రాయలవారి కల Questions and Answers Summary Inter 2nd Year Telugu

Reviewing AP Inter 2nd Year Telugu Study Material గద్యభాగం 4th Lesson రాయలవారి కల Questions and Answers Summary can help students prepare confidently for exams.

AP Inter 2nd Year Telugu రాయలవారి కల Questions and Answers

అభ్యాసం

I వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆంధ్ర మహావిష్ణువు రాయలవారి కలలో కనిపించి ఏమన్నాడు ?
జవాబు:
పరిచయం : ఈ ప్రశ్న ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావుగారు రచించిన ‘రాయలవారి కల’ అనే పాఠ్యభాగంలోనిది. రాయలవారి కల ఆంధ్ర మహావిష్ణువు ఆజ్ఞ : శ్రీకృష్ణదేవరాయలవారు విజయ యాత్రలో భాగంగా బెజవాడ సమీపంలో కొన్ని రోజులు ఉన్నారు. ఒక రోజు కృష్ణానది పాయల మధ్య వెలసిన ఆంధ్ర మహావిష్ణువుని దర్శించుకోవాలని సిరికాకొలను (శ్రీకాకొలను) వెళ్లాడు. ఆ రోజు ఏకాదశి. గుడి ఆవరణలో రాయలవారు దర్భశయ్య మీద పడుకున్నాడు.

రాత్రి నాల్గవ ఝాము గడిచే కాలంలో రాయలవారికి శ్రీకాకుళేశ్వరస్వామి దర్శనమిచ్చారు. ఆయన దివ్య మంగళ రూపాన్ని చూసి రాయలవారు పొంగిపోయారు. అప్పుడు, స్వామి రాయలవారితో ఇలా మాట్లాడారు. ఓ రాయా ! నీవు గీర్వాణ భాషలో (సంస్కృతం) చాలా కావ్యాలు రాశావు. మదాలస చరిత్ర, ‘సత్యవధూ ప్రీణనం’, సకలకథాసారసంగ్రహం, జ్ఞాన చింతామణి రసమంజరి వంటి కావ్యాలు రాశావు. వాటిలో అలంకారం, ధ్వని, వేదపురాణాలసారం మొదలైనవి పొందుపరిచావు. ఇన్ని కావ్యాలు రాశావు కదా ! తెలుగులో ఒక కావ్యం రాయలేవా ? తెలుగు వల్లభుడనైన నాకు ఆనందం కలిగే విధంగా ఆంధ్రభాషలో ఒక కావ్యాన్ని విశిష్టంగా నిర్మించు అని అన్నాడు.

అంతేగాక ఆ జగన్మోహనరూపుడు ఇలా అన్నాడు. ఓ రాయా ! నా గురించి పురాణాలలో ఎన్నో కథలున్నాయి. ఏ కథ చెప్పాలా అని నీవు సందేహపడాల్సిన అవసరం లేదు. తాను ఎంతో ప్రేమతో ధరించిన పూలదండను, అభిమానంతో నాకు సమర్పించిన ఓ చిన్నదాని కథని చెప్పు, పూర్వం ఇదే క్షేత్రంలో ఒక మగవాడు ఇచ్చిన పూలమాలను నాకు ఇష్టం లేకపోయినా జుగుప్సతో స్వీకరించాను. ఆపద కాలంలో అతన్ని రక్షించాను.

రాయా ! నేను తెలుగు రాయుడిని, నీవు కర్ణాటక సింహాసనానికి రాజువి, మనిద్దరి మధ్య సాపేక్షం కుదిరింది. నీవు తెలుగులో కావ్యం వ్రాసే పని చేయగల సమర్థుడివి అని నమ్మకం ఉంది. ఈ దేశం తెలుగువారిది. నేను తెలుగు వల్లభుడను, తెలుగుభాష కలకండ లాగా మధురమైనది. “దేశభాషలందు తెలుగు లెస్స” అని నీకు తెలియంది ఏముంది ? కాబట్టి తెలుగులో కావ్యం రాయమని ప్రేరణ కలిగిస్తున్నాను.

నీవు తెలుగులో ఈ కావ్యం రాశాకె, ఎవరికి అంకితమివ్వాలా అని ఆలోచిస్తున్నావేమో ! నీ ఇష్టదైవం లోకప్రసిద్ధుడైన తిరుమల వేంకటేశ్వరుడని నాకు తెలుసు. ఆయన, నేను పేర్లు వేరుగా పలికినా, నిజానికి మేమిద్దరం ఒక్కటే. అందువలన నీవు రాసే కావ్యాన్ని శ్రీ వేంకటేశ్వరునికి అంకితమివ్వు. నేను చెప్పినట్లు ఈ కావ్య రచన పూర్తి చేశావా ! నీకు భవిష్యత్తులో పరిపూర్ణమైన అభివృద్ధి కలుగుతుందని ఆశీర్వదించి ఆంధ్రవిష్ణువు అదృశ్యమయ్యాడు.

రాయలవారి కల Questions and Answers Summary Inter 2nd Year Telugu

ప్రశ్న 2.
రాయలవారి స్వప్న వృత్తాంతాన్ని విద్వజ్జనులు ఎలా విశ్లేషించారు ?
జవాబు:
పరిచయం : ఈ ప్రశ్న ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావుగారు రచించిన ‘రాయలవారి కల’ అనే పాఠ్యభాగంలోనిది.
శ్రీకృష్ణదేవరాయల వారు తనకు కలిగిన స్వప్న వృత్తాంతాన్ని వేద పండితులకు, విద్వజ్జనులకు వివరించగా వారు ఆ కలలోని ఒక్కో అంశాన్ని విశ్లేషిస్తూ శుభ ఫలితాలను క్రింది విధంగా వివరించారు.

విద్వజ్జనుల విశ్లేషణ : విద్వజ్జనులు రాయల వారి కలని అత్యంత పవిత్రమైనదిగా భావించి, దాని వెనుక ఉన్న 7 ప్రధాన పరమార్థాలను ఇలా విశ్లేషించారు. భక్తి ప్రపత్తులు : తామరపూల వంటి కన్నులు గలిగిన శ్రీమన్నారాయణుడు స్వప్నంలో సాక్షాత్కరించడం వల్ల, రాయలవారి హృదయంలో భక్తి భావం మరింత మెరుగుపడుతుందని విశ్లేషించారు.

సారస్వతాభివృద్ధి : సాక్షాత్తు భగవంతుడే తెలుగులో రాయలవారిని రాయమని ఆదేశించడం వల్ల లోకంలో తెలుగుభాష, సాహిత్యాలు గొప్పగా అభివృద్ధి చెందుతాయని విశ్లేషించారు.

సంపదలో పెరుగుదల : శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కలసి దర్శన మివ్వడం వల్ల, రాయల వారికి ప్రస్తుతం ఉన్న సంపద కంటే మించిన అసాధ్యమైన ఐశ్వర్యం లభిస్తుంది.

చక్రవర్తిత్వభాగ్యం : లక్ష్మీదేవి తెల్లని తామర పువ్వును ధరించి కనిపించడం ద్వారా రాయలవారు త్వరలోనే శ్వేతఛత్రం (తెల్లనిగొడుగు) నీడన ఊరేగే గొప్ప సార్వభౌమత్వాన్ని, చక్రవర్తిత్వాన్ని పొందుతారని సూచిస్తుంది.

సామంతుల విధేయత : స్వామివారు రాయల గురించి మాట్లాడుతూ “అనేక భాషలు మాట్లాడే రాజులు నిన్ను కొలుస్తున్నారు కదా” అని అనడం వల్ల భవిష్యత్లో విభిన్న భాషలు మాట్లాడే రాజులందరూ రాయల వారికి సామంతులుగా మారి, వారి ఆజ్ఞలను పాటిస్తారని అర్థం.

నూతన రాణి ఆగమనం : స్వామి తన ప్రియురాలి (గోదాదేవి) విశేషాలను వినడం తనకు ఇష్టమని చెప్పడం వల్ల, రాయల వారికి ఒక నూతన ప్రేయసి రాణిగా లభించబోతుందని విశ్లేషించారు.

సత్సంతానం మరియు ఆయుష్షు : కావ్యం రచిస్తే అభ్యుదయం కలుగుతుందని స్వామి దీవించడం వల్ల రాయల వారికి త్వరలోనే సత్సంతానం కలుగుతుందని, వారు సంపూర్ణ ఆయుర్థాయంతో వర్ధిల్లుతారని పండితులు ఆశీర్వదించారు.

ముగింపు : తుర్వసు వంశానికి చెందిన రాయలవారిని భగవంతుడు అనుగ్రహించడం కారణంగా ఇటువంటి అక్షయమైన ఫలితాలు లభించడం ఆశ్చర్యంకాదని, ఈ స్వప్నం సకల శుభాలకు సంకేతమని విద్వజ్జనులు సంతోషంతో విన్నవించారు.

II సంక్షిప్తరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
శ్రీకృష్ణదేవరాయలకు కలలో కనిపించిన ఆంధ్రమహావిష్ణువును వర్ణించండి.
జవాబు:
శ్రీకృష్ణదేవరాయలవారు శ్రీకాకుళ గుడిలో ఏకాదశినాడు, దర్భశయ్య మీద పడుకున్నారు. రాత్రిలో నాలుగవ ఝాము బహుశా తెల్లవారు ఝామున కల వచ్చింది. ఆ కలలో రాయల వారికి శ్రీకాళేశ్వర స్వామి దర్శనం ఇచ్చారు. శ్రీకాకుళ ఆంధ్ర విష్ణువు ఎలా ఉన్నాడంటే – ఆయనది దివ్యమైన మంగళరూపం. నల్లని మేఘాల రంగుని ఓడించేంతగా నీలం రంగులో ధగధగ మెరుస్తున్నాడు. ఆయన విశాలమైన కనులు తామరపూలలా మెరుస్తున్నాయి. ఆయన శరీరంపై బంగారు రంగు పట్టువస్త్రం కప్పి ఉంది. ఆ రంగు గరుత్మంతుని పచ్చని రెక్కల కాంతిని మించి ఉంది. ఆయన వక్షస్థలంపై ఉదయకాలపు సూర్యబింబాన్ని తలదన్నే కాంతితో కౌస్తుభమణి మెరిసిపోతోంది.

ఆంధ్ర విష్ణువు ప్రక్కన లక్ష్మీదేవి చిరునవ్వుతో నిలిచి ఉంది. ఆమె ఒక చేతిలో పద్మాన్ని, మరో చేతితో శ్రీవారి చేతిని పట్టుకుని పరమదయతో చూస్తు నిలబడి ఉంది. ఈ విధంగా రాయల వారికి అరవింద నేత్రుడైన, ఆంధ్ర విష్ణువు దర్శనమిచ్చాడు.

రాయలవారి కల Questions and Answers Summary Inter 2nd Year Telugu

ప్రశ్న 2.
కలలో కనిపించిన ఆంధ్ర మహావిష్ణువు రాయల వారిని ఏమని ఆజ్ఞాపించాడు?
జవాబు:
రాయల వారికి శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కలలో కనిపించాడు. ఆయన రాయలవారు గతంలో సంస్కృత భాషలో రచించిన ఈ క్రింది కావ్యాలను గుర్తు చేశాడు.

  1. సత్యవధూప్రీణనం
  2. జ్ఞానచింతామణి
  3. రసమంజరి

పై కావ్యాలను గుర్తుచేసి, ఇవన్నీ సంస్కృతంలో రాశావు కదా ! తెలుగులో ఒక కావ్యం రాయలేవా ? తెలుగు వల్లభుడైన నాకు ఆనందం కలిగించేట్లుగా తెలుగులో ఒక కావ్యాన్ని విశిష్టంగా నిర్మించు అని ఆజ్ఞాపించాడు.

ఇంకా కలలో మాట్లాడుతూ, నీవు ఏ కథ చెప్పాలా అని సందేహపడవద్దు. పురాణాలలో అనేక కథలు ఉన్నాయి. కానీ తానెంతో ప్రేమతో ధరించిన పూల దండను, అభిమానంతో నాకు సమర్పించిన ఒక చిన్నదాని కథ చెప్పు అని అన్నాడు. తరువాత మాట్లాడుతూ ఈ దేశమంతా తెలుగువారిది, నేను తెలుగు వల్లభుడను, తెలుగుభాష కలకండలాగా మధురమైనది, దేశభాషలలో తెలుగులెస్స – అందుకనే నేను, నిన్ను తెలుగులోనే కావ్యం రాయమని ఆజ్ఞాపిస్తున్నానని అన్నాడు.

ప్రశ్న 3.
తుమ్మపూడి కోటీశ్వరరావుగారి సాహిత్యసేవను తెల్పండి.
జవాబు:
తుమ్మపూడి కోటీశ్వరరావు గొప్ప అధ్యాపకులు, పరిశోధకులు. దానితో పాటూ మంచి సాహితీవేత్త. తెలుగుభాషా, సాహిత్యాల కోసం గుర్తించదగిన కృషి చేశారు. ఆయన కుమారభారతి, చితాభస్మం, తిరువెంబావై వంటి 7 కావ్యాలు వ్రాశారు. బాలచరిత, ధర్మాభిషేకం వంటి నాటకాలు ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు పాఠ్యగ్రంథాలుగా ఎంపిక అయ్యాయి. ఉపనిషత్తులపై వ్యాఖ్యానాలు, గీతోపన్యాసాలు మొదలైన వేదాంత గ్రంథాలు వ్రాశారు. వసంతోత్సవం వారి ప్రసిద్ధ నవల. ఎఱ్ఱన, నాచన సోమన, విశ్వనాథ మొదలైన వారి సాహిత్యంపై పలు రచనలు చేశారు. పాల్కురికి సోమనాథుని చెన్నమల్లు సీసాలు, ఆముక్తమాల్యదలపై వ్యాఖ్యానాలు వెలువరించారు. రసం – అలంకార సిద్ధాంతాలపై ‘సాలభంజిక’ అనే గ్రంథం వెలువరించారు.

ఇంకా వారు తిరుమల తిరుపతి దేవస్థాన అన్నమాచార్య, హరివంశం ప్రాజెక్టుల సంయుక్త సంచాలకులుగా వ్యవహరించారు. వారు ఆముక్తమాల్యద ప్రబంధానికి రచించిన ‘సౌందర్యలహరి’ వ్యాఖ్యానం ప్రసిద్ధి గాంచినది. కొందరి జీవిత చరిత్రలతో పాటు వారు పుట్టిన ‘ఈమని’ గ్రామచరిత్ర కూడా రాశారు. ఆయన జీవించినంత కాలం అక్షర సేద్యం చేసిన సాహితీ కృషీవలుడు, అభినవ భారతి కోటేశ్వరరావు గారు.

III ఏక వాక్యరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
శ్రీకృష్ణదేవరాయలు కొన్ని వారాలపాటు విడిది చేసిన ఊరు ఏది ?
జవాబు:
శ్రీకృష్ణదేవరాయలు కొన్ని వారాల పాటు విడిది చేసిన ఊరు బెజవాడ (విజయవాడ).

ప్రశ్న 2.
విష్ణుమూర్తి వక్షస్థలంపై ప్రకాశించే మణి ఏది ?
జవాబు:
విష్ణుమూర్తి వక్షస్థలంపై ప్రకాశించే మణి కౌస్తుభం.

ప్రశ్న3.
దేశభాషలందు తెలుగులెస్స అని రాయలవారితో పలికినదెవరు ?
జవాబు:
దేశభాషలందు తెలుగులెస్స అని శ్రీకాకుళ ఆంధ్రదేవుడు పలికాడు.

ప్రశ్న 4.
రాయలు తెలుగు ప్రబంధం వ్రాసి ఎవరికి అంకితమివ్వాలని స్వామి చెప్పాడు?
జవాబు:
శ్రీవేంకటేశ్వర స్వామికి అంకితమివ్వాలని చెప్పాడు.

రాయలవారి కల Questions and Answers Summary Inter 2nd Year Telugu

ప్రశ్న 5.
రాయలవారు ఆంధ్ర మహావిష్ణువు సన్నిధిలో ఉపవాసం ఉన్న తిథి ఏది?
జవాబు:
ఏకాదశి తిథినాడు రాయలవారు ఆంధ్ర మహావిష్ణువు సన్నిధిలో ఉపవాసం ఉన్నాడు.

ప్రశ్న 6.
ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావుగారి బిరుదు ఏది ?
జవాబు:
‘అభినవభారతి’ అనేది ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావుగారి బిరుదు.

రాయలవారి కల Summary in Telugu

రచయిత పరిచయం

పాఠ్యభాగం : రాయలవారి కల
రచయిత : తుమ్మపూడి కోటేశ్వరరావు
పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడింది. : ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావుగారు ఆముక్త మాల్యద ప్రబంధానికి రచించిన సౌందర్యలహరి వ్యాఖ్యానం నుండి గ్రహించబడింది.
జననం : 09-02-1934
జన్మస్థలము : గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో జన్మించారు.
తల్లిదండ్రులు : రాఘవమ్మ, వెంకటస్వామి
విద్యాభ్యాసం : ఈమని, దుగ్గిరాల, తెనాలి, విజయవాడ, హైదరాబాద్ లో చదువుకున్నారు.
ఉద్యోగ జీవితం : కరీంనగర్, శ్రీకాళహస్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తెలుగు అధ్యాపకునిగా పని చేశారు. 1968లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకునిగా ప్రవేశించారు. 1976 నుండి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో రీడరుగా, ఆచార్యునిగా పని చేశారు.
పదవులు : కేంద్రసాహిత్య అకాడమీ సలహా సంఘసభ్యులు తెలుగు విశ్వవిద్యాలయ పాలక సంఘసభ్యులు.
పరిశోధన : ఆముక్తమాల్యదా సౌందర్యం అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు.
నాటకాలు : కుందమాల, బాలచరిత, ధర్మాభిషేకం అనే మూడు నాటకాలు రాశారు.

రచనలు :

  1. కుమారభారతి,
  2. చితాభస్మం
  3. తిరువెంబావై లాంటి 7 కావ్యాలు రాశారు.

ఇతర రచనలు : వసంతోత్సవం అనే నవలను, అలాగే వారి స్వగ్రామంపై ఈమని చరిత్ర, కొన్ని జీవిత చరిత్రలు, ఎఱ్ఱన, సోమన, విశ్వనాథ వంటి వారి సాహిత్యంపై పలు రచనలు చేశారు. పాల్కురికి సోమనాథుని చెన్నమల్లు సీసాలు, ఆముక్త మాల్యదలపై వ్యాఖ్యానాలు రాశారు.
రసం : అలంకార సిద్ధాంతాలపై ‘సాలభంజిక’ అనే గ్రంథాన్ని రచించారు.
బిరుదులు : అభినవ భారతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు.
మరణం : 24.08.2023

పాఠ్యభాగ నేపథ్యం

విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తన రాజ్య విస్తరణలో భాగంగా చేపట్టిన తూర్పు దిగ్విజయ యాత్రలు అత్యంత ముఖ్యమైనవి. ఈ యాత్రల మూడవ దశలో రాయలవారు విజయవాడ సమీపాన యుద్ధ శిబిరాన్ని ఏర్పాటు చేసి, కొండపల్లి కోటను ముట్టడించడానికి సిద్ధమయ్యారు.

ఆ సమయంలో ఆయన శ్రీకాకుళం (కృష్ణాజిల్లా) లోని ఆంధ్ర మహావిష్ణువును దర్శించుకుని, స్వామికి ఐదు గ్రామాలను దానంగా ఇచ్చారు. ఆ రాత్రి రాయలవారి స్వప్నంలో ఆంధ్ర మహావిష్ణువు కనిపించి, తెలుగులో కావ్యాన్ని రచించమని ఆదేశించారు. ఈ అపురూపమైన చారిత్రక వృత్తాంతాన్ని రాయలవారు తన ‘ఆముక్తమాల్యద’ ప్రబంధంలో వివరించారు. ఆ విశేషాలనే విద్యార్థులకు వ్యాసరూపంలో అందించడం ఈ పాఠ్యభాగ నేపథ్యం.

పాఠ్యభాగ ఉద్దేశ్యం

ప్రపంచంలో ఎన్నో వేలభాషలు ఉన్నప్పటికీ, కేవలం తెలుగు వారికి మాత్రమే భాషా స్వరూపంతో కొలువబడే దైవం (ఆంధ్ర మహావిష్ణువు) ఉండటం విశేషం. శ్రీనాథుడు మొదలుకొని ఎందరో కవులను ఈ దైవం తెలుగులో రచనలు చేసేలాప్రేరేపించింది. స్వయంగా రాయలవారే స్వామి ఆదేశంతో తన కావ్య రచనను ప్రారంభించి విజయం సాధించారు. నేడు ప్రభుత్వం కూడా శ్రీకాకుళంలో “తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు” నిర్వహిస్తూ భాషా గౌరవాన్ని చాటుతోంది. విద్యార్థులు సైతం మన మాతృభాషను దైవంగా భావించి, గౌరవిస్తూ అన్ని రంగాల్లోనూ ముందుకు సాగాలన్నదే ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం.

రాయలవారి కల Questions and Answers Summary Inter 2nd Year Telugu

కఠిన పదాలకు అర్థాలు

74వ పేజి :

పూర్వము = గతము
జయించడం = గెలవడం
సకలం = మొత్తం
సన్నాహం = తయారుకావడం
దండు = సైన్యం
మార్గం = దారి
పరివారం = సేవకులు
రమ్యస్థలం = అందమైన స్థలం
కృష్ణవేణి = కృష్ణానది

76వ పేజి :

ఆవరణ = పరిసరాలు
దరయ్య = గడ్డిపరకలతో చేసిన పడక
ఝాము = 3 గంటల సమయం
దర్శనం = కనిపించడం
శ్యామవర్ణం = నీలం రంగు
మంగళ = శుభకరమైన
సౌందర్యం = అందం
వన్నె = రంగు
మేను = శరీరం
వక్షస్థలం = ఎద
కౌస్తుభం = విష్ణువు ఎద మీద ఉండే ఆభరణం
మణి = రత్నం
పద్మం = తామర
హస్తం = చేయి
కారుణ్యం = దయ
మందహాసం = చిరునవ్వు
జలజాక్షుడు = తామరపూల వంటి కన్నులు కలిగినవాడు
గీర్వాణం = సంస్కృతం
రసజ్ఞులు = సహృదయులు (సాహిత్యాన్ని ఇష్టపడేవారు)
ఒప్పారు = ప్రకాశించు
మెప్పు = పొగడ్త
సారం = రసం, చేవ
వల్లభుడు = అధిపతి, స్వామి
ఆంధ్రభాష = తెలుగుభాష
జగన్మోహనాకారుడు = భగవంతుడు
పరిపరి విధాల = అనేక విధాల
క్షేత్రం = తీర్థం, చోటు
జుగుప్స = అసహ్యం
ఏలిక = రాజు
ఆపత్కాలం = ఆపద కాలంలో
సాపేక్షం = పరస్పరం
కార్యం = పని
కలకండ = పటికబెల్లం
నిత్య౦ = రోజూ
లెస్స = మేలైనది
ఆనతి = ఆజ్ఞ

రాయలవారి కల Questions and Answers Summary Inter 2nd Year Telugu

77వ పేజి :

యోచన = ఆలోచన
అంకితం = కృతి ఇవ్వడం
జగత్ప్రసిద్ధుడు = లోకానికి బాగా తెలిసినవాడు
దైవం = దేవుడు
అదృశ్యం = కనిపించకుండా పోవడం
సంభ్రం = ఆశ్చర్యం
కాంచనం = బంగారం
కలశం = గుడిగోపురాలపై మొనదేలి నట్టుండే అగ్రభాగం మీది ఘటాకారపాత్ర
కాలోచిత విధులు = కాలకృత్యములు
సామంతులు = ఇరుగు పొరుగు రాజులు
నియోగాలవారు = పనివారు
పెందలకడ = చీకటి పడక ముందు (ప్రొద్దుపోక ముందు)
శిబిరం = సైన్యం విడిది చేసే చోటు
విద్వజ్జనులు = విద్వాంసులు
భాగ్యవంతులు = అదృష్టవంతులు
స్వప్నం = కల
సారస్వతం = సాహిత్యం
సాక్షాత్కారం = ఎదురుగా నిలబడుట
వెల్లి = ప్రవాహం
ఐశ్వర్యం = సంపద
చక్రవర్తి = రాజు, సార్వభౌముడు
ఉత్తరోత్తర విభిన్న = తరువాత కాలంలో
విభిన్న = రకరకాల
ఒద్ధిక = వినయం
భోగము = సుఖము
అభ్యుదయం = మంగళం, శుభం
సత్సంతానము = మంచి సంతతి
అనుగ్రహం = కృప, దయ
పూర్ణాయువు = సంపూర్ణమైన ఆయుషు
వర్ధిల్లు = పెరగడం
అక్షయఫలాలు = తరగని సంపద
విన్నవించడం = తెలియజేయడం