గాలివాన (పాటకథ) Questions and Answers Summary Inter 1st Year Telugu

Regular practice with AP Inter 1st Year Telugu Study Material ఉపవాచకం 3rd Lesson గాలివాన (పాటకథ) Questions and Answers Summary helps students stay prepared for examinations.

AP Inter 1st Year Telugu గాలివాన (పాటకథ) Questions and Answers

అభ్యాసం

I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
“గాలివాన” కథా సారాంశాన్ని వివరించండి.
జవాబు:
బహుముఖ ప్రజ్ఞాశాలియైన అడవి బాపిరాజు గారి కలం నుండి జాలువారిన రాగమాలిక కథా సంపుటి నుండి గ్రహించబడిన ‘గాలివాన’ కథ ఒక చక్కని కథ.

గాలివాన సృష్టించిన విధ్వంసం వలన పూర్తిగా నష్టపోయిన ఓ మారుమూల పల్లెవాసులకు ఒక తండ్రీ కూతురూ ధైర్యసాహసాలతో చేసిన సహాయం గురించి గాలివాన కథలో అడవి బాపిరాజుగారు చక్కగా వివరించారు.

విశాఖపట్టణం జిల్లాపైన గాలివాన విరుచుకుపడింది. కారు పల్లెగ్రామంపై గాలివాన ప్రభావం చాలా తీవ్రంగా పడింది. ఆ గ్రామంలో భైరి అప్పల స్వామి మంచి రైతు. ఉపకారి. అతను ఆ గ్రామంలో పర్యటించాడు. పాడైపోయిన పంటలను చూశాడు. కూలిపోయిన ఇళ్లను గమనించాడు. ప్రజల బాధలను అర్థం చేసుకొన్నాడు. తన గాదెలలోని ధాన్యం తీశాడు. బియ్యంగా ఆడించాడు. పెద్ద పెద్ద గుండిగలలో వంటలు చేయించాడు. వారందరికి భోజనాలు పెట్టించాడు.

అప్పలస్వామి కూతురు, చాలా అందమైనది, అందరితో ఆప్యాయంగా ఉంటుంది. విజయనగరంలో కాలేజీ చదువు చదువుకొంటోంది. తుఫాను గురించి ఆమెకు తెలిసింది. వెంటనే వచ్చేసింది. ఆ అమ్మాయి పేరు కామేశ్వరి, కామమ్మ, కాముడు, కామం అనేవి ఆమె ముద్దు పేర్లు.

గాలివాన వలన కారుపల్లెలో విపరీతమైన కరువు ఏర్పడింది. బియ్యమే కాదు, జొన్నలు, చోళ్లు వంటివి కూడా లేవు. ఎంతమంది నాయకులు కోరినా ప్రభుత్వం నుండి ఏ రకమైన సహాయం రాలేదు.

అప్పలస్వామి గాదె ఖాళీ అయింది, దాచిన ధనం కూడా తుఫాను బాధితులకే అయిపోయింది. ఆయన బంధువులు, మిత్రులు కూడా ధనం అడుగుతాడేమోనని దూరమయ్యారు.

ఇంట్లోని బంగారు నగలన్నీ అమ్మాడు. వెండి సామాను అమ్మేశాడు, భూములన్నీ తాకట్టుపెట్టేసి, వచ్చిన డబ్బంతా తుఫాను బాధితులకు ఖర్చు చేసేశాడు. ఆయన దాన గుణంలో కర్ణుడు, శిబి, దధీచిలను మించిపోయాడు.

ఆయన కూతురైన కామేశ్వరి విజయ నగరంలోని తన స్నేహితురాళ్లకు ఉత్తరాలు రాసింది. ఒక సంఘం స్థాపించమంది. చందాలు వసూలు చేయమంది. కానీ, వాళ్లంతా అనవసరమైన వేదాంతం చెప్పారు తప్ప సరిగ్గా డబ్బు వసూలు చేయలేదు.

చివరకు కామేశ్వరి తన శరీరం మీద ఉన్న నగలు అమ్మేసింది. రెండువేల రూపాయిలు వచ్చాయి. ఆ డబ్బు తన తండ్రికి ఇచ్చేసింది. చివరకు విజయనగరం వెళ్లి దివానును కలుసుకొని, చందా వసూలు చేయాలనుకొంది.
టిక్కెట్టు లేకుండా రైలెక్కింది. టిక్కెట్టు కలెక్టరుకు తమ ఊరిలోని కరువు గురించి చెప్పింది. తమ చందాల కోసం వెడుతున్నట్లు చెప్పింది. దివానుగారు తనకు తెలుసని టిక్కెట్టు కలెక్టరు చెప్పాడు.

రైలు ఆలస్యంగా రాత్రి 7 గంటలకు విజయనగరం చేరింది. టిక్కెట్టు కలెక్టరు కామేశ్వరిని వెంటబెట్టుకొని గుఱ్ఱం బండిలో బయల్దేరాడు. అది విజయనగరం దగ్గర నిర్జన ప్రదేశంలో వారిని వదిలేసి విజయనగరం వైపు వెళ్లిపోయింది. అతను కామేశ్వరిని చెయ్యి పట్టుకొని బలవంతంగా తోటలలోకి తీసుకొని వెళ్లిపోయాడు. కామేశ్వరికి స్పృహ తప్పింది. కొంతసేపటికే మెలకువ వచ్చింది. వాడిని గట్టిగా దవడమీద కొట్టింది. లేడిలా పరుగెత్తింది. వాడుకూడా పరుగెత్తాడు. ఒకరాయి తగిలి పడిపోయాడు.

అంతలో ఒక కారులో వస్తూ దివానుగారు ఎదురయ్యారు. విషయం చెప్పింది. ఆమెను గుర్తు పట్టాడు. పదివేల రూపాయిలు వసూలు చేసినవి ఇచ్చాడు. ఆమెకు ఆనందంతో నోటమాట రాలేదు.

ప్రశ్న 2.
“కామేశ్వరి” పాత్ర స్వభావాన్ని వివరించండి.
జవాబు:
కామేశ్వరి చాలా ధనవంతుడైన అప్పలస్వామిగారమ్మాయి. చాలా అందమైనది. తెలివైనది. తన తండ్రిలాగే మంచి గుణాలు కలది. ఆపదలో ఉన్న వారిని ఆదుకొనే స్వభావం కలది. తనకున్నదంతా దానం చేసి అయినా ఇతరుల కష్టాలు నివారించాలనుకొనే స్వభావం కలది. బంగారు నగల కంటే పరులకు ఉపకారం చేయడానికే ప్రాధాన్యం ఇస్తుంది. అందుచేతనే తన ఒంటిపైనున్న నగలన్నీ అమ్మేసింది. వచ్చిన రెండువేల రూపాయిలను తన తండ్రికిచ్చేసింది. అది కూడా తుఫాను బాధితుల సహాయానికే ఖర్చు పెట్టమంది.

ఆమె పేదలకు అన్నపూర్ణాదేవిలా అన్నం పెట్టి, ఆదరించే స్వభావం కలది. పేదలకు సహాయం చేయడం కోసం ప్రయత్నిస్తుంది. ముందూ వెనకా ఆలోచించదు. ఎంతదూరమైనా వెడుతుంది. ఎంత కష్టమైనా భరిస్తుంది. అనుకొన్నది సాధించడంలో ఎదురయ్యే ఎంతటి కష్టాన్నైనా ఎదిరిస్తుంది. అనుకొన్నది సాధిస్తుంది. సాహసవంతురాలు.

అందుచేతనే తుఫాను బాధితులకు సహాయం చేయమని కోరుతూ విజయనగరం దివాను గారికి ఉత్తరం రాసింది. తన స్నేహితురాళ్ళను కోరింది. స్నేహితురాళ్లు పెద్దగా చందాలు సేకరించలేదు.

టిక్కెట్టు లేకుండా రైలెక్కింది. టిక్కెట్టు కలెక్టరుకు దొరికిపోయింది. ఇతరులను తేలికగా నమ్మే స్వభావం కలది. కనుకనే అతనికి విషయం చెప్పింది. ఆ దుర్మార్గుడు దానిని లోకువగా తీసుకున్నాడు. ఆమె జీవితాన్ని పాడు చేయబోయాడు. అయినా ధైర్యం కూడదీసుకొంది. అతనిని ఎదిరించింది. కొట్టింది. తప్పించుకొంది. పరుగెత్తింది. దివానుగారిని కలుసుకొంది. అనుకొన్నది సాధించింది. 10 వేల రూపాయిలు విరాళం తీసుకొంది.

గాలివాన (పాటకథ) Questions and Answers Summary Inter 1st Year Telugu

ప్రశ్న 3.
ప్రకృతి విపత్తులు వచ్చినపుడెవరు ఎలా ఆదుకోవాలి ?
జవాబు:
ప్రకృతి విపత్తులంటే వరదలు, తుఫానులు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు మొదలైనవి.

వరదలు, వానలు వచ్చినపుడు జనాలు చాలా నష్టపోతారు. ఇళ్లు కూలిపోతాయి. పంటలు పాడౌతాయి. కనీసం తలదాచుకొందుకు కూడా చోటుండదు, లోతైన ప్రాంతాలలోని వారికి ప్రాణనష్టం కూడా జరుగుతుంది.

వానలు, వరదలు వస్తాయని ప్రభుత్వం ముందుగానే ప్రజలను హెచ్చరించాలి. సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. వారికి ఆహారం, మంచి నీరు, మందులు, వైద్య సదుపాయం, వసతి కల్పించాలి. ఆస్తినష్టం కలిగితే ధనసహాయం చేయాలి. మళ్లీ పంటలు వేసుకొందుకు విత్తనాలు, పురుగుమందులు, ఎరువులను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి. పల్లపు ప్రాంతాలలోని నీటిని తోడించాలి. ఇళ్లు పాడైతే ప్రభుత్వం ధనసహాయం చేసి, మళ్లీ ఇళ్లు నిర్మించుకొందుకు సహాయపడాలి. స్వచ్ఛంద సంస్థలు కూడా సేవా కార్యక్రమాలలో పాల్గొనాలి. ధనవంతులు విరివిగా విరాళాలివ్వాలి.

గాలివాననే తుఫాను అంటారు. తుఫాను సమయంలో కూడా వానలు, వరదల వల్ల వచ్చే నష్టాలే వస్తాయి. వాటితోపాటు అదనంగా చెట్లు కూలిపోతాయి. కరెంటు స్తంభాలు పడిపోతాయి. సమాచార వ్యవస్థ దెబ్బతింటుంది. రవాణా వ్యవస్థ పాడౌతుంది. వీటన్నిటినీ చక్కదిద్దాలి. వరదలు, వానలు వచ్చినపుడు చేసే సహాయ సహకారాలే తుఫాను వచ్చినపుడు కూడా చేయాలి.

భూకంపాలు వచ్చినపుడు ఆస్తినష్టం, ప్రాణనష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. భూకంపాలు వచ్చినపుడు ఇళ్లు, భవనాల నుండి మైదాన ప్రాంతానికి వచ్చేయాలి. భవనాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఎక్కువ అంతస్తులున్న భవనాలకు దూరంగా పరుగెత్తుకొని వెళ్లిపోవాలి. ప్రభుత్వం పైన పేర్కొన్న సహాయ, సహకారాలందివ్వాలి.

అగ్ని ప్రమాదం అన్నిటికంటే ఎక్కువ నష్టం కలిగిస్తుంది. ఇళ్లు, భవనాలు, ఫర్నిచర్ మొదలైనవి పూర్తిగా నాశనమౌతాయి. ప్రాణనష్టం కూడా ఎక్కువగా ఉండవచ్చు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ‘అగ్ని మాపకశాఖ’ వారికి ఫోన్ చేయాలి. అవసరమైతే పోలీసులకు, అంబులెన్స్లకు కూడా ఫోన్ చేయాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, చుట్టుపక్కలవారూ వెంటనే స్పందించాలి. కాపాడాలి. ఆదుకోవాలి.

ప్రశ్న 4.
గాలివాన వచ్చినపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
జవాబు:
గాలివాన వచ్చినప్పటి కంటే రావడానికి ముందే జాగ్రత్తపడాలి. ప్రభుత్వం వారిచ్చే సూచనలను మీడియా, టముకుల ద్వారా తెలుసుకోవాలి. వాటిని అనుసరించాలి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాలి. అవసరమైన సర్టిఫికెట్లు, డబ్బు, నగలు, మందులు, బట్టలు మొదలైనవి తీసుకొని వెళ్ళాలి. దాని వలన ప్రాణనష్టం ఉండదు.

చెట్ల దగ్గరికి వెళ్ళకూడదు. పాత భవనాలలో ఉండకూడదు. పూరిళ్లు, పెంకుటిళ్ళు, రేకులషెడ్లు మొదలైన వాటిలో ఉండకూడదు. వాటిని ఖాళీ చేయాలి. అనవసరంగా బైటకు రాకూడదు. వాహనాలపై ప్రయాణించకూడదు. ప్రయాణించవలసి వచ్చినా ప్రభుత్వ వాహనాలనే ఉపయోగించాలి. అది కూడా ప్రభుత్వాధికారుల అనుమతితో చేయాలి.

పిల్లలను, వృద్ధులను, రోగులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనవసరమైన పుకార్లు నమ్మకూడదు. అనవసర పుకార్లను వ్యాపింప చేయకూడదు. సమాచార వ్యవస్థ దెబ్బతింటుంది కనుక మంచిచెడులు ఎవరికి వారే ఆలోచించుకోవాలి. తెగిపడిపోయిన విద్యుత్ తీగలను తాకకూడదు. వాటిలో విద్యుత్తు ఉంటే చాలా ప్రమాదం. సగం పడిన చెట్ల దగ్గరకు వెళ్లకూడదు. అవి పూర్తిగా కూలితే ప్రమాదం. పాములు, తేళ్లు, జెర్రిలు మొదలైన విషపు పురుగులు చేరే ప్రమాదాన్ని గమనించుకోవాలి. నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే నిద్రమానుకొని అయినా యువతరం కాపలా కాయాలి.

శుద్ధిచేసిన మంచినీటిని మాత్రమే త్రాగాలి. లేకపోతే అతిసార వ్యాధి వంటివి పట్టుకొంటాయి. పరిశుభ్రమైన ఆహారమే తినాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోగులు, గర్భిణులు, బాలెంతలు మొదలైనవారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కనుక వారిని మరీ జాగ్రత్తగా చూసుకోవాలి. కాచిన నీరు త్రాగాలి.

తుఫాను వచ్చే సమయంలో ఆస్తినష్టం ఎలాగూ ఆపలేము. ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తపడాలి.

తుఫాను వెళ్లిపోయాక అంటువ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉంటాయి. వాటి బారిన పడకుండా ఎవరి జాగ్రత్త వారే తీసుకోవాలి. నీరు, చెత్త నిలవ ఉండకుండా చూసుకోవాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బ్లీచింగ్ చల్లుకోవాలి. ఆహారం, నీరు విషయంలో మరీ జాగ్రత్తలు పాటించాలి. అన్ని పదార్థాల పైనా మూతలు తప్పక పెట్టుకోవాలి. వేడి పదార్థాలనే తినాలి. వండుకొన్న పదార్థాలేవీ నిలవ చేసుకొని తినకూడదు.

గాలివాన (పాటకథ) Questions and Answers Summary Inter 1st Year Telugu

గాలివాన (పాటకథ) Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత పేరు : అడవి బాపిరాజు
జననం : 8.10.1895న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి 11 మైళ్ల దూరాన ఉన్న, క్రొవ్విడి వారి ముఖాసా గ్రామంలో జన్మించారు.
తల్లిదండ్రులు : అడవి వెంకట కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులు.
చదువు : ప్రాథమిక విద్య – కొవ్వూరులో, ఉన్నత విద్య – నరసాపురంలో, కళాశాల విద్య – రాజమండ్రి – ఆర్ట్స్ కాలేజీలో, న్యాయవాద విద్య మద్రాసులోనూ పూర్తి చేశారు.
భార్య : సుభద్రమ్మ

రచనలు : నారాయణరావు నవల. (జైలులో రచించారు) తుఫాను, కోనంగి, నరుడు, జాజిమల్లి, హిమ బిందు, గోన గన్నారెడ్డి, అడవి శాంతిశ్రీ, అంశు మతి అనే నవలలు రచించారు. అంజలి, తరంగిణి, తూలికా నృత్యం, భగీరలోయ, రాగమాలిక, వింధ్యాచలం అనే 6 కథా – సంపుటాలుగా – 35 కథలు రచించారు. తొలకరి, గోధూళి, శశికళ, అంజలి, చిగురుటాకులు, జ్యోతి, దీపమాల, గడ్డిపూల పళ్ళెము మొదలైన కవితా సంపుటాలు వ్రాశారు.

చలనచిత్రరంగం : సతీ అనసూయ- ధ్రువ విజయం (1935), మీరాబాయి (1940), పల్నాటియుద్ధం (1944), మల్లీశ్వరీ చలనచిత్ర కళా దర్శకత్వం వహించారు.

పత్రికారంగం : అభినవాంధ్ర సాహిత్యం, మీజాన్ పత్రికలకు సంపాదకత్వం వహించారు.

చిత్రాలు : విశ్వనాథ వారి కిన్నెరసాని, కోకిలమ్మ పాటలకు, నండూరి సుబ్బారావు గారి ఎంకిపాటల గీతా సంపుటాలకు రేఖాచిత్రాలు, ముఖ చిత్రాలు గీశారు. సముద్రగుప్తుడు, గౌతమ బుద్ధుడు, ధన్వంతరి, శశికళ, మీరాబాయి మొదలైన ఉత్తమ కళాఖండాలను సృష్టించారు.

బిరుదులు-బహుమతులు : ముట్నూరి కృష్ణారావు గారిచే కులపతి బిరుదును అందుకొన్నారు. 1934లో ఆంధ్ర విశ్వ విద్యాలయం నిర్వహించిన నవలా పోటీలలో ‘నారాయణరావు’ నవలకు ప్రథమ బహుమతి లభించింది.

ప్రత్యేకతలు : సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని, అరెస్టయి, జైలులో ‘నారాయణరావు’ నవలను రచించడం ప్రారంభించారు. ఆంధ్ర జాతీయ కళాశాలలో చిత్రకళా విద్యార్థిగా చేరిన బాపిరాజు గారు అదే కళాశాలకు ప్రిన్సిపాల్ పదవిని చేపట్టారు. ఆంధ్ర చలన చిత్రానికి కళా దర్శకత్వం వహించిన మొట్టమొదటి ఆంధ్రుడు బాపిరాజుగారు. ‘కవి చిత్రకారుడు కాలేడు, చిత్రకారుడు కవి కాలేడు’ అన్న బెర్నార్డ్ అభిప్రాయాన్ని తారుమారు చేశాడు. ‘చిత్రకారుడు కవిగాను, కవి చిత్రకారుడు’ గాను కాగలడని నిరూపించిన కళాతపస్వి అడవి బాపిరాజు. 22. 9. 1952న ఆయన తుది శ్వాస విడిచారు.

కఠిన పదాలకు అర్థాలు

100వ పేజి :

విధ్వంసం = నాశనం
ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవడం = చాలా భయంభయంగా బ్రతకడం
సహకారం = సహాయం
వాగు = చిన్న కాలువ
శివాలెత్తడం = ఒళ్లు తెలియని ఆవేశంతో ఊగిపోవడం
పరవళ్లెత్తడం = నదులు చాలా నీటితో నిండి వేగంగా ప్రవహించడం
అంబరం = ఆకాశం
రుద్రుడు = శివుడు
ప్రళయం = సృష్టి అంతమయ్యే స్థితిలో వచ్చే భయంకర స్థితి
తాండవం = పురుషులు ఉధృతంగా చేసే నాట్యం
ఆరితేరిన = బాగా నైపుణ్యం గల
దిట్టరి = గట్టివాడు
ప్రత్యక్షం = కనబడడం
గాదె = ధాన్యం నిలవచేసే పెద్ద గది వంటిది
గుండిగ = పెద్ద ఇత్తడి గిన్నె
అండిగ = పెద్ద పాత్ర (వెడల్పు మూతి కలది)
బాన = పెద్ద కుండ
ఆబాలగోపాలం = బాలుని నుండి గోపాలుని వరకు (అందరూ)

గాలివాన (పాటకథ) Questions and Answers Summary Inter 1st Year Telugu

102వ పేజి :

అష్టాదశ వర్ణాలు = 18 కులాలవారు (అన్ని కులాల వారు)
అన్నమో రామచంద్ర = ఆకలి ఎక్కువగా ఉన్నదని తెలియజేసే మాట
మొహమాటం = కావలసినది అడగలేని స్థితి (సిగ్గు)
కాశిక + అన్నదాత = అన్నపూర్ణాదేవి
పంతులు = ఉపాధ్యాయుడు
చారడేసి కళ్లు = అరచేయంత కళ్లు (పెద్ద పెద్ద కళ్లు)
పువ్వు పుటలు = పూలబుట్టలు
నవరత్నాలు = 9 రకాలైన రత్నాలు: కెంపు, ముత్యం, పగడం, పచ్చ, కనక పుష్యరాగం, వజ్రం, నీలం, గోమేధికం, వైడూర్యం
కుసుమాలు = పూలు
కంఠం = గొంతు
నాగులు = పాములు
నృత్యం = నాట్యం
ఆలకించడం = వినడం
ఖండం = ప్రాంతం
కాటకం = కరువు
ఉద్భవించడం = పుట్టడం
తీపు = ప్రేమ
నాయకుడు = నేత
గగ్గోలు పెట్టడం = చాలా గొడవ చేయడం
దాక్షిణ్యం = దయతో కూడిన స్వభావం
వితరణ = దానం
అరుదు = తక్కువ
మొహాలు చాటువేయడం = ఎదురుపడకుండా తప్పించుకు తిరగడం
నగలు = ఆభరణాలు
తనఖా పెట్టడం = తాకట్టు (కుదువ) పెట్టడం
ఈనాము = బహుమతిగా వచ్చిన భూమి
షాహూకార్లు = వ్యాపారస్తులు (వడ్డీ వ్యాపారి)
వరిగెలు = చేలలో రాలిన వెన్నులు
అభినవ = ఆధునికమైన

103వ పేజి :

ఉత్తర = లేఖ
అమ్మలక్కలు = స్త్రీలు
వేదాంతం = ఉపనిషత్తు
వేదాంతం = అర్థం కాని మాటలు
ఆడడం = పలకడం
విత్తనం = బీజం
సత్తువ = బలం
చిన్ని కందు = చిన్న బిడ్డ

104వ పేజి :

కాలుపెట్టడం = రావడం
కడుపుకు లేకపోవడం = తినడానికి తిండి లేకపోవడం
ఊళ్లు + ఏలువారు = ఊళ్లను పరిపాలించే అధికారులు
ఘనవంతులు = గొప్పవారు
టట్ డామిట్ = చిరాకును వ్యక్తపరిచే పదం
ఎరగడం = తెలియడం
కలకటేరు = కలెక్టర్
దివాను = రాజప్రతినిధి
ఖామందు = భూస్వామి
సంపన్నులు = ధనవంతులు
గడుసు = = తెలివి, (బ్రతక నేర్చిన)
రస్తాదారి = రహదారి
దౌడు = పరుగు
దుడుకు = భయం
దండం = నమస్కారం
లోన = లోపల

గాలివాన (పాటకథ) Questions and Answers Summary Inter 1st Year Telugu

105వ పేజి :

నిః + జన – నిర్జన = మనుషులు లేని
రక్తంచరుడు = ఇది నక్తంచరుడు అని ఉండాలి
నక్తంచరుడు = రాత్రులు తిరిగేవాడు (రాక్షసుడు (లేక) దేశ దిమ్మరి)
పిశాచి = రక్త మాంసాలు తినే ఒకరకమైన దయ్యం
సొమ్ము = ధనం
శక్తి = పార్వతీదేవి
ఉరకడం = పరుగెత్తడం