ఏ కులం? TS 7th Class Telugu 9th Lesson Questions and Answers Telangana
బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి.
ప్రశ్నలు
ప్రశ్న 1.
పై బొమ్మలో ఎవరెవరున్నారు?
జవాబు.
పై బొమ్మలో ఉపాధ్యాయిని, ఒక విద్యార్థి, ఒక విద్యార్థిని ఉన్నారు.
ప్రశ్న 2.
నల్లబల్లపైనున్న పద్యం ఏ శతకంలోనిది?
జవాబు.
నల్లబల్లపైనున్న పద్యం వేమన శతకంలోనిది.
ప్రశ్న3.
ఆ పద్యం ఏ సందేశాన్నిస్తుంది?
జవాబు.
ఏ కులంలో పుట్టారన్నది ముఖ్యంకాదు, మంచి గుణములు కలవారా, కాదా అన్నది గమనించాలి అని ఆ పద్యం సందేశాన్నిస్తుంది.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.86)
ప్రశ్న 1.
కార్మికుల ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తున్నది?
జవాబు.
కొలిమి దగ్గర పనిచేస్తుంటే ఆ సెగలకు పొగలకు కార్మికుల పేగులు కాలిపోతున్నాయి. బొగ్గుగనులలో తవ్వుతుంటే కమ్ముకునే దుమ్ము గొంతులోకి పోయి ఊపిరాడకపోవటం, దగ్గతూ ఉండటం జరుగుతుంది. అలా కార్మికుల ఆరోగ్యం క్షీణిస్తున్నది.
ప్రశ్న 2.
ఈ “మాడు చెక్కలే తింటూ మాగాణం దున్నినప్పుడు” అని కవి అనడంలో ఉద్దేశం ఏమిటి?
జవాబు.
మాగాణం అంటే శ్రేష్ఠమైన భూమి. అందులో వ్యవసాయం చేస్తే నాణ్యమైన పంటే చేతికందుతుంది. అంత కష్టపడి అటువంటి మంచి పంట పండించి మనకందించే రైతుకు తినడానికి ఏమీ మిగలడం లేదు. అడుగుబొడుగూ మిగిలినది ఏదో తింటాడు అని చెప్పటం కవి ఉద్దేశం.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.87)
ప్రశ్న 1.
రామకోటి రాసే కాగితాన్నీ, పూలబుట్టను కష్టపడి తయారుచేసిన వారిపట్ల మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు.
కార్మికుడు కాగితాలు తయారుచేసే ఫ్యాక్టరీలో పనిచేస్తే కాగితాలు పుస్తకాలుగా తయారుచేస్తే ఆ పుస్తకాలలో మనం రామకోటి రాసుకుంటాం. మనమెంతో పుణ్యాత్ములమనుకుంటాం. అలాగే పూలబుట్టలు అల్లి తెచ్చిపెడితే వాటిలోకి పూలుకోసుకుని పూజలు చేసి పుణ్యం సంపాదించుకున్నాం అనుకుంటాం. కాని మనం పుణ్యం సంపాదించగలగడానికి సౌకర్యం కలిగించిన వారిని మాత్రం మర్చిపోతాం. నా ఉద్దేశంలో అవి తయారు చేసినవారే గొప్ప పుణ్యాత్ములు
ప్రశ్న 2.
శ్రామికులు కూటికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు?
జవాబు.
శ్రమకు తగ్గ జీతం, ప్రతిఫలం శ్రామికుడికి రావడంలేదు. ముఖ్యంగా కుండలుచేసే కుమ్మరి గురించి చెప్పుకోవాలి. మనం తినే అన్నం వండుకోవడానికి కుండ కావాలి. ఆ కుండ తయారు చేయడానికి కుమ్మరి ఉండాలి. కానీ ఆ కుమ్మరికి కుండలు తయారీ డబ్బులు కూడా రాక, తిండికి ఇబ్బంది పడడం విచిత్రం.
ప్రశ్న 3.
ఈ “పాత రోత రథం విరిగిపోయింది” అని కవి అన్నాడు కదా! దీనిని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు. కొంతమంది పెత్తందార్లు కార్మికులను కర్షకులను తమ చేతికింద మనుషులుగా చేసుకొని వెట్టిచాకిరీ చేయిస్తూ వారికి కూటికి గతిలేకుండా చేస్తున్నారు. మాయమాటలు చెప్పి ఆ అమాయకులను మోసం చేస్తున్నారు. కాని కాలం మారింది. మెల్లగా వారిలోనూ చైతన్యం వచ్చింది. ఇప్పటిదాకా సాగిన జులుం ఇకపై సాగదు. అని చెప్పడానికి కవి “పాతరోత రథం విరిగిపోయింది” అన్నాడు.
ప్రశ్న 4.
శ్రీ శ్రామికులందరు చేయి చేయి కలిపి నిలబడితే ఏమి జరుగుతుంది?
జవాబు.
అన్ని వృత్తులవారూ ఏకమై చేయి చేయి కలిపితే స్వార్థపరుల ఆటలు సాగవు. సమసమాజం ఏర్పడుతుంది. ఆ నవసమాజంలో అందరూ సుఖంగా ఉంటారు.
ఇవి చేయండి
I విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. “ఏకులమబ్బీ….” అనే పాట ఉద్దేశం ఏమై ఉంటుంది? చర్చించండి.
జవాబు.
అన్ని వృత్తుల వారూ సమానమే. కులాలు మతాలు పేరుతో వారిని వేరుచేసి చూడటం తప్పు. వారు చేసే సేవల వల్లనే సమాజంలో ఎవరికీ ఏ కష్టం రాకుండా జీవితం సాఫీగా గడిచిపోతోంది. కాబట్టి కులాల మధ్య స్వార్థంతో అనైక్యతను సృష్టించకూడదు అని సమాజానికి గుణపాఠం చెప్పటమే ఈ పాట ఉద్దేశం.
2. పాఠంలో కవి చెప్పినట్లుగానే శ్రామికుల జీవితాలు ఉన్నాయా? దీనిమీద అభిప్రాయాలు తెలుపండి.
జవాబు.
ఈ పాఠంలో కవి చెప్పినట్లుగానే శ్రామికుల జీవితాలు కష్టాల కడలిలో కొట్టుకు పోతున్నాయి. పగలూ రాత్రీ కష్టపడినా చాలినంత కూలి లేక చాలీచాలని తిండితో శ్రామికులు పస్తులతో బతుకు గడుపుతున్నారు. ఫ్యాక్టరీలలో పనిచేసే వారు రకరకాలుగా బాధలు పడుతూ అనారోగ్యం పాలౌతున్నారు. వారి కష్టాన్ని పట్టించుకొనే వారుగాని ఆదరించే వారుగాని లేరు. ఇవన్నీ గమనించిన తరువాతే కవి ఆ విధంగా చెప్పాడు.
II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. మనిషి జీవనగమనమంతా శ్రామికులమీద ఆధారపడి నడుస్తుంది. మనిషి లౌకిక జీవన పార్శ్వాలన్నీ శ్రామికుల స్పర్శతో చైతన్యవంతమవుతాయి. పొద్దున్నే లేవగానే అవసరమయ్యే నీళ్ళు మన ఇంట్లోకి రావడానికి వెనుక ఎవరి శ్రమ దాగివున్నదో ఆలోచించామా? వేడివేడి చాయ్, కాఫీలు తాగే రుచి వెనుక పాలుపోసే పాలవాడిని గుర్తుచేసుకుంటామా? ఇల్లూ వాకిలిని పరిశుభ్రంగా ఉంచేవారిని, మనం వేసుకునే ఉతికిన దుస్తులు, ఇస్త్రీ మడతల వెనుక ఉన్న శ్రమ సౌందర్యాన్ని తలచుకున్నామా? అందమైన పూల తోటల పరిమళాలు, అపురూప శిల్ప సంపదలతో విలసిల్లే దేవాలయాల వాతావరణం వెనుక దాగిన కార్మికశక్తులను స్మరించుకున్నామా? ఇట్లా అడుగడుగునా మన అవసరాలకు, విలాసాలకు ఉపయోగపడే శ్రామికులు, కార్మికులు, వివిధ కులవృత్తులవాళ్ళు తీవ్రమైన సామాజిక వివక్షతకు గురౌతున్నారు.
చేసిన పనికి తగిన వేతనం లేక, సరైన గౌరవమూ లభించక శ్రమదోపిడికి, నిరాదరణకు గురౌతూ మానసిక వేదనలను అనుభవిస్తున్నారు. వారిపట్ల సమాజ దృక్పథం మారవలసిన అవసరమున్నది. ఆయా వృత్తుల వెనుక వున్న సాంస్కృతిక వారసత్వాన్ని సామాజిక బాధ్యతను మనం గుర్తించాలి. శ్రామికుల స్వేదంతో ప్రపంచం కదులుతుందన్న సత్యాన్ని గౌరవిద్దాం.
పై పేరా ఆధారంగా పట్టికను నింపండి.
జవాబు.
శ్రమజీవులు | వారి సేవలు |
1. నీటి సరఫరా చేసే ఉద్యోగులు | ఇంటింటికీ తెల్లవారేసరికి నీరు అందేట్లు కావలసిన ఏర్పాట్లు చేస్తారు. |
2. పాలవారు | చీకటినే లేచి పశువులను సిద్ధంచేసి పాలు పిండి అందరికీ అందిస్తారు. |
3. పనివారు | ఇల్లు, వాకిలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతారు. మన దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేస్తారు. |
4. తోటమాలి | అందమైన పూలతోటలు పెంచి ఆ పూల పరిమళాలను అందిస్తాడు. |
5. శిల్పి | చక్కని నిర్మాణంతో శిల్పాలతో దేవాలయాలను నిర్మిస్తాడు. |
2. ఈ పాఠంలోని ప్రాసపదాలు రాయండి.
జవాబు.
ఉదా :
1. పెట్టినపుడు, ఎత్తినపుడు; ఇటుక చేసి, కొండ్రలేసి, ఇచ్చినపుడు చేసినపుడు, చిమ్మినపుడు, త్రవ్వినపుడు, దున్నినపుడు, చెక్కినపుడు;
2. పాత – రోత, ఎండలు – బండలు
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
అ) “చెమటోడ్చే మనుషులు చేయి కలిపి నిలబడితే” అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?
జవాబు.
ఈ సమాజంలో కులాలు మతాలు పేరుతో జనాన్ని వేరుచేసి చూడటం, ఎక్కువ తక్కువ అంటూ వర్గీకరించటం జరుగుతున్నది. ఈ భేదాల మూలంగా శ్రామికుల మధ్య విభేదాలు కల్పించి అనైక్యతను సృష్టిస్తున్నారు. వారి సేవలందుకుంటున్నప్పుడు కనబడని హెచ్చుతగ్గులు మిగతా సమయాలలో గుర్తురావడం బాధాకరం. ఆ శ్రామికులంతా ఏకమై కలిసికట్టుగా ఉన్నప్పుడు ఈ స్వార్థపరుల ఆటలు సాగవు అని కవి చెబుతున్నాడు.
ఆ) శ్రమ చేసేవారికి సమాజంలో తగిన గౌరవం లభిస్తుందా? అభిప్రాయం రాయండి.
జవాబు.
శ్రమ చేసేవారికి సమాజంలో తగిన గౌరవం లభించటం లేదు. కనీసం వారిని మనుషులుగా కూడా గుర్తించడంలేదు. వారిచేత ఊపిరాడకుండా చాకిరీ చేయిస్తారు. తగిన కూలి మాత్రం ఇవ్వరు. వారు తిన్నారా? పస్తులున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, రోగాలతో బాధపడుతున్నారా? ఇవేవీ పట్టించుకోని స్వార్థపూరితమైన సమాజం మనది. అందుకే మన సమాజంలో శ్రమకు గుర్తింపులేదు.
ఇ) పాత కబుర్లకు చెదలు పట్టాయని కవి అంటున్నాడు. ఎందుకు అట్లా అన్నాడో ఆలోచించి రాయండి.
జవాబు.
మన సమాజంలో ఇప్పటికీ బూజుపట్టిన సాంప్రదాయాలనూ ఆచారాలనూ పాటించే మూర్ఖులున్నారు. కులాలు-వాటిలో శాఖలు- ఎచ్చుతగ్గులు, మతాలు అంటూ రకరకాల భేదాలను కల్పించి సమాజాన్ని ముందుకు పోనివ్వరు. ఇలాంటి పాత కబుర్లకు కాలం చెల్లిపోయింది. సమాజంలో వస్తున్న మార్పులను అందరూ గుర్తించి పాటించాలి. అందరూ సమానమే అనే భావం కలిగి ఉండాలి. కలిసిమెలిసి ఉంటూ శాంతిని నెలకొల్పాలి అని కవి భావిస్తున్నాడు. అందుకే పాతకబుర్లకు చెదలు పట్టాయన్నాడు.
ఈ) పాఠం ఆధారంగా కవికి గల సామాజిక భావన ఎటువంటిదో రాయండి.
జవాబు.
కవి మన సమాజంలో కులమత భేదాలు నశించిపోవాలని కోరుకుంటున్నాడు. ఏ వృత్తియైనా గౌరవప్రదమైనదే. ఇతరుల ఉపయోగం కోసమే ఆయా వృత్తులు సాగిస్తున్నారు ఆ శ్రామికులు. మన అవసరాలు తీరుస్తున్న వారిని మనమెంతో గౌరవించాలి. వారి పనిలోని నేర్పరితనాన్ని గుర్తించి ప్రోత్సాహపరచాలి. అప్పుడు వారెంతో ఆనందిస్తారు. అలాగే వారి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వాలి. అని కవి భావిస్తున్నాడు.
2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
అ. ‘సమాజంలో మనుషులంతా ఒక్కటే’ అనే వాక్యాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు.
సమాజంలో మనుషులంతా ఒక్కటే. వారిలో కుల మత వర్ణ వర్గ విభేదాలు లేవు. అన్నీ మనుషులు వాళ్ళ స్వార్థం కోసం కల్పించుకున్నవే. నేతపనివారు బట్టలు తయారుచేయకపోతే మన పరిస్థితి ఏమిటి? రైతు పత్తి పండించకపోతే నేతపని వారికి దారమెక్కడిది? రైతు పంటలు పండించాడు. అన్నం వండుకోడానికి కుండలు కావాలి కదా! కుమ్మరి వాడు ఆ కుండలు చేసి ఇస్తాడు. అతడికి సారె ఎక్కడిది? వడ్రంగి చక్రం తయారు చేయాలి. కమ్మరి దానికి పట్టా తయారు చేయాలి.
రైతు పొలం దున్నటానికి, పంట వెయ్యడానికి, కొయ్యడానికి కావలసిన పనిముట్లు కొడవలి, నాగలి, గొడ్డలి. ఇవన్నీ కమ్మరి, వడ్రంగి తయారు చెయ్యాల్సిందే. ధాన్యం మొయ్యాలంటే చెరగాలటే మేదరి బుట్టలు చేటలు అల్లాల్సిందే. కాళ్ళు కాలకుండా నడవాలంటే ఒకరు చెప్పులు కుట్టాల్సిందే. వానలో తడవకుండా ఉండాలంటే ఒకరు మేడలు కట్టాల్సిందే. వీరందరికీ ఎవరైనా మంచి చెడూ చెప్పేవారొకరు. వీరికి కష్టాలొస్తే కాపాడటానికొకరు. ఇలా సమాజంలోని మనుషులంతా ఒకరిమీద ఒకరు ఆధారపడి బతుకుతుంటే వీరిలో ఎక్కువ తక్కువలు ఎక్కడి నుండి వచ్చాయి. కాబట్టి మనుషుల మధ్య తేడాలేదు. అందరూ సమానమే.
IV. సృజనాత్మకత/ప్రశంస
1. మీ పాఠశాలలో ఈ గేయాన్ని అభినయించి చూపండి.
జవాబు.
విద్యార్థులు చేయవలసిన పని
(లేదా)
ఈ పాఠం స్ఫూర్తిగా తీసుకొని వివిధ పనులు చేసేవారి ప్రాధాన్యత తెలిపేటట్లు చిన్న కవిత/గేయం రాయండి.
i) పొలాల నన్నీ, హలాల దున్నీ, ఇలాతలంలో హేమం పిండగ
జగానికంతా సౌఖ్యం నిండగ
విరామ మెరుగక పరిశ్రమించే,
బలం ధరిత్రికి బలి కావించే,
కర్షకవీరుల కాయం నిండా
కాలువకట్టే ఘర్మజలానికి, ఘర్మజలానికి, ధర్మజలానికి,
ఘర్మజలానికి ఖరీదు లేదోయ్!
నరాల బిగువూ,
కరాల సత్తువ
వరాల వర్షం కురిపించాలని,
ప్రపంచ భాగ్యం వర్థిల్లాలని
గనిలో, వనిలో, కార్ఖానాలో
పరిమిస్తూ,
పరిప్లవిస్తూ,
ధనికస్వామికి దాస్యం చేసే,
యంత్రభూతముల కోరలు తోమే,
కార్మికవీరుల కన్నుల నిండా
కణకణ మండే,
గలగల తొణకే
విలాపాగ్నులకు, విషాదాశ్రులకు
ఖరీదుకట్టే షరాబు లేడోయ్!
కావున – లోకపుటన్యాయాలూ, కాల్చే ఆకలి, కూల్చే వేదన
దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ పరిష్కరించే, బహిష్కరించే
బాటలు తీస్తూ, పాటలు వ్రాస్తూ నాలో కదలే నవ్యకవిత్వం
కార్మికలోకపు కల్యాణానికి,
శ్రామికలోకపు సౌభాగ్యానికి
సమర్పణంగా, సమర్చనంగా-
త్రిలోకాలలో, త్రికాలాలలో
శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని కష్టజీవులకు కర్మ వీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ,
స్వస్తివాక్యములు సంధానిస్తూ,
స్వర్ణవాద్యములు సంరావిస్తూ,
వ్యథార్త జీవిత యథార్థదృశ్యం
పునాదిగా ఇక జనించబోయే
భావివేదముల జీవనాదములు
జగత్తుకంతా చవులిస్తానోయ్
కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం,
శరీర కష్టం స్ఫురింపజేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్ర వృత్తుల, సమస్త చిహ్నలు
నా వినుతించే
నా విరుతించే,
నా వినిపించే నవీనగీతికి,
నా విరచించే నవీన రీతికి,
భావ
భాగ్యం!
ప్రాణం!
ప్రణవం!
ii)
సమరం
సూర్యుడు ఉదయించగానే, మొదలౌతుందీ సమరం
మట్టిబొట్టు పెట్టుకొని, ఆయుధాలు పట్టుకొని
సమరానికి సాగుతారు, గుంపులుగా సైనికులు
దేనికోసమీ సమరం?, ఏమి గెలుచుకుంటారు?
కాలేకడుపులకోసం, పిడికెడు మెతుకులకోసం
సాగే ఈ సమరంలో, గెలిచేదేముంటుంది?
ఒక్కపూట అర్ధాకలి, ఒక్కపూట పస్తులు
ఎవరా సైనికులంటే, శ్రామికులూ కార్మికులూ
ఎవరు వారి శత్రువులు? కాలుతున్న కడుపులు
ఏవి వారి ఆయుధాలు? కొడవలి నాగలి రంపం
కత్తి సుత్తి ఉలి గొడ్డలి, చేతులలో నైపుణ్యం.
V. పదజాల వినియోగం.
1. కింద ఇచ్చిన వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.
అ) మా నాయనమ్మ ఆరోగ్యం క్షీణించింది.
జవాబు.
క్షీణించింది = తరిగి పోయింది.
ఆ) నేను మా బడిదగ్గర కమ్మరి కొలిమిని చూశాను.
జవాబు.
కొలిమి = కమ్మరివారు ఇనుమును కాల్చడానికి మంటపెట్టిన చోటు
ఇ) పొలంలోని కొండ్రలు చక్కని గీతలవలె ఉన్నాయి.
జవాబు.
కొండ్రలు = భూమి దున్నిన సాళ్ళు
గీతలవలె = చారలవలె
ఈ) మా వీధిలోని కుక్కకు తిండి లేక డొక్కలెండిపోయినాయి.
జవాబు.
డొక్క = కడుపు
ఉ) పిల్లలు కబుర్లలో పడిపోయారు.
జవాబు.
కబుర్లు = ముచ్చట్లు
ఊ) మన దేశంలో కూడు లేనివారు ఉండరాదు.
జవాబు.
కూడు = బువ్వ
2. కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి.
అ) కల్లబొల్లి = _________
జవాబు.
కల్లబొల్లి = మోసం చేసే
కల్లబొల్లి కబుర్లు చెప్పి మోసం చేసేవారి నుండి జాగ్రత్తగా ఉండాలి.
ఆ. ఆ) పాతరోత = _________
జవాబు.
పాతరోత పాతది అసహ్యంగా ఉంటుంది.
కొత్త వింత అని పాత రోత అనీ నిరసించడం తప్పు.
ఇ) చెమటోడ్చి = _________
జవాబు.
చెమటోడ్చి = కష్టపడి
చెమటోడ్చి పనిచేసినా కడుపునిండా తిండిలేని పేదలు ఎంతోమంది ఉన్నారు.
ఈ) విగ్రహాలు = _________
జవాబు.
విగ్రహాలు = శిల్పాలు
రాళ్ళతో విగ్రహాలు చెక్కే కళ శిల్పకళ.
3. కింది వాక్యాలు చదువండి. ప్రతివాక్యంలోనూ ప్రకృతి-వికృతి పదాలు ఉన్నాయి. వాటిని గుర్తించండి.
అ. కొందరు పిల్లలు పశువులను మేపుతున్నారు. మరికొందరు పసరాలతో ఆడుతున్నారు.
జవాబు.
పశువు (ప్ర) – పసరం (వి)
ఆ. జాతరలో రథం తిప్పుతరట! ఆ అరదం అందంగా ఉంటుందట!
జవాబు.
రథం (ప్ర) – అరదం (వి)
VI. భాషను గురించి తెలుసుకుందాం.
1. కింది పదాలను విడదీయండి. సంధుల పేర్లు రాయండి.
ఉదా : ఎవరితడు = ఎవరు + ఇతడు (ఉకార సంధి)
అ) డొక్కలెండి = _________
జవాబు.
డొక్కలు + ఎండి (ఉకార సంధి)
ఆ) బుట్టలల్లి = _________
జవాబు.
బుట్టలు + అల్లి (ఉకార సంధి)
ఇ) గుడ్డలుతికి = _________
జవాబు.
గుడ్డలు + ఉతికి (ఉకార సంధి)
ఈ) రాముడెప్పుడు = _________
జవాబు.
రాముడు + ఇప్పుడు (ఉకార సంధి)
2. ఈ కింది పదాలను కలుపండి. సంధుల పేర్లు రాయండి.
ఉదా : వెలుగును + ఇచ్చెను = వెలుగునిచ్చెను (ఉకార సంధి)
అ) కులాలు + అని = _________
జవాబు.
కులాలని (ఉకార సంధి)
ఆ) కూటికి + ఇంత = _________
జవాబు.
కూటికింత (ఉకార సంధి)
ఇ) కొండ్రలు + ఏసి = _________
జవాబు.
(ఉకార సంధి)
ఈ) కబుర్లు + అని = _________
జవాబు.
కబుర్లని (ఉకార సంధి)
ఉ) అంది + ఇచ్చు = _________
అందిచ్చు (ఇకార సంధి)
3. కింది పట్టిక ఆధారంగా సరైన ప్రత్యయాలతోటి ఖాళీలు పూరించండి.
అనగనగా ఒక రాజ్య _________ (1) ఆ రాజ్యము _________ (2) ప్రజల _________ (3) కులాలు, మతాలు లేవు. వారంతా ఒకరి _________ (4) ఒకరు త్యాగాలు చేసుకుంటారు. వారి _________ (5) మంచివారు ప్రపంచం _________ (6) ఎవరూ లేరు. అన్నదానం _________ (7) పుణ్యం వస్తుందని ఆ ఊరి రాజు _________ (8) అన్నదానం చేయబడింది. కాని ఆ అన్నదానాని _________ (9) ఎవరూ రాలేదు. కారణం ఆ ఊరిప్రజలు ఎవరు కష్టపడి సంపాదించుకున్నది వారే తింటారు. ఇది విని రాజు సంతోషపడ్డాడు. _________ (10) ప్రజలారా ! మీరంతా ధన్యులు. మీ _________ (11) నా జేజేలు అన్నాడు రాజు.
కు, ఓ, చేత, కి, ము, వలన, లో, కొరకు, కంటె, తో
జవాబు.
అనగనగా ఒక రాజ్యము. ఆ రాజ్యములో ప్రజలకు కులాలు, మతాలు లేవు. వారంతా ఒకరి కొరకు ఒకరు త్యాగాలు చేసుకుంటారు. వారి కంటే మంచివారు ప్రపంచంలో ఎవరూ లేరు. అన్నదానం వలన పుణ్యం వస్తుందని ఆ ఊరి రాజు చేత అన్నదానం చేయబడింది. కాని ఆ అన్నదానానికి ఎవరూ రాలేదు. కారణం ఆ ఊరిప్రజలు ఎవరు కష్టపడి సంపాదించుకున్నది వారే తింటారు. ఇది విని రాజు సంతోషపడ్డాడు. ఓ ప్రజలారా ! మీరంతా ధన్యులు. మీకు నా జేజేలు అన్నాడు రాజు.
ప్రాజెక్టు పని
కుల వ్యవస్థను రూపుమాపేందుకు కృషిచేసిన ఒక సంఘసంస్కర్త గురించి, మీ పాఠశాల గ్రంథాలయం నుండి సమాచారం సేకరించండి, వారి గురించి నివేదిక రాయండి. ప్రదర్శించండి.
బాబాసాహెబ్ అంబేద్కర్ :
పూర్వకాలంలో కులవ్యవస్థ బాగా పాతుకుపోయి ఉండేది. అంటరానితనం అనేది భూతంలాగా భయపెడుతూ బాధిస్తూ ఉండేది. బాబాసాహెబ్ అంబేద్కర్ బాల్యంలో ఎన్నో కష్టాలను అనుభవించి, అవమానాలకు గురియై, సమాజానికి ఎదురు తిరిగాడు. పట్టుదలతో పెద్దచదువులు చదివాడు. దళితులలో ఆత్మవిశ్వాసం పెంచాడు. వారిని చైతన్యవంతులను చేశాడు. రాజ్యాంగ నిర్మాణసంఘానికి అధ్యక్షుడై దళితులకు కొన్ని హక్కులు కల్పించాడు. రిజర్వేషన్లు, రాయితీలు కల్పించాడు. ఆ విధంగా కులాల వ్యవస్థను కదిలించి అణగద్రొక్కబడ్డవారిని తల ఎత్తుకొని జీవించేలా ప్రోత్సహించాడు. అలా అందరికీ ఆరాధ్య దైవమైనాడు.
TS 7th Class Telugu 9th Lesson Important Questions ఏ కులం?
ప్రశ్న 1.
రైతు చేసే కష్టాన్ని వివరించండి.
జవాబు.
రైతు తన కడుపుమాడుతున్నా లెక్కచేయకుండా భూమి చదును చేసి నాట్లు వేస్తాడు. పగలూ రాత్రీ కష్టపడి పొలంలో పంట పండించి ధాన్యపు రాసులను బస్తాల కెత్తుతాడు. ప్రజలందరి ఆకలి తీరుస్తాడు. అతనికి చివరికి మిగిలేది మాడిపోయిన మాడు అన్నమే. దానితోనే సరిపెట్టుకుంటూ కష్టపడుతూ మాగాణి పొలాలను దున్ని నాణెమైన పంటలు పండిస్తున్నాడు రైతు.
ప్రశ్న 2.
“మనుషులంతా ఒక్కటే” అనడానికి ఉదాహరణగా మీకు తెలిసిన ఒక సంఘటన గాని, కథగాని రాయండి.
జవాబు.
కోట్లాదిమంది ప్రజలు తమ ఆరాధన స్థలాలకు రోజూ వెళ్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. శక్తి కొద్దీ కానుకలిస్తారు. కాని భగవంతుడికి వీటన్నిటికంటే దయాదాక్షిణ్యాలు, జాలి, కరుణ కలిగిన వాళ్ళు, దానధర్మాలు చేసేవాళ్ళు అంటేనే ఇష్టం.
మనిషి మనిషికీ మధ్య అసూయాద్వేషాలు, ఓర్వలేనితనం, మోసాలు ద్వేషాలు, నేరాలు అడ్డుగోడలైనాయి.
మానవత్వం మరుగున పడిపోయింది. సమత, మమత అంతరించాయి. ఒక శివరాత్రినాడు శివాలయానికి తండోపతండాలుగా వచ్చారు. ఆ జనసమ్మర్దంలో ఒక కళ్ళులేని బిచ్చకత్తె కాలుజారి పడిపోయింది. ఆమె చేతిలో గిన్నె గోతిలో పడిపోయింది. అవ్వ స్పృహకోల్పోయింది. అక్కడికొచ్చిన మంత్రులు, అధికారులు, పెద్దమనుషులు ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. గుడిలో గంట ఎవరు కొట్టినా మోగటం లేదు. ఇద్దరు పిల్లలు ఆమె పరిస్థితి చూసి అక్కడికొచ్చారు.
అవ్వను లేపి కూర్చోబెట్టారు. దుమ్ము ధూళి దులిపి గాయానికి కట్టుగట్టారు. అవ్వనోట్లో చల్లని నీరు పోశారు. శివపూజకు తెచ్చిన అరటిపళ్ళు తినిపించారు. అవ్వ ఎంతో ఆనందంగా ఆ పిల్లల్ని మెచ్చుకొని దీవించింది. అంతే గుడిగంటలు గణగణా మ్రోగాయి. సమాజంలో నేడు అందరూ అలవరచుకోవలసింది ఇటువంటి మానవత్వమే.
పర్యాయపదాలు
- ఇల్లు = గృహం, సదనం, నివాసం, ఆవాసం
- బండ = శిల, రాయి
- పూజ = అర్చన, సపర్య
- రథం = తేరు, స్యందనం
- విగ్రహం = ప్రతిమ, ప్రతిబింబం, ప్రతికృతి, ప్రతినిధి
- సన్యాసి = భిక్షువు, జడధారి, యతి, ముని
- పశువు = జంతువు, మృగము
నానార్థాలు
- కులం = వంశం, జాతి, శరీరం, ఊరు, ఇల్లు, నేతిపొట్ల, దేశం, పిల్లి
- పశువు = గొర్రె, బలికి ఇచ్చు మృగం, మేడిచెట్టు, ప్రమథగణం
ప్రకృతులు -వికృతులు
ప్రకృతి – వికృతి
- పశువు – పసరం
- శిఖ – సెగ
- కులం – కొలం
- రాశి – రాసి
- రథం – అరదం
సంధులు
- కులమబ్బీ = కులము + అబ్బీ = ఉత్వసంధి
- మతము + అబ్బీ = ఉత్వ సంధి
- రాసులెత్తి = రాసులు + ఎత్తి = ఉత్వ సంధి
- గొట్టాలై = గొట్టాలు + ఐ = ఉత్వ సంధి
- పెట్టినపుడు = పెట్టిన + అపుడు = అత్వసంధి
- చేసినపుడు = చేసిన + అపుడు = అత్వసంధి
- ఎత్తినపుడు = ఎత్తిన + అపుడు = అత్వసంధి
- చెమటోడ్చే = చెమట + ఓడ్చే = అత్వసంధి
- మాదే = మాది + ఏ = అత్వసంధి
సమాసములు
- పొగగొట్టాలు = పొగయొక్క గొట్టాలు – షష్ఠీ తత్పురుష సమాసం
- బొగ్గుట్టలు = బొగ్గుల యొక్క గుట్టలు – షష్ఠీ తత్పురుష సమాసం
- ధాన్యరాసులు = ధాన్యము యొక్క రాసులు – షష్ఠీ తత్పురుష సమాసం
- చెమటోడ్చు బట్టల = చెమటను ఓడ్చు – ద్వితీయా తత్పురుష సమాసం
- బుట్టలల్లి = బుట్టలను అల్లి – ద్వితీయా తత్పురుష సమాసం
- కూటికింత = కూటి కొరకు ఇంత – ద్వితీయా తత్పురుష సమాసం
I. కింద ఇచ్చిన వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలను రాయండి.
1. వేసవి ఎండలవేడి కొలిమిలో పెట్టినట్లున్నది.
జవాబు.
కొలిమి = ఇనుము కాల్చే నిప్పులు మండే చోటు
2. మాగాణంలో వరి బాగా పండుతుంది.
జవాబు.
మాగాణం = తరిపొలం
3. వేసవిలో మల్లెపూలు రాసులు మంచి వాసన వెదజల్లుతాయి.
జవాబు.
రాసులు = కుప్పలు
4. పశువులను ప్రేమగా చూడాలి.
జవాబు.
పశువుల = జంతువులు
5. ఎండలలో బండలు కాలిపోతుంటాయి.
జవాబు.
బండలు = రాళ్ళు
II. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
1) దగ్గు
జవాబు.
దగ్గు ఎక్కువగా వస్తుంటే మందువాడాలి.
2) పూజ
జవాబు.
ఈ రోజు గుడిలో ప్రత్యేకమైన పూజ ఉన్నది
3) కాగితాలు
జవాబు.
మనం కాగితాల పై రాసుకుంటాము.
4) చేయి కలిపి
జవాబు.
ఏ పనియైనా అందరూ చేయి కలిపితే తేలికగా అయిపోతుంది.
III. కింది వాక్యాలలోని ప్రకృతి వికృతి పదాలను గుర్తించి రాయండి.
1) అడవిలో అగ్నిశిఖలు వ్యాపించినాయి. ఆ సెగలకు చెట్లు మాడిపోయాయి.
జవాబు.
శిఖ (ప్ర) – సెగ (వి)
2) కులంలో గుణవంతుడైన కొడుకుంటే ఆ కొలం ప్రసిద్ధమౌతుంది.
జవాబు.
కులం (ప్ర) – కొలం (వి)
3) దేవుని రథం బయలుదేరింది. ఆ అరదాన్ని భక్తులంతా లాగారు.
జవాబు.
రథం (ప్ర) – అరదం (వి)
IV. కింది వాక్యాలలోని గీతగీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి.
1) రవి ఇల్లు మా గృహం పక్కనే ఉంది. వారి నివాసానికి నేను వెళుతూ ఉంటాను.
జవాబు.
ఇల్లు – గృహం, నివాసం
2) సన్న్యాసి అంటే అన్ని కోరికలను వదిలేసినవాడు. కాని ఈ కాలంలో జడధారులు అంతా మోసగాళ్ళే. ఆ దొంగ యతులను నమ్మకూడదు.
జవాబు.
సన్న్యాసి – జడధారి, యతి
V. క్రింది పదాలను విడదీసి సంధిపేరు రాయండి.
1. బుట్టలల్లి
జవాబు.
బుట్టలు + అల్లి = ఉత్వసంధి
2. గొట్టాలై
జవాబు.
గొట్టాలు + ఐ = ఉత్వసంధి
3. కూటికింత
జవాబు.
కూటికి + ఇంత = ఉత్వసంధి
4. చెమటోడ్చి
జవాబు.
చెమట + ఓడ్చి= ఉత్వసంధి
VI. క్రింది పదాలకు విగ్రహవాక్యం రాసి ఏ సమాసాలో రాయండి.
1. చెమటోడ్చి
జవాబు.
చెమటను ఓడ్చి = ద్వితీయాతత్పురుష సమాసం
2. పొగగొట్టాలు
జవాబు.
పొగ యొక్క గొట్టాలు = షష్ఠీతత్పురుష సమాసం
3. కూటికింత
జవాబు.
కూటి కొరకు ఇంత = చతుర్థీ తత్పురుష సమాసం
గేయం – అర్థాలు – భావాలు
ఏ కులమబ్బీ!
మాదే మతమబ్బీ!!
1. మట్టి పిసికి ఇటుక చేసి
ఇల్లు కట్టి పెట్టినపుడు
డొక్క లెండి కొండ్ర లేసి
ధాన్యరాసులెత్తినపుడు ॥ఏ॥
అర్థాలు
అబ్బీ = ఓ అబ్బాయీ
మాది = మా అందరిదీ
ఏ కులం = ఏమి కులం ?
అబ్బీ = ఓ అబ్బాయీ
ఏ మతం = మాది ఏ మతం?
మట్టి పిసికి = మట్టిని మెత్తగా పిసికి
ఇటుక చేసి = ఇటుక రాయి తయారుచేసి
ఇల్లు కట్టి పెట్టినపుడు = మీకు ఇళ్ళు కట్టి ఇచ్చినపుడు
డొక్కలు + ఎండి = ఆకలితో డొక్కలు ఎండిపోయి
కొండ్రలు + ఏసి = పొలాలు వేసి పంటలు పండించి
ధాన్యరాసులు = ధాన్యపు కుప్పలను
ఎత్తినపుడు= బస్తాల కెత్తినపుడు
మాది = మా అందరిదీ
ఏ కులం = ఏమి కులం?
భావం : మట్టిని మెత్తగా తొక్కి, పిసికి, ఇటుకలను తయారుచేసి, ఇల్లు కట్టేవారిది ఏ కులం? కడుపు మాడ్చుకొని, దున్నిన చాలులో పంటను పండించి, ధాన్యరాసులను బస్తాలకు ఎత్తినపుడు రైతుదేకులం?! ఏ మతం?
2. పొగగొట్టాలై పేగులు
కొలిమి సెగలు చిమ్మినపుడు
దగ్గులతో క్షీణిస్తూ
బొగ్గుట్టలు త్రవ్వినపుడు ॥ఏ॥
కొలిమి సెగలు = మండే కొలిమి దగ్గర వచ్చే వేడిని
చిమ్మినపుడు = బయటికి వదిలినప్పుడు
పేగుల = కడుపులోని పేగులు
పొగగొట్టాలు+ఐ = పొగతో నిండిన గొట్టాలవలె మాడిపోయి
దగ్గులతో = ఊపిరాడని దగ్గుతో
క్షీణిస్తూ = ఆరోగ్యం దిగజారిపోతుంటే
బొగ్గు + గుట్టలు = బొగ్గు గనులను
త్రవ్వినపుడు = తొవ్వినపుడు
మాది = మా అందరిదీ
ఏ కులం = ఏ కులం?
భావం : ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఆ కొలిమి సెగలు తగిలి పేగులు మాడిపోతున్నాయి. బొగ్గు గుట్టలను తవ్వినపుడు దుమ్ము ధూళి వల్ల దగ్గుతో కార్మికుని ఆరోగ్యం క్షీణిస్తుంది. వీరిది ఏ కులం?! ఏ మతం?! ఇక్కడ కార్మికుని పేగులను పొగ గొట్టాలతో కవి పోల్చాడు)
3. మాడు చెక్కలే తింటూ
మాగాణం దున్నినపుడు
ఎండలలో బండలపై
విగ్రహాలు చెక్కినపుడు ॥ఏ॥
అర్థాలు
మాడు చెక్కలు + ఏ = మాడిపోయిన అన్నంచెక్కను
తింటూ = ఆహారంగా తీసుకుంటూ
మాగాణం = శ్రేష్ఠమైన పొలాలను
దున్నిన + అపుడు = సాగుచేసినపుడు
ఎండలలో = మండే ఎండల్లో
బండలపై = బండరాళ్ళపై
విగ్రహాలు = బొమ్మలను
చెక్కినపుడు = తయారుచేసినప్పుడు
మాది = మా అందరిదీ
ఏ కులం = ఏ కులం?
భావం: మాడిన అన్నం తింటూ కూడా నేలను దున్నుతూ వరిపంటను పండించే రైతుది ఏ కులం? మండే ఎండలో బండలను అందమైన ఆకృతులలో విగ్రహాలను చెక్కిన శ్రమజీవి శిల్పిది ఏ కులం?! ఏ మతం?!
4. పూజకు అందిచ్చు పూల
బుట్టలల్లి ఇచ్చినపుడు
రామకోటి రాసుకొనే
కాగితాలు చేసినపుడు ॥పా॥
అర్థాలు
పూజ = పూజ చేసుకోడానికి
పూల బుట్టలు = పూలు పెట్టుకొనే బుట్టలు
అల్లి = తయారుచేసి
ఇచ్చిన + అపుడు = ఇచ్చినప్పుడు
రామకోటి రాసుకొనే = రామకోటి రాసుకోడానికి
కాగితాలు చేసినపుడు = కాయితాలు తయారు చేసినప్పుడు
మాది = మా అందరిదీ
ఏ కులం = ఏ కులం?
భావం: దైవపూజకు తీసుకొని వెళ్ళే బుట్టలను అల్లి ఇచ్చిన వారిది ఏ కులం?! భక్తితో రామకోటి రాసుకునే వారికి కాగితాలన తయారుచేసే శ్రామికులది ఏ కులం? ఏ మతం?!
5. పశువు గొంతు కోసి మీకు
చెప్పులు కుట్టిచ్చినపుడు
కూటికింత కూడు లేక
కుండలు జేసిచ్చినపుడు ॥ఏ॥
అర్థాలు
పశువు = జంతువు యొక్క
గొంతుకోసి = పీకను కోసి
మీకు = మీకందరికి
చెప్పులు = కాళ్ళకు వేసుకొనే చెప్పులు
కుట్టి+ఇచ్చిన+అపుడు = తయారుచేసి ఇచ్చినప్పుడు
కూటికి = తినడానికి
ఇంత = కొంచెమైనా
కూడులేక = ఆహారం లేక
కుండలు = మట్టిపాత్రలను
చేసి+ఇచ్చినపుడు = తయారుచేసి ఇచ్చినప్పుడు
మాది = మా అందరిదీ
ఏ కులం = ఏమి కులం?
భావం : జంతువుల చర్మంతో చెప్పులు తయారుచేసి ఇచ్చిన వారిది ఏకులం?! ఏమతం?! బతకడానికి తిండిలేక జనం కోసం కుండలను తయారుచేసిన శ్రమజీవులది ఏ కులం?! ఏ మతం?!
6. సన్యాసులై వస్తే
క్షవరాలూ చేసినపుడు
మురికి గుడ్డలుతికి మల్లె
పూలు చేసి ఇచ్చినపుడు ॥ఏ॥
అర్థాలు
సన్యాసుళ్ళు+ఐ = సన్యాసుల్లాగా గడ్డాలు మీసాలు పెంచుకొని
వస్తే = మా దగ్గరి కొస్తే
క్షవరాలూ చేసినపుడు = జుట్టు కత్తిరించినప్పుడు
మురికి గుడ్డలు = మాసిపోయిన బట్టలు
ఉతికి = శుభ్రం చేసి
మల్లెపూలు చేసి = తెల్లగా మల్లెపూలలాగా చేసి
ఇచ్చిన+అపుడు = మీకిచ్చినప్పుడు
మాది = మా అందరిదీ
ఏ కులం = = ఏమి కులం?
భావం: గడ్డాలు, మీసాలు, జుట్టు పెంచుకొని వచ్చిన వారికి క్షవరాలు చేసేవారిది ఏ కులం?! మురికి బట్టలను మల్లెపువ్వులవలె తెల్లగా ఉతికి ఇచ్చేవారిది ఏ కులం?! ఏ మతం?! ఇట్లా వారి శ్రమను సమాజం వాడుకుంటుంది. వారు ప్రజల అవసరాలను తీరుస్తూనే ఉన్నారు.
7. చెల్లవు మీ కల్లబొల్లి
కబుర్లన్ని చెదలు పట్టె
ఆగదు మీ పాతరోత
రథం విరిగిపోయినది ॥ఏ॥
అర్థాలు
మీ = మీ యొక్క
కల్లబొల్లి = అబద్ధాల
కబుర్లు+అన్ని = మాటలన్నీ
చెల్లవు = ఇకపై సాగవు
చెదలు పట్టె = పాతబడి పుచ్చిపోయాయి
మీ పాత = మీ గతమంతా
రోత = అసహ్యమైనది
రథం విరిగిపోయింది = మీ ఆలోచనల రథం పాడైపోయింది
ఆగదు = మార్పు ఆగదు.
భావం: మీ కల్పిత మాటలకు కాలం చెల్లింది. అబద్ధాలతో ఉన్న మాటలను వినం. వాటికి చెదలుపట్టినాయి. ఆగకుండ సాగిన మీ పాత ఆలోచనల రథం విరిగిపోయింది.
8. కులాలనీ కులంలోని
శాఖలనీ వేరుజేస్తే
చెమటోడ్చే మనషులమూ
చేయి కలిపి నిలబడితే ॥ఏ॥
అర్థాలు
కులాలనీ = కులములనూ
కులంలోని = ప్రతి కులంలో ఉన్న
శాఖలనీ = భేదాలనూ
వేరు + చేస్తే = విడదీస్తే
చెమట + ఓడ్చే = కష్టపడి పనిచేసే
మనుషులమూ = మానవులము
చేయి కలిపి = ఐకమత్యంతో
నిలబడితే = సమూహంగా ఉంటే
భావం : కులాలను, కులాల్లోని అన్ని శాఖలను వేరుచేసి అనైక్యతను సృష్టించాలని చూసేవారికి, గుణపాఠంగా చెమటను చిందించే శ్రామికులు అందరూ చేయి చేయి కలిపి నిలబడతారు. అప్పుడే నవసమాజం, సమసమాజం ఏర్పడుతుంది.
పాఠం ఉద్దేశం
సమాజంలో అనేక కులాలవారు, తెగలవారు, వృత్తులవారు ఉన్నారు. కొందరు స్వార్థపరుల ఆలోచనల వల్ల వారు చీలిపోతున్నారు. వృత్తుల సేవలతోనే సమాజం సమతుల్యతను సాధిస్తుంది. అందుకే కులవృత్తుల సేవలను గుర్తించి తగిన గౌరవం అందించాలి. అప్పుడే సమసమాజ నిర్మాణం జరుగుతుందని తెలుపడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం ‘గేయ’ ప్రక్రియకు చెందినది. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రస్తుత పాఠ్యభాగం చెరబండరాజు రచించిన ‘జన్మహక్కు’ అనే కవితా సంపుటిలోనిది.
కవి పరిచయం
ప్రశ్న.
‘ఏ కులం?’ పాఠ్య రచయిత గూర్చి రాయండి.
జవాబు.
చెరబండరాజు అసలుపేరు బద్దం భాస్కరరెడ్డి. నల్లగొండజిల్లాలోని అంకుశాపురం ఇతని సొంతూరు. ఈయన ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. 1965లో దిగంబర కవిగా మొదలై, 1970 తర్వాత విప్లవగేయాలు, కథలు, నవలలు రాశాడు. ‘గమ్యం’, ‘ముట్టడి’, ‘పల్లవి’ ఇతని కవితా సంకలనాలు. “కత్తిపాట” ఇతని పాటల సంకలనం. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు మొక్కవోని దీక్షకు, ధిక్కారస్వరానికి ప్రతినిధి, ప్రతీక చెరబండరాజు.
ప్రవేశిక
మానవ శరీరంలోని ప్రతి అవయవానికి ప్రాధాన్యత ఉన్నది. ఏ అవయవానికి దెబ్బ తగిలినా, శరీరమంతా బాధపడుతుంది గదా! అవయవాలన్నీ కలిసి పనిచేసినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబ అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి, దేశాభివృద్ధికి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఐకమత్యంతో, సంఘీభావంతో ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించాలి. అందుకే కులాలు వేరైనా, వృత్తులు వేరైనా మనదంతా ఒకేజాతి – మనమంతా భారతీయులం. ‘ఐకమత్యమే మహాబలం’ అనే విషయాన్ని ఈ పాఠం చదివి తెలుసుకుందాం.
నేనివి చేయగలనా?