Regular practice with AP Inter 1st Year Telugu Study Material ఉపవాచకం 1st Lesson గౌరవ స్థానం Questions and Answers Summary helps students stay prepared for examinations.
AP Inter 1st Year Telugu గౌరవ స్థానం Questions and Answers
అభ్యాసం
I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
గౌరవస్థానం కథా సారాంశం ఏమిటి ?
జవాబు:
గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించిన కనుపర్తి వరలక్ష్మమ్మగారు రచించిన కథల నుండి గౌరవస్థానం అనే కథ గ్రహించబడింది.
ఆనాటి సమాజంలో స్త్రీలు వంటింటికి మాత్రమే పరిమితమైపోయారు. వారిలోని శక్తిసామర్థ్యాలకు తగిన అవకాశాలు లభించలేదు. గౌరవస్థానం లభించలేదు. నేటి కాలంలో స్త్రీలు విద్యావంతులు కావాలి. ఆర్థిక స్వావలంబన కల్గి ఉండాలి. అన్ని రంగాలలోనూ ప్రతిభాపాటవాలు కలిగి ఉండాలి. స్త్రీలను ఉత్తేజపరచాలి. చైతన్యవంతులను చేయాలి. సభ్య సమాజంలో స్త్రీలకు దక్కవలసిన గౌరవస్థానాన్ని దక్కనివ్వాలి. సముచితస్థానం లభించాలి అనే ఆకాంక్షతో ఈ కథ వ్రాయబడింది.
రాఘవరావు కుటుంబానికి రేడియోయే లోకమై పోయింది. వారు రేడియో కొన్న తర్వాత కార్యక్రమాలు వినడం, విమర్శించుకోవడం, వాటి గురించే చర్చించుకోవడం అదే వాళ్లపని.
సాయంత్రం నాలుగు గంటలకు రేడియోలో వచ్చిన ప్రసంగాన్ని రాఘవరావు, రాజేశ్వరీ దంపతులు చాలా శ్రద్ధగా విన్నారు. భారతరాజ్యాంగం ప్రకారం స్త్రీలకు పురుషులతో సమానంగా లభించిన హక్కుల గురించి ప్రసంగంలో ఆ విదుషీమణి చాలా చక్కగా వివరించారు. ఆ ప్రసంగాన్ని బట్టి స్త్రీలకు హక్కులన్నీ వచ్చేశాయని, రాఘవరావు నవ్వుతూ అన్నాడు. అవన్నీ కాగితాలలో మాత్రమే ఉంటాయని వాస్తవంలో ఉండవని రాజేశ్వరి అభిప్రాయపడింది.
మరి గవర్నర్లు, మంత్రులు, రాయబారులు, శాసనసభల్లో సభ్యులు, స్పీకర్లు ఇలా అన్నీ చేస్తున్నారు కదా అని రాఘవరావు అన్నాడు. పదహారుకోట్ల నలభై లక్షలమంది స్త్రీలలో ఏదో అతికొద్దిమందికి మాత్రమే ఆ అవకాశం ఇస్తున్నారని రాజేశ్వరి అభిప్రాయం.
చట్టాలు ఉన్నంత మాత్రాన లంచగొండులైన ఉద్యోగులను ఏమీ చేయలేక పోతున్నారు. బ్లాక్ మార్కెట్టు చేసే వ్యాపారులను ఎవ్వరూ ఏమీ చేయలేక పోతున్నారు. వాళ్లను శిక్షించే చట్టాలు ఉన్నా ఉపయోగం లేదనీ అలాగే మహిళాహక్కులూ అని రాజేశ్వరి అభిప్రాయం.
మనదేశంలో స్త్రీల కష్టాలను శాసనాలు తొలగించలేవు. స్త్రీకి కావలసింది గౌరవం. ఆ గౌరవం కూడా జీవితాంతం కావాలి అని రాజేశ్వరి అంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి అనే ముగ్గురమ్మలకూ ఉన్న గౌరవం లోకంలో ఎవ్వరికీ లేదని రాఘవరావు అన్నాడు.
ప్రతి కథ, కావ్యం, పత్రిక, పురాణం ఇలా ఏ రకమైన సాహిత్య ప్రక్రియలోనైన స్త్రీ లోకువగానే చూడబడుతోందని రాజేశ్వరి ఉద్దేశం. రాజ్యాంగం ప్రకారం స్త్రీలకు పోటీచేసే హక్కు, ఓటువేసే హక్కు, ఉద్యోగాలు, ఆస్తులు, అధికారాలు అన్నీ ఉన్నాయి. కానీ, స్త్రీ పురుషుల మధ్య బానిస, యజమాని భావం అలాగే ఉంది. ఆమెపై అనేక రకరకాలుగా అధికారాలు చెలాయిస్తూనే ఉన్నారు. వరకట్నం గురించి వేధిస్తూనే ఉన్నారు. కట్టుకొన్న భార్యను వదిలేసి పునర్వివాహాలు చేసుకొంటూనే ఉన్నారు. ఆమెను తనతో సమానంగా చూడాలనే ఆలోచన పురుషుడికి లేదు. మగవాళ్లలో మనఃపరివర్తన లేనిదే స్త్రీకి గౌరవస్థానం దక్కదు. స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి. పాటకపు స్త్రీలకు కూడా సుఖం లేదని తన అభిప్రాయాన్ని రాజేశ్వరిగారు చక్కగా చెప్పారు.
![]()
ప్రశ్న 2.
రాజేశ్వరి స్త్రీలకు ఏ విధమైన గౌరవస్థానం దక్కాలని కోరుకొంది ?
జవాబు:
కనుపర్తి వరలక్ష్మమ్మగారు రచించిన ‘గౌరవస్థానం’ కథలో స్త్రీలకు దక్కవలసిన గౌరవస్థానం గురించి నిస్సంకోచంగా కచ్చితమైన అభిప్రాయాలను రాజేశ్వరి గారు వ్యక్తపరిచారు.
స్త్రీలకు రాజ్యాంగం ప్రకారం చదువులు, ఉద్యోగాలు, ఆస్తి, ఓటు, ప్రాతినిధ్యపు హక్కులు చాలా సంక్రమించాయి.
ఎంతో మంది స్త్రీలు గవర్నర్లు, మంత్రులు, రాయబారులు, శాసనసభ్యులు, స్పీకర్లు మొదలైన ఎన్నో ఉన్నత పదవులను నిర్వహిస్తున్నారు. కానీ, 16 కోట్ల 40 లక్షలమంది స్త్రీలలో అది గణనీయమైన భాగం కాదు. చట్టాలు ఎన్ని వచ్చినా లంచగొండులైన ఉద్యోగులను ఏమీ చేయలేవు. బ్లాక్ మార్కెట్లో లో వ్యాపారం చేసే వ్యాపారస్తులను అరికట్టలేకపోతున్నాయి. అలాగే చట్టాల వలన స్త్రీలకు గౌరవస్థానం దక్కదు.
స్త్రీకి జన్మించిన దగ్గర నుండి మరణించే వరకు గౌరవంగా చూసే పరిస్థితి కావాలి.
స్త్రీల కష్టాలను శాసనాలు తొలగించలేవు. మనదేశంలో పురుషులకు స్త్రీలను గౌరవించడం తెలియదు. స్త్రీని గౌరవించడం అది ఒక హీనమైన పనిగా భావిస్తారు. స్త్రీలను కించపరచడం ఒక సరదాగా భావిస్తారు. అది తప్పు. శ్లోకాలలోనే తప్ప స్త్రీలకు వాస్తవంలో గౌరవంలేదని రాజేశ్వరిగారి అభిప్రాయం.
ఆధునికులు వ్రాసే కథలు, కావ్యాలు, పత్రికలు, ప్రహసనాలు, నాటకాలు, సినిమాలు, పురాణాలు, హరికథలు, పాటలు, పద్యాలు మొదలైన ఏ సాహితీ ప్రక్రియలోనూ స్త్రీలకు గౌరవస్థానం లేదు. విద్యార్థులకు కూడా తోటి విద్యార్థినులంటే లోకువే. భార్యను లోకువగా చూసే భర్తలే ఎక్కువమంది. ఈ శ్రీస్థితి మారాలి. ప్రతి సాహితీ ప్రక్రియలో స్త్రీకి పూజ్యత పెరగాలి. గౌరవస్థానం ఉండాలి.
రాజ్యాంగం ప్రకారం స్త్రీ చదువుకోవచ్చు. ఉద్యోగాలు చేయవచ్చు. ఆస్తులు అనుభవించవచ్చు. ఓటు వేయవచ్చు. పోటీ చేయవచ్చు. కానీ ఎన్ని అధికారాలు వచ్చినా స్త్రీని మగవాడు బానిసగానే చూస్తున్నాడు. ఆమెపై అధికారం చెలాయిస్తున్నాడు. ఆమె పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడు. ఆమెను పుట్టింటి నుండి అవీ, ఇవీ తెమ్మని వేధిస్తున్నాడు. కొందరైతే భార్యలను వదిలేసి, మళ్లీ పెళ్ళిళ్లు చేసుకొంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. స్త్రీ గౌరవింపబడాలి. స్వతంత్రంగా జీవించగలగాలి. స్త్రీని తనతో సమానంగా చూడాలనే భావన పురుషునిలో కలగాలి. అది రానంత కాలం ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం లేదని రాజేశ్వరిగారి అభిప్రాయం.
ఈ విధంగా స్త్రీలకు పురుషులతో సమానమైన గౌరవస్థానం దక్కాలని రాజేశ్వరిగారి అభిప్రాయం. అదే ఆమె కోరిక.
ప్రశ్న 3.
స్త్రీలకు గౌరవస్థానం దక్కడం వలన సమాజానికి కలిగే ప్రయోజనం ఏమిటి?
జవాబు:
స్త్రీలకు గౌరవస్థానం దక్కడం వలన సమాజానికి చాలా ప్రయోజనాలున్నాయి. గౌరవస్థానం వలన స్త్రీకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం వలన ఏ పనినైనా సమర్థవంతంగా చేయగలదు. విజయం సాధించగలదు. జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగగలదు.
దాని వలన సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. మేథోపరమైన అభివృద్ధి కూడా సమాజంలో పెరుగుతుంది.
సమాజంలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే. ఇద్దరికీ సమాన గౌరవం ఉంటే ఇద్దరూ విద్య, ఉద్యోగం, వ్యాపారం మొదలైన అన్ని రంగాలలోను పురోభివృద్ధిని సాధిస్తారు. ఇది సమాజాభివృద్ధికి అన్ని విధాలుగానూ సహకరిస్తుంది. అప్పుడే స్త్రీలలో చైతన్యం బాగా పెరుగుతుంది. స్త్రీలు చైతన్యవంతులైతే సమాజంలో అక్షరాస్యతా శాతం పెరుగుతుంది. అక్షరాస్యత పెరిగితే విజ్ఞానం పెరుగుతుంది. విజ్ఞానం పెరిగితే నూతన ఆవిష్కరణలు పెరుగుతాయి. సమాజంలో సంపద పెరుగుతుంది. సౌకర్యాలు పెరుగుతాయి. ఆరోగ్యాలు పెరుగుతాయి. ఎవరి సమస్యలు వారే పరిష్కరించుకొంటారు. మోసాలు, దోపిడీలు ఉండవు.
స్త్రీలను గౌరవింపబడే కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. విచక్షణ పెరుగుతుంది. పిల్లలకు అక్షరాస్యత పెరుగుతుంది. నిజాయితీ, నిర్భీతి పెరుగుతుంది. ఆనందంగా ఉన్న కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యాన్ని బట్టి పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. ఉత్పత్తి పెరుగుతుంది. సమాజంలో సంపద, ఆరోగ్యం, ఆయుర్దాయం పెరుగుతుంది. అటువంటి సమాజమే ప్రపంచం చేత గౌరవం అందుకొంటుంది. ఆదర్శవంతమౌతుంది.
స్త్రీ గౌరవ స్థానాన్ని బట్టే సమాజానికి గౌరవం పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఏ సమాజంలో స్త్రీలు గౌరవింపబడతారో ఆ సమాజం అందరి మన్ననలూ అందుకొంటుంది. పురోగమిస్తుంది. విచక్షణతో ఉంటుంది. సుసంపన్నమౌతుంది అని గ్రహించాలి.
![]()
ప్రశ్న 4.
స్త్రీలకు గౌరవస్థానం ఎప్పుడు దక్కుతుంది ?
జవాబు:
స్త్రీలకు గౌరవస్థానం దక్కాలంటే స్త్రీలు బాగా చదువుకోవాలి. తమ కాళ్లపై తాము నిలబడాలి. తమను అగౌరవపరిచేవారిని ఎదిరించాలి. చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. తమను తాము కాపాడుకొందుకు అధికారుల సహాయం తీసుకోవాలి. ధైర్యంగా ఉండాలి. ప్రతిదానికీ భయపడడం మానుకోవాలి. తమ కుటుంబం నుండే సంస్కరణ మొదలు పెట్టాలి. ఆడపిల్లలను ఒకలాగా, మగ పిల్లలను ఒక లాగా చూసే పద్ధతిని విడిచిపెట్టాలి. ఆడపిల్లలకే కాకుండా మగపిల్లల చేత కూడా ఇంటిపనులు చేయించాలి. స్త్రీలను గౌరవించే అలవాటును చిన్నతనం నుండీ అలవరచాలి.
పాఠశాల విద్యలో స్త్రీల గొప్పదనాన్ని తెలియజేసే పాఠాలు ఉండాలి. గొప్ప గొప్ప పనులు చేసిన స్త్రీలను గురించి పాఠాలు పెట్టాలి. స్త్రీ పురుషులిద్దరూ సమానమేననే భావాన్ని విద్యార్థులకు కలిగించే పాఠాలు ఉండాలి.
సినిమారంగం కూడా ఈ విషయంలో నడుం బిగించాలి. స్త్రీని ఒక ఆటబొమ్మగా చూపించకూడదు. హీరోని బాగా ఎక్కువచేసి చూపడం, పాత్రలకు తగిన ప్రాధాన్యం లేకుండా, తక్కువ చేసి చూపకూడదు. స్త్రీని కించపరచడం, హేళన చేయడం తప్పు అనే భావన కలిగించేలా సినిమాలు ఉండాలి. స్త్రీ కుటుంబానికి, సమాజానికీ చేస్తున్న సేవను ఎక్కువ చేసి చూపాలి.
స్త్రీలను హేళన చేసేవారిని, కించపరిచే వారిని కఠినంగా శిక్షించాలి. స్త్రీలను కాపాడడానికి ప్రత్యేకంగా పోలీసు బృందాలను ఏర్పరచాలి. స్త్రీలను కాపాడడం, వారి గౌరవాన్ని కాపాడడం కేవలం ప్రభుత్వ బాధ్యతే కాదు. అది సామాజిక బాధ్యతగా గుర్తించాలి.
స్త్రీల గౌరవానికి భంగం కలిగే మాటలను, చేష్టలను గమనిస్తే వాటిని నిరోధించాలి. మనకెందుకులే అనే ధోరణి పనికిరాదు. దీనిపై వక్తృత్వ, వ్యాసరచన మొదలైన పోటీలు పెట్టాలి. సెమినార్లు, వర్క్షాపులు నిర్వహించాలి. విరివిగా ప్రచారం చేయాలి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృత ప్రచారం జరగాలి.
అప్పుడే స్త్రీలకు గౌరవ స్థానం దక్కుతుంది. నిలబడుతుంది.
గౌరవ స్థానం Summary in Telugu
కవయిత్రి పరిచయం
కథ పేరు : గౌరవస్థానం
కవయిత్రి పేరు : కనుపర్తి వరలక్ష్మమ్మ
జననం : 6.10.1896న గుంటూరు జిల్లా బాపట్లలో
తల్లిదండ్రులు : పాలపర్తి హనుమాయమ్మ, శేషయ్య దంపతులు
కలం పేరు : లీలావతి
రచనలు : మా చెట్టు నీడ ముచ్చటలు (వ్యాసాలు) మహిళా మహోదయం, పునఃప్రతిష్ఠ, లేడీస్ క్లబ్, రాణీ మల్లమ్మ (నాటికలు) ద్రౌపదీ వస్త్ర సంరక్షణ (ద్విపద రచన) నమో ఆంధ్రమాత (గేయాలు) పిల్లలపాటలు, నవలలు మొదలైనవి.
ప్రత్యేకతలు : వరలక్ష్మమ్మ గారు మహిళాభ్యుదయం కోసం రచనలు చేశారు. గృహలక్ష్మి మాస పత్రికలో ఆమె రాసిన ‘శారద లేఖలు’ చాలాకాలం ప్రచురిత మయ్యాయి. బాలికాభివృద్ధి కోసం బాపట్లలో ‘స్త్రీ హితైషిణి’ మండలి స్థాపించి, చాలా కార్య క్రమాలు నిర్వహించారు. వీరి రచనలు కన్నడ, తమిళ, హిందీ భాషలలోకి కూడా అనువదించ బడ్డాయి. ఆమె ఖాదీ ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు.
అవార్డులు – రివార్డులు: వరలక్ష్మమ్మగారు గృహలక్ష్మి పత్రిక వారి స్వర్ణ కంకణ గ్రహీతలలో మొదటివారు. మద్రాసు, విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలలో పాల్గొన మొదటి మహిళ. సమాజ సేవలో తరించిన వరలక్ష్మమ్మగారు 13.8.1978లో స్వర్గస్తు లయ్యారు.
కఠిన పదాలకు అర్థాలు
87వ పేజి :
అదే లోకం = అదే పని
నవనవం = కొత్త కొత్త
విమర్శ = మంచి, చెడుల చర్చ
88వ పేజి :
ఫలాహారాలు = ఫలాహారాలు (టిఫిన్స్)
ముగించడం = పూర్తి చేయడం
తయారైనావా = వచ్చావా (వెటకారంగా అనే మాట)
విషయం = సమాచారం
భారతవర్షం = భారతదేశం
స్థానం = చోటు
విదుషీమణి = గొప్ప పండితురాలు
సతీపతులు = భార్యా భర్తలు
కాగితాల మీద వ్రాయబడిన హక్కులు = ఆచరణలో లేని హక్కులు
మందహాసం = చిరునవ్వు
పదింపది = అనేకమార్లు
రొట్టె విరిగి నేతిలో పడడం = ఊహించని అదృష్టం కలిసి రావడం
వంతు = భాగం
సాటి = పోలిక
త్రోసి వేయడం = తిరస్కరించడం
శిక్షాస్మృతి = చట్టం
దొంగకు తోడుపోవడం = దొంగకు కూడా సహాయం చేసే వెర్రితనం
![]()
90వ పేజి :
పదవి = హోదా
సంఘం = సమాజం
ఒరుగు = ఎండినవి
గర్భం = కడుపు
కాలగర్భంలో కలవడం = మరణించడం
ఆక్షేపించడం = వెక్కిరించడం
అంతరాయం = ఆటంకం
లా = న్యాయశాస్త్రం
బద్ధం = కట్టుబడడం
న్యూనత = హీనం
చిన్నబుచ్చడం = అవమానించడం
అలవోక = అనుకోకుండా
పొరబడడం = తప్పుగా అనుకోవడం
త్రిమూర్తులు = బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు
పూజ్యత = గౌరవం
అపోజిషన్ = ప్రతిపక్షం
అపోహ = భ్రమ
ఆడంబరం = అట్టహాసం
చులకన = లోకువ
అవలేశం = కొంచెం
తార్కాణం = ఉదాహరణ
91వ పేజి :
ఆధునికులు = నేటివారు
ప్రహసనం = హాస్యంగా ఉండే చిన్ని నాటిక
ఎదురుతిరిగి = ఎదిరింది
వమ్ము = వృథా
ప్రతిక్రియ = ప్రతీకారం
విరహితలు = చేయలేనివారు
తేలిక = లోకువ
సంగతి = విషయం
మన్నవ = గౌరవం
మచ్చు = నాణ్యత పరిశీలన
ఒడిగట్టు = పాల్పడు
పడతి = స్త్రీ
బానిస = వేతనం లేని పనివాడు
నిరంకుశత్వం = కఠినత్వం
బహుముఖాలు = అనేకరకాలు
చెలాయించడం = మితిమీరి ప్రదర్శించడం
నిర్బంధం = కఠినంగా బంధించడం
పరిత్యజించడం = విడవడం
పునఃవివాహం = మళ్లీ పెళ్లి
తగలేయడం = పాడుచేయడం
సహధర్మిణి = భార్య
జోగిని = యోగిని
భోగిని = సంసారి
యుక్తాయుక్తం = తగనిది, తగినది
పరిజ్ఞానం = తెలివి
పరివర్తన = ప్రవర్తనలో మార్పు
హైన్యత = హీనత్వం
![]()
92వ పేజి :
ఆర్థికోపపత్తి = డబ్బుపై అధికారం
నయం = మంచిది
పాటక స్త్రీ = కూలిపని చేసే స్త్రీ
అధోగతి = హీన స్థితి
క్లిష్ట సమస్య = కఠిన సమస్య