AP Inter 1st Year Telugu Grammar లేఖారచన

Reviewing AP Inter 1st Year Telugu Study Material Grammar లేఖారచన can help students prepare confidently for exams.

AP Intermediate 1st Year Telugu Grammar లేఖారచన

లేఖ అంటే జాబు, ఉత్తరం. లేఖ లిఖిత సంప్రదాయానికి చెందింది. ఒక చోటు నుండి మరో చోటుకు, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సమాచారాన్ని చేరవేయడానికి ఉపయోగపడే రచనా మాధ్యమం లేఖ. ‘ఉత్తరం రాయడం’ ఒక కళ. ఆత్మీయతకు చిహ్నంగా, మర్యాదస్తుల లక్షణంగా, అవసరానికి బంధువుగా, ఆవేశానికి ఆయుధంగా, ప్రేమకు కానుకగా ఉత్తరాలు ఉపయోగపడుతున్నాయి.

లేఖ స్వరూపాన్ని పరిశీలిస్తే ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవలసిన అంశాలు ఇవి

  1. ఉత్తరం రాసేవారి చిరునామా, తేది
  2. సంబోధన (పిలుపు)
  3. ఉత్తరంలో చెప్పదలుచుకున్న ప్రధాన విషయం
  4. ముగింపు
  5. లేఖ రాసినవారి సంతకం
  6. ఎవరికి రాస్తున్నామో వారి చిరునామా

1. ఉత్తరం రాసేవారి చిరునామా, తేది

ఎవరు లేఖను రాస్తున్నారో వారి చిరునామా లేఖ పైభాగంలో కుడి పక్కన రాయాలి. సంక్షిప్తంగా ఉత్తరం ఎక్కడి నుంచి రాస్తున్నామో ఆ ప్రదేశం పేరు రాసినా సరిపోతుంది. లేఖా రచనలో విరామ చిహ్నాలకు ప్రాధాన్యం ఉంటుంది. దాని కింద తేదీని తప్పనిసరిగా రాయాలి. చిరునామా రాసేటప్పుడు వారి పేరు తర్వాత కామా, ఊరిపేరు తరువాత కామా, ఆనాటి తేదీ తరువాత ముగింపు చుక్క (ఫుల్స్టాప్) ఉండాలి.

2. సంబోధన (పిలుపు)

లేఖ ఎవరికి రాస్తున్నామో వారిని సంబోధిస్తూ ఎడమ వైపు రాయాలి. మనం లేఖ రాస్తున్నవారితో ఉన్న అనుబంధాన్ని బట్టి సంబోధన మారుతూ ఉంటుంది. తల్లిదండ్రులకు రాసే సందర్భంలో ప్రారంభంలో భాగంగా –

పూజ్యులయిన నాన్నగారికి / అమ్మగారికి అనీ

స్నేహితులకైతే – ప్రియ మిత్రునికి / ప్రాణస్నేహితునికి / ప్రియమైన రవికి అనీ

పరిచయం లేనివారికి, అధికారులకు – అయ్యా/అమ్మా అని సంబోధించాలి. అంతగా పరిచయం లేని మిత్రులకు ఉత్తరం రాసేటపుడు పేరుకు ముందు శ్రీ / శ్రీమతి / కుమారి లాంటివి చేర్చాలి. బంధువుల విషయంలో ‘ప్రియమైన అన్నయ్యకు / తమ్మునికి / అక్కయ్యకు / మామయ్యకు / చెల్లికి’ అని పేర్కొనాలి. మనం ఉత్తరం రాస్తున్న వారికి మనతో ఉన్న అనుబంధాన్ని బట్టి సంబోధన మారుతూ ఉంటుంది.

వివాహిత స్త్రీలకు ‘శ్రీమతి’, అవివాహిత స్త్రీలకు ‘కుమారి’, చిన్న పిల్లలకు ‘చిరంజీవి’ అని సంబోధించి రాయాలి. అధికారులకు రాసే లేఖల్లో గౌరవనీయు లైన, మహారాజ రాజశ్రీ, మాన్యశ్రీ అనీ సంబోధన అవసరం.

సంబోధన ఉత్తరం ఎడమవైపు ఉంటుంది. దీని తర్వాత కామాను ఉంచాలి.

3. ఉత్తరంలో చెప్పదలచుకున్న ప్రధాన విషయం

సంబోధన క్రిందుగా కొంచెం కుడివైపు నుంచి ప్రధాన విషయాన్ని ప్రారంభించాలి. వ్యక్తిగత ఉత్తరాల్లో తమకంటే పెద్దలైనవారికి వందనాలు, నమస్కారాలు; చిన్నవారికి దీవెనలు, ఆశీస్సులు తెలియచేయాలి. క్షేమ సమాచారాలు ఇచ్చి పుచ్చుకోవడం తెలుగువారి సంప్రదాయం. అధికారిక ఉత్తరాల్లో అవసరం లేదు.

‘ప్రధాన విషయం’ అంశంలో భాష సరళంగా ఉండాలి. విషయం సూటిగా, సంక్షిప్తంగా ఉండాలి. విషయం విస్తారమైనపుడు పేరాలుగా విభజించి రాయాలి.

AP Inter 1st Year Telugu Grammar లేఖారచన

4. ముగింపు

లేఖ ముగింపులో కుడివైపున అనుబంధాన్ని, గౌరవాన్ని సూచించే పదం రాయాలి. ఉదాహరణకు స్నేహితునికైతే ప్రియమిత్రుడు / ప్రాణ స్నేహితుడు వంటి పదాలు, తల్లిదండ్రులకైతే ప్రియ పుత్రుడు / ప్రియ పుత్రిక వంటి పదాలు రాయాలి. వ్యాపార, వ్యవహార, అధికారిక లేఖల్లో భవదీయుడు, విశ్వాస పాత్రుడు లాంటి పదబంధాలను ఉపయోగించాలి.

5. లేఖ రాసినవారి సంతకం

ముగింపుకి కొంచెం క్రింద ఉత్తరం రాసేవారు సంతకం చేయాలి. అవసరం మేరకు సంతకం క్రింద కుండలీకరణంలో ఉత్తరం రాసేవారి పూర్తి పేరు విడి అక్షరాల్లో రాయాలి.

6. ఎవరికి రాస్తున్నామో వారి చిరునామా

ముగింపు తర్వాత ఉత్తరం రాసినవారి సంతకం ఉంటుంది కదా. దానికి ఒక గీత క్రింద ఎడమ వైపున ఉత్తరం ఎవరికి చేరాలో వారి పూర్తి చిరునామా పిన్కోడ్తో సహా రాయాలి. అధికారులకు రాసే ఉత్తరంలో ప్రారంభంలో ఎడమవైపు ఉత్తరం రాసేవాళ్ళ చిరునామా, దాని క్రింద ఎవరికి ఉత్తరం రాస్తామో వారి చిరునామా రాయాల్సి ఉంటుంది.

పరీక్షలో తీసుకోవలసిన జాగ్రత్తలు :

  1. పరీక్షల్లో భాగంగా లేఖా రచనలో అభ్యర్థుల హాల్టికెట్ నెంబరు, చరవాణి నంబరు, పేరు, చిరునామాలు వ్రాయకూడదు. వాటి స్థానంలో XXXXXXX అని రాసి విరామ చిహ్నాలు ఉపయోగించాలి.
  2. ఉద్యోగాల కోసం, పత్రికలకు కథలు, కవితలు రాసేటపుడు జవాబు కోసం స్టాంపులు అంటించిన చిరునామా కవరు జత చేయాలి.

నమూనా లేఖలు

1. కళాశాల ప్రధానోపాధ్యాయులు గారికి లేఖ

స్థలం : X X X X,
తేదీ : × × × X.

గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి,
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
X X X X X,
X X X X X.

ఆర్యా,

విషయం : రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలకు వెళ్ళడానికి 3 రోజులు సెలవు కొరకు విజ్ఞప్తి.

నేను తమ కళాశాలలో ఎమ్.పి.సి. ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించబోయే వ్యాసరచన పోటీలకు నేను ఎంపిక అయ్యాను. ఆ పోటీలకు విజయవాడ వెళ్ళవలసి ఉన్నది. పోటీలో పాల్గొనడానికి, వెళ్ళి తిరిగిరావడానికి, నగరంలో జరుగుతున్న పుస్తక మహోత్సవాన్ని సందర్శించడానికి నాకు 3 రోజులు సెలవు ఇప్పించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.

ధన్యవాదాలు,

ఇట్లు,
తమ విశ్వసనీయ విద్యార్థి,
X X X X X.

AP Inter 1st Year Telugu Grammar లేఖారచన

2. విహారయాత్ర గురించి మిత్రునికి లేఖ.

స్థలం : X X X X,
తేదీ : X X X X.

ప్రియమైన మిత్రుడు వసంత్కు మనోజ్ రాయునది,

నేనిక్కడ క్షేమంగా ఉన్నాను. నీ క్షేమాన్ని సదా కోరుకుంటున్నాను. వారంరోజుల క్రితం మా కళాశాల అధ్యాపకులతో కలిసి మేమంతా అరకులోయ విహారయాత్రకు వెళ్లాము. ఉదయాన్నే విశాఖపట్టణం వెళ్లి అక్కడ నుండి అరకు మీదుగా వెళ్లే కిరండోల్ రైలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అల బోగీలో ఎక్కాము. కొండల మధ్య ప్రయాణం దారిలో ఎన్నో జలపాతాలు, లోతైన లోయలు, వంతెనలు, అంతా పచ్చని అడవి ఎంతో ఆహ్లాదంగా ఉంది. మేఘాలతో దోబూచులాడుతూ, కొండలను తొలిచి వేసిన రైలు మార్గంలో ప్రయాణిస్తూ అరకు చేరాము. భోజనాలయ్యాక కాఫీ, మిరియాల తోటలను చూశాము. చాపరాయి జలపాతానికి వెళ్లాము. సాయంత్రం పద్మావతి ఉద్యానవనాలు, గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను తెలిపే ప్రదర్శనశాలను చూశాము. రాత్రికి పర్యాటకశాఖ వారు ఏర్పాటు చేసిన ‘థింసా’ నృత్యాన్ని చూసి మా బసకు చేరుకున్నాము. మరుసటిరోజు ఉదయం అరకు విశాఖపట్టణం బస్సు ఎక్కి మార్గమధ్యంలో ప్రఖ్యాత బొర్రా గుహలను కూడా దర్శించి ఇంటికి చేరుకున్నాము. ఈ విహారయాత్ర మాకెంతో విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించింది.. అన్ని విషయాలతో నాకు తిరిగి ఉత్తరం రాయగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
మనోజ్.

చిరునామా :
X X X X X,
X X X X X,
X X X X X.

3. గ్రామంలో ఉన్న పారిశుద్ధ్య సమస్యను వివరిస్తూ మండల అభివృద్ధి అధికారి వారికి లేఖ.

స్థలం : X X X X,
తేదీ : X XXX.

శ్రీయుత మండల అభివృద్ధి అధికారి గారికి,
X X X X X.

ఆర్యా,

విషయం : మా గ్రామంలో నెలకొని ఉన్న పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించడం – గురించి.

మా గ్రామంలో నాలుగురోజుల క్రితం ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు కురిశాయి. మురుగు కాలువలలో చెత్త పేరుకుపోయి నీరు ఎక్కడికక్కడ నిలువ ఉండిపోయింది. వీధులన్నీ మురికి నీటితో నిండిపోయాయి. పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. తాగునీరు కూడా కలుషితం అయింది. విషజ్వరాలతో గ్రామస్థులు బాధపడుతున్నారు. కలరా, డయేరియా వంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంది.

కాబట్టి మీరు తక్షణమే స్పందించి సంబంధిత అధికారులను పంపించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టవలసిందిగా మనవి చేస్తున్నాను.

ధన్యవాదాలు,

ఇట్లు,
తమ విశ్వసనీయ,
X X X X X.

చిరునామా :
X X X X X,
X X X X X,
X X X X X.

4. చదువు గురించి వివరిస్తూ తల్లిదండ్రులకు లేఖ

స్థలం : X X X X,
తేదీ : X X X X,

పూజనీయులైన అమ్మా నాన్నలకు నమస్కరించి రాయునది ఏమనగా,

నేను క్షేమం. మీరు క్షేమమని తలుస్తాను. మా కళాశాలలో అధ్యాపకులు పాఠ్యాంశాలను వివరణాత్మకంగా బోధిస్తున్నారు. విశాలమైన తరగతి గదులు, డిజిటల్ విద్యాబోధన, స్నేహపూర్వక వాతావరణంతో కళాశాల ప్రాంగణం చదువుకునేందుకు చాలా అనుకూలంగా ఉంది. కళాశాలకు పెద్ద ఆటస్థలం కూడా ఉంది. ప్రముఖ వ్యక్తులను తీసుకువచ్చి స్ఫూర్తిదాయక ఉపన్యాసాలను కూడా చెప్పిస్తున్నారు.

మొన్న జరిగిన అర్ధవార్షిక పరీక్షలలో ప్రథమశ్రేణి మార్కులు వచ్చాయి. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే వార్షిక పరీక్షలలో ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకునే విధంగా కష్టపడి చదువుతున్నాను. సంక్రాంతి సెలవులకు ఇంటికి వస్తాను. నానమ్మ, తాతయ్యలను అడిగినట్లు చెప్పండి.

ఇట్లు,
మీ కుమారుడు,
X X X X X.

చిరునామా :
X X X X X,
X X X X X,
X X X X X.

AP Inter 1st Year Telugu Grammar లేఖారచన

5. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటూ లేఖ

స్థలం : X X X X,
తేదీ : X X X X.

శ్రీయుత గౌరవనీయులైన డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ గారికి,

విషయం : గ్రామీణ తపాలా ఉద్యోగి – ఉద్యోగం కొరకు విజ్ఞప్తి.

ఆధారం : ఇటీవల వార్తాపత్రికలలో వచ్చిన ప్రకటనలు.

అయ్యా,

తమరు పత్రికాముఖంగా గ్రామీణ తపాలా ఉద్యోగిగా పనిచేయడానికి తగిన అభ్యర్థులు కావాలని ప్రచురించిన ప్రకటనలు చదివాను. ప్రస్తుతం నేను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఆర్ట్స్ గ్రూపులో చదువుకుంటున్నాను. 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాను. కంప్యూటర్ విద్యలో కూడా పరిజ్ఞానం ఉంది. సదరు ఉద్యోగానికి కావలసిన అర్హతలన్నీ నాకు ఉన్నాయి. కనుక వాటిని పరిశీలించి నాకు ఉద్యోగ అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాను.

నమస్కారాలతో ………………….

ఇట్లు,
తమ విశ్వసనీయుడు,
X X X X X.

జతచేసిన ద్రువ పత్రాల నకళ్ళు:

  1. పదవ తరగతి ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం,
  2. జనన, కుల ధ్రువీకరణ పత్రం,
  3. కంప్యూటర్ పరిజ్ఞాన ధ్రువీకరణ పత్రం,
  4. ఆధార్ కార్డు.

అదనపు లేఖలు

ప్రశ్న1.
తల్లిదండ్రులకు లేఖ

మీ ఇంటర్మీడియట్ చదువును గురించి, మీ తల్లిదండ్రులకు లేఖ రాయండి.
జవాబు.

స్థలం : ………………………..
తేదీ : ………………………..

పూజ్యులైన అమ్మకూ, నాన్నకూ,

నమస్కారాలు. నేను క్షేమంగా ఉన్నాను. మీరు క్షేమం అని, తలుస్తాను. నేను బాగా చదువుకుంటున్నాను. నా ఆరోగ్యం, బాగుంది. ఉదయము లేవగానే, యోగాసనాలు వేస్తున్నాను.

మా గురువులు చెప్పే పాఠాలను, శ్రద్ధగా చదువుతున్నాను. ప్రతిరోజూ కళాశాల గ్రంథాలయానికి వెళ్ళి, దినపత్రికలు చదువుతున్నాను. మా పాఠ్యాంశములకు సంబంధించిన, రిఫరెన్సు గ్రంథాలను, పరిశీలిస్తున్నాను. ప్రతి వారం మాకు జరిగే పరీక్షలలో, నాకు మంచి మార్కులు వస్తున్నాయి. లెక్కలు, సైన్సు విషయాలకు, మంచి ప్రాధాన్యం ఇస్తున్నాను.

ఇక్కడ మా ఉపన్యాసకులు, మాకు శ్రద్ధగా బోధిస్తున్నారు. తప్పక మీ ఆశయాలు నెరవేర్చడానికి కృషి చేస్తాను. మామ్మకు, తాతయ్యకు నా నమస్సులు. చెల్లెలు పద్మకు నా ఆశీస్సులు. నా మిత్రులను అడిగినానని చెప్పండి. సంక్రాంతి సెలవులకు మన ఊరు వస్తాను. ఉంటాను.

నమస్సులతో,

మీ ప్రియ పుత్రుడు, / పుత్రిక,
X X X X X X X.

చిరునామా
X X X X X X,
X X X X X,
X X X X,
X X X.

AP Inter 1st Year Telugu Grammar లేఖారచన

ప్రశ్న 2.
అధికారికి లేఖ

విద్యుత్ కోత సమస్యను గురించి తెలుపుతూ సంబంధిత అధికారికి లేఖ రాయండి.
జవాబు.

స్థలం : ………………………..
తేదీ : ………………………

స్థానిక డివిజనల్ ఇంజనీరు గారికి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ,
అనంతపురం.

విషయము : ఇంటరు పబ్లిక్ పరీక్షల సమయంలో విద్యుత్ కోత నివారణ గురించి విజ్ఞప్తి.

ఆర్యా ! / అమ్మా !

నమస్కారాలు. నేను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటరు మొదటి సంవత్సరము చదువుతున్నాను. రాబోయే మార్చి నెలలో, మాకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఇప్పటికే మన నగరంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. వచ్చే నెలలో కోతలు మరింత ఎక్కువ కావచ్చును. పరీక్షలకు మేము శ్రద్ధగా చదువుకోవడానికి, రాత్రివేళల్లో విద్యుచ్ఛక్తి చాలా అవసరం. పరీక్షలు, మా జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. మేము గత సంవత్సరం పదవ తరగతి పరీక్షలలో, రాత్రి దీపాలు లేక చాలా బాధపడ్డాము. ఈ సంవత్సరం మార్చి నెలలో, రాత్రివేళల్లో విద్యుత్ కోత లేకుండా, దయతో చూడండి. మా విద్యార్థుల భవితను దృష్టిలో ఉంచుకొని, విద్యుత్ కోత లేకుండా చేయండి.

నమస్కారాలతో,

మీ విధేయుడు, / విధేయురాలు,
X X X X X.

చిరునామా :
X X X X X X X.
X X X X X,
X X X X,
X X X X X.