Telangana SCERT 10th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం రామాయణం బాలకాండ Questions and Answers.
TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం బాలకాండ
బాలకాండం
వాల్మీకి రామాయణ రచన :
నారదుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి నారదుడిని “ఓ మహర్షీ ! అన్నీ మంచి గుణాలే గలవాడు, కష్టాలకు కుంగిపోనివాడు, ధర్మయుతుడు, శరణు వేడినవారిని రక్షించేవాడు, ఆడిన మాట తప్పనివాడు, సకలప్రాణులకూ మేలు చేసేవాడు, శూరుడు, అసూయ లేనివాడు, సౌందర్యవంతుడు ఈ గుణాలన్నీ గలవాడెవరు?” అని అడిగాడు. “ఈ గుణాలన్నీ గలవాడు శ్రీరాముడు !” అంటూ నారదుడు శ్రీరాముని చరిత్రను వినిపించాడు.
వాల్మీకి ఒకరోజు శిష్యులతో కలిసి తమసానదికి వెళుతూ వుండగా ఒక దృశ్యం చూశాడు. జంటగా నున్న క్రౌంచపక్షులలో మగదానిని ఒక వేటగాడు బాణంతో కొట్టాడు. అనుకోకుండానే వాల్మీకి నోటివెంట “ఓ కిరాతుడా? ప్రేమతో ఉన్న జంట పిట్టల్లో ఒక దాన్ని చంపిన నీవు శాశ్వత అపకీర్తిని పొందుతావు” అనే భావం వచ్చే శ్లోకం వెలువడింది. ఆశ్చర్యకరంగా అది ఛందస్సుతో కూడి వుంది. అది ‘అనుష్టుప్’ అనే ఛందస్సు. బ్రహ్మ రామచరిత్రను రాయమని వాల్మీకికి చెప్పాడు. వాల్మీకి రామాయణం రచించాడు.
అయోధ్యా నగరం :
సరయూ నదీతీరంలో ఉన్న కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య. దశరథుడు రాజు. ప్రజలను సొంత బిడ్డల్లా పాలించేవాడు. రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉండేవారు కాని అతడికి సంతానం లేదు. ఋష్యశృంగుడు దశరథునిచే పుత్రకామేష్టియాగం చేయించాడు.
రావణాసురుడు ముల్లోకాలను బాధిస్తూ వుండేవాడు. దేవతలు బ్రహ్మను ప్రార్థించారు. మానవుడి చేతిలో రావణునికి మరణం వుందని బ్రహ్మ చెప్పాడు. దేవతలు విష్ణువును ప్రార్థించారు. యజ్ఞకుండం నుండి దివ్య పురుషుడు ఉద్భవించి దశరథునికి పాయసం అందించాడు. దశరథుడు తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పాయసాన్ని పంచాడు. కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. వాళ్ళు సద్గుణసంపన్నులు. సర్వ విద్యలను అభ్యసించారు. లక్ష్మణుడు రాముణ్ణి భక్తితో సేవించేవాడు. భరత శత్రుఘ్నులకు ప్రేమాభి మానాలు మెండు.
విశ్వామిత్రుని యాగ సంరక్షణ :
ఒక రోజు విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చి తానొక యజ్ఞం చేస్తున్నానని మారీచ, సుబాహులనే రాక్షసులు విఘ్నం కలుగజేస్తున్నారని, యజ్ఞాన్ని రక్షించడానికి శ్రీరాముని పంపమని దశరథుని కోరాడు. దశరథుడు “మహర్షీ! బాలుడైన రాముడిని నీ వెంట పంపలేను. కావాలంటే నేను వస్తాను. మీ యజ్ఞాన్ని పాడు చేస్తున్న రాక్షసులెవరు ?” అన్నాడు. “రావణాసురుడు పంపిన రాక్షసులు మారీచ సుబాహులు !” అని సమాధానమిచ్చాడు విశ్వామిత్రుడు దశరథుడు భయపడి నాకుమారుడిని పంపను అన్నాడు. విశ్వామిత్రుడికి కోపం వచ్చింది.
వాళ్ళ కులగురువైన వశిష్ఠుడు రాముణ్ణి విశ్వామిత్రుని వెంట పంపమని సలహా ఇచ్చాడు. దశరథుడు శ్రీరాముని విశ్వామిత్రుని వెంట పంపాడు. లక్ష్మణుడు అన్నని అనుసరించాడు. విశ్వామిత్రుడు వారికి బల, అతి బల అనే విద్యలను ఉపదేశించాడు. గురుసేవగావిస్తూ రామలక్ష్మణులు సరయూ గంగానదుల సంగమప్రదేశాన్ని చేరారు. అక్కడ నుండి మలద, కరూశ ప్రాంతాలకు చేరుకున్నారు. తాటక అనే యక్షిణి తనకుమారుడైన మారీచునితో కలిసి ప్రజలను పీడిస్తున్నది. తాటకను చంపమని విశ్వామిత్రుడు శ్రీరామునికి చెప్పాడు.
తాటక కాబట్టి, స్త్రీవధగావించడానికి శ్రీరాముడు వెను కాడాడు. దుష్టురాలైన స్త్రీని చంపితే తప్పుగాదని విశ్వామిత్రుడు చెప్పాడు. తాటక మాయాయుద్ధానికి పూనుకున్నది. సంధ్యాసమయం కంటే ముందే ఆమెను వధించమని విశ్వామిత్రుడు ఆదేశించగా రాముడు శబ్దబేధితో ఆమెను చంపాడు. విశ్వా మిత్రుడు సంతోషించి రాముడికి దివ్యాస్త్రాలు ప్రసాదించాడు.
విశ్వామిత్రుడు సిద్ధాశ్రమంలో యజ్ఞం ప్రారంభించాడు. మారీచ సుబాహులు యజ్ఞవేదికపై రక్తవర్షాన్ని కురిపించారు. రాముని అస్త్రం దెబ్బకు మారీచుడు సముద్రంలో ఎగిరి పడ్డాడు. రాముడు సుబాహుని చీల్చాడు. విశ్వా మిత్రుడు నిర్విఘ్నంగా యజ్ఞం పూర్తిగావించాడు. మరునాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటపెట్టుకొని మిథిలకు బయలు దేరాడు. దారిలో గంగానదిని దర్శించారు. విశ్వామిత్రుడు గంగానది వృత్తాంతాన్ని వినిపించాడు.
తన పితరులైన సగరులకు ఉత్తమగతులు కలిగించడానికి భగీరథుడు గంగను వారి బూడిదలపై ప్రసరింపజేయ సంకల్పించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్కచేయక తీవ్రతపస్సు గావించాడు. చివరకు గంగను పాతాళానికి తీసుకు వెళ్ళాడు, రాముడు ఆ భగీరథ వంశపువాడే !
విశ్వామిత్రుడు రామలక్ష్మణులను గౌతముని ఆశ్రమం వద్దకు తీసుకువెళ్ళాడు. అహల్య గౌతముని శాపానికి గురియై అక్కడే పడివుంది. గురువుగారి కోరిక మేరకు రాముడు గౌతమాశ్రమంలో కాలుమోపి అహల్యకు శాపవిమోచనం కలిగించాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిలలో జనకుని వద్దకు తీసుకువెళ్ళాడు. జనకుడు శివధనస్సును చూపాడు. జనకుడు శివధనస్సు ఘనతను వర్ణించాడు. అయిదు వేల మంది మోసుకువచ్చిన ధనస్సును రాముడు అవలీలగా ఎత్తి వింటినారి సంధించి ఎక్కుపెట్టగా అది ఫెళ్ళున విరిగింది.
దానిని ఎక్కుపెట్ట గలవాడే తనకుమార్తె సీతకు భర్త అని జనకుడు చెప్పివున్నాడు. ఇచ్చినమాట ప్రకారం సీతారాముల వివాహాన్ని నిశ్చయించాడు. అయోధ్య నుండి దశరథుడు వచ్చాడు. సీతను రాముడికి, ఊర్మిళను లక్ష్మణునికి, మాండవిని భరతునికి, శ్రుతకీర్తిని శత్రుఘ్నునికి ఇచ్చి పెళ్ళి చేశారు. తిరిగి వెళుతూ వుండగా పరశురాముడు ఎదురై రాముడితో తన వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని సవాలు చేశాడు. రాముడు దాన్ని కూడా ఎక్కుపెట్టాడు. పరశురాముడు ఓడిపోయాడు. రాముడు అయోధ్యకు చేరి తల్లిదండ్రులను సేవిస్తూ వున్నాడు. భరత శత్రుఘ్నులు తాతగారి దేశానికి వెళ్ళారు.
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
శోకం నుండి శ్లోకం ఎలా పుట్టిందో రాయండి.
జవాబు:
ఒకసారి నారదుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. మాటల మధ్యలో శ్రీరాముని గుణగణాలను వర్ణించి చెప్పాడు. రాముని కథ వాల్మీకి మనసుకు హత్తు కున్నది. ఒకనాడు వాల్మీకి సరయూ నదికి స్నానానికి వెళుతున్నాడు. దారిలో ఒక కొమ్మపైన క్రౌంచ పక్షుల జంటను చూసి ఎంతో ఆనందించాడు. అంతలో ఒక బోయవాడు బాణంవేసి మగపక్షిని నేల గూల్చాడు. వాల్మీకి హృదయంలో కరుణ పొరలింది. బోయవాడి మీద కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే ఆయన నోటినుంచి శ్లోకం వెలువడింది. దాని భావం – ‘ఈ క్రౌంచ పక్షుల జంటలో ఒక దానిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలౌతావు’ అని.
“మానిషాధ ప్రతిష్టాంత్వ
మగమః శాశ్వతీః సమాః
యత్ క్రౌంచ మిథునాదేకమ్
అవధీః కామమోహితమ్”
అనే నాలుగు పాదాలతో లయబద్ధంగా వచ్చిన ఈ శ్లోకం ఆయనకే ఆశ్చర్యం కలిగించింది. అలా వాల్మీకి శోకం నుంచి శ్లోకం పుట్టింది. అది ‘అనుష్టుప్’ ఛందస్సు అని, ఆ ఛందంలోనే రామాయణం రాయమని బ్రహ్మ వాల్మీకిని ఆదేశించాడు.
ప్రశ్న 2.
దశరథునికి పుత్రజననం గురించి రాయండి. (లేదా) రామ, లక్ష్మణ భరత, శత్రుఘ్నులు జన్మించిన విధం వ్రాయండి.
జవాబు:
కోసలదేశ రాజు దశరథుడు. సంతానం లేదనే దిగులుతో దశరథుడు తన కులగురువైన వశిష్ఠుని ఆదేశంతో ‘పుత్రకామేష్టియాగం’ చేశాడు. యాగం పూర్తికాగానే గొప్ప తేజస్సుతో యజ్ఞపురుషుడు ఆవిర్భవించి పాయస పాత్రను తెచ్చి దశరథుని చేతిలో ఉంచాడు. “ఈ పాయసం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంచుతుంది. సంతానాన్ని ప్రసాదిస్తుంది” అని చెప్పాడు. దశరథుడు ఎంతో సంతోషంతో ఆ పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచాడు. వారు గర్భం ధరించారు. చైత్రమాసంలో శుద్ధనవమినాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. దశమినాడు కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రఘ్నుడు జన్మించారు. అలా నలుగురు కుమారులు జన్మించి నందుకు దశరథుని ఆనందానికి మేరలేదు. ఈ వార్త విని అయోధ్య ప్రజలంతా ఆనందంతో ఉప్పొంగి పోయారు.
ప్రశ్న 3.
రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. దీన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
కోసల దేశాన్ని దశరథ మహారాజు పాలించేవాడు. అతడు మహావీరుడు. ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకునేవాడు. అతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మవర్తనులై సుఖసంతోషాలతో ఉన్నారు.
అలాగే శ్రీరాముడు కూడా ప్రజలను కన్న బిడ్డలవలె చూసుకున్నాడు. రాజ్యంలో ఏ ఈతి బాధలూ లేవు. ప్రజలంతా ధర్మమార్గంలో నడిచారు. బంధుత్వాలు, బాధ్యతలు, అప్యాయతలూ కలిగి ఉండి సత్ప్రవర్తనతో జీవించారు. కాబట్టి రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు అని చెప్పవచ్చు.
ప్రశ్న 4.
రామాయణం బాలకాండం ఆధారంగా గురు శిష్యుల అనుబంధాన్ని విశ్లేషించండి.
జవాబు:
రామాయణం బాలకాండలో గురువు విశ్వామిత్రుడు. శిష్యులు రామలక్ష్మణులు. విశ్వామిత్రుడు తాను చేసే యాగాన్ని రాక్షసులు పాడు చేస్తున్నారని యాగరక్షణ కోసం రామలక్ష్మణులను తనతో తీసుకెళ్ళాడు. బాగా ఎక్కువైపోయిన రాక్షసమూకను అంతంచేయడానికి కావలసినంత అస్త్రశస్త్ర విద్యలు వారికందించాలని విశ్వామిత్రుని కోరిక. అంత సమర్థుడైన గురువు దొరకడం రామలక్ష్మణుల అదృష్టం.
ఇంతమందిలో చిన్నవయసు వారైన రామలక్ష్మణులను ఎంచు కోవడం వారి అదృష్టం. ఎంతో భక్తితో విశ్వామిత్రుని సేవిస్తూ వెంటనడుస్తున్నారు వారు. దారిలోని ప్రదేశాలను పరిచయం చేస్తూ ధర్మాలనుపదేశిస్తూ నడిపిస్తున్నాడు గురువు. అక్షరం పొల్లు పోకుండా గ్రహిస్తున్నారు శిష్యులు. ఉత్తముడైన గురువు ఉపదేశించిన బల, అతిబల అనే విద్యలను, అస్త్రశస్త్ర ప్రయోగాలను శ్రద్ధగా నేర్చుకున్న ఉత్తమశిష్యులు రామలక్ష్మణులు.
ప్రశ్న 5.
గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి ?
జవాబు:
విశ్వామిత్రుని యాగాన్ని రక్షించడానికి రామ లక్ష్మణులు ఆయనతో వెళ్ళారు. యజ్ఞం పూర్తయిన తరువాత రామలక్ష్మణులను మిథిలానగరానికి తీసుకొని వెళ్ళాడు. దారిలో రాముడు తమ వంశం పుట్టు పూర్వోత్తరాలు వినాలని ఉన్నదని కోరాడు. అట్లే ఆవంశ చరిత్ర వినిపించాడు విశ్వామిత్రుడు. మరునాడు గంగావతరణ వృత్తాంతం తెలుపుమని రాముడు ప్రార్థించాడు.
విశ్వామిత్రుడు వెంటనే భగీరథుని దృఢసంకల్పం, పట్టుదల గురించి వివరించాడు. దివినుండి గంగను భువికి దింపి పాతాళంలో పారించి బూడిద కుప్పలుగా పడి ఉన్న తన పితృదేవతలకు మోక్షప్రాప్తి కలిగించి కార్య సాధకుడైన విషయాన్ని వివరించాడు. భగీరథుని వంశంలోనే వాడే రాముడు. అతనివలె పట్టుదల, కార్యదీక్ష రాముడు అలవరచుకుంటాడని, దృఢ సంకల్పానికి అసాధ్యమైనది ఏదీ లేదని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా పనిని వదలకుండా చేస్తే జయం కలుగుతుందనే ఆశయంతో విశ్వామిత్రుడు గంగావతరణాన్ని గురించి రామునికి చెప్పాడు.
ప్రశ్న 6.
జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణం-సమర్థిస్తూ రాయండి.
జవాబు:
రామాయణంలోని బాలకాండలో రామలక్ష్మణుల విద్యాభ్యాసం ద్వారా ఉత్తమ విద్యార్థి లక్షణాలను తెలుసుకోవచ్చు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు మొదట వేదశాస్త్రాలను అభ్యసించారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞానఖనులయ్యారు. సద్గుణాలకు ఆటపట్టినారు. ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలివి.
ఆ తర్వాత వివిధ అస్త్ర ప్రయోగదక్షుడైన విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు యాగరక్షణ కోసం వెళ్ళారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల, అతిబల విద్యలను ఉపదేశించాడు. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలిదప్పులు ఉండవు. రూపకాంతులు తగ్గవు. నిద్రలో ఉన్నా ఏమరు పాటుతో ఉన్నా రాక్షసులేమీ చేయలేరు.
తమకు విద్య నేర్పిన విశ్వామిత్రునికి సేవలు చేశారు. రామలక్ష్మణులు యాగరక్షణ చేసి, విశ్వా మిత్రుని మెప్పించారు. సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు ఎన్నో దివ్యాస్త్రాలను అను గ్రహించాడు. విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళుతూ ఆ తర్వాత మిథిలా నగరానికి వెళుతూ దారిలోని విశేషాలను విశ్వామిత్రుని అడిగి తెలుసు కున్నారు రామలక్ష్మణులు. ఇలా రామ లక్ష్మణులు తెలియని విషయాలను తెలుసుకోవడానికి ఎప్పుడూ ఆసక్తి కనబరచడం వల్ల అనేక విద్యలను, రహస్యాలను తెలుసుకోగలిగారు. వారికున్న ఆసక్తిని గమనించి విశ్వామిత్రుడు తనకు తెలిసిన అన్ని విద్యలను, రహస్యాలను, విశేషాలను రామ లక్ష్మణులకు తెలియచేశాడు.
జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణమని రామ లక్ష్మణులు నిరూపించారు.
ప్రశ్న 7.
రామలక్ష్మణ భరత శత్రఘ్నులు ఉత్తమ విద్యార్థులు అని తెలుసుకున్నారు కదా ! ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలేమిటో సొంతమాటల్లో రాయండి.
జవాబు:
ఉత్తమ విద్యార్థులకుండవలసిన ప్రధాన లక్షణం ఏకాగ్రత, చెప్పిన ప్రతివిషయాన్ని శ్రద్ధగా గ్రహించాలి. తరువాత గురుభక్తి, గురువుపట్ల అచంచల భక్తివిశ్వాసాలతో మెలగుతూ గురువును దైవంగా భావించాలి. వినయవిధేయతలతో అధ్యయనం చేయాలి. పెద్దల పట్ల గౌరవము, చిన్నవారి పట్ల ఆదరాభిమానాలు కలిగి ఉండాలి. తల్లిదండ్రులను దైవసమానంగా భావించి వారి ఆజ్ఞను శిరసావహించాలి. అందరితో స్నేహంగా ఉండాలి. వృద్ధులపట్ల ప్రేమ, ఆదరం కలిగి ఉండాలి.
సమాజంలో దీనులపట్ల ఆదరం చూపాలి. తోటి వారికి చేతనైన సహాయం చేయాలి. చదువులో పోటీతత్వం కలిగి ఉండాలి. ఆటలమీద ఆసక్తి కలిగి ఉండాలి. ఈ విధంగా ప్రవర్తించిన విద్యార్థులు సమగ్ర వ్యక్తిత్వం కలవారిగా తీర్చిదిద్దబడతారు. సమాజంలో ఉన్నత స్థానం పొందగలుగుతారు.
ప్రశ్న 8.
ఉత్తమ విద్యార్థుల లక్షణాలేమిటి ? రామలక్ష్మణులు ఉత్తమ విద్యార్థులని ఎలా చెప్పగలవు ?
జవాబు:
జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం, ఉత్తమ విద్యార్థుల లక్షణం. గురువుగారికి సేవ చేయడం కూడా ఉత్తమ విద్యార్థి లక్షణం.
రామలక్ష్మణులు ఉత్తమ విద్యార్థులు. వారు తమ గురువైన విశ్వామిత్రుడి పాదాలు ఒత్తారు. వారు గురువు వెంట వెళ్ళి, సకాలంలో లేచి, నిత్యకర్మలు చేసేవారు. గంగాసరయూ నదుల సంగమం వంటి వాటి గురించి గురువుగారిని అడిగి వివరంగా తెలిసి కొన్నారు. గురువు ఆజ్ఞను పాటించడం శిష్యుడి కర్తవ్యమని గ్రహించి, విశ్వామిత్రుడు చెప్పినట్లుగా వారు తాటకను వధించారు.
వారు సిద్ధాశ్రమం చేరి విశ్వామిత్రుని యజ్ఞాన్ని కాపాడారు. మారీచ సుబాహులను తరిమికొట్టారు. మిథిలా నగరానికి గురువుగారితో వెడుతూ, గంగ మొదలయిన వాటిని గురించి గురువుగారిని అడిగి తెలుసుకొన్నారు. గురువుగారి అనుగ్రహంతో ఎన్నో అస్త్రాలను ప్రయోగ, ఉపసంహారాలతో నేర్చు కున్నారు.
దీనిని బట్టి రామలక్ష్మణులు ఉత్తమ విద్యార్థులని చెప్పగలము.
ప్రశ్న 9.
రాముడు తొలిసారిగా తాటక అనే స్త్రీని సంహరించడాన్ని ఎలా సమర్థించగలవు ?
జవాబు:
తాటక, ఒక యక్షిణి. ఆమె వేయి ఏనుగుల బలం కలది. తాటక, ఆమె కుమారుడు మారీచుడు, కలసి మలద, కరూశ జనపదాలను విధ్వంసం చేశారు. దుష్టురాలు తాటకను వధించమని విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. రాముడు కొంచెంసేపు మాట్లాడ లేదు.
అప్పుడు విశ్వామిత్రుడు “స్త్రీని చంపడం ఎలా అని, నీకు అనుమానం వద్దు, అధర్మపరురాలయిన తాటకను చంపితే దోషం రాదు” అని రాముడికి కర్తవ్యం ఉపదేశించాడు.
విశ్వామిత్రుడు చెప్పినట్లు చేయమని దశరథుడు రాముడికి వచ్చేటప్పుడు చెప్పాడు. తండ్రిగారి ఆజ్ఞ రామునకు శిరోధార్యము. అలాగే గురువుగారయిన విశ్వామిత్రుడి ఆజ్ఞను పాటించడం శిష్యుడిగా రాముడి కర్తవ్యం. అందువల్లనే తాటక స్త్రీ అయినప్పటికీ, తండ్రి, గురువుల ఆజ్ఞలను శిరసా వహించి, రాముడు తాటకను చంపాడు. అందులో తప్పు లేదు.
ప్రశ్న 10.
బ్రహ్మ దగ్గర దేవతలంతా ఏమని గోడు వెళ్ళబోసు కున్నారు ? బ్రహ్మ వారికిచ్చిన జవాబేమి ?
జవాబు:
రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్ర వీగుతూ తమను చిత్రహింసలకు గురిచేస్తున్నా డన్నారు. ముల్లోకాలను బాధించడమేగాక ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్టుణ్ణి చేయడానికి పూనుకొన్నాడని తెలిపారు. అతని ఆగడాలకు అంతే లేదన్నారు. ఋషులు, యక్షగంధర్వులమాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజస్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు. అతనిపీడ విరుగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు.
బ్రహ్మ దేవతలతో “రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు. మానవులపట్ల అతనికి చులకన భావం అందుకే వారి గురించి ప్రస్తావించలేదు. కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని” అన్నాడు.
ప్రశ్న 11.
రాముడు తాటకని సంహరించిన సన్నివేశాన్ని వివరించండి. (June 2015)
జవాబు:
తాటక అనే యక్షిణి వేయి ఏనుగుల బలం కలిగినది. ఆమెను ఎవరూ ఎదిరించలేకపోతున్నారు. దుష్టురాలైన తాటకను చంపుమని విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. అధర్మపరురాలయిన తాటకను చంపితే దోషం రాదని మహర్షి చెప్పాడు. గురువు ఆజ్ఞను పాటించాలని రాముడికి తండ్రి కూడా చెప్పాడు.
వికృతాకారంతో విరుచుకుపడుతున్న తాటక చేతులను రాముడు వాడి బాణాలతో ఖండించాడు. అయినా ఆవేశంతో వస్తున్న తాటక ముక్కుచెవులను లక్ష్మణుడు కోసి వేశాడు. తాటక ఆవేశం రెండింతలయ్యింది. తాను కనిపించకుండా రామలక్ష్మణులపై రాళ్ళ వర్షం కురిపించింది.
అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలం పొందుతారు. సంధ్యాకాలం రాకుండానే తాటకను చంపమని మహర్షి రాముడికి చెప్పాడు. దానితో రాముడు శబ్దవేధి విద్యను ప్రదర్శిస్తూ తాటకపై బాణప్రయోగం చేశాడు. క్షణకాలంలో తాటక నేలపైపడి ప్రాణాలను వదలింది. మహర్షి సంతోషించి రాముడికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు.
ప్రశ్న 12.
రామలక్ష్మణులు విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణను చేసిన తీరును తెలపండి. (March 2015)
(లేదా)
శ్రీరాముడు విశ్వామిత్రుని యజ్ఞాన్ని సంరక్షించిన విధానాన్ని వివరించండి. (June 2019)
జవాబు:
రామలక్ష్మణులు దశరథుని పుత్రులు. ధనుర్విద్య నేర్చారు. విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చి, రాక్షసులు తన యజ్ఞానికి విఘ్నం కలుగజేస్తున్నారనీ, యజ్ఞ రక్షణకు రాముణ్ణి తనతో 10 రోజులు పంపమనీ కోరాడు. రాముడికి ఇంకా 16 ఏళ్ళు నిండలేదనీ యజ్ఞరక్షణకు తానే వస్తానని దశరథుడన్నాడు.
తన యజ్ఞానికి మారీచ సుబాహులు విఘ్నాలు కలుగజేస్తున్నారని విశ్వామిత్రుడు చెప్పాడు. రాక్షసులు మీదికి రాముణ్ణి పంపలేనన్నాడు దశరథుడు. విశ్వామిత్రునికి కోపం వచ్చింది. వశిష్ఠ మహర్షి దశరథునికి నచ్చచెప్పి, రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుని వెంట పంపాడు.
విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ అనే విద్యలు ఉపదేశం చేశాడు. ఆ విద్యల మహిమవల్ల రామలక్ష్మణులకు ఆకలిదప్పులు ఉండవు. మార్గమధ్యంలో తాటక అనే రాక్షసి రాగా విశ్వామిత్రుని మాటపై రాముడు తాటక బాహువులు ఖండించాడు. లక్ష్మణుడు దాని ముక్కు, చెవులు కోశాడు. శబ్దవేధి బాణంతో రాముడు తాటకను చంపాడు.
విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సిద్ధాశ్రమం చేరి, యజ్ఞదీక్ష చేపట్టాడు. మారీచ సుబాహులు యజ్ఞకుండంలో రక్తం కురిపించారు. మారీచుడిపై రాముడు ‘శీతేషువు’ అనే మానవాస్త్రాన్ని ప్రయోగించాడు. మారీచుడు సముద్రంలో పడ్డాడు. ఆగ్నేయాస్త్రంతో రాముడు సుబాహుణ్ణి చంపాడు. మిగిలిన రాక్షసులను, ‘వాయవ్యాస్త్రం’తో తరిమారు. మహర్షి యజ్ఞం చక్కగా పూర్తయ్యింది.
ప్రశ్న 13.
రామలక్ష్మణులు విశ్వామిత్ర యాగాన్ని రక్షించిన వృత్తాంతాన్ని తెలపండి.
(లేదా)
విశ్వామిత్రుని వెంట వెళ్ళిన రామలక్ష్మణులు అతని యాగాన్ని కాపాడిన విధానాన్ని వివరించండి. (May 2022)
జవాబు:
రామలక్ష్మణులు దశరథుని పుత్రులు. ధనుర్విద్య నేర్చారు. విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చి, రాక్షసులు తన యజ్ఞానికి విఘ్నం కలుగజేస్తున్నారనీ, యజ్ఞ రక్షణకు రాముణ్ణి తనతో 10 రోజులు పంపమనీ కోరాడు. రాముడికి ఇంకా 16 ఏళ్ళు నిండలేదనీ యజ్ఞరక్షణకు తానే వస్తానని దశరథుడన్నాడు.
తన యజ్ఞానికి మారీచ సుబాహులు విఘ్నాలు కలుగజేస్తున్నారని విశ్వామిత్రుడు చెప్పాడు. రాక్షసుల మీదికి రాముణ్ణి పంపలేనన్నాడు దశరథుడు. విశ్వామిత్రునికి కోపం వచ్చింది. వశిష్ఠ మహర్షి దశరథునికి నచ్చచెప్పి, రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుని వెంట పంపాడు.
విశ్వామిత్రుడు . రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ అనే విద్యలు ఉపదేశం చేశాడు. ఆ విద్యల మహిమవల్ల రామలక్ష్మణులకు ఆకలిదప్పులు ఉండవు. మార్గమధ్యంలో తాటకి అనే రాక్షసి రాగా విశ్వామిత్రుని మాటపై రాముడు తాటక బాహువులు ఖండించాడు. లక్ష్మణుడు దాని ముక్కు, చెవులు కోశాడు. శబ్దభేది బాణంతో రాముడు తాటకను చంపాడు.
విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సిద్ధాశ్రమం చేరి, యజ్ఞదీక్ష చేపట్టాడు. మారీచ సుబాహులు యజ్ఞకుండంలో రక్తం కురిపించారు. మారీచుడిపై రాముడు ‘శీతేషువు’ అనే మానవాస్త్రాన్ని ప్రయోగించాడు. మారీచుడు సముద్రంలో పడ్డాడు. ఆగ్నేయాస్త్రంతో రాముడు సుబాహుణ్ణి చంపాడు. మిగిలిన రాక్షసులను, ‘వాయవ్యాస్త్రం’తో తరిమారు. మహర్షి యజ్ఞం చక్కగా పూర్తయ్యింది.
ప్రశ్న 14.
వాల్మీకి మహర్షి రామాయణ రచనకు శ్రీకారం చుట్టిన విధానం గురించి తెలపండి.
జవాబు:
నారద మహర్షి ఒకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. “మంచిగుణాలు కలవాడూ, మాట తప్పనివాడూ, ధర్మం తెలిసినవాడూ మొదలయిన శుభలక్షణాలు గలవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా ? అని, వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్నించాడు. “సాధారణంగా ఇన్ని విశిష్ట గుణాలు కలవాడు ఉండడు. కాని శ్రీరాముడు ఒక్కడు మాత్రం అలాంటివాడు ఉన్నాడు అని చెప్పి, నారదుడు వాల్మీకికి రామకథను చెప్పాడు. నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు.
వాల్మీకి రామకథను గురించి ఆలోచిస్తూ, శిష్యులతో తమసానదీ స్నానానికి వెళ్ళాడు. అక్కడ ఒక వేటగాడు బాణంతో ఒక మగ క్రౌంచ పక్షిని కొట్టి చంపాడు. వాల్మీకి హృదయంలో కరుణ రసం పొంగింది. “మానిషాద” అనే శ్లోకం ఆయన నోట వెలువడింది. వాల్మీకి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.
సృష్టికర్త అయిన బ్రహ్మ, వాల్మీకిని చూడడానికి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి బ్రహ్మకు ఉపచారాలు చేశాడు. బ్రహ్మ, వాల్మీకిని కూర్చోమన్నాడు. వాల్మీకి హృదయంలో ‘మానిషాద’ శ్లోకం, మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనించింది. బ్రహ్మ చిరునవ్వు నవ్వి వాల్మీకితో “నీవు పలికినది శ్లోకమే. ఈ ఛందస్సులోనే, నీవు రామాయణం రాయి. భూమండలంలో పర్వతాలూ, నదులూ ఉన్నంతకాలం, ప్రజలు రామాయణగాథను కీర్తిస్తూనే ఉంటారు” అని చెప్పాడు.
ఈ విధంగా బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం, వాల్మీకి మహర్షి రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు.
ప్రశ్న 15.
దశరథునికి పుత్రజననం గురించి రాయండి. (లేదా) రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం.
జవాబు:
సరయూనదీ తీరంలో “కోసల” దేశం ఉంది. దాని ముఖ్యనగరం ‘అయోధ్య. దాన్ని దశరథ మహారాజు పాలిస్తున్నాడు. దశరథుడు ధర్మపరాయణుడు. ఇతని పాలనలో దేశం, భోగభాగ్యాలతో విలసిల్లేది. ప్రజలు సుఖంగా ఉండేవారు. దశరథునకు సంతానం లేదు. సంతానం కోసం ఆయన అశ్వమేథయాగం చేద్దామనుకున్నాడు. దశరథుని మంత్రి సుమంత్రుడు అందుకు ఋష్యశృంగమహర్షిని పిలవమన్నాడు.
ఋష్యశృంగుడు ఉన్నచోట వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఋష్యశృంగుడు మూడురోజులు అశ్వమేథయాగం చేయించాడు. పుత్రుల కోసం యజ్ఞం చేయించమని దశరథుడు, ఋష్యశృంగుని కోరాడు. ఇంతలో దేవతలు రావణాసురుడు తమను చిత్రహింస పెడుతున్నాడని బ్రహ్మకు చెప్పారు. రావణాసురుని బాధ తప్పే ఉపాయం చెప్పమునీ, దేవతలు బ్రహ్మను కోరారు.
బ్రహ్మ, దేవతలతో రావణాసురునికి మానవులవల్లనే మరణం ఉందని చెప్పాడు. ఇంతలో శ్రీమహావిష్ణువు వచ్చాడు. దేవతలు మానవుడిగా పుట్టి రావణాసురుని సంహరించమని విష్ణుమూర్తిని కోరారు. దశరథ మహారాజు ముగ్గురు భార్యలకూ నాలుగురూపాలలో పుత్రుడిగా పుట్టమని దేవతలు విష్ణువును కోరారు. విష్ణువు వారికి అభయం ఇచ్చాడు.
దశరథుడి పుత్రకామేష్టి యజ్ఞకుండం నుండి, బ్రహ్మ పంపించగా ఒక దివ్యపురుషుడు బంగారు పాత్రతో దివ్యపాయసం తీసుకొనివచ్చాడు. ఆ పాయసపాత్రను అతడు దశరథుడికి ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలయిన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచాడు. కౌసల్యకు రాముడు, కైకకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు.
ప్రశ్న 16.
సీతారాముల వివాహ వృత్తాంతాన్ని రాయండి.
జవాబు:
విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో “జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ ఒక మహాధనుస్సు ఉంది. అక్కడకు వెడదాం” అన్నాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట మిథిలకు బయలుదేరారు. దారిలో మహర్షి రామలక్ష్మణులకు తన వంశాన్ని గూర్చి, గంగ వృత్తాంతాన్ని గూర్చి చెప్పాడు. భగీరథుని వృత్తాంతం చెప్పాడు.
మిథిలా నగరం సమీపంలో, వారు గౌతమ మహర్షి ఆశ్రమం చూశారు. ఆ ఆశ్రమంలో అహల్యాగౌతములు ఉండేవారు. అహల్య తప్పు చేసిందని గౌతముడు అహల్యను వేల సంవత్సరాల పాటు అన్నపానాలు లేకుండా బూడిదలో పడి ఉండమని శపించాడు. రాముని రాకతో ఆమెకు శాపవిముక్తి కలుగుతుందని చెప్పాడు. రాముడు మహర్షి ఆదేశంపై గౌతమాశ్రమంలో కాలుమోపి, అహల్యకు శాపవిముక్తి కల్పించాడు.
మిథిలలో జనకమహారాజు వీరిని ఆదరించాడు. అహల్యా గౌతముల కుమారుడు శతానందుడు, రామునికి కృతజ్ఞతలు చెప్పాడు. జనకుడు రామలక్ష్మణులను ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు జనకునితో “వీరు దశరథ పుత్రులు రామలక్ష్మణులు. నీ ధనుస్సును చూద్దామని వచ్చారు. చూపించు శుభం కలుగుతుంది” అని చెప్పాడు. జనకుడు శివధనుస్సు చరిత్రను వివరించి తన కూతురు సీత నాగటి చాలులో దొరికిందనీ, ఆ సీతను శివధనుస్సును ఎక్కుపెట్టగల వీరునికి ఇచ్చి పెండ్లి చేస్తాననీ చెప్పాడు. చాలామంది రాజులు శివధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారని కూడా చెప్పాడు.
విశ్వామిత్రుడు శివధనుస్సును తెప్పించమన్నాడు. ఐదువేలమంది కలసి శివధనుస్సు ఉన్న పెట్టెను సభలోకి తెచ్చారు. రాముడు పట్టుకోగానే శివధనుస్సు వంగింది. నారి ఎక్కుపెట్టగా ఆ ధనుస్సు ధ్వని చేస్తూ విరిగింది.
జనకుడు సీతారాములకు పెండ్లి చేయడానికి సిద్ధం అయ్యాడు. దశరథునికి కబురుపెట్టారు. అయోధ్య నుండి అందరూ వచ్చారు. జనకుడు తన కుమార్తెలు సీతా, ఊర్మిళలను, రామలక్ష్మణులకు, తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు మాండవిని, శ్రుతకీర్తిని భరతశత్రుఘ్నులకు ఇచ్చి పెండ్లి చేశాడు.
ప్రశ్న 17.
శ్రీరాముడు శివధనుస్సును విరిచిన విధానాన్ని తెల్పండి.
జవాబు:
జనక మహారాజు, విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు జనక మహారాజునకు రామలక్ష్మణులను చూపించి, “వీరు దశరథ మహారాజు కుమారులు, వీరులు. వీరు శివధనుస్సును చూడాలనుకుంటున్నారు” అని చెప్పాడు. జనకుడు శివధనుస్సు చరిత్రను చెప్పాడు. యాగం కోసం తాను భూమిని దున్నుతుండగా ‘సీత’ దొరికిందనీ, శివధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడే సీతకు తగిన భర్త అనీ అన్నాడు. పూర్వంలో రాజులు ఎవ్వరూ శివధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారని జనకుడు చెప్పాడు.
విశ్వామిత్రుడు జనకమహారాజు మాటలు విని శివధనుస్సును తెప్పించమన్నాడు. ఐదువేలమంది బలవంతులు శివధనుస్సు ఉన్న పెట్టెను తెచ్చారు. విశ్వామిత్రుని అనుమతితో రాముడు ధనుస్సు మధ్యభాగాన్ని అవలీలగా పట్టుకొన్నాడు. ధనుర్విద్యలో ఆరితేరిన రాముని చేయి తగలగానే శివధనుస్సు వంగింది.
రాముడు వింటికి నారిని సంధించాడు. అల్లెత్రాడును ఆకర్ణాంతంగా లాగాడు. పిడుగు పడ్డట్టుగా భయంకర శబ్దాన్ని చేస్తూ శివధనుస్సు ఫెళ్ళున విరిగింది. జనక విశ్వామిత్రులు, రామలక్ష్మణులు తప్ప, మిగిలినవారంతా మూర్ఛపోయారు.
ప్రశ్న 18.
“జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం, ఉత్తమ విద్యార్థుల లక్షణం” సమర్థిస్తూ రాయండి.
జవాబు:
విశ్వామిత్రుడు యజ్ఞ రక్షణకై రాముని తన వెంట పంపించమని దశరథుని కోరాడు. వశిష్ఠుని హితవచనాలు విని, దశరథుడు రామలక్ష్మణులను విశ్వామిత్రుడికి అప్పగించాడు.
విశ్వామిత్రుని రామలక్ష్మణులు అనుసరించారు. వారు చాలాదూరం, సరయూ నదీ తీరం వెంట ప్రయాణించారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ అనే విద్యలను బోధించాడు. ఆ విద్యల ప్రభావం వల్ల వారికి ఆకలి దప్పులు ఉండవు. రూపకాంతులు తగ్గిపోవు. నిద్రలో ఉన్నా, ఏమరుపాటుతో ఉన్నా రాక్షసులు వారిని ఏమీ చేయలేరు. మూడు లోకాల్లో రామలక్ష్మణులను ఎదిరించి పోరాడేవారు ఉండరు.
రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు. విశ్వామిత్రుని పాదాలు ఒత్తాడు. గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈ విధంగా జ్ఞానాన్ని పొందడంలో శిష్యులు నిరంతరం అప్రమత్తులై ఉండాలి. అదే ఉత్తమ విద్యార్థుల లక్షణం.
ఉత్తమ విద్యార్థులైన రామలక్ష్మణులు, గురువుగారు చెప్పినట్లు ‘తాటకి’ అనే రాక్షసిని సంహరించారు. అందుకు సంతోషించి విశ్వామిత్ర మహర్షి, రామలక్ష్మణులకు ఎన్నో దివ్యాస్త్రాలను ప్రసాదించాడు. గురువు అనుగ్రహిస్తే శిష్యునకు ఇవ్వలేనిది ఏమీ ఉండదు. జ్ఞానాన్ని పొందడంలో ఎప్పుడూ అప్రమత్తులై ఉండడం, ఉత్తమ విద్యార్థుల లక్షణం అని దీనిని బట్టి గ్రహించాలి.
రాముడు అప్రమత్తుడై ఉన్నందువల్లే, విశ్వామిత్రుడి నుండి అనేక విద్యలూ, శస్త్రాస్త్రములూ సంపాదించాడు.
ప్రశ్న 19.
దశరథుడు సంతానం కోసం చేసిన యాగాలు ఏమిటి ? యాగ నిర్వహణ భారం ఎవరు వహించారు ?
జవాబు:
దశరథుడు సంతాన ప్రాప్తి కోసం “అశ్వమేధయాగం”, పుత్ర సంతానం కోసం “పుత్రకామేష్టి” యాగం చేశాడు. అశ్వమేధయాగం చేయాలి అనుకొన్నప్పుడు మంత్రీ, సారథీ అయిన సుమంత్రుని సలహా మేరకు ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించాడు. ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు. నిష్ఠాగరిష్ఠుడు. మూడు రోజులపాటు అశ్వమేధ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించాడు.
తర్వాత దశరథుని కోరిక మేరకు ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యాగభారాన్ని కూడా వహించాడు. ఈ యాగానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు హాజరై దశరథుని కోరిక తీరాలని దీవించారు.
ప్రశ్న 20.
శ్రీరాముడు శివధనుస్సును విరిచిన విధానాన్ని తెలపండి.
జవాబు:
విశ్వామిత్రుడు జనకుని ఆహ్వానం మేరకు రామలక్ష్మణులతో కలిసి మిథిలా నగరానికి వెళ్ళాడు. దశరథ కుమారులైన రామ లక్ష్మణులను జనక మహారాజుకు చూపించి, జనకుని వద్ద ఉన్న శివధనుస్సును వారికి చూపించమన్నాడు. జనకుడు శివధనుస్సుని చరిత్రను వివరించి, దానిని ఎక్కుపెట్టిన వారిని సీతకు తగిన భర్తగా గుర్తిస్తానన్నాడు. గతంలో ఎందరో రాజులు ప్రయత్నించి విఫలమయ్యారని చెప్పాడు. జనకుని ఆజ్ఞ మేరకు బలిష్టులు, ఆజానుబాహులు అయిన ఐదువేలమంది శివధనుస్సు ఉన్న పెట్టెను సభావేదికపై ఉంచారు.
విశ్వామిత్రుని అనుమతితో శ్రీరాముడు ధనుస్సు మధ్యభాగాన్ని పట్టుకుని పైకి లేపాడు. ధనుర్విద్య యందు ఆరితేరిన శ్రీరాముడు వింటినారిని పట్టి లాగాడు. పిడుగుపాటు వంటి భయంకరమైన శబ్దంతో శివధనుస్సు విరిగింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగిలిన వారంతా మూర్ఛపోయారు.
ప్రశ్న 21.
భగీరథ ప్రయత్నం అనే జాతీయానికి సంబంధించిన కథను తెలపండి.
జవాబు:
భగీరథుడు పాతాళంలో బూడిదకుప్పలై పడి ఉన్న సాగరపుత్రులకు ఉత్తమగతులు కల్పించాలనుకున్నాడు. అందుకు ఆకాశంలో ఉన్న సురగంగను పాతాళానికి రప్పించాలి. దృఢసంకల్పానికి అసాధ్యమేమున్నది. బ్రహ్మ కోసం తపస్సు చేసి అతని సలహా మేరకు గంగను ఒప్పించి, ఆకాశం నుండి దూకే గంగను భరించడానికి శివుణ్ణి మెప్పించి, గంగను నేలకు తెచ్చి జహ్నుడు అడ్డురాగా అతనిని ప్రార్థించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడక గంగను పాతాళం దాకా తీసుకువెళ్ళి పని పూర్తి చేయగలిగాడు. అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టువదలని సందర్భంలో భగీరథ ప్రయత్నం అనే జాతీయం ఏర్పడింది.
ప్రశ్న 22.
రామాయణం మానవ జీవితానికి స్ఫూర్తి నిచ్చే మహాకావ్యం అని ఎలా చెప్పగలవు ? (లేదా) రామాయణాన్ని ఎందుకు చదవాలి ? (లేదా) రామాయణం చదవడం వలన ప్రయోజనమేమిటి ?
జవాబు:
మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాలను పరిశుద్ధం చేయగల మహా కావ్యం రామాయణం. అమ్మానాన్నలకు పిల్లలపై గల వాత్సల్యం దశరథుని పాత్ర ద్వారా తెలియజేస్తోంది. రామలక్ష్మణుల ద్వారా అన్నదమ్ములెలా ఉండాలో తెలియజేస్తోంది. సీతారాముల పాత్రల ద్వారా భార్యాభర్తల అనురాగం ఎలా ఉండాలో తెలియజేస్తోంది. గురువుగారి పట్ల శిష్యుల భక్తి, శిష్యుల పట్ల గురువులకు ఉండవలసిన వాత్సల్యాన్ని విశ్వామిత్రుడు, రామలక్ష్మణుల పాత్రలు తేలియజేస్తున్నాయి.
సేవకుడు-యజమాని ఉండవలసిన తీరును హనుమ – శ్రీరామ, హనుమ-సుగ్రీవ పాత్రలు తెలియజేస్తాయి. స్నేహితులు ప్రవర్తించవలసిన తీరును తెలియజేసేవి శ్రీరామ సుగ్రీవ పాత్రలు. ఈ విధంగా రామాయణం చదవడం వలన సమాజంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. మానవ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం తెలుస్తుంది. ధర్మంగా ప్రవర్తించడం తెలుస్తుంది.
ప్రశ్న 23.
అహల్యకు శాపవిముక్తి కలిగిన విధానాన్ని రాయండి.
(లేదా)
‘శ్రీరామ పాదం సోకి రాయి ఆడదైనది’ అనే విషయాన్ని సమర్థించండి.
జవాబు:
మిథిలానగర సమీపానికి చేరుకొన్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు. అక్కడ గౌతముని ఆశ్రమం చూశారు. ఆ ఆశ్రమం అందంగా ఉంది. కాని, జనసంచారం లేదు. గౌతమ మహర్షి భార్య అహల్య అనీ, ఆమె ఒక తప్పు చేసినందుకు ఆమెను గౌతముడు శపించాడనీ విశ్వామిత్ర మహర్షి చెప్పాడు. అప్పటి నుండి అహల్య వాయువే ఆహారంగా తీసుకొని జీవిస్తూ బూడిదలో పడి ఉంది.
అహల్య అదృశ్య రూపంలో ఉంది. రాముని రాకతో ఆమెకు నిజరూపం కల్గుతుందని గౌతముడు చెప్పాడని విశ్వామిత్రుడు శ్రీరామునకు చెప్పాడు. విశ్వామిత్రుని ఆజ్ఞతో గౌతముని ఆశ్రమంలో శ్రీరాముడు పాదం మోపాడు. ఆ పవిత్ర పాదం పెట్టగానే అహల్య పూర్వ రూపం పొందింది. అహల్యా గౌతములు శ్రీరాముని సత్కరించారు.
ప్రశ్న 24.
విశ్వామిత్రుని వెంట అయోధ్య నుండి బయలుదేరి, సిద్ధాశ్రమం చేరేవరకు రామలక్ష్మణులకు ఎదురైన సంఘటనల గురించి రాయండి.
జవాబు:
వశిష్ఠుని హిత వచనాలతో విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులను దశరథుడు పంపాడు.
రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు సరయూనది వెంబడి నడుస్తున్నారు. కొంత దూరం ప్రయాణించాక రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు ‘బల’, ‘అతిబల’ విద్యలనుపదేశించాడు. వీటి వల్ల అలసట, ఆకలి, దాహం, శత్రుభయం ఉండవు. మరునాడు ‘మలద’, ‘కరూశ’ జనపదాలకు చేరారు. అక్కడ విశ్వామిత్రుని ఆజ్ఞతో శబ్దభేది విద్యతో ‘తాటక’ను చంపాడు. విశ్వామిత్రుడు ఆనందించాడు. ఎన్నో దివ్యాస్త్రాలను ఇచ్చాడు.
తర్వాత సిద్ధాశ్రమం చేరారు. అదే విశ్వామిత్రుని యజ్ఞభూమి.
ప్రశ్న 25.
అయోధ్య నగరం గురించి రాయండి.
జవాబు:
సరయూనదీ తీరంలో ‘కోసల’ దేశం ఉంది. అందులోనే అయోధ్యా నగరం ఉంది. అయోధ్య అంటే యోధులకు జయించడానికి వీలులేనిది అని అర్థం. అయోధ్యా నగరాన్ని మనువు నిర్మించాడు. కోసల దేశాన్ని పాలించిన రాజులంతా అయోధ్యను రాజధానిగా చేసుకొని పరిపాలించారు. చాలా మంది ధర్మమూర్తులైన చక్రవర్తులు పరిపాలించారు. ప్రజలు కూడా ధర్మపరాయణులు. సుఖసంతోషాలలో జీవించారు. అయోధ్యా నగరం భోగభాగ్యాలతో విలసిల్లింది.
ప్రశ్న 26.
విశ్వామిత్రుడెందుకు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు ? అది సమంజసమా ? వివరించండి..
జవాబు:
విశ్వామిత్రుడు కోరినది చేస్తానని దశరథుడు మాట ఇచ్చాడు. శ్రీరాముని తన వెంట యాగరక్షణకు పంపమని విశ్వామిత్రుడు కోరాడు. తన చిన్ని రాముడు యుద్ధం చేయలేడనీ, తానే వస్తానన్నాడు దశరథుడు. ఈ విధంగా ఇచ్చిన మాట తప్పే ప్రయత్నం చేసిన దశరథునిపై విశ్వామిత్రునికి కోపం వచ్చింది. అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు.
అది సమంజసమే. ఎందుకంటే బాల రామునికి విలువిద్యలో మెళకువలు నేర్పాలని విశ్వామిత్రుని ప్రయత్నం. రామునికి రాక్షస సంహారంలో అనుభవ పూర్వకమైన విజ్ఞానం కల్గించాలని విశ్వామిత్రుని ఆలోచన. దానికి ఆటంకం ఏర్పడింది. ముందు ఇచ్చిన మాట తప్పడం దశరథుని (సూర్య) వంశపు రాజులెవరూ చేయలేదు. దశరథుడు మాట మార్చడం వలన ఆ వంశానికి చెడ్డపేరు వస్తుంది. అలా జరగకూడదని విశ్వామిత్ర మహర్షి కోరిక.
ప్రశ్న 27.
గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పడంలో ఆంతర్యం ఏమిటి ?
జవాబు:
శ్రీరాముడు తన పూర్వీకుల గొప్పతనం తెలుసుకోవాలి. వారి గౌరవానికి తగినట్లుగా తన శిష్యుడైన శ్రీరాముడు కూడా ప్రవర్తించాలి అని విశ్వామిత్రుని ఆంతర్యం. తన పూర్వుల వలె శ్రీరాముడు కూడా తల్లిదండ్రుల పట్ల భక్తి గౌరవాలు కల్గి ఉండాలి. చేపట్టిన పనిని పూర్తి చేసే పట్టుదల అలవడాలి. తన పూర్వుల కంటె ఉన్నతంగా, ఆదర్శవంతంగా జీవించాలనే కోరిక శ్రీరామునిలో కల్గించడమే విశ్వామిత్రుని లక్ష్యం. అదే ఆయన ఆంతర్యం.
పరిచిత గద్యాలు
ప్రశ్న 1.
కింది పేరాను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురిచేస్తున్నాడన్నారు. ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్టుణ్ణి చేయడానికి పూనుకొన్నాడని తెలిపారు. అతని దుండగాలకు అంతే లేదన్నారు. ఋషుల, యక్ష గంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజస్థితిని ప్రకటించలేక పోతున్నారని వాపోయారు. అతని పీడ విరగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు.
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
దేవతలంతా తమ కష్టాలను ఎవరికి చెప్పుకున్నారు ?
జవాబు:
దేవతలంతా తమ కష్టాలను బ్రహ్మకు చెప్పుకున్నాడు.
ప్రశ్న 2.
బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతున్నది ఎవరు ?
జవాబు:
బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతున్నది రావణాసురుడు.
ప్రశ్న 3.
రావణుడి భయం వల్ల ఎవరు తమ సహజస్థితిని ప్రకటించ లేకపోతున్నారు ?
జవాబు:
రావణుడి భయం వల్ల సూర్యుడు, సముద్రుడు, వాయువు తమ సహజస్థితిని ప్రకటించ లేకపోతున్నారు.
ప్రశ్న 4.
ఎవరిని రాజ్యభ్రష్టుణ్ణి చేయడానికి రావణుడు పూనుకొన్నాడు ?
జవాబు:
ఇంద్రుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేయడానికి రావణుడు పూనుకొన్నాడు.
ప్రశ్న 5.
గోడు వెళ్ళబోసుకోవడం అంటే ఏమిటి ?
జవాబు:
బాధలు, కష్టాలు చెప్పుకోవడాన్ని గోడు వెళ్ళబోసుకోవడం అంటారు.
ప్రశ్న 2.
కింది గద్యాన్ని చదువండి. ఆ తర్వాత ప్రశ్నలకు జవాబులు రాయండి. (June 2019)
విశ్వామిత్రుడు సమాధానమిస్తూ “పౌలస్త్యవంశజుడైన విశ్రవసుడనే ముని కుమారుడు రావణాసురుడు. అతడు కుబేరుని సోదరుడు. అనేక రాక్షస బలాలు కలవాడు. బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బడిముబ్బడైంది. ముల్లోకాలనూ అల్లకల్లోలం చేస్తున్నాడు. అటువంటివాడికి యజ్ఞం భగ్నం చేయడమనేది అల్పంగా తోస్తున్నది. అందుకే ఇటువంటి పనులలో పాల్గొనడు. మారీచ సుబాహులు ఇతనిచేత ప్రేరితులై యజ్ఞాలకు విఘ్నాలను కలిగిస్తున్నా” రనగానే దశరథుడు మరింత భయపడ్డాడు. “యుద్ధంలో యమునితో సమానులైన వారి నెదుర్కోవడానికి నా చిన్నిపాపణ్ణి పంపను. నేను కూడా యుద్ధ విషయంలో అశక్తు” డనని పలికాడు.
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
రావణుడి గర్వానికి కారణం ఏమిటి ?
జవాబు:
బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల రావణుడికి గర్వం కలిగింది.
ప్రశ్న 2.
పై పేరాలో సంభాషణ ఎవరెవరి మధ్య జరిగినది ?
జవాబు:
విశ్వామిత్రునకు, దశరథ మహారాజునకు మధ్య సంభాషణ జరిగింది.
ప్రశ్న 3.
యమునితో సమానులైన వారు ఎవరు ?
జవాబు:
మారీచ సుబాహులు యమునితో సమానులైనవారు.
ప్రశ్న 4.
ఎవరి ప్రేరణతో మారీచ సుబాహులు యజ్ఞాలకు విఘ్నం కలిగిస్తున్నారు ?
జవాబు:
రావణాసురుని ప్రేరణతో మారీచ సుబాహులు యజ్ఞాలకు విఘ్నం కలిగిస్తున్నారు.
ప్రశ్న 5.
రావణుడు ఏ వంశానికి చెందినవాడు ?
జవాబు:
రావణుడు పౌలస్త్య వంశానికి చెందినవాడు.
ప్రశ్న 3.
కింది గద్యాన్ని చదువండి. (June 2018)
సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశమున్నది. అందులోనిదే ‘అయోధ్యా’ అనే మహానగరం. అయోధ్యా అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది. మనువు దీనిని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు. మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నోమార్లు యుద్ధం చేసినవాడు. ధర్మ పరాయణుడు, ప్రజలను కన్న బిడ్డలవలె చూసుకొనేవాడు. వసిష్ఠ వామదేవులు అతని ప్రధాన పురోహితులు. సుమంత్రుడు మొదలుగా గల ఎనిమిది మంది మంత్రులు. ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజల ధర్మ వర్తనులై సుఖసంతోషాలతో ఉన్నారు.
కింద ఇచ్చిన వాక్యాలలో సరైన దానికి (✓) గుర్తు పెట్టి సూచించండి.
1.
అ) శ్రీరాముడు సూర్యవంశం వాడు. [✓]
ఆ) సూర్యవంశానికి చెందినవాడు కాదు దశరథుడు. [ ]
2.
అ) దశరథునికి సుమంత్రుడు మంత్రి. [✓]
ఆ) సుమంత్రుడు దశరథుని కొలువులో లేడు. [ ]
3.
అ) యోధులు జయించటానికి శక్యమైన నగరం’ కోసల. [ ]
ఆ) అయోధ్య యోధులు జయించటానికి శక్యం కానిది. [✓]
4.
అ) కోసలదేశపు రాజ పురోహితులో వసిష్ఠుడు ఒకరు. [✓]
ఆ) దశరథుడి పురోహితులు వసిష్ఠుడు, వామదేవుడు కారు. [ ]
5.
అ) పై గద్యం ప్రకారం రాక్షసులతో యుద్ధం చేసింది దశరథుడు. [ ✓]
ఆ) శ్రీరాముడు రాక్షసులతో యుద్ధం చేసినట్లు పై గద్యంలో ఉంది. [ ]
ప్రశ్న 4.
కింది పేరాను చదవండి – క్రింది మాటలకు ఒక వాక్యంలో వివరణ వ్రాయండి.
ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కుంగదీసింది. సంతానప్రాప్తి కోసం అశ్వమేధయాగం చేయాలన్న ఆలోచన కలిగింది. వెంటనే పురోహితులు, గురువులతో సమావేశమయ్యాడు. మనసులోని మాట చెప్పాడు. వారు తథాస్తు అన్నారు. సరయూనదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది. మంత్రీ, సారథీ అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమౌతుందని సూచించాడు. ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు. నిష్ఠాగరిష్టుడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. దశరథుని ఆజ్ఞమేరకు ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా తోడ్కొనివచ్చారు. మూడు రోజులపాటు అశ్వమేధయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ప్రశ్న 1.
కుంగదీసింది : ……………………………
జవాబు:
అంటే, నీరసింప చేసింది అని భావము. అనగా అణగిపోయాడు అని భావము.
ప్రశ్న 2.
తథాస్తు అన్నారు : ……………………………
జవాబు:
అంటే “అలాగే కానియ్యండి” అని అర్ధము. అందుకు అంగీకరించారని భావం.
ప్రశ్న 3.
నిష్ఠాగరిష్ఠుడు : …………………………….
జవాబు:
‘నిష్ఠ’ అంటే ధర్మము మొదలయిన వాని యందు నమ్మకం కలిగియుండడం. అటువంటి నిష్ఠ. కలవారిలో గొప్పవాడు అని భావం.
ప్రశ్న 4.
సగౌరవంగా తోడ్కొని వచ్చారు : ……………………………
జవాబు:
అంటే గౌరవంగా వెంటబెట్టుకొని తీసుకొని వచ్చారు అని భావము.
ప్రశ్న 5.
శాస్త్రోక్తంగా నిర్వహించారు: …………………………….
జవాబు:
శాస్త్రములో చెప్పిన విధంగా చక్కగా జరిపించారు అని భావము.
ప్రశ్న 5.
కింది పేరాను చదవండి. దాని కింది మాటలకు ఒక వాక్యంలో వివరణ ఇవ్వండి.
“కాలచక్రం తిరుగుతున్నది. ఒకనాడు దశరథుడు తన మంత్రులు పురోహితులతో సమావేశమయ్యాడు. తన కుమారుడు వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు. మహా తేజశ్శాలియైన విశ్వామిత్ర మహర్షి, సృష్టికి ప్రతిసృష్టి చేయగల సమర్థుడతడు. దశరథుడు ఎదురేగి స్వాగతించాడు. అతిథి దేవోభవ. అతిథి మనకు దేవునితో సమానం. ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచిత రీతిన మర్యాదలు గావించాడు. వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు. తన పైన కార్యభారాన్ని పెడితే నెరవేరుస్తానన్నాడు. దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు.
ప్రశ్న 1.
సమావేశమయ్యాడు
జవాబు:
అంటే ఇతరులతో కలిసి ఒకచోట కూర్చున్నాడు అని భావము.
ప్రశ్న 2.
వివాహ ప్రస్తావన
జవాబు:
వివాహమును గూర్చి మాట్లాడడం అని భావము.
ప్రశ్న 3.
అతిథి దేవోభవ
జవాబు:
అంటే అతిథిని మనము దేవునితో సమానంగా గౌరవించాలి అని భావము.
ప్రశ్న 4.
సముచిత రీతి
జవాబు:
అంటే మిక్కిలి తగిన విధముగా అని భావము
ప్రశ్న 5.
నెరవేరుస్తానన్నాడు
జవాబు:
అంటే సిద్ధింప చేస్తానన్నాడు. చెప్పినట్లు చేస్తానన్నాడని భావము.
ప్రశ్న 6.
కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూవున్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. సమీపంలో ఒక కొమ్మపైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు. వాటి అనురాగం ముచ్చటగొలుపుతున్నది. వాటి మధురధ్వనులు వీనులవిందు చేస్తున్నాయి. ఇంతలో ఒక వేటగాడు క్రూరబాణంతో మగపక్షిని నేలకూల్చాడు. అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడచింది. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది. హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. కరుణరసం జాలువారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
నదీ తీరంలోని ప్రకృతి ఎలా ఉంటుంది ?
జవాబు:
అందంగా ఉంటుంది.
ప్రశ్న 2.
వేటగాడు పక్షిని ఎందుకు కొట్టాడు ?
జవాబు:
వేటగాడు తన ఆహారం కోసం పక్షిని కొట్టాడు.
ప్రశ్న 3.
వాల్మీకి హృదయం ఎటువంటిది ?
జవాబు:
వాల్మీకి హృదయం సున్నితమైనది.
ప్రశ్న 4.
పక్షుల జంటను చూసి ఎవరు ఆనందించారు ?
జవాబు:
పక్షుల జంటను చూసి వాల్మీకి ఆనందించాడు.
ప్రశ్న 5.
జీవహింస మంచిది కాదా ?
జవాబు:
జీవహింస మంచిది కాదు.
ప్రశ్న 7.
కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
సరయూ నదీతీరంలో ‘కోసల’ అనే సుప్రసిద్ధ దేశముంది. అందులోనిదే ‘అయోధ్యా’ అనే మహానగరం. ‘అయోధ్యా’ అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది. మనువు దీన్ని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథమహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు. మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నోమార్లు యుద్ధం చేసినవాడు. ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకునేవాడు. వశిష్ఠ, వామదేవులు అతని ప్రధానపురోహితులు. సుమంత్రుడు మొదలుగాగల ఎనిమిది మంది మంత్రులు. ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మవర్తనులై సుఖసంతోషాలతో ఉన్నారు. ‘యథారాజా తథా ప్రజాః’ – రాజు ఎలా ఉంటే ప్రజలూ అలాగే ఉంటారు.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
కోసల దేశంలో ప్రవహించే నది ఏది ?
జవాబు:
కోసల దేశంలో సరయూ నది ప్రవహిస్తోంది.
ప్రశ్న 2.
ఆదర్శవంతమైన రాజు ఎవరు ?
జవాబు:
దశరథ మహారాజు.
ప్రశ్న 3.
కోసల రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు ?
జవాబు:
దశరథ మహారాజు వలె ధర్మవర్తనులై ఉండేవారు.
ప్రశ్న 4.
అయోధ్యా నగర నిర్మాణంలో కీలకపాత్ర ఎవరిది ?
జవాబు:
అయోధ్యా నగర నిర్మాణంలో కీలకపాత్ర మనువుది.
ప్రశ్న 5.
కోసల దేశం ఎందుకు భోగభాగ్యాలతో విలసిల్లింది
జవాబు:
దశరథ మహారాజు ధర్మబద్ధంగా పరిపాలించినందున.
ప్రశ్న 8.
కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు. వేదశాస్త్రాలనభ్యసించారు. ధనుర్విధ్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞానఖనులయ్యారు. సద్గుణాలకు ఆటపట్లైనారు. ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలివి. రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు. చిన్ననాటి నుంచీ అన్నసేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు. ఇతడు రాముడికి బహిఃప్రాణం. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎలా ఉండేవారు ?
జవాబు:
అన్యోన్య ప్రేమాభిమానాలతో ఉండేవారు.
ప్రశ్న 2.
“వేదశాస్త్రాలను అభ్యసించారు” – దీనిలో సమాసపదం ఏది ?
జవాబు:
వేదశాస్త్రాలు
ప్రశ్న 3.
రాజ కుమారులను శుక్లపక్ష చంద్రునితో ఎందుకు పోల్చారు ?
జవాబు:
రోజు రోజుకు అభివృద్ధి చెందడం వలన.
ప్రశ్న 4.
ఈ పేరాను బట్టి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు ఎవరిని సేవించటం అలవాటు ?
జవాబు:
తమ కంటే పెద్దవారిని సేవించేవారు.
ప్రశ్న 5.
ఈ పేరాకు తగిన శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
ఉత్తమ విద్యార్థి.
ప్రశ్న 9.
కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
దశరుథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞగుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు చేతిలో బంగారుపాత్ర, వెండి మూతతో. అందులో దివ్యపాయసమున్నది. దాన్ని దశరథునకందించాడు. ఈ పాయసం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుందన్నాడు. పేదవానికి పెన్నిథి దొరికినట్లైంది దశరథునికి. అతని మనస్సు ఆనందతాండవం చేసింది.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
యజ్ఞగుండం నుండి ఉద్భవించిన దివ్యపురుషుడు ఎవరి ఆదేశానుసారం వచ్చాడు ?
జవాబు:
యజ్ఞగుండం నుండి దివ్యపురుషుడు బ్రహ్మ ఆదేశానుసారం వచ్చాడు.
ప్రశ్న 2.
దశరథుడు నిర్వహించిన యాగమేది ?
జవాబు:
దశరథుడు నిర్వహించిన యాగం ‘పుత్రకామేష్టి’.
ప్రశ్న 3.
దివ్యపురుషుడు ప్రసాదించిన పాయసం ప్రత్యేకత ఎట్టిది?
జవాబు:
ఆ పాయసం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. సంతానాన్ని ప్రసాదిస్తుంది.
ప్రశ్న 4.
పేదవానికి పెన్నిథి దొరికినట్లుగా భావించిన దశరథుడు నిజంగా ఏ విషయంలో పేదవాడు?
జవాబు:
దశరథుడు నిజంగా సంతాన భాగ్యంలో పేదవాడు.
ప్రశ్న 5.
ఈ పేరాకు శీర్షిక నిర్ణయించండి.
జవాబు:
ఈ పేరాకు శీర్షిక ‘పాయసప్రదానం’ అంటే సరిపోతుంది.
ప్రశ్న 10.
కింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద గుగ్గిలమైనాడు. “ఇచ్చిన మాట తప్పడం మా ఇంటావంటా లేదు. నీవందుకు సిద్ధపడితే రిక్తహస్తాలతో తిరిగి వెడతాను, మీరు సుఖంగా ఉండండి” అన్నాడు విశ్వామిత్రుడు. పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠమహర్షి. ఇచ్చిన మాట నిలుపుకోమని దశరథునికి హితవు పలికాడు. మాట నిలబెట్టుకోని వానికి ధర్మకార్యాల నాచరించిన ఫలం నశిస్తుందని హెచ్చరించాడు. వివిధాస్త్ర ప్రయోగ విధుడైన విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండగూడదన్నాడు. రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని సుతిమెత్తగా సూచించాడు.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
విశ్వామిత్రుడికి ఎందుకు కోపం వచ్చింది ?
జవాబు:
“తనపై పెట్టిన కార్యభారాన్ని నెరవేరుస్తాను” అని ఇచ్చిన మాటను తప్పడం వల్ల దశరథునిపై విశ్వామిత్రుడికి కోపం వచ్చింది.
ప్రశ్న 2.
‘రిక్త హస్తాలతో వెడతాను’ అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
వట్టి చేతులతో వెడతానని అర్థం. రాముడిని తీసుకొని వెళ్ళకుండానే వెడతానని భావం.
ప్రశ్న 3.
దశరథునికి వశిష్ఠుడు ఏమని హితము చెప్పాడు ?
జవాబు:
విశ్వామిత్రునకు ఇచ్చిన మాటను నిలుపుకొమ్మని వశిష్ఠుడు దశరథునికి హితము చెప్పాడు.
ప్రశ్న 4.
దశరథుడికి వశిష్ఠుడు ఏమని సూచించాడు ?
జవాబు:
రాముణ్ణి విశ్వామిత్రుని వెంట పంపితే మేలు జరుగుతుందని వశిష్ఠుడు సుతిమెత్తగా సూచించాడు.
ప్రశ్న 5.
ఇంటావంటా లేనిది ఏమిటి ? ఎవరి ఇంట లేదు ?
జవాబు:
‘ఇచ్చిన మాట తప్పడం’ దశరథుని ఇంటావంటా లేదు.
ప్రశ్న 11.
కింది గద్యభాగాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
“ఇదంతా విని శివధనుస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు. సరేనన్నాడు జనకుడు. బలిష్ఠులు, దీర్ఘకాయులు, అయిన ఐదు వేల మంది అతి కష్టం మీద శివధనుస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు.
విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనుస్సు మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకొన్నాడు రాముడు. ధనుర్విద్య యందు ఆరితేరిన రాముని చేయి సోకినంతనే ఆ ధనుస్సు వంగింది. వింటి నారిని సంధించాడు. వేలకొలది సదస్యులు ఆశ్చర్యంలో మునిగి పోయారు. అల్లెత్రాడును ఆకర్ణాంతంగా లాగాడు రాముడు. పిడుగుపాటులా భయంకర శబ్దాన్ని చేస్తూ ఫెళ్ళున విల్లు విరిగింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగతా వారంతా మూర్ఛపోయారు.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
శివధనుస్సు పేటికను ఎవరు తెచ్చారు ?
జవాబు:
బలిష్ఠులు, దీర్ఘకాయులు అయిన భటులు శివధనుస్సు ఉన్న పేటిక సభలోకి తెచ్చారు.
ప్రశ్న 2.
ధనుస్సు ఎందుకు వంగింది?
జవాబు:
ధనుర్విద్యలో ఆరితేరిన శ్రీరాముని చేయి సోకగానే ధనుస్సు వంగింది.
ప్రశ్న 3.
విల్లు విరిగినప్పుడు ఎటువంటి శబ్దం వచ్చింది ?
జవాబు:
విల్లు విరిగినపుడు పిడుగుపాటు వంటి భయంకర శబ్దం వినబడింది.
ప్రశ్న 4.
రాముడు శివధనుస్సును ఎవరి అనుమతితో ఎలా పట్టుకొన్నాడు ?
జవాబు:
రాముడు విశ్వామిత్రుని అనుమతితో, అవలీలగా శివధనుస్సును పట్టుకున్నాడు.
ప్రశ్న 5.
శివ ధనుర్భంగ శబ్దం విని మూర్ఛపడని వారెవరు ?
జవాబు:
రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు, జనకుడు మూర్ఛ పడలేదు.
ప్రశ్న 12.
కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మపంపగా వచ్చినవాడు చేతిలో బంగారుపాత్ర వెండిమూతతో. అందులో దివ్యపాయసముంది. దాన్ని దశరథునకందించాడు. ‘ఈ పాయసం సంపదలనిస్తుంది, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుంద’న్నాడు. పేదవానికి పెన్నిధి దొరికినట్లైంది దశరథునికి. అతని మనస్సు ఆనందతాండవం చేసింది.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
పాయస పాత్రను ఎవరు పంపారు ?
జవాబు:
బ్రహ్మదేవుడు పంపాడు.
ప్రశ్న 2.
పుత్రకామేష్టియాగం ఎందుకు చేస్తారు ?
జవాబు:
సంతానం కోసం.
ప్రశ్న 3.
దశరథునికి ఎందుకు ఆనందం కలిగింది ?
జవాబు:
తనకు సంతానం కలుగుతుందని.
ప్రశ్న 4.
మానవునికి కావలసినదేమిటి ?
జవాబు:
సంపద, ఆరోగ్యం, సంతానం.
ప్రశ్న 5.
బంగారు పాత్రలో ఏముంది ?
జవాబు:
దివ్యపాయసం.
ప్రశ్న 13.
కింది పేరాను చదివి, ఎందుకు, ఏమిటి, ఎలా అనేవి ఉపయోగించి 5 ప్రశ్నలు తయారుచేయండి.
రామలక్ష్మణ సహితుడయి విశ్వామిత్రుడు ‘సిద్ధాశ్రమం’ చేరుకున్నాడు. అదే అతని యజ్ఞభూమి. రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువుగారిని యజ్ఞదీక్షను స్వీకరించమని ప్రార్థించారు. మన్నించాడు మహర్షి.. యజ్ఞదీక్షితుడయ్యాడు. మరునాడు యజ్ఞం ప్రారంభమైంది. ఆరు రోజులపాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారు మునులు. ఐదురోజులైంది. కంటిమీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు. కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇంత నిష్ఠ ఉండాలి. చివరిరోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞకుండం నుండి జ్వాలలు ఎగసిపడ్డాయి. ఇది రాక్షసుల రాకకు సూచన.
జవాబు:
ప్రశ్నలు
- సిద్ధాశ్రమం ఏమిటి ?
- ఏమి ప్రారంభమయ్యింది ?
- రామ, లక్ష్మణులు ఎందుకు వచ్చారు ?
- గురువును ఎలా ప్రార్థించారు ?
- ఆరు రోజులపాటు ఏం జరిగింది ?