AP Inter 1st Year Telugu Grammar సమాసాలు

Reviewing AP Inter 1st Year Telugu Study Material Grammar సమాసాలు can help students prepare confidently for exams.

AP Intermediate 1st Year Telugu Grammar సమాసాలు

వేరు వేరు అర్థాలు కలిగిన రెండు పదాలు కలిసి ఒకే అర్థవంతమైన పదంగా ఏర్పడితే, దానిని ‘సమాసము’ అని అంటారు.

దీనినే పరవస్తు చిన్నయసూరి, తన ‘బాలవ్యాకరణము’లో, ‘సమర్ధంబులగు పదంబు లేక పదంబగుట సమాసంబు” అని నిర్వచనమును ఇచ్చాడు.
ఉదా : రాజు, ఆజ్ఞ అనేవి రెండు వేరు వేరు పదములు. ఆ పదములకు వేరు, వేరు అర్థములు ఉన్నాయి. ఆ రెండు పదాలు కలిసి, ‘రాజాజ్ఞ’ అనే సమాసం ఏర్పడుతుంది.

“రామ”, “బాణము” అనేవి రెండు వేరు వేరు పదాలు. వాటికి వేరు వేరు అర్థాలున్నాయి. ఈ రెండు పదాలు కలిసి “రామబాణము” అనే సమాసం ఏర్పడింది.

విగ్రహవాక్యం : రెండు పదాలను సమాసంగా చేసినపుడు ఆ సమాసాల మధ్య లోపించిన విభక్తి ప్రత్యయాలను చేర్చి సమాసం యొక్క అర్థాన్ని వివరించడాన్ని, “విగ్రహవాక్యం” అంటారు.
ఉదా : ‘రాజాజ్ఞ’ అనే సమాసమునకు, ‘రాజు యొక్క ఆజ్ఞ’ అనేది విగ్రహవాక్యం.

పూర్వపదము : సమాసంలోని మొదటి పదాన్ని “పూర్వపదము” అని అంటారు.
ఉదా : ‘రాజాజ్ఞ’ అనే సమాసములో, ‘రాజు’ అనేది పూర్వపదము.

ఉత్తరపదము : సమాసంలోని రెండవ పదాన్ని, ‘ఉత్తరపదము’ లేదా ‘పరపదము’ అని అంటారు. పైన చెప్పిన ‘రాజాజ్ఞ’ అనే సమాస పదములో, ‘ఆజ్ఞ’ అనే పదము, “ఉత్తరపదము” (లేదా) పరపదము అవుతుంది.

సమాసాలు ప్రధానముగా మూడు రకాలు : అవి

  1. తత్పురుషము
  2. బహువ్రీహి
  3. ద్వంద్వము.

AP Inter 1st Year Telugu Grammar సమాసాలు

తత్పురుషం

ఉత్తర పదార్థ ప్రధానంగా గల సమాసం తత్పురుషం. అంటే సమాసంలోని రెండవ పదానికి ప్రాధాన్యం ఉంటుంది. ఇది వ్యధికరణం, సమానాధికరణం అని రెండు రకాలు.

1) వ్యధికరణము :
వి + అధికరణం = వ్యధికరణం
‘వి’ అంటే భిన్నమైన అనీ, అధికరణం అంటే ఆధారం అనీ అర్థం. ద్వితీయా విభక్తి మొదలుకొని సప్తమీ విభక్తి వరకు గల అర్థవంతమైన పదాలు గల సమాసమే వ్యధికరణ సమాసం.

అ) ప్రథమా తత్పురుష సమాసము :
వివరణ : దీనిలో మొదటి పదం ప్రథమా విభక్తిలో ఉంటుంది. సమాసం పూర్తి కాగానే లోపిస్తుంది.
ఉదా :

  1. నడిసముద్రం – సముద్రపు నడుమభాగం
  2. అర్ధరాజ్యం – రాజ్యపు అర్ధభాగం

ఆ) ద్వితీయా తత్పురుష సమాసము :
వివరణ : దీనిలో మొదటి పదం చివర ‘నిన్, నున్, లన్, గూర్చి, గురించి’ అనే విభక్తి ప్రత్యయాలు చేరతాయి.
ఉదా : 1. సేతుబంధనం – సేతువును నిర్మించడం

ఇ) తృతీయా తత్పురుష సమాసము :
వివరణ : దీనిలో మొదటి పదం చివర ‘చేతన్, చేన్, తోడన్, తోన్’ అనే విభక్తి ప్రత్యయాలు చేరతాయి.
ఉదా :

  1. అద్దాల మేడ – అద్దాలతో మేడ
  2. భక్తి సాధ్యులు – భక్తి చేత సాధ్యులు

ఈ) చతుర్థీ తత్పురుష సమాసము :

వివరణ : దీనిలో మొదటి పదం చివర ‘కొఱకున్, కై’ అనే విభక్తి ప్రత్యయాలు చేరతాయి.
ఉదా :

  1. సీతాన్వేషణ – సీత కొరకు అన్వేషణ
  2. విశ్వశాంతి – విశ్వం కొరకు శాంతి

ఉ) పంచమీ తత్పురుష సమాసము :
వివరణ : దీనిలో మొదటి పదం చివర ‘వలనన్, కంటెన్, పట్టి’ ప్రత్యయాలు చేరతాయి.
ఉదా :

  1. స్ఫోటనరవం – స్ఫోటన వలన రవం
  2. ఆనందబాష్పాలు – ఆనందం వలన బాష్పాలు

ఊ) షష్ఠీ తత్పురుష సమాసము :
వివరణ : దీనిలో మొదటి పదం చివర ‘కిన్, కున్, యొక్క, లోన్, లోపల’ అనే విభక్తి ప్రత్యయాలు చేరతాయి.
ఉదా :

  1. శంఖధ్వానము – శంఖము యొక్క ధ్వానము
  2. రాజశాసనము – రాజు యొక్క శాసనము
  3. తల్లిమాటలు – తల్లి యొక్క మాటలు
  4.  శిరోవేదన – శిరస్సునకు వేదన
  5.  కపినాథుడు – కపులకు నాథుడు

ఋ) సప్తమీ తత్పురుష సమాసము :
వివరణ : దీనిలో మొదటి పదం చివర ‘అందున్, నన్’ అనే విభక్తి ప్రత్యయాలు చేరతాయి.
ఉదా :

  1. వనవాసి – వనము నందు వసించువాడు
  2. మాటనేర్పరి – మాటల యందు నేర్పరి

ౠ) నఞ తత్పురుష సమాసము :
వివరణ : విగ్రహవాక్యం ‘కానిది, లేనిది’ అనే వ్యతిరేక అర్థాన్ని బోధిస్తే నఞ తత్పురుష సమాసం అంటారు.
ఉదా :

  1. అహింస – హింస కానిది
  2. అలఘుడు – తక్కువ కాని వాడు
  3. నిర్దయుడు – దయలేనివాడు

AP Inter 1st Year Telugu Grammar సమాసాలు

2) సమానాధికరణము :
సమాన + అధికరణం = సమానాధికరణం
విశేషణానికి, విశేష్యం (నామవాచకం)తో జరిగే సమాసాన్ని ‘సమానాధి కరణం’ అంటారు. దీనినే ‘కర్మధారయ సమాసం’ అని కూడా అంటారు. ఇది ఏడు రకాలు

అ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం :
వివరణ : ఈ సమాసంలో విశేషణం పూర్వపదంగా విశేష్యం ఉత్తరపదంగా ఉంటాయి.
ఉదా :

  1. శీతలవాయువు – శీతలమైన వాయువు
  2. నల్లరాతి – నల్లనైన రాయి
  3. మహావృక్షము – గొప్పదైన వృక్షము
  4. నిండునదులు – నిండైన నదులు

ఆ) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం :
వివరణ : ఈ సమాసంలో విశేషణం ఉత్తరపదంగా విశేష్యం పూర్వపదంగా ఉంటాయి.
ఉదా : 1. వృక్షరాజము – శ్రేష్ఠమైన వృక్షము

ఇ) విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం :
వివరణ : ఈ సమాసంలో పూర్వోత్తర పదాలు రెండూ విశేషణాలుగా ఉంటాయి.
ఉదా :

  1. భక్తివైరాగ్యములు – భక్తియును, వైరాగ్యమును
  2. దానధర్మములు – దానమును, ధర్మమును

ఈ) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం :
వివరణ : ఈ సమాసంలో ఉపమానం పూర్వపదంగా, విశేష్యం (నామవాచకం) ఉత్తరపదంగా ఉంటుంది.
ఉదా :

  1. తేనెపలుకులు – తేనె వంటి పలుకులు
  2. మేఘచ్చాయ – మేఘము వంటి ఛాయ

ఉ) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం :
వివరణ : ఈ సమాసంలో ఉపమానం ఉత్తరపదంగా, విశేష్యం పూర్వపదంగా ఉంటుంది.
ఉదా :

  1. పదాబ్జములు – అబ్జముల వంటి పాదములు
  2. చరణ కమలాలు – కమలాల వంటి చరణాలు

ఊ) అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం :
వివరణ : దీనినే రూపక సమాసమని అంటారు. రూపకం అంటే ఆరోపించటం అని అర్థం. సమాసంలోని ఉత్తరపదం ఉపమానంగా ఉంటుంది. ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించటాన్ని రూపక
సమాసం అంటారు.
ఉదా :

  1. కీర్తిమేఘములు – కీర్తి అనెడి మేఘములు
  2. భాషావధూటి – భాష అనెడి వధూటి

ఋ) సంభావన పూర్వపద కర్మధారయ సమాసం :
వివరణ : సంభావన అంటే సంబోధన, గుర్తు అని అర్థం. పూర్వపదం సంబోధనగా ఉత్తరపదం జాతివాచకంగా ఉంటుంది.
ఉదా :

  1. భరతఖండము – భరత అనే పేరు గల ఖండము
  2. కృష్ణానది – కృష్ణ అనే పేరు గల నది

3) ద్విగు సమాసం : “సంఖ్యా పూర్వకం ద్విగువు” ఈ సమాసంలో సాధారణంగా పూర్వపదం సంఖ్యావాచకంగా ఉత్తరపదం నామవాచకంగా ఉంటుంది.
ఉదా :

  1. ముల్లోకములు – మూడు అయిన లోకములు
  2. దశదిశలు – పది అయిన దిక్కులు (లేదా) పది సంఖ్య గల దిక్కులు
  3. శతయోజనాలు – శత సంఖ్య గల యోజనాలు

AP Inter 1st Year Telugu Grammar సమాసాలు

4) బహువ్రీహి సమాసం : ‘అన్యపదార్థ ప్రధానము బహువ్రీహి’. బహువ్రీహి అంటే సమాసంలోని పదాల అర్థాలు కాక మరొక అర్థం ప్రధానంగా ఉంటుంది. విగ్రహవాక్యంలో ‘కలది, కలవాడు’ అనే పదాలు సమాస పదాలకు చివరన చేరతాయి.
ఉదా :

  1. ముక్కంటి – మూడు కన్నులు కలవాడు (శివుడు)
  2. కమలాక్షుడు – కమలములు వంటి అక్షులు కలవాడు (శ్రీహరి)
  3. వృకోదరుడు – వృకము (తోడేలు) వంటి ఉదరము కలవాడు (భీముడు)
  4. కలకంఠకంఠి కోకిల వంటి కంఠం కలది (స్త్రీ)

5) ద్వంద్వ సమాసం : ‘ఉభయ పదార్థ ప్రధానం’ గల సమాసం ద్వంద్వం. సమాసంలోని రెండు పదాల అర్థాలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. ఈ సమాసంలోని రెండు పదాలూ నామవాచకాలై ఉంటాయి.
ఉదా :

  1. యక్షరాక్షసులు – యక్షులును, రాక్షసులును
  2. సురాసురులు – సురులును, అసురులును
  3. సిద్ధసాధ్యులు – సిద్ధులును, సాధ్యులును