఠం ఆధారంగా వివరాలను పట్టికలో రాయండి.
జవాబు.
వృత్తులు | వాటికి సంబంధించిన పేరా సంఖ్య | పేరాలో ఇచ్చినవారు వాడే వస్తువులు |
1. కుమ్మరి | 33వ పేజీలో 1, 2 పేరాలు | లేదా తయారుచేసే వస్తువుల పేర్లు కుండలు, కూజాలు, అటికెలు, గురుగులు, మట్టి బొమ్మలు (చక్రం, సారెలు వాడతారు.) |
2. కంసాలి | 33వ పేజీలో 3, 4 పేరాలు | హారాలు, గాజులు, చెవి కమ్మలు, ముక్కుబిళ్ళ, వడ్డాణం, కడియాలు, ఉంగరాలు, గజ్జెలు, గొలుసులు మొదలగునవి. వీటిని తయారు చేయటానికి కొలిమి, చిన్నపాటి సుత్తులను వాడతారు. |
3. కమ్మరి | 3వ పేజీ 2వ పేరా | నాగటికర్రు, పార, గొడ్డలి, కొడవలి, సుత్తి, ఇరుసులు, బండిచక్రము మొదలగునవి. వీటిని తయారుచేయటానికి సుత్తి, కొలిమి, దాయి మొదలగువాటిని వాడతారు. |
4. వడ్రంగి | 34వ పేజీ 3వ పేరా | నాగలి, గుంటుక, గొర్రు, దూలాలు, వాసాలు కిటికీలు, గుమ్మాలు, కుర్చీలు, బెంచీలు మొదలగునవి. వీటిని తయారు చేయటానికి ఉలి, బాడిశ మొదలగు వాటిని వాడతారు. |
5. తోలు పనివాళ్ళు | 35వ పేజీ 1, 2, 3 పేరాలు | చెప్పులు, డప్పులు, మోట బావిలో నీళ్ళు తోడే బొక్కెనలకు తొండాలను చర్మంతో తయారు చేస్తారు. |
6. నేత పనివాళ్ళు | 36వ పేజీ 2, 3 పేరాలు | బట్టలు, కలంకారీ దుస్తులు, పట్టు వస్త్రాలు కంబళ్ళు మొదలగునవి తయారు చేస్తారు. |
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) ‘ఆదివాసులు మనందరికీ మార్గదర్శకులు’ – అని ఎట్లా చెప్పగలరు ? రాయండి.
జవాబు.
ఆదివాసులు అడవులే అమ్మ ఒడిగా జీవించేవారు. ప్రకృతిలో రేయింబవళ్ళు కలసిపోయి ఉండేవారు. ప్రకృతి పరిశీలకులు వారు. ఏమి తినాలో ఏమి తినకూడదో పరిశీలించి ఆ జ్ఞానాన్ని మనకు అందించారు. ఈ పరిశీలన కోసం ఎందరో తమ ప్రాణాలను వదిలి ఉంటారు. వారికున్న విజ్ఞానం చాలా గొప్పది. వాళ్ళు నిజంగా వృక్ష శాస్త్రజ్ఞులే! వన మూలికా వైద్యాన్ని వారి నుండే సభ్య ప్రపంచం తెలుసుకుంది. ప్రజలు రోగాల బారిన పడినప్పుడు చెట్ల ఆకుల రసాలతో ఆరోగ్యవంతులను చేయటం వారికి తెలిసినంతగా మనకు తెలీదు. యుద్ధాల్లో గాయపడిన వారికి స్వస్థతచేకూర్చగల శక్తి వారి నాటు వైద్యానికి ఉందంటే ఆశ్చర్యపడనవసరం లేదు. కావున వారు సభ్య సమాజానికి మార్గదర్శకులని చెప్పాలి.
ఆ) కుమ్మరి గొప్పతనం గురించి మీరు ఏమనుకుంటున్నారో రాయండి.
(లేదా)
నీకు తెలిసిన ఒక వృత్తి గొప్పతనాన్ని తెల్పండి
జవాబు.
కుమ్మరి వేసవి కాలపు చంద్రుడు. చల్లని నీటిని అందించే మట్టి కుండల తయారీలో నేర్పరి. చక్రం త్రిప్పుతూ తయారు చేసిన బంకమట్టిని దానిపై ఉంచి చేతి వేళ్ళతో సున్నితంగా నొక్కుతూ ఆశ్చర్యపడే విధంగా వివిధ రూపాలలో మట్టి వస్తువులను తయారు చేయగల నేర్పరి. ఆయన చేతుల్లో ఇంద్రజాల విద్య ఉందా అనిపిస్తుంది. మనం ఉపయోగించుకునే మట్టి పాత్రల వెనుక నైపుణ్యం కుమ్మరిదే. వేసవిలో పేదవాడి ఫ్రిజ్ నీటి కుండల నుండి అందమైన మట్టి బొమ్మలు తయారు చేయగల నేర్పరి అతడు. ఆయనకు ఆధారభూతమైన వస్తువు ‘సారె’ ఒక్కటే. కుమ్మరి చేసే కుండలు, మట్టిపాత్రలు, దీపపు ప్రమిదలు లేనిదే ఇప్పటికీ మనకు రోజు గడవదంటే, కుమ్మరి గొప్పదనం అర్థమవుతుంది.
ఇ) “రైతులు మన అన్నదాతలు” – సమర్థిస్తూ రాయండి.
(లేదా)
“రైతుకు చేతులెత్తి నమస్కరిస్తాను” అని కవి అనడంలోని ఉద్దేశం ఏమిటి ?
జవాబు.
రైతులు మన అన్నదాతలు. రైతే దేశానికి వెన్నెముక. అతడు పంట పండించకపోతే మనకు ఆహారం ఉండదు. కష్టపడి ఆరుగాలం పంటను సంరక్షించుకుంటూ దాన్నే తన జీవిత సర్వస్వంగా భావించేవాడు రైతు. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికి, సమస్యలతో నలిగి సడలని ధైర్య సాహసములతో పంటలు పండించి అన్నదాత అనిపించుకున్నాడు. ఆయన కష్టం మనకు భుక్తినిస్తుంది. ఒక్కపూట ఆహారం లేకపోతే అల్లాడిపోతాం. పిడికెడు మెతుకుల కోసం పడరాని పాట్లు పడతాం. కోటి విద్యలు కూటికొరకే కదా! మనం తినే అన్నం, కూరగాయలు, పండ్లు ఊరికే రావు కదా! రైతు కష్టించి పని చేస్తేనే మన కడుపులు నిండుతాయి. అందుకే రైతు మన అన్నదాత. అతనికి చేతులెత్తి నమస్కరిస్తానని కవి అన్నాడు.
ఈ) “దేహానికి అవయవాలు ఎంత ముఖ్యమో, సమాజానికి అన్ని వృత్తులవాళ్ళూ అంతే అవసరం” – దీన్ని సమర్థిస్తూ, మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
దేహానికి అవయవాలు ఎంత ముఖ్యమో, సమాజానికి అన్ని వృత్తుల వాళ్ళూ అంతే అవసరం. ఇది నిజం. ఏ అవయవం లేకపోయినా దేహానికి పరిపూర్ణత ఉండదు. అలాగే ఏ వృత్తిదారుడు లేకపోయినా అది సమాజం అనిపించుకోదు. ఒక వృత్తిని ఆధారం చేసుకొని మరొక వృత్తి నిలబడుతుంది. ప్రతి వృత్తిలోను శ్రమ, నైపుణ్యాలుంటాయి. ప్రతివృత్తి పవిత్రమైందే. ఏ వృత్తినీ చిన్నచూపు చూడకూడదు. ఒక శుభకార్యం జరగాలంటే ఎంతో మంది వృత్తిదారుల ప్రమేయం దానిపై ఉంటుంది. మంగళవాద్యాలు, కుండలు, ప్రమిదలు, ఆభరణాలు, వస్త్రాలు కావాలి. వాటిని తయారు చేసే అన్ని వృత్తులవారి సహకారం కావాలి కదా! ఇలా ఒకరికొకరై ఒకరితో ఒకరు సహకరించుకొంటేనే సమాజం నిలబడుతుంది. మన శరీరంలో కళ్ళు, ముక్కు, నోరు, కాళ్ళు చేతులు వీటిలో ఏది గొప్ప అంటే ఏం చెబుతాం. దేనికదే గొప్ప. అన్ని అవయవాలు కలసి ఉండి పనిచేస్తేనే దేహం, అన్ని వృత్తులవారు కలసి ఉంటేనే సమాజం.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) “శ్రమ పునాదిపైనే అభివృద్ధి అనే భవనం నిర్మించబడుతుంది” అని ఎట్లా చెప్పగలరు ? కారణాలు వివరిస్తూ రాయండి. (లేదా) కార్మిక లోకానికి ఈ దేశం ఎంతో ఋణపడి ఉన్నది. సమర్థిస్తూ క్లుప్తంగా రాయండి.
జవాబు.
శ్రమ పునాదిపైనే అభివృద్ధి అనే భవనం నిర్మించబడుతుంది. ఇది వాస్తవం. ‘శ్రమయేవ జయతే’. ‘కృషి ఉంటే మనుషులు ఋషిలవుతారు’ అన్న నానుడులు ఉండనే ఉన్నాయి. శ్రమించటానికి ఎవరూ సిగ్గుపడనవసరం లేదు. సోమరితనం దరిద్రాన్ని తెచ్చిపెడ్తుంది. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని శ్రీశ్రీ గారి భావన. శ్రమను గౌరవించటం నేర్చుకోవాలి. శ్రమ సంస్కృతిలో జీవించటం నేర్చుకోవాలి.
సమాజం అభివృద్ధి చెందాలంటే సమాజంలో ఉన్న వారందరి కృషి అవసరం. రెండవ ప్రపంచయుద్ధంలో జపాన్ పూర్తిగా సర్వస్వాన్ని కోల్పోయింది. దేశ ప్రజలందరు ఆ దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములై శ్రమించి ప్రపంచంలో అత్యున్నత దేశంగా తీర్చిదిద్దారు. కాబట్టి శ్రమ పునాదులపైనే అభివృద్ధి అనే భవనం నిర్మించబడుతుందన్నది యథార్థం. దానికి సమాజంలోని ప్రజలందరూ కులమత వృత్తి భేదం లేకుండా ఒకరికొకరు కలసిమెలసి సహజీవనం చేస్తూ శ్రమించాల్సి ఉంటుంది.
అప్పుడే నిజమైన సమాజపు భవనం నిర్మించబడుతుంది. రైతు నాకెందుకులే అని వ్యవసాయం మానేస్తే, ఒక్కపూట కూడా మనకు తిండి గడవదు. ఇలాగే ఇతర వృత్తుల వాళ్ళు శ్రమ చేయనిదే మనకు రోజు గడవదు. అసలు మన శరీరమే శ్రమను కోరుతుంది. కేవలం తిండితిని కూర్చుంటే, ఆ తిండి అరగక, అనారోగ్యం పాలవుతాము. అందుకే శ్రమలోనే అభివృద్ధి ఉంది.
IV. సృజనాత్మకత/ప్రశంస
1. మీ గ్రామంలోని వృత్తిపనుల వారిని గురించిన ఒకరి వివరాలను సేకరించడానికి ప్రశ్నావళిని తయారు చేయండి.
ఉదా ॥ 1. నమస్కారం! మీ పేరేమిటి ?
జవాబు.
ఉదా : 1. నమస్కారం! మీ పేరేమిటి ?
2. మీరు ఏం చేస్తుంటారు ?
3. మీది కులవృత్తా ? కాదా ?
4. దీనిని ఎవరి దగ్గర నేర్చుకున్నారు ?
5. ఇది మీకు తృప్తినిస్తుందా ?
6. ఈ వృత్తి మీకు భుక్తినిస్తుందా ?
7. మీ వృత్తిలోని ప్రత్యేకత ఏమిటి ?
8. మీ వృత్తిలో మీరు ఏం సాధించారు ?
9. సమాజంలో మీ వృత్తికి మంచి ఆదరణ ఉందా ?
10. ప్రజల అభిమానాన్ని పొందాలంటే మీ వృత్తి పట్ల మీరు ఎలాంటి శ్రద్ధను చూపుతారు ?
11. మీ వృత్తిదారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
V పదజాల వినియోగం
1. కింది పదాలకు సొంత వాక్యాలు రాయండి.
అ) చేదోడు వాదోడు : పిల్లలు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలి.
ఆ) చాకచక్యం : చాకచక్యంగా వ్యవహరించటం తెలివిగల వారి లక్షణం.
2. కింది పట్టికలోని ప్రకృతి వికృతులను గుర్తించి వేరుచేసి రాయండి.
జవాబు.
ప్రకృతి – వికృతి
ఉదా : విద్య – విద్దె
అ) గౌరవం – గారవం
ఆ) ఆహారం – ఓగిర
ఇ) భక్తి – బత్తి
ఈ) రాత్రి – రాతిరి
3. కింది వాటికి పర్యాయపదాలు రాయండి.
అ) చెట్టు : ___________, ___________, ___________
జవాబు.
వృక్షము, తరువు, భూరుహము
ఆ) పాదము : ___________, ___________, ___________
జవాబు.
పద్యపాదము, కాలిఅడుగు, చరణము
ఇ) శరీరం : ___________, ___________, ___________
జవాబు.
దేహం, తనువు, కాయం
VI. భాషను గురించి తెలుసుకుందాం.
1. కింది పట్టికలోని వాక్యాలలో క్రియాభేదాలను గుర్తించి రాయండి.
జవాబు.
వాక్యం | అసమాపక క్రియ | సమాపక క్రియ |
ఉదా : సీత బజారుకు వెళ్ళి, బొమ్మ కొన్నది. | వెళ్ళి | కొన్నది |
1. రాజు పద్యం చదివి, భావం చెప్పాడు. | చదివి | చెప్పాడు. |
2. వాణి బొమ్మ గీసి, రంగులు వేసింది. | గీసి | వేసింది |
3. కావ్య మెట్లు ఎక్కి పైకి వెళ్ళింది. | ఎక్కి | వెళ్ళింది |
4. రంగయ్య వచ్చి, వెళ్ళాడు. | వచ్చి | వెళ్ళాడు. |
5. వాళ్ళు అన్నం తిని నీళ్ళు తాగారు. | తిని | తాగారు |
సంక్లిష్ట వాక్యం :
కింది వాక్యాలు చదవండి. కలిపి రాసిన విధానం చూడండి.
ఉదా : గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.
గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది.
2. కింది వాక్యాలను కలిపి రాయండి.
అ) విమల వంటచేస్తుంది. విమల పాటలు వింటుంది.
జవాబు.
విమల వంట చేస్తూ పాటలు వింటుంది.
ఆ) అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది.
జవాబు.
అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది.
ఇ) రవి ఊరికి వెళ్ళాడు. రవి మామిడి పండ్లు తెచ్చాడు.
జవాబు.
రవి ఊరికి వెళ్ళి మామిడి పండ్లు తెచ్చాడు.
పై వాక్యాలను కలిపి రాసినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
మొదటి వాక్యంలోని సమాపక క్రియ అసమాపక క్రియగా మారింది. కర్త పునరుక్తం కాలేదు.
ఇట్లా రెండు లేక మూడు వాక్యాలు కలిపి రాసేటప్పుడు చివరి వాక్యంలోని సమాపక క్రియ అలాగే ఉంటుంది.
ముందు వాక్యాల్లోని సమాపక క్రియలు, అసమాపక క్రియలుగా మారుతాయి. కర్త పునరుక్తం కాదు. దీనినే, ‘సంక్లిష్ట వాక్యం’ అంటారు.
3. కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా రాయండి.
అ) రజిత అన్నం తిన్నది. రజిత బడికి వెళ్ళింది.
జవాబు.
రజిత అన్నం తిని బడికి వెళ్ళింది.
ఆ) వాళ్ళు రైలు దిగారు. వాళ్ళు ఆటో ఎక్కారు.
జవాబు.
వాళ్ళు రైలు దిగి ఆటో ఎక్కారు.
ఇ) రామయ్య వ్యవసాయదారుడా ? రామయ్య ఉద్యోగస్తుడా?
జవాబు.
రామయ్య వ్యవసాయదారుడా ? ఉద్యోగస్తుడా? రెండు నామవాచకాలలో ఒకటి లోపించడం.
ఈ) రాజన్న లడ్డూలు తెచ్చాడు. రాజన్న అందరికీ పంచాడు.
జవాబు.
జవాబు. రాజన్న లడ్డూలు తెచ్చి అందరికీ పంచాడు.
సంయుక్త వాక్యం :
4. కింది వాక్యాలు చదవండి. కలిపి రాయండి.
ఉదా : రైలు వచ్చింది. చుట్టాలు రాలేదు.
రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు.
అ) వర్షాలు కురిసాయి. పంటలు బాగా పండాయి.
జవాబు.
వర్షాలు కురిసాయి కాబట్టి పంటలు బాగా పండాయి.
ఆ) అతనికి కనిపించదు. అతడు చదువలేడు.
జవాబు.
అతనికి కనిపించదు కాబట్టి చదువలేడు.
పై వాక్యాలను కలిపి రాసినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
పై వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పురాలేదు. వాక్యాలమధ్య కొన్ని అనుసంధాన పదాలు వచ్చాయి. ఇట్లా రెండు వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు రాస్తే అవి ‘సంయుక్త వాక్యాలు’ అవుతాయి. అనుసంధాన పదాలు అంటే కావున, కానీ, మరియు, అందువల్ల మొదలైనవి.
సంయుక్తవాక్యంగా మారేటప్పుడు వాక్యాల్లో వచ్చే మరికొన్ని మార్పులు ఎట్లా ఉంటాయో గమనించండి.
అ) వనజ చురుకైనది. వనజ అందమైనది.
వనజ చురుకైనది. అందమైనది. రెండు నామ పదాల్లో ఒకటి లోపించడం.
ఆ) దివ్య అక్క, శైలజ చెల్లెలు.
దివ్య, శైలజ అక్కాచెల్లెళ్ళు – రెండు నామ పదాలు ఒకేచోట చేరి చివర బహువచనం చేరడం.
ఇ) రామయ్య వ్యవసాయదారుడా ? రామయ్య ఉద్యోగస్తుడా ?
రామయ్య వ్యవసాయదారుడా ? ఉద్యోగస్తుడా ? రెండు నామవాచకాలలో ఒకటి లోపించడం.
ఈ) ఆయన డాక్టరా ? ఆయన ప్రొఫెసరా ?
ఆయన డాక్టరా, ప్రొఫెసరా ? – రెండు సర్వనామాలలో ఒకటి లోపించటం.
5. కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
అ) వారు గొప్పవారు. వారు తెలివైనవారు.
జవాబు.
వారు గొప్పవారు, తెలివైనవారు.
ఆ) సుధ మాట్లాడదు. సుధ చేసి చూపిస్తుంది.
జవాబు.
సుధ మాట్లాడదు, చేసి చూపిస్తుంది.
ఇ) మేము రాము. మేము తేలేము.
జవాబు.
మేము రాము, తేలేము.
భాషా కార్యకలాష్ట్రాలు / ప్రాజెక్టు పని
వివిధ వృత్తి పనులవారు పాడుకొనే పాటలను సేకరించండి. ఒక పాటపై మీ అభిప్రాయం ఆధారంగా నివేదిక రాయండి. ప్రదర్శించండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :
1) ప్రాజెక్టు పని పేరు : వివిధ వృత్తుల వారు పాడుకొనే పాటలు
2) సమాచారాన్ని సేకరించిన విధానం : ఆయా వృత్తి పనుల వారిని కలిసి సేకరించడం
ఆ) నివేదిక :
1. రైతు కూలీల పాట
వానమ్మ వానమ్మ వానమ్మా
ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మా ॥వానమ్మ॥ 2
తెలంగాణ పల్లెలన్నీ ఎండి మండుతున్నాయి
తినటానికి తిండిలేక … ఉండడానికి గుడిసె లేక
తాగేందుకు నీరు లేక … కాపాడే నాథుడు లేక ॥వానమ్మ॥ 2
చెర్లర్లో నీళ్ళూలేవూ … సెలకల్లో నీళ్ళూలేవూ
వాగుల్లో నీళ్ళూలేవూ … వంపుల్లో నీళ్ళూలేవూ
నిన్నే నమ్మిన రైతూ … కళ్ళల్లో నీళ్ళూలేవూ ॥వానమ్మ॥ 2
ఎదిగేటి మిరపసేనూ … ఎండల్లో ఎండిపోయే
సక్కని మొక్కజొన్న ఎక్కెక్కి ఏడ్వబట్టె…
పాలోసుకున్న కంకి … పాలన్నీ ఉడిగిపాయె
నీళ్ళోసుకున్నా నేను … నీళ్ళడలేకపాయే ॥వానమ్మ॥ 2
నల్లానీ గౌడీ బర్రె … తెల్లాని ఎల్లన్నావు
సైదన్నా మేకపోతూ … సక్కని లేగదూడా
కరువంటూ పీనుగెల్లా … కటికోని కమ్ముకునిరి ॥వానమ్మ॥ 2
కొంగునా నీళ్ళూ దెచ్చే … నింగిలో మబ్బులేవీ
చెంగూ చెంగూనా ఎగిరే … చెరువుల్లో చేపాలేవీ
తెల్లనీ కొంగ బావా … కళ్ళల్లో ఊసూలేవీ ॥వానమ్మ॥ 2
2. కుమ్మరిపాట
అన్నల్లారా రారండోయ్ … తమ్ముల్లారా చూడండోయ్
కుండలు చేసే కుమ్మరి నేను
కూజాలు చేసే కుమ్మరి నేను
గిర గిర సారెను తిప్పేస్తా
గురుగులు ముంతలు చేసేస్తా
బంకమట్టికే ఆకృతినిస్తూ
మట్టి ముంతలకు సొగసులద్దుతూ
ఇళ్ళలో వాడే మట్టి పాత్రలను
చల్లని నీటి మట్టి కూజాలను
తయారుచేసే కుమ్మరి నేనూ
పెళ్ళిళ్ళకు వాడే కూరాళ్ళను
దీపవళి నాటి దీపపు ప్రమిదలను
చక చక తయారుచేస్తాను
చిటికెలో మీకు ఇస్తాను ॥అన్నల్లారా రారండోయ్॥
ఇ) ముగింపు :
ఇలా వివిధ వృత్తి పని వాళ్ళు తాము పనిచేస్తున్నప్పుడు కలిగే అలసటను పోగొట్టుకోవడానికి, మానసిక ఉ ల్లాసానికి ఇలాంటి పాటలు పాడుకుంటూ పని చేస్తారు. పల్లెటూళ్ళు మన సంస్కృతీ సంప్రదాయాలకు, ప్రాచీన కళలకు పట్టుగొమ్మలు. ఈ కళలను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
(లేదా)
మీకు తెలిసిన వృత్తిపనివారిని కలవండి. వారు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యల గురించి నివేదిక రాయండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :
1) ప్రాజెక్టు పని పేరు : వివిధ వృత్తిపని వారి సమస్యలు
2) సమాచారాన్ని సేకరించిన విధానం : ఆయా వృత్తిపని వారిని కలువడం ద్వారా
ఆ) నివేదిక :
విషయ వివరణ :
మన దేశంలో ఎన్నో రకాల వృత్తుల వాళ్లు ఉన్నారు. యాంత్రీకరణ జరిగిన తర్వాత వారి చేతి వృత్తులకు గిరాకీ తగ్గి చాలామంది వారి కుల వృత్తులు వదిలివేసి వేరే పనులు చేస్తున్నారు. వృత్తినే నమ్ముకొని జీవిస్తున్న వారి బతుకులు దుర్భరంగా ఉన్నాయి. మా ప్రాంతంలో గల చేనేత, కుమ్మరి, మేదర వృత్తి పనుల వారిని కలిసి వారి సాదక బాధకాల గూర్చి నివేదిక తయారుచేశాను.
1. చేనేత వృత్తి
పూర్వకాలం చేనేత వృత్తికి ఎంతో ఆదరణ ఉండేది. మగ్గంపై చేతితో నేసిన చీరలు, ధోవతులకు చాలా గిరాకీ ఉండేది. కానీ మరమగ్గాలు వచ్చిన తర్వాత చేనేత బట్టలకు ఆదరణ తగ్గిపోయింది. కారణం, మరమగ్గం మీద నేసిన దుస్తుల కంటే వీటి నాణ్యత, మన్నిక తక్కువ, ధర ఎక్కువ. ఒక చేనేత కార్మికుడు గుంట మగ్గంపై 10 గం||లు కూర్చుండి నేస్తే అతడి రోజువారీ కూలీ రూ. 150/- లు మాత్రమే ! కేవలం 10 గజాల గుడ్డను మాత్రమే నేయగలడు. 150 రూ॥లు ఈ కాలంలో అతని జీవితావసరాలను ఎంతమాత్రం తీర్చలేవు.
ఇక మరమగ్గాల కార్మికుల జీవితాలేమైన సవ్యంగా ఉన్నాయా అంటే అదీ లేదు. ఒక మరమగ్గం కార్మికుడు రోజుకు 12 గం||లు పనిచేయాలి. ఒక వారం Day shift లో పనిచేస్తే, మరో వారం Night shift లో పనిచేయాలి. ఏక కాలంలో 8 మరమగ్గాలను చూసుకోవాలి. 10 పీకుల గుడ్డకు 30 పైసలు, అంటే సుమారు 1 మీటర్ గుడ్డకు 1 రూపాయి గిట్టుబాటవుతుంది. ఒక్కో మగ్గంపై 40 మీటర్ల గుడ్డ నేయగలడు. అంటే 8 మరమగ్గాలపై 12 గం||లలో 320 మీటర్ల గుడ్డ మాత్రమే నేయగలడు. సగటున వారానికి 6 రోజులు పనిచేస్తే, 320 × 6 = 1920 రూ॥ నెలకు 1920 × 4 = 7680 రూ॥ సంపాదించగలడు. కానీ, శబ్ద కాలుష్యం, నిద్రలేమి, 12 గంటలు నిలబడే పనిచేయడం లాంటి సమస్యల వల్ల నెలకు 6000/- కంటే ఎక్కువగా సంపాదించలేక పోతున్నారు. అది ఇల్లు కిరాయి, పిల్లల చదువు, జీవించడానికి సరిపోక ఎంతోమంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.
2. కుమ్మరి వృత్తి
పూర్వకాలం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విలసిల్లిన వీరి వృత్తి యాంత్రీకరణ తర్వాత, అల్యూమినియం, స్టీలు పాత్రలు, వంట ఇళ్ళను ఆక్రమించిన తర్వాత, వెల వెల బోయింది. చేతినిండా పనిలేక పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లుతున్నారు.
ఎవరో యోగా సాధకులు, కుండలో నీరు, మట్టి పాత్రల్లో వంటకు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప, ఎవరూ వీటిని వాడడం లేదు. పెళ్లికి వాడే కూరాటి కుండలు, దీపావళి నాడు వాడే ప్రమిదలు తప్ప, ఇతర మృణ్మయ పాత్రల వాడకం శూన్యం.
3. మేదర వృత్తి
వీరు వెదురు బొంగును బద్దలుగా చీల్చి, ఆ బద్దలతో గాదెలు, తట్టలు, చేటలు, తడికెలు లాంటివి తయారుచేస్తారు. పూర్వం ప్రతి గ్రామంలో ఈ మేదరవాళ్లు ఉండేవారు. ఒక ఇంటిని రెండు భాగాలుగా వేరు చేయుటకు తడికెలు వాడేవారు. దానికి బదులు ఇప్పుడు కార్డుబోర్డును వాడుతున్నారు.
పెళ్ళిళ్ళలో తడికెల పందిరి వేసేవారు, దాని స్థానంలో ఇప్పుడు టెంట్లు వచ్చాయి. ప్లాస్టిక్ చేటలు, తట్టలు, బుట్టలు వచ్చి వెదురుతో చేసిన చేటలు, తట్టలు, బుట్టల స్థానాన్ని ఆక్రమించాయి. చేయడానికి పనిలేక వీరు పట్టణాలకు వలస వెళుతున్నారు.
ఇ) ముగింపు :
ఈ విధంగా యాంత్రీకరణ, వివిధ చేతి వృత్తుల వారికి పనిలేకుండా చేసింది. వీరి సాదక బాధకాలు, ప్రభుత్వం తెలుసుకొని చేయూత నివ్వాలి. చేతివృత్తుల వారి ఉత్పత్తులకు మార్కెట్లో స్థానం కల్పించి, తగిన ధర ఇప్పించాలి. వీరు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నెలకొల్పుకోవడానికి, తక్కువ వడ్డీకే బ్యాంకులు అప్పులు ఇవ్వాలి.
TS 8th Class Telugu 4th Lesson Important Questions అసామాన్యులు
ప్రశ్న 1.
నేతపనివారల కళా నైపుణ్యాన్ని వివరించండి.
జవాబు.
బట్టలను తయారు చేసేవారు నేతపనివారు. మన శరీరాన్ని కప్పుకోవటానికి బట్టలు కావాలి. మగ్గం ద్వారా బట్టలను తయారుచేసి అందించే నేతపనివారి నైపుణ్యం చాలా గొప్పది. బట్టలు నేయడానికి వాడే మగ్గం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడినది. నేతపనివారు అగ్గిపెట్టెలో పట్టేంత చీరలను తయారు చేస్తారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఒక సుదీర్ఘ ప్రక్రియ. దూది నుండి సన్నని దారాన్ని తీయటం, దాన్ని పడుగు పేకలలో అమర్చటం, మగ్గంపై వస్త్రాలను తయారుచేయటం నేత పనివారలు ఎంతో నైపుణ్యంతో చేస్తారు. గొర్రెల బొచ్చును కత్తిరించి ఉన్నిదారం వడికి కంబళ్ళను చేస్తారు. పట్టువస్త్రాల తయారీ వీరి నైపుణ్యానికి ఒక మచ్చుతునక.
ప్రశ్న 2.
క్షురకుల సేవలు మరువలేనివి. సమర్థించండి.
(లేదా)
సమాజంలో వృత్తి చాలా గొప్పది. మీకు తెలిసిన ఒక వృత్తిని గురించి ఐదు వాక్యాలు రాయండి.
జవాబు.
క్షురకుల సేవలు మరువరానివి. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించటంలో వీరి పాత్ర అనిర్వచనీయమైనది. కత్తి, కత్తెరలతో వారు చూపే పనితనం ఎంతో నైపుణ్యంతో కూడినది. వీరికి తెలిసిన మరొక విద్య దేశీయమైన వైద్యం. చెట్ల వేళ్ళతో, ఆకులతో, చేపలతో చేసే మందుల పట్ల వీరికి మంచి అవగాహన ఉంది. తైలంతో శరీర మర్దన వీరి నైపుణ్యానికి నిదర్శనం. స్త్రీలకు క్షురకస్త్రీలే పూర్వం ప్రసవం చేసేవారట. వీరి సేవలన్నీ ఆరోగ్యకరమైనవి. సమాజానికి వీరి సేవలు అత్యవసరం.
ప్రశ్న 3.
“అన్నమయములైనవన్నీ జీవమ్ములు” అని కవి అనడంలోని ఉద్దేశమేమి?
జవాబు.
సకల ప్రాణులు అన్నం తినే జీవిస్తాయి. ఆ అన్నమే లేకపోతే ప్రాణికోటి లేదు. ఇంత ప్రాధాన్యం ఉన్న ఆహార నియమాల గురించి ఆదివాసులకు మొదటనే తెలుసు. అన్నం అందరికీ అవసరం అని కవి చెప్పాడని భావం.
ప్రశ్న 4.
గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి ?
జవాబు.
గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండాలంటే గ్రామంలోని ప్రజలందరి సమిష్టి కృషి ఎంతో అవసరం. ఒకప్పుడు
గ్రామాలు స్వయం సమృద్ధిగా వెలిగాయి. ప్రజా జీవనానికి అవసరమైన వస్తువులను అన్ని వృత్తులవారు కలసి మెలసి తయారు చేసుకునేవారు. ఒకరి అవసరాలకు మరొకరు చేదోడు వాదోడుగా నిలిచేవారు. కులాల కుమ్ములాటలు ఉండేవి కావు. అందరూ అక్కా, బావా, మావా, అత్తా… అని నోరారా పిలుచుకుంటూ ఆత్మీయతతో జీవించేవారు.
మానవత్వాన్ని చాటిన మధుర జీవనం వారిది. కలసి ఉండటం, ఒకరిపై ఒకరు ఆధారపడటం, ఒకరికొకరు సహకరించుకోవటం మన సంస్కృతిలో గొప్పతనం. వీటిని అలవరచుకొని పాటిస్తే గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉంటాయనటంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. సమాజంలోని వారు ఒకరినొకరు సహకరించుకోకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటే గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించలేవు.
ప్రశ్న 5.
అసామాన్యులు వ్యాసం రాయటంలో ఉద్దేశమేమిటి ? చర్చించండి.
జవాబు.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, జీవన విధానం వృత్తి జీవనంపై ఆధారపడి ఉంది. మన సమాజంలోని రహస్యమిదే. పనిని విభాగించటం. మన సమాజం నేర్చుకున్న ఈ చేతివృత్తులు అందరికి సామాజిక స్థాయిని అందిస్తున్నాయి. ఉదాహరణకు ఒక వివాహం జరగాలనుకోండి దానికి కావలసిన వస్తు సామగ్రి ఒక్కరే తయారు చేయటం అసాధ్యం. ధాన్యం ఒకరు, పప్పు ఉప్పులు ఒకరు, కుండలు ఒకరు, తాళిబొట్టు ఒకరు, వస్త్రాలు ఒకరు, పాలు మిగిలిన ఆహార పదార్థాలు ఇంకొకరు. ఇలా సమాజంలోని వారు ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువును లేక పదార్థాన్ని తయారుచేసి సిద్ధంగా ఉంచితేనే కదా, వివాహం జరిగేది.
భారతదేశంలోని ప్రజల మధ్య ఉండే సహకారం సమన్వయాలకు ఒక నిదర్శనం వృత్తులు అని చెప్పేందుకు ఈ వ్యాసాన్ని రచించారు. బ్రాహ్మణుడు లేకపోయినా. కుమ్మరి లేకపోయినా పెళ్ళితంతు జరగటం కష్టమే! సమసమాజ నిర్మాణం ధ్యేయంగా కులవృత్తులు ఏర్పడ్డాయి. కాని ఇప్పుడు నిరాదరణకు గురై వ్యక్తులకు జీవన భృతిని కల్పించలేకపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం సాంకేతిక పరిజ్ఞానం.
ప్రశ్న 6.
రజకుల కాయకష్టం మనకు ఆరోగ్యాన్నందిస్తుంది. సమర్థించండి.
జవాబు.
భారతీయ సమాజంలో చేతివృత్తులకు ఒక విశిష్టత ఉంది. “కులవృత్తికి సాటిరాదు గువ్వల చెన్నా” అన్నమాటలు మన సమాజానికి ప్రతినిధిగా వచ్చినవే! రజకుల కాయకష్టం నిజంగా మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. బట్టల మురికిని శుభ్రం చేయటం ద్వారా మనకు వారు ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. బట్టలను శుభ్రంగా ఉతికి ఆరేయటంతో వాటికి అంటుకున్న మురికితోపాటు చాలా క్రిములు నశిస్తాయి. అలా ఉతికిన బట్టలకు గంజిపెట్టి చలువ చేసి, ఇస్త్రీ చేయటంతో శుభ్రమైన బట్టలుగా అవి తయారవుతాయి.
ఇస్త్రీతో మిగిలిన క్రిములు కూడా నశిస్తాయి. శుభాశుభ కార్యాలు వీరి ప్రమేయం లేకుండా జరుగవు. ఇంట్లో జరిగే కార్యక్రమాలన్నింటిలో చేతివృత్తుల వారి ప్రమేయమే ఎక్కువ. అందునా రజకుల ప్రమేయం మరీ ఎక్కువ. శుభకార్యక్రమాల శుభవార్తలను బంధువులకు తెలియజేయటం దగ్గర నుండి ఆ సమయంలో ఇళ్ళను, గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరించే బాధ్యతను వీరు చక్కగా నిర్వహిస్తారు. ఇవన్నీ మనకు ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమాలే! కనుక రజకుల కాయకష్టం మనకు ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని ఇస్తుందనటంలో అతిశయోక్తి లేదు.
పర్యాయపదాలు
- ఆకాశము = నింగి, గగనము
- సొమ్ములు = డబ్బు, సంపద
- హలము = నాగలి, సీరమ
- కర్షకుడు = రైతు, హాలికుడు
- పశువులు = జంతువులు, పసరములు
- విప్లవం = ఉద్యమము, మేలుకొలువు
నానార్థాలు
- కాలము = సమయము, మరణము
- చేవ = సారము, ధైర్యము
- పాడి = ధర్మము, న్యాయము, క్షీర సంపద (పెరుగు, పాలు, నెయ్యి మొదలైనవి)
- శక్తి = బలము, పార్వతి
- అర్థము = శబ్దార్థము, ప్రయోజనం
ప్రకృతి – వికృతులు
- ప్రకృతి – వికృతి
- ఆశ్చర్యము – అచ్చెరువు
- శక్తి – సత్తి
- ఆకాశము – ఆకసము
- త్యాగము – చాగము
- అటవి – అడవి
- విజ్ఞానము – విన్నాణము
- కష్టము – కస్తి
- ధర్మము – దమ్మము
- స్త్రీ – ఇంతి
వ్యుత్పత్త్యర్థాలు
- గురువ = అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు (ఉపాధ్యాయుడు)
- హాలికుడు = హలముతో నేలను దున్నువాడు (రైతు)
- పక్షి = పక్షములు కలది
- పౌరుడు = పురంలో నివసించువాడు
సంధులు
- దేశాభివృద్ధి = దేశ + అభివృద్ధి – సవర్ణదీర్ఘసంధి
- సూత్రము : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమౌతాయి.
- సున్నితమైన = సున్నితము + ఐన – ఉత్వసంధి
- అద్భుతమైన = అద్భుతము + ఐన – ఉత్వసంధి
- సూత్రము : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
- ప్రత్యక్షము = ప్రతి + అక్షము – యణాదేశసంధి
- అత్యంతము = అతి + అంతము – యణాదేశసంధి
- సూత్రము : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనపుడు క్రమంగా యవరలు వచ్చును.
సమాసములు
- వ్యర్థ పదార్థం = వ్యర్థమైన పదార్థం – విశేషణ పూర్వపద కర్మధారయము
- మహా పురుషుడు = గొప్పవాడైన పురుషుడు – విశేషణ పూర్వపద కర్మధారయము
- మధుర జీవనము = మధురమైన జీవనము – విశేషణ పూర్వపద కర్మధారయము
- తోడు నీడ = తోడుయును నీడయును – ద్వంద్వ సమాసం
- రేయింబవలు = రేయియును పవలును – ద్వంద్వ సమాసం
- బండి చక్రము = బండి యొక్క చక్రము – షష్ఠీ తత్పురుష సమాసం
- జంతువుల మనసు = జంతువుల యొక్క మనసు – షష్ఠీ తత్పురుష సమాసం
- కళా దృష్టి = కళ యొక్క దృష్టి – షష్ఠీ తత్పురుష సమాసం
- మూడు తరాలు = మూడు అను సంఖ్యగల తరాలు – ద్విగు సమాసం
- నవగ్రహాలు = తొమ్మిది అను సంఖ్యగల గ్రహాలు – ద్విగు సమాసం
- మృదుమధురము = మృదువైనది మధురమైనది – విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
- శీతోష్ణము = శీతలమైనది ఉష్ణమైనది – విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
పాఠం ఉద్దేశం
అన్ని వృత్తుల సమిష్టి సహకారంతో సమాజం కొనసాగుతుంది. వృత్తులు సమాజ సేవలో తమవంతు పాత్రను పోషిస్తాయి. దేశాభివృద్ధికి మూలస్తంభాలుగా నిలిచినవి వృత్తులే! అయినా వాటికి ఆదరణ కరువైంది. వివిధ వృత్తుల వారిపట్ల గౌరవాన్ని, శ్రమ విలువలను పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ప్రశ్న.
‘వ్యాస ప్రక్రియను పరిచయం చేయండి.
జవాబు.
ఈ పాఠం వ్యాసప్రక్రియకు చెందినది. వృత్తులు వ్యక్తి గౌరవానికి, సమాజాభివృద్ధికి ఎట్లా తోడ్పడుతాయో వివరిస్తూ, శ్రమ సౌందర్యాన్ని తెలియజేసే వ్యాసమిది.
ప్రవేశిక
శ్రమ జీవన సౌందర్యాన్ని వర్ణించడం ఎవరితరం ? ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకుంది. అయినా అన్ని వృత్తుల సమిష్టి జీవనమే సమాజం. ఎవరి వృత్తి ధర్మాన్ని వారు నిబద్ధతతో నిర్వహిస్తే సమాజం సుసంపన్నం అవుతుంది. ప్రతి వృత్తి గౌరవప్రదమైనదే! అన్ని వృత్తుల మేలు కలయికతోనే వసుధైక కుటుంబ భావన పెరుగుతుంది. కొన్ని వృత్తుల విశేషాలను తెలుసుకుందాం!
కఠిన పదాలకు అర్ధాలు
- దృష్టి = చూపు
- ప్రతిభ = నేరు
- పరిశీలన = నిశితమైన గమనింపు
- మార్గం = దారి / త్రోవ
- అద్భుతం = గొప్పది.
- ఆపాదమస్తకం = కాలిగోటి నుండి తల వరకు
- సొమ్ములు = ధనము / పశువులు
- ఆకృతి = రూపం
- ఔదార్యము = ఉదారగుణం
- క్షుధ = ఆకలి
- ఇక్కట్లు = కష్టాలు
- కృషీవలుడు = రైతు
- చిచ్చు = అగ్ని
- హలము = నాగలి
- గొంగడి = కంబళి, రగ్గు
- ఆవిష్కరణ = కనిపెట్టుట
- తోవ = మార్గము
- అమాంతం = ఒక్కసారిగా
- గురుగుల = ఆడపిల్లలు చిన్న వయస్సులో ఆడుకొనే బొమ్మలు (వంటసామగ్రితో ఉన్నవి)
- గిరాకీ = ఎక్కువగా కావలసినవి, ప్రియమైనవి, బాగా కావలసినవి (డిమాండ్)
- సెగ = వేడి బాగా తగులుట, దగ్గరగా వేడి ఉండుట
- తొలి = మొదటి, రంధ్రం
- వెల = రేటు
- వక్కాణించు = గట్టిగా చెప్పు
- కాటికి = కాడు + కి = శ్మశానానికి
- బొక్కెన = బక్కెట్టు
- బాయి = బావి
- క్షురము = కత్తి
- క్షురకుడు = మంగలి
- శరీరమర్దనం = మసాజ్ లేదా మాలిష్
నేనివి చేయగలనా ?