Reviewing AP Inter 2nd Year Telugu Study Material పద్యభాగం 1st Poem చారుచర్య Questions and Answers Summary can help students prepare confidently for exams.
AP Inter 2nd Year Telugu చారుచర్య Questions and Answers
అభ్యాసం
I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
దంతధావన, స్నాన, పుష్పధారణ పద్ధతులను వివరించండి.
జవాబు:
ప్రతిరోజూ ప్రాతఃకాలాననే నిద్ర నుండి మేల్కొనాలి. ఆలస్యం చేయకుండా దంతధావనం చేయాలి. అందుకోసం వేప, కానుగ, చండ్ర, మద్ది మొదలైన ఔషధ విలువలు కలిగిన పుల్లలను ఉపయోగించాలి. వివిధ వృక్ష జాతులకు సంబంధించిన పుల్లలను దంతధావనానికి ఉపయోగించడం వలన వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కనుక వాటిని తెలుసుకొని వినియోగించు కోవాలి. శుభ్రంగా దంతధావనం చేయడం వలన కఫం, పైత్యం హరించుకు పోయి, నాడీ మండలం శుద్ధి అవుతుంది.
ఆపై చక్కగా గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం వలన శరీరం కాంతివంతంగా తయారై రోజంతా ఉత్తేజంగా ఉంటారు. స్నానానంతరం చక్కగా తలదువ్వుకొని, కాలానికి తగిన లేపనాలను పూసుకోవాలి. సువాసనను, ఆరోగ్యాన్ని ప్రసాదించే గేదగి, గన్నేరు, మొల్ల, పొగడ, సంపెంగల వంటి పుష్పాలను ధరించాలి. ఇవి ధరించడం వలన స్త్రీ పురుషులకు త్రిదోషాలు హరించుకుపోతాయి. చలువ చేస్తుంది.
ప్రశ్న 2.
వస్త్రధారణ, భోజన, తాంబూల సేవన పద్ధతులను వివరించండి.
జవాబు:
ఋతువులననుసరించి వస్త్రధారణ చెయ్యాలి. కాలిపోయినవి, కన్నాలు పడినవి అయిన వస్త్రాలు ధరించరాదు. ఎవరి తాహతుకు తగినట్లుగా వారు ఆయా వారాలలో ఆయా రత్నాలు పొదిగిన ఆభరణాలు ధరించాలి. ఉన్నంతలో దానధర్మాలు చేయాలి. మన చుట్టూ ఉన్న వారికి పెట్టాకే మనం భుజించాలి. సాధ్యమైనంత వరకు భోజనం ఒంటరిగా కాకుండా పదిమందితో కలసి తినాలి.
భోజన సమయంలో భోక్త గాని, దాత గాని కోపావేశాలకు లోనయితే ఆ ఆహారం విషంతో సమానమవుతుంది. మధురంగా ఉన్నాయని పదార్థాలు అతిగా తినకూడదు. భోజనం మధ్యలో అతిగా నీరు త్రాగకూడదు. అన్నం తినడానికి, నీరు తాగడానికి క్రమపద్ధతిని పాటించాలి. భోజనానంతరం కొద్దిదూరమైనా నడవాలి. అలా నడిచాక పైత్యాంతకమైన తాంబూలాన్ని సేవించాలి. తాంబూల సేవనం వలన ఒనగూరే ప్రయోజనాలు అనేకం. తాంబూలంలో వేసుకునే సున్నం త్రిదోషాలను హరిస్తుంది. మంచి ఆహారాన్ని స్వీకరిస్తూ ప్రశాంత జీవనం గడపాలి.
II సంక్షిప్తరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
భూషణ ధారణ పద్ధతిని వివరించండి.
జవాబు:
ఎవరి తాహతకు తగినట్లుగా వారు ఆయా వారాలలో ఆయా రత్నాలు పొదిగిన ఆభరణాలు ధరించాలి. లక్కతో పొదిగినవి, రాగితో ఆభరణాలు ధరించరాదు.
![]()
ప్రశ్న 2.
వ్యవహార పద్ధతిని వివరించండి.
జవాబు:
ఇతరులకు మేలు చేస్తూ ఓర్పు, సహనం కలిగి ఉన్నవారి ఇంట లక్ష్మీదేవి నివాసముంటుంది. ధైర్యం, ఉత్సాహం ఉన్నవారిని సంపదలు అవే వెతుక్కుంటూ వస్తాయి. పగలు నిద్రపోకూడదు. పరకాంతను కోరుకోకూడదు. భక్ష్యయోగం కాని పదార్థాల మీద వ్యామోహం వదిలేయాలి. కరుకుగా మాట్లాడకూడదు. ఆత్మస్తుతికి దూరంగా ఉండాలి. క్రమశిక్షణ కలిగిన జీవితం గడపుతూ పదుగురి మేలు కోరుకునే మానవునికి ఎల్లప్పుడూ అభ్యుదయమే కలుగుతుంది.
III. ఏక వాక్యరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
నూత్న సత్కళాభోజునిగా వినుతికెక్కినదెవరు ?
జవాబు:
నూత్న సత్కళాభోజునిగా వినుతి కెక్కినది అప్పనమంత్రి.
ప్రశ్న 2.
దంతధావనంలో ఉపయోగించే చెట్ల పుల్లల పేర్లు వ్రాయండి.
జవాబు:
దంతధావనంలో ఉపయోగించే చెట్ల పుల్లలు వేప, కానుగ, చండ్ర, మద్ది, ఉత్తరేణు, జువ్వి, మామిడి, మాదీఫలం, దానిమ్మ, అడవిమల్లె, ఊరుగ, వావిలి మున్నగునవి.
ప్రశ్న 3.
శీతాకాలంలో ఎలాంటి వస్త్రాలు ధరించాలి ?
జవాబు:
శీతాకాలంలో ఊలు వస్త్రాలు ధరించాలి.
ప్రశ్న 4.
మధురమైన పదార్థాలు అతిగా తింటే వచ్చే నష్టమేమిటి?
జవాబు:
మధురమైన పదార్థాలు అతిగా తింటే విషం అవుతాయి.
ప్రశ్న 5.
మనకు ఆకలిని పుట్టించి, దప్పికను హరించేటట్లు చేసేవి ఏవి?
జవాబు:
మనకు ఆకలిని పుట్టించి, దప్పికను హరించేటట్లు చేసేవి తాంబూల చర్వణము.
ప్రశ్న 6.
సంపదలు ఎవరిని వెతుక్కుంటూ వస్తాయి?
జవాబు:
సంపదలు ధైర్య సాహసాలు కల్గిన ఉత్సాహవంతులను వెతుక్కుంటూ వస్తాయి.
ప్రశ్న 7.
అప్పనమంత్రి ఏ కాలంనాటి వాడని పండితులు అంచనా వేశారు?
జవాబు:
అప్పనమంత్రి 13వ శతాబ్దానికి చెందిన వాడని, పోతనకు కాస్త ముందు వాడని పండితులు అంచనా వేశారు.
IV. సందర్భ సహిత వ్యాఖ్యలు
ప్రశ్న 1.
సింధు వారంబునను రావు చెడ్డకలలు
జవాబు:
కవి పరిచయము : ఈ వాక్యము అప్పనమంత్రి రచించిన ‘చారుచర్య’ అను పాఠములోనిది.
సందర్భము : వావిలి చెట్టు యొక్క పుల్లలతో దంతధావనం చేస్తే పీడకలలు రావని కవి చెబుతున్న సందర్భము.
భావము : వావిలి చెట్టు పుల్లలతో పళ్ళు తోమితే చెడు కలలు రావని భావము.
![]()
ప్రశ్న 2.
స్పష్టముగాఁ జేయునేని బహుజనములతోన్
జవాబు:
కవి పరిచయము : ఈ వాక్యము అప్పనమంత్రి రచించిన ‘చారుచర్య’ అను పాఠములోనిది.
సందర్భము : అనేక మంది మానవులతో కలసి భోజనం చేస్తే అనుకున్న పనులు నెరవేరతాయని కవి పల్కిన సందర్భము.
భావము : అనేక మందితో కలసి భోజనం చేయాలి అని భావము.
ప్రశ్న 3.
వాయు చలనకు నొకపాలు వలయు నెడము
జవాబు:
కవి పరిచయము : ఈ వాక్యము అప్పనమంత్రి రచించిన ‘చారుచర్య’ అను పాఠములోనిది.
సందర్భము : పొట్టను నాలుగు భాగాలుగా చేసుకొని, అందు రెండు భాగాలలో అన్నమును, ఒక భాగంలో నీటిని ఉంచాలి. మిగిలిన నాల్గవ భాగంలో వాయువు తిరిగే విధంగా ఉంచుకుంటే తేలికగా జీర్ణమవుతాయని కవి చెప్పిన సందర్భము.
భావము : వాయువు కదిలేందుకు పొట్టలో ఒక భాగాన్ని ఉంచాలి.
ప్రశ్న 4.
వేగమె దాహంబు నణఁచు విన్నాణంబున్
జవాబు:
కవి పరిచయము : ఈ వాక్యము అప్పనమంత్రి రచించిన ‘చారుచర్య’ అను పాఠములోనిది.
సందర్భము : భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకుంటే ఆకలి పుట్టించి, దప్పికను హరిస్తుందని చెప్తూ కవి పల్కిన సందర్భములోనిది.
భావము : వెంటనే దాహాన్ని నశింప చేస్తుందని భావము.
విశేషాంశాలు
1. భోజమహారాజు : సాధారణ శక సంవత్సరం 1010-1055 సంవత్సరాల మధ్య పరమార వంశానికి చెందిన భోజమహారాజు మధ్యభారతదేశంలో ధారా నగరం రాజధానిగా మాళవ రాజ్యాన్ని పాలించాడు. ఈయన కవి, పండిత పోషకుడు. వేదశాస్త్ర అధ్యయనం కోసం భోజుడు నిర్మించిన భోజశాల, అతిపెద్ద శివలింగం ఉన్న భోజేశ్వరాలయం నేటికీ నిలిచి ఉన్నాయి. ఈయన 84 గ్రంథాలు వ్రాశాడని ప్రతీతి.
అందులో కొన్ని: శృంగారప్రకాశం, సరస్వతీకంఠాభరణం (వ్యాకరణ గ్రంథం), చంపూరామాయణం, నామమాలిక (నిఘంటువు), గోవిందవిలాస కావ్యం, 83 అధ్యాయాలు గల సమరాంగణ సూత్రధారము (వాస్తుశాస్త్రం), 136 శ్లోకాలు గల చారుచర్య మొదలైన సంస్కృత గ్రంథాలు ఉన్నాయి.
2. పంచశౌచాలు :
- సత్యశౌచం,
- మనః శౌచం,
- ఇంద్రియ నిగ్రహశౌచం,
- సర్వభూతదయాశౌచం,
- జలశౌచం.
3. నాలుగు గడియల స్నానం : గడియ = 24 నిమిషాలు, 4 గడియలు అంటే 96 నిమిషాలు, సమయం, సౌలభ్యం ఉన్నవారు శరీరానికి నఖ, శిఖ పర్యంతం తైలమర్దనం చేసుకున్న తర్వాత నలుగు, కుంకుడురసంతో అభ్యంగన స్నానం చేయడానికి అంత సమయం పట్టేది. ఇంత సమయం పాటు నిత్యం స్నానం చేయడం అందరికీ సాధ్యం కాదు. అలాగని హడావిడిగా నాలుగు చెంబుల నీళ్ళు ఒంటిమీద దిమ్మరించుకోవడం స్నానం అనిపించుకోదు అన్న భావాన్ని గ్రహించాలి.
4. జవ్వాది : పునుగుకు సైదోడుగా ఉండే సుగంధ ద్రవ్యం జవ్వాది. మంచి గంధంతో మూలికలు కలిపి తయారుచేసే మంగళ ప్రదమైన పదార్థం ఇది. ఇందులో కలిపే ఓషధులు లభించే ప్రాంతాన్ని తమిళనాడులో “జవ్వాదిమలై” అని పిలుస్తారు.
5. దశదానాలు :
- గోదానం,
- భూదానం,
- తిలదానం
- హిరణ్యదానం,
- నెయ్యి,
- వస్త్రాలు,
- ధాన్యం,
- బెల్లం,
- శర్కర/మధుర పదార్థాలు
- జలం/జలపాత్ర.
6. పంచయజ్ఞాలు : గృహస్థు ఆచరించవలసిన నిత్యకర్మలు
1. బ్రహ్మయజ్ఞం (వేదాధ్యయనం / విద్యాభ్యాసం)
2. పితృయజ్ఞం (గతించిన పెద్దలకు తర్పణాలివ్వడం)
3. దేవయజ్ఞం (అర్చన, అగ్నికార్యం, నివేదన)
4. భూతయజ్ఞం (సర్వప్రాణులను ఆదరించడం),
5. మానుష్యయజ్ఞం (అతిథి సత్కారం).
![]()
7. ఉత్తరేణి : ఔషధ విలువలు ఉన్న ఈ మొక్కను సంస్కృతంలో “అపామార్గ” అంటారు. ఈ మొక్క యొక్క ఆకు, కాండం, వేర్లు కూడా ఔషధాలలో వినియోగిస్తారు. దంతధావనానికి ఉత్తమమైన ఉత్తరేణిని, వేప, కానుగ పుల్లలతోపాటు నేటికీ ఆంధ్రదేశమంతటా వినియోగిస్తారు. అట్ల తదియనాడు వాయినాల నోము తీర్చుకునే స్త్రీలు ఉత్తరేణి పుల్లతో దంతధావనం చేసి 11 పసుపు ముద్దలతో స్నానం చేసిన తర్వాత గౌరీపూజ చేయడం, లక్ష వత్తుల నోము చేసేనాడు కూడా మహిళలు ఉత్తరేణి పుల్లతో పళ్ళుతోముకోవడం తీరాంధ్రదేశంలో సంప్రదాయంగా వస్తున్నది.
8. శ్వేతార్కం : తెలుగులో తెల్లజిల్లేడు అంటారు. తెలుపు, నలుపు ఏ రకం జిల్లేడైనా వాటి పాలు కంటికి చాలా ప్రమాదం కలిగిస్తాయి. పిప్పి పంటికి తెల్లజిల్లేడు పాలు ఉపశమనం కలిగిస్తాయని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. వైద్యుల సలహాతో మాత్రమే వినియోగించాలి.
9. త్రిదోషాలు : మానవ శరీరంలో 1. వాత, 2. పిత్త, 3. శ్లేష్మాలు గతి తప్పకుండా అదుపులో ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో ఏ ఒక్కటి ప్రకోపించినా శరీరం రోగగ్రస్తమవుతుంది.
చారుచర్య Summary in Telugu
కవి పరిచయం
అప్పనమంత్రి భారద్వాజ గోత్రుడు. ఆపస్తంబ సూత్రుడు. సోమయాజులలో శ్రేష్ఠుడైన సింగనా మాత్యునికి అప్పనమంత్రి మేనల్లుడు. పుణ్యాత్ము డైన శ్రీవల్లభాచార్యుడు ఇతని అన్న. : హరి భక్తుడైన అప్పనమంత్రి సంస్కృతాంధ్రాలలో కవిత్వం చెప్పగల దిట్ట. మన కావ్యాలు ప్రబంధాలలో సందర్భాన్ని అనుసరించి వివిధ ఓషధులు, చికిత్సల వివరాలు చర్చించబడ్డాయి. మనకు తెలిసినంత వరకు తెలుగులో ఆరోగ్య సూత్రాలను క్రోడీకరిస్తూ వెలువడిన గ్రంథాలు చాలా అరుదుగా ఉన్నాయి.
వ్యాధులు చికిత్సా విధానాలు – ఔషధాల గురించి తెలిపే ‘బసవరాజీయం’ (18వ శతాబ్ది) . లాంటి ఆయుర్వేద గ్రంథాలున్నాయి. మానవులు క్రమశిక్షణాయుత జీవన విధానాలను అలవరచు
కోవడానికి పాటించాల్సిన నియమాలను, పద్దతులను వివరించే గ్రంథాలలో “చారుచర్య” నాయకమణి లాంటి రచనగా భావించవచ్చును.
పాఠ్యభాగ ఉద్దేశం
భారతీయ వైద్య విధానం చాలా గొప్పది. రోగాలు ముదరకుండా, ముందుగా రోగాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే పూర్ణ ఆయుర్దాయమును కల్గి ఉండుట. ఈనాడున్న సమాజంలో నూటికి సగం పైగా “భాగ్యవంతులు” కన్పిస్తున్నారే కానీ “మహాభాగ్యవంతులు” అన్నవారు నూటికి పదిమంది కూడా కన్పడటంలేదు.
ధర్మసాధనాలన్నింటిలోను దేహమే మొట్టమొదటిది. దేహాలయాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం అనేది మన చేతుల్లోను, చేతల్లోను ఉంది. కనుక నేటి విద్యార్థులకు వ్యవహార జ్ఞానం, మంచి ఆహారపు అలవాట్లు నేర్పడంతో పాటు ఆరోగ్య విషయాలపై తెలుగువారికున్న శ్రద్ధాసక్తులను, ఒకనాటి శౌచ, అలంకార పద్ధతులను తెలియ జేయడమే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ నేపథ్యం
ఈ చారుచర్య పద్యభాగాన్ని అప్పనమంత్రి 76 పద్యాలున్న లఘుకృతిగా మలచాడు. అవతారికతో మొదలై వరుసగా దంతధావన, స్నాన, పుష్పధారణ, లేపన, వస్త్రధారణ, భూషణధారణ…. ఇలా ఈ విధంగా మొత్తం 12 పద్ధతుల గురించిన వివరాలు ఇందులో ఉన్నాయి. వీటి నుండి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా 9 పద్ధతుల నుండి పద్యాలను ఎంపిక చేసి పాఠ్యాంశంగా అందించడం జరిగింది.
పాఠ్యభాగ సారాంశం
ప్రతిరోజూ ప్రాతఃకాలంలోనే నిద్ర నుండి మేల్కొనాలి. అలస్యం చేయకుండా దంతధావనం చెయ్యాలి. అందుకోసం వేప, కానుగ, చండ్ర, మద్ది మొదలైన ఔషధ విలువలు కలిగిన పుల్లలను ఉపయోగించాలి. వివిధ వృక్ష జాతులకు సంబంధించిన పుల్లలను దంత ధావనానికి ఉపయోగించడం వలన వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కనుక వాటిని తెలుసుకుని వినియోగించుకోవాలి. శుభ్రంగా దంతధావనం చేయడం వలన కఫం, పైత్యం హరించుకుపోయి, నాడీమండలం శుద్ధి అవుతుంది.
ఆపై చక్కగా గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం వలన శరీరం కాంతివంతంగా తయారై రోజంతా ఉత్తేజంగా ఉంటారు. స్నానానంతరం చక్కగా తల దువ్వుకొని కాలానికి తగిన లేపనాలను పూసుకోవాలి. సువాసనను, ఆరోగ్యాన్ని ప్రసాదించే గేదగి, గన్నేరు, మొల్ల, పొగడ, సంపెంగల వంటి పుష్పాలను ధరించాలి. ఇవి ధరించడం వలన స్త్రీ పురుషులకు త్రిదోషాలు హరించుకుపోతాయి. చలువ చేస్తుంది. ఋతువులననుసరించి మనం వస్త్రధారణ చెయ్యాలి. కాలిపోయినవి, కన్నాలు పడినవి అయిన వస్త్రాలు ధరించరాదు.
ఎవరి తాహతుకు తగినట్లుగా వారు ఆయా వారాలలో ఆయా రత్నాలు పొదిగిన ఆభరణాలు ధరించాలి. ఉన్నంతలో దాన ధర్మాలు చేయాలి. మన చుట్టూ ఉన్నవారికి పెట్టాకే మనం భుజించాలి. సాధ్యమైనంత వరకు భోజనం ఒంటరిగా కాకుండా పదిమందితో కలిసి తినాలి. భోజన సమయంలో భోక్తగాని, దాతగాని కోపావేశాలకు లోనయితే ఆ ఆహారం విషంతో సమానమవుతుంది. మధురంగా ఉన్నాయని పదార్థాలు అతిగా తినకూడదు. భోజనం మధ్యలో అతిగా నీరు త్రాగకూడదు. అన్నం తినడానికి, నీరు త్రాగడానికి క్రమపద్ధతిని పాటించాలి. భోజనానంతరం కొద్ది దూరమైనా నడవాలి.
అలా నడిచాక పైత్యాంతకమైన తాంబూలాన్ని సేవించాలి. తాంబూల సేవనం వలన ఒనగూరే ప్రయోజనాలు అనేకం. తాంబూలంలో వేసుకునే సున్నం త్రిదోషాలను హరిస్తుంది. మంచి ఆహారాన్ని స్వీకరిస్తూ ప్రశాంత జీవనం గడపాలి. ఇతరులకు మేలు చేస్తూ ఓర్పు, సహనం కలిగి ఉన్నవారి ఇంట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ధైర్యం, ఉత్సాహం ఉన్నవారిని సంపదలు అవే వెతుక్కుంటూ వస్తాయి. పగలు నిద్రపోకూడదు, పరకాంతను కోరుకోకూడదు. భక్ష్యయోగ్యంగాని పదార్థాల మీద వ్యామోహం వదిలేయాలి. కరుకుగా మాట్లాడకూడదు. ఆత్మస్తుతికి దూరంగా ఉండాలి. క్రమశిక్షణ కలిగిన జీవితం గడుపుతూ పదుగురి మేలు కోరుకునే మానవునికి ఎల్లప్పుడూ అభ్యుదయమే కలుగుతుంది.
పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు
దంతధావన పద్దతి
1. రేపకడ మేలుకొని యఘ
నాపకమతి దంతధావనవిధిజ్ఞుం డై
తాపుణ్య కాష్ఠమున మౌ
నోపేతుం డగుచు వలయు నొనరింపంగన్
ప్రతిపదార్థము:
రేపు + కడ – రేపకడ = ప్రాతఃకాలమున
మేలుకొని = నిద్రలేచి
అఘనాపకమతి = పాపనాశనమైన బుద్ధితో
దంతధావన విధిజ్ఞుండు + ఐ = పళ్ళను తోముటయందు
విధిజ్ఞుండై = పనిని తెలిసినవాడై
తాపుణ్యకాష్టమున = పవిత్రమైన పుల్లలతో
మౌన + ఉపేతుండు + అగుచు మౌనో పేతుండగుచు = మౌనాన్ని ధరిస్తూ
ఒనరింపంగన్ వలయు = చేయవలయును
తాత్పర్యము : ప్రతిరోజూ ప్రాతఃకాలంలోనే నిద్ర నుండి మేల్కొనాలి. ఆలస్యం చేయకుండా మౌనం వహిస్తూ, పవిత్రమైన పుల్లలతో దంతధావనం చేయాలి.
2. ఆ. వె. ఖదిరమును పటమును గానుఁగ జిల్లేడు
వేము మద్ది జువ్వి వీనియందు
నొగరు చేఁదు కార మొనరిన చెక్కలఁ
దడిపి తోమవలయు దంతములకు
ప్రతిపదార్ధము :
ఖదిరమును = చండ్ర
వటమును = మఱ్ఱి
గానుగ = గానుగ
జిల్లేడు = జిల్లేడు వేరు
వేము = వేప
మద్ది = మట్టి
జువ్వి = జువ్వి
వీని + అందు-వీనియందు = వీనితో
ఒగరు, చేదు, కారము + ఒనరిన ఒగరు, చేదు, కారమొనరిన= ఒగరు చేదు కారము కలిగినటువంటి
చెక్కలన్ = పుల్లలతో
తడిపి = నీటిలో తడిపి
దంతములకు = దంతాలను
తోమవలయు = తోమాలి
తాత్పర్యము : చండ్ర, మఱి, గానుగ, జిల్లేడు వేరు, వేప, మద్ది, జువ్వి మున్నగు పుల్లలను తడిపి పళ్ళను తోమాలి. ఒగరు, చేదు, కారము కలిగినటువంటి ఔషధ విలువలు కల్గిన ఈ పుల్లలను ఉపయోగించాలి.
![]()
3. సీ. ఆయురారోగ్యంబులగు మద్ది మామిడి
కణమున శ్రీలక్ష్మి గలుగు మిగులఁ
బీడ లెల్లనుఁ బాయు బీజపూరంబున
రణజయం బొదవుఁ గరంజకమున
విత్తలాభము సంభవించును మారేడు
నొదవు ఘనప్రజ్ఞ యుత్తరేణి
నరుచిహరము జాడ్యహరము జేయును జండ్ర
సిద్ధించు నతుల వాక్సిద్ధి జువ్వి
తే.గీ. జాజి దాడింబమున దిరిసమున గొడిసె
మొదల నంకోలమునఁ గల్గు మోక్షలక్ష్మి
సింధువారంబునను రావు చెడ్డకలలు
దంతధావనకరంబు లింతవట్టు
ప్రతిపదార్థము :
ఆయుః + ఆరోగ్యంబులు + అగు ఆయురారోగ్యంబులగు = ఆయువును పెంచి, ఆరోగ్యాలైన,
మద్ది, మామిడి, కణెమున = మద్ది, మామిడి అగు చిన్నపుల్లలతో (దంతధావనం చేస్తే)
మిగులన్ = అధికంగా
శ్రీలక్ష్మిన్ + కలుగున్ శ్రీలక్ష్మిగలుగు = ఐశ్వర్య సంపదలు కలుగుతాయి
బీజ పూరంబున = మద్దిచెట్టు పుల్లలతో (దంతధావనం చేస్తే)
పీడలు + ఎల్లనున్ + పాయు పీడలెల్లఁ బాయు = సకల పీడలు నశిస్తాయి.
కరంజకమున = ‘గానుగ’ అను పుల్లతో (దంత ధావన చేస్తే)
రణజయంబు + ఒదవున్ రణజయంబొదవున్ = యుద్ధంలో విజయం కల్గును
మారేడున్ = మారేడు పుల్లతో (దంత ధావనం చేస్తే)
విత్త లాభము = ధన లాభము
సంభవించును = కల్గుతుంది
ఉత్తరేణిని = ఉత్తరేణితో (దంత ధావనం చేస్తే)
ఘన ప్రజ్ఞ = గొప్ప ప్రతిభ
ఒదవు = కల్గును
చండ్ర = చండ్ర పుల్లతో (దంత ధావనం చేస్తే)
అరుచిహరము = అరుచిని నశింపచేయును
జాడ్యహరము = మూర్ఖం పోతుంది
జువ్వి = జువ్వి పుల్లతో (దంత ధావనం చేస్తే)
అతుల = అధికమైన (సాటిలేని),
వాక్ + సిద్ధి వాక్సిద్ధి స్పష్టమైన మాటను
సిద్ధించును = సిద్ధిస్తుంది
జాజి = జాజి పుల్లతోను
దాడింబమునన్ = దానిమ్మ పుల్లతోను
దిరిసమున = దిరిసమను పుల్లతోను
గొడిసె = అడవి మల్లె పుల్లతోను
అంకోలమునన్ = ఊరుగ పుల్లతోను
మొదలన్ = మొదలగు పుల్లలతోను (దంత ధావనం చేస్తే)
మోక్షలక్ష్మీ = మోక్షమనెడి లక్ష్మి కల్గుతుంది. (అంటే ముక్తి లభిస్తుంది)
సింధు వారంబునను = వావిలి చెట్టు యొక్క పుల్లతో (దంత ధావనం చేస్తే)
చెడ్డ కలలు = చెడు కలలు
రావు = రానేరావు
ఇంత + పట్టు ఇంతవట్టు = ఈ విధంగా
దంతధావనకర్షంబు = దంతధావన చేయటానికి అర్హత కల్గి యుంటుంది
తాత్పర్యము : మద్ది, మామిడి పుల్లలతో దంతధావనం చేస్తే సంపదలు కల్గుతాయి. మాదీఫల చెట్టు పుల్లతో పళ్ళు తోమితే సకల పీడలు తొలగిపోతాయి. గానుగ పుల్లనుపయోగించి పళ్ళు తోమితే యుద్ధంలో విజయం సిద్ధిస్తుంది. మారేడు పుల్లతో తోమితే ధన సంపదయును, ఉత్తరేణినియుపయోగించి తోమితే గొప్ప ప్రతిభ కల్గును. చండ్ర పుల్లతో పళ్ళు తోమితే అరుచియును, మూర్ఖత్వమును పోతాయి. జువ్వితో పళ్ళు తోమితే వాక్సిద్ధి లభిస్తుంది. జాజి, దానిమ్మ, దిరిసము, అడవిమల్లి, ఊరుగ మున్నగు చెట్ల పుల్లలతో పళ్ళు తోమితే ముక్తి లభిస్తుంది. వావిలి చెట్టు పుల్లతో పళ్ళు తోమితే చెడు కలలు రావు. కనుక పైన చెప్పినవన్నియు దంతధావనానికి అర్హములు.
4. కం. ప్రియరుచ్యము కఫపైత్య
క్షయకారి మనఃప్రసన్న కారణము శ్రుతి
ద్వయనాడి శుద్ధికరమును
నయనహితము దంతధావనము మనుజులకున్
ప్రతిపదార్ధము :
మనుజులకున్ (పైన చెప్పిన వివిధ పుల్లలతో పళ్ళు తోమితే) = మానవాళికి
దంతధావనము = పళ్ళు తోమితే
ప్రియరుచ్యము = ఇష్టంగా తినుటకును
కఫపైత్య క్షయకారి = కఫపైత్యాలను నశింప చేయునదియును
మనఃప్రసన్నకారణము = మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు కారణమును
శ్రుతిద్వయనాడి = రెండు చెవుల యొక్క నాడులు
శుద్ధికరమును = పరిశుద్ధంగా ఉంచుటకును
నయనహితము = కళ్ళకు మేలు చేయును
తాత్పర్యము: పైన వివరించిన చెట్ల పుల్లలతో పళ్ళు తోమితే ఇష్టంగా తినేందుకు, కఫపైత్యాలు నశించేందుకు, మనస్సు ప్రశాంతంగా ఉండుటకును, రెండు చెవుల యొక్క నాడులు శుభ్రంగా ఉండుటకును, కళ్ళు ప్రశాంతంగా ఉండేందుకును ఉపయోగపడును.
స్నాన పద్ధతి
5. ఉ. అంగసుఖంబు, దుర్గుణము లారయఁ బొందని మందు, మేనికిన్
రంగు సుపోషణంబు సుకరంబునఁ బ్రాయము మళ్లివచ్చున
భ్యంగన మాచరించుటకు నర్షవిధం బగు నుష్టవారిజే
యం గడునొప్పు నాల్గు గడియల్ జలకంబు యథావిధిజ్ఞుఁ డై
ప్రతిపదార్దము :
అంగసుఖంబు = శరీర సౌఖ్యము
ఆరయన్ = ఆలోచించగా
దుర్గుణములు = చెడు లక్షణాలు
పొందని మందు = కలుగని ఔషధము
మేనికిన్ = శరీరానికి
రంగు సుపోషణంబు = మంచి కాంతితో వెల్గుతుంది
సుకరంబున = తేలికగా
ప్రాయము = యౌవనము
మళ్ళీ వచ్చును = యథాప్రకారంగా వస్తుంది
అభి + అంగనము అభ్యంగనము మాచరించుటకు = శరీరమంతా నూనె రాసిన తర్వాత కొంత సేపటికి సుండిపిండితో నలుగు పెట్టుకుని తర్వాత శిరఃస్నానము చేయుటను అభ్యంగన మందురు.
అర్హవిధంబు + అగు అర్హ విధంబగు = తగినటువంటి
ఉష్ణవారిన్ + చేయన్ ఉష్ణవారిజేయన్ = వేడినీటితో స్నానము
కడున్ + ఒప్పున్ కడునొప్పున్ = చేయుట మంచిది
యథా = యథా ప్రకారంగా
విధిజ్ఞుండు + ఐ
విధిజ్ఞుండై = తెలిసినవాడై
నాల్గు గడియల్ = ఒక గంట 36 నిమిషాలు (24 నిమిషాలు = 1 గడియ)
జలకంబు = అభ్యంగన స్నానము
ఒప్పున్ = తగియుంటుంది
తాత్పర్యము : అభ్యంగన స్నానము వేడినీటితో చేయాలి. అలా చేస్తే శరీర సౌఖ్యము, చెడు లక్షణాలు కలిగించని మందు వంటిది, శరీరకాంతి, తేలికగా యౌవనము మళ్ళీ వచ్చుట, మున్నగు ప్రయోజనాలు కల్గును. ఈ అభ్యంగన స్నానము నాల్గు గడియలు పాటు చేయాలి.
![]()
6. కం. ఆచారానన్తరమునఁ
బ్రా ముడువవలయుఁ గేశపాశంబులఁ గా
లోచితజలముల గరగర
రాచిన కస్తూరి పూయ రమణీయ మగున్
ప్రతిపదార్థము :
ఆచార + అనన్తరమునన్ ఆచారానన్తరమునన్ = స్నానానరమున
కేశపాశంబులన్ = జుట్టును
ప్రాచీ = హరిత పువ్వులతో
ముడువవలయున్ = ధరించాలి
కాల + ఉచిత కాలోచిత = కాలానికి తగిన
జలములన్ = లేపనాలను
గర గర రాచిన = చక్కగా రాచిన
కస్తూరి పూయ = కస్తూరిని రాసిన
రమణీయము + అగున్ రమణీయమగున్ = అందంగా ఉంటుంది
తాత్పర్యము : స్నానానంతరం చక్కగా తల దువ్వుకొని, కాలానికి తగిన లేపనాలను పూసుకోవాలి.
లేపన పద్దతి:
7. కం. జలకంబు దీర్చినప్పుడె
వలయున్ దడియొత్తఁ గాంతివచ్చును బిటికా
దులు వొందకుండు గండువు
గలుగదు మఱి దాన నునుపు గాత్రమున కగున్
ప్రతిపదార్థము:
జలకంబున్ + తీర్చిన + అప్పుడు + ఎ జలకంబుదీర్చినప్పుడె = స్నానం చేసిన తర్వాత
తడి + ఒత్తన్ తడి యొత్తన్ = శరీరంపైన ఉన్న తడిని ఒత్తుచు
వలయున్ = మృదువుగా తుడవాలి
కాంతి వచ్చును = శరీరకాంతి కల్గుతుంది.
పిటిక + ఆదులు పిటికాదులు = బొబ్బర్లు వంటివి
పొందకుండు = కలుగవు
కండువు = దురద
కలుగదు = కలుగదు
మఱిదాన = మరిదానిన్
గాత్రమునకు = శరీరానికి
అనువు = మృదుత్వము
అగు = కల్గును
తాత్పర్యము: స్నానం చేసిన తర్వాత శరీరాన్ని మృదువుగా తుడవాలి. తరువాత శరీరకాంతి ప్రకాశిస్తుంది. బొబ్బర్లు వంటివి రావు. దురద పుట్టదు. శరీరం మృదుత్వంతో ప్రకాశిస్తుంది.
8. కం. పరిమళము గల్గుపూవులు
ధరియింపఁగ దాన చుండ్రు తలఁబట్టదు చె
చ్చెరఁ జెమటకంపు తొలఁగును
నరులకు మతి దెలియు ననువు నయనముల కగున్
ప్రతిపదార్థము:
పరిమళమున్ + కల్గు పరిమళముగల్గు = సువాసనలు వెదజల్లు
పూవులు = పుష్పాలను
ధరియింపగన్ = ధరించినచో
దాన = కనుక
చుండ్రు = చుండ్రు అనెడి ఒక వ్యాధి. (తలకు పట్టే వ్యాధి విశేషము)
తలన్ + పట్టదు తలబట్టదు = తలలోకి రాదు
చెర + చెరన్ చెచ్చెరన్ = వెంటనే
చెమటకంపు = చెమట వల్ల కలిగె దుర్వాసన
తొలంగును = తొలగిపోతుంది
నరులకు = మానవులకు
మతిన్ + తెలియును మతిదెలియును = చక్కని బుద్ధి ఏర్పడుతుంది
అనువు = మృదుత్వము
నయనములకు + అగున్ నయనములకగున్ = కళ్ళకు కల్గుతుంది.
తాత్పర్యము : సువాసనలు వెదజల్లు పుష్పాలను శిరస్సున ధరించినచో చుండ్రు రాదు. చెమట కంపు పోతుంది. బుద్ధి వికసిస్తుంది. కళ్ళకు మృదుత్వం కల్గుతుంది.
పుష్పధారణ పద్ధతి
9వ పద్యము : ప్రతిపదార్థ తాత్పర్యాలను వ్రాయమని అడిగే పద్యం)
ఉ. గేదఁగిపువ్వు దాలిచి సుఖింతురు మేలు జవాది పూసి హృ
న్మోదముగాఁగఁ గన్నెరులు మొల్లలతో వకుళ ప్రసూనముల్
జాదులు పాటలంబులును సంపెఁగలున్ శతపత్రకంబులున్
శ్రీదనరారు భోగులు ధరింతురు కస్తురిఁ గూర్చి వేడుకన్
ప్రతిపదార్థము :
గేదఁగి పువ్వున్ = గేదగి పుష్పంను
తాలిచి = ధరిస్తే
సుఖింతురు = సుఖంగా ఉంటారు
మేలు = అది మంచిది
జవాది పూసి = జవాదిని వ్రాసుకున్నట్లయితే
హృత్ + మోదమున్ కాన్ + కన్ హృన్మోదముగాఁగఁ = హృదయానందము కల్గుతుంది.
గన్నెరులు = గన్నేరు పూలు
మొల్లలతోన్ = మొల్లలను
వకుళ ప్రసూనముల్ = పొగడ పుష్పాలను
జాదులు = జాజిపువ్వలను
పాటలంబులును = దిరిసెన పువ్వులును
సంపెంగలున్ = సంపెంగలును
శతపత్రకంబులున్ = తామరపువ్వులును
భోగులు = భోగ స్వభావం కల్గిన వారైన
శ్రీ దనరారు = ఐశ్వర్యవంతులు
ధరింతురు = ధరిస్తారు
వేడుకన్ = వేడుకతో
కస్తురిన్ + కూర్చి కస్తురిఁగూర్చి = కస్తూరిని
ధరింతురు =ధరిస్తారు.
తాత్పర్యము : సువాసనలను, ఆరోగ్యాన్ని ప్రసాదించే గేదఁగి, గన్నేరు, మొల్ల, పొగడ, సంపెంగల వంటి పుష్పాలను ఐశ్వర్యవంతులు ధరిస్తారు. పైగా కస్తూరిని గూడ వ్రాసుకుని సౌఖ్యాన్ని పొందుతారు.
10. ఉ. మొల్లలు జాజి క్రొవ్విరులు మొత్తములుం గరవీరరాజి దా
వెల్ల దొలంకుపువ్వు కురువేరు త్రిదోషహరంబు లారయన్
చల్లఁదనంబు దీన సహజం బగు గొజ్జ్యగినీరు గొంత పైఁ
జల్లి ధరింతు రర్థిమెయి జాణలు వేసవిరాత్రు లెప్పుడున్
ప్రతిపదార్థము :
మొల్లలు = బొండుమల్లెలు
జాజి = జాజిపూవులు
మొత్తములున్ = మున్నగునవి
కొత్త + విరులు క్రొవ్విరులు = నవ్యత్వము కల్గిన పుష్పాలు
కరవీరరాజిన్ = ఎర్ర గన్నేరులు
తావి + ఎల్లన్ తావెల్లన్ = సకలమైన సువాసనను
తొలంకు పువ్వు = వెదజల్లే పుష్పాలు
కురువేరు = వట్టివేళ్ళు
ఆరయన్ = తెలుసుకొనగా
త్రిదోషహరంబులు = వాతపిత్త కఫాలను హరించేవి
చల్లదనంబుదీనన్ = దీనివల్ల చల్లదనమును
సహజంబు + అగు
సహజంబగు = సహజత్వాన్ని కల్గించే
గొజ్జఁగి నీరు = గులాబి రెక్కలు కలిపిన నీరు(అనగా పన్నీరు)
కొంత = తగుమాత్రంగా
పై + చల్లి పైజల్లి = శరీరంపైన జల్లి
ఎప్పుడున్ = ఎల్లప్పుడూ
వేసవి రాత్రులు = వేసవి రాత్రులందు
జాణలు = నెఱజాణలు (రసికత్వము కల్గిన స్త్రీలు)
అర్థమెయి = శరీర సౌఖ్యం కొరకు
ధరింతురు = ధరిస్తారు
తాత్పర్యము : బొండు మల్లెలు, జాజులు, ఎర్ర గన్నేరులు మున్నగు పుష్పాల సువాసనలు వెదజల్లేవి, వట్టి వ్రేళ్ళు ధరించ వాత, పిత్త, కఫాలను (త్రిగుణ దోషాలు) పోగొట్టి చల్లదనం కల్గిస్తాయి. ఎప్పుడు వేసవిరాత్రులందు శరీరంపై జాణలు పన్నీరు చల్లుకొని సుఖ సౌఖ్యాన్ని పొందుతారు.
![]()
వస్త్రధారణ పద్దతి
11. శా. సీతుం గందువఁ బట్టుచీరలును మాంజిష్ఠంబులున్ దోఁపులున్
వాతశ్లేష్మ నివృత్తి హేతువులు, దుర్వారోష్ణ కాలంబునన్
జేతో మోదము పైత్యహానియుఁ గడుం జేకూరుఁ జెంగావులన్
శ్వేతచ్చాయపటంబు లభ్రపట లీవేళన్ బ్రిదోషఘ్నముల్
ప్రతిపదార్థము :
సీతున్ = శీతాకాలమందు
కందువన్ = ఇష్టమైన
పట్టుచీరలును = పట్టుచీరల్ని
మాంజిష్ఠంబులున్ = చమరీ మృగము యొక్క వెంట్రుకతో చేసిన
తోపులున్ = నూలు వస్త్రాలు
వాతశ్లేష్మ = వాత శ్లేష్మాలను
నివృత్తి హేతువులు = నశింపచేసే కారణాలు
దుర్వార + ఉష్ణ కాలంబునన్ దుర్వారోష్ణ కాలంబునన్ = భయంకర వేసవికాలమందు
చేతోమోదము = హృదయానందమును
పైత్యహానియున్ = పైత్యాన్ని నశింప చేయునదియును
చెంగావులన్ = చెంగావి వస్త్రాలను
శ్వేతచ్ఛాయపటంబులు = తెల్లని వస్త్రాలను
అభ్రపటలు = గొడుగులు
ఈవేళన్ = ఈ సమయంలో (ధరిస్తే)
త్రిదోషఘ్నముల్ = వాత, పిత్త, శ్లేష్మాదులు నశించిపోవును
కడున్ + చేకూరున్ కడుంజేకూరున్ = అధికంగా కల్గుతుంది
తాత్పర్యము : శీతాకాలమందు పట్టుచీరలును, చమరీ మృగము యొక్క వెంట్రుకలతో చేసిన నూలు వస్త్రాలు ధరిస్తే వాత శ్లేష్మ నివృత్తి హేతువులు. భయంకర వేసవికాలంలో హృదయానందాన్ని, పైత్య హారియును కల్గించు చెంగావి వస్త్రాలు, తెల్లని వస్త్రాలు, గొడుగులు ధరిస్తే వాత శ్లేష్మాదులు నశించిపోతాయి.
12. కం. కాలినచీర ధరించిన
మేలు దొలంగుటయె కాదు మిక్కిలి కీడై
కాలుని వశమగుఁ గావున
వాలాయము దానిఁ బాఱవైవఁగవలయున్
ప్రతిపదార్థము :
కాలిన చీర ధరించిన = కాలిపోయినటువంటి చీరను ధరిస్తే
మేలున్ + తొలంగుటయె కాదు
మేలు దొలంగుటయె కాదు = శుభాలు నశించిపోవుటయే కాక
మిక్కిలి = అధికమైన
కీడై = కీడు కలుగుతుంది
కాలుని వశము + అగున్ కాలుని వశమగున్ = మరణించుట జరుగును
కావున = కనుక
వాలాయము = వెంటనే
దానిన్ = ఆ చీరను
పాఱవైవఁగ వలయున్ = పారవేయాలి
తాత్పర్యము : కాలిన చీరను ధరించరాదు. ఒకవేళ ధరిస్తే కీడు కల్గుతుంది. పైగా మరణం సంభవిస్తుంది. కనుక వెనువెంటనే ఆ చీరను పారవేయ వలయును.
భూషణధారణ పద్ధతి
13. ప్రతిపదార్థ తాత్పర్యాలను వ్రాయమని అడిగే పద్యం)
చం. తెవులులు, సెందనోడు నధిదేవత లిత్తురు మెచ్చి సంతతో
త్సవములు రత్నభూషణవితానము దాల్పఁగ నట్లు లేనినాఁ
డవయవశుద్ధి హేతు రుచిరాభరణంబులు దాల్పఁగాఁదగున్
రవణముపొంటె లక్కయును రాగియు నిడ్డవిగావు దాల్పఁగన్
ప్రతిపదార్థము :
తెవులులు = వ్యాధులు
చందన్ + ఓడున్ చందనోడున్ = పొందనటు వంటి
రత్నభూషణ వితానమున్ = రత్నాలతో పొదిగిన ఆభరణాలను
తాల్పఁగన్ = ధరించినట్లైతే
అధిదేవతలు = ఆయా రత్నాలకు అధిదేవతలైనవారు
మెచ్చి = అభినందించి
సంతత + ఉత్సవములు
సంతతోత్సవములు = సంతోషంతో కూడిన ఉత్సవాలను
ఇత్తురు = ఇస్తారు.
అట్లు లేనినాడు = రత్నాభరణాలు లేని రోజున
అవయవశుద్ధి = అవయవాలను శుభ్రపరచే
రుచిరాభరణంబులున్ = బంగారు వన్నె గల ఆభరణాలు
తాల్పగాన్ + తగున్ తాల్పగాఁదగున్ = ధరించుట యుక్తము
రవణముపొంటె = ఆభరణం కొఱకు
లక్కయు = లక్క గాని
రాగియు = రాగివి గాని
తాల్పన్ + కన్ తాలఁగన్ = ధరించుటకు
నిడ్డవి గావున్ = ఇడినవి కావు (మంచివి కావని అర్థం)
తాత్పర్యము : రత్నాలతో పొదిగిన బంగారు ఆభరణాలను ధరిస్తే, ఆయా రత్నాలకు అధిపతులైన దేవతలు సంతోషాన్ని కలిగిస్తారు. అపుడు ఎటువంటి వ్యాధులు రావు. అవి లేనపుడు కేవలము బంగారు ఆభరణాలు ధరిస్తే అవయవాలు శుభ్ర మవుతాయి. కాని లక్క, రాగి వంటి ఆభరణాలు ధరించరాదు.
అర్చా పద్ధతి
14. కం. దానములు చేసి యట స
న్మానంబున దేవపితృసమభ్యర్ధనముల్
పూని యొనరించి పిమ్మటఁ
గాని చనఁగవలదు భుక్తి కార్యంబునకున్
ప్రతిపదార్థము :
దానములు చేసి + అట దానములు చేసియట = దానములు చేయాలి; తరువాత
సత్ + మానంబునన్ సన్మానంబునన్ = గౌరవంగా
దేవ, పితృ సమభ్యర్చనముల్ పూని = దేవ పితృగణాలకు పూజను
ఒనరించి పిమ్మటన్ + కాని ఒనరించి పిమ్మటఁగాని = చేసిన తర్వాత గాని
భుక్తి కార్యంబునకున్ = భోజనం చేయుటకు
చనన్ + కవలదు
చనఁగవలదు = వెళ్ళటం తగదు
తాత్పర్యము : ముందుగా ప్రతిరోజూ దానాలు చేయాలి. తర్వాత గౌరవంతో దేవ పితృ గణాలకు పూజ చేయాలి. ఆ తర్వాత గాని భోజనం చేయాలి.
భోజన పద్ధతి
15. కం. పెక్కండ్రు లేకయున్నను
నొక్కఁ డిరువురైనఁ బంక్తి నొగిఁ గుడువక తా
నొక్కండ భుక్తి గొనుటది
యెక్కడునింద్యమనిచెప్పి రిద్దచరిత్రుల్
ప్రతిపదార్థము :
పెక్కుండ్రులేక + ఉన్ననున్ పెక్కుండ్రు లేకయున్ననున్ = అనేక మంది లేకపోయినను
ఒక్కడు + ఇరువురైనన్ ఒక్కరువునన్ = ఒకడు లేక ఇద్దరైనను
పంక్తిన్ + ఒగిన్ పంక్తి నొగిన్ = సహపంక్తిలో ఉండి
కుడువక = తినకుండా
తాన్ + ఒక్కండు + అ తానొక్కండ = తాను ఒక్కడే
భుక్తి గొనుట = భోజన చేయుటను
అది = అలా భోజనం చేయుట
ఎక్కుడు = అధికమైన
ఇద్ధచరిత్రుల్ = పవిత్రమైన వారైన పెద్దలు
నింద్యమని చెప్పిరి = దోషమని చెప్పారు
తాత్పర్యము : అనేక మందితో కలసి సహపంక్తి భోజనం చెయ్యాలి. లేదా కనీసం ఒకరిద్దరైనను కలసి భోజనం చేయాలి. అట్లు ఒంటరిగా భోజనం చేస్తే ఆర్యులు దోషమని చెప్పారు.
16. కం. ఇష్టఫల సిద్ధి చేకుఱుఁ
దుష్టియునుం గలుగు పేర్మి దొరయును సుజనో
త్కృష్టుఁడగు భోజనము వి
స్పష్టముగాఁ జేయునేని బహుజనములతోన్
ప్రతిపదార్థము :
బహుజనములతోన్ = అనేకమందితో కలసి
భోజనము =భోజనము
విస్పష్టముగాన్ = బాగుగా తెలిసినదియు
చేయును + ఏనిన్ చేయునేనిన్ = చేసినట్లైతే
ఇష్టఫలసిద్ధి చేకుఱున్ = ఇష్టమైన పనులు నెరవేరుతాయి
తుష్టియనున్ = సంతృప్తియును
కలుగు = కలుగును
పేర్మి = ప్రేమ
దొరయును = కల్గును
సుజన + ఉత్కృష్టుడు + అగు సుజనోత్కృష్టుఁడగు = సుజనులలో శ్రేష్టుడవుతాడు.
తాత్పర్యము : జనులతో కలసి భోజనము చేస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. తృప్తి కలుగుతుంది. ప్రేమ కూడా కల్గుతుంది. మంచి జనులలో శ్రేష్ఠుడవుతాడు.
17. కం. కుడుచు నతం డైనను బె
డు నాతం డైననపుడు డెందము రెండై
కడుఁ గోపముతో నుండినఁ
గుడిచినయన్నంబు కాలకూటముఁ బోలున్
ప్రతిపదార్ధము :
కుడుచును + అతండు + ఐననున్ కుడుచునతండైననున్ = భోజనము చేసే వాడైనను
పెట్టెడున్ + ఆతండు + ఐనన్ పెట్టెడునాతండైనన్ = భోజనము పెట్టేవాడైనను
అపుడు = ఆ సమయంలో
డెందము = హృదయము
రెండై = రెండు విధాలుగా
కడున్ = మిక్కిలి
కోపముతోన్ + ఉండినన్ కోపముతో నుండినన్ = కోపము కల్గి ఉన్నట్లైతే
కుడిచిన + అన్నంబు కుడిచినయన్నంబు = చేసిన భోజనము
కాలకూటమున్ + పోలున్ కాలకూటముఁబోలున్ = విషము వలె ఉంటుంది
తాత్పర్యము : భోజనము పెట్టువాడైనను, భోజనము తినే వాడైనను కోపంతో ఉండరాదు. అలా కోపాన్ని కనుక ప్రదర్శిస్తే ఆ భోజనము విషంతో సమానమవుతుంది.
18. కం. అతిమధురమదీపన కర
మతిలవణము నయనకాంతిహర మాహారం
బతితిక్తామ్లము ముదిమికి
నతిశయహేతు వని చెప్పి రాయుర్వేదుల్
ప్రతిపదార్థము :
అతిమధురము = అతిగా తీపిని తింటే
అదీపనకరము = ఆకలిని చంపేస్తుంది
అతి లవణము = అతిగా ఉప్పును తింటే
నయనకాంతిహరము = కంటి వెలుగులు నశిస్తాయి
ఆహారంబు = ఆహారము (భోజనము)
అతి – తిక్త + ఆమ్లము అతితిక్తామ్లము = అతిగా చేదు, పులుపులతో తిన్నట్లైతే
ముదిమికిన్ = వృద్ధాప్యానికి
అతిశయ హేతువు + అని అతిశయహేతువని = అతిశయించడానికి కారణమని
ఆయుర్వేదుల్ = ఆయుర్వేద శాస్త్ర పండితులు
చెప్పిరి = చెప్పారు.
తాత్పర్యము : అతిగా తియ్యని పదార్థాలు తింటే ఆకలి చస్తుంది. అతిగా ఉప్పు తింటే కాంతి వెలుగులు నశిస్తాయి. అతిగా చేదు, పులుపులతో భోజనం చేస్తే వృద్ధాప్యం వచ్చేందుకు హేతువని ఆయుర్వేద శాస్త్ర పండితులు చెబుతున్నారు.
19. తే.గీ. కుడువఁ దొణఁగుచు నీళ్లను గ్రోలెనేని
దీపనము చెడుఁ దద్దయు దేహ మఱుగు
భుక్తి మధ్యోదకము కొంత పుష్టిజేయుఁ
బిదవఁ బానీయ మానుట పెద్ద మేలు
ప్రతిపదార్థము :
కుడువన్ = భోజనము చేయుటకు ముందు
తొణంగుచు = ఒప్పుగా
నీళ్ళను = నీటిని
గ్రోలెనేని = త్రాగినట్లైతే
దీపనము చెడున్ = జీర్ణశక్తి నశించును
తద్దయు = తర్వాత
దేహము + అఱుగు దేహమఱుగు = శరీరము నశిస్తుంది
భుక్తి = భోజనము చేయుచున్నప్పుడు
మధ్య + ఉదకము మధ్యోదకము = మధ్యలో నీరు త్రాగితే
కొంత = కొలది
పుష్టిన్ + చేయున్ పుష్టిజేయున్ = పరిపుష్టిని కలిగిస్తుంది
పిదపన్ = తర్వాత (భోజనము పూర్తి చేసిన తర్వాత)
పానీయము = నీటిని
మానుట = మానివేయాలి
పెద్ద మేలు = అధికంగా శుభం కలుగుతుంది
తాత్పర్యము : భోజనానికి ముందు నీరు త్రాగరాదు. అలా చేస్తే జీర్ణశక్తి దెబ్బతింటుంది మరియు శరీరము నశిస్తుంది. భోజనము చేయునపుడు మధ్యలో నీరు త్రాగాలి. అలా చేస్తే కొంత పుష్టి కలుగుతుంది. భోజనము తర్వాత నీరు త్రాగరాదు. అలా చేస్తే శుభం కల్గుతుంది.
![]()
20. తే.గీ. కడుపు నాలుగుపాళ్లనుగా నెఱింగి
రెండు పాళ్ళన్నమునను బూరింపవలయుఁ
బానమున నింపఁగా నొకపాలువలయు
వాయుచలనకు నొకపాలు వలయు నెడము
ప్రతిపదార్థము :
కడుపు = పొట్టను
నాలుగు పాళ్ళనుగాన్ + ఎఱింగి నాలుగుపాళ్ళనుగానెఱింగి = నాల్గు భాగాలుగా చేసికొనుచు
రెండు పాళ్ళు + అన్నముననున్ రెండు పాళ్ళన్నముననున్ = రెండు భాగాలు అన్నముతోను
పూరింప వలయును = నింపాలి
ఒక పాలు = ఒక భాగము
పానమునన్ నింపగా వలయు = నీటితో నింపాలి
ఒక పాలు = ఒక భాగము
వాయు చలనకు = వాయువుతో
ఎడము వలయును = నింపాలి
తాత్పర్యము : పొట్టను నాల్గు భాగాలుగా చేసి, అందులో రెండు భాగాలు అన్నముతోను, ఒక భాగము నీటితోను, ఒక భాగము వాయువు కదలికకు నింపాలి.
21. తే.గీ. కుడిచినప్పుడఁ శయనింపఁ గడుపు పెరుగు
కదల కెచ్చోటఁ గూర్చున్నఁ గలుగు సుఖము
అల్ల నడయాడ నాయువు నగ్గలించు
దూరమరిగిన మృత్యువు దోన యరుగు
ప్రతిపదార్థము :
కుడిచిన + అప్పుడు + అ కుడిచినప్పుడ = భోజనము చేసిన తర్వాత
శయనింపన్ = పవ్వళించినచో
కడుపు పెరుగు = పెద్ద పొట్ట వస్తుంది
కదలక = కదలకుండా
ఏ + చోటన్ ఎచ్చోటన్ = ఎక్కడైనా
కూర్చున్నన్ = కొంతసేపు కూర్చున్నచో
కలుగు సుఖము = సౌఖ్యము కలుగుతుంది.
అల్లనడయాడన్ = కొంతదూరము నడచినచో
ఆయువును = ఆయువును
అగ్గలించు = వ్యాపించును
దూరము + అరిగిన దూరమరిగిన = ఇంకా ఎక్కువ దూరం నడిచినచో
మృత్యువుదోన + అరుగు మృత్యువుదోనయరుగు = మృత్యువు రాదు
తాత్పర్యము : భోజనము చేయగానే పడుకుంటే పెద్ద పొట్ట (బొజ్జ) వస్తుంది. కదలకుండా కాసేపు కూర్చుంటే సుఖము కలుగుతుంది. భోజనం తర్వాత కొంత దూరం నడిస్తే ఆయువు పెరుగుతుంది. ఇంకా ఎక్కువ దూరం నడిస్తే మృత్యువు రాదు.
22. కం. కడుపు కడుఁబిక్కటిల్లి నఁ
బొడమును మఱిదప్పి హీనభోజనుఁ డైనన్
బడుగగుఁ గావున సమమగు
కడుపున నేతెవులు లేక కొలఁదియొడ లగున్
ప్రతిపదార్థము :
కడుపు = పొట్ట
కడున్ = ఎక్కువగా
పిక్కటిల్లినన్ = నిండుగా ఉంటే
మఱి = మఱి
దప్పి = దాహము
పొడమును = కల్గును
హీన భోజనుఁడు + ఐనన్ హీనభోజనుఁడైనన్ = భోజనం లేకపోతే
బడుగు + అగున్ బడుగగున్ = బక్కవాడవుతాడు
కావున = కనుక
సమము + అగు సమమగు = సమంగా
కడుపునన్ = భోజనం చేసినట్లైతే
ఏ తెవులు లేక = ఏ రోగాలు లేకుండా
కొలఁది + ఒడలు + అగున్ కొలఁది యొడలగున్ = తగు మాత్రంగా శరీరము ఉంటుంది
తాత్పర్యము : అధికంగా భోజనం చేస్తే దాహం కల్గుతుంది. భోజనం చేయకుండా ఉంటే బక్కవాడవుతాడు. సమానంగా భోజనం చేస్తే ఏ రోగాలు లేకుండా తగు మాత్రంగా శరీరముంటుంది.
తాంబూల పద్ధతి
23. కం. పూగమునకు గుణములు పై
త్యాగమముం జెఱుచుట యునునాఁకలి మృదులీ
లాగతిఁ బుట్టించుటయును
వేగమె దాహంబు నణఁచు విన్నాణంబున్
ప్రతిపదార్థము :
పూగమునకున్ = వక్కకు
గుణములు = గుణాలున్నాయి
పైత్యాగమమున్ = పైత్యం కలుగుట
చెఱుచుటయునున్ = నశింప జేయును
మృదులీలాగతిన్ = సుకుమారంగా
ఆకలి = ఆకలిని
పుట్టించుటయును = కల్గిస్తుంది.
వేగమె = వెంటనే
దాహంబున్ + అణచు దాహంబునణచు = దాహాన్ని మాన్పించు
విన్నాణంబున్ = విజ్ఞానము కల్గును
తాత్పర్యము : మనిషికి పైత్యాన్ని హరించి, సుకుమారంగా ఆకలిని పుట్టిస్తుంది. వెంటనే దాహాన్ని నశింపచేసే విజ్ఞానము వక్కకు ఉన్న సుగుణాలు.
24. సీ. లఘుకారి క్రిమిదోష విఘటనసంధాయి
దీపననిర్దోష దీప్తికరము
పాషాణచూర్ణంబు పైత్య వాతఘ్నంబు శంఖచూర్ణము పైత్య శైత్యహరము
చిప్పల సున్నంబు శ్లేష్మంబు హరియించు
గుల్లసున్నము వాత గుణముఁ జెఱుచుఁ
దెలివిచ్చుఁ జాల ముత్తియపు సున్నము చూర్ణ
పర్ణ మాయువునకు బాధకంబు
తే.గీ. పత్రమూలంబునను రోగపటల ముండు
నగ్ర మది పాపముల కెల్ల నాశ్రయంబు
నడిమి యీనియబుద్ధి వినాశకరము
వీని వర్జించి తగఁ జేయు వీడియంబు
ప్రతిపదార్థము :
లఘుకారి క్రిమిదోష విఘటన సంధాయి = లఘుకారియైన క్రిమి దోషాలను వేరు చేసి
దీపన నిర్దోష = జీర్ణశక్తిని దోషం లేకుండా చేసి
దీప్తికరము = ప్రకాశింప చేస్తుంది
పాషాణచూర్ణము = రాతి సున్నము
పైత్య వాతఘ్నంబు = పైత్యాన్ని హరిస్తుంది
శంఖ చూర్ణము = శంఖాలతో తయారైన సున్నం
పైత్య శైత్య హరము = పైత్యాన్ని, శీతలాన్ని నశింపజేస్తుంది
చిప్పల సున్నంబు = ఆలు చిప్పలతో తయారైన సున్నం
శ్లేష్మంబు = శ్లేష్మాన్ని
హరియించు = హరిస్తుంది
గుల్ల సున్నము = నత్త గుల్లలతో తయారైన సున్నం
వాతగుణమున్ = వాత గుణాన్ని
చెఱచున్ = నశింపచేస్తుంది
ముత్తియపు + సున్నము ముత్తియపు సున్నము = ముత్యాలతో తయారైన సున్నము
తెలివిచ్చున్ = తెలివితేటలనిస్తుంది
చాల – చూర్ణ = అధికంగా సున్నం
పర్ణమునకు = తమలపాకుకు రాస్తే
ఆయువునకు = ఆయుష్షుకు
బాధకంబు = బాధపెడుతుంది
పత్రమూలంబునను రోగపటలము + ఉండు = తమలపాకు యొక్క మొదలు (తొడిమ)
రోగపటలముండు = రోగ హేతవు
అగ్రము = = తమలపాకు (చివరనున్న) అగ్రము
అది = ఆ తమలపాకు కొస
పాపములకు + ఎల్లన్ పాపములకెల్లన్ = సకల పాపాలను
ఆశ్రయంబు = నిలయము
నడిమి = తమలపాకు మధ్యలో నున్న
ఈనియ = ఈనెలు
వినాశకరము = నాశనాన్ని చేస్తుంది
వీని వర్ణించి = పై చెప్పిన దానిని వదిలివేసి
వీడియంబు = తాంబూలాన్ని
తగన్ + చేయు తగఁజేయు = తగిన విధంగా వేసుకోవాలి
తాత్పర్యము: క్రిమికీటకాదులను వేరుచేసి, జీర్ణశక్తిని పెంచి, ప్రకాశింప చేస్తుంది. రాతి సున్నంతో తాంబూలం వేస్తే పైత్యాన్ని, వాతాన్ని హరింప చేస్తుంది. శంఖ చూర్ణంతో తాంబూలం వేస్తే పైత్యాన్ని, శైత్యాన్ని (చల్లదనాన్ని) హరిస్తుంది. ఆలుచిప్పల సున్నంతో తాంబూలం వేస్తే శ్లేష్మాన్ని పోగొడుతుంది. నల్లగుల్లల సున్నంతో తాంబూలం వేస్తే వాతాన్ని నశింప చేస్తుంది. ముత్యాల సున్నంతో తాంబూలం వేస్తే తెలివితేటలను పెంచుతుంది. అధికంగా సున్నం వేస్తే ఆయువు నశిస్తుంది. తమలపాకు మొదలు (తొడిమ) రోగాన్ని కల్గిస్తుంది. తమలపాకు కొస పాపాల్ని కల్గిస్తుంది. తమలపాకు మధ్య ఈనెలు బుద్ధిని నశింప చేస్తుంది. కనుక వీటిని గ్రహించి తగు విధంగా తాంబూలం వేసుకోవాలి.
వ్యవహార పద్ధతి
25. ఉ. తాలిమిగల్గి తాఁ బరుల దైన్యము వాపుచు శాంతిగల్గి సం
క్షాళితచిత్తుఁడయ్యుఁ దగ సాహసకార్యము సేయ మైకొనం
జాలి పరోపకారియయి సంపద కుబ్బని యాతఁ డెప్పుడున్
శ్రీలలనాకటాక్ష సరసీరుహధాముఁడు మంత్రి శేఖరా !
ప్రతిపదార్థము :
శ్రీలలనాకటాక్ష = శ్రీలక్ష్మి యొక్క అనుగ్రహమనెడి
సరసీరుహధాముడు = తామర పువ్వులకు నిలయమైన శ్రేష్ఠుడు
మంత్రి శేఖరా = మంత్రి శేఖరా !
తాలిమిన్ + కల్గి తాలిమిగల్గి = ఓర్పు కలిగినటువంటి
పరుల = ఇతరుల యొక్క
దైన్యము + పాపుచు దైన్యమువాపుచు = దైన్యాన్ని నశింపచేస్తూ
శాంతిన్ + కల్గి శాంతిగల్గి = శాంతిని వహించి
సంక్షాళిత చిత్తుఁడయ్యు = ప్రక్షాళన జరిగిన మనస్సు కలవాడై
తగ. సాహసకార్యము + చేయ తగ సాహసకార్యముసేయ = తగిన విధంగా సాహసకార్యం చేస్తూ
మైకొనన్ + చాలి = మైమరచే విధంగా
ప + ఉపకారి + అయి పరోపకారియయి = ఇతరులకు ఉపకారం చేస్తూ
ఎప్పుడున్ = ఎల్లప్పుడు
సంపదకు = ఐశ్వర్యాలకు
ఉబ్బని = పొంగిపోని
అతడు = గొప్పవాడు.
తాత్పర్యము : శ్రీలక్ష్మీ దేవి యొక్క అనుగ్రహమనెడి తామరల యందు శ్రేష్ఠుడైన మంత్రి శేఖరా ! ఓర్పు కలిగి ఉండాలి. ఇతరుల దైన్యాన్ని పోగొట్టాలి. శాంతిని వహించాలి. ప్రక్షాళన జరిగిన మనస్సు ఉండాలి. తనువు పులకించే విధంగా ఇతరులకు ఉపకారం చేయాలి. ఐశ్వర్యాలకు పొంగిపోనివాడే గొప్పవాడు.
![]()
26. కం. కారణము దైవ మనుచును
బ్రారంభం బుడుగఁ జనదు ప్రభువుల కెందున్
ఊరక తిలలను దైలం
బేరీతిని బడయవచ్చు నిద్ధచరిత్రా !
ప్రతిపదార్ధము :
నిద్ధ చరిత్రా = పవిత్రమైన మనస్సు కలవాడా !
ఎందున్ = ఎక్కడ కూడా
ప్రభువులకు = రాజులకు
కారణము = తాను చేయవలసిన పనిని చేయక కారణము
దైవము + అనుచును దైవమనుచును = భగవంతుడే అని పల్కుచు
ప్రారంభంబు = ప్రారంభించకుండా
ఉడుగన్ + చనదు ఉడుగఁజనదు = త్యజించకుండుట పనికిరాదు
ఊరక = ఊరికినే (కష్టపడకుండా)
తిలలను = నువ్వుల నుండి
తైలంబు + ఏ రీతిని తైలంరీతిని = ఏ విధంగా నూనెను
పడయవచ్చు = పొందవచ్చును
తాత్పర్యము : ఆర్యా ! ఎక్కడా కూడ ప్రభువులకు కష్టపడకుండా ఏ పనీ నెరవేరదు. ఎందుకంటే శ్రమ లేకుండా ఊరికినే నువ్వుల నుండి తైలం వస్తుందా ? రాదు కదా ! అని భావము. కష్టపడాలి. పనుల ప్రారంభించకుండా ఉండకూడదు.
27. మ. గిరులెవ్వారలు ప్రోచి పెంచి రిటు నింగిన్ ముట్టగా నేరులె
వ్వరు వాటంబులుగాఁగఁ ద్రవ్విరి? మృగవ్రాతంబు సేవింపఁ గే
సరికిం బట్టముగట్టి రెవ్వరు? మహైశ్వర్యంబు లుత్సాహులై
తిరుగన్ గల్గును మంత్రియప్ప నుతకీర్తీ ! నాగమాంబాసుతా!
ప్రతిపదార్థము :
నుతకీర్తీ ! = నుతించబడిన కీర్తి కలవాడా !
నాగమాంబా సుతా ! = నాగమాంబ కుమారుడవైన
మంత్రియప్ప = అప్పన మంత్రీ !
ఇటు నింగిన్ ముట్టగాన్ = ఇటు ఆకాశాన్ని ముట్టుకునే విధంగా
గిరులు = పర్వతాలను
ఏ + వారలు-ఎవ్వారలు = ఎవరు ?
ప్రోచి = రక్షించి
పెంచిరి = పెంచారు !
ఏ + వరు – ఎవ్వరు = ఎవరు ?
ఏరులు = నదులను
వాటంబులుగాన్ + కన్ వాటంబులుగాఁగన్ = ఏటవాలుగా
త్రవ్విరి = త్రవ్వారు ?
ఏ + వరు – ఎవ్వరు = ఎవరు ?
మృగ వ్రాతంబు సేవింపన్ = జంతువులన్నీ సేవించుటకు
కేసరికిన్ = మృగరాజైన సింహానికి
పట్టమున్ + కట్టిరి పట్టముగట్టిరి = పట్టాభిషేకం చేశారు
మహా + ఐశ్వర్యంబులు మహైశ్వర్యంబులు = గొప్ప సంపదలు
ఉత్సాహులు + ఐ ఉత్సాహులై = ధైర్య సాహసాలతో
తిరుగన్ + కల్గును తిరుగన్ గల్గును = సంచరించగా లభిస్తాయి
తాత్పర్యము : స్తుతింపదగిన కీర్తి కలవాడా ! నాగమాంబ సుతుడవైన అప్పన మంత్రీ ! పర్వతాలను ఎవరు రక్షించి పెంచారు. నదులు ప్రవహించడానికి ఎవరు వాటంగా త్రవ్వారు ? జంతువులన్నీ సేవించుటకు మృగరాజుగా సింహానికి పట్టాభిషేకం ఎవరు చేశారు. ధైర్య సాహసాలతో సంచరిస్తే అన్ని సంపదలు కల్గుతాయి.
28. సీ. పగలు నిద్రింపక పరకాంతఁ గోరక
పరదూషణములేక పరుల కెపుడుఁ
గీడు చింతింపక కినుకయుఁ గపటంబు’
గలుగక చవి యెంత గలిగెనేని
పథ్యంబు శుచియును భక్ష్యంబుగాని ప
దార్థంబు మీఁదఁ దత్పరత లేక
బుడుబుడులాడుచుఁ బడఁతుల మొగముల
వెడమాయమాటలు వినఁగఁబోక
తే.గీ. పలుకుతఱి జడివెట్టక పరుసగాక
బొంకులాడక తన్నుఁదా బొగడు కొనక
కెలనివారికి మేలైన నెలమిఁ బొందు
మనుజునకు నభ్యుదయ మొందు మంత్రియప్పు !
ప్రతిపదార్థము:
మంత్రి + అప్ప ! మంత్రియప్ప ! = ఓ అప్పన మంత్రీ !
పగలు నిద్రింపక = పగలు పరుండరాదు
పరకాంతన్ + కోరక పరకాంతఁగోరక = ఇతరుల భార్యలను కోరకుండుట
పరదూషణము లేక = ఇతరులను నిందించరాదు
పరులకు + ఎపుడు పరులకెపుడు = ఎప్పుడూ ఇతరులకు
కీడు చింతింపక = కీడును చేసే పనిని తలచరాదు
కినుకయున్ = కోపమును
కపటంబున్ = మోసమును
కలుగక = ఉండకూడదు
చవి + ఎంతన్ + కలిగినేని చవియెంత గలిగినేని = రుచుల యందు ఇష్టం ఎంత కలిగినా !
పథ్యంబు = హితమైనది (తగిన విధంగా తినుట)
శుచియును = శుభ్రత కలిగి యుండుట
భక్ష్యంబున్ + కాని భక్ష్యంబుగాని = తినుటకు పనికిరాని
పద + అర్థంబు మీఁదన్ పదార్థంబుమీఁదన్ = పదార్థాలపైన
తత్పరత లేక = కోరికలు లేకయుండుట
బుడబుడలాడుచున్ = అస్పష్ట ధ్వనితో
పడతుల మొగముల = ఆడవాళ్ళ ముఖాల నుండి
వెడమాయమాటలు = వచ్చేటువంటి మాయ మాటలను
వినన్ + కన్ + పోక వినంగంబోక = వినకూడదు
పలుకతఱిన్ = మాట్లాడే సమయంలో
జడి + పెట్టక జడివెట్టక = వేగంగా మాట్లాడక
పరుసన్ + కాక పరుసఁగాక = కఠినంగా మాట్లాడక
బొంకులు + ఆడక బొంకులాడక = అబద్ధాలు ఆడక
తన్నున్ + తాన్ తన్నుఁదా = తననుతాను (గురించి)
పొగడుకొన = పొగడుకోకూడదు
కెలని వారికి = ప్రక్కవారికి
మేలు + ఐనన్ మేలైనన్ = ఉపయోగపడే విధంగా
ఎలమిన్ + పొందు ఎలమిఁబొందు = సంతోషంగా ఉండు
మనుజునకున్ = మానవాళికి (పై చెప్పిన విధంగా ఉంటే)
అభి + ఉదయము + ఒందు అభ్యుదయమొందు = ప్రగతి ఉంటుంది.
తాత్పర్యము : ఓ అప్పనమంత్రీ ! పగలు పరుండరాదు. ఇతరుల భార్యలందు ఆసక్తి ఉండకూడదు. ఇతరులను నిందించరాదు. ఎప్పుడు ఇతరులకు కీడును చేసే పనిని తలచరాదు. కోపము, మోసము ఉండకూడదు. రుచుల యందు ఎంత ఇష్టం ఉన్నా అధికంగా తినరాదు. శుభ్రత కలిగి యుండాలి.
![]()
తినుటకు పనికిరాని పదార్థాల మీద వ్యామోహం ఉండకూడదు. అస్పష్టధ్వనితో ఆడవాళ్ళు మాట్లాడే మాటలను వినకూడదు. వేగంగా మాట్లాడరాదు. కఠినంగా మాట్లాడరాదు. అబద్ధాలు ఆడరాదు. తనను తాను పొగడుకోకూడదు. ప్రక్కవారితో సంతోషంగా ప్రవర్తించాలి. ఇలా ఎవరైతే ఉంటారో ఆ మానవుడు ప్రగతిని సాధిస్తాడు.