రుద్రపశుపతి కథ Questions and Answers Summary Inter 1st Year Telugu

Regular practice with AP Inter 1st Year Telugu Study Material పద్యభాగం 2nd Poem రుద్రపశుపతి కథ Questions and Answers Summary helps students stay prepared for examinations.

AP Inter 1st Year Telugu రుద్రపశుపతి కథ Questions and Answers

అభ్యాసం

I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
శివుడు విషం తాగాడని రుద్రపశుపతి ఎలా దుఃఖించాడు ?
జవాబు:
పురాణ కాలక్షేపానికి వెళ్ళిన రుద్రపశుపతి, క్షీరసాగర మథనంలో పుట్టిన హాలాహలం అనే లోకనాశక విషానికి సమస్త జీవరాశులు, దేవతలు తట్టుకోలేక మహాదేవుణ్ని ప్రార్థించగా శివుడు వచ్చి ఆ విషాన్నంతా ఒక ఉండలా చేసి కంఠంలో ఉంచుకున్నాడని పౌరాణికుడు చెప్పగా బెంబేలుపడిన రుద్రపశు పతి తట్టుకోలేని దుఃఖంతో పరమేశ్వరా ! నిన్నెలా విషం తాగనిచ్చారయ్యా ! నీవు ఏ మాత్రం ఆలోచించక ఎందుకు తాగావయ్యా ! నీ అర్ధాంగి పార్వతీదేవి ఎలా అంగీకరించిందయ్యా ! అంటూ రోదిస్తూ మూర్ఛిల్లాడు. కొంతసేపటికి తెప్పరిల్లి నా దిక్కు నీవేనయ్యా ! నీవు విషం తాగితే నాకు దిక్కెవరు అంటూ శివుణ్ని కాపాడమనీ అందరినీ ప్రార్ధించాడు.

ప్రశ్న 2.
రుద్రపశుపతి ముగ్ధభక్తిని వివరించండి.
జవాబు:
రుద్రపశుపతిది కల్మషం లేని ముగ్ధభక్తి. స్వచ్ఛమైన వాత్సల్యం. ప్రేమాను రాగాలను పరమాత్మకు పంచిన నిర్మలుడు. పారవశ్యంతో కూడిన భక్తి భావం మరియు వెన్న వంటి హృదయం కలవాడు. శివుడంటే ఎనలేని భక్తి విశ్వాసములు కలవాడు. శివుణ్ని చూసినంతనే ఆప్తునిలా సేవించి, లాలించి, ప్రాణాలనైనా ఇవ్వడానికి వెనుదీయని భక్తుడు.

II. సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విషం తాగిన శివుణ్ణి కాపాడమని రుద్రపశుపతి ఎవరెవరిని కోరాడు ?
జవాబు:
విషం తాగిన శివుణ్ని కాపాడమని పార్వతిని, ప్రమథగణాలను, పరమాప్తులను, శతరుద్రులను, వీరభద్రుణ్ని మున్నగువారిని రుద్రపశుపతి కోరాడు.

ప్రశ్న 2.
శివుడు రుద్రపశుపతికి ఇచ్చిన వరమేమిటి ?
జవాబు:
శివుడు రుద్రపశుపతిని తన తొడపై కూర్చుండబెట్టుకుని కంఠము నుండి విషం జారకుండా చూడమని వరమిచ్చెను.

ప్రశ్న 3.
పాల్కురికి సోమన గురించి సంగ్రహంగా తెలపండి.
జవాబు:
పాల్కురికి సోమన 12వ శతాబ్దపు కవి. ఈయన బసవపురాణమును ద్విపద కావ్యాన్ని రచించాడు. శివభక్తుడు, శైవ కథలనే వ్రాశాను.

III. ఏక వాక్య / పద రూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సముద్ర మథనంలో ముందుగా వచ్చింది ఏమిటి ?
జవాబు:
హాలాహలం

ప్రశ్న 2.
రుద్రపశుపతికి ప్రత్యక్షమైనది ఎవరు ?
జవాబు:
పార్వతీ సమేతుడైన శివుడు

ప్రశ్న 3.
శివునికి ఎవరు లేరని రుద్రపశుపతి బాధపడ్డాడు ?
జవాబు:
శివునికి తల్లి లేదని బాధ పడ్డాడు.

ప్రశ్న 4.
శివుడు దేనిని తన కంఠంలో ఉంచాడు ?
జవాబు:
విషము (హాలాహలం)

రుద్రపశుపతి కథ Questions and Answers Summary Inter 1st Year Telugu

ప్రశ్న 5.
రుద్రపశుపతికి శివుడు అప్పజెప్పిన బాధ్యత ఏమిటి ?
జవాబు:
రుద్రపశుపతిని శివుడు తన తొడపైన కూర్చుండబెట్టుకుని కంఠం నుండి విషం జారకుండా చూడమనే బాధ్యతను అప్పగించాడు.

ప్రశ్న 6.
పాల్కురికి సోమన ఎవరి అవతారమని భక్తుల విశ్వాసం ?
జవాబు:
పాల్కురికి సోమన శివుని ప్రమథ గణాలలోని భృంగి అవతారమని వీర శైవుల విశ్వాసము.

IV. సందర్భ సహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
గరళంబు మ్రింగె శ్రీకఱ కంఠుఁడనిన
జవాబు:
పరిచయము : పాల్కురికి సోమన రచించిన “బసవపురాణం” అనే ద్విపద కావ్యం తృతీయాశ్వాసం నుండి గ్రహింపబడిన “రుద్రపశుపతి కథ” లోనిది.
సందర్భము : దేవతలు, రాక్షసులు కలసి క్షీరసాగరమథనం చేయగా ముందుగా హాలాహలం పుట్టింది. లోక రక్షణకై శివుడు మ్రింగెనని చెబుతూ బసవన్న, చెన్న బసవన్నకు చెప్పిన సందర్భము.
భావము : శివుడు విషాన్ని మ్రింగెను.
వ్యాఖ్య : క్షీరసాగర మథనాన్ని పౌరణికుడు చెబుతుండగా రుద్రపశుపతి వినెను. ఈ కథను బసవన్న చెన్న బసవన్నకు చెప్పిన సందర్భము.

ప్రశ్న 2.
ముక్కంటి ! నాకింక దిక్కెవ్వరయ్య !
జవాబు:
పరిచయము : పాల్కురికి సోమన రచించిన “బసవపురాణం” అనే ద్విపద కావ్యం తృతీయాశ్వాసం నుండి గ్రహింపబడిన “రుద్రపశుపతి కథ” లోనిది.
సందర్భము : క్షీరసాగర మథనంలో ముందుగా హాలాహలం పుట్టింది. లోక రక్షణకై దానిని శివుడు మ్రింగాడు. ఈ కథను విన్న రుద్రపశుపతి మిక్కిలి బాధతో తనలో అనుకున్న సందర్భము.
భావము : శివుడు విషం త్రాగితే నాకు దిక్కు ఎవరు ?
వ్యాఖ్య : క్షీరసాగర మథనంలో ముందుగా హాలాహలం పుట్టింది. లోక రక్షణకై శివుడు మ్రింగాడు. ఈ కథను విన్న ముగ్ధ భక్తుడైన “రుద్ర పశుపతి” అమితంగా బాధపడుతూ, శివుడే విషాన్ని మ్రింగితే నాకింక దిక్కు ఎవరు అని అన్నాడు. విషం అంటే ప్రాణాలను తీస్తుంది కనుక శివుడు విషం తాగితే ఇంక బ్రతకడు కనుక శివుడే పోతే నాకింక దిక్కెవ్వరని ముగ్ధభక్తితో అంటున్నాడు.

ప్రశ్న 3.
అణుమాత్ర నా కంఠమందుఁ జిక్కినది.
జవాబు:
పాల్కురికి సోమన రచించిన “బసవపురాణం” అనే ద్విపద కావ్యం తృతీయాశ్వాసం నుండి గ్రహింపబడిన “రుద్రపశుపతి కథ” లోనిది.
సందర్భము : విషము మ్రింగిన శివునితో రుద్రపశుపతి – విషాన్ని ఉమ్మి వేయుము. అణుమాత్రమందైన విషాన్ని ఉమ్మి వేయటానికి నీకు లెక్క కాదు అని పల్కిన సందర్భము.
భావము : అణుమాత్రమంత విషం కంఠంలో ఉన్నది.
వ్యాఖ్య : రుద్రపశుపతి పల్కిన మాటలు ఇవి. శివా ! విషం మింగితే నువ్వు ఉంటావా ? నువ్వు లేకపోతే నాకు దిక్కెవ్వరు ? అని బాధపడుచుండెను. లోకాలన్నీ అంధకారంలో మునిగిపోతుంది. కనుక నువ్వు అణుమాత్రమైన విషం ముద్దను బయటకు ఉమ్మివేయుము.

V. సంధులు

1. విశ్వేశుడు
జవాబు:
విశ్వ + ఈశుడు – గుణసంధి
సూత్రము : సంస్కృతమున అకారానికి అసవర్ణములైన ఇ-ఉ-ఋలను అచ్చులు పరంబగునపుడు క్రమంగా ఏ-ఓ-అర్ అనునవి ఏకాదేశమగును.

2. ప్రత్యక్షము
జవాబు:
ప్రతి + అక్షము – యణాదేశ సంధి
సూత్రము : సంస్కృతమున ఇ-ఉ-ఋలను అచ్చులకు అసవర్ణములైన అచ్చులు పరంబులగునపుడు య-వ-ర లనునవి ఏకాదేశమగును.

3. కడుపుసొచ్చినను
జవాబు:
కడుపు + చొచ్చినను – గసడదవాదేశ సంధి
సూత్రము : ప్రథమ మీది పరుషములకు గసడదవలగు.

4. పరమాప్తులు
జవాబు:
పరమ + ఆప్తులు – సవర్ణదీర్ఘ సంధి
సూత్రము : సంస్కృతమున అ, ఇ, ఉ, ఋ, ఇ లకు సవర్ణములైన అచ్చులు పరంబులగునపుడు క్రమంగా వాని దీర్ఘము ఏకాదేశమగును.

5. ఏమిసేయుదును
జవాబు:
ఏమి + చేయుదును – గసడదవాదేశ సంధి
సూత్రము : ప్రథమమీది పరుషములకు గసడదవలగు.

6. దిక్కెవ్వరు
జవాబు:
దిక్కు + ఎవ్వరు – ఉత్త్వసంధి
సూత్రము : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.

7. ప్రాణేశుడు
జవాబు:
ప్రాణ + ఈశుడు – గుణసంధి
సూత్రము : సంస్కృతమున అకారమునకు అసవర్ణములైన ఇ-ఉ-ఋలను అచ్చులు పరంబగునపుడు క్రమంగా ఏ-ఓ-అర్ అనునవి ఏకాదేశమగును.

8. నేలఁబడి
జవాబు:
నేలన్ + పడి సరళాదేశ సంధి
సూత్రము : ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగును.

VI. సమాసములు

(విగ్రహవాక్యం రాసి, సమాసనామము రాయండి.)

1. ముక్కంటి
జవాబు:
మూడు కన్నులు కలవాడు – బహువ్రీహి సమాసము

2. పదాబ్జములు
జవాబు:
అబ్జముల వంటి పాదములు – ఉపమాన ఉత్తరపద కర్మధారయము

3. కమలాక్షుడు
జవాబు:
కమలముల వంటి అక్షులు కలవాడు – బహువ్రీహి సమాసము

4. సురాసురులు
జవాబు:
సురలును, అసురులును – ద్వంద్వ సమాసము

5. దశదిశలు
జవాబు:
పది సంఖ్య గల దిశలు – ద్విగు సమాసము

VII. కఠిన పదాలకు అర్థాలు

  1. కఱకంఠుడు = శివుడు
  2. భర్గుడు = శివుడు
  3. వెండి = మరియు, మరల
  4. ఒగి = క్రమంగా
  5. కాలకూటము = కాలకూటము అనే పేరు కలిగిన విషం
  6. నిష్ఠించి = ఉమ్మి వేసి
  7. వలపలి = కుడి
  8. నెమ్మి = క్షేమం
  9. పినాకి = శివుడు

VIII. వ్యుత్పత్త్యర్థాలు

  1. మృడుడు = భక్తులను సంతోషపెట్టేవాడు.

రుద్రపశుపతి కథ Summary in Telugu

కవి కాలాదులు

పాఠ్యభాగము : రుద్రపశుపతి కథ
గ్రహింపబడిన గ్రంథం : “బసవ పురాణం”లోని తృతీయాశ్వాసం నుండి గ్రహింపబడింది.
కవి : పాల్కురికి సోమనాథుడు
కాలము : 12వ శతాబ్దము
నివాసము : వరంగల్ జిల్లా జనగామ తాలూకాలోని “పాలకురికి”

రచనలు : 1. బసవపురాణము 2. పండితారాధ్య చరిత్ర 3. వృషాధిప శతకము 4. బసవోదాహరణమ 5. అనుభవసారము 6. చెన్నమల్లు సీసములు 7. చతుర్వేదసారము 8. బసవరగడ (కన్నడం) 9. బసవనస్తోత్రము 10. బసవాష్టకం (సం) 11. అక్షరాంక గద్య (సం) 12. నమస్కార గద్య (సం) 13. పంచప్రకార గద్య (సం) 14. సోమనాథస్తవము 15. వృషభాష్టకము 16. సోమనాథభాష్యమ్ (సం) 17. రుద్రభాష్యమ్ (సం) 18. బసవాఢ్యరగడ (కన్నడం) 19. సద్గురు రగడ (కన్నడం) 20. గంగోత్పత్తి రగడ (కన్నడం) 21. బసవోదాహరణమ్ (సం)

విశిష్టత : ఈయన దేశిమార్గ రీతులకు చెందిన ద్విపద కవిత్వానికే కాక, శివ సమూహానికి, వీరశైవ సిద్దాంతాలకు కూడా గురుపీఠమని చెప్పదగిన వాడు. శివునిగాని, బసవేశ్వరునిగాని వర్ణించే టప్పుడు ఇతని రచన ఆవేశపూరితమై గంగా ప్రవాహం వలె ప్రవహిస్తుంది. కొన్ని ద్విపదలలో ప్రాసయతిని వాడాడు.

పాఠ్యభాగ నేపథ్యం

తెలుగు సాహిత్య చరిత్రలో పాల్కురికి సోమనాథుడు “బసవపురాణం” మనే దేశి పురాణంను వ్రాశాడు. ఈయన అన్యమతస్థులను తీవ్రంగా ద్వేషించి, వీరశైవ సిద్ధాంతాలను, మత ప్రచారాన్ని తన సాహిత్యం ద్వారా ప్రజలకు తెలిపి, ప్రజలను చైతన్యవంతులుగా చేశాడు. సాహిత్యం ద్వారా వీరశైవ మత ప్రచారం చేసిన కవులలో ఇతడు అగ్రగణ్యుడు.

పాఠకుల ఆలోచనకు ఏ విషయాన్ని విడిచిపెట్టక ప్రతి విషయాన్ని విస్తృతంగా వర్ణించి చెప్పాడు. శివునిగాని, బసవేశ్వరునిగాని వర్ణించేటప్పుడు ఇతని రచన ఆవేశ పూరితమై గంగా ప్రవాహంవలె ప్రవహిస్తుంది.
ఈ బసవపురాణంలో బసవేశ్వరుని కంటే పురాతనమైన శివభక్తుల కథలు, బసవని సమకాలీన శివభక్తుల కథలున్నాయి.

ప్రస్తుత పాఠ్యాంశం రుద్రపశుపతి కథ. ఈ కథను బసవన్న, చెన్న బసవన్నకు చెప్పాడు. రుద్రపశుపతి పురాణ కాలక్షేపానికి వెళ్ళాడు. అక్కడ పౌరాణికుడు క్షీరసాగర మథనాన్ని అనే ఘట్టాన్ని చెబుతున్నాడు. ఆ సముద్ర మథనంలో ముందుగా హాలాహలం పుట్టింది. దాని సకల లోకాల్లోనున్న జీవులు, దేవతలు తట్టుకోలేక శివుణ్ని ప్రార్థించారు. వెంటనే శివుడు వచ్చి ఆ హాలాహలాన్ని ఒక ముద్ద చేసి మ్రింగాడు. ఈ ఘట్టాన్ని విన్న రుద్రపశుపతి ముగ్ధభక్తితో దుఃఖిస్తూ, వ్యధ చెందుతున్న సందర్భం.

పాఠ్యభాగ సారాంశం

రుద్రపశుపతి గొప్ప ముగ్ధభక్తుడు. పుణ్యకాలక్షేపానికి వెళ్ళాడు. దేవతలు, రాక్షసులు కలసి క్షీరసాగర మథనం చేస్తున్నారని పౌరాణికుడు చెబుతున్న గాథ. అపుడు ముందుగా హాలాహలం పుట్టిందనియు, లోకాలను రక్షించేందుకు శివుడు దాని మ్రింగాడు అని చెబుచుండెను. అపుడు రుద్రపశుపతి విని తట్టుకోలేక అనేక విధాలుగా బాధపడ్డాడు.

పరమేశా ! నీవు విషం తాగితే ఎలా ఉండగలవు ? నాకు దిక్కెవరు అంటూ భయంకరంగా ఏడ్వసాగాడు.

పరమేశ్వరా ! ఈ విషాన్ని మ్రింగకుండా ఉమ్మివేయుము. నిన్ను ప్రార్థిస్తున్నాను. అమ్మా ! పార్వతీ ! నీవెట్లా సహించావు తల్లీ ! అయ్యో ! ప్రమథాది గణములార ! పరమాప్తులార ! శతరుద్రులార ! శివుణ్ని రక్షించండి. తల్లి ఉంటే శివుణ్ని విషాన్ని త్రాగనిస్తుందా ? శివుడు పోతే నాకు దిక్కెవరు ? భయంకరమైన నీటి మడుగులో పడి నేను మరణిస్తాను అని రుద్ర పశుపతి పరిపరి విధాల తలంచాడు.

పార్వతీ సహితుడై శివుడు తన ప్రమథ రుద్రాది గణాలతో, రుద్ర పశుపతికి ప్రత్యక్షమై భక్తా ! శాంతించు. నీకేమి వరము కావాలో కోరుకొనుమని పల్కాడు. కాని నాకేమి వద్దు స్వామీ ! ముందు నీవు తాగిన విషాన్ని కక్కివేయుము అని రుద్రపశు పతి పల్కాడు.

తనకేమీ కాదని శివుడు ఎంత చెప్పినా రుద్రపశుపతి వినలేదు. చివరికి శివుడు రుద్రపశుపతిని తన తొడపైన కూర్చుండబెట్టుకొని, నాయనా ! నా కంఠంలో నున్న విషము క్రిందకు జారకుండా చూస్తూ ఉండమని చెప్పాడు. ఈ నాటికీ రుద్రపశు పతి శివుణ్ని కంటికి రెప్పలా కాస్తున్నాడని శివభక్తుల విశ్వాసము. కనుక శివభక్తుల మూఢభక్తి అంత గొప్పది.

రుద్రపశుపతి కథ Questions and Answers Summary Inter 1st Year Telugu

కఠిన పదాలు – అర్ధాలు

1 నుండి 20 పంక్తులు :

వ్యక్తం బెఱుంగవే యయ్యళయూర
భక్తుండు మును రుద్ర పశుపతి నాఁగఁ
బ్రథిత మౌ నాదిపురాణమం దబ్ధి
మథనావసర మొక్క కథకుండు సదువఁ
గమలజ కమలాక్షు లమిత దైత్యాదు
లమరులు సెడి పాఱ నం దుద్భవించి
పొరి నజాండములెల్ల దరికొని కాల్చు
గరళంబు మ్రింగె శ్రీకఱకంఠుఁ డనిన
నా రుద్రపశుపతి యాలించి ‘భర్గుఁ
డారగించుట నిక్కమా విషం’ ? బనుడు
‘ననుమానమా ! త్రావె హరుఁడు విషంబు
బనుగొన నటమీఁది పను లెఱుంగ’ మన
విని యుల్కిపడి వీఁపువిఱిగి “హా ! చెడితి”
నని నేలఁ బడి పొర్లి “యక్కటా ! నిన్ను
వెఱిఁ జేసిరిగాక ! విశ్వేశ ! యెట్టి
వెఱివా రైనను విషముఁ ద్రావుదురె ?
బ్రదుకుదురె ? విషమ్ముపాలైన వార ?
లిది యెట్టు వినవచ్చు; నేమి సేయుదును ?
నిక్క మెవ్విధమున నిన్నెకా కెఱుఁగ;
ముక్కంటి ! నా కింక దిక్కెవ్వరయ్య ?

అర్థాలు :

ఎఱుంగుట = తెలిసికొనుట
నాగ = పెద్ద
ప్రథితము = ప్రసిద్ధిపొందినది
అబ్ధి = సముద్రము
కథకుడు = పురాణం చెప్పువాడు
కమల + అక్షులు = కమలాక్షులు = పద్మము వంటి కన్నులు కలవారు
దైత్యాదులు = దితి సంతానము (రాక్షసులు)
అమరులు = మరణము లేనివారు (దేవతలు)
పొరి = చంపుట
అజ + అండము = అజాండము = బ్రహ్మాండమ
ఉద్భవించుట = పుట్టుట
గరళము = విషము
భర్గుడు = శివుడు
ఆరగించుట = త్రాగుట
నిక్కము = నిజము
హరుడు = శివుడు
ఆ + కటా ! = అక్కటా ! = అయ్యో !
విశ్వ + ఈశుడు = విశ్వేశుడు = శివుడు (ప్రపంచానికి ప్రభువు)
ముక్కంటి = మూడు కన్నులు కలవాడు – శివుడు

తాత్పర్యం : రుద్రపశుపతి గొప్ప భక్తుడు. పురాణ కాలక్షేపానికి వెళ్ళాడు. దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని మథించగా ముందుగా విషం పుట్టింది. దానిని శివుడు మ్రింగాడు. ఈ గాథ విన్న రుద్రపశుపతి తట్టుకోలేక నీవెందుకు తాగావయ్య ! నాకు దిక్కు ఎవరు ? అని బాధపడ్డాడు.

21 నుండి 42 పంక్తులు :

నాకొఱకై నఁ బినాకి ! యివ్విషము
చేకొన కుమియవే నీకు మ్రొక్కెదను;
గటకటా ! మేన సగంబున నుండి
యెట వోయితవ్వ ! నీ వెఱుఁగవే గౌరి !
ప్రమథగణములార ! పరమాప్తులార!
సమసిన వెండి మీశక్యమే కావ ?
శతరుద్రులార ! యసంఖ్యాతులార !
క్షితిధరకన్యకాపతిఁ గావరయ్య !
వీరభద్రయ్యరో ! విషముఁ బ్రాణేశుఁ
డారగించె నిఁ కెట్టు లవునో కదయ్య !
యోపురాతనులార ! యొడయుండు బ్రదుక
నోపు నొకో ! విషం బొగి నారగించెఁ;
జావు దప్పింపరే సద్గురునాథు;
దీవన లీయరే కావరే శివునిఁ;
దల్లిలేని ప్రజలఁ దలఁతురే యొరులు ?
తల్లి యున్న విషముఁ ద్రావ నేలిచ్చు !
పరమేశుఁ డీబారి బ్రదికెనేనియును
మరణంబు లేదువో మఱి యెన్నఁటికిని.”
నని ప్రలాపింపుచుఁ బనవుచు నొండు
వినఁజాలఁ బ్రాణము ల్విడుతు నే ననుచుఁ
దడయక ఘనజలాంతరమున నుఱుకఁ
బడకుండ నారుద్రపశుపతిఁ బట్టి

అర్థాలు :

పినాకి = శివుడు
చేకొనక = తీసుకోకుండా
ఉమియవే = ఉమ్మివేయుము
గౌరి = పార్వతి (గిరి కుమార్తె)
పరమ + ఆప్తులు = పరమాప్తులు = గొప్పవారైన ఆత్మీయులు
క్షితిధర కన్యకాపతి = హిమవంతుని కుమార్తె అయిన పార్వతి భర్త = శివుడు
ప్రాణ + ఈశు = ప్రాణేశు = భర్త
అనవుచు = అని పల్కుచు
తడయక = ఆలస్యం చేయకుండా
ఘన-జల+అంతరమున = ఘనజలాంతరమున = గొప్పదైన నీటి మధ్యలో

తాత్పర్యం : పరమేశ్వరా ! ఈ విషాన్ని మ్రింగకుండా ఉమ్మివేయుము. నిన్ను ప్రార్థిస్తాను. అమ్మా ! పార్వతీ ! నీ వెట్లా సహించావు. ప్రమథ గణములార ! పరమాప్తులారా ! శతరుద్రులారా ! శివుణ్ని రక్షించండి. తల్లి ఉంటే శివుణ్ని విషాన్ని త్రాగనిస్తుందా ? శివుడు పోతే నాకు దిక్కెవరు ? భయంకరమైన నీటి మడుగులో పడి నేను మరణిస్తాను అని రుద్రపశుపతి తలంచాడు.

రుద్రపశుపతి కథ Questions and Answers Summary Inter 1st Year Telugu

43 నుండి 66 పంక్తులు :

పార్వతీసహితుఁడై ప్రమథరుద్రాది
సర్వసురాసుర సంఘంబు గొలువ
హరుఁడు ప్రత్యక్షమై “యడుగుము నీకు
వర మిత్తు నెయ్యది వాంఛితం” బనుడుఁ-
గడుసంభ్రమంబున మృడుపదాబ్జములఁ
బడి రుద్రపశుపతి భట్టారకుండు
“ఏమియు నే నొల్ల; నీవిష సేవ
నేమేమి పుట్టునో యే వినఁజాల;
గ్రక్కున నుమియవే కాలకూటంబు
నిక్కంబు నా కెక్కెనీయీవి.” యనిన
దశనకాంతులు దశదిశలఁ బర్వంగఁ
బశుపతి యారుద్రపశుపతి కనియెః
“నిట లోకములలోన నెన్ననే కాక
యట మ్రింగ నుమియంగ నది యెంత పెద్ద ?
యణుమాత్ర నా కంఠమందుఁ జిక్కినది;
గణుతింప నున్నదే కాలకూటంబు
ఇంత సంతాపింప నేల నీ ?” కనుచు
వింతనవ్వొలయంగ సంతరించుడును-
“నమ్మంగఁ జాలఁ బినాకి ! యివ్విషము
గ్రమ్మన నొక్కింత గడుపు సొచ్చినను
బెద్దయుఁ బుట్టునో పిమ్మటివార్త
దద్దయు విన నోపఁ దా మున్న చత్తు
సమయని మ్మొండేనిఁ జావనీవేని
యుమియు మివ్విషమొండె నొండు సెప్పకుము

అర్థాలు :

పార్వతీ సహితుడు + ఐ = పార్వతీ సహితుడై = పార్వతితో కూడిన శివుడు
సుర + అసురులు = సురాసురలు = దేవతలు, రాక్షసులు
ప్రతి + అక్షము = ప్రత్యక్షము = దర్శనమిచ్చుట
సంభ్రమము = ఆశ్చర్యము
కాలకూటము = విషము
సంతాపింపనేల = బాధపడనేల
పినాకి = శివుడు

తాత్పర్యం : పార్వతీ సహితుడై శివుడు తన ప్రమథ రుద్రాది గణాలతో రుద్ర పశుపతికి ప్రత్యక్షమై వరము కోరుకొనుమని పల్కాడు. నాకేమి వద్దు స్వామీ ! నీవు త్రాగిన విషాన్ని కక్కివేయుము అని రుద్రపశుపతి పల్కెను.

67 నుండి 88 పంక్తులు :

తక్కినమాటలు దనకింప” వనుచు
నిక్కంబుతెగువమై నిష్ఠించి పలుక;
‘నుమియ కుండినఁ జచ్చునో ముగ్ధ” యనుచు
నుమబోటి యాత్మలో నుత్తలపడఁగ
“నుమిసినఁ గొని కాల్చునో తమ్ము” ననుచుఁ
గమలాక్షముఖ్యులు గడగడ వడఁకఁ
బ్రమథు లాతని ముగ్ధభక్తికి మెచ్చి
యమితమహెూత్సవులై చూచుచుండ
నొక్కింత నవ్వుచు నుడురాజధరుఁడు
గ్రక్కున లేనెత్తి కౌఁగిటఁ జేర్చి,
“ప్రమథులయాన నీపాదంబులాన
సమయ నివ్విషమున సత్యమిట్లనిన
నమ్మవే వలపలి నాతొడ యెక్కి
నెమ్మిఁ జూచుచునుండు నీలకంఠంబు”
నని యూరుపీఠంబునందు ధరించె.
మును గుఱియున్నదే ముగ్దత్వమునకు
నదిగాక కుత్తుక హాలాహలంబు
కదలినంతటనే చచ్చెదఁగాక ! యనుచుఁ
దనకరవాలు తొమ్మున దూసి మోపి
కొని కుత్తకయ చూచుచును తెప్ప లిడక
పశుపతితొడమీఁదఁ బాయక రుద్ర
పశుపతి నేఁడును బాయకున్నాఁడు.

అర్థాలు :

తెగువ = సాహసము
నిష్ఠించు = శ్రద్ధవహించు
ఉమియకుండిన = ఉమ్మివేయకుండా
ముగ్ధ = అమాయకుడు
ఉడురాజధరుడు = నక్షత్రాలకు ప్రభువైన చంద్రుణ్ని ధరించిన వాడు – శివుడు
నీలకంఠంబు = నల్లనైన కంఠము కలవాడు – శివుడు
ఊరు = తొడ
కుత్తుక = గొంతు
హాలాహలము = విషము
కరవాలు = చెయ్యి
పాయక = వదలిపెట్టక
ఱొమ్ము = వక్షఃస్థలము

తాత్పర్యం : తనకేమి కాదని శివుడు ఎంత చెప్పినా రుద్రపశుపతి వినలేదు. చివరకు శివుడు రుద్రపశుపతిని తన తొడపైన కూర్చుండ బెట్టుకుని నాయనా ! నా కంఠంలోనున్న విషము క్రిందకు జారకుండా చూస్తూ ఉండమని చెప్పాడు. ఈనాటికీ రుద్రపశుపతి శివుణ్ని కంటికి రెప్పలా కాపలా కాస్తున్నాడని శివభక్తుల విశ్వాసము. శివభక్తుల మూఢభక్తి అంత గొప్పది.