ఉరి Questions and Answers Summary Inter 1st Year Telugu

Regular practice with AP Inter 1st Year Telugu Study Material ఉపవాచకం 2nd Lesson ఉరి Questions and Answers Summary helps students stay prepared for examinations.

AP Inter 1st Year Telugu ఉరి Questions and Answers

అభ్యాసం

I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఉరి కథలో సామాన్యుడి వేదన ఎటువంటిది ?
జవాబు:
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు రచించిన, ‘ఆనందవాణి’ పత్రికలో 17.12.1950న ప్రచురితమైన ‘ఉరి’ కథలోని నాయకునికి రచయిత పేరు పెట్టలేదు.

అతను సామాన్యులలో అతి సామాన్యుడు. అతనిని సమాజంలో ఎవ్వరూ పట్టించుకోరు. ఎవరికీ అతను అవసరం లేదు. చాలా దురదృష్టవంతుడు. మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చుకొన్నాం, సమానత్వం, న్యాయం, రక్షణ వంటివి కాగితాలలోనే మిగిలాయి. సామాన్యులకవేమీ దక్కవు అని కథా రచయిత అభిప్రాయం.

కథానాయకుడైన అతి సామాన్యుడు చాలా వేదన చెందాడు. నేటి సమాజం, రక్షణ, న్యాయం, సమానత్వాలపై తన ఆవేదనను వెళ్లగక్కాడు.

తను మాట్లాడినా, మాట్లాడకపోయినా ఒకటే అని అతని భావన. ఎందుకంటే తన మాటలను, తనను ఎవరూ పట్టించుకోరని అతని ఆవేదన. తను ఒక మనిషిని చంపాడని ఉరిశిక్ష విధించారు. కానీ, తను చంపినట్లు తనకు తెలియదు. ఆ మాట అన్నవారికీ తెలియదు. సాక్షులకూ తెలియదు. అయినా ఉరిశిక్ష విధించారు.

అతని ఆవేదనంతా తన పెళ్లాం బిడ్డల గురించే వాళ్లని పోషించలేక చాలా బాధలు పడ్డాడు. వాళ్లకు తిండి లేదు. తనకు తిండిలేదు. అతనిని జైలులో పెట్టి రెండు నెలలైంది. ఈ రెండు నెలల నుండి తనకు తిండి దొరుకుతోంది. కానీ తన భార్యా బిడ్డలకు తిండి లేదనేదే అతని బాధ. బహుశా వారు మరణించి ఉంటారని అతని ఊహ. వాళ్ల కంటే తానే అదృష్టవంతుడని అతని నమ్మకం. వాళ్లు ఆకలికి తట్టుకోలేక మరణించి ఉంటారు. కానీ, తనకు చచ్చే ముందు తిండి దొరుకుతోందని ఆనందపడ్డాడు.

అతనికి ఉద్యోగం లేదు, మోసం చేయలేడు, కూలీనాలీ కుదరలేదు. ఎలాగో కాస్త డబ్బు సంపాదించాడు. వాటితో కొనుక్కొందామంటే బియ్యం దొరకలేదు. ఏడ్చే ఓపిక కూడా లేని తన భార్యా పిల్లలని చూసి, అతని వేదన రెట్టింపయింది.

ఒక ముసలిది తనకు వచ్చిన బియ్యంలో సగం బియ్యం రెట్టింపు ధరకు ఇచ్చింది. అవి పశువులు కూడా తినని బియ్యం. ఆ బియ్యం ఎవరూ దంచలేదు. ఆమెకు ఓపిక లేదు. పుల్లలు ఏరుతుంటే ఒకాయన కొట్టాడు. ఆ దెబ్బలు తిని ఇంటికి వచ్చాడు. అది ఇల్లు కాదు. గోడపక్క చిన్న మరుగు. ఆపైనున్న పుల్లలు పీకి అతని భార్య వంట చేస్తోంది. తన దరిద్రానికి అతనికి భరించలేని వేదన కలిగింది.

పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోతున్నారు. కడుపునొప్పితో మెలి తిరిగి పోతున్నారు. చేతిలో డబ్బులు లేక అలా చూస్తూ అతను చాలా బాధపడ్డాడు.

బియ్యం ఇస్తారని తెలిసి వెళ్లాడు. చాలామంది జనం. అలజడి రేగింది. పోలీసులు కాల్పులు జరిపారు. జనం రాళ్లు విసిరారు. నడవడానికి కూడా ఓపికలేని అతను ఇంటికి పోదామనుకొన్నాడు. ఇంతలో ఎవరో విసిరిన
రాయి తగిలి ఒకడు మరణించాడు.

ఆ రాయిని అనామకుడే విసిరాడనుకొన్నారు. తరిమారు. కొట్టారు. పట్టుకొన్నారు. ఖైదీ అయ్యాడు. చేయని తప్పుకు ఖైదీ అయినందుకు బాధపడలేదు. అన్నం చూసి ఆనందించాడు. వేదనను కూడా వేదనగా అనుభవించలేని అత్యంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి అనామకునిది. అతని వేదన చూసి కష్టాలకే కన్నీళ్లు వస్తాయి.

ప్రశ్న 2.
ఉరి కథలోని అనామకుని వంటి వారి పరిస్థితి ఎప్పుడు బాగుంటుంది ?
జవాబు:
ఉరి కథలోని అనామకుని వంటి వారి పరిస్థితి బాగుపడాలంటే ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి.

అటువంటివారికి ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వం పనులను కల్పించాలి. పనికి తగిన వేతనం ఇవ్వాలి. వారి బాధలు, భయాలు చెప్పుకొందుకు అవకాశాలు కల్పించాలి. వాటిని పరిష్కరించాలి. వారికి విద్యా సదుపాయాలు కల్పించాలి. అటువంటి వారి పిల్లలకు ఉచితంగా బట్టలు, పుస్తకాలు, మూడుపూటలా తిండి, చదువు ఏర్పాటు చేయాలి. బలమైన పౌష్టికాహారం ఇవ్వాలి. సెలవులలో కూడా తిండి ఏర్పాటు చేయాలి.

నెలకొకసారైనా అటువంటి కుటుంబాలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించాలి. ఉచితంగా మందులు ఇవ్వాలి. వైద్యం చేయించాలి.

ధైర్యంగా బతకగలమనే భరోసా కల్పించాలి. ఈ ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వ ఏర్పాటులో నేనూ భాగస్వామినే. నాకు జీవించే హక్కుంది. పని చేయవలసిన బాధ్యత ఉంది. నా హక్కులను పోరాడి సాధించుకోగలను అనే నమ్మకం కలిగించాలి. ఏదో ఒక విషయంలో శిక్షణనివ్వాలి. ధన సంపాదనకు అవకాశాలు కల్పించాలి.

మీడియా కూడా ఈ విషయంలో ప్రధానపాత్ర వహించాలి. అనామకుని వంటి వారి జీవితాలలో పడే బాధలను వెలుగులోకి తేవాలి. వారి అభిప్రాయాలను బాహ్య ప్రపంచానికి తెలియజేయాలి. వారి సమస్యలను తెలుసుకోవాలి. సంబంధిత అధికారులకు తెలిసే అవకాశం ఏర్పాటు చేయాలి. ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. వారి జీవితాలలో వెలుగులు నింపాలి.

ఉరి Questions and Answers Summary Inter 1st Year Telugu

ప్రశ్న 3.
ఉరి పాఠ్యాంశాన్ని కథగా వ్రాయండి.
జవాబు:
ఉరి పాఠంలోని నాయకుడు, అనామకుడు. అతనికి ఉద్యోగం లేదు. పనిలేదు. ఎవరినీ మోసం చేయలేడు. అతని జీవితం చాలా దుర్భరమైనది. కటికదరిద్రం అనుభవిస్తున్నాడు. భార్యా బిడ్డలకు కనీసం తిండి కూడా పెట్టలేని హీనస్థితి. వారు ఆకలితో బాధపడుతుంటే చూస్తూ ఉండడం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కనీసం ఏడవడానికి కూడా ఓపిక లేని స్థితిలో ఉన్న పిల్లలను చూస్తే అతని కడుపు తరుక్కుపోతోంది.

ఎలాగోలా నాలుగుడబ్బులు సంపాదించాడు. వాటితో బియ్యం కొందామని షాపుకు వెళ్లాడు. కాని, అక్కడ పెద్ద పులి తోకలా పెరిగిపోతున్న వరుస. ఆ వరుసలో చిట్టచివర నిల్చున్నాడు. అక్కడ దాకా బియ్యం రావేమో అనుకొన్నాడు. నిలబడడానికి ఓపిక లేదు. అందుచేత రెట్టింపు ధరతో ఒక ముసలిదాని దగ్గర సగం బియ్యం కొన్నాడు. అవి పశువులు కూడా తినలేనంతగా ఉన్నాయి. అవి దంపుకొని, చెరిగితే బాగుంటాయని ఆశ. కాని, అతని భార్యకు అవి దంచే ఓపిక లేదు. చాలామందిని దంచి పెట్టమని అడిగింది. ఎవ్వరూ ఉపకారం చేయలేదు. అవి వండడానికి పుల్లల కోసం అతను ఒక విరిగిపోయిన దడ్డి దగ్గర పుల్లలేరు కొచ్చాడు. దానికి ఆ యజమాని అతనిని కొట్టాడు. దెబ్బలు తిని ఇంటికి వచ్చాడు.

పడిపోయిన గోడపై కొద్దిమేర ఉన్న చిన్న తడిక క్రింద వారి మకాం. అదే వారి ఇల్లు. అతను వచ్చేసరికి దాని పుల్లలు లాగి ఇల్లాలు వంటచేస్తోంది. పిల్లలు ఆకలితో మెలితిరిగిపోతున్నా ఏమీ చేయలేని దౌర్భాగ్య స్థితి అతనిది.

ఆ రోజు మధ్యాహ్నం, బియ్యం ఇస్తున్నారని తెలిసి వెళ్లాడు. అక్కడ చాలామంది జనం ఉన్నారు. అక్కడ బియ్యం ఇస్తారేమోనని అతని ఆశ. కానీ, పోలీసులు వచ్చారు. గొడవైంది. పోలీసులు కాల్పులు జరిపారు. జనం రాళ్లు రువ్వారు. ఆ గొడవ చూసి అనామకుడు భయపడ్డాడు. ఇంటికి వెళ్లిపోదామనుకొన్నాడు. అంతలో ఎవరో రాయి విసిరాడు. ఒకడు మరణించాడు. ఆ రాయి అనామకుడే విసిరాడనుకొన్నారు. తరిమారు. కొట్టారు. పట్టుకొన్నారు. జైలులో పెట్టారు మరునాడు అన్నం పెట్టారు.

అయ్యో ! తన భార్యాపిల్లలు తిండిలేక, ఆకలిబాధ తట్టుకోలేక మరణించి ఉంటారనుకొన్నాడు. తనకు ఉరిశిక్ష విధించారు. మరణించేముందు తనకు ఆకలిబాధ లేనందుకు ఆనందించాడు. తన భార్యా బిడ్డలకు మరణించే ముందు ఆహారం కూడా లేనందుకు బాధపడ్డాడు. ఇది ఒక నిర్భాగ్యుని వ్యథ. అనామకుని అమరగాథ, కష్టాలు కూడా కన్నీటితో కరిగిపోయే తీరని మారని జీవనగాథ.

ఉరి Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత పేరు : విశ్వనాథ సత్యనారాయణ గారు
జననం : 10.9.1895 న కృష్ణాజిల్లా నందమూరులో పార్వతమ్మ, శోభనాద్రి దంపతులకు శుద్ధ శ్రోతియ వైదిక కుటుంబంలో జన్మించారు.
గురువు : తిరుపతి వేంకట కవులలోని చెళ్లపిళ్ల వేంకట శాస్త్రిగారు. విశ్వనాథ వారికి గురువు గారంటే చాలా భక్తి.
ఉద్యోగం : బందరు హిందూ కళాశాలలో కొంతకాలం, బెజవాడలోని ఎస్. ఆర్. ఆర్. మరియు సి.వి.ఆర్ కళాశాలలో చాలాకాలం తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు.

రచనలు : వరలక్ష్మీ త్రిశతి. (మొదటి భార్య జ్ఞాపకార్థం 300 పద్యాస్మృతి కావ్యం)
రామాయణ కల్పవృక్షము (జ్ఞానపీఠ్ అవార్డు తెచ్చిన రచన) ఆంధ్ర పౌరుషం, కిన్నెరసాని పాటలు, వేయిపడగలు, పురాణ వైర గ్రంథమాల, కాశ్మీరీ చారిత్రక నవలలు, విశ్వనాథ మధ్యాక్కరలు, నన్నయ ప్రసన్న కథా కలితార్థయుక్తి మొదలైనవి రచించారు. ఏకవీర నవల (మలయాళ, తమిళ భాషలలోకి అనువదించబడింది) సినిమాగా కూడా వచ్చింది.

రచనా ప్రక్రియలు : పద్యం, నవల, నాటకం, కథానిక, శతకం, కావ్యం, కవిత, విమర్శ, వ్యాసం, రేడియో ప్రసంగాలు, పాట, ఆత్మకథ, చరిత్ర మొదలైన అనేక సాహితీ ప్రక్రియలలో రచనలు చేశారు.

రచనా వస్తువులు : చరిత్ర, తత్త్వశాస్త్రం, మతం, సామాజిక శాస్త్రం, ఆథ్యాత్మికత, రాజకీయశాస్త్రం, భాషాశాస్త్రం మొదలైన అనేక అంశాలు.

ప్రశంసలు అవార్డులు : ప్రపంచం పట్టనంతటి కవి విశ్వనాథ అని మల్లాది రామకృష్ణశాస్త్రి గారన్నారు. ‘నిన్నటి నన్నయ భట్టు- ఈనాటి కవి సమ్రాట్ విశ్వనాథ’ అని శ్రీశ్రీ ప్రశంసించారు. తెలుగు సాహిత్యానికి భారతదేశం లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘జ్ఞానపీఠ్’ అవార్డును తొలిసారి అందుకున్నవారు కవిసమ్రాట్ విశ్వ నాథగారు.

ప్రత్యేకతలు : 1921లో మహాత్మాగాంధీ గారి పిలుపు మేరకు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడానికై కళాశాల చదువును వదిలేశారు. చివరకు 1926-27లో కళాశాల చదువును పూర్తిచేశారు. విశ్వనాథ వారి వేయిపడగలు నవలను మాజీ ప్రధాని కీ.శే. పి.వి. నరసింహారావుగారు ‘సహస్రఫణ్’ పేరుతో హిందీ భాషలోకి అనువ దించారు. దీనికి గాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 18.10.1976న విశ్వనాథ వారు స్వర్గస్తులు అయ్యారు.

కఠిన పదాలకు అర్థాలు

94వ పేజి :

సమాజం = సంఘం
అత్యంత = చాలా ఎక్కువ
దురదృష్టవంతుడు = అదృష్టం లేనివాడు
పరాయివారు = ఇతరులు
ఆకాంక్ష = కోరిక
లక్ష్యం = గురి
చావు = మరణం
మాయ+అపిహితులు = మాయ కూడా ఇష్టపడేవారు
సహజం = ప్రకృతిధర్మం
శరీరం = దేహం
మాడి = ఆకలితో బాధపడి
తిండి = భోజనం
దయ = జాలి
తమాయించుకోవడం = నిగ్రహించుకోవడం
ఇంటిల్లపాతికా = ఇంట్లో వారంతా
బక్క నరాలు = బక్క చిక్కినవారు (నరం లాగా సన్నబడిన వారు)
అల్లే = అలాగ

ఉరి Questions and Answers Summary Inter 1st Year Telugu

96వ పేజి :

దుకాణం = కొట్టు (షాపు)
గొడ్లు = పశువులు
పోట్లు = రోకలితో దంపడాలు
విసిరికొట్టడం = పొమ్మని కఠినంగా చెప్పడం
నోము = పూజ
అట్లు = దోసెలు
ప్రోయ్యి = పొయ్యి
దొడ్డి = పెరడు
నాలుగణాలు = పావులా (24 పైసలు)
అణా = ఆరు పైసలు
బొబ్బ = అరుపు
హంగామా = హడావుడి

97వ పేజి :

వ్యవహారం = పని (విషయం)
నెల్లాళ్ళ మట్టి = నెల్లాళ్ల నుండి
అర్భనాకారి = బాగా సన్నని శరీరం కలవాడు
మనుష్య + ఆకృతి = మనుష్యాకృతి = మానవాకారం
రక్షకభటులు = పోలీసులు
నెమరకణత = చెవికి, నుదుటికి మధ్యభాగం
తరమడం = వెంటబడి పరుగెత్తించడం
గాఢము = దట్టమైన
అంధకారం = చీకటి
ఖైదు = జైలు
ఒకపూట = 6 గంటల కాలం
ప్రాణాలు లేచిరావడం = ఉత్సాహం కలగడం
దశ ఎత్తుకోవడం = అదృష్టం కలిసి రావడం
కడుపులు చల్లగా ఉండడం = సంతానంతో చక్కగా జీవించడం
వెయ్యి+ఏళ్లు -వెయ్యేళ్ళు = చాలాకాలం
ఇంటిది = భార్య
చింత = ఆలోచన
కడుపున పుట్టడం = ఋణం తీర్చుకోవడం